13-09-2026 – ఆదివారము మొదటి ఆరాధన

వారము కొరకైన వాక్యము

యెహోవా నామమును ఆధారంగా చేసుకొని జీవించుట, ఆయన రక్షణపై జయోత్సవము చేయుట

ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. మరొకసారి మీ అందరినీ కలుసుకొనుటకు ఇచ్చిన ఈ మంచి సమయమునుబట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ప్రభువు మన అందరిని ప్రేమించినవాడు. ఆ ప్రేమను గ్రహించిన వారమైతే ఆయనను స్తుతించువారముగా ఉంటాము. ఈ దినము మన జీవితాలలో చాలా ప్రాముఖ్యమైన దినము. ఈ దినమును బట్టి మిగతా దినములన్నిటిలోను మన క్షేమమును చూచగలుగుతాము. అందుచేత ఈ దినమును ఎట్టి పరిస్థితిలోను మనము విడిచిపెట్టకూడదు. బయట ఎంతటి వర్షమున్నను ప్రభువును స్తుతించుటకు సిద్ధపడి వచ్చిన మీరు ధన్యులు. దేవుని సన్నిధిలో ఉండాలనే ఆలోచన మీ జీవితమును గొప్పదిగా చేయును.

లేఖనము మనకు తెలియజేయునది ఏమనగా, యెహోవా మహా ఘనత వహించినవాడు; బహుగా స్తుతి నొందదగినవాడు; సమస్త దేవతలకంటె పూజ్యుడు. మన దేవుడు ఎల్లప్పుడును స్తుతింపదగినవాడు. ఎందుకంటే ఆయన మన పక్షముగా సమస్తము జరిగించువాడు. మన జీవితములు మనవి కావు; అవి ప్రభువు నిమిత్తమైనవి, ఆయన సొత్తైనవి. అందుచేత మన జీవితములలో ఆయన చేసిన కార్యములను జ్ఞాపకము చేసికొని మనము ఆయనను స్తుతించవలెను. ఈ ఆదివారం దినమున ఆయన చూపిన కృపను, ఆయన ప్రేమను జ్ఞాపకము చేసికొనుట మనకు తప్పనిసరి. మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు అది మనకు మంచిదే. వాక్యము చెప్పునది—దేవుని స్తుతించుటలో మన క్షేమమూ, ఆశీర్వాదమూ దాగి యున్నవి. ఎంతటి పనులలో నిమగ్నమై ఉన్నను దేవుని జ్ఞాపకము చేసికొనవలెను; ఎందుకంటే ఆయన కాపాడకపోతే మన జీవితములు ఎప్పుడో ముగిసిపోయి ఉండేవి.

1 దినవృత్తాంతములు 16:25
యెహోవా మహా ఘనత వహించినవాడు ఆయన బహుగా స్తుతినొంద తగినవాడు సమస్త దేవతలకంటె ఆయన పూజ్యుడు.

మనము పనులలో నిమగ్నమై ఉన్నప్పుడు అపవాది దానిని అవకాశముగా తీసుకొని మనలను బంధించుటకు యత్నించును. అయినను మనము ఎన్ని పనులలో నిమగ్నమై ఉన్నను ప్రభువునే ఆధారముగా చేసికొనువారమై ఉండాలి. మనము అలా ఉన్నప్పుడు ప్రభువు పగటివేళ తన కృప కలుగునట్లు ఆజ్ఞాపించువాడు. కృపలేక మన జీవితమే లేదు. గత వారమంతా మన పనులలోను, ఉపాధిలోను, ప్రతి కార్యములోను ఆయన కృప మనతో నుండినందునే మన దినములు క్షేమముగా గడచినవి. అందుచేత ఈరోజు మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ ఒక్క దినము దేవుని సన్నిధిలో ఉండగలిగితే మిగతా ఆరు దినములలో క్షేమమును చూచెదము. గడిచిన వారములో ఆయన కృపచేత జీవించితివి; ఇప్పుడు ఆ కృపను జ్ఞాపకము చేసికొని స్తుతించుచున్నావు. అప్పుడు ఆయన రాబోవు దినములకొరకు మరల కృపను ఆజ్ఞాపించును. కృప ఒకే విధముగా కాక నానావిధములుగా ప్రత్యక్షమగును. రాబోవు దినములలో ఏమి జరుగునో మనకు తెలియదు; కానీ ఏది జరిగినను ఆయన కృప ముందుగానే ఆజ్ఞాపింపబడినది గనుక మనము భయపడనవసరము లేదు. నీ తీర్మానము ఇదై యుండాలి: ‘నాకు కృప ఉన్నది; కావున నేను చింతించను.’

కీర్తనలు 42:8
అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగ నాజ్ఞాపించును రాత్రివేళ ఆయననుగూర్చిన కీర్తనయు నా జీవదాతయైన దేవునిగూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును.

కృప ఎంత బలమైనదో మీరు గ్రహించాలి. వాక్యమే మన జీవితమును నిలబెట్టును; వాక్యములోనున్న సత్యమే మనలను స్వతంత్రులుగా చేయును. కాబట్టి ఈ లోకములో మన జీవన విధానం సహజమాత్రమైనది కాక, దేవుని శక్తిని అనుభవించే విధముగా ఉండాలి. నీ కళ్ల ముందర ప్రతికూలత కనబడినంత మాత్రాన అంతా అయిపోయినది కాదు. దేవుడు నీకు అనుగ్రహించిన కృప మరణమును కూడ జయించగలదు. మరణము శరీర బలహీనతచేత గానీ, పరిస్థితులచేత గానీ ఎట్లైనా రాగలదు; అయితే మరణముకంటె బలమైనది దేవుని కృప. అందుచేత నీవు కృపను ఆధారముగా చేసికొనవలెను. అదే సమయంలో మన జయోత్సాహము మన బలమును బట్టి కాదు, ఆయన రక్షణను బట్టి. ఈ కృపను అనుభవించుటకు విశ్వాసము అవసరం. విశ్వాసము ఉన్నప్పుడు నీవు కృపలో ప్రవేశించువాడవై యుందువు. కాబట్టి విశ్వాసమును, కృపను కలిపి పట్టుకొనుము; అప్పుడు కార్యము సఫలమగును.

కీర్తనలు 20:5
యెహోవా నీ రక్షణనుబట్టి మేము జయోత్సాహము చేయుచున్నాముమా దేవుని నామమునుబట్టి మా ధ్వజము ఎత్తుచున్నామునీ ప్రార్థనలన్నియు యెహోవా సఫలపరచునుగాక.

రోమీయులకు 5:2
మరియు ఆయనద్వారా మనము విశ్వాసమువలన ఈ కృపయందు ప్రవేశముగల వారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయ పడుచున్నాము.

అపవాది అడ్డంకులు సృష్టించుట తన పని. అందులో ఆశ్చర్యము లేదు. మనము భయపడవలసిన అవసరము లేదు. దేవుడు నీకు విశ్వాసమును ఇచ్చియున్నాడు. కాబట్టి నీ హృదయమును నిబ్బరపరచుకొని, ‘నా దేవుడు సజీవుడై యున్నాడు; నా పక్షముగా నిలుచువాడు’ అని నిలబడుము. ఆయన తన ప్రజలయందు ప్రీతి కలిగినవాడు; తన దీనులను రక్షణతో అలంకరించువాడు. నీలో లేకపోవుట, నీ బలహీనత, నీ దీనస్థితి చూసి నిరుత్సాహపడకు. దేవుడు నిన్ను తన బిడ్డగా చూచుచున్నాడు. నీవు దీనుడవై యున్నావేమో గాని ఆయన నిన్ను రక్షణతో అలంకరించును. అపవాది అనేక విధములుగా అడ్డుకొనినను, అపవాదికంటె మన దేవుడు శక్తిమంతుడు. చాలా సార్లు మన తండ్రి గొప్పవాడై యున్నప్పటికిని మనమే అపవాదిని గెలిపించుచుంటాము. అది జరగకూడదు. దేవుడు ఏమి చేయగలడో తెలుసుకొనుటకు వాక్యము అవసరం. వాక్యము నీలో నిలిచినచో అసాధ్యమని ఏదియు ఉండదు; సమస్తము సాధ్యమే.

కీర్తనలు 149:4
యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును.

ఉమగారు తన కుమారుడు తన దగ్గర ఉండాలని కోరుకున్నారు. నేను ఆమె కుమారుని కొరకు ప్రార్థన చేసినప్పుడు ప్రభువు ఒక మాట తెలియజేశారు. పరిస్థితులు చూచినప్పుడు ఆ కుమారుడు తిరిగి వచ్చి తన తల్లితో ఉండే అవకాశములేమి కనబడలేదు. ఆమె కుమారుడు తిరిగి వచ్చి విశాఖపట్నములో తన తల్లి దగ్గర ఉంటాడని ప్రభువు తెలియజేశారు. ఆ తల్లికి పరిస్థితిని జయించగల శక్తి లేకపోయినా, తాను ఆరాధించుచున్న దేవుడు శక్తిమంతుడు. ఆయన అద్భుతముగా ఆ కుమారుని తిరిగి ఆమె చేతిలో పెట్టెను. అందుచేత అసాధ్యముగా కనబడినది దేవుని చేతిలో సాధ్యమగును. సమస్తము సాధ్యమే అని ధైర్యముగా నిలబడవలెను.

ఇంకొక సత్యమును గ్రహించండి. పిల్లల విషయమై విచారముతో ఉన్న తల్లిదండ్రుల కొరకు ప్రభువు మాట యున్నది—‘నీ విచారమును కొట్టివేసెదను.’ యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు; వారికంటె బలవంతుడైన వాని చేతి నుండి వారిని విడిపించుచున్నాడు. ఈ మాటను విడిచిపెట్టకూడదు. నిన్న నా ప్రయాణములో రైలు ఆలస్యము, అలసట, ఇతర అంతరాయములు కలిగాయి. పరిచర్యకు ముందు ప్రార్థన చేసుకొనే సమయమూ తక్కువగా ఉండినది. అయినను ప్రభువు ఇప్పుడు మరల ఈ విమోచన మాటను తెలియజేస్తున్నారు. ‘విమోచించుచున్నాడు’ అనే మాట అత్యంత ముఖ్యము. దేవుడు యాకోబును ఏర్పరచుకున్నట్లే, ఆయన వాగ్దానము తరతరాలకు కొనసాగుచు వస్తుంది. ఆ వాగ్దానము నిన్ను చేరుకొనినప్పుడు నీవు కూడా ఆ వంశస్థులలో భాగమని గ్రహించాలి. దేవుడు ఎవరికో చేసిన వాగ్దానము మనకూ వర్తించునా అని అనుమానించకు; ఆయన కృప, ఆయన నిబంధన, ఆయన ఏర్పాట్లు తరతరాలకు కొనసాగును.

యిర్మీయా 31:11
యెహోవా యాకోబు వంశస్థులను విమోచించు చున్నాడు, వారికంటె బలవంతుడైన వాని చేతిలోనుండి వారిని విడిపించుచున్నాడు

అబ్రాహాముకు చేసిన వాగ్దానము ఇస్సాకును కరువులో నిలబెట్టెను. దావీదుకు చూపిన శాశ్వత కృప అతని తరములలో కొనసాగెను. దావీదు వంశములోనుండి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినాడు; క్రీస్తునందు మనమును దేవుని వాగ్దానములలో పాలుపంచుకొనువారమే. దేవుడు ఇచ్చిన మాట స్థిరపరచబడవలెనని, దాని ప్రకారమే నిర్మాణము జరుగునని జ్ఞాపకము చేసికొనండి. కాబట్టి పరిస్థితి ఎలా ఉన్నను, ‘దేవుడు నాకు వాగ్దానము ఇచ్చాడు’ అనే సత్యాన్ని విడువకూడదు. ఆ మాటను పట్టుకొని నిలిచినప్పుడు అదే మాటను ఆయన నెరవేర్చును; దాని ప్రకారమే నిర్మించును. అందుచేత నీవు నీ రంగములో క్రిందస్థానములో ఉండవలసిన అవసరము లేదు. ప్రభువు నిన్ను ఉన్నతస్థానమునకు తీసికొనివెళ్లగలడు. దావీదును గొర్రెల మధ్యనుండి తీసికొని, ముందుగా రాజభవనమునకు, తరువాత సింహాసనమునకు చేర్చిన దేవుడే మన దేవుడు. ఆయన మాట విడుదలైనచో దానికి ఎదురుగా నిలిచే అర్హతలు గాని, లోపాలు గాని, పరిస్థితులు గాని తుదకు అడ్డుకాలేవు. నీవు ఉన్న స్థలములోనే ప్రభువు నిన్ను ఉత్తమునిగా నిలబెట్టగలడు.

యిర్మీయా 33:2
మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలెనని దాని నిర్మించు యెహోవా, యెహోవా అను నామము వహించినవాడే ఈలాగు సెలవిచ్చుచున్నాడు

మనము విడిపింపబడవలసిన పరిస్థితి మనకంటె బలమైనదై ఉన్నా, దానిని జయించగలిగిన శక్తి మనలో లేకున్నా, దేవుని వాగ్దానము విడుదలను నిర్ణయించియున్నది. దేవుడు ఇచ్చిన మాటను ఆయన మరువడు. సమయానుకూలముగా దానిని స్థిరపరచుచు ఉంటాడు. ఆయన చెప్పిన ప్రకారము వారు సీయోను కొండమీదికి వచ్చి ఉత్సాహధ్వని చేయుదురు. యెహోవా చేయు ఉపకారమును బట్టి ఆనందించుదురు. ఈ ఉపకారమనే మాటలో ప్రతిఫలమనే భావము ఉన్నది. మనము దేవుని కొరకు చేసినదాన్ని ఆయన మరువడు. ఆయన మరచిపోవడానికి అన్యాయస్థుడు కాదు. మీరు ఇంతకుముందు ఏ విధముగా దేవుని కార్యములో పాలుపంచుకొని యున్నారో, చేసిన సహకారమో, చేసిన సేవయో—దానికి ప్రతిఫలము ఇచ్చువాడు దేవుడే. ఆయన ఇప్పుడు మీ జీవితములో ఉపకారము చేయుచున్నాడు; ప్రతిఫలము ఇచ్చుచున్నాడు.

యిర్మీయా 31:12
వారు వచ్చి సీయోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు; యెహోవా చేయు ఉప కారమునుబట్టియు గోధుమలనుబట్టియు ద్రాక్షారసమును బట్టియు తైలమునుబట్టియు, గొఱ్ఱలకును పశువులకును పుట్టు పిల్లలనుబట్టియు సమూహములుగా వచ్చెదరు; వారిక నెన్నటికిని కృశింపక నీళ్లుపారు తోటవలె నుందురు.

యిర్మీయా 31:13లోని విషయమును గ్రహించండి. ప్రభువు ఇంకొక ప్రవచనమును తెలియజేయుచున్నాడు: ఆయన దుఃఖమునకు ప్రతిగా సంతోషము ఇచ్చి ఆదరించును; విచారమును కొట్టివేసి ఆనందము కలుగజేయును. ఈ విచారము పంటల విషయమై కావచ్చును, పిల్లల విషయమై కావచ్చును, ఇప్పటికే పిల్లలు ఉన్నప్పటికిని వారి జీవితం సరిగా లేకపోవుటచేత కలిగిన బాధ కావచ్చును. ఏ విచారమైతే నీ హృదయములో ఉందో దానిని ప్రభువు కొట్టివేయగలడు. దీనికి సాక్ష్యముగా నా కుటుంబానుభవమును చెప్పుచున్నాను. చిన్ననాటి నుండి మా అన్నయ్య సరిగా ఉండేవాడు కాదు. మా తల్లి మొదటినుండి ప్రార్థనాపరురాలు; మా అన్నయ్యమీద ఆమెకు ఎంతో ప్రేమ. మా నాన్నగారు కొంతకాలము పడుతూ లేస్తూ ఉన్నప్పటికీ, ఒక సమయము తరువాత స్థిరపడి మరల వెనుకకు తిరిగిచూడలేదు. పరిస్థితులు, స్నేహసంబంధాలు, భవిష్యత్తు మొదలైనవాటిని చూసినప్పుడు తల్లిదండ్రులకు విచారము సహజమే. అలాంటి సమయంలో ఒకసారి మా అమ్మకు దేవుడు చెప్పిన మాట—‘నీ కుమారుడు దేవుని సేవ చేయును.’ ఆ సమయంలో చూస్తే అది అసాధ్యముగా కనబడింది. అతడు విదేశమునకు వెళ్లుటకై ఏర్పాట్లు జరుగుచుండెను. సేవచేయు పరిస్థితి ఎక్కడా కనబడలేదు. విదేశమునకు వెళ్లుటకు మా నాన్నగారు డబ్బులు కూడా చెల్లించారు. అయినను దేవుడు ఆ పరిస్థితిని మార్చారు. అయినను దేవుని మాట ఎంతో శక్తివంతమైనది. సౌలు వంటి వ్యతిరేకిని మార్పించిన దేవుడు, మనుష్యజీవితములనూ మార్చగలడు. అందుచేత మీ పిల్లల విషయమై మీరు దుఃఖముతో ఉన్నట్లయితే, ప్రభువు మాటను పట్టుకొనండి. ఎలాగు మార్పు తేవాలో, ఎలాగు కుమారుని రప్పించాలో, ఎలాగు కుమార్తెను లేపాలో ఆయనకే తెలుసు. ఆయన మీలోనున్న విచారమంతటిని కొట్టివేసి ఆనందము కలుగజేయును. ఆయన తన ప్రజలయెడల ప్రీతి కలిగినవాడై యుండుట చేత రక్షణతో అలంకరించువాడు.

కాబట్టి నీ కళ్ల ముందర ప్రతికూలత ఉన్నప్పటికిని దేవుడు ఇచ్చిన మాటను పట్టుకొని జయోత్సవము చేయుము. దేవుడు మాట ఇచ్చినచో దానిని నెరవేర్చును. కొన్ని సందర్భములలో ఆయన చెప్పినది వెంటనే నెరవేరినట్లు కనబడకపోవచ్చు. నేను ఒకసారి ఒక తమ్ముడికి సంబంధించిన దర్శనములో ఒక చిన్న బిడ్డను చూచి చెప్పితిని. ఆ సమయంలో చూసిన దానికి తగిన ఫలితం వెంటనే కనబడలేదు. అయితే తరువాత దేవుడు చూపినదే యథార్థముగా నెరవేరినది. అప్పుడు నేనొకటి మరింత లోతుగా గ్రహించితిని—ప్రభువు చెప్పినది సమయానుసారముగా నెరవేరును; అది జరగకపోవడం అనేది ఉండదు. మనము మాత్రం ఒకసారి జరగలేదని వదిలివేయకూడదు. ‘నేను ప్రయత్నించాను, కాలేదు’ అని చాలామంది అంటారు. అయితే ఒకసారి జరగలేదని దేవుడు నీకు క్షేమము చేయలేదని అర్థము కాదు. కొన్నిసార్లు నీవు కోరినదానిలో నీకు నష్టం ఉండుటచేత ఆయన అది ఇవ్వడు. ఎందుకంటే సమస్తమును సుఖముగా అనుభవించుటకు ఆయన ధారాళముగా దయచేయు దేవుడు. మనకు మేలు చేయునదే ఆయన ఇస్తాడు. ఆయన మాటను పట్టుకొని నిలబడినప్పుడు ఆ కృప యొక్క ప్రవాహము ఎంత గొప్పదో అనుభవించెదవు.

మన దేవుడు అన్యాయము చేయువాడు కాదు. ఆయన ఇవ్వలేదని మనం ఆయనను విడిచిపెట్టే వారముగా ఉండకూడదు. ఆయన స్వభావమే తన పిల్లలను సంతోషింపజేయుట, ఆనందింపజేయుట, కాపాడుట. లోకంలోని తల్లిదండ్రులు కొన్ని సందర్భాలలో మరచిపోయినా, పరిస్థితులచేత మారినా, ఆయన మాత్రం ఎప్పటికీ మారడు; మరచిపోడు అంటే మరచిపోడు. అందుచేత ఈ రోజు మన దేవుడు ఎటువంటి దేవుడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన రక్షణను బట్టి మనము జయోత్సవము చేయుచున్నాము. తన బిడ్డలయందు ప్రేమ కలిగినవాడై ఆయన రక్షణతో అలంకరించుచున్నాడు; సంతోష వస్త్రము ధరింపజేయుచున్నాడు. ఎవరు తక్కువగానో, వెనుకబడిన వారిగానో ఉండుట ఆయనకు ఇష్టం లేదు. పరిశుద్ధాత్ముడు మన హృదయములను పరిశీలించువాడు; మన అంతరంగములో ఉన్నదాన్ని సంపూర్ణముగా ఆయన మాత్రమే తెలిసికొనును. కాబట్టి మనము తక్కువపడుచున్న స్థితిలో ఉన్నామంటే ఆయన వెంటనే స్పందించువాడే.

రక్షణతో ఆయన నిన్ను అలంకరించును; నీ జీవితమునకు అవసరమైన రక్షణను అనుగ్రహించును; నీ ప్రయాణమును సిద్ధపరచి నిన్ను హెచ్చించును. అందుకే నేను చెబుతున్నది ఏమిటంటే, నీ దేవుని బట్టి నువ్వు నిలబడగలిగితే ప్రతి విషయములోను నిలబడగలవు. సమస్త కార్యములు చేయగలిగిన దేవుడు మన దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయములో, ఆయన దేవుని మహిమయొక్క తేజస్సై, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచున్నాడని చెప్పబడెను. సమస్తమును నిర్వహించుట అంటే జీవితములో ఒక భాగమే కాదు, ప్రతి విభాగమూ ఆయన అధీనములో ఉండుట. ఒక రాష్ట్ర పరిపాలనలో అనేక శాఖలు ఉన్నట్లు, మన జీవితములలోనూ అనేక విభాగములు ఉన్నాయి. మన క్షేమము, ఆరోగ్యం, సంపద, అవసరములన్నియు—అన్నిటినీ నిర్వహించువాడు ఆయనే. అందుచేత మనము మన దేవుని ఆధారంగా చేసుకొని బ్రతకాలి.

భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులే; వారు మనకు ఇష్టులే. అయినప్పటికీ కాపాడువాడు మాత్రం యెహోవాయే. యెహోవాను విడిచి వేరొకదానిని అనుసరించువారికి శ్రమలు విస్తరించును. కీర్తనలు 16:5లో యెహోవాయే మన స్వాస్థ్యభాగమునకు ఆధారమని గ్రహించుచున్నాము. అందువల్ల నా భాగము, నా ఆరోగ్యం, నా ఆశీర్వాదము, నాకు దేవుడు నియమించినది ఏదైనా సరే, దానిని కాపాడువాడు ఆయనే. మనుష్యులు ఎంత శ్రేష్ఠులైనా వారు ఆ స్థాయివరకే; కాపాడుట మాత్రం ఆయన పని. అందుకే నేను మళ్లీ చెబుతున్నాను—మనము ఆయనను ఆధారంగా చేసుకొని బ్రతకాలి. వినుట మాత్రమేగాక, అనుసరించుటలో, ఆచరణలో, కార్యరూపములో దీనిని ఉంచాలి.

కీర్తనలు 16:3-5
3 నేనీలాగందునుభూమిమీదనున్న భక్తులే శ్రేష్టులు; వారు నాకు కేవలము ఇష్టులు.
4 యెహోవాను విడచి వేరొకని అనుసరించువారికిశ్రమలు విస్తరించును.వారర్పించు రక్త పానీయార్పణములు నేనర్పింపనువారి పేళ్లు నా పెదవులనెత్తను.
5 యెహోవా నా స్వాస్థ్యభాగము నా పానీయభాగమునీవే నా భాగమును కాపాడుచున్నావు.

పరిస్థితులు కఠినముగా ఉన్నా ప్రతి సవాలునూ విశ్వాసముతో ఎదుర్కోవాలి. ఫిలిప్పీయులకు 4:13లో చెప్పబడిన సత్యమును పట్టుకొని నిలబడాలి. నాలో స్వయముగా ఏమీలేకపోయినా, నాలోనున్నవాడు శక్తివంతుడు. ఆయనను బట్టి సమస్తము నా యెడల జరిగించబడును. నీ భాగమును కాపాడువాడు ఆయనే కాబట్టి, దేవుడు నీకొరకు సిద్ధపరచినదాన్ని ఎవ్వరూ అపహరింపలేరు. అది పదోన్నతియా, స్థలమా, ఆశీర్వాదమా ఏదైనా సరే—అది నీకొరకు సిద్ధపరచబడినదైతే దానిపై ఎవరూ చేయి వేయలేరు. ప్రయత్నాలు చేయవచ్చు, అడ్డంకులు తేవచ్చు, కాని అవి ఫలించవు. దేవుడు మాట ఇచ్చినందున మనము నిలబడుచున్నాము; దేవుడు మాట ఇచ్చినందున బయలుదేరుచున్నాము. పూర్వము జనులు యుద్ధమునకు వెళ్లుటకు ముందుగా ప్రభువును విచారించేవారు; ఆయన ‘వెళ్ళుము’ అని చెప్పిన మాట చాలు. తమ బలాబలములను చూసి కాక, దేవుని మాటను పట్టుకొని బయలుదేరేవారు. అదే విధముగా మనము కూడా ఆ విశ్వాసములో ఎదగాలి.

ఫిలిప్పీయులకు 4:13
నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.

మనము యెహోవా రక్షణను బట్టి జయోత్సవము చేయుచున్నాము; దేవుని నామమును బట్టి మా ధ్వజమును ఎత్తుచున్నాము. ఆ నామములో సమస్తమును తలవంచించు అధికారం ఉంది. ఆ యేసుక్రీస్తు నామమును మనము కలిగిన వారమై ఉన్నాము. పైన ఉన్నదైనా, భూమి మీదున్నదైనా, కిందనున్నదైనా ఆయన నామమునకు లోబడవలసిందే. నేను ఒక సాక్ష్యమును చెప్పుచున్నాను. ఇరవై సంవత్సరములు దాదాపు ప్రతిరోజూ తీవ్ర బాధను అనుభవించిన ఒక యువకుడు ఉండెను. చిన్నప్పటి నుండి అతనిని ఒక దురాత్మిక బంధము, ఫిట్స్‌ వంటి దాడులు పట్టి బాధించుచుండెను. వైద్యం చేసినా, ప్రయత్నాలు చేసినా మార్పు లేకపోయెను. అయితే యేసు నామములో పరిష్కారము ఉందని ప్రభువు తెలియజేశాడు. ప్రార్థనకు ముందే అతడు సేవచేయబోతున్నాడని, దేవుడు అతనిని ఏర్పరచుకొన్నాడని ప్రత్యక్షపరచెను. నేను యేసు నామములో ధ్వజమును ఎత్తినప్పుడు, ఇరవై సంవత్సరములు బాధించిన ఆ బంధము విడిచిపోయెను; ఆ బాధ నుండి అతడు విడుదల పొందెను. ప్రతి అమావాస్యకు దాడులు తప్పక వచ్చేవని వారి తల్లిదండ్రులు చెప్పిరి; కాని యేసు నామములో ఆ ధ్వజము ఎత్తిన తరువాత ఆ దాడి రాలేదు. కాబట్టి యేసు నామములో మనము ఎత్తు ధ్వజము మనకు విజయమును అనుగ్రహించును. అందుచేత ప్రతి విషయంలో మనము ఆయనను ఆధారంగా చేసుకొని బ్రతకాలి.

కీర్తనలు 20:5
యెహోవా నీ రక్షణనుబట్టి మేము జయోత్సాహము చేయుచున్నాముమా దేవుని నామమునుబట్టి మా ధ్వజము ఎత్తుచున్నామునీ ప్రార్థనలన్నియు యెహోవా సఫలపరచునుగాక.

ఆయన తన నామమును మనకు ఇచ్చియున్నాడు. ఆ నామములో మనము ధ్వజమును ఎత్తాలి. అప్పుడు యెహోవా తన అభిషిక్తుని రక్షించునని మనకు తెలియును; తన పరిశుద్ధాకాశములోనుండి అతనికి ఉత్తరమిచ్చును; తన దక్షిణహస్త బలమును చూపును. ‘అభిషిక్తుడు’ అంటే దేవుడు అభిషేకించినవాడు. క్రీస్తు రాకమునుపు యాజకత్వము కొందరికి మాత్రమే పరిమితమై యుండెను; అయితే యేసుక్రీస్తు ప్రభువు మనందరిని రాజులైన యాజక సమూహముగా చేసెను. కాబట్టి మనము అభిషేకించబడిన వారమే. ఈ వాక్యమును అలా స్వీకరించాలి: నేను ఆయన నామములో ప్రార్థనచేస్తే, నా ప్రార్థన అంగీకరించబడును. నేను ఏ విషయములోనైతే ఆయనను నమ్మి ప్రార్థించుచున్నానో, ఆ విషయములో ఆయన దక్షిణహస్తము కార్యరూపమునకు తెచ్చును. నేను ప్రార్థించుచున్నది నిర్మాణములోనికి వచ్చుచున్నది; నెరవేర్చబడుటకు దేవుని హస్తము పని చేయుచున్నది. ఇది కేవలం ఆలోచన కాదు—రక్షణార్థక కార్యము జరుగుచున్నదని తెలిసికొనుట.

కీర్తనలు 20:6
యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నా కిప్పుడు తెలియునురక్షణార్థమైన తన దక్షిణహస్తబలము చూపునుతన పరిశుద్ధాకాశములోనుండి అతని కుత్తరమిచ్చును.

1 పేతురు 2:9
అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు.

కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు; మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. ఎందుకంటే ఆయన తన బిడ్డల పక్షముగా, తన అభిషిక్తుల పక్షముగా కార్యము చేయువాడు. నువ్వు ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నావో, ఆ ప్రార్థన నెరవేర్పు జరుగుతుంది. శత్రువు నీకంటె బలముగా ప్రయత్నించినా, అతని ప్రయత్నములు సఫలమగవు. దేవుని దక్షిణహస్తము అపవాది క్రియలన్నిటిని తారుమారు చేయును. దేవుడు నిన్ను సిగ్గుపడనియ్యడు. వారు కృంగి నేలమీద పడిపోవుదురు; మనము లేచి చక్కగా నిలుచుచుందుము. కాబట్టి నీ జీవితం కృంగిపోయి, కూలిపోయే జీవితం కాదు; చక్కగా నిలబడే జీవితం. తన మహిమ నిమిత్తము దేవుడు నిన్ను నిలబెడతాడు. ఆయన బహుగా స్తుతి నొందదగినవాడు. దేవుడు నీ జీవితములో చేసిన కార్యమును చూచినప్పుడు నీలో రక్షణానందము ఉప్పొంగిపోవును; ఎవరి ఎదుట అయినా ఆయన చేసిన కార్యమును చెప్పక ఉండలేవు. ఆయన ఇస్తున్నది ఉత్తమమైనదే; ప్రత్యేకముగా అనుగ్రహించువాడు. నీకు అనుగ్రహించబడినది మరొకరితో పోల్చదగినది కాదు. అందుచేత ఆయనను ఆధారంగా చేసుకొని జీవిస్తే నీ జీవితం చక్కగా నిలుచును. నువ్వు ఏ ప్రార్థన చేస్తున్నావో దానికి జవాబు పొందబోతున్నావు. పరిస్థితులు ఎలా ఉన్నా, ఆయన దక్షిణహస్తము నీకు వ్యతిరేకమైన ప్రతి పరిస్థితినీ మార్చివేయును. ఎందుకంటే నీ జీవితముద్వారా ఆయన బహుగా స్తుతి పొందవలెను.

కీర్తనలు 20:7-8
7 కొందరు రథములనుబట్టియు కొందరు గుఱ్ఱములను బట్టియు అతిశయపడుదురుమనమైతే మన దేవుడైన యెహోవా నామమునుబట్టి అతిశయపడుదము.
8 వారు క్రుంగి నేలమీద పడియున్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము.

కాబట్టి మనము లేచి నిలబడి ఆయనను ఆరాధిద్దాం. మనసారా, హృదయమారా ఆయనను స్తుతించుటకు సిద్ధపడదాం. ఇప్పుడు ఆయన ఒక కార్యము చేయబోతున్నాడు. నీవు నిజముగా అభిషేకించబడిన వాడవని గ్రహిస్తే, నువ్వు చేస్తున్న ప్రార్థనలకు జవాబులు పొందబోతున్నావు. కూలిపోయే జీవితం కాదు, చక్కగా నిలబడే జీవితం నీది. నీవు ఎక్కడ ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, భయపడవద్దు; ఆయన దక్షిణహస్తము నీకు తోడై యున్నది.

దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ నేను మిమ్మల్ని ఒక విషయములో ప్రోత్సహిస్తున్నాను. ప్రభువు మనకు ఇచ్చిన మాటలు స్థిరపరచబడునని నమ్మి ముందుకు సాగాలి. రాబోవు కూడికలు, కాన్ఫరెన్సులు, మిరాకిల్ సర్వీసులు—ఇవన్నియు దేవుని కార్యమునకు మార్గములు. వాటి కొరకు ప్రార్థన చేయండి; వాటిని తేలికగా తీసుకోకండి; తప్పక పాల్గొనండి. ఒక తరానికి ఒకరిని లేపునట్లు, ఈ తరములోనూ దేవుడు కొందరిని లేపుచున్నాడు. దేవుని పని ఎట్టి పరిస్థితిలోను ఆగదు. వర్షమొచ్చినా, ఎండయినా, అడ్డంకులొచ్చినా ఆయన పని కొనసాగుతుంది. ఈ ప్రాంతములన్నియు ప్రభువు కొరకు స్వతంత్రించుకుందాం. అబ్రాహాముతో చెప్పినట్లే, నీవు ఎంతవరకు చూసెదవో అంతవరకు నీదగును. అలాగే మనము ఎంతవరకు విశ్వాసముతో స్వతంత్రించుకొందుమో అంతవరకు దేవుడు మనకు ఇస్తాడు. శరీరబలహీనతలున్నా, ప్రయాణశ్రమలున్నా, ఉపవాసములో ఉన్నా, దేవుని కొరకు పరిగెత్తుట ఆగకూడదు. నాకు ప్రభువు అప్పగించినదాన్ని పూర్తిచేశానని సాక్ష్యమివ్వగలిగే దినమువరకు పరిగెత్తాలి. అందుకే మనమందరము సిద్ధపడాలి; దేవుని రాజ్యమును కట్టాలి; ఆయన మనకు ఇచ్చిన వాటిని స్వతంత్రించుకోవాలి.

ముఖ్యాంశాలు

  • దేవునికి కృతజ్ఞత — మన జీవితములు మనవి కావు; అవి ప్రభువు నిమిత్తమైనవి, ఆయన సొత్తైనవి.
  • కృపను ఆధారము చేసికొనుట — రాబోవు దినములలో ఏమి జరుగునో మనకు తెలియదు; కానీ ఏది జరిగినను ఆయన కృప ముందుగానే ఆజ్ఞాపింపబడినది గనుక మనము భయపడనవసరము లేదు.
  • విశ్వాసముతో నిలబడుట — ఈ కృపను అనుభవించుటకు విశ్వాసము అవసరం.
  • వాగ్దానమును విడువకుండుట — కాబట్టి పరిస్థితి ఎలా ఉన్నను, ‘దేవుడు నాకు వాగ్దానము ఇచ్చాడు’ అనే సత్యాన్ని విడువకూడదు.
  • ఆయనను ఆధారంగా చేసుకొని బ్రతకాలి — మనుష్యులు శ్రేష్ఠులైనా కాపాడువాడు యెహోవాయే; ఆయన మన భాగమును కాపాడుచున్నాడు కాబట్టి విశ్వాసముతో ఆచరణలో నడవాలి.
  • కూలిపోయే జీవితం కాదు, నిలబడే జీవితం — శత్రువు ప్రయత్నించినా దేవుని దక్షిణహస్తము అపవాది క్రియలను తారుమారు చేసి, మనలను సిగ్గుపడనియ్యక, చక్కగా నిలబెడుతుంది.
  • దేవుని పని ఆగదు; స్వతంత్రించుకొందాం — ప్రార్థన, పరిచర్య, ప్రయాణశ్రమల మధ్యనూ దేవుని పని నిలువదు. దేవుడు మనకు చూపిన ప్రాంతములు, అవకాశములు, అప్పగింపులు విశ్వాసముతో స్వతంత్రించుకొనవలెను.