13-09-2026 – ఆదివారము రెండవ ఆరాధన

వారము కొరకైన వాక్యము

దేవుడు ఇచ్చిన పిలుపు శక్తివంతమైనది; ఆ పిలుపును ఘనపరచి దానికి తగినట్టు సిద్ధపడినవారికి సమస్తము సమకూర్చబడును.

ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనలందరినీ ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుదము. ఉదయకాలములో ఆయనను స్తుతించుటకు ఇచ్చిన అవకాశమువలె, ఈ సాయంకాల సమయములోను మరల ఆయనను స్తుతించుటకు అవకాశము ఇచ్చినందుకు దేవునికి స్తోత్రము.

దేవుడు తన సన్నిధికి మనల్ని ఆహ్వానించిన వాడై ఉన్నాడు. కాబట్టి ఆయన పిలుపు ఎంతో ప్రశస్తమైనది అని మనము గ్రహించాలి. లేఖనము కూడా ఇదే బోధిస్తుంది. ఈ విషయమును 2 పేతురు 1:10లో చూడగలము. ఈ లేఖన సత్యాన్ని గంభీరముగా గ్రహించాలి. దేవుడు నిన్ను ఏ పిలుపుతో పిలిచాడో, ఆ పిలుపులోనే నీకు కావలసిన సమస్తము ఉంచబడియున్నది. ఇది కేవలం ఒక సిద్ధాంతము కాదు; ఇది నా అనుభవము. అందుకే మన పిలుపు, ఏర్పాటు విషయములో అలక్ష్యము కాకుండా, జాగ్రత్తగా ఉండవలసి ఉంది.

2 పేతురు 1:10
అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసికొనుటకు మరి జాగ్రత్తపడుడి.మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్రిల్లరు.

ఈ రోజు మనము దేవుని ఆరాధించుటకు ఇక్కడికి రావడమూ యాదృచ్ఛికం కాదు; ఆయన మనల్ని పిలిచిన వాడై, మహిమపరచుటకు మనలను నియమించిన వాడై ఉన్నాడు. “నేను దేవుని మహిమ కొరకై నియమించబడిన వాడను” అని నిశ్చయము చేసుకున్నప్పుడు, దేవుని కొరకు సిద్ధపడుట మొదలవుతుంది. లేనిచో, “క్రైస్తవులం కాబట్టి చర్చికి వెళ్ళాలి” అన్నట్టుగా వచ్చి, పాటలు పాడి, తిరిగి వెళ్ళిపోవడం మాత్రమే మిగులుతుంది. అయితే దేవుడు కోరుకొనేది అది కాదు. మీరు ఏదైతే చేసినా హృదయపూర్వకముగా చేయాలని ఆయన కోరుతున్నాడు. అందుకే మనము దేవుని సన్నిధికి సాధారణ రీతిగా రాకూడదు. ఉదయకాలములో వచ్చినవారము కాబట్టి సాయంకాల సమయము అవసరం లేదని అనుకునే మనస్సు చాలామందికి ఉండవచ్చు. కాని మనకు ఇచ్చిన ప్రతి అవకాశమూ ప్రత్యేకమైనదే. ఈ రోజు మీరు వచ్చిన దానివలన, దేవుడు నన్ను తన మహిమ కొరకు ఎన్నుకొని నియమించాడని మీరు గ్రహించాలి.

దేవుని పిలుపు వలన మనము నియమించబడిన వారమై ఉన్నాము. ఆయన పిలిచినప్పుడు, ఆయన సన్నిధిలో నిలబడుటకు మన హృదయమును కూడా సిద్ధపరచినవాడే. ఇది కేవలం దేవుని మహిమపరచడానికే పరిమితమయ్యేది కాదు; ఆయన తన వాక్కును కూడా మనకు ఇస్తున్నాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి: ఉదయకాలములోనూ, సాయంకాలములోనూ ఆయన వాక్కు మనకు ఎందుకు అందిస్తున్నాడు? మనపై ఉన్న పిలుపు గొప్పది గనుక, ఆ పిలుపుకు తగిన వారముగా మనల్ని సిద్ధపరచుటకే ఆయన తన వాక్కును అనుగ్రహిస్తున్నాడు. అందుకే పిలుపు విషయములో నిశ్చయత కలిగిన వారముగా ఉండాలి. అందరికీ ఒకే రకమైన పిలుపు లేకపోయినా, అందరినీ పిలిచిన అంతిమ ఉద్దేశము దేవుని రాజ్య నిర్మాణమే. నన్ను ఒక దాని కొరకు, నిన్ను మరొక దాని కొరకు పిలిచివుండవచ్చు; అయితే అందరి పిలుపుల అంతిమ దిశ దేవుని రాజ్యమే.

చాలా సార్లు ఆరంభ దినములలో దేవుడు మనతో మాట్లాడిన పిలుపును మనము అంగీకరిస్తాము; “నేను దీనికొరకు పిలవబడ్డాను” అని చెబుతాము. కానీ దినాలు గడిచినకొద్దీ ఆ నిశ్చయతను కోల్పోయి మరిచిపోతాము. అందుకే లేఖనము “మరి జాగ్రత్తపడుడి” అని బలముగా చెబుతోంది. ఆయన సన్నిధిలో నిలబడుటే గొప్ప భాగ్యము కాగా, ఆయన పనిని జరిగించుటకు మనల్ని ఏర్పరచుట మరింత గొప్ప ధన్యత. అందువలన వాక్యము వినడం అంటే కేవలం విని వెళ్ళిపోవడం కాదు. ప్రతి సారి వాక్కు మనకు వచ్చినప్పుడు, “దేవుడు నన్ను పిలిచాడు; ఈ వాక్యము ద్వారా నాలో ఏదో స్థిరపరచాలనుకుంటున్నాడు” అని గ్రహించాలి. పిలిచినవాడు సర్వసృష్టికర్త. ఆయన ఆలోచనతోనే మనము ఈ భూలోకానికి వచ్చాము; వ్యర్థముగా రాలేదు. అపవాది అనేక ప్రయత్నములు చేసి, ఆ పిలుపులోనుండి మనల్ని తొలగించదలచుతాడు. అయినప్పటికీ, దేవుని పిలుపు శక్తివంతమైనది గనుక, దానిని పట్టుకొని నిలిచినవారిని సులభముగా లాగివేయలేడు.

ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం, ప్రతి సారి ప్రభువు నీకు మాట ఇస్తున్నప్పుడు, దాని ద్వారా ముందుగా నిన్ను బలపరచాలనుకుంటున్నాడు. పేతురును ప్రభువు పిలిచాడు; పిలిచిన తర్వాత అతనిని బలపరిచాడు; సిద్ధపరచాడు. యేసుక్రీస్తు ప్రభువుతో ఉన్న కాలమంతా పేతురు తయారుచేయబడుతూ వచ్చాడు. తరువాత ఒక సమయములో అతని ద్వారా గొప్ప కార్యములు జరిగాయి. యేసయ్య స్పర్శచేత స్వస్థతలు జరిగినట్లు, పేతురు నీడ పడినప్పుడు కూడా స్వస్థతలు జరిగాయి. దారి పొడవున రోగులను ఉంచేవారు; అతని నీడ తాకినప్పుడు అద్భుతాలు సంభవించేవి. దీని అర్థం ఏమిటి? పిలిచిన దేవుని సంకల్పము బలమైనది. పేతురు జ్ఞానములో గొప్పవాడు కాదు; అతడు జాలరువృత్తి చేసినవాడే. అయినప్పటికీ దేవుడు అతనిని పిలిచాడు. పేతురు నిశ్చయతలోనికి వచ్చిన తరువాత గొప్ప ఆశ్చర్యకార్యములు మొదలయ్యాయి. కాబట్టి ప్రతి సారి నీకు వచ్చే వాక్యము, దేవుడు ఇచ్చిన పిలుపును నీలో ప్రతిష్ఠించుటకూ, ప్రత్యక్షపరచుటకూ వస్తుంది. అందువలన ఆ మాటను బట్టి నువ్వు సిద్ధపడాలి.

హెబ్రీయులకు 11:8లో అబ్రహాము పిలుపునకు లోబడిన విషయమును చూస్తాము. ఇది ఎంత గొప్ప పాఠమో చూడండి. అబ్రహాము పిలువబడినప్పుడు, ముందున్న మార్గమంతా స్పష్టముగా తెలియకపోయినా, పిలుపునకు లోబడ్డాడు. ఇదే విధముగా పేతురును కూడా “నా వెంబడి రా; మనుష్యులను పట్టువాడవగుదువు” అని పిలిచాడు. భవిష్యత్తు ఎలా ఉంటుందో అతనికి కూడా తెలియదు. అయినా నిశ్చయతతో తన జాలరువృత్తిని విడిచి ప్రభువును వెంబడించాడు. కాబట్టి మనమందరము కూడా దేవునిచేత పిలువబడిన వారమే. ఈ అంత్యదినములలో ఆయన పిలిచిన వారందరినీ వాడుకొనదలచి ఉన్నాడు. అందుచేత, దేవుడు నిన్ను ఏ పిలుపుతో పిలిచాడో, ఆ పిలుపులో నిలకడగా ఉండుట అత్యవసరము.

హెబ్రీయులకు 11:8

ఇప్పుడు మనము కడవరి దినములలో ఉన్నాము. తొలకరి వర్షమును ఆయన కుమ్మరించినట్టే, కడవరి వర్షమును కూడా ఆయన కుమ్మరించును. ఆదికాలములో దేవుని శక్తి ప్రత్యక్షపడగా, అనేక ఆశ్చర్యకార్యములు జరిగి, అనేకులు రక్షణలోనికి నడిపింపబడ్డారు. ఒక దినమున మూడు వేలమంది, మరొక దినమున అయిదు వేలమంది చేర్చబడినట్లు మనము చూస్తాము. ఆ శక్తి ప్రత్యక్షతే తొలకరి వర్షముగా కనబడింది. ఇప్పుడు అదే దేవుడు, అంత్యదినములలో కడవరి వర్షమును కుమ్మరించి మరల తన శక్తిని విడుదల చేయుటకు సిద్ధపడుతున్నాడు. ఆ కడవరి వర్షమునకు నిన్నును నన్నును సిద్ధపరచుచున్నాడు. తొలకరి వర్షమునకు పేతురు సాక్ష్యమిచ్చినట్లే, కడవరి వర్షమునకు నీవు సాక్ష్యమివ్వవలసి ఉంది. అయితే దానికి మూలమైనది నీ నిశ్చయతే. నీవు నీ పిలుపులో నిలబడగలిగితే, నీ ద్వారా కూడా ఆశ్చర్యకార్యములు జరిగిస్తాడు.

నీ నిశ్చయత ఈ లోక విషయాలలోనే ఉండకూడదు. చదువు మంచిదే; చదువుకోండి. దాని ద్వారా దేవుడు మహిమపరచబడవచ్చు. కాని చదువులోనూ దేవుని శక్తి ప్రత్యక్షపడగలదు. వైద్యవిద్య చదువుతున్నవారు ఉన్నారు; కొన్ని వైద్యపరమైన పరిమితులు ఉన్న సందర్భములో, ప్రార్థనచేసినప్పుడు ముందుగా స్పందించని శరీరం స్పందించి, ఆ తరువాత చికిత్స జరిగే విధముగా దేవుడు తన శక్తిని కనుపరచగలడు. ఈ కడవరి దినములలో ప్రతి ఒక్కరినీ దేవుడు వాడుకొనగలడు; మన పిల్లలను కూడా వాడుకొనగలడు. అందుకే అపోస్తలుల కార్యములు 2:17ను చదువుదాం. వృద్ధులను కూడా ఆయన విడిచిపెట్టలేదు. ఇదే విషయమును అపోస్తలుల కార్యములు 2:18లోను చూస్తాము. అంటే ఎవ్వరూ మినహాయింపుకారు.

అపొస్తలుల కార్యములు 2:18-19
18 ఆ దినములలో నా దాసులమీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు.
19 పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమిమీద సూచకక్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగజేసెదను.

ఇంకా, పైన ఆకాశమందు మహత్కార్యములు, క్రింద భూమిమీద సూచకక్రియలు జరుగుతాయని లేఖనము చెబుతోంది. ఈ సూచకక్రియలు ఎలా జరుగును? దేవుడు తన శక్తిని ప్రదర్శించుటకు ఒక మనిషిని ఉపయోగించును. ఫరో ఎదుట మోషేను పంపి, అతని ద్వారా సూచకక్రియలు జరిగించినదీ ఇదే సత్యం. దేవుడు స్వయంగా చేయలేడా? చేయగలడు. అయినప్పటికీ, ఆయన కార్యములు జరిగుటకు ఒక మనిషిని ఎన్నుకొనుట దేవుని విధానమైయున్నది. ఇశ్రాయేలు ప్రజల విమోచన కొరకు మోషేను ఎన్నుకున్నాడు; అతని ద్వారా మహాకార్యములు జరిగించెను. ఇదే విధముగా, నీవు నీ పిలుపులో నిశ్చయత కలిగి, సిద్ధపడినవాడవైతే, నీ ద్వారా కూడా సూచకక్రియలు జరుగును. నీవు చిన్నవాడవైనా, వృద్ధుడవైనా, నీ ద్వారా ఆయన కార్యము జరిగించగలడు. ఎందుకంటే ఆయన పిలిచిన పిలుపు నీ జీవితం అంతా తన ప్రకటనను కొనసాగించుచుండును.

గర్భములో రూపుదాల్చకముందే నీ జీవితమును గూర్చి దేవునికి ఆలోచన ఉన్నది. కాబట్టి ఆయన ఇచ్చిన పిలుపులో నిశ్చయతతో నిలబడాలి. చాలాసార్లు అపవాది మనల్ని దారి మళ్లించుచుంటాడు. ఉదాహరణకు, ఒకరికి ప్రార్థనాభిషేకము ఇచ్చి ఉండవచ్చు. అతడు గదిలో దేవుని సన్నిధిలో గాఢముగా ప్రార్థించుటకు పిలవబడి ఉండవచ్చు. కాని మరొకరు అందరి ముందు నిలబడి సంఘటితంగా కార్యములు జరుగుచుండగా, మన పిలుపును వదలి, వారి పిలుపువైపు పరిగెత్తే ప్రమాదము ఉంది. ఎందుకంటే అది బహిరంగముగా కనబడుతుంది. అయితే కనబడకపోయే పిలుపు కూడా తక్కువది కాదు. ఏలీయా నిత్యము దేవుని సన్నిధిలో ఉండే వాడు. అతడు ఎల్లప్పుడూ బహిరంగ వేదికలమీద కనిపించే వాడు కాదు. అయినప్పటికీ, వచ్చినప్పుడు జనులు కంపించిరి. ఎందుకంటే అతని పిలుపు శక్తివంతమైనది. కాబట్టి ఏ పిలుపైనా దేవునియొద్ద నుంచి వచ్చినదైతే, అది శక్తివంతమైనదే.

ఇదే విషయమును మరొక ఉదాహరణతో గ్రహించవచ్చు. డానియేలు కొలనాండో అనే దేవుని సేవకుడు ఒక కాలములో సాధారణ పనులు చేసేవాడని చెప్పబడింది. కార్యాలయ ప్రాంగణమును శుభ్రపరచడం, బాత్రూములు కడగడం, సేవకుని ఇంటి పనులు చేయడం వంటి చిన్నదిగా కనిపించే పనులలోనే కొన్నేండ్లు నమ్మకముగా నిలిచాడు. అతనిలో దేవుని అభిషేకము ఉండింది; అయినప్పటికీ మొదటగా అతడు తనకు ఇచ్చిన స్థానములోనే విశ్వాసపాత్రుడై యుండెను. ఆ పిలుపులో నిశ్చయముగా నిలిచిన తరువాత, ఒక రోజు అతడిని దేవుడు విశాలమైన ప్రభావమున్న స్థితికి తీసికొనిపోయాడు. కాబట్టి పిలుపు చిన్నదా పెద్దదా అన్నది ముఖ్యం కాదు; దానిలో నమ్మకంగా నిలుచుటే ముఖ్యం.

దేవుడు ఒక ఖండమంతటిని కదిలించుటకు ఒక మనిషిని సిద్ధపరచగలడు. రైన్హార్డ్ బొంకే సేవలో నేలలు శుభ్రం చేసే పనిలో నమ్మకంగా ఉన్న డానియేలు కొలన్డా వంటి వాడిని దేవుడు తరువాత గొప్ప బాధ్యతల కొరకు నిలబెట్టెను. ఇదే సూత్రం మనమందరికీ వర్తిస్తుంది. మనం ఏ పిలుపులో పిలువబడ్డామో దానికి తగిన బహుమానం ఉందని గ్రహించాలి. అందుకే నేను గురియొద్దకే పరిగెత్తుచున్నాను అని చెప్పిన వాక్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. చిన్నదిగా కనిపించే పనిని తక్కువగా చూడకూడదు. కొందరు సంవత్సరాల తరబడి ఒకే పనిలో నమ్మకంగా నిలబడతారు; ఎందుకంటే దేవుడు వారిని దానికి పిలిచినట్టు వారికి నిశ్చయము ఉంటుంది. మన పైనున్న పిలుపు ఏమిటి, దానిలో మనం ఎంత నిశ్చయతతో ఉన్నాము అనేది ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాలి.

ఫిలిప్పీయులకు 3:14
క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను.

మన ఆత్మీయ జీవితము సరిగ్గా సిద్ధపడాలంటే ఈ ప్రశ్న అవసరం: నేను ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నాను? హాగరుతో అడిగిన ప్రశ్నలో ఇదే బోధ ఉంది. దేవుని దూతకు ఆమె ఎక్కడి నుండి వచ్చిందో తెలియక కాదు; ఆమె ఏ పిలుపులో చేరిందో, ఆ పిలుపు నుండి ఎందుకు దూరమవుతున్నదో గ్రహింపజేయడానికే ఆ ప్రశ్న. అబ్రాహామును పిలిచింది దేవుడే; హాగరు ఆ పిలుపులో చేరినది. ఆ పిలుపులో చేరినందువల్లే ఆమెకు, ఆమె సంతానానికీ ఆశీర్వాదపు భాగస్వామ్యము లభించింది. అబ్రాహాము మనలాగే మనిషి; కానీ అతనిపైనున్న పిలుపు శక్తివంతమైనది. కాబట్టి నీ పిలుపు నిన్ను మాత్రమే నిలబెట్టదు; నీ పిలుపుకు సహకరించువారినీ జీవింపజేయగలదు. పిలుపు శక్తి ఇంతటి గొప్పది.

ఆదికాండము 16:8

ఈ విషయాన్ని నేను అనుభవంలో చూశాను. ఒకసారి భయంకరమైన వర్షంలో కూడికకు ఎవరూ రాలేరని అనిపించిన సమయములో నేను ప్రార్థనలో ఉండగా పరిశుద్ధాత్ముడు నాకు స్పష్టంగా చెప్పిన మాట: నీ పిలుపు శక్తివంతమైనది; ఆ పిలుపే జనులను ఆకర్షించి తీసుకొని వస్తుంది. ఆ సమయంలో అక్కడ టీం వారే తప్ప మరెవ్వరూ లేరు. కానీ కొంతసేపటి తరువాత తలుపు తీసి వచ్చేసరికి మందిరమంతా నిండిపోయింది. మరొకసారి రావులపాలంలో కూడా ప్రారంభములో ఎవరూ రాలేదు; పైగా ఎత్తిచూపే మాటలూ వినిపించాయి. అయినా నేను ఒక గంట వేచిచూడమని చెప్పి, నిర్ణయముతో సేవ ప్రారంభించాను. కొద్దిసేపటిలోనే స్థలం నిండిపోయింది. అందుకే నేను చెప్పేది ఏమనగా, నీ పిలుపును ఎవ్వరూ అడ్డుకోలేరు. నిన్ను అడ్డుకోవాలని వచ్చిన ప్రయత్నములు సఫలము కావు. చాలాసార్లు సిగ్గుపడే పరిస్థితులు కళ్లముందు కనిపించినా, ఒక్కసారిగా తెరుచుకోవలసినది తెరుచుకొని, జరగవలసినది జరిగిపోయిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. ఇది నా గురించే కాదు; నీ గురించీ ఇదే సత్యం. నువ్వు నీ పిలుపులో నమ్మకంగా ఉంటే చాలు.

అయితే ఆ పిలుపునకు కలిగిన బహుమానం ఏమిటి? అది కేవలం ఈ భూమి జీవితం తరువాత మాత్రమే వచ్చే కిరీటం కాదు. ఇక్కడే దేవుడు తన పిలుపును ఘనపరచినవారిని ఘనపరచును. నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును అనే సూత్రం ఇక్కడ పనిచేస్తుంది. పిలిచిన యేసయ్యకు మాటలతో గౌరవం చెప్పుట మాత్రమే ఘనపరచుట కాదు; ఆయన చెప్పిన మాటకు లోబడుటే నిజమైన ఘనపరచుట. నేలలు శుభ్రం చేసే పని గానీ, మరుగుదొడ్లు శుభ్రం చేసే పని గానీ చిన్నది కాదు; దేవుడు ఇచ్చిన బాధ్యతయైతే దానిని గౌరవంగా చూడాలి. ఆ పిలుపును తక్కువగా చూడకుండా గౌరవించినవారిని దేవుడే పైకి తీసుకొస్తాడు. మన పిలుపులో నిశ్చయత లేకపోతే దేవుడు ఉంచిన గొప్ప విషయాన్ని మనమే కోల్పోతాము. అందుకే మీరు మీరే సిద్ధపడండి.

1 సమూయేలు 2:30
నీ యింటి వారును నీ పితరుని యింటివారును నా సన్నిధిని యాజ కత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ యిచ్చియున్నను ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయెనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చు చున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగానన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును. నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు.

ప్రత్యేకంగా యవ్వనస్థులారా, దేవుడు మిమ్మల్నీ పిలిచాడు. అంత్యదినాలలో ఆయన ప్రతి వయస్సువారినీ వాడుకొనును. మీలో అనేకమందికి ప్రవచనముల ద్వారా భవిష్యత్తు, సేవ, పిలుపు గురించి దేవుడు ముందుగానే మాటలిచ్చాడు. ఆ మాటలను తేలికగా తీసుకోవద్దు. తిమోతికి చెప్పినట్టు, నీకొరకు ముందుగా చెప్పబడిన ప్రవచనములను బట్టి నీవు మంచి పోరాటము పోరాడవలెను. అంటే, నీమీద పలికిన వాక్యాల ప్రకారమే నీవు సిద్ధపడవలెను. ఒకవేళ మనకు చెప్పబడిన ప్రవచనములను పట్టించుకోకపోతే అది దారుణమైన నష్టం. ఏ పిలుపు గురించి నీకు దేవుడు చెప్పాడో, దానికి తగిన నిరీక్షణతో, సిద్ధతతో నీవు బ్రతకాలి.

1 తిమోతికి 1:18
నా కుమారుడువైన తిమోతీ, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగినవాడవై, నిన్నుగూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటినిబట్టి యీ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను.

నా జీవితంలో ఇది ఎలా జరిగిందో నేను చెప్పుతున్నాను. దేవుడు నన్ను ప్రవక్తగా పిలిచాడని నాకు స్పష్టమైన తరువాత నేను నా జీవితమంతా మార్చుకున్నాను. అంతకుముందు వాక్యమునకు సిద్ధపడటం, సాధారణ సేవలో నడవటం ఉండేది. కానీ ఆ పిలుపు తెలిసిన తరువాత నా నోటి నుండి పలికిన మాటలు స్థిరపరచబడుతున్నవి; దేవుని నుండి మాటలు రావడం మొదలైంది. అప్పటి నుండి నా సమయములో ప్రధాన భాగము దేవుని సన్నిధిలోనే గడుస్తోంది. కుటుంబముతో గడిపే సమయముకన్నా ఎక్కువగా నేను దేవుని సన్నిధిలో గడిపాను. ఎందుకంటే నేను దేనికోసము పిలువబడ్డానో దానికి తగినట్టుగా నా జీవితాన్ని మార్చుకున్నాను. బయట తిరుగుట, ఫ్రీగా గడపుట, శరీరానికిష్టమైన వాటిని వెంబడించుట నా మనసుకు అంగీకరించదు; నేను దాని కొరకు లేను. ఏలియాను దేవుడు ఎలా పిలిచెనో, అలాగే నన్ను కూడా పిలిచాడు అని నేను గ్రహించిన తరువాత, ఏలియా వంటి జీవితానికి తగిన సిద్ధత అవసరమని అర్థం చేసుకున్నాను. కేవలం మాట విన్నంత మాత్రాన కాదు; ఆ పిలుపుకు తగిన జీవనరీతిలోకి మారాలి. దేవుని సన్నిధిలో దొరికే ఆనందము కంటే ఎక్కువగా భూలోకములో ఇంకేమీ నన్ను సంతోషింపచేయలేదని నేను చెప్పగలను. శరీర సంబంధమైన కోరికలు మసకబారిపోయాయి; పిలుపుకు తగిన ప్రత్యక్షతలో దేవుడు నన్ను ముందుకు నడిపిస్తున్నాడు. సిద్ధపాటు లేకుంటే ఈ స్థితిలో నేను నిలువలేను.

మోషేను చూడు. అతడు నత్తివాడు; సహజముగా చూస్తే జనులు నవ్వవచ్చు. అయినా దేవుడు పిలిచిన తరువాత అతని మాటను జనులు హేళన చేయలేదు; అనుసరించారు. ఇది శారీరక సామర్థ్యము గురించినది కాదు, మనమీదనున్న ఆత్మీయ పిలుపు గురించినది. దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడించునని వాక్యము చెప్తుంది. అందుకే కొందరి జీవితంలో అన్ని విషయాలూ మేలుకే తిరుగుతున్నట్లు కనిపిస్తుంది; కారణం వారి పైనున్న పిలుపు. ఈరోజు దేవుడు మనలను పిలుచుకొని సిద్ధపరుస్తున్నాడు. ఆయన మాటను మనకు అందించుట కూడా ఆ పిలుపు ప్రత్యక్షమగుటకే. ఉదయం, సాయంకాలం, మళ్లీ మళ్లీ వాక్యము వినిపించుట వ్యర్థం కాదు; ఆ మాటలన్నీ నిన్ను కట్టడానికే. దేవుని మాటలచేత మన జీవితాలు నిర్మింపబడాలి. దేవుడు మనలను సహజమైన జీవితానికి కాదు, అతీంద్రియమైన జీవితానికి పిలిచాడు.

రోమీయులకు 8:28
దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.

అతీంద్రియ జీవితం అంటే ఏమిటో గ్రహించాలి. జనసమూహమంతా ఒకేలాగా అనుభవించదు; పిలువబడినవారి జీవితంలో ప్రత్యేక సమకూర్పు కనిపిస్తుంది. నేను ఒకప్పుడు మనకు అందని విషయాలను చూసి ఆశ్చర్యపడే రోజులుండేవి. కానీ దేవుడు పిలిచిన వానికి సమకూర్చబడును. ఒక సందర్భంలో ఏదీ సాధ్యమయ్యేలా కనిపించలేదు; డబ్బు లేదు, ఉన్న వనరులు సరిపోవు, బుకింగ్ కుదరదు అనిపించింది. అయినా అకస్మాత్తుగా సిద్ధపరచబడి ఉన్నదని తెలిసింది. మరి దానికి కావలసిన మార్గములు కూడా దేవుడే ఒక రోజులో సమకూర్చెను. కడపలో ఉన్న వాహనం వైజాగ్‌కు చేరి, అసాధ్యమని భావించినది సాధ్యమైంది. దానికోసం నేను బలప్రయత్నము చేయలేదు; దేవుడే సమకూర్చెను. కాబట్టి పిలువబడినవాడు కేవలం బతుకడు; అతడు తృప్తి పరచబడును కూడా. దేవుడు తన పనిని జరిగించుకుంటూనే నిన్ను అతీంద్రియంగా పోషించును.

నేను ఇవన్నీ చెప్పుటకు కారణం, మీరు కూడా మీ పిలుపుకు తగినట్టు మారాలని ప్రోత్సహించుటే. పట్టణాలను స్వతంత్రించుకొనుటకు సిద్ధపడుమని ప్రభువు నాకు చెప్పిన తరువాత నా జీవనరీతి అంతా మారిపోయింది. శ్రమలు, ప్రయాణాలు, ఉపవాసాలు, రాత్రింబగళ్లు తిరుగుట—ఇవన్నీ నేను భారముగా చూడటం లేదు; ఇదే నా పిలుపు అని తెలుసుకున్నాను. ఈ పిలుపు లేకపోయి ఉంటే నేను ఎన్నాళ్లకో క్యాన్సరులో గానీ, మరే ప్రమాదములో గానీ ఉండేవాడిని; ఈ రోజున భూమిమీద ఉండకపోయేవాడిని. ఒక ప్రమాదం జరిగినప్పుడు కూడా నేను నష్టమే చూశాను; కానీ ప్రభువు నాకు కలలో చూపించి, అపవాది నిన్ను చంపుటకు ప్రయత్నించెను, నేను తప్పించితిని అని తెలియజేశాడు. అప్పుడు అర్థమైంది—నష్టపోయింది ధనం కాదు; నిలిచింది జీవితం, ఎందుకంటే పిలుపు ఇంకా నెరవేరవలసి ఉంది. ఎన్నోసార్లు దేవుడు తప్పించినది ఈ పిలుపు కోసమే. కాబట్టి మీ మనస్సును మీ పిలుపుకు తగినట్టుగా సర్దుబాటు చేసుకోండి. ఆరోగ్యసమస్యలు గానీ, ఒత్తిడులు గానీ, బాహ్య పరిస్థితులు గానీ చివరి మాట కావు. నీ పిలుపును నిశ్చయపరచుకొనుట నీ బాధ్యత. ఆ నిశ్చయత లేకుండా మిగతా ఫలితాలు వచ్చెదవు అనుకోవద్దు. నేను నిలబడినది నా బలముచేత కాదు; దేవుని పిలుపుచేతనే.

దావీదును జ్ఞాపకము చేసుకోండి. అతడు చిన్నవాడే; గొల్యాతు బలవంతుడు. సహజమైన ప్రమాణముల ప్రకారం చూస్తే దావీదు నిలబడలేడు. కానీ అతనిపైనున్న పిలుపు కారణంగా అతడు తప్పించబడ్డాడు; ఎందుకంటే అతడు సింహాసనముమీద కూర్చోబెట్టబడవలసి ఉంది. ఆ పిలుపు నెరవేరక ముందే అతని జీవితం ముగియలేదు. ఇదే సత్యం మనకూ వర్తిస్తుంది. మన పైనున్న పిలుపు స్థిరపరచబడేంత వరకు అపవాది ఎన్నో విధములుగా ప్రయత్నించగలడు; కానీ ఆ ప్రయత్నములు సఫలం కావు. మరణమువలె బలమైనది ఎదురొచ్చినప్పటికీ, పిలువబడినవాడు తప్పించబడును. పిలువబడినవారికి సమస్తము సమకూర్చబడును. కాబట్టి భయపడవద్దు. మీరు సామాన్యమైన దానికి కాదు, గొప్ప దానికి పిలువబడినవారు.

ఇది అంత్యదినకాలం; దేవుడు తన శక్తి ప్రత్యక్షపడునట్లు ప్రతి వయస్సువారినీ వాడుకొనును. నేను ఒక్కణ్ణే కాదు; యవ్వనులు, బాలురు, వృద్ధులు—అందరిలోను చూచక్రియలు కనబడే సమయములో మనం ఉన్నాము. నేను ఆ సమయాన్ని ఎదురుచూస్తున్నాను; ఒకొక్కరిని దేవుడు ముందుకు తీసుకొస్తున్నాడు. ఇరవై సంవత్సరాలుగా ప్రతిరోజూ ఫిట్స్‌తో బాధపడిన ఒక కుమారుని కొరకు ఒక్కసారి ప్రార్థించగా దేవుని శక్తి పనిచేసింది. లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలుని కొరకు కూడా ప్రార్థించాము; సాక్ష్యం వస్తుంది. మనము కేవలం తలనొప్పులు, చిన్న నొప్పుల కొరకు మాత్రమే సేవ చేయుటలేదు; మరణముతో సంబంధమైన విషయాలమీద కూడా దేవుని శక్తి ప్రకటింపబడును. పాతాళ ద్వారములు నిలువలేవు అని ఇచ్చిన వాగ్దానమే దీనికి ఆధారం. నాలో ప్రత్యేకముగా ఏమీలేదు; నా మీదనున్న పిలుపులోనే సమస్తం ఉంది. అందుకే నేను చెప్తున్నాను—నువ్వు పిలువబడినవాడివైతే నీవు సంతోషింపబడతావు, తృప్తిపరచబడతావు, తప్పించబడతావు, ఘనపరచబడతావు.

మత్తయి 16:18

కాబట్టి ఇప్పుడు మనము మనలను పరిశీలించుకోవాలి. హాగరు వలె ఎక్కడి నుండి వచ్చి ఎక్కడికి వెళ్తున్నామో ఒకసారి చూద్దాం. మానవులమై ఉండగా కొన్నిసార్లు మనము మిస్ కావచ్చు; కానీ ప్రభువు మిస్ కానీయడు. ఆయన పిలిచిన పిలుపు నుండి మనము ఎక్కడైనా దూరమైతే, మనలను తప్పుపట్టుటకే కాదు, తిరిగి ప్రోత్సహించి సిద్ధపరచుటకే ఆయన మాట్లాడుతున్నాడు. ఈ అంత్యదినాలలో మన ద్వారా దేవుని శక్తి లోకానికి పరిచయమగాలని ఆయన కోరుతున్నాడు. అందుకే సాధారణమైన పనిలో సంవత్సరాలుగా ఉన్నావని నిరాశపడవద్దు. డానియేలు కొలన్డా ఒకప్పుడు స్వీపర్‌గా ఉన్నా, ఒక దినమున దేవుడు అతనిని ఘనపరచెను. నువ్వు శక్తికి మించి పనిచేస్తూ, ఎవ్వరూ చూడడంలేదనుకొని బాధపడుతున్నావా? బాధపడవద్దు; ప్రభువు అన్నిటినీ చూచుచున్నాడు. ఎంత తృణీకరించబడితివో అంత గొప్పగా ఘనపరచబడెదవు. ఆయన ఇచ్చిన పిలుపు నుండి నిన్ను ఏదియు లాగిపోలేదు; దేవుడే దానిని స్థిరపరచును. అందువల్ల ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పి, ఆ పిలుపుకు తగినట్టుగా ఇకనుండి సిద్ధపడుదామని నిర్ణయించుకోవాలి. నేను ప్రార్థించేది ఇదే: ఈ వాక్యముచేత ఆదరింపబడి సిద్ధపడుతున్న వారిని ప్రభువు పురికొల్పి, అంత్యకాలములో వారి ద్వారా చూచక్రియలు జరిగించును గాక; చిన్నవారి నుండి పెద్దవారి వరకు, ప్రత్యక్షముగా ఉన్నవారినీ, లైవ్ ద్వారా విన్నవారినీ ఎవ్వరినీ మిస్ కాకుండ సిద్ధపరచును గాక.

ముఖ్యాంశాలు

  • దేవుని రాజ్య నిర్మాణము — అందరికీ ఒకే రకమైన పిలుపు లేకపోయినా, అందరినీ పిలిచిన అంతిమ ఉద్దేశము దేవుని రాజ్య నిర్మాణమే.
  • పిలుపులో నిశ్చయత — దేవుని పిలుపు శక్తివంతమైనది గనుక, దానిని పట్టుకొని నిలిచినవారిని సులభముగా లాగివేయలేడు.
  • వాక్యము ద్వారా సిద్ధపాటు — ప్రతి సారి నీకు వచ్చే వాక్యము, దేవుడు ఇచ్చిన పిలుపును నీలో ప్రతిష్ఠించుటకూ, ప్రత్యక్షపరచుటకూ వస్తుంది.
  • పిలుపును ఘనపరచుట — ఆయన చెప్పిన మాటకు లోబడుటే నిజమైన ఘనపరచుట.
  • పిలుపుకు తగిన జీవనము — ఏ పిలుపు గురించి నీకు దేవుడు చెప్పాడో, దానికి తగిన నిరీక్షణతో, సిద్ధతతో నీవు బ్రతకాలి.
  • కృతజ్ఞతతో ముందుకు సాగుట — అందువల్ల ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పి, ఆ పిలుపుకు తగినట్టుగా ఇకనుండి సిద్ధపడుదామని నిర్ణయించుకోవాలి.