నీవు వెలుగై ఉండాలంటే

మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండమీదనుండు పట్టణము మరుగై యుండనేరదు.

మత్తయి 5:14

మనము వెలుగైఉన్నాము అని వాక్యము చెప్తుంది. మీరు పూర్వమందు చీకటియై యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగైయున్నారు అని ఎఫెసీయులకు 5:8 లో కూడా చెప్పబడింది. “ఇప్పుడైతే” అనేది చాలా ప్రాముఖ్యమైనది. గతం అనేది ముగించబడింది.”గతంలో” చీకటిగా ఉన్నావేమో, “ఇప్పుడైతే” నీవు క్రీస్తునందు వెలుగుగా ఉన్నావు. ఎక్కడైతే పూర్వం చీకటిగా ఉందో, అక్కడ ఇప్పుడు నీలో ఉన్న వెలుగు ప్రకాశించాలి.

నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక, నీ కన్ను తేటగా నుంటె నీ దేహమంతయు వెలుగుమయమై యుండును; అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై యుండును.

లూకా 11:34

 
లెమ్ము తేజరిల్లుము అని వాక్యము చెప్తుంది. ఎవరు తేజరిల్లుతారు? ఈ వాక్యమును గ్రహించేముందు మరొక వాక్యము జ్ఞాపకంచేసుకుందాం. సర్పము తన కుయుక్తిచేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులును చెరుపబడి, క్రీస్తు ఎడలనున్న సరళతనుండియు పవిత్రత నుండియు ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను.౹ -2 కొరింథీయులకు 11:3. అపవాది ఖచ్చితంగా కుయుక్తులు ప్రదర్శిస్తాడు. అందుకే అపవాదితంత్రములు మనము ఎరిగి ఉండాలి. అపవాది చీకటి సంబంధి. మనము వెలుగు సంబంధులము. ఎలాగైనా మనలను మోసపరిచి మరలా చీకటిలోకి లాక్కుపోవటానికి ప్రయత్నిస్తాడు అపవాది.

హవ్వను సాతాను మోసంచేసినప్పుడు జరిగిన పరిస్థితి చూసినట్టైతే, “అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను; వారు తాము దిగంబరులమని తెలిసికొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసికొనిరి.౹ -ఆదికాండము 3:7″. ఈ ముందు జరిగిన పరిస్థితిలో, “దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై యుండెను. అది ఆ స్త్రీతో–ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? అని అడిగెను.౹ అందుకు స్త్రీ–ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును;౹ అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములనుగూర్చి దేవుడు–మీరు చావకుండునట్లు వాటిని తిన కూడదనియు, వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను.౹ అందుకు సర్పము–మీరు చావనే చావరు;౹ ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పగా -ఆదికాండము 3:1-5″.

అపవాది హవ్వతో మీ కన్నులు తెరువబడి అని అంటుంది. అంటే ఆదాము, హవ్వలు గుడ్డివారుగా ఉన్నారా? భౌతికంగా ఆదాము, హవ్వలు చూడగలుగుతున్నారు. కాని, అపవాది మీ కన్నులు తెరువబడతాయి అని మోసంచేసాడు. అయితే వారు ఆ ప్రకారం చేసినప్పుడు, మనోనేత్రములు పోయి, శరీరసంబంధ కన్నులు తెరువబడ్డాయి. వాక్యాన్ని గమనిస్తే, “దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకా శింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగ జేసెను.౹ -2 కొరింథీయులకు 4:4”. సూపర్నేచురల్ చూపుపోయి, శరీరము, లోకమునకు సంబంధించిన కళ్ళు మాత్రమే పనిచేస్తాయి. “అవిశ్వాసము” అనేది దీనికి కారణంగా అర్ధమవుతుంది.

ప్రభువు యెరికోవైపు వెళుతున్నప్పుడు ఒక గుడ్డివాడు చూపుపొందటానికి కేకలు వేస్తున్నాడు. ఆ గుడ్డివాడినిగనుక మనము గమనిస్తే, “వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన–నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగగా, వాడు–ప్రభువా, చూపు పొందగోరుచున్నాననెను. యేసు–చూపుపొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పెను; -లూకా 18:41-42”. ఇక్కడ ఆ గుడ్డివాడి కళ్ళు “విశ్వాసము” బట్టి తెరువబడ్డాయి.ఆదాము కళ్ళు తెరువబడ్డాయి, శరీర సంబంధమైన, శ్రమలతో కూడిన పరిస్థితులకొరకు కళ్ళు తెరువబడ్డాయి.యెరికో దగ్గరున్న గుడ్డివాడి కళ్ళూ తెరువబడ్డాయి, సూపర్నేచురల్ విషయాలు చూడాటానికి తెరువబడ్డాయి. తెరువబడినవెంటనే యేసును చూసెను, దేవుని మహిమపరచెను, ఆయనను వెంబడించెను. అనగా సూపర్నేచురల్ సంగతులను వెంబడిస్తున్నాడు.

అవిశ్వాసాన్ని బట్టి లోకసంబంధమైన కళ్ళు, విశ్వాసాన్ని బట్టి దేవునిసంబంధమైన కళ్ళు తెరువబడుతున్నాయి.

నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక, నీ కన్ను తేటగా నుంటె నీ దేహమంతయు వెలుగుమయమై యుండును; అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై యుండును. దీనిని అర్ధంచేసుకోవటానికి, కొన్ని వాక్యాలు చూద్దాము.

ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను.౹ -యోహాను 1:4. అలాగే, “నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది. -కీర్తనలు 119:105”.

దేహమునకు కన్నే దీపము. మన త్రోవకు అనగా మన జీవిత ప్రయాణంలో వాక్యమే దీపము. అనగా దేహము మన జీవితం అలాగే మన జీవితానికి కన్ను, దేవుని వాక్యము. చెడినకన్ను అనగా వాక్యఫలింపులేని పరిస్థితి.

ఈ వాక్యము ఎప్పుడు మన జీవితంలో ఫలిచదు? దీనిని అర్ధంచేసుకోవటానికి, కొన్ని వాక్యాలు చూద్దాము.

వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడెను. పక్షులువచ్చి వాటిని మ్రింగివేసెను.

మార్కు 4:4

మన జీవిత ప్రయాణంలో విత్తబడుతున్న వాక్యము అపవాది ఎత్తుకుపోతున్నాడు. ఎందుకంటే పక్కన పడుతున్నాయి, అనగా ఆ వాక్యాన్ని విశ్వసించట్లేదు, ఆ వాక్యము పక్కకుత్రోయబడింది, అపవాది ఎత్తుకుపోయాడు. ఉదాహరణకు, “పాస్టరుగారికి మాగురించి అన్నీ తెలుసు అండి, అందుకే ఆయన అన్ని ఆ ప్రకారం చెప్తున్నారు అనే ఆలోచన తీసుకువస్తాడు”. అప్పుడు ఆ సమయంలో ఇవ్వబడినవాక్యమును మనము విశ్వసించలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతాము. అప్పుడు అపవాది ఎత్తుకుపోతాడు. ఎప్పుడైతే మన ఊహకు మించినది ప్రభువు వాక్యము చెప్తుందో, అప్పుడు అపవాది దానిని ఎత్తుకుపోతుంది. ప్రభువు లేఖనము అనగా వాక్యము. అందులో జీవము ఉంది. ఆ వాక్యము మన ఊహకుమించినదైనప్పటికీ విశ్వసించినయెడల ఆ జీవము ప్రత్యక్షపరచబడుతుంది.

కొన్ని చాల మన్ను లేని రాతినేలను పడెను; అక్కడ మన్ను లోతుగా ఉండ నందున అవి వెంటనే మొలిచెను గాని

మార్కు 4:5

కొన్నివిత్తనాలు మన్ను లేని రాతినేలను పడెను. అనగా. మన్ను అనగా, “దేవుని జ్ఞానము”. కొన్ని సందర్భాలలో దేవుని వాక్యము ఎరిగే జ్ఞానము లేనిదానిని బట్టి ఆ వాక్యము నిలువట్లేదు. జ్ఞానము కలిగినవాడు లోతుగా పరిశీలనచేస్తాడు అప్పుడు వాడు వాక్యములోని లోతైన మర్మములు తెలుసుకోగలవారిగా ఉంటారు.

 కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్లపొదలు ఎదిగి వాటిని అణచివేసెను గనుక అవి ఫలింపలేదు.

మార్కు 4:7

కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్లపొదలు ఎదిగి వాటిని అణచివేసెను గనుక అవి ఫలింపలేదు. -మార్కు 4:7.
ముండ్లపొదలో విత్తనము పడింది. ముండ్లపొద అనగా, భయము లేని భక్తి గా చూడవచ్చు. మన వద్దకు హెచ్చరికవాక్యము వచ్చినప్పుడు, భక్తికలిగినందున అది మొలకెత్తుతుంది, కాని భయములేని కారణాన, ఆ మొలకెత్తినది ఫలించట్లేదు.

కొన్ని మంచినేలను పడెను; అవి మొలిచి పెరిగి పైరై ముప్పదంతలుగాను అరువదంతలుగాను నూరంతలుగాను ఫలించెను.

మార్కు 4:8

మనము దేవుని వెలుగుతో నిండిన జీవితం కలిగిఉండాలంటే

  1. దేవుని వాక్యము మన ఊహకు మించినదైనా కూడా నమ్మగలిగే విశ్వాసము ఉండాలి.
  2. దేవుని వాక్యజ్ఞానము కలిగి ఉండాలి
  3. దేవునియందలి భయముతో కూడిన భక్తి కలిగి ఉండాలి.

మంచినేల అనగానే విశ్వాసము, దేవుని జ్ఞానము, నిజమైన భయభక్తులను కలిగిన జీవితం. అప్పుడు ఖచ్చితంగా మనజీవితంలో ముప్పదంతలుగానో, అరువదంతలుగానో, నూరంతలుగానో ఫలిస్తాము. వాక్యమే మనజీవితమునకు దీపము అయిఉన్నది. వాక్యము ఫలించినకొలది మనజీవితం వెలుగుమయం అవుతుంది. ఆ వాక్యము ఎందుచేత ఫలించట్లేదు అనేది ఈరోజు ధ్యానము చేసాము. విన్నవాక్యము ప్రకారము మంచినేలగా మన జీవితాన్ని చేసుకొనులాగున దేవుడు మనకు సహాయము చేయునుగాక.

యూట్యూబ్ లో ఈ వీడియో చూడండి