దేవునికి మహిమకరముగ ఉండుము

మన జీవితములు దేవునికి మహిమకరముగా ఉండాలి. మనము దేవుని మహిమ నిమిత్తమే సృష్టించబడ్డాము అని వాక్యము తెలియజేస్తుంది. ఈ విషయము మనము ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మనము మంచిగా ఉన్న పరిస్థితులో అయినా, చెడుగా ఉన్న పరిస్థితిలోఅయిన ఈ సత్యమును మనము గుర్తుపెట్టుకుంటే, ఆ చెడు పరిస్థితులను జయించగలము. లేకపోతే ఆ పాపములో కొట్టుకొనిపోయేవారుగా ఉంటాము.

–నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞానదశలో మీకుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.౹ -1 పేతురు 1:14


దేవునికి మహిమకరముగా జీవించాలి అంటే మనము పరిశుద్ధముగా ఉండాలి. పూర్వపు అజ్ఞానదశలో మనము తెలియక పాపపు ఆశలప్రకారము జీవించాము.

వారితో (అవిశ్వాసులతో) కలిసి మనమందరమును శరీరముయొక్కయు మనస్సుయొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించిమునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి.౹ -ఎఫెసీయులకు 2:3.


మొట్టమొదట మనము చెయ్యవలసినది, మన శరీరము చెప్పినప్రకారము మనము చెయ్యకూడదు. అది కళ్ళముందు చూసేదానిని బట్టి జరిగించేదిగా ఉంటుంది. ఉదాహరణకు చూస్తే, మన ఇంటిపక్కనవాళ్ళు ఏమైనా కొనుక్కుంటే వెంటనే మనము కూడా అది కలిగియుండాలి అనే కోరిక వెంటనే వచ్చేస్తుంది. ఒక్కోసారి అసూయకలిగిన దురాశగా కూడా అది మారిపోతుంది.


శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,౹ విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,౹ భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితోకూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేనుమునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.౹ -గలతీయులకు 5:19-21.


ఇంతకుముందు ఇలా ఉన్నారేమో, కానీ ఈరోజు నీయొద్దకు వచ్చిన దేవునివాక్యము స్వీకరించినట్టయితే, మీరు విధేయులగు పిల్లలై, అనగా దేవునికి విధేయులైన పిల్లలై పరిశుద్ధముగా ప్రవర్తించుడి. నీ శరీరము నిన్ను ప్రేరేపించిన పరిస్థితులలో నీలో ఉన్న దేవుని ఆత్మ, నీతో మాట్లాడే మాటకు విధేయత చూపించినట్టయితే, నీవు పరిశుద్ధముగా ఉండగలుగుతావు.


మరియు మాట చేత గాని క్రియచేత గాని, మీరేమి చేసినను ప్రభువైన యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయుడి. -కొలొస్సయులకు 3:17.


ఏమి చేసినా కూడా, ఒకవేళ తగ్గవలసివచ్చినా తగ్గడమే, అది మనకొరకు కాదు. దేవుని కొరకు, ఆయన మాటకు విధేయులగుటకొరకు.
మన ప్రవర్తన సరిగాలేకుండా, మనము ఎన్ని ఆత్మీయ కార్యములు జరిగించినా అవి వృధాయే.


మీరు క్షయబీజమునుండి కాక, శాశ్వతమగు జీవముగల దేవునివాక్యమూలముగా అక్షయబీజమునుండి పుట్టింపబడినవారు గనుక నిష్కపటమైన సహోదరప్రేమ కలుగునట్లు, మీరు సత్యమునకు విధేయులవుటచేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారైయుండి, యొకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఏలయనగా -1 పేతురు 1:22.


శాశ్వతమగు జీవముగలిగినది దేవునివాక్యమే. పాస్టరుగారి సాక్ష్యము -“సేవకు వచ్చిన కొత్తలో, ఎలా ఉండాలి అని దేవునివద్ద కనిపెడుతున్నప్పుడు, డబ్బుకొరకు ఎవరియొద్ద చెయ్యి చాచకూడదు అని నిర్ణయించుకున్నాను. ఇంటి అవసరతల నిమిత్తము ప్రార్థన చేస్తున్నప్పుడు, ‘సీయోనులోనుండి నిన్ను ఆశీర్వదిస్తానూ అనేమాట దేవుడి దయచేసాడు. అప్పటినుండీ అనేకమైన పరిస్థితులలో ఆ మాట నా జీవితములో అనేక నెరవేర్చబడింది – బ్రదర్. రాజ్ కమల్“.

సత్యమునకు విధేయులుగా ఉండాలి అంటే ఎలా ఉండగలుగుతావు? సత్యము అనగా యేసుక్రీస్తే.


నేను క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నే నిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసమువలన జీవించుచున్నాను.౹ -గలతీయులకు 2:20.


నన్ను ప్రేమించి -> నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన -> యేసు వలనైన నా జీవితము. ఎప్పుడైతే, నీ జీవితము యేసు ప్రాణముపెడితే వచ్చింది అని గుర్తిస్తామో, అనగా ఈ జీవితము నీది కాదు అని గుర్తిస్తావో, అప్పుడు ఆ క్రీస్తు సత్యమునకు విధేయుడగుతావు.


సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణమాటలను మాని, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి.౹ -1 పేతురు 2:2.

దుష్టత్వము అనగా ఇతరులకు అపకారము జరిగించాలి అనే కోరిక. వేషధారణ అంటే మనుష్యుల యెదుట ఒకలాగా, వారులేనప్పుడు ఒకలాగ ఉండే స్థితి. అసూయ అనగా ఇతరులు కలిగినదానిబట్టి చెడుగా ఆలోచించే గుణము.అయితే ఈ పరిస్థితులు రాకమానవు. అయితే ఈ పరిస్థితులలో నీ రక్షణవిషయములో ఎదుగునిమిత్తము, నిర్మలమైన వాక్యమును అపేక్షించుడి అనగా స్వీకరించుడి. అంటే ఆ పరిస్థితులలో వాక్యము చెప్పు ప్రకారము చెయ్యటమే. వాక్యములో ఎదగాలి అంటే, ఆ కోరిక నీకు వుంటే, నీ శరీరము ప్రేరేపించే పరిస్థితిలో ఉదాహరణకు ఈరోజు నీకు అసూయ ఉంది. దేవుని వాక్యము సంధించింది, నీవు స్వీకరించావు. తరువాత అదే అసూయపడే పరిస్థితి వచ్చినప్పుడు ఆ వాక్యప్రకారము నీవు చెయ్యాలి. అలా చేసేంతవరకు వాక్యములో నీవు ఎదగలేవు. అక్షరాలు రాకుండా వాక్యములు నేర్చుకోలేము. అనగా ఏ, బి, సి, డిలు రాకుండా సెంటెన్సులు నేర్చుకోలేము.


అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్‌క్రియలను చూచి, వాటినిబట్టి దర్శనదినమున దేవుని మహిమపరచునట్లు, వారిమధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. -1 పేతురు 2:12.


బ్రదర్ జీవితములో నుండి ఒక సాక్ష్యము – “దేవుని సేవకు రాకముందు, స్నేహితులతో కలిసి బాగా మద్యము సేవించే పరిస్థితులలో జీవించే వాడిని. ఆదివారము చర్చికి వెళుతూ తరువాత వారితో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉండేవాడిని. అయితే ఎప్పుడైతే దేవుని రక్షణలోనికి వచ్చానో, అదే స్నేహితుల మధ్య నా మారిన జీవితము దేవుని నామమును మహిమపరిచేదిగా అయ్యింది.“.

కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది.౹ మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి. -రోమా 12:1-2.


లోకము నశించిపోయేదానిని వెంబడిస్తుంది. అయితే మనము నిత్యము జీవించేవాడిని వెంబడిస్తునాము. లోకమునకు సంబంధించినవారు ఎలా ఉన్నాకూడా, సత్యమును అనుసరించేవాడిగా, నీవు వారిప్రకారము ఉండకూడదు. నిలబడడానికి నువ్వు సిద్ధపడితే, నిలబెట్టడానికి ఆయన సిద్ధమే. అయితే నీవు సిద్ధపడగానే ఒక పరీక్ష సిద్ధముగా ఉంటుంది. ఒకవేళ ఆ పరీక్షలో ఓడిపోతే, మరలా ప్రభువు సంధించేవరకు దైవోగ్రతకు పాత్రులుగా ఉంటాము.
ఈరోజు నేర్చుకున్న అయిదు విషయాలు.

  1. పరిశుద్ధులుగా ఉండాలి.
  2. సత్యమునకు విధేయులై ఉండాలి.
  3. సమస్తమైన దుష్టత్వము (ఇతరులకు అపకారము జరిగించాలి అనే కోరిక) వదిలిపెట్టాలి.
  4. వాక్యమునకు విధేయత కలిగి ఉండాలి.
  5. అన్యజనులు ఏ విషయములో నీవు చెడ్డవాడివి అనుకుంటారో అదే విషయములో వారు నీలో మార్పు చూడాలి, దేవునిని మహిమ పరచాలి.

పూర్తివీడియో యూట్యూబ్ లో చూడండి.