నీ రాజు స్తుతింపబడునుగాక

నీ రాజు స్తుతింపబడును గాక. ఎప్పుడు ఆయన స్తుతింపబడతాడు అనేది వాక్యముద్వారా నేర్చుకుందాము.


మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజనసమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని౹ ఖర్జూరపుమట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి –జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలురాజు స్తుతింపబడునుగాక అని కేకలువేసిరి.

యోహాను 12:12-13


ఇక్కడ “ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలురాజు స్తుతింపబడునుగాక” అనేమాట మనము గమనించాలి. అంతకుముందు యెరుషలేములో జరిగిన సంగతులు గనుక గమనిస్తే, “ఆయన విశ్రాంతిదినాచారము మీరుట మాత్రమేగాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, తన్ను దేవునితో సమానునిగా చేసికొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. -యోహాను 5:18”. ఆరోజున దేవదూషణ చేస్తున్నాడు అని ఆయనను అంగీకరించక, పట్టుకొనిన యూదులు ఇప్పుడు జయము అంటున్నారు.


మరొక వాక్యము చూద్దాం, కాబట్టి నేను పరలోకమునుండి దిగి వచ్చిన ఆహార మని ఆయన చెప్పినందున యూదులు ఆయననుగూర్చి సణుగుకొనుచు–ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా?౹ -యోహాను 6:41. ఈ మాటలు విన్నవెంటనే వారు యేసును అంగీకరించలేదు. ఆయన పరలోకమునుండి వచ్చినవాడు అనే సంగతి నమ్మలేదు. మరి ఇప్పుడైతే జయము జయము అని కేకలు వేస్తున్నారు.


మరొక వాక్యములో, “నేను ఆయన యొద్దనుండి వచ్చితిని; ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పెను.౹ అందుకు వారాయనను పట్టుకొన యత్నముచేసిరి గాని ఆయన గడియ యింకను రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు. ౹ -యోహాను 7:29-30”. నేను తండ్రిని ఎరుగుదును అని చెప్పగానే, ఆ యూదులు ఆయనను పట్టుకోవడానికి ప్రయత్నించారు. మరి ఇప్పుడైతే వారు రాజుగా స్వీకరించి జయము అని కేకలు వేస్తున్నారు.


ఇంకొకవాక్యములో, “యేసు–అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.౹ కాబట్టి వారు ఆయనమీద రువ్వుటకు రాళ్లు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములోనుండి బయటికి వెళ్లిపోయెను. -యోహాను 8:58-59”. ఇక్కడకూడా, ఆయన చెప్పిన మాటను బట్టి రాళ్ళతో కొట్టడానికి చూసారు. వారు యేసును అంగీకరించలేని స్థితినుండి మార్పుచెంది, ప్రభువుపేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని కేకలు వేస్తూ మహిమపరుస్తున్నారు.
వీరు అనుభవము ద్వారా ఈ సత్యమును గ్రహించినవారుగా ఉన్నారు.

కొన్ని వాక్యములు గమనిద్దాము.

కాబట్టి యేసు తాను మృతులలోనుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కాపండుగకు ఆరు దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి.౹ మార్త ఉపచారము చేసెను; లాజరు ఆయనతోకూడ భోజమునకు కూర్చున్నవారిలో ఒకడు.౹

యోహాను 12:1-2

యూదులందరి యెదుట జరిగిన గొప్ప అద్భుతం, చనిపోయి, సమాధిచెయ్యబడిన లాజరు, తిరిగిలేచి సజీవుడిగా వారిమధ్యకు మరలా రావడం. “ఆయన ఆలాగు చెప్పి–లాజరూ, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా౹ చనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు– మీరు అతని కట్లు విప్పిపోనియ్యుడని వారితో చెప్పెను. కాబట్టి మరియయొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి -యోహాను 11:43-45″

దేవుడు నీ జీవితంలో జీవమును ఇస్తాను అని దేవుడు చెప్పిన మాటలు నీవు అంగీకరించలేకపోతున్నావు. అయితే ఇతరుల జీవితంలో దేవుడు చేసిన అద్భుతకార్యమును చూసి నమ్మినట్టైతే, ఇప్పుడు నువ్వుకూడా నీ దేవుని మాటను అంగీకరించి ఆయనను ఎదుర్కొని స్తుతించేవాడుగా ఉంటావు.

సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు.౹ -జెకర్యా 9:9.
ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. -మత్తయి 11:28.

దేవుని నమ్మినప్పుడు మనకు రక్షణ దయచేయబడింది. అయితే ఆ రక్షణను కొనసాగించలేని స్థితిలో ఉండిపోతున్నాము. అసలు రక్షణ అంటే ఏమిటి? బాప్తీస్మము ద్వారా, నేను పాపము విషయమై మరణించి, ప్రభువును బట్టి తిరిగి జన్మించాను అనే సాక్ష్యము ఇస్తున్నాము. అయితే కొన్ని దినాలైన తరువాత, ఏ పాపము విషయములో చనిపోయాము అని చెప్తున్నామో, అదే పాపములో మరలా పడుతున్నాము. అలా ఉండకుండా జాగ్రత్తపడటమే రక్షణ కొనసాగించుకొనుట.


ఎప్పుడు నీ రాజు స్తుతింపబడతాడు?
1. నీకు అనుగ్రహించబడిన నీతిని కొనసాగించినప్పుడు.
2. నీకు దేవుడు ఇచ్చిన రక్షణను కొనసాగించినప్పుడు.
3. క్రీస్తు మనస్సు కలిగి జీవితాన్ని కొనసాగించినప్పుడు.


వదిలివేసిన దానిని తిరిగిపట్టుకుంటే, పరలోకములో ప్రవేశములేదు. అయితే ప్రభువు ప్రేమ కలిగిన వాడు కాబట్టి, మరొక అవకాశము దయచేసేవాడుగా ఉన్నాడు. ఆయన మాటలు అంగీకరించి మనజీవితంలో ఆయన స్తుతినొందునట్లుగా మన జీవితాలు సరిచేసుకుందాము.

యూట్యూబ్ లో ఈ వీడియో చూడండి