ఆయన ఆసీనుడై వచ్చుచున్నాడు

మన ప్రభువు మనలను ప్రేమించేవాడుగా ఉన్నాడు – మనము దేవునిని స్తుతించేవారుగా ఉండాలి. ఆ ప్రభువు ప్రేమను బట్టే సమస్త కార్యములు జరుగుతున్నాయి.

ఏ పని కొరకైతే ప్రభువు ఈ భూలోకములోనికి వచ్చాడో, ఆ పని ముగించుకాలముయొక్క ప్రారంభమే మట్టల ఆదివారము. నీ జీవితములో ఏ కార్యము ముగించబడాలో ఆ ముగింపుకొరకైన కార్యము ఇప్పుడే ప్రారంభించబడింది – ఆమెన్!


ఆయన ఆసీనుడై వచ్చుచున్నాడు. మన దేవుడు రాజుగా ఉంటున్నాడు. జెకర్యా 9:9 లో చూస్తే, సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు అని రాయబడింది. ఆ ఆసీనుడైనవాడు ఎవరు అనేది మనము అర్ధంచేసుకోవాలి. ఆయనకున్న పదవిని బట్టి “ఆసీనుడు” అనేమాట వాడబడుతుంది. అయితే ఆయన ఎందుకు అసీనుడు అయ్యాడు? అనేది అర్ధము చేసుకొనుటకు కొన్ని వాక్యములు చూద్దాం.


నేను కన్నులారా చూచితిని గనుక బాధించువారు ఇకను సంచరింపకుండను, తిరుగులాడు సైన్యములు నా మందిరముమీదికి రాకుండను దానిని కాపాడుకొనుటకై నేనొక దండు పేటను ఏర్పరచెదను. -జెకర్యా 9:8.


సింహాసనం మీద ఆసీనుడైనవాడు తన ప్రజలు బాధింపబడుట కన్నులార చూసాడు. కన్నులారా చూసి ఇకముందు వారు బాధింపబడకుండునట్లు ఒక దండుపేట ఏర్పరుచుచున్నాడు. అనగా ఏ ఆలోచన అయితే మనలను కాపాడటానికి ఆయన కలిగిఉన్నాడో అది నెరవేర్చుటకు వచ్చుచున్నాడు. యూదులను గమనిస్తే ప్రభువును మొదట వారు నమ్మలేదు. దేవాలయమును మూడుదినాలలో దేవాలయమును కడతాను అని ప్రభువు చెప్పినప్పుడు వారు నమ్మలేదు. కాని ఎప్పుడైతే లాజరు జీవితములో జరిగినదానిని చూసారో, అప్పుడు నమ్మినవారుగా ఉన్నారు.

మన దేవుని గూర్చిన వార్తను నమ్మినవారికి జీవార్థమైన సువాసనగా ఉంది. అయితే నశించువారికి మాత్రమే, వారి అపనమ్మకాన్ని బట్టి ఆవార్త మరణపు వాసనగా ఉంటుంది. మన జీవితంలోనే కాక, ఇతరుల జీవితంలో ప్రభువు జరిగించిన అద్భుతకార్యములను చూసినప్పుడు సైతము మనము నమ్మి, మన పాడైన స్థలములు బాగుచేయబడును, ఆదరించబడును అని నమ్మినవారమైతే ప్రభువు కొరకు సంతోషగానము చేయగలుగుతాము.

నీ రాజు నీతిపరుడును, రక్షణ గలిగినవాడుగా మరియు దీనుడుగా వస్తున్నాడు. ఈ వాక్యము ద్వారా మనము ఏమి అర్ధముచేసుకోవచ్చు? ఆసీనుడుగా ఉండి మన స్థితి చూసినవాడు, మనకు అవసరమైన రక్షణ కలిగినవాడుగా మనదగ్గరకు వచ్చుచున్నాడు. అనగా ఖచ్చితంగా విడుదలదయచేయు రక్షణ కలుగుతుంది. అలాగే ఆయన దీనుడుగా వస్తున్నాడు అనగా మనము బాధింపబడుతున్న పరిస్థితిని చూసి మనమీద కనికరము కలిగినవాడుగా వస్తున్నాడు. ఆయన మనసంతా మనమీద కనికరంతో నిండిపోయింది.

మరియు యెహోవా యిట్లనెను–నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపట్టువారినిబట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే యున్నవి.౹ -నిర్గమకాండము 3:7 .

ఇశ్రాయేలుప్రజల జీవితంలో గమనించినట్టైతే, “మరియు యెహోవా యిట్లనెను–నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపట్టువారినిబట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే యున్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలోనుండి వారిని విడిపించుటకును, ఆ దేశములోనుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు హిత్తీయులకు అమోరీయులకు పెరిజ్జీయులకు హివ్వీయులకు యెబూసీయులకు నివాసస్థానమై, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చియున్నాను.౹ -నిర్గమకాండము 3:8”. దేవుడు విడుదల ప్రణాళిక తో వస్తున్నాడు.
ఆయన స్వాస్థ్యమును విడనాడువాడు కాదు. నీవు నేను ఆయన స్వాస్థ్యము. “బాధించువారు ఇకను సంచరింపకుండను – జెకర్యా 9:8”. అనగా మనలను బాధించడానికి ఎన్ని రకాలుగా ఆ పరిస్థితి ప్రయత్నిస్తుందో, ఆ అన్ని పరిస్థితులనుండి తప్పించడానికి ప్రణాళిక కలిగినవాడు.

అక్కడ ముప్పది యెనిమిది ఏండ్లనుండి వ్యాధిగల యొక మనుష్యుడుండెను.౹ యేసు, వాడు పడియుండుట చూచి, వాడప్పటికి బహుకాలమునుండి ఆ స్థితిలోనున్నాడని యెరిగి–స్వస్థపడ గోరుచున్నావా అని వానినడుగగా౹ ఆ రోగి–అయ్యా, నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చునంతలో మరియొకడు నాకంటె ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను.౹ యేసు–నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుమని వానితో చెప్పగా౹ వెంటనే వాడు స్వస్థతనొంది తన పరుపెత్తికొని నడిచెను. -యోహాను 5:5-9.


ఆ వ్యక్తి 38 సంవత్సరాలనుండి బాధపడుతున్నాడు. యేసు ఆవ్యక్తి అప్పటికే బహుకాలమునుండి ఆ స్థితిలో ఉన్నాడు అని ఎరిగినవాడు. ఎరిగినవాడై కనికరముతో నిండినవాడై అతని దగ్గరకి వచ్చాడు యేసు. ప్రభువు స్వస్థపరచబడగోరుతున్నావా అని అడిగినప్పుడు, ఆ వ్యక్తి కోనేటిద్వారా మాత్రమే విడుదలకొరకు ఎదురుచూస్తున్నాడు. అయితే మాటలోనే శక్తికలిగినవాడు, అతడు బహుకాలముగా ఉన్న పరుపు ఎత్తుకొని నడువు అని చెప్పాడు. మన జీవితం గురించి చూసినప్పుడు, విడుదల కొరకు ఎంతో ఆశగా ఉన్నామేమో కాని ఎలాగో మిస్ అయిపోయింది. అయితే ప్రభువు చెప్తున్నాడు, నువ్వు గనుక ఇంక అదే ఆశతో విడుదల పొందాలి అని చూస్తున్నావా? నీ రాజు నీయొద్దకు వచ్చుచున్నాడు. విడుదలకొరకైన ప్రణళికతో వస్తున్నాడు. పొందుకో.

ఏదైతే చాలకాలంగా అంటిపెట్టుకుని ఉండిపోయిందో, దానినుండి విడుదల ప్రభువు దయచేయువాడు. నమ్మి విడుదల పొందుకుని ప్రభువుని మహిమపరుచు.

యూట్యూబ్ లో ఈ వీడియో చూడండి