నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను, అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు గిర్గాషీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులను ఏడు జనములను నీ యెదుటనుండి వెళ్లగొట్టిన తరువాత…
ద్వితీయోపదేశకాండము 7:1
ఈ జనములు, ఇశ్రాయేలీయులకంటే సంఖ్యలోగానీ, బలములోగానీ గొప్పవారై ఉన్నారు. మనజీవితంలోకూడా అద్భుతమైన వాగ్దానములు దేవుని నుండి పొందిఉంటాం. అయితే మన ఆలోచనలు, మన బలము కూడా ఏమాత్రము సరిపోయేదిగా ఉండట్లేదేమోగాని, “నీ దేవుడైన యెహోవావారిని నీకప్పగించునప్పుడు… ద్వితీయోపదేశకాండము 7:2”. నీ బలముబట్టికాదు, నిన్ను ప్రేమించిన నీ దేవుని బట్టి ఇది జరుగును. అప్పుడు నీవు, “వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను. వారితో నిబంధన చేసికొనకూడదు, వారిని కరుణింపకూడదు – ద్వితీయోపదేశకాండము 7:2”.ఏమి నిర్మూలంచేయాలి? మన ఆలోచనలు నిర్మూలంచేయాలి.
ఈ జనములు నాకంటె విస్తారముగా ఉన్నారు, నేను ఎట్లు వారిని వెళ్లగొట్టగల నని నీవనుకొందువేమో, వారికి భయపడకుము.
ద్వితీయోపదేశకాండము 7:17
మనజీవితంలో మనము ఏమిచేసినా ఆయన కృపను బట్టే. ఆయన తన స్వరక్తమిచ్చి మనలను కొనుక్కున్నాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీ యెడల నా ఆలోచనలు లెక్కకు బహు బహువిస్తారములు. మన బాధలో, మన దుఃఖములో మనము అలోచించేదానికన్నా ఎక్కువగా మనదేవుడు మనగురించి ఆలోచించేవాడుగా ఉన్నాడు. మీరు చెడ్డ వారై యుండియు మీ పిల్లలకు మంచి యీవుల నియ్య నెరిగి యుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచి యీవుల నిచ్చును. -మత్తయి 7:10. మన తల్లిదండ్రులు మంచివాటిని ఇవ్వాలి అని ఎలా అయితే “అనుకుంటున్నారో”, అంతకంటే ఎక్కువ నిశ్చయముగా మంచివాటిని పరలోకమందున్న తండ్రి ఇచ్చువాడుగా ఉన్నాడు. ఆ మంచివాటిని మనజీవితంలో ఎలా మనము పొందాలో అనే ఆలోచన ఆయన కలిగేవున్నాడు.
షద్రకును, మేషాకును, అబేద్నెగోయు రాజుతో ఈలాగు చెప్పిరి–నెబుకద్నెజరూ, యిందునుగురించి నీకు ప్రత్యుత్తర మియ్యవలెనన్న చింత మాకు లేదు.౹ మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల యీ అగ్నిగుండములోనుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు; మరియు నీ వశమున పడకుండ ఆయన మమ్మును రక్షించును; -దానియేలు 3:16-17. అలాగే, అపొస్తలులకార్యములు 7వ అధ్యాయములో, స్తెఫను రాళ్ళతో కొట్టబడుతున్న స్థితిలో, “అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశమువైపు తేరిచూచి, దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటను చూచి..”. ఆదాము హవ్వలు కూడా దేవుని మహిమకలిగిన స్థితిలో ఉన్నంతవరకు వారికి శ్రమ, బాధ ఏమీ తెలియదు. ఈ షడ్రకు, మేషాకు అబెద్నగో అనేవారిని అగ్నిగుండంలో వేసినా కూడా, దేవుని మహిమ వారిమీద ఉన్నది. వారితో మరొక నాల్గవ మనిషి, దేవుని యొద్దనుండి వచ్చాడు. దేవుని సన్నిధిలో మహిమ, బలము ప్రభావములు ఉంటాయి. ఆ వ్యక్తి ఆ మహిమ ప్రభావములు అక్కడకు తీసుకువచ్చాడు. వాక్యము చూసినట్టయితే, “ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.౹ -రోమా 3:23”. ఈ షద్రకు, మేషాకు, అబెద్నగో అనువారు, పాపము చేయక దేవుని కొరకు నిలబడినదానిని బట్టి, దేవుడు అనుగ్రహించు మహిమను పొందారు.
మీ తండ్రియైన అబ్రాహాము సంగతి ఆలోచించుడి మిమ్మును కనిన శారాను ఆలోచించుడి అతడు ఒంటరియై యుండగా నేను అతని పిలిచితిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది యగునట్లు చేసితిని. -యెషయా 51:2. అబ్రాహాముకు సామర్థ్యము కలుగజేసినవాడు దేవుడే. చాలమంది ఏమనుకుంటారో వాక్యము స్పష్టంగా చెప్తుంది, “మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసెనని అనుకొందురేమో.౹ -ద్వితీయోపదేశకాండము 8:17”. నిజానికి, “నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసికొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటివలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే.౹ -ద్వితీయోపదేశకాండము 8:18”. ఇప్పుడు నీవున్న నీ స్థితిలో నీకు సామర్థ్యము కలిగచేసినవాడు దేవుడే. మన జీవితంలో ఆయన వాగ్దానము చేసాడు. ఏమి వాగ్దానము? అబ్రాహామును బట్టి తన సంతానము ఆశీర్వదించబడును అనేది. ఆ వాగ్దానము నెరవేరుటకు సామర్ధ్యము దేవుడే బలము కలుగజేయువాడు.
దానియేలు యిర్మీయా గ్రంధము చదివినప్పుడు 70 సంవత్సరాలతరువాత విడుదల అని గ్రహించగానే దేవుని సన్నిధిలోనికి త్వరపడి వెళ్ళినాడు. మనము కూడా దేవుని వాగ్దానమును గ్రహించగానే, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి.
అతడు ఒకనికి అయిదు తలాంతులను ఒకనికి రెండు, ఒకనికి ఒకటియు ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి, వెంటనే దేశాంతరము పోయెను. -మత్తయి 25:15. అనగా ఒకని విశ్వాసపరిమాణమును బట్టి సామర్థ్యము కలుగజేయువాడు ఉన్నాడు.
తనప్రేమని బట్టి దేవుడు కలుగజేయు సామర్థ్యము కలిగి ఉండుటకు, దేవుడు మనపై తన కృపచూపించి నడిపించును గాక. ఆమేన్!
ఈ వీడియో యూట్యూబ్ లో చూడండి.