యేసు ఈ లోకములో ఉన్నప్పుడు అనేకమైన మాటలు ఉపమానముతో వివరించి చెప్పినాడు. ఒకమాట ఈరోజు మనము గమనిద్దాము.
ఆయన వారిని చూచి– ఆలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను అని వ్రాయబడిన మాట ఏమిటి? -లూకా 20:17
ఇల్లు – ఆత్మీయ జీవితం
కట్టువారు – ఆత్మీయంగా కట్టబడాలి అనే ఆశ కలిగినవారు.
రాయి – ఇల్లు కట్టుటలో సరిహద్దు సరైన విధానంలో వచ్చున్నట్లుగా ఉపయోగించు రాయి. రిఫరెన్స్ కొరకు. అత్మీయమైన జీవితానికి సరిహద్దు సరిగా కట్టబడాలి అంటే, యేసు అనే రాయే, మూలరాయిగా ఉన్నరు.
నిషేధించిన రాయి – ఉపయోగించబడకూడదు అని వదిలిపెట్టబడినది. కొన్ని పరిస్థితులలో ఆయన మాట నమ్మని పరిస్థితులలో, ఆయన మహిమ ప్రత్యక్షత చూడలేని పరిస్థితులలో ఆయనను నిషేధించువారిగా ఉంటున్నాము.
ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే; ఆ రాయి మూలకు తలరాయి ఆయెను.౹ -అపొస్తలుల కార్యములు 4:11.
క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.౹ -ఎఫెసీయులకు 2:20
ఈ రెండు వాక్యములను బట్టి చూస్తే, మనము వేరు వేరు పరిస్థితులలో, నిషేధించినప్పటికీ, ఆయనే మన సరిహద్దులు సరిగా కట్టబడి, ఆ సరిహద్దులోపల సుందరమైన అత్మీయ జీవితం కట్టబడటానికి, తలరాయి ఆయనే, యేసు ప్రభువే.
మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశ మంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను. -అపొస్తలుల కార్యములు 2:36
ఈ వాక్యములో – “మీరు సిలువవేసిన యేసే” అనగా మీరు నిషేధించిన లేదా మీరు విసర్జించిన యేసే, అనగా మనము యేసును అంగీకరించని ప్రతి పరిస్థితులలో ఆయనను సిలువవేసిన వారిగా ఉన్నాము కాని, ఆ ప్రతి పరిస్థితులలో విడుదల కొరకు ఆయననే ప్రభువుగా దేవుడు నియమించాడు. అనగా ఆయా పరిస్థితులలో మనకొరకు దేవుడు విడుదల చేసిన వాక్యమును అంగీకరించలేని పరిస్థితులలో ఆయనను నిషేధించువారిగాను, విసర్జించినవారిగాను, సిలువవేసినవారిగాను ఉంటున్నాము. కాని, మన పరిస్థితి సరిజేయబడాలి అంటే అదే వాక్యమును గైకొనాలి.
యేసుక్రీస్తు అందరికి ప్రభువు. ఆయనద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు.౹ -అపొస్తలుల కార్యములు 10:36.
ఇదే వాక్యమును వ్యక్తిగతంగా చూసినప్పుడు, “యేసుక్రీస్తు నా జీవితము అంతటికీ, అనగా నా జీవితంలోని ప్రతి పరిస్థితిలోనూ, ఆయనే ప్రభువుగా అధికారము కలిగినావాడు. నా జీవితంలో వెంటాడె అలజడి, శ్రమలు, వేదన, కృంగుదల అన్ని పరిస్థితులలో సమాధానము కలిగించు ఆయన వాక్యమును, అనగా నా పరిస్థితులలో నేను రక్షించబడతాను అనే సువార్త ప్రకటించినాడు. ఎప్పుడైతే ఈ మాటలు మనము విశ్వసిస్తామో, ఆ ప్రతి పరిస్థితిలో మనము సిగ్గుపడము.”.
అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.౹ కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింపబడుదుము.౹ -రోమా 5:8-9
ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణముద్వారా మనము దేవునితో సమాధానపరచబడినయెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడు దుము.౹ -రోమా 5:10
ఏలయనగా –ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సీయోనులో సాప్థిచుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచు వాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడియున్నది.౹ -1 పేతురు 2:6.
మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను.౹ -1 యోహాను 4:9
ఇలా మనము గమనిస్తే మన జీవితంలో దేవుని ప్రేమ యేసుక్రీస్తుయందు మన కొరకు ప్రత్యక్షపరిచినాడు అని గ్రహించగలము. అయితే విశ్వాసులమైన అనేక సందర్భాలలో ఆయనను మనము ఆయన వాక్యమును నమ్మక, శరీరమును జయించలేక, ఆయనను నిషేధించువారిగాను, విసర్జించువారిగాను చివరికి సిలువవేయువారిగాను ఉంటున్నాము. ఈ మూడు పరిస్థితులను గమనిస్తే –
- నిషేధించుట – మొదటి స్థితి అనగా, పాపపు ఆలోచన రాగానే ఆపలేని పరిస్థితి
- విసర్జించుట – రెండవ స్థితి అనగా, దేవుని ఆత్మ మన మనస్సాక్షిని గద్దించినా కూడా లెక్కచేయని పరిస్థితి
- సిలువవేయుట – చివరి స్థితి అనగా, పాపము చేసె పరిస్థితి
వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని –సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడుగగా౹ -అపొస్తలుల కార్యములు 2:37.
ఈరోజు విన్న ఈ వాక్యముద్వారా నీ హృదయములో నొచ్చుకొన్నయెడల, ఏమి చేతుము అనే ప్రశ్నవస్తే, ఆయనే నీ జీవితాన్ని సరిజేయగలిగే మూలరాయి. నువ్వు నిషేధించిన, విసర్జించిన మరియు సిలువవేసిన ఆ యేసే, ఆయన విడుదల చేసిన మాటలే నీ ఆత్మీయ జీవితమునకు సరిహద్దువేసి దానిని కట్టులాగున మూలరాయి అని గ్రహించు.
పేతురు–మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.౹ -అపొస్తలుల కార్యములు 2:38
అనగా ఏ విషయములో నీ హృదయము నొచ్చుకుందో, ఆ విషయములో అంగీకరించి, మారుమనస్సుపొంది ఆ పాపమును సమాధిచేయుడి. అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము అనగా, నీకొరకు ఏమైతే సిద్ధపరచబడిందో దానిని పొందుకుంటావు.
దేవుని దివ్యప్రేమ ఈరోజు నీతో మాట్లాడుతున్నది అని గ్రహిస్తున్నావా?
నీకు పాపపు ఆలోచన వచ్చినప్పుడు దానిని ఆపలేని పరిస్థితిలో ఉన్నాసరే. లేక ఆ పాపమును జరిగించుటకు నీవు సిద్ధపడుతున్నప్పుడు దేవుని ఆత్మ గద్దింపు తోసివేసి ఆయనను విసర్జించిన స్థితిలో ఉన్నాసరే, లేద చివరికి ఆ పాపమును జరిగించి ఆయనను బాహాటముగా సిలువ వేసినాసరే. ఈ దేవుని ప్రేమపూర్వకమైన సువార్త అనగా ఈ ప్రతి స్థితిలోనుండి నిన్ను రక్షించుటకు, విడిపించుటకు ఆయనా ఇంకనూ ఇష్టము కలిగి ఉన్నాడు అనే సువార్త విని నీ హృదయములో నొచ్చుకొని, ఇప్పుడు నేను ఏమి చేయాలి అని నిజముగా ఆలోచన కలిగిఉంటే, ఏ పాపమైతే నీవు జరిగించావో దానిని నీ జీవితంలో ఇంక సమాధి చెయ్యి. యేసుయెదుట ఒప్పుకో ఆయనను నీ జీవితానికి ప్రభువుగా అంగీకరించు. ఆపుడు నిత్యము నీతో ఉండే పరిశుద్ధాత్మ వరము, నీ జీవితమును జయకరముగా నడిపించుటకు అవసరమైన ప్రతి ప్రోత్సాహకరమైన వరము ఆయన దయచేస్తాడు.
ఈ మెసేజ్ ను యూట్యూబ్ లో వినండి.