ప్రేమా పూర్ణుడు ప్రాణ నాథుడు
ప్రేమా పూర్ణుడు ప్రాణ నాథుడు
నను ప్రేమించి ప్రాణమిచ్చెను (2)
నే పాడెదన్ – కొనియాడెదన్ (3)
నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును (4) ||ప్రేమా||
లోయలకంటే లోతైనది నా యేసు ప్రేమ
గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ (2)
యేసుని ప్రేమ వెల యెంతో
ఇహమందైనా పరమందైనా (2)
వెల కట్టలేని కలువరిలో ప్రేమ
వెలియైన ప్రేమ నాకై బలియైన ప్రేమ – (2) ||ప్రేమా||
మరణముకంటె బలమైనది – పునరుత్ధాన ప్రేమ
మరణపు ముల్లును విరచినది – బలమైన ప్రేమ (2)
రక్తము కార్చి రక్షణ నిచ్చి
ప్రాణము పెట్టి పరముకు చేర్చే (2)
గొర్రెపిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ
బలియైన ప్రేమ నాకై వెలియైన ప్రేమ – (2) ||ప్రేమా||
నాదు రక్షక నీ మనసే ఉత్తమం
నాదు రక్షక నీ మనసే ఉత్తమం
దినదినము నీతోనే వసియింతును ||2||
నేనేది పలికినను ఏమి చేసినను ||2||
నీ ప్రేమనే కనుపరుతును
నీ శక్తినే కొనియాడేదను ||నాదు||
నా హృదిలో నీ వాక్యము నివసింపని
ప్రతి క్షణము ప్రతి దినము ధ్యానింతును ||2||
లోకము నను విడచిన నీవు విడువలేదు ||2||
నాకు జయము జయము నీ శక్తితోనే ||2|| ||నాదు||
నా తండ్రి నా విభుడా పాలించుమా
ఆదరణ నా హ్రుదిలోనా నింపుమయా ||2||
మనుజులు నను మరిచిన నీవు మరువలేదు ||2||
నాకు జయము జయము నీ ప్రేమతోనే ||2|| ||నాదు||
ఆరాధన వర్తమానం
దేవుడు ఆయన సన్నిధిలోనికి రావడానికి మనకు ఎందుకు ఈ సమయము మనకు ఇచ్చారు? దేవునికి మనపైన ఒక ఉద్దేశ్యము ఉంది. మనలను సృష్టించినప్పుడె మన జీవితానికి కావలసిన సమస్తము సృష్టించాడు. మన ద్వారా ఆయనకు మహిమ రావడానికి ఆయన మనలను సృష్టించుకున్నారు. లేఖనాలు గమనిస్తే, నా చిత్తమంతా నేనే నెరవేర్చుకుంటాను అని దేవుడు చెప్తున్నాడు. మరి ఆయన చిత్తాన్ని ఎలా నెరవేరుస్తాడు. తన వాక్కును పంపి తన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు. దాని నిమిత్తమై, మన జీవితములో దేవుని చిత్తము నెరవేరడానికి ఆయన తన వాక్కును విడుదల చేస్తారు, ఆ వాక్కు మన జీవితములో స్థిరపరచబడుతుంది. అయితే ఆయన సన్నిధిలోనే ఆ వాక్కు విడుదల అవుతుంది కాబట్టే, ఆయన మనలను తన సన్నిధికి నడిపించాడు. ఉదయము సాయంత్రము కూడా మన సంఘములో దేవుడు తన వాక్కును విడుదల చేస్తున్నాడు. మనము రెండంతల ఆశీర్వాదము పొందుచున్నావారము.
మనము ఎప్పుడు ఆయన సన్నిధిలో ఉన్నాసరే ఆయన మనతో మాట్లాడతాడు. మనకు తెలియకుండానే ఆ వాక్కు విడుదల అవుతున్నప్పుడు మన జీవితములో అనేక కార్యములు స్థిరపరచబడతాయి. ఆదామును గమనిస్తే పాపము చేయనంతవరకు దేవుని మహిమతో నింపబడి ఉన్నాడు. తన దినములు గడుచుచున్నవి అవి సంతోషముగా, సమాధానకరముగానే ఉన్నాయి. అయితే ఎప్పుడైతే పాపము ప్రవేశించిందో అప్పుడు దేవుని మహిమ ఆదామును విడిచిపెట్టినట్టుగా మనము చూడగలము. మనము దేవుని వాక్యము ప్రకారము జీవించినంతసేపు ఆయన మహిమ మనతోనే ఉంటుంది. అపవాది మనకు వ్యతిరేకముగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా దేవుని మహిమను బట్టి అవన్నీ తప్పించబడుతున్నాయి. అందుకే ఆయన సన్నిధిలో మనము ఎల్లప్పుడు ఉండాలి.
ప్రభువా, తరతరములనుండి మాకు నివాసస్థలము నీవే. పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు. – కీర్తన 90:1-2
అంటే ఏంటి? నీవు నాకు దేవుడవు అయి ఉన్నావు. తరతరములకూ నీవే మాకు నివాస స్థలముగా ఉన్నావు. ఎక్కడ? దేవుని సన్నిధే నివాస స్థలము అయివున్నది. ఆ దేవుని సన్ణిధిలోనే ఆయన మహిమ ఉన్నది. ఒక తరము అనాగా కాలము. ఉదాహరణకు కొంత కాలము బాగా ఉండవచ్చు, కొంత కాలము బాగా లేకపోవచ్చు. అయితే చెడ్డసమయమైనా, మంచి సమయమైనా నీవే దేవుడవు అని మొషే భక్తుడు కీర్తనలో చెప్పుచున్నాడు. ఎందుకు చెప్పగలుగుతున్నాడు అంటే, దేవుని సన్నిధిలోనే నివాసముంటున్నాడు, ఆ సన్ణిధిలో దేవుని మహిమ ఉన్నాది, ఆ మహిమ తన చెడు సమయములో తోడుగా ఉండి విడిపించేదిగా ఉంటుంది.
మనము కూడా మోషే వలే నీ సన్నిధే నా నివాస స్థలము అని గుర్తించి దేవుని ఆరాధిస్తావో, అప్పుడు నీ చెడు సమయమైనా దానిని నీవు ఖచ్చితముగా దాటి వెళ్తావు. దావీదును గమనిస్తే, ఎటువంటి ఆపద సంభవించినా తన రక్షణ కోట అయిన దేవుని సన్నిధిలోనికే పరిగెట్టేవాడుగా ఉన్నాడు. మనము కూడా అలాగే ఎటువంటి సమయమైనా కూడా ఆయన సన్నిధిలోనికే వెళ్ళాలి.
ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు – రోమా 3:23.
పాపము చేయడము వలన దేవుని మహిమను పొందలేకపోతున్నాము. మరి దేవుని అంగీకరించి పాపమునుండి విడుదల పొంది, ఆ దేవుని వాక్య ప్రకారము జీవించుచున్నవారు ఆ దేవుని మహిమను పొందగలుగుతారు అనే కదా! దేవుని మహిమ మనతో ఉన్నంతకాలము మనము శ్రమ అనేదే చూడము. ఈ సత్యమును ఎరిగినవారిగా దేవుని ఆరాధిద్దాము
Worship Song | ఆరాధన గీతం
తరతరములు ఉన్నవాడవు
యుగయుగములు ఏలువాడవు
నీవే రాజువు నీవే దేవుడవు
జగాలను ఏలే జయశీలుడవు నీవు
జనసైన్యములను నడిపే విజయశీలుడవు నీవు
ఎన్నితరాలు మారినా ఎన్ని యుగాలు గడిచినా
నీవే నీవే నీవే రారాజువు. “తరతరములు”
భూమికి నీవే పునాదులు వేసినవాడవు
నీ రాజ్యస్థాపనకై ఈ సృష్టినే కలుగజేసావు
సృష్టికర్తవు నీవే శాంతిదాతవు నీవే
నీవే నీవే నీవే మహరాజువు “తరతరములు”
Main Message | మెయిన్ మెసేజ్
మన వ్యక్తిగతమైన జీవితాలకు దేవుని వాక్యమే ఆధారమై ఉన్నది. వాక్యమునకే మనము ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. వాక్యమే మనకు నేర్పించేది. ఈరోజు మన భాగము, ప్రార్థన అంగీకరించబడాలి అంటే ఎలా ఉండాలి? ప్రార్థన అనేది విశ్వాసి జీవితములో ప్రాముఖ్యమైనది అంతర్భాగమైనది. మన జీవితములో అనేకమైన పరిస్థితులలో ప్రార్థిస్తున్నాము. కొన్ని సార్లు ప్రార్థనకు జవాబు వస్తుంది, మరికొన్ని సందర్భాలలో జవాబు రావట్లేదు. అయితే ఈ విషయము గూర్చి ప్రార్థన అంగీకరించబడిన ఒక వ్యక్తి జీవితము ద్వారా నేర్చుకుందాము.
నీవు తిరిగి నా ప్రజలకు అధిపతియైన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుమునీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చున దేమనగానీవు కన్నీళ్లు విడుచుట చూచితిని; నీ ప్రార్థన నేనంగీకరించి యున్నాను; నేను నిన్ను బాగుచేసెదను; మూడవ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కి పోవుదువు.- 2 రాజులు 20:5.
హిజ్కియాకు ఉన్న సమస్యను బట్టి ఆయన ప్రార్థన చేసాడు. ఆయన చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. అయితే ఆ సందర్భమును ధ్యానించి నేర్చుకుందాము.
ఆదినములలో హిజ్కియాకు మరణకరమైన…. రోగము కలుగగా, ఆమోజు కుమారుడును ప్రవక్త యునైన యెషయా అతనియొద్దకు వచ్చినీవు మరణమవుచున్నావు, బ్రదుకవు గనుక నీవు నీ యిల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడతట్టు త్రిప్పుకొని యెహోవా, యథార్థ హృదయుడనై, సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచు కొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసికొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను – 2 రాజులు 20:1-3.
ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనము చూడగలము. మొదటిది, “యదార్థ హృదయముగలిగినవాడుగా, సత్యముగా నడుచుకొనుట”. రెండవది, “దేవుని దృష్టికి అనుకూలముగా సమస్తమును జరిగించుట”. నడుచుకొనుట, జరిగించుట అనేవి ప్రాముఖ్యమైన విషయాలుగా చూడగలము. మనము కూడా హిజ్కియావలే నడుచుకుని, దేవుని దృష్టి కి అనుకూలముగా జరిగించినప్పుడు, ఖచ్చితముగా మన ప్రార్థనకూడా అంగీకరించబడుతుంది.
హిజ్కియాకు మరణకరమైన రోగము వచ్చింది. మన జీవితాలలో మరణకరమైన లేదా నాశనకరమైన పరిస్థితులు ఎమైనా ఉన్నాయేమో. అయితే హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించబడింది. మరి మనము చేసే ప్రార్థన అంగీకరించబడుతుందా? ఉదయాన మనము నేర్చుకున్నాము, “ఆయనకు తగినట్టుగా” నడుచుకొనుటను గూర్చి.
ఆ హిజ్కియాను ప్రేమించిన దేవుడే నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. అయితే హిజ్కియా ప్రార్థన అంగీకరించబడింది. మరి మన ప్రార్థన ఎందుకు అంగీకరించబడట్లేదు? ఈ ప్రశ్న ద్వార వాక్యము నీ హృదయాన్ని తడుతుంది. దయచేసి నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు.
యదార్థమైన హృదయము అంటే ఏమిటి? లోపల బయట, ఇంట బయట ఒకేరకముగా ఉన్నవారు. హృదయము లోపల, బాహ్యముగా కూడా ఒకే రకముగా ఉన్నవారు. ఎప్పుడు అలా ఉండగలము? కేవలము దేవుని వాక్యమును ఆధారము చేసుకున్నప్పుడే! అయితే ఈరోజుల్లో మనకు భక్తి ఉంటుందిగానీ భయము ఉండట్లేదు. ఆ భయము లేని కారణానే దేవుడు నేను చేసే సమస్తము చూస్తున్నాడు అనే ఆలోచన రావట్లేదు. ఎప్పుడైతే దేవుని యందలి భయము కలిగి ఉంటామో అప్పుడు యదార్థముగా ఉంటాము. దేవుని సన్నిధిలో ఎలా ఉంటామో అలాగే మనము బయట లోకములో కూడా ఉండాలి. ఉదయాన చూసాము, దేవుని బట్టి మనము తగ్గించుకోవలసి వస్తే తగ్గించుకోవడమే! అప్పుడు మనము యదార్థముగా దేవుని వాక్యము ప్రకారము నడుచుకొంటున్నట్టే. మన ప్రార్థన అంగీకరించబడాలి అంటే, యదార్థముగా జీవించాలి.
దేవుడు సృష్టించిన ప్రతి ఆశీర్వాదము ఎవరి కోసము? “ఆశీర్వదించబడినవారలారా లోపలకి రమ్ము” అని వాక్యము చెప్పుచున్నది కదా! అది కేవలము ఒక్క సమయమునకే కాదు గానీ నీ జీవితమంతా దేవుడు సృష్టించిన ఆశీర్వాదములు అనుభవించాలి. అయితే వాటిని ఎందుకు అనుభవించలేకపోతున్నాము? యదార్థముగా మనము లేని కారణముచేతనే. దేవుని సన్నిధికి నీవు ఎందుకు నడిపించబడ్డావు? దేవుని చిత్తము నీ జీవితములో జరగడానికి. ఆయన చిత్తము ఏమిటి? నీవు ఆయన సృష్టించిన ఆశీర్వాదములు అనుభవించడమే. అందుకే వాటిని అనుభవించులాగున నీవు సరిచేసుకోవలసిన వాటిని నీకు తన వాక్యము ద్వార తెలియచేస్తున్నాడు. ఈ “యదార్థత” అనేది చాలా ప్రాముఖ్యమైనది. నేనేమైనా పోగొట్టుకుంటానేమో అనే భయముచేత యదార్థముగా ఉండలేము అయితే యేసయ్యను గమనిస్తే,
క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందు నంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామ మునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. – ఫిలిప్పీయులకు 2:5-11.
యేసు దేవునితో సమానుడైనా సరే తండ్రి చిత్తమునకు విధేయత చూపించుటలో యదార్థముగా నడుచుకున్నదానిని బట్టి, అనగా తగ్గించుకున్నదానిని బట్టి, అన్ని నామములకన్నా పైనామము పొందుకున్నాడు. అందుకే మనము కూడా ఈరోజు తీర్మానము తీసుకుందాము, “నేను ఏ పరిస్థితి అయినా సరే యదార్థముగానే ఉంటాను”. ఎప్పుడైతే నీవు యదార్థముగా ఉండటానికి సిద్ధపడతావో, అప్పుడు నీవు సాక్షిగా ఉంటావు.
రెండవదిగా, “సత్యముతో దేవుని యెదుట నడుచుట”, అంటే ఏమిటి? దేవుని వాక్యమే సత్యము ఆ ప్రకారముగానే హిజ్కియా చేసాడు.
మరియు యెహోవాధర్మశాస్త్రమునందు వ్రాయ బడియున్న విధినిబట్టి జరుగు ఉదయాస్తమయముల దహన బలులను విశ్రాంతిదినములకును అమావాస్యలకును నియా మకకాలములకును ఏర్పడియున్న దహనబలులను అర్పిం చుటకై తనకు కలిగిన ఆస్తిలోనుండి రాజు ఒక భాగమును ఏర్పాటుచేసెను. మరియు యెహోవా ధర్మశాస్త్రమును బట్టి యాజకులును లేవీయులును ధైర్యము వహించి తమ పని జరుపుకొనునట్లు ఎవరి భాగములను వారికి ఇయ్య వలసినదని యెరూషలేములో కాపురమున్న జనులకు అతడు ఆజ్ఞాపించెను. ఆ యాజ్ఞ వెల్లడియగుటతోడనే ఇశ్రాయేలీయులు ప్రథమఫలములైన ధాన్య ద్రాక్షారసములను నూనెను తేనెను సస్యఫలములను విస్తారముగా తీసికొని వచ్చిరి. సమస్తమైన వాటిలోనుండియు పదియవ వంతులను విస్తారముగా తీసికొని వచ్చిరి.- 2 దినవృత్తాంతములు 31: 3-5.
దేవుని వాక్యము ప్రకారముగా జరిగించినవాడుగా హిజ్కియా ఉన్నాడు. అందుకే ప్రవక్త ద్వారా తన మరణము గూర్చి తెలుసుకున్నప్పుడు, తను చేసిన కన్నీటి ప్రార్థన అంగీకరించబడింది. నీ జీవితములో కూడా నీవు వాక్యమునుబట్టి నీ జీవితములో సమస్తము సిద్ధపరచుకున్నప్పుడు ఖచ్చితముగా నీ ప్రార్థన అంగీకరించబడుతుంది. అయితే మనము 40 రోజులు, 21 రోజులు, 7 రోజులు లేదా 3 రోజులు ఉపవాసము చేసినప్పటికీ మన ప్రార్థనకు జవాబు రావట్లేదు. అయితే మనము యాదార్థముగా లేని కారణాన ఈ స్థితి కలిగి ఉంటున్నాము.
కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును – యోహాను 5:19.
యేసయ్య మనకు ఒక మాదిరి ఉంచి వెళ్ళాడు. ఆయన ద్రాక్షావల్లిగా ఉన్నాడు మనము తీగెలుగా ఉన్నాము. ఆయన ఏమి చేసాడో మనము కూడా అదే చెయ్యాలి. ఎప్పుడైతే నీవు సత్యమున్ వెంబడిస్తావో, ఆ సత్యము నిన్ను విడుదల చేస్తుంది. కీర్తనాకారుడు “నీ వాక్యము నా పాదములకు వెలుగై ఉన్నది” అని చెప్పుచున్నాడు. ఎప్పుడైతే నీలో వాక్యముంటుందో ఎంతమాత్రము చీకటి ప్రవేశించదు.
మూడవదిగా, “నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును ఏలాగు జరిగించితినో”. ఒకని దృష్టి తన మార్గము యదార్థముగానే కనబడుతుంది. ఎవరికైనా గొడవ అయింది అనుకోండి వారి వారి దృష్టిలోనే విషయాన్ని చెప్తారు. అయితే దేవుని దృష్టికి అనుకూలముగా చెప్పగలగాలి. ఆత్మీయముగా మనము చూస్తే, దేవుని కొరకు జరిగించిన విధానమును మనము చూడగలము. దేవుని పట్టణములో కట్టించబడిన దేవతా స్తంభములను, బలి పీఠములను పడగొట్టినవాడుగా ఉన్నాడు. మనము కూడా మన జీవితములో అపవాదికి అవకాశము ఇచ్చే ప్రతి విషయాలను పడగొట్టాలి. అది దేవుని దృష్టికి అనుకూలముగా జరిగించుట. బలిపీఠము వద్ద ఎవరికోసమైతే బలి అర్పిస్తున్నామో, వారికి ఇష్టమైనది అర్పించుట. అపవాది బలిపీఠము దగ్గర వాడికి ఇష్టమైనది చెయ్యడము అనేది దేవునికి వ్యతిరేకముగా చేయటము. అటువంటి ప్రతీ పరిస్థితినీ పడగొట్టాలి, ఎటువంటి పరిస్థితులలోనూ అపవాదికి అవకాశము ఇవ్వకూడదు.
మన ప్రార్థన అంగీకరించబడాలి అంటే, యదార్థముగా, సత్యము ప్రకారము నడచుట, దేవుని దృష్టికి అనుకూలముగా జరిగించుట. హిజ్కియా కూడా అదేవిధముగా చేసాడు. మనము కూడా అదేవిధముగా సిద్ధపరచుకుందాము. అలా సిద్ధపరచుకున్నప్పుడు, పోగొట్టుకున్న జీవము, పరిస్థితి తిరిగి పొందుకుంటావు.
హిజ్కియా యూదా దేశమంతటను ఈలాగున జరిగించి, తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచు వచ్చెను – 2 దినవృత్తంతములు 31:20.