ఆరాధన వర్తమానము
ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ దినము ప్రభువు స్వయంగా నియమించిన పరిశుద్ధమైన దినము. ఇది మన ఇష్టానికి సంబంధించినది కాదు, ఇది దేవుని ఆజ్ఞకు సంబంధించినది. ఈ దినాన్ని మనము తప్పక ఆచరించవలసినవారమై ఉండాలి. ఎందుకంటే ఈ దినాన్ని మిస్ చేయడం అంటే, దేవుడు మన జీవితాల కోసం నిర్ణయించినదాన్ని కోల్పోవడమే.
మన జీవితాలు మన శక్తి మీద గాని, మన జ్ఞానం మీద గాని, మన వద్ద ఉన్న వనరుల మీద గాని ఆధారపడి లేవు. మన జీవితాలు పూర్తిగా దేవుని కృప మీదే ఆధారపడి ఉన్నాయి. అపొస్తలుడు పౌలు చెప్పినట్లుగా, “నేను ఏమై ఉన్నానో, అది దేవుని కృప వలననే.” ఇదే సత్యం మన జీవితాలన్నిటికీ వర్తిస్తుంది. ఈ కృపను తెలిసినవారిగా, నిత్యము దేవుణ్ణి స్తుతించే వారమై, ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకునే వారమై ఉండాలి.
విశ్రాంతి దినము – దేవుని చేత నియమించబడినది
విశ్రాంతి దినము సాధారణమైన దినము కాదు. ఇది దేవుని చేత నియమించబడిన ప్రత్యేకమైన దినము. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, శరీరంగా బలహీనంగా ఉన్నప్పటికీ, ఈ దినాన్ని మనము ఎట్టి పరిస్థితిలోనూ పోగొట్టుకోకూడదు. ఎందుకంటే ఇది నిత్యమైన కట్టడం. ప్రభువు ఒకసారి నియమించిన తరువాత, దానికి మించిన అధికారం ఇంకేదీ లేదు.
ఈ దినానికి దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని నిర్ణయించి ఉంచాడు. ఈ దినము ఖాళీగా ఉండడానికి కాదు; ఈ దినంలో స్తుతి, ఆరాధన, దేవుని సన్నిధిలో నిలబడటం, ఆయన రక్షణ కార్యం మన జీవితాల్లో స్థిరపడటం అనే ఉద్దేశంతో దేవుడు దీనిని ఏర్పాటు చేశాడు.
కాలము, సమయం మరియు దేవుని నియమం
యేసు ప్రభువు చెప్పిన క్రొత్త ద్రాక్షరసం మరియు తిత్తుల ఉపమానం ద్వారా మనకు ఒక ఆత్మీయ సత్యం తెలుస్తుంది. తిత్తు అనేది ఒక కంటైనర్ లాంటిది. ఆత్మీయంగా చూస్తే, సంవత్సరం ఒక కంటైనర్, దినము ఒక కంటైనర్, ప్రతి సమయము కూడా ఒక కంటైనర్. లేఖనాలు చెప్తున్న సత్యం ఏమిటంటే – ప్రతి సమయానికి దేవుడు ఏదో ఒక కార్యాన్ని ముందే నిర్ణయించాడు.
మన జీవితాల్లో ఒక సమయం వస్తుంది. ఆ సమయానికి కావలసిన వర్షాన్ని దేవుడే ఇస్తాడు. మన విత్తనం ఎదగడానికి కావలసిన కృపను, ఆశీర్వాదాన్ని సరైన సమయానికే ఆయన విడుదల చేస్తాడు. ఆశీర్వాదం మనుషుల మీద ఆధారపడదు; అది దేవుని నియమం మీద ఆధారపడి ఉంటుంది.
విధేయత మరియు ఆశీర్వాదం
లేవీయకాండం 26వ అధ్యాయంలో దేవుడు స్పష్టంగా చెప్పిన సూత్రం ఇది: మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని, నా ఆజ్ఞలను ఆచరించిన యెడల, మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇస్తాను. మీ భూమి పంటలను ఇస్తుంది. మీరు తృప్తిగా భుజించి, నిర్భయంగా నివసిస్తారు.
అర్థం ఏమిటంటే, మన పని విధేయత. ఆశీర్వాదం విడుదల చేయడం దేవుని పని. దేవుడు ఒక మార్గం మాత్రమే తెరవడు; అవసరమైతే అనేక మార్గాలను తెరిచి, తన వాగ్దానాన్ని పూర్తిగా నెరవేర్చే వాడే. దేవుడు తెరిచిన మార్గాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే మనము వెంబడిస్తున్నది మాట ఇచ్చి విడిచిపెట్టే దేవుడు కాదు, మాట ఇచ్చి నెరవేర్చే సజీవ దేవుడు.
అవిధేయతకు హెచ్చరిక
అదే అధ్యాయంలో దేవుడు మరో వైపును కూడా స్పష్టంగా తెలియజేస్తాడు. మీరు నా మాట వినక, నా ఆజ్ఞలను నిరాకరించిన యెడల, శ్రమ వ్యర్థమవుతుంది, విత్తిన విత్తనం ఫలించదు, శత్రువులు మీ శ్రమ ఫలితాన్ని తినేస్తారు. ఇది భయపెట్టడానికి చెప్పిన మాట కాదు; ఇది మార్గదర్శకంగా ఇచ్చిన హెచ్చరిక.
దేవుడు మన దుఃఖంలో ఉన్నప్పుడు ఆదరిస్తాడు – ఇది నిజం. కానీ అదే దేవుడు మనం పాపంలో ఉన్నప్పుడు కూడా గమనిస్తాడు – ఇది కూడా నిజం. అందుకే సంఘానికి అవసరమైనది దేవుని యందు భయము మరియు భక్తి.
దేవుని యందు భయము – ఆరోగ్యమైన భక్తి
దేవుని యందు భయము అంటే దేవుని నుండి పారిపోవడం కాదు. దేవునికి విరుద్ధంగా మాట్లాడడానికి, చేయడానికి, చూడడానికి, వినడానికి భయపడటం. ఈ భయమే మన జీవితాన్ని సరైన మార్గంలో ఉంచుతుంది. ఎవరికైతే ఈ భయము ఉంటుందో, వారు తమ మార్గాన్ని జాగ్రత్తగా సిద్ధం చేసుకుంటారు.
దేవుడు మనలను ఆశీర్వదించేది లోకానికి ఒక సాక్ష్యంగా నిలబెట్టడానికే. అదే విధంగా, వాక్యాన్ని నిరాకరించినప్పుడు వచ్చే ఫలితాలు కూడా లోకానికి ఒక హెచ్చరికగా నిలుస్తాయి.
వాక్యము – జీవితం యొక్క పునాది
యేసు ప్రభువు లూకా సువార్తలో చెప్పిన ఉపమానం ప్రకారం, వాక్యాన్ని విని చేయువాడు బండ మీద పునాది వేసినవాడితో సమానం. వరదలు వస్తాయి, ప్రవాహాలు కొడతాయి, పరీక్షలు వస్తాయి – కానీ ఆ జీవితం కదలదు. ఎందుకంటే అది బలమైన పునాదిపై కట్టబడింది.
మన జీవితాన్ని భావాల మీద కాదు, మనుషుల మీద కాదు, పరిస్థితుల మీద కాదు – దేవుని వాక్యం మీదే కట్టుకోవాలి. వాక్యమే క్రైస్తవ జీవితానికి బేస్. వాక్యం మీద కట్టుకున్న జీవితం ఎప్పటికీ కూలదు.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనము చేయాల్సింది ఒక్కటే – దేవుని వాక్య ప్రకారంగా నడుచుకోవడం. ఆయన మాట విని, ఆయన మాట ప్రకారంగా జీవితం నిర్మించుకోవడం. అప్పుడు ఆశీర్వాదం సరైన సమయానికి, సరైన విధంగా మన జీవితాల్లో స్థిరపరచబడుతుంది. వాక్యం మీద కట్టుకున్న జీవితం ఈ లోకంలో సాక్ష్యంగా నిలుస్తుంది, నిత్యమైన ఫలితాన్ని కలిగిస్తుంది.
వారము కొరకైన సందేశము
ప్రియమైన దేవుని బిడ్డలారా,
మన చుట్టూ ఎన్నో సంఘటనలు, వ్యవస్థలు, పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. అవి సాధారణంగా కనిపించినా, జాగ్రత్తగా గమనిస్తే దేవుడు వాటి ద్వారా మనతో మాట్లాడుతున్నాడని తెలుసుకోగలం. కానీ సమస్య ఏంటంటే – మనం వినడం వరకు సిద్ధంగా ఉన్నాం గానీ, వాటిలోకి అడుగు పెట్టడానికి, వాటిని నెరవేర్చడానికి సిద్ధంగా ఉండడం లేదు.
దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రశ్న ఏంటంటే – మనం ఏ స్థాయిలో స్పందిస్తున్నాం? పొందుకుంటున్నాం గానీ, దాన్ని జీవితం ద్వారా విడుదల చేస్తున్నామా?
దేవుని సమయం మరియు దేవుని వ్యవస్థ
యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించిన కాలాన్ని పరిశీలిస్తే ఒక సత్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన జీవితం 33½ సంవత్సరాలుగా నియమించబడింది. ఆ సమయానికి ముందుగానీ, ఆ సమయానికి తరువాతగానీ, దేవుని ప్రణాళికకు వెలుపల ఏ కార్యమూ ఆయన జీవితంలో జరగలేదు. లేఖనాల్లో చెప్పబడినదంతా, దేవుడు నిర్ణయించిన సమయానికే నెరవేరింది.
ఇది యాదృచ్ఛికం కాదు. యేసుక్రీస్తు ఈ లోక వ్యవస్థను కాకుండా, పరలోకానికి సంబంధించిన వ్యవస్థను అనుసరించారు. అందుకే ఈ లోకానికి సంబంధించిన ఏ శక్తీ, ఏ అధికారం ఆయనపై ప్రభావం చూపలేకపోయింది.
మన చుట్టూ జరుగుతున్న వాటిని ఆత్మీయంగా గమనించాలి
మన చుట్టూ జరిగే సంఘటనలన్నీ కేవలం వార్తలు కాదు. వాటిలో దేవుని నడిపింపు ఉంటుంది. దేవుడు అనేక సందర్భాల్లో మనతో మాట్లాడతాడు. కానీ వాటిని ఎంతవరకు మనం నెరవేర్చుతున్నామన్నదే అసలు ప్రశ్న.
మనము చాలాసార్లు “రిసీవ్” చేసుకుంటాం. “ఆమేన్” అంటాం. కానీ ఆ మాటకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయాలు ఏమిటి? దేవుడు ఇచ్చిన వాగ్దానానికి స్పందనగా మన జీవితంలో జరిగిన మార్పు ఏంటి?
దేవుడు ఎప్పుడూ ఉద్దేశం లేకుండా వరాలు ఇవ్వడు. ఆయన ఏదైనా ఇస్తే, అది ఇతరులకోసం ఉపయోగించబడాలి.
సంఘం – దేవుడు పనిచేసే వ్యవస్థ
సంఘం ఒక సాధారణ స్థలం కాదు. అది దేవుడు పనిచేసే ఒక ఆత్మీయ వ్యవస్థ. మనం సంఘంలో ఉన్నామంటే, దేవుడు మన ద్వారా ఏదో ఒక కార్యం చేయాలనుకుంటున్నాడు.
మనము కేవలం ఆశీర్వాదాలు పొందడానికి మాత్రమే సంఘానికి రాలేదు. ఈ సంఘంలో మనకు స్థానం ఇచ్చారంటే, మన మూలంగా దేవుడు విస్తరణ చేయాలనుకుంటున్నాడు.
సంఘం విస్తరించాలి. సరిహద్దులు పెరగాలి. దానిలో ప్రతి విశ్వాసికీ భాగస్వామ్యం ఉంది.
పొందుకున్న వాక్యానికి మన స్పందన ఏమిటి?
ఒక దైవజనుడి ద్వారా దేవుడు వాక్యాన్ని విడుదల చేసినప్పుడు, ఆ వాక్యానికి స్పందనగా మనం తీసుకున్న నిర్ణయాలు ఏమిటి అన్నది చాలా ముఖ్యమైన ప్రశ్న.
వాక్యాన్ని వినడం ఒక స్థాయి.
వాక్యాన్ని నమ్మడం ఇంకో స్థాయి.
వాక్యానికి అనుగుణంగా జీవించడం అసలు స్థాయి.
మన ఆలోచన విధానం మారాలి. దేవుడు ఇచ్చే వాగ్దానం ద్వారా నేను ఇంకొకరి జీవితంలో ఏ మార్పు తీసుకురాగలనో అనే చైతన్యం మనలో రావాలి.
మోషే – అహరోను – మిర్యాము సంఘటన ద్వారా దేవుని సన్నిధి సత్యం
సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో మోషేకు విరోధంగా అహరోను మరియు మిర్యాము మాట్లాడిన సందర్భంలో, దేవుడు ఒక ముఖ్యమైన సత్యాన్ని మనకు నేర్పుతున్నాడు.
దేవుడు ముగ్గురినీ ప్రత్యక్ష గుడారానికి పిలిచాడు. కానీ లోపలికి పిలవబడింది అహరోను మరియు మిర్యాము మాత్రమే. అక్కడే దేవుడు వారికి తన విధానాన్ని, తన రహస్యాలను వెల్లడించాడు.
ఇది మనకు ఏమి నేర్పుతుంది అంటే –
దేవుడు అన్ని విషయాలు అన్ని స్థలములలో మాట్లాడడు. కొన్ని మర్మాలు ప్రత్యేకమైన స్థలములలో వెల్లడవుతాయి.
దేవుడు మాట్లాడే దేవుని స్థలములు
దేవుడు మనతో మాట్లాడే కొన్ని స్థలములు ఉంటాయి:
వ్యక్తిగత ప్రార్థనలో
కుటుంబ ప్రార్థనలో
సంఘంలో వాక్య సమయంలో
నిశ్శబ్దంగా ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు
ఈ స్థలములు మనం గుర్తించాలి. గౌరవించాలి. వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. అన్ని చోట్ల దేవుడు మాట్లాడగలిగినా, ఆయన కొన్ని సత్యాలను కొన్ని స్థలములు మాత్రమే వెల్లడిస్తాడు.
దేవుని సన్నిధికి విలువ ఇచ్చినవారే అధికారాన్ని అనుభవిస్తారు
ఏలియా, రాజైన అహాబు ఎదుట నిలబడి చెప్పిన మాట గుర్తుంచుకోండి:“నేను ఎవరి సన్నిధిలో నిలుచున్నానో ఆ యెహోవా జీవముగా”! అతడు ఆ మాట చెప్పగలిగిన కారణం – అతడు దేవుని సన్నిధిలో నుంచే వచ్చాడు అన్న నిశ్చయము. దేవుని సన్నిధిని గౌరవించినవారే ఆ సన్నిధిలో ఉన్న శక్తిని అనుభవిస్తారు.
సిద్ధపాటు కలిగి దేవుడు మాట్లాడే దేవుని స్థలములోకి రావాలి
సంఘానికి రావడం ఒక అలవాటుగా కాకుండా, సిద్ధతతో రావాలి.
మన జీవితంలో దేవునికి విరోధమైన వాటిని విడిచిపెట్టి, శుద్ధమైన హృదయంతో,
“ఈ రోజు దేవుడు నాతో మాట్లాడతాడు” అనే విశ్వాసంతో రావాలి. ఆ విధంగా దేవుని సన్నిధిలోకి అడుగు పెట్టినప్పుడు, దేవుడు తప్పకుండా మాట్లాడతాడు.
దేవుని సన్నిధిలోకి రావడానికి ముందుగా సిద్ధత అవసరం
ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుని సన్నిధిలోకి రావచ్చు. కానీ అదే సన్నిధి ఒకవైపు మహిమను విడుదల చేసే స్థలంగా ఉంటే, మరోవైపు తీర్పు బయలుపడే స్థలంగా కూడా ఉంటుంది.
ప్రత్యక్ష గుడారం అనేది:
దేవుని మహిమ దిగి వచ్చే స్థలం
దేవుని సన్నిధిని అనుభవించే స్థలం
కానీ అహరోను మరియు మిర్యాముల జీవితంలో చూస్తే, అదే సన్నిధిలో నుండి తీర్పు బయలుపడింది.
అందుకే ఒక విషయం మనం స్పష్టంగా గ్రహించాలి. దేవుని సన్నిధిలోకి రావడానికి ముందు సిద్ధపాటు అవసరం.
సిద్ధపాటు లేకుండా వస్తే మహిమను అనుభవించలేం. సిద్ధపాటుతో వస్తే దేవుని మహిమను చూడగలం.
దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు:
శుద్ధమైన హృదయంతో రావాలి
దేవుని భయంతో రావాలి
ఆయనతో మాట్లాడాలనే ఆకాంక్షతో రావాలి
ఈ ప్రిపరేషన్‌తో వచ్చినప్పుడు దేవుడు తన మహిమను మనకు చూపిస్తాడు.
దేవుడు మాట్లాడే దేవుని స్థలములు – స్థాయిలు వేరువేరు
మోషేతో దేవుడు మాట్లాడిన విధానాన్ని గమనించండి.
ప్రతి సందర్భంలో దేవుడు మోషేతో ఒకే దేవుని సన్నిధిలో మాట్లాడలేదు.
కొన్ని సందర్భాల్లో:
“పైకి రా” అన్నాడు
పర్వతం ఎక్కమన్నాడు
ప్రత్యేకమైన దేవుని సన్నిధిలోకి పిలిచాడు
అది ఒక ప్రత్యేకమైన దేవుని సన్నిధి.
అక్కడే దేవుడు తన గంభీరమైన మాటలను రివీల్ చేశాడు.
అహరోను, మిర్యాములకు ఆ అనుభవం లేదు.
ఎందుకంటే వారి ఆత్మీయ స్థాయి, వారి ఆత్మీయ స్టాండర్డ్ అక్కడికి చేరలేదు.
ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి.
దేవుడు అందరినీ ఒకే స్థాయిలో తన సన్నిధిలోకి పిలవడు.
మన ఆత్మీయ స్థాయి,
మన ప్రార్థనా జీవితం,
మన పరిశుద్ధ జీవితం –
ఇవన్నీ మనం ఏ దేవుని సన్నిధిలోకి వెళ్ళగలమో నిర్ణయిస్తాయి.
ఆత్మీయ స్టాండర్డ్ లేకుండా దేవుని సన్నిధి మారదు
ప్రియమైనవారారా,
ఉపవాసాలు, ప్రార్థనలు మాత్రమే సరిపోవు.
దాని వెనుక ఒక ఉద్దేశం ఉండాలి.
దేవుని కోసం జీవించాలనే తపన ఉండాలి.
మోషేను దేవుడు యాదృచ్ఛికంగా పిలవలేదు.
అతని ఆత్మీయ స్టాండర్డ్ వేరు.
అతడు ఎంతమంది ప్రజలను నడిపిస్తున్నాడో దేవుడికి తెలుసు.
అందుకే దేవుడు: “పైకి రా, నాతో మాట్లాడు” అని పిలిచాడు.
ఇప్పుడు ప్రశ్న మనకే. మనము దేవుని సన్నిధిలో ఉన్నాం. కానీ మనం ఆ స్టాండర్డ్ లోకి వెళ్ళగలుగుతున్నామా?
పొందుకుంటున్నాం – అవును. అనుభవిస్తున్నాం – అవును. కానీ ఆ స్థాయికి ఎదుగుతున్నామా? ఆ స్టాండర్డ్ లోకి వెళ్ళగలిగితే, ఈ భూమి మీదే దేవుని ప్రత్యేకమైన సన్నిధిని మనం అనుభవించగలం.
దానియేలు 2:21 – కాలాలను, సమయాలను మార్చే దేవుడు
ఈ నూతన సంవత్సరానికి మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన వాగ్దానం:
“ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి, రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు.”
(దానియేలు 2:21)
ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. జ్ఞానులకు మళ్ళీ జ్ఞానం ఎందుకు? ఎందుకంటే దేవుని కార్యాలన్నీ మర్మములై ఉంటాయి. దేవుడు ఏమి చేస్తాడో చెప్తాడు, కానీ ఎలా చేస్తాడో ఎప్పుడూ చెప్పడు. ఆ “ఎలా” అర్థం కావాలంటే, దేవుడు ఇచ్చే జ్ఞానం అవసరం.
జ్ఞానం లేక నాశనం – మన సమస్య ఇదే
దేవుని ప్రజలు నాశనమయ్యేది ఎందుకంటే వారికి దేవుని గురించిన జ్ఞానం లేదు.
లోకానుసారమైన జ్ఞానం మనకు ఉంది. చదువు ఉంది. నైపుణ్యం ఉంది. కానీ దేవుని గురించిన అనుభవ జ్ఞానం లేకపోతే, జీవితం ఫెయిల్యూర్స్‌తో నిండిపోతుంది. పేతురు చెప్తున్నాడు: యేసుక్రీస్తును అనుభవజ్ఞానంతో ఎరిగినప్పుడు, మనకు కావలసిన ప్రతి దానికి దేవుడు అనుగ్రహిస్తాడు.
దానియేలు – కాలాన్ని మార్చిన మనిషి
దానియేలు ఒక బానిస. తన కుటుంబం నుండి వేరుపరచబడ్డాడు. వేరే భాష, వేరే సంస్కృతి, వేరే ఆహారం. అతడు కాలానికి, సమయానికి లోబడినవాడు. కానీ ఒక రోజు రాజుకు కల వచ్చింది. ఆ కల ప్రకారం దానియేలు చంపబడాల్సిన వాడు.అక్కడే దానియేలు నిలబడి ఒక సత్యం ప్రకటించాడు:
నా దేవుడు కాలాన్ని, సమయాన్ని మార్చగలడు.
అతడు దేవుని సన్నిధిలోకి ప్రవేశించాడు. దేవుని మర్మాన్ని గ్రహించాడు.
రాజు భవిష్యత్తును రివీల్ చేశాడు. చివరికి, జ్ఞానులందరి మీద అధికారిగా నియమించబడ్డాడు. కాలానికి లోబడిన మనిషి, కాలాన్ని మార్చే దేవుని సన్నిధిలోకి వెళ్లినప్పుడు, తన భవిష్యత్తును మార్చుకున్నాడు.
తుదిగా – మనం ఎందుకు సంఘంలో ఉన్నాం?
ప్రియమైన దేవుని బిడ్డలారా, మనను దేవుడు ఈ సంఘంలో పెట్టింది జస్ట్ వచ్చి విని వెళ్లిపోవడానికి కాదు.
మన ద్వారా:
సంఘం విస్తరించాలి
దేవుని మహిమ బయలుపడాలి
దేవుని సన్నిధి లోతుగా అనుభవించబడాలి
ఆ స్టాండర్డ్ లోకి మనం రావాలి. ఆ దేవుని సన్నిధిని విలువైనదిగా చూడాలి. అప్పుడు మన జీవితం సాధారణంగా ఉండదు.కాలాలను మార్చే దేవుని సన్నిధిలో మనము కూడా చరిత్ర సృష్టించే వారమవుతాము.
