06-Nov-2022 – ఆదివారము ఆరాధన – ఆయనకు తగినట్లుగా

హోసన్నా మహోన్నతుడు

హోసన్నా హోసన్నా
హోసన్నా మహోన్నతుడు
దేవా నీ నామము ఉన్నత నామము
కృతజ్ఞత స్తుతులు నీకే
హోసన్నా మహోన్నతుడు

కీర్తి కీర్తి
కీర్తి రారాజుకే
దేవా నీ నామము ఉన్నత నామము
కృతజ్ఞత స్తుతులు నీకే
కీర్తి రారాజుకే

మహిమ మహిమ
మహిమ రారాజుకే
దేవా నీ నామము ఉన్నత నామము
కృతజ్ఞత స్తుతులు నీకే
మహిమ రారాజుకే

హల్లెలూయా స్తోత్రం యేసయ్యా

హల్లెలూయా స్తోత్రం యేసయ్యా (4)
యేసయ్యా నీవే నా రక్షకుడవు
యేసయ్యా నీవే నా సృష్టికర్తవు
దరి చేర్చి ఆదరించుమా
ఓ యేసయ్యా… దరి చేర్చి ఆదరించుమా
వి ప్రెయిస్ యు అండ్ వర్షిప్ యు
ఆల్మైటీ గాడ్.. ప్రైస్ యు అండ్ వర్షిప్ యు
హాల్లేలూయా ఆమెన్
ఓ యేసయ్యా.. ఆమెన్ హాల్లేలూయా

పరిశుద్ధ తండ్రి ప్రేమా స్వరూపివి
సర్వాధికారివి.. ఓ యేసయ్యా (2)
కరుణించి కాపాడుమా
ఓ యేసయ్యా.. కరుణించి కాపాడుమా (2) ||హల్లెలూయా||

స్తుతులకు పాత్రుడా – స్తోత్రించి కీర్తింతున్
కొనియాడి పొగడెదన్.. ఓ యేసయ్యా (2)
కృప చూపి నడిపించుమా
ఓ యేసయ్యా.. కృప చూపి నడిపించుమా (2) ||హల్లెలూయా||

నిన్ను పోలిన వారెవరు

నిన్ను పోలిన వారెవరు
నీతో సమముగా లేరెవరు
పరమును వీడి నా దరికొచ్చిన
నా ప్రభువా నిన్ను స్తుతియించెదన్

యేషూవ యేషూవ – నా రాజు మీరయ్య
యేషూవ యేషూవ – హల్లెలూయా
యేషూవ యేషూవ – నా సర్వం మీరయ్య
యేషూవ యేషూవ – హల్లెలూయా….

1) సిలువలో నాకై – మరణించి
నాపై నీ ప్రేమను – కనుపరచి
మూడవ దినమున – తిరిగి లేచి
మరణమునే జయించి
వేలాది దూతలతో మధ్యాకాశములో
నన్ను కొనిపోవా రానైయున్న

యేషూవ యేషూవ – నా రాజు మీరయ్య
యేషూవ యేషూవ – హల్లెలూయా
యేషూవ యేషూవ – నా సర్వం మీరయ్య
యేషూవ యేషూవ – హల్లెలూయా….

2) నా పేరుతో- నన్ను పిలచి
నీ సాక్షిగా- నిలువబెట్టి
నీ ఆత్మతో- అభిషేకించి
నీ సొత్తుగా- నన్ను మార్చి
కృప వెంబడి కృపతో- యెనలేని ప్రేమతో
నీ సేవకునకు తోడైయున్న

యేషూవ యేషూవ – నా రాజు మీరయ్య
యేషూవ యేషూవ – హల్లెలూయా
యేషూవ యేషూవ – నా సర్వం మీరయ్య
యేషూవ యేషూవ – హల్లెలూయా….

ఆరాధన వర్తమానం

దేవుని సన్నిధిలో ఉండగలుగుట అనేది దేవుడు మనకు ఇచ్చిన ఆధిక్యత. ఆయన మాత్రమే ఘనతనొందుటకు అర్హుడై ఉన్నాడు. మన దేవుడు ఏమై ఉన్నాడో అనే అనుభవము కలిగి ఉన్నప్పుడు ఆయనను మనము నిజముగా ఆరాధించగలుగుతాము.

యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి నైవేద్యములు చేత పుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి పరిశుద్ధాలంకారములగు ఆభరణములను ధరించుకొనిఆయనయెదుట సాగిలపడుడి. 1 దినవృత్తాంతములు 16:29.

దేవునికి తగిన మహిమ చెల్లించుటకు మన దగ్గర ఎటువంటి వస్తువులు, ఆస్తులు లేవు. అయితే మన పూర్ణహృదయమే ఆయన అంగీకరించగలిగిన అర్పణ. నిజమైన దేవుని ఆరాధించే మనము తప్పనిసరిగా మన పూర్ణ హృదయము, పూర్ణ మనస్సు, పూర్ణ బలముచేత సిద్ధపడి ఆయన సన్నిధికి రావాలి.

యెహోవా మహా ఘనత వహించినవాడు ఆయన బహుగా స్తుతినొంద తగినవాడు సమస్త దేవతలకంటె ఆయన పూజ్యుడు – 1 దినవృత్తాంతములు 16:25.

నా దేవుడు బహుగా స్తుతినొందదగినవాడు అనే సత్యము ఎరగకుండా, ఆ ప్రకారము సిద్ధపడకుండా ఆయన సన్నిధిలోనికి ఎన్ని సంవత్సరాలుగా ఆరాధించినా అది నిష్ప్రయోజనమే! ఒకవేళ ఆయన చేసిన మేళ్ళను బట్టియో, తప్పించిన పరిస్థితులను బట్టియో దేనిని బట్టియైనా మనము సిద్ధపడి ఆయనను స్తుతించాలి.

ఇంతవరకు ఏమైనాగానీ, ఇప్పటినుండి ఆదివారము ఆయనను ఆరాధించడానికి యధాలాపముగా కాక, పూర్ణహృదయముతో సిద్ధపడి వచ్చులాగున మనలను మనమే సరిచేసుకుందాము

ఘనతాప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బలమును సంతోషమును ఆయనయొద్ద ఉన్నవి – 1 దినవృత్తాంతములు 16:27.

వాక్యప్రకారము మన జీవితములో ఉంటే మనకు ఏది ఇష్టమో అది అడగమని ప్రభువు చెప్పాడు.

నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండినయెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింప బడును – యోహాను 15:7.

దాని అర్థము, వాక్యప్రకారము నీ జీవితము ఉంటే, ఆయనను అడకముందే నీకు కావలసినవాటిని దయచేసే ప్రేమ కలిగినవాడు నీ దేవుడు. అటువంటి దేవునిని ఈరోజు మన హృదయమును సరిచేసుకుని, సిద్ధపడి ఆరాధిద్దాము.

Worship Song | ఆరాధన గీతం

హోసన్నా హోసన్నా
హోసన్నా మహోన్నతుడు
దేవా నీ నామము ఉన్నత నామము
కృతజ్ఞత స్తుతులు నీకే
హోసన్నా మహోన్నతుడు

కీర్తి కీర్తి
కీర్తి రారాజుకే
దేవా నీ నామము ఉన్నత నామము
కృతజ్ఞత స్తుతులు నీకే
కీర్తి రారాజుకే

మహిమ మహిమ
మహిమ రారాజుకే
దేవా నీ నామము ఉన్నత నామము
కృతజ్ఞత స్తుతులు నీకే
మహిమ రారాజుకే

 

Main Message | మెయిన్ మెసేజ్

మనము కడవరి దినాలలో ఉంటున్నాము. మనము సిద్ధపడకపోతే మనము విడువబడతాము. మనము వినినవాక్యము ప్రకారము మనము సరిచేసుకొని జీవించకపోతే విడిచిపెట్టబడతాము. ఈ సత్యము ఎరిగినవారమై దేవునియందలి భయభక్తులతో జీవించాలి. ఎన్నిగంటలు మనము వాక్యము వింటున్నాము అనేదానినిబట్టి దేవుడు సంతోషించడు గాని, విన్నదాని ప్రకారము ఎంతవరకు చెయ్యగలుగుతున్నాము అనే దానిని చూసేవాడుగా ఉంటాడు. మనలో అనేకులం భక్తిని చూపిస్తాము గాని, భయము కలిగి ఉండట్లేదు. దేవుని యందలి “భయభక్తులు” ఖచ్చితముగా కలిగే ఉండాలి.

ఈరోజు ఆయనకు తగినట్లుగా ఎలా జీవించాలి అనే విషయాన్ని నేర్చుకుందాము.

అందుచేత ఈ సంగతి వినిననాటనుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకముగనులవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు, ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తినిబట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగాచేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలు చున్నాము. – కొలస్సీ 1:9-12.

ఆయనకు తగినట్టుగా అంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో, ఆయనకు తగినట్టుగా మనము నడచుకోవాలి. మన జీవితాలలో మన సామాజిక మరియు ఆర్థిక స్థాయిని బట్టి మనము జీవిస్తాము. అయితే మనకొరకు ప్రాణము పెట్టి మనలను రక్షించిన యేసుక్రీస్తు నడిచినప్రకారము మనము జీవించాలి.

క్రీస్తుకూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచి పోయెను. – 1 పేతురు 2:21.

అయితే మన ప్రభువు యొక్క అడుగుజాడలు ఏమై ఉన్నాయో మనము ఎరిగి ఉండాలి. యేసయ్య పేరు జ్ఞాపకముచేసుకోగానే మనకు వెంటనే గుర్తువచ్చేది, “ప్రేమ”. ఆయన ఎటువంటివారిని ప్రేమించారు?

నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి. మత్తయి 5:44

నీ శత్రువులు అంటే నీకు వ్యతిరేకముగా చేసినవారిని గురించి ప్రార్థన చేయాలి. అంటే ఎలా? ఒకవేళ నీ శత్రువు జీవితములో ఏదైనా నష్టము కలిగినప్పుడు దానిని బట్టి నీవు సంతోషించక వారి పరిస్థితులలో వారి గురించి నీ ప్రేమను బట్టి ప్రార్థించాలి. మనము కూడా పాపులము, శత్రువులము అయి ఉండగా, మన యేసు ప్రభువు మనలను ప్రేమించి మనకొరకు ప్రాణము పెట్టారు.

మీరు మిమ్మును ప్రేమించువారినే ప్రేమించినయెడల మీకేమి ఫలము కలుగును? – మత్తయి 5:46.

అనగా మీరు శత్రువులను ప్రేమించినయెడల మీకు క్రీస్తును బట్టి ఫలము కలుగుతుంది అనే కదా! నీవు శత్రువుగా భావించినవారు కష్టములో ఉన్నప్పుడు వారికొరకు నీవు ప్రార్థించాలి.

రెండవదిగా, యేసు ప్రభువు “పరిశుద్ధుడు”. ఆయన అడుగుజాడలలో నడవాలి అంటే ఆయన పరిశుద్ధుడుగా ఉన్నప్రకారము, మనము కూడా పరిశుద్ధులుగా అనగా ఎవరితోనూ వేలు ఎత్తి చూపించలేని జీవితము కలిగి జీవించాలి. మనము యేసుయందలి విశ్వాసమును బట్టి పాపము చెయ్యకుండా జీవించినప్పుడు, ఖచ్చితముగా మనము యేసునుబట్టి, పరిశుద్ధత కొనసాగించబడతాము. మన ప్రభువును అపవాది శోధించినప్పుడు, వాక్యమును ఆధారముగా చేసుకుని ఆయన తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. మనము కూడా, వాక్యముద్వారానే పరిశుద్ధతను కాపాడుకోవాలి. “నేడే రక్షణ దినము”, అనే ఆశ ప్రతీ రోజు నీవు కలిగిఉన్నట్టయితే, ఆ ప్రతీ దినము వాక్య ప్రకారము నీ జీవితాన్ని పరిశుద్ధతతో కొనసాగించగలుగుతావు.

ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను. – ఫిలిప్పీయులు 2:6-8.

మన ప్రభువు “విధేయత” కలిగినవాడు గనుక, ఆయన అడుగుజాడలలో నడిచే మనము కూడా విధేయత చూపించేవారుగా ఉండాలి. మనము అనేకసార్లు “అహం” కాని, “ఆర్థికస్థాయి” బట్టి గానీ, తగ్గింపులేని స్థితిలో ఉంటాము. అయితే దేవుడై ఉండి మన ప్రభువే తగ్గించుకున్నవాడై ఉన్నాడు. అలాగే మనముకూడా తగ్గవలసిన పరిస్థితులలో తగ్గింపు కలిగి ఉండాలి. దేవునికి విధేయత చూపించడము కొరకు ప్రభువు తగ్గించుకున్నాడు. మనము కూడా దేవునికి విధేయత చూపించడము కొరకు మనలను మనము తగ్గించుకోవాలి. థగ్గించుకోవడము వలన మనకు కలిగే నష్టము ఏమియు లేదు. ఎవడైతే తగ్గించుకుంటాడో, వాడు హెచ్చించబడతాడు అని లేఖనాలు సెలవిస్తునాయి కదా!

కొంత దూరము వెళ్లి, సాగిలపడి నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగి పోనిమ్ము, అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. – మత్తయి 26:39.

ప్రభువు హృదయములో తండ్రి దగ్గరనుండి దూరమయ్యే ఆ పరిస్థితి ఇష్టములేనివాడుగా ఉన్నాడు. ఇంకా లోతుగా ఆలోచిస్తే, యేసయ్య హృదయములో “ఒక కోరిక” ఉంది. అయితే దేవుని చిత్తమునకు లోబడి అవసరమైతే ఆ కోరికను వదులుకునేవాడుగా ఉన్నాడు. యేసయ్య జీవితములో మొదటి స్థానము దేవుని చిత్తమే అయిఉన్నది. అలాగే ఆయన అడుగుజాడలలో నడవడానినికి సిద్ధపడే మనముకూడా దేవుని చిత్తానికే లోబడి మన ఇష్టాయిష్టాలు ఉండాలి.

కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును. యోహాను 5:19.

తండ్రి ఏది చేయుట మనము ఎరిగిఉన్నామో, ఆ ప్రకారముగానే మన జీవితముకూడా ఉండాలి. మనము విడువబడటానికి కాదు కాని, ఆయనతో నిత్యము ఉండటానికే మనము పిలువబడ్డాము. దానికొరకు ఇక్కడే సిద్ధపడాలి. “నేను” అనేది ఎప్పుడు పనిచేస్తుందో, అప్పుడు దేవుని కార్యము చూడలేము. దేవుని మాటయే మన జీవితములో ప్రథమస్థానము కలిగి ఉండాలి.

నాల్గవదిగా, మత్తయి 26:53 ధ్యానించి ముగించుకుందాము.

ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనినయెడల ఆయన పండ్రెండు సేనా వ్యూహములకంటె1 ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొను చున్నావా? – మత్తయి 26:53

తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృత జ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టు నిలిచియున్న యీ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై యీ మాట చెప్పితిననెను. యోహాను 11:41,42.

అనగా, ప్రభువు ఏమి అడుగుతున్నాడో అది తండ్రి దయచేసేవాడుగా ఉన్నాడు. అయితే యేసు ప్రభువు తండ్రి హృదయాన్ని ఎరిగినవాడుగా ఉన్నాడు. అందుకే ఎల్లప్పుడును నా మనవి ఆలకిస్తున్నావు అని చెప్పగలుగుతున్నాడు. నీ పరిస్థితి ఎలాఉంది? మనము తండ్రి హృదయాన్ని ఎరిగినవారుగా ఉన్నామా?

అద్భుతము అవసరమైన సందర్భము ఒకటి, ప్రాణము పోగొట్టుకొనే సమయము. ఈ రెండు సందర్భములూ వేరు. ఒక చోట తండ్రిని మహిమను ప్రకటించే సమయము, మరొకటి తండ్రి చిత్తము నెరవేర్చే సమయము. యేసయ్య ఎలా తన జీవితాన్ని కొనసాగించాడో మనముకూడా ఈ నాలుగు సందర్భాలగుండా వెళ్ళినప్పుడు మనముకూడా ఆయన అడుగుజాడలలో నడవగలుగుతాము.