ఆరాధన వర్తమానము
తండ్రి తన పిల్లలు తన ఇంటిలో ఉండునట్లుగా కోరుకొంటాడు. ఈ దినము మనమందరము ఆయన చేత ఆకర్షించబడినవారిగా ఉన్నాము, నడిపించబడినవారముగా ఉన్నాము.
నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును.౹ -యోహాను 10:27
గొర్రెల కాపరి, మరియు గొర్రెల మధ్య ఉన్న సంబంధము మనము అర్థము చేసుకొందాము. ఇక్కద కాపరి, తన గొర్రెలను నడిపిస్తున్నాడు గనుక తనకు ఒక ఉద్దేశ్యము ఉంటుంది. అది గొర్రెలకు తెలియకపోవచ్చు గానీ, కాపరికి మాత్రము తెలుస్తుంది. అయితే మొట్టమొదట అసలు నడిపించడానికి గల ఉద్దేశ్యము ఏమిటి అంటే, వాటిపై బాధ్యత కలిగి ఉండటమే, ఆ బాధ్యత అంగీకరించడమే!
దేవుడు మనలను తన సన్నిధికి నడిపించాడు, ఆయన సన్నిధిలో మనము ఉన్న దానిని బట్టి మనపై ఆయనకు ఒక ఉద్దేశ్యము ఉంది. మనము ఆయనకు సొత్తు అయి ఉన్నాము గనుక, మనపై బాధ్యత ఆయనదే!
నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱెలకొరకు తన ప్రాణము పెట్టును.౹ జీతగాడు గొఱ్ఱెల కాపరికాడు గనుక గొఱ్ఱెలు తనవికానందున తోడేలు వచ్చుట చూచి గొఱ్ఱెలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొఱ్ఱెలను పెట్టి చెదరగొట్టును.౹ జీతగాడు జీతగాడే గనుక గొఱ్ఱెలనుగూర్చి లక్ష్యము చేయక పారిపోవును.౹ నేను గొఱ్ఱెల మంచి కాపరిని.౹ -యోహాను 10:11-14
జీతగాడు లక్ష్యము చేయడు అయితే మంచి కాపరి గొర్రెలను లక్ష్యము చేసేవాడిగా ఉంటాడు. అనగా వాటికి కావలసిన తిండి, నీరు, రక్షణ అన్నింటి కొరకు లక్షము కలిగినవాడుగా ఉంటాడు. కాపరి గొర్రెలను నడిపించే సమయములో జీవము లేను పరిస్థితి కనబడితే, ఎక్కడైతే జీవము ఉంటుందో అక్కడకు వాటిని నడిపించేవాడిగా ఉంటాడు.
జీతగాడు జీతగాడే గనుక అపాయము వచ్చుట చూసి, గొర్రెలను వదిలి పారిపోయేవాడుగా ఉంటాడు. అయితే గొర్రెల మంచి కాపరి మాత్రము, ఆ గొర్రెల కొరకు ప్రాణము సైతము పెట్టేవాడిగా ఉంటాడు. మన దేవుడు కూడా మనకు మంచి కాపరి కాబట్టి, మన యెడల లక్షము కలిగినవాడుగా ఉన్నాడు.
గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.౹ -యోహాను 10:10
అనగా ఆ గొర్రెలకు జీవము కలుగునట్లు, సమృద్ధి అయిన జీవము కలుగుటకే, కాపరి నడిపించబడుతున్నాడు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున కూడుకొని ఉంటారో, వారి మధ్యన నేనుంటాను అని యేసయ్య చెప్పారు.
యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. -కీర్తనలు 23:1
మొదటిగా ఆయన మనకు కాపరిగా ఉన్నాడు అనే సంగతి మనము తెలుసుకోవాలి. ఎందుకు ఆయన మనకు కాపరిగా ఉన్నాడు అని చూస్తే, మనము ఆయనకు సొత్తు అయినవారిగా ఉంటున్నాము. గనుకనే మనకు లేమి కలుగదు అనే నిశ్చయత మనము కలిగి ఉండాలి.
ఈ నిశ్చయత మనము కలిగి, “లేమి కలుగదు” అనే సత్యము నెరవేరాలి అంటే, “నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును.౹ -యోహాను 10:27” ఈ సత్యము నీ జీవితములో నీవు కలిగి ఉండాలి.
అనగా దేవుడు తన స్వరమును తన వాక్కు ద్వారా వినిపిస్తున్నాడు. గనుక ఆ వాక్కును విని, ఆ వాక్కు ప్రకారము మనము జీవించినపుడు, మనకు లేమి కలుగదు.
పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయు చున్నాడు శాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు. -కీర్తనలు 23:2
ఆయన స్వరము విని ఆ ప్రకారము నడుస్తున్నపుడు, మనకు ఏమి అర్థము అయిన అర్థము కాకపోయినా, కాపరి పై ఉన్న నమ్మకము బట్టి ఎలా అయితే గొర్రెలు నడుస్తాయో, అదే నమ్మకము కలిగి మనము వెంబడించాలి. అప్పుడు ఖచ్చితముగా మనము సమృద్ధి అయిన జీవము వైపు మాత్రమే నీవు నడిపించబడతావు.
రండి యెహోవానుగూర్చి ఉత్సాహధ్వనిచేయుదము మన రక్షణ దుర్గమునుబట్టి సంతోషగానముచేయు దము -కీర్తనలు 95:1
నీ జీవితములో దేవుని ఉద్దేశ్యము నీవు సమృద్ధి అయిన జీవము కలిగి ఉండాలి. ఎక్కడ అసంపూర్ణముగా ఉందో, అక్కడ సమృద్ధి కలిగించడానికి, నీ కాపరి నీ యెడల లక్ష్యము ఉంచుతున్నాడు. నీకు సమృద్ధి కలుగులాగున వాక్కును విడుదల చేస్తాడు. ఆ వాక్కు ప్రకారము నీవు నడిచినపుడు, నీకు సమృద్ధి ఖచ్చితముగా కలుగుతుంది.
ఒక టీచర్ ను చూస్తే, తన విద్యార్థులపై లక్ష్యము ఉంచుతారు. గనుక బాగా చదవలేని వారిపై లక్ష్యము ఉంచి వారిని అభివృద్ధివైపు నడిపిస్తాడు. అంతే కాక బాగా చదివేవారిపై సహితము లక్ష్యము చేసేవాడిగా ఉంటాడు. గనుకనే ఈ దినము నీ స్థితి మార్చడానికి ప్రభువు నడిపించాడు అనే సత్యము నీవు ఎరిగి ఉండాలి.
గాయము చేయువాడు ఆయనే ఆ గాయము కట్టువాడు కూడా ఆయనే! అసలు గాయము ఎందుకు చేస్తాడు? అని చూస్తే – మనము సరైన విధానములో నడిపించబడాలి అనే ఉద్దేశ్యముతోనే గాయము చేస్తాడు తప్ప, నిన్ను నాశనము చేయడానికి కాదు, నష్టపరచడానికి కాదు.
రండి యెహోవానుగూర్చి ఉత్సాహధ్వనిచేయుదము మన రక్షణ దుర్గమునుబట్టి సంతోషగానముచేయు దము కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. -కీర్తనలు 95:1-2
ఇక్కడ చూస్తే, అప్పటికే చేసిన మేళ్ళను బట్టి కృతజ్ఞత చెల్లించడము. అలాగే, మనము కృతజ్ఞత చెల్లించడము ద్వారా భవిష్యత్తు కూడా స్థిరపరచబడుతుంది. భవిష్యత్తులో ఉన్న సమస్య ఏదైనా సరే, దానినుండి తప్పించి నిన్ను నడిపిస్తాడు.
ఆరాధన గీతము
కృతజ్ఞతా స్తుతులతో నీ సన్నిధి చేరెద
నూతన స్తుతి పాడుచూ సీయోనులో నిలిచెద
వారము కొరకైన వాక్యము
ఈ దినము దేవునికి ఇష్టుడై ఉండుట అనే దాని గూర్చి మనము నేర్చుకుందాము.
నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. -2 సమూయేలు 22:20
దేవునికి ఇష్టుడిగా మనము ఉండాలి. అయితే ఏమి చేస్తే ఆయనకు ఇష్టుడుగా ఉంటాము? దావీదును చూస్తే, అతడు దేవునిని ఆధారముగా చేసుకుని ఆయన జీవించాడు.
తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన–నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని; అతడు నా యిష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నియు నెరవేర్చునని చెప్పి అతనినిగూర్చి సాక్ష్యమిచ్చెను. -అపొస్తలుల కార్యములు 13:22
మన గురించి కూడా ఇటువంటి సాక్ష్యమే చెప్పాలి అనే ఆశ దేవుడు కలిగి ఉన్నాడు. యోబు గురించి కూడా అలాగే సాక్ష్యము ఇచ్చాడు.
అందుకు యెహోవా–నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలో చించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులుకలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమిమీద అతనివంటివాడెవడును లేడు -యోబు 1:8
ఈ సాక్ష్యము దేవుడు ఇస్తున్నాడు అంటే, నీ గురించి నా గురించి కూడా దేవుడు సాక్ష్యము ఇవ్వడానికి ఆశ కలిగి ఉన్నాడు. దావీదు తాను ఇష్టమైనవాడు అనే సత్యము ఎరిగి ఉన్నాడు గనుకనే, ఆయనే నన్ను తప్పించాడు అని చెప్పగలుగుతున్నాడు.
–నీవు నా తండ్రివి నా దేవుడవు నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొఱ్ఱపెట్టును. -కీర్తనలు 89:26
దేవునికి ఎందుకు ఇష్టుడుగా ఉన్నాడు అని చూస్తే, దావీదు మనసులో ఉన్న భావము ఇలా ఉంది – దేవుడిని తండ్రిగాను, దేవుడిగాను తన యొక్క రక్షణ దుర్గముగాను అంగీకరించి ఉన్నాడు.
తండ్రి ఏమి చేస్తాడు అనే సంగతి మనము ఎరిగి ఉంటే, నీవే నా తండ్రి అని దేవుని తో సత్యము ఎరిగి యదార్థముగా చెప్పగలుగుతాము. తండ్రి సంరక్షించేవాడుగా ఉన్నాడు, సిద్ధపరచేవాడిగా ఉన్నాడు.
–నాకాలు జారెనని నేననుకొనగా యెహోవా, నీ కృప నన్ను బలపరచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ జేయుచున్నది. -కీర్తనలు 94:18-19
దావీదు దేవుని గూర్చిన సత్యము ఎరిగి, అంగీకరించినదానిని బట్టే, తన పరిస్థితి కాలు జారి నష్టపోయే సమయమైనా సరే, దేవుని కృపయే తనను బలపరచుచున్నది అని, మనస్సులో విచారములచేత దుఃఖము కలుగుచుండగా, ఆయనే ఆదరణ కలిగించేవాడు అని చెప్పగలుగుతున్నాడు.
యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించు చున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించు వాడు నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు నేను ఆశ్రయించియున్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొఱ్ఱపెట్టగా ఆయన నా శత్రువులచేతిలోనుండి నన్ను రక్షిం చును. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లువలె నామీదపడి బెదరింపగను పాతాళపు పాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరింపగను నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని నా దేవునికి ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన నంగీకరించెను నా మొఱ్ఱ ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. -కీర్తనలు 18:1-6
ఇక్కడ మరొక సందర్భములో చూస్తే, తన ప్రాణము పోయే పరిస్థితి అయినప్పటికీ, దేవుని సన్నిధిని తాను విడిచిపెట్టలేదు. అంతే కాక, తాను సంతోషములో ఉన్న స్థితిలో సితారా వాయించుచూ దేవుని సన్నిధినే ప్రేమించినవాడుగా ఉన్నాడు.
–ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ము కొను నా దేవుడని నేను యెహోవానుగూర్చి చెప్పుచున్నాను. -కీర్తనలు 91:2
దావీదు తాను చెప్పడమే కాదు గానీ, తన జీవితములో కూడా అదే ప్రకారము చేసినవాడుగా ఉన్నాడు. గొలియాతు తో యుద్ధమునకు పోయినపుడు, ఎలుగుబంటి బలమునుండి, సింహముబలము నుండి నన్ను రక్షించిన నా దేవుడు, ఈ గొలియాతు బలమునుండి నన్ను రక్షించేవాడు అని ప్రకటించి ముందుకు వెళ్ళాడు.
మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపెను. ఆయననుగూర్చి దావీదు ఇట్లనెను –నేనెల్లప్పుడు నా యెదుట ప్రభువు ను చూచు చుంటిని ఆయన నా కుడిపార్శ్వముననున్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను; నా నాలుక ఆనందించెను మరియు నా శరీరము కూడ నిరీక్షణ గలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు. నాకు జీవమార్గములు తెలిపితివి నీ దర్శన మనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. -అపొస్తలుల కార్యములు 2:24-28
దావీదు దేవునిని ఆధారము చేసుకొని నడవడమే కాదు గానీ, పరిశుద్ధాత్మ ద్వారా తెలియచేయబడిన సత్యమును విశ్వసించి నిరీక్షణ కలిగి ఉన్నవాడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే మన జీవితములో ఎంతో ప్రాముఖ్యమైన వాడుగా ఉన్నాడు అనే సంగతి ఎరిగి, ఆయనను కలిగి నీ జీవితమును కొనసాగిస్తే నీవు దేవునికి ఇష్టుడిగా ఉండగలుగుతావు.
అంతే కాక ఆత్మ ద్వారా క్రీస్తును గూర్చిన సంగతులు దావీదుకు దేవుడు బోధించినపుడు, వాటిని అంగీకరించినవాడిగా దావీదు ఉన్నాదు. అనగా దేవునిని దావీదు అంగీకరించాడు, క్రీస్తును అంగీకరించాడు, అలాగే పరిశుద్ధాత్మను కూడా అంగీకరించినవాడుగా ఉన్నాడు.
విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడిగా ఉండుట అసాధ్యము.
విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.౹ -హెబ్రీయులకు 11:6
నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని నా దేవునికి ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన నంగీకరించెను నా మొఱ్ఱ ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను పర్వతముల పునాదులు వణకెను ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికారంధ్రములనుండి పొగ పుట్టెను ఆయన నోటనుండి అగ్నివచ్చి దహించెను -కీర్తనలు 18:6-8
నీవు దేవుని యెడల విశ్వాసము కలిగి నీవు యదార్థముగా ఉన్నపుడు ఖచ్చితముగా నీ దేవుడు ఏమి చెయ్యాలో అది చేస్తాడు. నీ దేవుడు అవసరమైతే నూతనముగా సృష్టించగలుగుతాడు, మృతమైనదానిని సజీవముగా చేయగలుగుతాడు.
