09-03-2025 – ఆదివారం మొదటి ఆరాధన

ఆరాధన వర్తమానము

ఈ దినము తన సన్నిధిలో మనలను నిలబెట్టిన దేవునికే మహిమ కలుగును గాక. దేవునిని ఆరాధించడము అనేది ఎంతో ధన్యతతో కూడినది. ఈ రోజు ఆయన మనము ఎలా ఆరాధించాలి అని కోరుకుంటున్నాడో, అదే రీతిగా మనము ఆరాధించాలి.

దావీదు వలె నాట్యమాడి అంటూ పాట పాడి మనము స్తుతించాము. దావీదు ఒక రాజుగా ఉన్నాడు. అయితే మందసము ఎదుట నడిరోడ్డు మీద తాను నాట్యమాడాడు. తన రాచరికపు ముసుగు దేవుని పై తనకున్న ఆరాధనా భావమును కప్పలేకపోయింది. తాను కాపరిగా ఉన్నా, రాజుగా ఉన్నా దేవుని ఆరాధించే విషయములో మార్పులేని ఆరాధన దావీదుది.

మనము బలహీన స్థితిలో ఉన్నా, బలమైన స్థితిలో ఉన్నా, శ్రమలో ఉన్నా, ఉన్నతమైన స్థితిలో ఉన్నా మనము దేవునిని ఆరాధించాలి ఎందుకు అని చూస్తే. శ్రమలో ఉన్నా, ఉన్నతమైన స్థితిలో ఉన్నా సరే ఆయనే మనకు దేవుడై ఉన్నాడు.

ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమప్రభువునై యున్నాడు. ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు. ఆయన నరులముఖమును లక్ష్యపెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు.౹ -ద్వితీయోపదేశకాండము 10:17
ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కన్నులార చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే.౹ -ద్వితీయోపదేశకాండము 10:21

మన దేవుడు పరమదేవుడును పరమప్రభువునై యున్నాడు. ఆయనే నీకు కీర్తనీయుడు అయి ఉన్నాడు. ఈ సత్యమును మనము అర్థము చేసుకున్నపుడు, ఆ సత్యము ప్రకారము దేవునిని ఆరాధించాలి. నా దేవుడు నా శ్రమలోనుండి నన్ను తప్పించగలిగిన సమర్థుడు, నేను కీర్తించడానికి, ఆరాధించడానికి ఆయనే కారణము. నా స్తుతికి కారణభూతుడగు దేవా అని కీర్తనాకారుడు చెప్పుచున్నాడు.

ఆయన మనకు దేవుడుగా ఉన్నందుకే మన జీవితములలో అద్భుతములు జరిగించబడతాయి. ఎందుకంటే ఆయన అద్భుతకరుడు అయి ఉన్నాడు. అసలు అద్భుతము ఎప్పుడు అవసరము? ఏ శ్రమలో మనము ఉన్నామో, ఆ శ్రమలోనుండి తప్పించడానికి దేవుడు చేసేదే అద్భుతము. నీ కొరకు భీకరమైన కార్యములు చేసేవాడుగా ఉన్నాడు. మన దేవుడు తన ప్రేమను నిరూపించే దేవుడు. ఆ కలువరి సిలువలో ఆయన ప్రేమను నిరూపించాడు.

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.౹ -యోహాను 3:16

ఇదే వాక్యమును మరొకలా చూస్తే, దేవుడు మనలను ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచిన ప్రతీ సారీ, నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. అయితే మనము విశ్వాసముంచే సమయములో ఆటంకములు వస్తాయి. అయితే అలా ఆటంకము వచ్చిన ఆ సమయములోనే, నీ దేవుడు గొప్పదేవుడు అనే సత్యమును నమ్మి నిలబడాలి. ఆటంకములు వచ్చినంత మాత్రాన నీ జీవితము ఆగిపోదు, కానీ నీ జీవితము ప్రభువు మహిమ కొరకు ఏర్పాటు చేసిన జీవితము.

కలువరి సిలువలో దేవుని ప్రేమ నిరూపించబడింది. అలాగే నీ శిక్షకు బదులుగా ఆయన శిక్ష అనుభవించాడు అనేది నిరూపించబడింది. పాపిగా ఉన్న మనము పరిశుద్ధులుగా చేయబడ్డాము అనే సత్యము నిరూపించబడింది. అలాగే పరిశుద్ధుల కొరకు సిద్ధపరచిన స్వాస్థ్యము నీవు పొందుకొనుట కూడా నిరూపించబడుతుంది.

మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నులయెదుట చేసినవాటన్నిటిచొప్పున ఏ దేవుడైనను శోధనలతోను సూచక క్రియలతోను మహత్కార్యములతోను యుద్ధముతోను బాహుబలముతోను చాచిన చేతితోను మహా భయంకర కార్యములతోను ఎప్పుడైనను వచ్చి ఒక జనములోనుండి తనకొరకు ఒక జనమును తీసికొన యత్నము చేసెనా? -ద్వితీయోపదేశకాండము 4:34

ఇక్కడ నీ దేవుని యొక్క ప్రత్యేకత గూర్చి చెప్పబడుతుంది. శోధనలతోను సూచక క్రియలతోను మహత్కార్యములతోను యుద్ధముతోను బాహుబలముతోను చాచిన చేతితోను మహా భయంకర కార్యములతో మన పితరుల యెదుట కార్యములు చేసిన దేవుడు, ఈ దినము నీ కన్నుల యెదుట కూడా చేయగల దేవుడు!

నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను ఎక్కువగా ఎంచి, నిన్ను తనకు స్వకీయజనముగా ఏర్పరచుకొనెను.౹ -ద్వితీయోపదేశకాండము 7:6

దేవుడు కలిగి ఉన్న సమస్తము మనవే. ఇప్పుడు మనము వాటిని కలిగి ఉండకపోవచ్చు. అనగా ఇంకా ముప్పదంతలుగానే ఉన్నావేమో, అయితే నీవు అరువదంతలుగాను, నూరంతలుగానూ ఎదిగేది నీవు ఆరాధించే నీ దేవుడిని బట్టే! నిన్ను బట్టి నీ జీవితము ఉండదు గానీ, నీ దేవుడిని బట్టే!

దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.౹ -రోమా 8:28

ఇప్పుడు ముప్పదంతలుగా ఉన్న స్థితిలో ఉన్నట్టయితే. నీవు ఉన్న ముప్పదంతలనుండి, అరువదంతలుగా ఎదుగునట్లు మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతాయి. గనుక నీ జీవితములో సమస్తము దేవునిని బట్టియే జరుగుతాయి, కలుగుతాయి. అవసరమైతే నూతనముగా నీ కొరకు సృష్టించేవాడు. నీవున్న స్థితి నుండి నిన్ను తప్పించుటకు నీ దేవుడు సమస్తము సమకూర్చి జరిగించేవాడు.

గనుకనే మన స్థితిని బట్టి మన ఆరాధన ఉండకూడదు గానీ, మన దేవుడు ఏమై ఉన్నాడో, దానిని బట్టే మన ఆరాధన ఉండాలి. పేతురును చూస్తే, అందరికంటే ఎక్కువగా వాక్యమును విన్నాడు, అందరికన్నా ఎక్కువగా బోధించబడ్డాడు. అనేక సందర్భములలో అందరికంటే ఎక్కువగా మందలించబడ్డాడు కూడా. అదే పేతురు సరిచేయబడి, వారికి నాయకుడుగా స్థిరపరచబడ్డాడు.

మనకొరకైన దేవుని పిలుపును బట్టే మన జీవితములు ఉన్నాయి, ఉంటాయి.

ఆరాధన గీతము

నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు

వారము కొరకైన వాక్యము

మన జీవితము ప్రత్యేకమైనది. లోకములో ఉన్న జీవితం వేరు, మనము అనుభవిస్తున్న జీవితము వేరు. లోకములో నుండి మనము ప్రత్యేక పరచబడినవారము గనుక మన జీవితము ప్రత్యేకముగానే ఉంటుంది. మన ఆత్మీయమైన జీవితములో ఒక సందర్భము మన ప్రతీ ఒక్కరి జీవితములో ఉంటుంది. అది పరీక్షించబడే సందర్భము.

ఆ సంగతులు జరిగినతరువాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన–అబ్రా హామా, అనిపిలువగా అతడు–చిత్తము ప్రభువా అనెను.౹ -ఆదికాండము 22:1

పిల్లలకు పరీక్షా సమయము. వారికి ఆయా బోధనలు జరిగిన తరువాత, వారికి పరీక్షా సమయము ఉంటుంది. అలాగే మన జీవితమునకు అవసరమైన ఆయా సంగతులు నేర్పిస్తున్నాడు, బోధిస్తున్నాడు. ఈ బోధన అయిన తరువాత నీకు పరీక్షా సమయము ఉంటుంది. నీవు విశ్వాసములో ఉన్నాను అని నీవు అనుకున్నపుడు నీ విశ్వాసమునకు పరీక్ష ఉంటుంది. నీవు దేవుని కొరకు ఏమైనా చేస్తాను అని నీవు అనుకుంటే, అప్పుడు నీకు పరీక్షా సమయము ఉంటుంది.

నాలో ఆయసకరమైనది ఏమైనా ఉంటే నాకు తెలియ చేయి దేవా అని మనము ప్రార్థించేవారముగా ఉండాలి. అయితే ఆ పరీక్షా సమయములో మనము ఎలా నిలబడాలో ఈ దినము నేర్చుకుందాము.

నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్షవలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును.౹ -1 పేతురు 1:7

ప్రభువు నీకు అనేకమైన సంగతులు బోధిస్తాడు. ఆ బోధించిన విషయములలో నిన్ను పరీక్షిస్తాడు.ఆ పరీక్షలో నీవు ఉత్తీర్ణుడవయితే నీవు ప్రమోట్ చెయ్యబడతావు. నీకు ఘనత రావాలి అంటే, నీవు ఖచ్చితముగా పరీక్షించబడాలి. ఇప్పుడు ప్రభువు నీకు బోధిస్తునాడు అంటే, పరీక్షా సమయము ముందుంది. ఆ పరీక్షలో నీవు ఉత్తీర్ణుడవయితే నీవు ప్రమోట్ చెయ్యబడతావు.

అబ్రహాము జీవితములో అనేకమైన సంగతులు జరిగాయి. లోతు కుటుంబము ఎత్తుకుపోబడినపుడు, శారాను రాజు తీసుకుపోయినపుడు, పిల్లలు ఇంకా పుట్టక నిరాశలో ఉన్నపుడు, ఇంకా అనేకమైన స్థితులలో అబ్రహాముకు దేవుడు అనేకమైన విషయములు నేర్పించాడు. అయితే ఆయా సంగతులు జరిగిన తరువాత అబ్రహామును ప్రభువు పరీక్షించాడు.

అబ్రహామును పిలిచి తన ఒక్కగానొక్క కుమారుని అర్పించమని దేవుడు అడిగాడు. మనము కూడా ఎప్పుడైతే మన విశ్వాసము పరీక్షించబడుతుందో, ప్రభువు మనకు ఇచ్చిన మాట ప్రకారము మనము నిలబడాలి. అయితే అలా నిలబడాలి అంటే, దేవుని వాగ్దానము ఖచ్చితముగా పట్టుకొని, నమ్మి నిలబడాలి.

వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు, అనగా ఇచ్చిన వాగ్దానము నెరవేర్చగల సమర్థుడు అని నమ్మాలి. ఇప్పుడు అబ్రహాము విషయములో దేవుడు అబ్రహాము సంతానమును ఇసుకరేణువులవలే విస్తరింపచేస్తాను అని వాగ్దానము ఇచ్చాడు. అంతే కాక, “ఇస్సాకు వలన అయినది మాత్రమే నీ సంతానము అనబడును” అని దేవుడు వాగ్దానము చేసాడు.

ఇప్పుడు దేవుడు ఇస్సాకును బలిగా అర్పించమన్నాడు. అయితే అబ్రహాము దేవుడు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చగలవాడు అని నమ్మాడు గనుక ఇస్సాకు మరణించినా సరే, తిరిగి జీవింపచేయగల సమర్థుడు అని నమ్మాడు.

శారాను రాజు పట్టుకొని పోయిన తరువాత అబ్రహాము తిరిగి ఆమెను పొందటము అనేది అసాధ్యము. అయితే దేవుడు అబ్రహాము కొరకు అద్భుతమైన రీతిలో రాజు చేతులనుండి తన భార్యను సురక్షితముగా అప్పగించాడు. ఇది అబ్రహాము యొక్క అనుభవము.

అందుకనే దావీదు, నా ప్రాణమా దేవుడు చేసిన ఉపకారములను దేనినీ మరువకు అని తనతో తానే చెప్పుకుంటున్నాడు. అరణ్యములో ఐగుప్తులో మీకొరకు యుద్ధము చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేయగలడు అనే సత్యము నీవు నమ్మినపుడు, నీవు నిలబడతావు.

నీకు దేవుడు ఏమి బోధిస్తాడో, అదే నీ అనుభవముగా మార్చబడుతుంది. ఆ అనుభవమే నీ పరీక్షా సమయములో నిలబడటానికి ఆధారముగా ఉంటుంది. నీవు కనపరచే విశ్వాసమును బట్టి నీ దేవుడు నిన్ను సిగ్గుపరచడు, గానీ నీ విశ్వాసము ప్రకారము కార్యము చేస్తాడు.

దేవుని వాగ్దానము నెరవేర్పు కొరకు ప్రతీ ప్రయత్నములు జరుగుతాయి, అవి మధ్యలో ఆగిపోవు. అయితే నీవు వాగ్దానమును జ్ఞాపకము చేసుకొని నిలబడకపోతే, నీవు కృంగిపోయివాడవుగా ఉంటావు. అయితే, నీవు వాగ్దానమును జ్ఞాపకము చేసుకొని నిలబడితే, దేవుడిచ్చిన వాగ్దానము ఖచ్చితముగా నెరవేరుతుంది.

సేవ చేసేవారు, చేయాలనుకొనేవారు, ప్రభువు పని చేయాలనుకొనేవారు కొన్ని సంగతులు జాగ్రత్తగా జ్ఞాపకము చేసుకోవాలి. క్రీస్తు రూపాంతరములోనికి మార్పు చెందకుండా, ఈ ఆశ నెరవేర్చబడదు. అందుకే మనము నిలబడవలసిన విధానములో నిలబడాలి.