ఆరాధన వర్తమానము
అర్హత లేనివారికి అర్హత కలిగించేది మన దేవుడే. మనము దేవుని సన్నిధిలో ఉండులాగున మనలను నడిపించింది దేవుని కృపయే! అటువంటి దేవుని సన్నిధిలోనికి రాకుండా అపవాది అనేక ప్రయత్నములు చేస్తాడు. మొదట ఆయన సన్నిధికి రాకుండా చేయడానికి ప్రయత్నిస్తాడు, ఒకవేళ ఆయన సన్నిధికి వస్తే, ఆయన మాటలు వినకుండా చేయడానికి ప్రయత్నిస్తాడు. ఒకవేళ ఆయన మాటలు వింటే, ఆ మాటల ప్రకారము మనము చేయకుండా ఉండడానికి కూడా ప్రయత్నిస్తాడు. అందుకే దేవుని కృప లేనిదే మనము ఆయన సన్నిధికి రాలేము అని అర్థము చేసుకోగలుగుతాము.
దేవునిని ఆరాధించడానికి మనము ఇక్కడ కూడుకున్నాము. మనము ప్రార్థన చేసినపుడు మన విన్నపములు దేవుని సన్నిధికి చేరతాయి. అయితే ఆరాధనలో నీ వద్దకు దేవుని సన్నిధియే దిగి వస్తుంది. గనుక మన ఆత్మ, శరీరము, మరియు జీవము ఏకమై ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి. అప్పుడు మనమున్న ప్రతీ పరిస్థితీ మార్చబడుతుంది. అందుకే యదార్థమైన ఆరాధన ఎంతో ప్రాముఖ్యమైనది.
దేవునిని ఎందుకు ఆరాధించాలి అంటే నిన్ను శత్రువు దాడినుండి తప్పించేవాడు, బంధకములనుండి విడిపించేవాడు, నీ అడ్డులన్నీ తొలగించేవాడు.
వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదావారిమీదికి వచ్చిన అమ్మోనీయులమీదను మోయాబీయులమీదను శేయీరు మన్యవాసులమీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి.౹ -2 దినవృత్తాంతములు 20:22
యెహోషాపాతు జీవితములో చూస్తే, శత్రువులందరూ కూడగట్టుకొని ఆయన మీదికి వచ్చినపుడు. దేవుని యొద్ద నిలబడి శత్రువు యొక్క బలమును గొప్పదైనదైనప్పటికీ , వారికంటే బలమైన వాడు తన దేవుడు అని ఒప్పుకొని, తన దేవునిని ఆరాధించుట మొదలు పెట్టగానే దేవుని కార్యము జరగడము ప్రారంభమయింది.
పౌలు సీలలను చెరసాలలో బంధించినపుడు వారు నమ్మిన దేవునిని నమ్మి, వారి పరిస్థితిని చూడక, ఆరాధించినపుడు వారి బంధకములు తెగిపడ్డాయి, వారి అడ్డులు తొలగించబడ్డాయి. గనుక నీవు ఈరొజు చేసే ఆరాధన నీ బంధకములను తెంపబోతున్నాయి.
షద్రకు, మేషాకు మరియు అబెద్నగోలు దేవునినామము కొరకు రాజు యెదుట వారు తమ దేవుడు రక్షించగల సమర్థుడు అని ధైర్యముగా ప్రకటించారు. అలా నీ దేవుడు ఏమై ఉన్నాడో నీవు ఒప్పుకొని నీవు ప్రకటించుటయే ఆరాధన
ఇశ్రాయేలు ప్రజలకు యెరికో గోడలు అడ్డువచ్చినపుడు వారు దానిని వారి శక్తితో ఏమీ చెయ్యలేదు గానీ, వారు దేవునిని ఆరాధించి దాని చుట్టూ తిరిగినపుడు, దేవుడే దిగి వచ్చి, ఆ గోడలను పగలగొట్టి వారి అడ్డు తొలగించాడు.
అలాగే మోషే కూడా ఎర్రసముద్రము ఎదురుగా ఉన్నప్పుడు దేవుడు ముందుకు సాగిపోమని చెప్పాడు. మోషే చేతిలో ఒక కర్ర ఉంది, అయితే మనకు ఇప్పుడు నాలుక ఇవ్వబడింది. మన నాలుకపైనే జీవ మరణములు ఉన్నాయి. గనుక ఆరాధనలో మనము నోరు తెరిచి పలికే ప్రతి మాట మన దేవుడి గూర్చి గనుక, అది జీవమై మన పరిస్థితిలో ప్రతి అడ్డు తొలగించబడుతుంది.
నీవు చేసే ఆరాధనను బట్టి, నీ దేవుడు నీకోసము దిగి వచ్చి, నిన్ను శత్రువు దాడినుండి తప్పిస్తాడు, బంధకములనుండి విడిపిస్తాడు, నీ అడ్డులన్నీ తొలగిస్తాడు. గనుక యదార్థముగా ఆయనను ఆరాధించు
ఆరాధన గీతము
మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా
మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము
మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా
నీవంటి వారు ఎవరు – నీవంటి వారు లేరు
స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం
నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము
మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా
నీవంటి వారు ఎవరు – నీవంటి వారు లేరు
అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా
మా కరములను జోడించి మేము మహిమ పరచెదం
మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా
నీవంటి వారు ఎవరు – నీవంటి వారు లేరు
వారము కొరకైన వాక్యము
మన జీవితములలో రెండు వాతావరణములు ఉంటాయి. మొదటిది ఈ లోక సంబంధమైనది, రెండవది ఆత్మ సంబంధమైనది. మనము ఆరాధించే సమయములో ఆత్మ సంబంధమైన వాతావరణములో ఉంటాము. మన దైనందిన జీవితము భౌతికముగా చూస్తే లోకములో ఉన్న వాతావరణములో ఉంటాము.
వాతావరణము అంటే కేవలము ఎండ వాన కాదుగానీ, మన చుట్టు ఉన్న పరిస్థితులు ఎలా మనలను ప్రభావితము చేస్తాయో అదే వాతావరణము. లోకములో ఉన్న వాతావరణము, మన పరిస్థితులలో మన నడవడికను ప్రభావితము చేస్తుంది. అదే దేవుని సన్నిధిలో విడుదల అయ్యే వాక్యము, దాని ప్రభావమే ఆత్మీయ వాతారణము. ఈ వాతావరణము మన భౌతికమైన జీవితము కూడా మార్చబడుతుంది.
ఉదాహరణకు ఒక బహుమతిని చూస్తే, అది కనపడితేనే గాని మనము దానిని స్వీకరించలేము. అదే దేవుని ఆశీర్వాదము అనే బహుమానము, కంటికి కనపడదు గానీ, విశ్వాసముతో మనము స్వీకరించాలి. లోకపు వాతావరణములో నీ కంటికి కనపడతేనేగానీ నీవు నమ్మలేవు అదే ఆత్మీయ వాతావరణములో నీవు నమ్మితే అది నీ కంటికి కనబడుతుంది.
ఈ దినము ఆసాపు అనే వ్యక్తిని గూర్చి తెలుసుకుందాము. మనలో ఒక సందేహము సాధారణముగా వస్తుంది. మన చుట్టూ ఉన్నవారు ఎదుగుతున్నపుడు, ఎంతో భక్తి కనబరుస్తున్న మనము ఎందుకు ఎదగట్లేదు అనే ప్రశ్న తప్పకుండా వస్తుంది. ఇంతవరకు నీవు ఎంతో సహనము కనపరిచావేమో అయితే ఇప్పుడు నీవు నిరాశ పడిన స్థితిలోనికి వెళ్ళిపోయావేమో. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.
ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తునుండి వెళ్ళేటప్పుడు దేవునిని ఆరాధించడానికి సిద్ధపడి వెళ్ళినవారుగా ఉన్నారు. ఇది కావాలి అది కావాలి అని దేవుడు అడగలేదు గానీ, వారు బంగారము, వెండి వంటి అనేకమైన వాటిని సిద్ధపరచుకొని వెళ్ళారు.
ఇశ్రాయేలుయెడల శుద్ధహృదయులయెడల నిశ్చయముగా దేవుడు దయాళుడై యున్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను నా అడుగులు జార సిద్ధమాయెను. -కీర్తనలు 73:1-2
ఇక్కడ తృటిలో తప్పిన పరిస్థితి గురించి కీర్తనాకారుడు చెప్పుచున్నాడు. ఈ మాటలు ఆసాపు చెప్పిన మాటలు. ఇశ్రాయేలు దేవుడు దయాళుడై ఉన్నప్పటికీ, ఆయనను కలిగి ఉన్నప్పటికీ, ఆ భక్తినుండి తొలగిపోయే పరిస్థితిలోనికి జారిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోబోయాడు.
ఇశ్రాయేలుయెడల శుద్ధహృదయులయెడల నిశ్చయముగా దేవుడు దయాళుడై యున్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను నా అడుగులు జార సిద్ధమాయెను. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించువారినిబట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవువారు పుష్టిగా నున్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారమువలె వారిని చుట్టుకొనుచున్నది వస్త్రమువలె వారు బలాత్కారము ధరించుకొందురు. క్రొవ్వుచేత వారి కన్నులు మెరకలై యున్నవివారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి ఎగతాళి చేయుచు బలాత్కారముచేత జరుగు కీడును గూర్చి వారు మాటలాడుదురు. గర్వముగా మాటలాడుదురు. ఆకాశముతట్టు వారు ముఖము ఎత్తుదురువారి నాలుక భూసంచారము చేయును. వారి జనము వారిపక్షము చేరునువారు జలపానము సమృద్ధిగా చేయుదురు. –దేవుడు ఎట్లు తెలిసికొనును మహోన్నతునికి తెలివియున్నదా? అని వారను కొందురు. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు. వీరు ఎల్లప్పుడు నిశ్చింతగలవారై ధనవృద్ధి చేసికొందురు. నా హృదయమును నేను శుద్ధిచేసికొని యుండుట వ్యర్థమే నా చేతులు కడుగుకొని నిర్మలుడనై యుండుట వ్యర్థమే -కీర్తనలు 73:1-13
ఇక్కడ తన చుట్టూ ఉన్న భక్తి హీనుల స్థితి అభివృద్ధి చూసి, కీర్తనాకారుడు చెప్పుచున్నమాటలు. చివరికి అసలు నేను నా హృదయమును శుద్ధిచేసుకొని ఉండుట వ్యర్థము కదా అని అనుకుంటున్నాడు.
ఇప్పుడున్న మహిమ మన పితరులున్న మందిరము కంటే ఎక్కువైనదిగా ఉండాలి. మోషే నలభై దినములు దేవుని సన్నిధిలో ఉండి వస్తేనే మిగతా ప్రజలు చూడలేనంత మహిమ పొందినవాడై ఉన్నాడు. మనము అంతకంటే మహిమ కలిగి ఉండాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. నిన్ను పిలిచి ఏర్పాటు చేసుకున్న దేవుడు నమ్మ దగిన వాడు.
నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపడు.౹ -యోహాను 10:28
నిజానికి దేవుని యెడల భక్తి గలిగిన వారు, దేవుని చేతిలో ఉంటున్నారు. ఆయనే వాటికి నిత్య జీవితము ఇచ్చేవాడుగా ఉన్నాడు. అయితే కీర్తనాకారుడు చుట్టూ ఉన్నవారిని చూసినపుడు తన స్థితి వారికంటే తక్కువైన స్థితిలో ఉంది అనుకున్నాడు.
మన ఆత్మీయ జీవితములో ఇతరులు, మరిముఖ్యముగా భక్తిహీనులతో పోల్చుకొనుట వలన మనము నిరాశ చెదకూడదు. మనము దేవుని చేతిలో ఉన్నాము, ఆయనే మన ఆధారము అనే సత్యము ఎరిగి నిలబడి ఉండాలి.
అయినను దీనిని తెలిసికొనవలెనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయివారి అంతమునుగూర్చి ధ్యానించువరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. -కీర్తనలు 73:16-17
ఈ వాక్యము ప్రకారము దేవుని సన్నిధిలో కనిపెట్టినపుడు సత్యము తెలుసుకొనే వరకే ఆ నిరాశ. ఒకసారి సత్యము తెలిసిన తరువాత ఇంక నిరాశ అనేది లేదు. ఆదాము మొదట సృష్టించబడినపుడు ఒంటరిగా ఉన్నాడు. అయితే అన్ని జంతువులకు పక్షులకు పేర్లు పెట్టాడు. ఒకవేళ ఆ జంతువులు ఆదాము కొరకు ఏదైనా సహాయము చేద్దామా, అతడు ఒంటరిగా ఉన్నాడు, ఎదైనా తోడు ఇద్దామా అని ఆలోచిస్తే, అవి ఏమీ చేయలేని పరిస్థితి. గనుక ఆదాము కొరకు ఏమైనా చెయ్యాలి అంటే అది దేవుడే చెయ్యాలి.
మనమున్న పరిస్థితిలో, మనకు సహాయము మనము నమ్ముకున్న దేవుని వలన తప్ప వేరే ఎవరి వలన అది సాధ్యము కాదు.
నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచియున్నావువారు నశించునట్లు వారిని పడవేయుచున్నావు క్షణమాత్రములోనే వారు పాడై పోవుదురు మహాభయముచేత వారు కడముట్ట నశించుదురు. మేలుకొనినవాడు తాను కన్న కల మరచిపోవునట్లు ప్రభువా, నీవు మేలుకొని వారి బ్రదుకును తృణీకరింతువు. నా హృదయము మత్సరపడెను. నా అంతరింద్రియములలో నేను వ్యాకులపడితిని. నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని నీ సన్నిధిని మృగమువంటి వాడనైతిని. అయినను నేను ఎల్లప్పుడు నీయొద్దనున్నాను నా కుడిచెయ్యి నీవు పట్టుకొని యున్నావు. నీ ఆలోచనచేత నన్ను నడిపించెదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నా కక్కర లేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై యున్నాడు. నిన్ను విసర్జించువారు నశించెదరు నిన్ను విడిచి వ్యభిచరించువారినందరిని నీవు సంహరించెదవు. నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వకార్యములను నేను తెలియజేయునట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చియున్నాను. -కీర్తనలు 73:18-28
దేవుని సన్నిధిలో ఆసాపు కనిపెట్టినపుడు, దేవుడు అతడికి చుట్టు ఉన్న భక్తిహీనుల పరిస్థితి కనపరచినపుడు, సత్యము తెలిసింది. వెంటనే నేను పశుప్రాయుడను అని ఒప్పుకొన్నాడు. నిన్ను పిలిచిన దేవుడు దేని నిమిత్తము పిలిచాడో, ఎన్నుకొన్నాడో, నీకు అర్థముకాదు గానీ, ఆయన గొప్ప ఉద్దేశ్యములు నీ యెడల కలిగి ఉన్నాడు. మనకు ఏది అవసరమో అది మన దేవుడికే తెలుసు.
అందుకే చివరికి కీర్తనాకారుడు ఇలా చెప్పగలుగుతున్నాడు – “నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై యున్నాడు”. గనుక మనము కూడా ఈ సత్యము ఎరిగి దేవుని యెడల నిజమైన భక్తి కలిగి యదార్థముగా, ధైర్యముగా నిలబడదాము.
అందుకే యేసయ్య “మొదట నా నీతిని, రాజ్యమును మొదట వెతకండి” అని చెప్పుచున్నాడు. అప్పుడు నీకు అవసరమైనవన్నీ ఆయనే సమకూర్చేవాడుగా ఉన్నాడు. అప్పుడు మనము కూడా – “నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వకార్యములను నేను తెలియజేయునట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చియున్నాను” అని చెప్పగలుగుతాము. నీ దేవుని నియమము మారేది కాదు, తప్పిపోయేది కాదు.
