26-01-2025 – ఆదివారం మొదటి ఆరాధన – నీ రక్షణను కొనసాగించు

ఆరాధన వర్తమానము

ఇది సంతోషించవలసిన స్థలము, సమయము అయి ఉంది. దేవుని యొక్క సన్నిధిని బట్టి మన జీవితములో ఖచ్చితముగా సంతోషము కలుగుతుంది. ఈ భూలోకములో మనము అనేకమైన పరిస్థితుల గుండా మనము వెళ్ళవలసి వస్తుంది. అయితే ఒక స్థలములో మాత్రము ఖచ్చితముగా సంతోషముంటుంది, అదే దేవుని సన్నిధి.

దేవుని సన్నిధి ఆశ్రయ దుర్గము అని దావీదు చెప్పుచున్నాడు. ఏమి కనుగొని ఈ మాటలు దావీదు చెప్పుచున్నాడు? ఎందుకు మాటి మాటికీ ఆయన సన్నిధికి పరిగెట్టేవాడిగా ఉంటున్నాడు?

నా మంచముమీద నిన్ను జ్ఞాపకము చేసికొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరకినట్లుగా నా ప్రాణము తృప్తిపొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్నుగూర్చి గానముచేయుచున్నది -కీర్తనలు 63:4-5

దావీదు తన మంచము మీదనే ఉన్నాడు గానీ తాను దేవుని సన్నిధిలో ఉంటున్నాను అని చెప్పుచున్నాడు. తాను తరుమబడుతున్న సమయములో ఈ మాటలు చెప్పుచున్నాడు. తన జీవితములోని శ్రమ దినములో, కష్ట సమయములో తాను తన దేవుని గూర్చి జ్ఞాపకము చేసుకుంటున్నాడు.

–ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ము కొను నా దేవుడని నేను యెహోవానుగూర్చి చెప్పుచున్నాను. -కీర్తనలు 91:2

ఆయనే ఆశ్రయము, నా కోట మరియు నేను నమ్ముకొను నా దేవుడు అని దావీదు చెప్పుచున్నాడు. షద్రకు, మేషాకు అబెద్నగోలు కూడా అగ్ని గుండములో వేయబడునప్పుడు, “మా దేవుడు మమ్ములను రక్షించగల సమర్థుడు” అని రోషము కలిగి రాజు యెదుట చావు భయము లేకుండా చెప్పగలిగారు.

వారు దేవుని గూర్చి ఏమి నమ్మారో, ఏమి ప్రకటించారో అదే వారి జీవితములో దేవుడు నెరవేర్చి వారిని రాజు ఎదుట ఘనపరచి, తన నామమును మహిమపరచుకున్నారు.

ఈ రీతిలో దేవునికి సాక్షిగా నిలబడాలి అంటే, ఉన్నతమైన ఆత్మీయ స్థితి కావాలి. అనగా నా దేవుడు నేను అడిగింది చేసినా చెయ్యకపోయినా, రక్షించినా రక్షించకపోయినా ఆయనే నా దేవుడు అనే ఆటిట్యూడ్ ఉండాలి. అప్పుడు మనము బహు బలము కలిగిన వారిగా మనము ఈ లోకములో జీవించగలుగుతాము.

నీవు నీ ఎదుట ఉన్న పరిస్థితిని చూసి నీవు భయపడుతున్నావు అంటే నీ ఆత్మీయ జీవితము బలముగా లేదు అని అర్థము. అదే నీవు భయపడక నీ దేవుని యందలి ధైర్యమును ప్రకటిస్తే నీ ఆత్మీయ జీవితము బలముగా ఉంది అని అర్థము.

దావీదు తన మంచము మీద, రాత్రి కాలమున దేవుని గూర్చి ఏమి జ్ఞాపకము చేసుకుంటున్నాడు? “ఆయనే ఆశ్రయము, నా కోట మరియు నేను నమ్ముకొను నా దేవుడు” అని జ్ఞాపకము చేసుకుంటున్నాడు, అప్పుడు –

క్రొవ్వు మెదడు నాకు దొరకినట్లుగా నా ప్రాణము తృప్తిపొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్నుగూర్చి గానముచేయుచున్నది -కీర్తనలు 63:5

దావీదు ఉన్న స్థితి ఒక శ్రమ దినము. అయితే తాను దేవుని సన్నిధిలో ఉన్న దానిని గూర్చి తన హృదయము తృప్తిపరచబడుతుంది. నీవు కూడా నీ దేవుని సన్నిధిలో ఆయన ఏమై ఉన్నాడో జ్ఞాపకము చేసుకుంటే, నీ హృదయము కూడా తృప్తిపరచబడుతుంది,

వేటకాని ఉరిలోనుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండ నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము, కేడెమును డాలునై యున్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను వేయి మంది పడినను నీ కుడిప్రక్కను పదివేలమంది కూలినను అపాయము నీ యొద్దకురాదు. నీవు కన్నులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును -కీర్తనలు 91:3-8

ఇక్కడ దావీదు తాను నమ్మిన దేవుడు ఏమి చేయగలుగుతాడో తాను ప్రకటించాడు. ఈ కీర్తన మోషే రాసినప్పటికీ దావీదు తన దేవుని గూర్చిన ఆ సత్యమైన మాటలు, తన శ్రమ దినములో జ్ఞాపకము చేసుకుంటున్నాడు. ఏ బాణము మీదికి వచ్చినా అది జయము పొందదు, దేవుడే ఆశ్రయముగా, దుర్గముగా కాపాడేదిగా ఉంటుంది.

–యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసికొనియున్నావు నీకు అపాయమేమియు రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు -కీర్తనలు 91:9-10

నీ దేవుని గూర్చి నీవు ఏమి నమ్మి ఆయననే ఆశ్రయముగా నివాస స్థలముగా చేసుకొన్నావో, ఆ కారణమున అపాయమేమీ రాదు అని ఏ తెగులు నీ గుడారము సమీపించదు.

అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చె దను శ్రమలో నేనతనికి తోడై యుండెదను అతని విడిపించి అతని గొప్ప చేసెదను దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను నా రక్షణ అతనికి చూపించెదను. -కీర్తనలు 91:14-16

మన జీవితములో ఎన్ని శ్రమలున్నా సరే, మన విశ్రమ స్థానము దేవుని సన్నిధి మాత్రమే. అయితే నీ దేవుడు ఏమి అయ్యున్నాడో ఎరిగితే మాత్రమే ఇది సాధ్యము అవుతుంది,

యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. -యిర్మీయా 10:10

మన దేవుడు నిజమైన దేవుడు. మోషేను ఐగుప్తు వెళ్ళమని దేవుడు చెప్పమన్నప్పుడు, నీ పేరు ఏమని చెప్పాలి అని మోషే అడిగినప్పుడు, “ఉన్నవాడు అనువాడను” అని దేవుడు తన పేరు చెప్పమని అన్నాడు. మన జీవితములో అనేక సార్లు అసలు దేవుడున్నాడా? అనే ఆలోచన మనము కలిగి ఉంటాము. అయితే నీవున్న శ్రమ కఠినమైనదే, దానికంటే ఖచ్చితమైన సత్యము నీ దేవుడు ఉన్నవాడు, నిన్ను చూచుచున్నవాడు.

మన దేవుడు నిజమైన దేవుడు అంటే ఎలా మనము అర్థము చేసుకోవాలి? నీవు ఏమి ఆయన గూర్చి ఏమి నమ్ముతున్నావో, దానిని నీకొరకు చేసేవాడు. దానినే నీ జీవితములో ప్రత్యక్షపరచేవాడు.

అందుకే ఆయనను సంపూర్ణముగా మనము విశ్వసించాలి, మన దేవుడు బలవంతముగా ఏమీ చెయ్యడు. ఆయన చేసేది ప్రేమతోనే చేస్తాడు. ఆయన నిజమైనవాడు, జీవము కలవాడు, ఆయనే సదాకాలము రాజు అయి ఉన్నాడు.

నీ దేవుని గూర్చి నీవు ఏమి నమ్మి చెప్పగలుగుతావో, అదే నీ జీవితములో ప్రత్యక్షపరచబడుతుంది.

యెహోవా రోషముగలవాడై ప్రతికారము చేయువాడు, యెహోవా ప్రతికారముచేయును; ఆయన మహోగ్రతగలవాడు, యెహోవా తన శత్రువులకు ప్రతికారము చేయును, తనకు విరోధులైన వారిమీద కోపముంచుకొనును.౹ -నహూము 1:2

అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు.౹ -1 పేతురు 2:9

తనకు విరోధులైన వారిమీద దేవుడు తన ఉగ్రతను కనపరచేవాడిగా ఉన్నాడు. అయితే నీవు నేను ఆయన సొత్తై ఉన్నాము. ఆయన రాజై ఉన్నాడు గనుక, ఆయనకు ఒక రాజ్యముంటుంది, ఆ రాజ్యములో తన ప్రజలుంటారు. తన ప్రజలకు అపాయము కలిగించేవారు, నష్టము కలిగించేవారు ఆ రాజుకు శత్రువులుగా ఉంటారు. గనుక నీ జీవితములో ఉన్న శ్రమ, నష్టము, కష్టము నీ దేవునికి శత్రువులుగా ఉంటున్నాయి. ఆ పరిస్థితులపై రోషముకలిగి, మహోగ్రతకలిగినవాడుగా ఉన్నాడు. గనుక నీ విరోధి అయిన పరిస్థితి ఖచ్చితముగా ముగించబడవలసినదే.

ఈ రోజు మనకు దేవుడు నేర్పుతున్న సత్యము ఏమిటి అంటే – “నీ దేవుని గూర్చి నీవు ఏమి నమ్మి చెప్పగలుగుతావో, అదే నీ జీవితములో ఆయన నెరవేరుస్తాడు, ప్రత్యక్షపరుస్తాడు.” గనుక ఈ సత్యమును ప్రతీ దినము మనము లేవగానే ప్రకటిద్దాము, ఆ ప్రత్యక్షతను మనము అనుభవిద్దాము.

రాజు పరిపాలన చేస్తాడు అని మనకు తెలుసు. అంటే ఏమిటి? తన ప్రజలు, సురక్షితముగా, సుభిక్షముగా ఉండులాగున సమస్తము సమకూర్చి, ఆజ్ఞలు జారీ చేసి, తన రాజ్యమును స్థిరపరుస్తాడు.

మనము సంతోషించే స్థలములో ఉన్నాము. ఆయన సన్నిధిలో పూర్ణ సంతోషము కలదు. ఈ సంతోషము ఎవరికోసము అంటే, ఆయన బిడ్డలమైన మనకోసమే! మన తండ్రి తన పిల్లలకొరకు సిద్ధపరచి, దాచి ఉంచేవాడు. ఆయన దాచిన మేలు నీవు ఈ దినము అనుభవించాలి.

ఆరాధన గీతము

దేవా నీకే నా స్తుతి పాడెదన్

మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును; మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అటువలె మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరల చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీయొద్దనుండి తీసివేయడు.౹ -యోహాను 16:20,22

 

 

వారము కొరకైన వాక్యము

క్రీస్తును కలిగి ఉండుట ఎంతో గొప్ప భాగ్యము. ఆయనను బట్టియే మనకు పరలోకమునుండి రక్షణ దయచేయబడింది. ఈ రక్షణను బట్టియే మనకు సమస్తము జరిగించబడుతుంది. ఈ రక్షణను ఎంతో ఉన్నతమైనదానిగా, విలువైన దానిగా మనము చూడాలి. అలాకాకపోతే, అపవాది చీకటిలోనికి మనలను కొనిపోయి నాశనముచేసేదిగా ఉంది. అయితే మన ప్రభువు వెలుగై ఉన్నాడు, మనలను వెలుగుగా చేసి ఉన్నాడు. గనుక ఈ రక్షణ ఎంతో విలువైన దానిగా మనము చూడాలి.

ఈ అంత్య దినములలో రక్షణ యొక్క విలువ అర్థము చేసుకోలేని వారిగా ఉంటున్నారు. మనము అలా ఉండకూడదు.

కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడును విధేయులై యున్న ప్రకారము, నాయెదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి యెక్కువగా నేను మీతో లేని యీ కాల మందును, భయముతోను వణకుతోను మీ సొంతరక్షణను కొనసాగించుకొనుడి.౹ -ఫిలిప్పీయులకు 2:12

మనము బాప్తీస్మము తీసుకున్నతరువాత మొదటి కొన్నిరోజులు ఎంతో నిష్టగా ఉంటాము. దినములు గడిచే కొద్దీ కొంచెం కొంచెం నిర్లక్ష్యము చేసేవారిగా ఉంటాము.

మీకు కలుగు ఆ కృపనుగూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణనుగూర్చి పరిశీలించుచు, తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైనశ్రమలనుగూర్చియు, వాటి తరువాత కలుగబోవు మహిమలనుగూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చునపుడు, ఆ ఆత్మ, యే కాలమును ఎట్టి కాలమును సూచించుచువచ్చెనో దానిని విచారించి పరిశో ధించిరి.౹ -1 పేతురు 1:10

ఇక్కడ చూస్తే ఆ ప్రవక్తలకు రక్షణ దొరకలేదు గానీ, రాబోవు రక్షణ గూర్చి పరిశీలించినవారిగా ఉన్నారు. ఏ కాలమున ఈ రక్షణ అనుగ్రహించబడుతుంది? ఈ రక్షణబట్టి ఏమి జరుగుతుంది అని పరిశీలించి ఒక విషయమును కనుగొన్నారు. ఏమిటి అంటే- “క్రీస్తు విషయమైనశ్రమలు ఉంటాయి, వాటి తరువాత మహిమ కలుగుతుంది”. అంటే శ్రమ వెంబడి మహిమ వెంబడించేదిగా ఉంటుంది.

కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొనిపోకుండునట్లు వాటియందు మరి విశేష జాగ్రత్త కలిగియుండవలెను.౹ ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున, ప్రతి అతి క్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా౹ ఇంత గొప్ప రక్షణను మనము నిర్ల క్ష్యముచేసినయెడల ఏలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుటచేత ఆరంభమై, దేవుడు తన చిత్తానుసారముగా సూచకక్రియలచేతను, మహత్కార్యములచేతను, నానావిధములైన అద్భుతములచేతను, వివిధము లైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుటచేతను, వారితోకూడ సాక్ష్యమిచ్చుచుండగా వినినవారిచేత మనకు దృఢ పరచబడెను. -హెబ్రీయులకు 2:1-3

రక్షణ ఏమిటో తెలిస్తే నీవు అసలు ఏమి నిర్లక్ష్యము చేస్తున్నావో తెలుస్తుంది.

ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను – లూకా 1:68

ఆయన సన్నిధిలో పరిశుద్ధముగా జీవించడానికి ఈ రక్షణ అనుగ్రహించబడింది. ఆయనను సేవించడానికి ఈ రక్షణ అనుగ్రహించబడింది. అసలు ఎక్కడ మనము పరిశుద్ధతను నిర్లక్ష్యము చేస్తున్నాము? దేవుని వాక్యము ప్రకారముగా నీ జీవితము లేకపోతే ఆ రక్షణను నిర్లక్ష్యము చేస్తున్నాము అని అర్థము.

నీ రక్షణను కొనసాగించాలి అంటే వాక్యము ప్రకారముగా జీవించుటలో నిర్లక్ష్యము ఉండకూడదు. అంతే కాక, ఆ రక్షణను శ్రద్ధగా కొనసాగించిన యెడల, నీ జీవితములో సమస్తము ప్రభువు బోధించుట చేత ప్రారంభమై, దేవుడు తన చిత్తాను సారముగా సూచక క్రియలచేత స్థిరపరచబడతుంది.

నీవు రక్షణ పొందినపుడు, ఎవరైతే క్రీస్తునందుంటారో వారు నూతన సృష్టి అని బోధించబడింది. ఆ రక్షణను నీవు కొనసాగిస్తే, ఆ చెప్పబడిన నూతనమైనది స్థిరపరచబడుతుంది.

నీ జీవితములో రక్షణ యొక్క ఉద్దేశ్యము ఏమిటి అంటే నీవు జీవించడమే కాదు గానీ, అనేకులను సాక్షులుగా నిలబెట్టడానికే. గనుక నీ రక్షణ నీవు నిర్లక్ష్యము చేయకూడదు. దానికి మొదటిగా నీవు దేవుని యందలి భయము నీవు కలిగి ఉండాలి.

నీ రక్షణ శ్రద్ధగా కొనసాగించాలి అంటే నీవు దేవుని యందలి భయము నీవు ఖచ్చితముగా కలిగి ఉండాలి. ఫిలిప్పీయులలో చెప్పబడిన “నేను లేని కాలమందు” అంటే, ఎవరూ లేకుండా ఒంటరిగా ఉన్నప్పుడు సహితము, దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయము కలిగి పరిశుద్ధతను కాపాడుకోవాలి.

ఎవరు నిన్ను చూస్తున్నా చూడకపోయినా, నీవు ఒంటరిగా ఉన్నా, నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు అనే భయము కలిగి నీ రక్షణ నీవు కొనసాగించాలి. ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ నీ పై ఉంటుంది.