30-Oct-2022 – ఆదివారము ఆరాధన – అంగీకరించే మనసు కలిగి ఉండుట

స్తుతి మహిమ యేసు నీకే – స్తుతి ఘనత ప్రభు నీకే

స్తుతి మహిమ యేసు నీకే
స్తుతి ఘనత ప్రభు నీకే (2)
ఆరాధన స్తుతి ఆరాధన (8) ||స్తుతి||

కళ్ళల్లో కన్నీరు తుడిచావు
గుండె బరువును దింపావు (2)
వ్యధలో ఆదరించావు
హృదిలో నెమ్మదినిచ్చావు (2)
యెహోవా షాలోమ్ ఆరాధన (8) ||స్తుతి||

నీవొక్కడవే దేవుడవు
మిక్కిలిగా ప్రేమించావు (2)
రక్తము నాకై కార్చావు
రక్షణ భాగ్యమునిచ్చావు (2)
యెహోవా రోహీ ఆరాధన (8) ||స్తుతి||

నను బ్రతికించిన దేవుడవు
నాకు స్వస్థత నిచ్చావు (2)
నా తలను పైకెత్తావు
నీ చిత్తము నెరవేర్చావు (2)
యెహోవా రాఫా ఆరాధన (8) ||స్తుతి||

నాముందు నీవు నడిచావు
నాకు తలుపులు తెరిచావు (2)
ప్రాకారములను కూల్చావు
ప్రాకారముగా నిలిచావు (2)
యెహోవా నిస్సీ ఆరాధన (8) ||స్తుతి||

నీ కృపను గూర్చి నే పాడెదా నీ ప్రేమను గూర్చి

నీ కృపను గూర్చి నే పాడెదా నీ ప్రేమను గూర్చి

ప్రకటించెదా (2)
నిత్యము నే పాడెదా నా ప్రభుని కొనియాడెదా (2)
మహిమా ఘనతా ప్రభావము చెల్లించెదా. (2)

1.ఇరుకులో ఇబ్బందిలో ఇమ్మానుయేలుగా
నిందలో అపనిందలో నాకు తోడునీడగా (2)
నా యేసు నాకుండగా నా క్రీస్తే నా అండగా
భయమా దిగులా మనసా నీకేలా (2)

2.వాక్యమై వాగ్దానమై నా కొరకే ఉదయించినా
మరణమై బలియాగమై నన్ను విడిపించినా (2)
నా యేసు నాకుండగా నా క్రీస్తే నా అండగా
భయమా దిగులా మనసా నీకేలా (2)

3.మార్గమై నా గమ్యమై నన్ను నడిపించినా
ఓర్పుయై ఓదార్పుయై నన్నాదరించినా (2)
నా యేసు నాకుండగా నా క్రీస్తే నా అండగా
భయమా దిగులా మనసా నీకేలా (2)|

ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి

ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి

దేవా నీదు క్రియలు అద్బతములై యున్నవి
నే పాడెదన్ నేచాటెదన్ నీదు నామం భువిలో
సన్నుతించెదనూ నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా

హాలేలూయ హాలేలూయ
భరియింపరాని దుఃఖములు యిహమందు నను చుట్టిన
నా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి
నా వేదనంతటిని నాట్యముగా మార్చితివి
నీదు సాక్షిగా యిలలో జీవింతునూ..
…సన్నుతించెదనూ…

హాలేలూయ హాలేలూయ
లోకములో నేనుండగా నే నిర్మూలమైన సమయములో
నూతన వాత్సల్యముచే అనుదినము నడిపితివి
నిర్దోషిగ చేయుటకై నీవు దోషివైనావు
నీదు సాక్షిగా యిలలో జీవింతునూ..
…సన్నుతించెదనూ…

ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి
దేవా నీదు క్రియలు అద్బతములై యున్నవి
నే పాడెదన్ నేచాటెదన్ నీదు నామం భువిలో
సన్నుతించెదనూ నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా

ఆరాధన వర్తమానం

అప్పుడు లేవీయులైన యేషూవ కద్మీయేలు బానీ హషబ్నెయా షేరేబ్యా హోదీయా షెబన్యా పెతహయా అనువారునిలువబడి, నిరంతరము మీకు దేవుడైయున్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఈలాగు స్తోత్రము చేసిరి సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక. నీవే, అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండునది అంతటిని, సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటినన్నిటిని కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. – నెహెమ్యా 7:5,6.

“నిరంతరము మీకు దేవుడైయున్న యెహోవా” ఈ మాట చాల ప్రాముఖ్యమైనది మనము ఎప్పుడూకూడా జ్ఞాపకము పెట్టుకోవాలి. అలాగే ” సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ (దేవుని) ఘనమైన నామము” అనగా అన్ని ఆశీర్వాదములకు మించిన ఘనత కలిగిన నామము మన దేవుని నామము. మన దేవుని గొప్పదనాన్ని వర్ణించుటకు మన జీవితము, జ్ఞానములు సరిపోవు.

అలాగే ఆకాశమహాకాశ భూసముద్రములను వాటిలోని సమస్తమును సృష్టించి వాటిని కాపాడుచున్నవాడు మన దేవుడు. దీనిని బట్టి మనము గ్రహించవలసినది ఏమిటంటే, నీవు నేను కూడా ఆయన చేత సృష్టించబడ్డాము అంటే ఆయన చేతనే మనము కాపాడబడేవారము. మనము కలిగి ఉన్న ప్రతీదీ ఆయనను బట్టే మనము కలిగి ఉన్నాము.

ఒక్కోసారి మన జీవితములలో గిద్యోను వంటి అనుభవము “దేవుడే మనకు తోడైఉండినయెడల ఇదంతా ఎలాగు సంభవించెను?” ఉంటుంది. అయితే మనము మన జీవితాన్ని వాక్యములో కట్టుకోవాలి అప్పుడు మనము కదల్చబడము. మనలను సృష్టించిన దేవుడు మనలను కాపాడువాడు గనుక మనము కదల్చబడము. ఇది సత్యము అని నీవు ఎరిగియున్నట్టయితే నీ నెగటివ్ పరిస్థితులలో కూడా నీవు కదల్చబడవు.

వారు విధేయులగుటకు మనస్సు లేనివారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసికొనక తమ మనస్సును కఠినపరచు కొని, తాముండి వచ్చిన దాస్యపుదేశమునకు తిరిగి వెళ్లుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగు బాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంత మును బహు కృపయు గలవాడవునై యుండి వారిని విసర్జింపలేదు. – నెహెమ్యా 7:17.

మనము దేవుని విసర్జించిన పరిస్థితులలో మనము చేసిన తిరుగుబాటును బట్టి అనేకమైన శ్రమల గుండా వెళ్ళవలసిన పరిస్థితులు వస్తాయి. ఇదేవిధముగా ఇశ్రాయేలు ప్రజల జీవితములో కూడా జరుగుట చూస్తాము. అయినప్పటికీ
మనము దేవుని విసర్జించిన పరిస్థితులలో ఆయన మనలను విడిచిపెట్టడు కాని, క్షమించుటకు సిద్ధమైన హృదయము కలిగినవాడు కనుక క్షమించమని వచ్చినవెంటనే మనలను క్షమించి తిరిగి సమకూర్చేవాడుగా ఉన్నాడు మన దేవుడు.

నీ జీవితములో ఏమైతే ముగించాలో దానిని ముగించి ప్రారంభించవలసినది ప్రారంభించువాడునై ఉన్నాడు మన దేవుడు.

అయితే నీవు మహోపకారివై యుండి, వారిని బొత్తిగా నాశనముచేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కృపాకనికర ములుగల దేవుడవై యున్నావు. – నెహెమ్యా 7:31

నీ స్థితిగతులు బాగాలేనప్పుడు దేవుని కనికరము నీమీద పనిచేస్తుంది. ఇశ్రాయేలు ప్రజల జీవితములో కూడా యుద్ధాలు వచ్చినప్పుడు శ్రమలు కలిగినప్పుడు దేవుని ఇలాగే కోరుకోనేవారు. దేవా నీ కృపాకనికరములు మా మీద చూపించుమని వేదుకున్నారు. అలాగే మనము కూడా ప్రతీ పరిస్థితిలో ఈ విధముగా ఆయనను ప్రార్థిద్దాము. ఈరోజు మనము తెలుసుకున్న సత్యములను బట్టి మన దేవుని ఆరాధిద్దాము.

Worship Song | ఆరాధన గీతం

ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ
యేసయ్యా నీ ప్రేమానురాగం నను కాయును అను క్షణం

శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో
కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో
అర్ధమే కానీ ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా
కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి “ఎడ”

విశ్వాస పోరాటములో ఎదురాయె శోధనలు
లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో
దుష్టుల క్షేమము నే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా
దీర్ఘ శాంతము గలదేవా నా చేయి విడువక నడిపించితివి “ఎడ”

నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో
నా బలమును చుసుకొని నిరాశ చెందితిని
భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా
ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి “ఎడ”

Main Message | మెయిన్ మెసేజ్

“అంగీకరించే మనస్సు” అనేది మన అధ్యాత్మిక జీవితములో అత్యంత ప్రాముఖ్యమైనది. అంగీకరించే మనస్సు లేకుండా ప్రభువు కార్యములు మన జీవితములో చూడలేము.

ఏలీయా దినములయందు మూడేండ్ల ఆరు నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరవు సంభవించినప్పుడు, ఇశ్రాయేలులో అనేకమంది విధవరాండ్రుండినను, ఏలీయా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న యొక విధవరాలియొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు – లూకా 4:25-26.

ఆ ఊరిలో అంతమంది ఉండగా ఆమె యొద్దకే ఏలియాను దేవుడు పంపాడు? ఆమె ధనవంతురాలా? దేవునికి ఆమె స్థితి తెలియదా? ఈరోజు ఈ విషయము ధ్యానము చేద్దాము.

అంతట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెనునీవు సీదోను పట్టణ సంబంధ మైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము; నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక విధవరాలికి నేను సెల విచ్చితిని. 1 రాజులు 17:8,9

ఇక్కడ ఆ విధవరాలైన స్త్రీకి ఈ సంగతులు అనగా దేవునికి ఏలియాకు మధ్య జరిగిన సంభాషణ తెలియదు. అయితే ఆమె స్థితి మార్చడానికి ప్రభువు ఆలోచన కలిగి ఉన్నాడు.

అందుకామె నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నాయొద్దనున్నవే గాని అప్పమొకటైన లేదు, మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసికొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితిననెను. – 1 రాజులు 17:12.

“నీ దేవుడైన యెహోవా జీవముతోడు” అని ఆమె ఎందుకు చెప్పింది? ఏమి ఉద్దేశ్యము కలిగి ఆ మాట చెప్పింది. ఈమె దేవుని యందు భయము కలిగినది గనుక, జీవము గలిగిన దేవుడైన యెహోవా, సమస్తము ఎరిగిన యెహోవా ఎదుట సత్యమే చెప్పుచున్నాను కానీ అబద్ధమాడుటలేదు అని అర్థము. దీనిని బట్టి “దేవుని యందు భయము కలిగినది” అని మనము గమనించవచ్చు.

మన జీవితములో దేవుని కార్యము జరగాలి అనే ఆశ ఉంటుంది కానీ దేవుని యందలి భయము కలిగి ఉండము. అయితే దేవుని వాక్యము ఇలా సెలవిస్తుంది –

వారికిని వారి సంతాన మునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనస్సు వారికుండిన మేలు. – ద్వితీయోపదేశకాండము 5:29.

మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగముచేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించినయెడల మీకు క్షేమము కలుగును. – 1 సమూయేలు 12:14.

ఆ సారెఫతులోని విధవరాలి జీవితములో క్షేమము కలగటానికి కారణము దేవునియందలి భయము కలిగి ఉండుటయే. ఏలియా అంతకుముంది ఎరిగిన వాడుకాడు. పోని ముందుగా చెప్పి వచ్చిన వ్యక్తి కూడా కాదు. అయినా కూడా ఆ స్త్రీ దేవుని యెదుట భయము సత్యముగా కలిగి ఉంది.

యేలియా ఆత్మీయమైన కొనసాగింపు అవరసము కలిగినవాడు మరియు ఆ విధవరాలు శారీరకమైన కొనసాగింపు అవరము కలిగినది. ఆత్మీయముగానైనా శారీరకముగానైనా మన దేవుడే చెయ్యగలడు. దీనికై మనము ఆయనయందు భయము కలిగి ఉండుట అవసరమైనది.

అలాగే ఈ స్త్రీలో రెండవ లక్షణము “యదార్థత”. యేలియా తనను అప్పము అడిగినప్పుడు, తన వద్ద ఏమి ఉందో ఎంత ఉందో దాచక యేలియాకు తెలియజేసింది. ఊరికే చెప్పలేదు గానీ యేలియా దేవుని ప్రవక్త అని ఎరిగినదై, “నీ దేవుడైన జీవము తోడు… ” అని చెప్పినది.

నా దేవా, నీవు హృదయ పరిశోధనచేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేనెరుగుదును; నేనైతే యథార్థహృదయము గలవాడనై యివి యన్నియు మనఃపూర్వకముగా ఇచ్చి యున్నాను; ఇప్పుడు ఇక్కడనుండు నీ జనులును నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను – 1 దినవృత్తాంతములు 29:17.

దేవుని యందలి భయము కలిగి యదార్థత కలిగి ఉన్నట్టయితే ఆయన మనయందు ఇష్టము కలిగినవాడై ఉంటాడు. ఈ స్త్రీ కూడా అదేవిధముగా ఉంది అందుకే దేవుడు ఆమె యందు ఇష్టము కలిగినవాడై, ఆమె స్థితి మార్చుటకై ఏలియాను ఆమె యొద్దకు పంపాడు.

అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవినియొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసికొనిరమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోవుచుండగా అతడామెను మరల పిలిచినాకొక రొట్టెముక్కను నీ చేతిలో తీసికొని రమ్మని చెప్పెను… అప్పుడు ఏలీయా ఆమెతో ఇట్లనెనుభయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము; అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదటచేసి నాయొద్దకు తీసికొనిరమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసికొనుము. – 1 రాజులు 17:10,11,13.

ఇక్కడ మొదట ఏలియా నీళ్ళు అడిగాడు ఆ తరువాత అప్పము అడిగాడు. అప్పుడు తన స్థితిని చెప్పినప్పుడు, ఏలియా మొదటి అప్పము తనకు ఇచ్చి తరువాత వారికొరకై చేసుకొమ్మని చెప్పగా, ఆమె అంగీకరించింది. నీవు నేను అయితే మాకే లేదంటే ముందు నీకు చెయ్యాలా అనే ఆలోచన కలిగి ఉంటాము లేదా మనము మాటలుకూడా అంటాము.

అయితే ఏలియా మాట అంగీకరించింది. ఎందుకంటే ఏలియా దేవునికి సంబంధించినవాడు అని ఎరిగినదై, దేవుని యెదుట యాదర్థముగా ప్రవర్తించింది. అలాగే దేవుని కార్యముగా ఆమె ఏలియాను అంగీకరించింది. దేవుని మాటలో జీవమే గాని నాశనము లేదు. ఆ జీవమే ఆమె జీవితములో ఆశ్చర్యకార్యము జరిగించబడింది. మరి ముఖ్యముగా ఇచ్చే విషయములో దేవుని మాటకు లోబడుట అత్యంత ప్రాముఖ్యము.

భూమిమీద యెహోవా వర్షము కురిపించువరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువకాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చియున్నాడు అనెను. అంతట ఆమె వెళ్లి ఏలీయా చెప్పిన మాటచొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె యింటి వారును అనేకదినములు భోజనముచేయుచు వచ్చిరి – 1 రాజులు 17:14,15.

ఇదంతా ఎప్పుడు జరిగింది? “దేవుని వలన బయలుపరచబడిన మాట ప్రకారము చేసినప్పుడు” జరిగింది.

సారెఫతు విధవరాలి జీవితములో మనము చూసిన లక్షణాలు

1. దేవుని యందలి భయము
2. దేవుని యెదుట యదార్థత
3. దేవుని మాట అంగీకరించుట
4. దేవుని మాట ప్రకారము చేయుట

నీవు నేను కూడా అదేవిధముగా మన జీవితాలను సిద్ధపరచుకుంటే మన శారీరకమైన ఆశీర్వాదములు, ఆత్మీయమైన ఆశీర్వాదములు పొందుకునేవారిగా ఉండి ప్రభువు నామమును మహిమ పరచగలుగుతాము.

దేవుడు ఏలియాతో “నేను సెలవిచ్చితిని” అని చెప్పాడు. అయితే ఆమెతో ఏమి చెప్పలేదు. కానీ ఆమె హృదయమును ఆమె లక్షణములు ఎరిగినవాడు గనుక ఏలియాతో అలా చెప్పాడు. ఏ నమ్మకమైతే దేవుడు ఆమె మీద ఉంచాడో ఆ నమ్మకాన్ని వమ్ము చెయ్యలేదు. ఆమె దేవుని పని జరుగుటలో ఆమె నమ్మకముగా ఉండగలిగింది అలాగే ఆమె దేవుని యెదుట సాక్ష్యముగా ఉండగలిగింది. మనము కూడా అలాగే సిద్ధపడదాము.