05-01-2025 – ఆదివారం మొదటి ఆరాధన

ఆరాధన వర్తమానము

తన సన్నిధిలో మనలను నిలబెట్టిన దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక! మనము నూతన సంవత్సరములో అడుగుపెట్టాము. ఈ నూతన సంవత్సరములో మనము సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి.

ప్రభువు ప్రతీ దానికీ ఒక లెక్క రాస్తూ ఉన్నాడు. ఆ లెక్క దేని కొరకు అంటే, ఏ విధముగా నీవు ప్రభువును వెంబడిస్తున్నావు? అనే విషయములో! గడచిన సంవత్సరములు చాలు, ప్రభువును వెంబడించుటలో ఆచార యుక్తముగా గడిపిన సమయము చాలు. అయితే ఈ నూతనమైన సంవత్సరములో మాత్రము ప్రభువుకొరకైన సాక్షిగా నిలబడాలి. దానికొరకు –

బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు. -సామెతలు 22:6

అంటే సంవత్సరపు మొదటి దినములనుండే దేవుని వెంబడించుట విషయములో ఆసక్తి లేకపోతే, గత సంవత్సరము వలెనే, అపవాది చేతిలో కీలుబొమ్మ వలే ఉండిపోతాము. ఈ సంవత్సరము ఒక అద్భుతమైన సంవత్సరముగా ప్రభువు మనకు ఇచ్చాడు. దానిని మనము సద్వినియోగము చేసుకోవాలి.

2024 చివరి వాక్కు ఏమిటి అని ఆలోచిస్తే, రాబోయే సంవత్సరములో భక్తి విషయములో జాగ్రత్త కలిగి ఉండాలి అని ప్రభువు చెప్పాడు. అలాగే దేవునికంటే విస్తారమైనది ఏదీ కూడా మన జీవితములో ఉండకూడదు. ఈ సంవత్సరము ఈ రెండువిషయములలో మనము జాగ్రత్త కలిగి, సరిచేసుకొని నిలబడదాము.

ఆయన అక్కడనుండి బయలుదేరి స్వదేశమునకు రాగా, ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతిదినము వచ్చినప్పుడు ఆయన సమాజమందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి–ఈ సంగతులు ఇతనికి ఎక్కడనుండి వచ్చెను? ఇతనికియ్యబడిన ఈ జ్ఞానమెట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి? ఇదేమి? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరు మనతో నున్నారు కారా? అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. -మార్కు 6:1-3

అక్కడ ప్రభువు బోధ వినిన వారు ఎంతో ఆశ్చర్యపోయారు. అయితే చివరికి ఆయన విషయములో అభ్యంతరపడినవారుగా ఉన్నారు. మరియ వద్దకు గొర్రెల కాపరులు వచ్చి చెప్పిన మాటలు, తన హృదయములో భద్రపరచుకొంది, ఆ విషయములను గూర్చి తలపోసుకొంటూ వుంది. అందుకనే కానా విందులో ఆమె మాత్రమే యేసయ్య వద్దకు అక్కడ ఉన్న సమస్యను తీసుకువెళ్ళింది. దాని అర్థము, ప్రభువు మాటలు, బోధ మనము విని, ఎల్లప్పుడు తలపోసుకొని, సమయము వచ్చినపుడు ఆ ప్రకారము చేయగలిగినపుడే, మనము ధన్యులముగా పిలువబడుతాము.

మరియను పరిశుద్ధాత్మ దేవుడు ఎలిజబెతు ద్వారా ధన్యురాలు అని అందుకే పిలిచినాడు. సిద్ధపాటు లేకుండా ప్రభువు సన్నిధికి రాకూడదు. ప్రభువు లేకుండా మనకు జీవితమే లేదు. చంపడానికి ఆహాబు ప్రయత్నిస్తున్నాడు, వాడికి దొరకుండా వుండాలి అంటే ప్రభువే ఆధారము.

ప్రభువు పెందలకడనే లేచి ప్రభువు దేవుని సన్నిధిలో కనిపెట్టేవాడు. మనము కూడా ఆయన బిడ్డలుగా దేవుని సన్నిధిలో ఉండటానికి ఆసక్తి కలిగినవారిగా ఉండాలి. నీకు దేవునికి మధ్య అడ్డుగా ఒకవేళ నీ పాపము ఉంటే, ప్రభువు సన్నిధిలో ఒప్పుకొందాము. నీ భక్తి విషయములో ఈ సంవత్సరము మాత్రము ఖచ్చితమైన తీర్మానము తీసుకుందాము.

మొదటి దినమున మనము నేను నీ వాడను దేవా అని ప్రకటించాము. ఈ ప్రకటన ఎంతో బలమైనది మరియు ప్రభావము కలది. ఇది మనము ఆత్మ మండలములో విత్తిన మాట, ఖచ్చితముగా అది ఫలిస్తుంది.

ఈరోజు దేవుడు స్తుతించదగిన వాడు ఎందుకు అంటే, ఈ సంవత్సరము నీ కొరకు సీజన్స్ అనగా నీ కొరైన సిద్ధపరచిన సమయములు ఆరంభిచేవాడుగా ఉన్నాడు. నీ జీవితమును నీవు కొనసాగించుచుండగా, దేవుడు నీ కొరకు సిద్ధపరచిన సమయమును నీవు స్వతంత్రించుకుంటావు. ఈ సంవత్సరమంతా నీ కొరకైన అనేకం సమయములు లేదా సీజన్స్ సిద్ధపరచాడు దేవుడు. ప్రతీ సీజన్ కూడా నీ జీవితమును కొనసాగించడానికే.

పేతురు అనేక సంవత్సరములుగా చేపలు పడుతున్నాడు గానీ, ఆ దినము దొరకలేదు. అయితే ప్రభువు మాట పట్టుకొని వెళ్ళినపుడు మాత్రము వారి దోనెలు నిండి పొర్లిపోయాయి. పక్కదోనెలుకూడా తెచ్చుకున్నారు. అలాగే ఈ సంవత్సరము మనము ఆయన మాట ప్రకారముగా మనము చేసినపుడు ఆయన సిద్ధపరచిన సీజన్స్ మనము అనుభవిస్తాము.

డిక్లరేషన్ అనేది ఎంతో బలమైనది. దేవా నీవే నా రాజువు అని డిక్లేర్ చేస్తే, ఆయన రాజ్యము మొదలవుతుంది. నేను ఆయన సొత్తైన వాడను గనుక నేను భయపడటానికి అవకాశము లేదు. నీకొరకు డిక్లేర్ చెయ్యబడిన పొలములో నీవే ఏమైనా చేయగలవు, అంతే కానీ భయపడవు కదా!

మనము డిక్లేర్ చేసిన తరువాత ప్రభువు ఏమి చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అని ఖచ్చితముగా గమనించాలి. ప్రభువు నిన్ను సృష్టించాడు ఖచ్చితముగా నీ మీద ఆయనకు ఒక ఉద్దేశ్యము ఉంటుంది. అయితే నీ ఉద్దేశ్యము యొక్క నెరవేర్పుకు ఒక సమయము ఉంటుంది. అయితే ఆ సమయము ఎప్పుడు? ఈ సంవత్సరము నీవే ప్రభువుకు సాక్షివి. అయితే ఎప్పుడు నీవు సాక్షివి? ఏ రోజు నీవు సాక్షిగా ఉంటావు అని ఆలోచిస్తే, ఏ రోజైతే నీవు విశ్వాసముతో నిలబడతావో ఆరోజే నీవు సాక్షివి.

ఆరాధన గీతము

తరతరములు ఉన్నవాడవు

 

వారము కొరకైన వాక్యము

ఈ పరిశుద్ధ దినమును ప్రభువు మనకిచ్చాడు, ఈ సంవత్సరమును, ఈ సంవత్సరము కొరకైన మాటలు మనకు ఇచ్చాడు మన దేవుడు. ఈ మాటలు మనము స్వతంత్రించుకోవాలి. ఎలా మనము ఈ మాటలు వాగ్దానములు స్వతంత్రించుకోవాలి అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. నీవు ఈ సంవత్సరము ఆయన సాక్షిగా ఉండటానికి నిన్ను నిర్ణయించుకున్నాడు.

ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తిచేసికొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము. -2 కొరింథీయులకు 7:1

దేవుడు అందరికీ వాగ్దానము చేసాడు. అయితే కొన్ని విషయములలో మనము సరిచేయబడవలసిన అవసరము ఉంది. అందుకే ప్రభువు మనకు ఈ విషయము జ్ఞాపకము చేస్తున్నాడు.

వాగ్దానము స్వతంత్రించుకోవాలి అంటే మొట్టమొదట మనము కలిగి ఉండవలసినది దేవుని భయము కలిగి ఉండుట. రెండవదిగా పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి, అనగా పరిశుద్ధతలో కొనసాగించబడాలి. పరిశుద్ధత లేకుండా వాగ్దానమును స్వతంత్రించుకోలేవు.

పరిశుద్ధత ఎలా మనము కలిగి ఉంటాము? వాక్యమే మనకు ఉదక స్నానము చేయిస్తుంది గనుక, వాక్య ప్రకారమే మన జీవితము ఉండాలి. వాక్యము ఎలా చెప్తే అలాగే మన జీవితము ఉండాలి. అలా కాకపోతే సాక్ష్యము అనే విషయము గూర్చి ఇంక మనము మర్చిపోవచ్చు.

అహాబు అనగా అపవాది మనలను నశింపచేయడానికి, మన జీవితమును ముగించడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే వాడికి అందకుండా ప్రభువు నిన్ను తప్పిస్తాడు అనేది వాగ్దానము. అయితే భక్తి లేకుండా, పరిశుద్ధత లేకుండా మనము ఏమీ చెయ్యలేము.

మూడవదిగా, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకోవాలి.

శరీరము ఎప్పుడూ కళ్ళముందు ఏముందో దానినే నమ్ముతుంది, దానినే వెంబడిస్తుంది. అయితే ప్రభువు వాగ్దానము ఉంది గనుక, శరీరము ఏమి చెప్పినా దానిని విడిచిపెడదాము, దానిని నమ్మవద్దు. శరీరము ఎప్పుడూ, దేవునికి వ్యతిరేకముగా ఉన్న విషయాలకే మనలను ప్రేరేపిస్తుంది.

శరీరము బలముగా పనిచేస్తున్నపుడు, ఆత్మ బలహీనపరచబడుతుంది. శరీరాన్ని మనము ఎలా అధిగమించాలి అనేది మనము వచ్చేవారము మనము తెలుసుకుందాము. శరీరము ఖచ్చితముగా నలగగొట్టబడవలసిందే. అప్పుడే వాగ్దానమును స్వతంత్రించుకుంటావు.

దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి గనుక మనద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయనవలన నిశ్చయములై యున్నవి. ౹ -2 కొరింథీయులకు 1:20

క్రీస్తులేకపోతే వాగ్దానమే లేదు. గనుక నీలో క్రీస్తు లేకపోతే వాగ్దానము నెరవేర్పు అనే ఆలోచనకు అవకాశమే లేదు. అయితే క్రీస్తు మనలో నివసించాలి అంటే-

నేను క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నే నిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసమువలన జీవించుచున్నాను.౹ -గలతీయులకు 2:20

క్రీస్తు నీలో ఉన్నప్పుడు, ఇంక నీది అంటూ ఏమీ ఉండకూడదు గానీ, నీ జీవితమంతా విశ్వాసము పైనే ఆధారపడి ఉండాలి. వెలిచూపు వలన కాదు గాని, విశ్వాసము వలననే మన జీవితము ఉండాలి. క్రీస్తు నీలో ఉంటే నీ ప్రేమ కాదు గానీ, క్రీస్తు ప్రేమ నీలో కనబడాలి.

క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు అనే సత్యమునకు 2025 లో నేనే సాక్షిని! ఆమేన్.

నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మ ను మీకనుగ్రహించును.౹ -యోహాను 14:16
ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీమీదికి పంపు చున్నాను; మీరు పైనుండి శక్తి పొందువరకు పట్టణములో నిలిచి యుండుడని వారితో చెప్పెను. -లూకా 24:49
వీరందరును, వీరితోకూడ కొందరు స్త్రీలును, యేసు తల్లియైన మరియయు ఆయన సహోదరులును ఏకమనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. -అపొస్తలుల కార్యములు 1:14

శిష్యులు ప్రభువు తమతో చెప్పిన వాగ్దానము గూర్చి ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. అయితే ప్రార్థన చేయడము అంటే, ఇవ్వబడిన వాగ్దానము కొరకు ప్రభువుతో ప్రార్థనలో మాట్లాడేవారుగా ఉండాలి. వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి అంటే, పట్టణములో నిలబడి, అదే వాగ్దానము కొరకు ఎడతెగక ప్రార్థన చేస్తూ కనిపెట్టుకొని వేచిఉండాలి. ఈ దినము వాగ్దానము నెరవేరబడుతుందా? వాగ్దానము నెరవేరకుండా ఏమైనా నాలో అడ్డుగా ఉందా? అని ఎడతెగక ప్రార్థనలో కనిపెట్టాలి.

యెడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. -లూకా 24:53

అలాగే దేవునికి స్తోత్రము, స్తుతి ఆరాధన ఖచ్చితముగా ఎడతెగక అర్పించాలి. వాగ్దానము నెరవేర్పు కొరకు నీవు ప్రయత్నిస్తుండగా, ఆ వాగ్దానమునుండి తప్పించడానికి అపవాది కూడా ప్రయత్నిస్తాడు. అయితే మనము ఎలా ఉండాలి?

–నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడియున్నది.౹ –నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పినదానినిబట్టి తాననేక జనములకు తండ్రి యగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను.౹ మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సుగలవాడైయుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని,౹ -రోమా 4:18-19

ఇక్కడ “విశ్వాసమందు బలహీనుడు కాక” అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. అబ్రహాముకు వాగ్దానము ఇవ్వబడింది, అయితే శరీరము మృతతుల్యమైనట్టుగా కనబడింది, అయితే అవిశ్వాసమునకు అస్సలు చోటే ఇవ్వలేదు. తన శరీరమును నలగ గొట్టి, దేవుని మహిమ పరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను.

సమర్థుడు అనే మాటను చూస్తే, షద్రకు మేషాకు అబెద్నగోలు మమ్మల్ని రక్షించగల సమర్థుడు మా దేవుడు అని చెప్పారు. అయితే వారి పరిస్థితి చూస్తే, అగ్ని గుండములో వేయబడ్డారు. గనుక సమర్థుడు అంటే, అక్కడ ఉన్న నెగటివ్ పరిస్థితి ప్రభావము ఏ మాత్రము ఉండకుండా చేయగల సమర్థుడు. అబ్రహాము విషయములో మృతతుల్యమైన శరీరము ప్రభావము ఏమీ లేకుండా చేయగల సమర్థుడు. అలాగే నీ వాగ్దానము నెరవేరుటలో ఏ నెగటివ్ పరిస్థితి ప్రభావము ఉండనివ్వని సమర్థుడు.

1. మొట్టమొదట మనము కలిగి ఉండవలసినది దేవుని భయము కలిగి ఉండాలి.
2. రెండవదిగా పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి, అనగా పరిశుద్ధతలో కొనసాగించబడాలి
3. మూడవదిగా, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకోవాలి.
4. నాల్గవదిగా క్రీస్తును కలిగి జీవించేవారిగా మనము ఉండాలి.
5. అయిదవదిగా వాగ్దానము కొరకు ప్రార్థనలో ఆసక్తి కలిగి కనిపెట్టాలి.
6. ఆరవదిగా వాగ్దానమును నెరవేర్చగల సమర్థుడు అని ఎడతెగక మహిమపరచాలి.