22-12-2024 – ఆదివారం మొదటి ఆరాధన

ఆరాధన వర్తమానము

మరొక దినము దేవుని సన్నిధిలో నిలబడటానికి దేవుడు మనకు సహాయము చేసాడు దానిని బట్టి దేవునికే స్తోత్రము.

యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము. -విలాపవాక్యములు 3:22

దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు అని వ్రాయబడింది. దేని విషయములో అని ఆలోచిస్తే, నీవు ఆశించినది, నీవు కోరుకొన్నది నీకు దొరకని సమయములో కూడా ఆయన నమ్మదగినవాడు. ఆ నమ్మదగినవాడు అనుదినము మనపై తన వాత్సల్యతను చూపిస్తూనే ఉంటాడు. అందుకనే నీవు పొందవలసినది నీవు పొంది నీవు తృప్తిపరచబడేవరకు నీ యొక్క జీవితము కొనసాగించబడుతుంది. అందుకనే నీవు ఇంకా సజీవుల లెక్కలో ఉంటున్నావు.

దేవుని యొక్క కృప, వాత్సల్యత అనగా ప్రేమలను బట్టే మనము నిర్మూలము కాలేదు. దేవుని ప్రేమను బట్టే మనకు ఆయన కృప మనకు అనుగ్రహించబడుతుంది. ఆ కృపను బట్టే మన జీవితము కొనసాగించబడుతుంది.

హేబేలు కంటే మరి శ్రేష్టకరమైన ప్రోక్షణ రక్తము అని వ్రాయబడింది. ఎందుకు అని ఆలోచిస్తే, హేబేలు రక్తము మంటిలోనుండి మొర్రపెట్టింది. అటువంటిది యేసయ్య రక్తము నీ కొరకు మొర్రపెడుతుంది. అందుకనే దేవుని ప్రేమను పొందడానికి, ఆయన కృప పొందడానికి ఆ యేసయ్య రక్తమే కారణము.

మన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. దానికి సాక్ష్యమే నీవు. ఎందుకనగా, నీ జీవితములో నీవు ఆశించిన పది కార్యములలో నీవు పొందిన తొమ్మిది విషయాలను బట్టి కాక, నీవు ఇంకా పొందలేని ఆ ఒక్కదానిని సహితము నీవు పొందుకొని తృప్తిపడులాగున ఆయన నీ జీవితము కొనసాగించువాడై నీ దేవుడు ఉన్నాడు.

వాగ్దానమును స్వతంత్రించుకోవాలి అని ప్రభువు మనకు తెలియచేసి ఉన్నాడు. ఈ ఆశ మనము కలిగి ఉండాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. మనము ఈ ఆశ కలిగి మనము నిలబడితే, కార్యము మొత్తము దేవుడే చేసేవాడిగా ఉన్నాడు. ఎర్రసముద్రము ఎదురుగా ఉన్నపుడు, మోషే దేవునికి మొరపెట్టినపుడు, నాకెందుకు మొరపెడుతున్నావు? సాగిపో అని చెప్పగా, మోషే తన చేతి కర్రను సముద్రము వైపు చాపగా, దేవుడే తన కార్యము జరిగించాడు.

పేతురును మనుష్యులను పట్టే జాలరినిగా చేస్తాను అని ప్రభువు చెప్పాడు. ప్రభువు భూమినుండి వెళ్ళిపోయినతరువాత, పేతురు నాయకుడిగా దేవుని కృపను బట్టి నిలబడి గొప్ప పరిచర్య చేసాడు. అంటే, మనకు దేవుడు చేస్తాను అని చెప్పిన దానికి సమయము నిర్ణయించబడింది గనుక, మనము వెనుకకు తిరుగక సాగిపోవాలి.

కానానుకు అందరూ వెళ్ళారా? కొందరే వెళ్ళారు. అందరికీ వాగ్దానము ఉంది అయితే కొందరే స్వతంత్రించుకున్నారు. సణుగుకోవడము బట్టి కొంతమంతి వాగ్దానమును స్వతంత్రించుకోలేకపోయారు. అయితే మనము అలా ఉండకూడదు. మన దేవుని ప్రేమ మనపై నిలిచి ఉన్నది గనుక ఇంకా మనకు ఆశ పుట్టుచున్నది. మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. తప్పిపోయిన కుమారుడు అసహ్యమైన పరిస్థితిలో తిరిగివచ్చినపుడు, పరుగెత్తి, కౌగలించుకొని, మెడపై ముద్దుపెట్టి తన ప్రేమ చూపించాడు. అయితే ఒక ముఖ్యమైన విషయము, ఆయన వద్దకు నీవు రావాలి.

యేసయ్య వాక్యము అయి ఉన్నాడు, ఆ వాక్యమును బట్టి ఖచ్చితముగా నాశనము కాక నిలిచి ఉంటాము. ఆ వాక్యము మనలో నిలిచి ఉన్నంతకాలము మనము నాశనము కాక నిలిచి ఉంటాము.

ఆరాధన గీతము

నీవే నా రక్షణ – నీవే నిరీక్షణ

 

 

వారము కొరకైన వాక్యము

మన దేవుడు నమ్మదగినవాడు మనలను తృప్తిపరచేవాడు. దేవుడు ఏమై ఉన్నాడో మనము ఎరిగినపుడు, ఊహించని కార్యములను మనము అనుభవించగలుగుతాము. మనుష్యులను కాక వాక్యమును మాత్రమే చూసే లక్షణము మనము కలిగి ఉండాలి.

మనము దేవుని కృపా సింహాసము వద్దకు వచ్చాము. ఆ సింహాసనము గురించి మనము తెలుసుకుందాము.

గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. -హెబ్రీయులకు 4:16

మన దేవుడు తన సన్నిధికి వచ్చినవారి స్థితి మార్చేది. ఆ సింహాసనము అధికారము కలిగినది. అయితే మనము మాత్రము ఆ యేసయ్యను బట్టి కృప కనికరము పొందేవారముగా ఉంటాము.

యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడు కొనుడి. -యెషయా 55:6

ఈ దినము మనము ఆయన కృపా సింహాసనము దగ్గర ఉన్నాము. ఆ సింహాసనము వద్ద క్షమాపణ దొరుకుతుంది, కృప దొరుకుతుంది, కనికరము దొరుకుతుంది. ఇది ఎవ్వరికీ లేని ధన్యత మనము కలిగి ఉన్నాము. అయితే ఈ కృప, కనికరము పొందుకొని మరలా తిరిగి పూర్వపు పాపపు స్థితిలోనికి వెళ్ళడము కాదు గానీ, ఆ కనికరించబడిన స్థితిలో నిలిచి ఉండాలి. దేవుని భయము మనలో ఏలుబడి చేస్తే, ఏ పాపము మనలను ఏలుబడి చేయలేదు.

భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను దుష్టులు తమ తలంపులను మానవలెనువారు యెహోవావైపు తిరిగినయెడల ఆయన వారి యందు జాలిపడునువారు మన దేవునివైపు తిరిగినయెడల ఆయన బహుగా క్షమించును. -యెషయా 55:7

మనము ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతామో అప్పుడు ఆయన మనలను క్షమించేవాడుగా ఉన్నాడు. మనము ఏ విషయములలో పదే పదే దేవునిని బాధపెడుతున్నామో, ఆయన హృదయమును గాయపరుస్తున్నామో దానిని బట్టి మనము పశ్చాత్తాప హృదయము కలిగి ఉండాలి.

ప్రభువు పాతాళ లోక ద్వారములు మూసి వేసి తాళములు మన చేతికి ఇచ్చాడు గానీ, పరలోకపు ద్వారములను మాత్రము ఎల్లప్పుడు తెరిచే ఉంచాడు గనుక –

దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.౹ -ఫిలిప్పీయులకు 4:6