10-11-2024 – ఆదివారం రెండవ ఆరాధన

ఆరాధన వర్తమానము

దేవుని సన్నిధిలో ఉండుట మహాభాగ్యము. ఆయన సన్నిధిలో ఉన్నవారు జీవాన్ని చూస్తారు. నా మాట వినిన యెడల మీరు బ్రతుకుదురు అని దేవుడు తన వాక్యము ద్వారా సెలవిస్తున్నారు. దేవుని మాటలలో జీవము ఉంది, ఆయన జీవము మన జీవితములో స్థిరపరచబడుతుంది.

దప్పిగొనినవారలారా, నీళ్లయొద్దకు రండి రూకలులేనివారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నియ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కానిదానికొరకు మీ రేల రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయనిదానికొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణము సారమైనదానియందు సుఖింపనియ్యుడి. చెవియొగ్గి నాయొద్దకు రండి మీరు వినినయెడల మీరు బ్రదుకుదురు నేను మీతో నిత్యనిబంధన చేసెదను దావీదునకు చూపిన శాశ్వతకృపను మీకు చూపుదును – యెషయా 55:3

ఈ వాక్యమును మరొకలా చూస్తే, జీవములేని వారలారా జీవము యొద్దకు రండి అని ప్రభువు మనతో చెప్పుచున్నట్లుగా చూడవచ్చు. మన జీవితము యొక్క ఆరంభము జీవముతో అయి ఉన్నది. అయితే అపవాది ఆ జీవాన్ని దొంగిలించింది. మరలా తిరిగి ఆ జీవముతో కూడిన జీవితమును అనుగ్రహించడానికి తన మాటను విడుదల చేసాడు.

మన జీవితములో జీవాన్ని పొందుకోవడానికి ఒకే మార్గము దేవుడు మాత్రమే! నీళ్ళు తాగితేనే ఎలా అయితే దాహము తీర్చబడుతుందో, అలాగే జీవము కావాలి అంటే జీవాధిపతి వద్దకే మనము వెళ్ళాలి.

మన జీవితములో సంపూర్ణత కనబడటంలేదు గనుకనే దానిని సంపూర్ణము చేయడానికి ఆయన ఆహ్వానము అందిస్తున్నాడు ఈ దినము.

రూకలు లేనివారు అంటే ఎలా చూడాలి అంటే, ఈరోజులలో మనము ఏదైనా పొందుకోవాలి అంటే వెల చెల్లిస్తేనే గానీ పొందుకోలేము. ఆ వెల రూకలు లేదా ధనముగా ఉంది. అయితే రూకలు లేనివారు ఎలా కొనగలుగుతారు?

యేసయ్య రాకమునుపు రూకలు ఇచ్చి కొని తినమంటున్నాడు. యేసయ్య వచ్చిన తరువాత కొనుక్కోవడానికి వెళ్ళనవసరములేదు మీరే భోజనము పెట్టుడి అని ప్రభువు చెప్పుచున్నాడు. యేసయ్యను కలిగి ఉన్న మనము ధన్యులము. అక్కడ ఉన్న వారందరికీ ఆయనే సిద్ధపరచాడు. అలాగే యేసయ్యే వెలగా ఉన్నాడు గనుక, ఆయనను అంగీకరించిన మనకొరకు ఆయనే వెల చెల్లించినవాడిగా ఉన్నాడు. వెల చెల్లించి నిన్ను స్వతంత్రుడిగా చేసాడు.

ఆ యేసయ్యను మనము కలిగి ఉంటే పాతవన్నీ గతించిపోయి సమస్తము నూతనపరచబడ్డాయి. ఆ గతించిన పాతది ఏమిటి అని ఆలోచిస్తే, రూకలులేనివారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి అంటే వెల అయిన యేసయ్యను గనుక మనము కలిగి ఉంటే, ఆ సిద్ధపరచబడిన భోజనము మనము పొందుకోగలిగినవారిగా ఉంటాము. గనుక జీవములేని స్థితి పాతదిగా చూడవచ్చు. క్రీస్తును బట్టి మనము పొందుకున్న జీవముగలిగిన స్థితిని నూతన స్థితిగా చూడవచ్చు. క్రీస్తును కలిగిన నీవు జీవమై ఉంటావు.

రూకలు లేకపోయినను ఏమియు నియ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ద్రాక్షారసము సంతోషానికి గుర్తు అయి ఉన్నది. అలాగే పాలు వాక్యమునకు, సమృద్ధికి సాదృశ్యము అయి ఉన్నవి.అటువంటి వాక్యము జీవము అయి ఉన్నది.

ఆహారము కానిదానికొరకు మీరేల రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయనిదానికొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? అని ప్రభువు ప్రశ్న వేస్తున్నాడు. సంతోషము కొరకు అనేకమైన విధానములలో వెతుకుతున్నారు. కానీ నిజమైన సంతోషము యేసయ్యలోనే! అలాగే తృప్తి కొరకు కూడా అనేకమైన కార్యములవెంట పడతారు, అయితే నిజమైన తృప్తి యేసయ్యలోనే, యేసయ్య ద్వారానే!

నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణము సారమైనదానియందు సుఖింపనియ్యుడి అని ప్రభువు చెప్పుచున్నాడు. అయితే ఈ జాగ్రత్త నీవు నేనే కలిగి ఉండాలి. క్రీస్తు లేకపోతే మన జీవితము వ్యర్థమైపోయేవిగా ఉండేవి. క్రీస్తును కలిగి కూడా నీవు అదే స్థితిలో ఉండిపోతే, ఈ రోజు నీవు సత్యము గ్రహించాలి, ఆ సత్యమునందే నిలబడాలి.

జీవితములో ఏ విషయమందయినా సరే ప్రభువు సిద్ధపరచిన దానినే పొందుకోవడానికి మనము ఆశకలిగి ఉండాలి. ఎలా అంటే, నీతిమంతుడు విశ్వాసము మూలమున బ్రతుకును అన్నట్టుగా, ప్రభువు నా కొరకు సిద్ధపరచాడు అనే విశ్వాసము మనము కలిగి నిలిచి ఉండాలి. ఏ మాత్రము సందేహము కలిగినా మన విశ్వాసము కుంటుపడినట్లే. అయితే ప్రభువు నిన్ను ప్రత్యేకముగా ప్రేమించినవాడు అనే సత్యము నీవు జ్ఞాపకము చేసుకున్నపుడు నీవు తిరిగి నిలబడగలుగుతావు.

మేలైనది నీవు పొందుకోవాలి అంటే, నా ప్రభువు, నాను పరిపాలించేవాడు నా జీవితాన్ని ఏలే వాడు అనే రోషము నీవు కలిగి నిలిచి ఉండాలి. నీ జీవితమును ఏలే వాడు నీకు అడ్డుగా ఉన్నదానిని నిర్మూలము చేస్తాడు. నిన్ను ప్రేమించిన నీ దేవుడు నీ కొరకు ఏమైనా చేయగలడు అనే సత్యములో నీవు నిలిచి ఉండాలి.

మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను- రోమా 8:30

మంచి పదార్థాలు భుజించడానికి ముందుగా నిర్ణయించాడు. దానికొరకైన వెల చెల్లించి మనలను పిలిచాడు. ఆ పిలుపు విని ఆయనను అంగీకరించిన మనలను నీతిమంతులుగా తీర్చారు. నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమ పరచెను. అనగా దేవుని నుండి, దేవుని బట్టి మంచి సాక్ష్యము మన జీవితము ద్వారా బయలుపరచబడుతుంది.

నీవు నమ్మినదానిని బట్టే నీ జీవితములో మంచి పదార్థములు అనుభవించగలుగుతావు. నీ జీవితములో ఏదైతే మంచిగా లేదో, అది అనారోగ్యమైనా, ఆర్థికమైనా, ఉద్యోగమైనా ఇంకా ఏదైనా నీవు నమ్మి నిలబడిన యెడల ఆ సమస్తము మచిగా మార్చబడతాయి.

చెవియొగ్గి నాయొద్దకు రండి మీరు వినినయెడల మీరు బ్రదుకుదురు అని ప్రభువు చెప్పుచున్నాడు. ఈ వాక్యమును విన్న నీవు వదిలిపెట్టక రుచి చూసి అనుభవించు.

ఆరాధన గీతము

కృతజ్ఞతతో స్తుతి పాడెద

 

వారము కొరకైన వాక్యము

ఈరోజు దేవునితో నడవడం ఎలా అనే విషయము గూర్చి నేర్చుకుందాము. దానికొరకు దేవునితో నడిచిన వారిని గూర్చి తెలుసుకుందాము. అలా నడిచిన వారిలో మొదటివాడైన హనోకు గూర్చి తెలుసుకుందాము.

హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను. – ఆదికాండము 5: 24

దేవునితో నడవడానికి ప్రత్యేకమైన విధానము ఏమైనా ఉందా? ఆయన పరిశుద్ధుడు గనుక ఖచ్చితముగా మనము పరిశుద్ధులుగా ఉండాలి.

నోవహు వంశావళి యిదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై యుండెను. నోవహు దేవునితోకూడ నడచినవాడు – ఆదికాండము 6:9

నోవహును గూర్చి నీతిపరుడు మరియు నిందారహితుడు అని చెప్పబడి ఉంది. అదికూడా ఎటువంటి పరిస్థితులలో అతడు ఆ సాక్ష్యము పొందాడు అని ఆలోచిస్తే,

నరుల చెడు తనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయముయొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమిమీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను – ఆదికాండము 6:5-6

చుట్టూ పాపము ప్రబలినప్పటికీ, నోవహు మాత్రము దేవుని యెదుట నీతిమంతుడుగా జీవించాడు. నీతిమంతుడుగా జీవించుట అంటే దేవుని యెదుట మంచి మనస్సాక్షి కలిగినవారమై నిలిచి ఉండగలుగుట. అలా ఉండగలగాలి అంటే, సమస్తము దేవుని యెదుట సరైన విధానములో చేయాలి, ప్రవర్తించాలి.

దానిని బట్టి ఆదాముకు దొరికిన భాగ్యమే నోవహుకు దొరికింది. ఏమిటి అంటే, “నీవు ఫలించి, భూమిని నిండించు” అనే ఉద్దేశ్యమును పొందుకున్నాడు. ఆదాము అయితే, ఆ ఉద్దేశ్యమును పోగొట్టుకొన్నాడు అదే నోవహు మాత్రము ఆ ఉద్దేశ్యమును స్వతంత్రించుకున్నాడు.

మనము కూడా దేవునితో నడవాలి అనే ఆశ ఉంటుంది కానీ చేయవలసిన పనులు మాత్రము మనము చేయలేనివారిగా ఉంటాము. మన మనస్సాక్షికంటే నిజమైన విచారణ కర్త ఈ భూమిపై మరొకటిలేదు. మనము తప్పిన యెడల, మనస్సాక్షి ఖచ్చితముగా గద్దిస్తుంది.

అంతేకాక, దేవుని మాటను అంగీకరించే మనసు మనము కలిగి ఉండాలి. నోవహు చూస్తే, ఇంతకు ముందెన్నడూ వర్షము అనేది కురవనే లేడు. అయినప్పటికీ దేవుడు చెప్పినతరువాత ఆ మాటకు లోబడి ఓడను నిర్మించినవాడుగా ఉన్నాడు. అలాగే మనము కూడా దేవుని మాటను మాత్రమే మనము నమ్మి ఆ మాటకు లోబడిపోవాలి. అలాగే హనోకులో చూస్తే మరొక లక్షణము కనబడుతుంది.

విశ్వాసమునుబట్టి హనోకు మరణము చూడకుండునట్లుకొని పోబడెను; అతడు కొనిపోబడకమునుపు దేవునికి ఇష్టుడై యుండెనని సాక్ష్యము పొందెను; కాగా దేవుడతని కొని పోయెను గనుక అతడు కనబడలేదు – హెబ్రీ 11: 5

దేవునికి ఇష్టమైన జీవితము మనము జీవించాలి. అయితే ఎలా ఉంటే మనము దేవునికి ఇష్టులుగా ఉంటాము? “ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయన యందు ఆనందిస్తున్నాను” ఈ మాటలు యేసయ్యను గూర్చి చెప్పుచున్నమాటలు. యేసయ్య తండ్రి ఏమి చెప్తే అది చేసినవాడిగా ఉన్నాడు. ఒకవేళ తండ్రి చెప్పినది తనకు ఇష్టము ఉన్నా లేకపోయినా, తండ్రి చిత్తము ప్రకారమే చేయడానికి సిద్ధపడినవాడుగా ఉన్నాడు. అలాగే మనము కూడా దేవుడు చెప్పినది మనకు నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితముగా చేసేవారిగా మనము ఉండాలి.

నోవహు సమయములలో తండ్రి దిగి వచ్చి ప్రత్యక్షపరచుకున్నాడు. శిష్యుల సమయములో యేసయ్య వచ్చాడు ప్రత్యక్షపరచుకున్నాడు. పౌలు సమయములో పరిశుద్ధాత్మ దిగి వచ్చి ప్రత్యక్షపరచుకున్నాడు.

నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. – 1 కొరింథీ 11:1
పరిశుద్ధాత్మవలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము నంగీకరించి, మమ్మును ప్రభువును పోలి నడుచుకొనినవారైతిరి – 1 థెస్సలోనిక 1:6

మమ్మును ప్రభువును పోలి నడుచుకొనినవారైతిరి అని పౌలు చెప్పుచున్నాడు. ఆ మాటలకు అర్థము ఏమిటి? మేము పరిశుద్ధాత్మ వలన నడుచుకున్న ప్రకారముగా మీరుకూడా నడచుకున్నారు అని దాని అర్థము. పౌలు ఆత్మతో నడిచినవాడుగా ఉన్నాడు.

హనోకు, నోవహు దేవునితో నడచుకున్నారు. శిష్యులు యేసయ్యతో నడచినవారుగా ఉన్నారు. ఇప్పుడు మనము పరిశుద్ధాత్మతో నడిచేవారుగా ఉంటాము. ఈ విధముగా ఇప్పుడు కూడా మనము దేవునితో నడవగలుగుతాము.

ఈరోజులలో పరిశుద్ధాత్మ అనగానే అనేకులకు సందేహములు కలుగుతాయి. “మమ్మును ప్రభువును పోలి నడుచుకొనినవారైతిరి” ఇక్కడ ప్రభువును చూస్తే, మనుష్యకుమారునిగా ఈ భూలోకములో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడినవాడిగా ఉన్నాడు.

ఇందునుగూర్చి దేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపర చెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచియున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు – 1 కొరింథీయులకు 2:9-10

మనము దేవునితో నడవడము అంటే, పరిశుద్ధాత్మతో నడవటమే. ఆయన దేవుని మర్మములను, మనకొరకు దేవుడు సిద్ధపరచినవాటి గూర్చిన సంగతులు, మనకు తెలియచేసేవాడిగా ఉన్నాడు. గనుక ఈ విషయములన్నీ వ్యక్తిగతముగా మనము అనుభవించగలిగినవే! అయితే సహవాసము లేకుండా పరిశుద్ధాత్మను అనుభవించలేము.

అయితే ఈ అనుభవములోనికి రావడానికి పునాది వంటి విషయములు ఏమిటి అంటే –

  1. పరిశుద్ధమైన జీవితం
  2. నిందారహితమైన జీవితం
  3. దేవునిమాటకు లోబడే స్వభావం
  4. దేవుని మాటను అంగీకరించే జీవితం
  5. దేవునికి ఇష్టమైన జీవితం