27-10-2024 – ఆదివారం రెండవ ఆరాధన

ఆరాధన వర్తమానము

దేవునిని స్తుతించడానికి మరొక అవకాశము ప్రభువు మనకు ఇచ్చాడు. పరిశుద్ధులు మాత్రమే దేవునిని స్తుతించేవారుగా ఉంటారు. ఈరోజు దేవునిని స్తుతించడానికి మనకు దేవుడు అవకాశము ఇచ్చాడు గనుకనే ఈరోజు మనము ఇక్కడకు కూడి వచ్చాము.

మన దేవుడు సిద్ధపరచిన సమస్తము తన వాక్కును పంపి మనకు తెలియచేసేవాడుగా ఉన్నాడు. దేవుని వాక్కులో సృష్టించగల శక్తి ఉంటుంది. ఆ శక్తిని మనము గ్రహించగలగాలి, అప్పుడే ఆ శక్తి నీ జీవితములో స్థిరపరచబడుతుంది.

యెహోవా, నీవే నా దేవుడవు నేను నిన్ను హెచ్చించెదను నీ నామమును స్తుతించెదను నీవు అద్భుతములు చేసితివి, సత్యస్వభావము ననుస రించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి – యెషయా 25:1

ఇక్కడ భక్తుడు దేవునిని స్తుతించడానికి ఎందుకు సిద్ధపడుతున్నాడు అని చూస్తే – నీవు అద్భుతములు చేసితివి, సత్యస్వభావము ననుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి.

ఇక్కడ దేవుడు భక్తుడి జీవితము కొరకైన ఆలోచనలు కలిగినవాడుగా ఉన్నాడు. అంతే కాక, ఆ ఆలోచనలు నెరవేర్చువాడుగా ఉన్నాడు. నీవు కూడా అదే దేవుడిని ఆరాధించడానికి వచ్చావు. నీ యెడల కూడా నీ దేవుడు ఆలోచనలు కలిగినవాడుగా ఉన్నాడు. ఆ ఆలోచనలు అన్నీ మనకు మంచి చేయడానికే. ఈ ఆలోచనలు సర్వశక్తుడైన దేవుని ఆలోచనలు అవి మనుష్యుల ఆలోచనల వంటివి కాదు. మనుష్యుల ఆలోచనలైతే అవి వెంటనే నశించిపోయేవిగా ఉంటాయి.

నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెర వేర్చుకొనెదననియు చెప్పుకొనుచు ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయు చున్నాను. పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను – యెషయా 46:10

ఏ ఆలోచనలైతే మన యెడల కలిగి ఉన్నాడో, ఆ ఆలోచనలు ఆయనే నెరవేర్చేవాడుగా ఉంటుననడు. ఎంత గొప్ప వాడో కదా మన దేవుడు.

యెహోవాను స్తుతించుడి. నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము. నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించె దను నేను బ్రతుకుకాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదువారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగు దురు.వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యెహోవామీద ఆశపెట్టు కొనునో వాడు ధన్యుడు – కీర్తన 146:1-5

ఈ మాటలు కీర్తనాకారుడు తన అనుభవము చేత చెప్పుచున్న మాటలు. ఆయన చేసిన అనేకమైన యుద్ధములలో, మనుష్యుల చేత విజయము కలగలేదు గానీ, దేవుని వలననే అని ఒప్పుకొంటున్నాడు. మనము కూడా మన దేవుడు గురించి మనకు అనుభవపూర్వకముగా యెరిగిన ప్రకారముగా స్తుతిద్దాము.

ఈ లోకములో మనము జీవిస్తున్నపుడు, మనము సహాయము పొందవలసిన అవసరములు ఏర్పడతాయి. అటువంటి సమయములో మనకంటే గొప్పవారి మీద మన ఆశ కలుగుతుంది. కొన్ని సార్లు వారి వలన సహాయము కలిగే అవకాశము ఉండవచ్చు, లేదా కలిగిన అవకాశముకూడా మారిపోవచ్చు, లేదా వారి ఆలోచన మారిపోవచ్చు.

అయితే ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యెహోవామీద ఆశపెట్టు కొనునో వాడు ధన్యుడు అనగా సంతోషముగా జీవిస్తాడు. ఎందుకంటే మన దేవుడు మన యెడల ఆలోచనలు కలిగిన వాడు మరియు వాటిని నెరవేర్చేవాడుగా ఉన్నాడు. ఈ మాటలు ఎప్పుడు నెరవేర్చబడతాయి అంటే, “నా దేవుడు” అనే వ్యక్తిగతమైన సంబంధము మనము దేవునితో కలిగి ఉండాలి.

నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు – యిర్మీయా 29:11

ఈ భక్తులందరూ చెప్పే సత్యము ఏమిటి అంటే, మన దేవుడు మనపై ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఆ ఆలోచనలు మనకు సమాధాన కరమైనవే.

ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఫరో వద్ద కష్టములు అనుభవిస్తున్నపుడు, దేవుడు స్పందించాడు ఎందుకు అని ఆలోచిస్తే – అబ్రహాముకు దేవుడు వాగ్దానము చేసాడు.

ఆయన–నీ సంతతివారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపువారికి దాసులుగా నుందురు. వారు నాలుగు వందల యేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు; వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు – ఆదికాండము 15:13-14.

అనగా ఇశ్రాయేలు ప్రజలు శ్రమపడటము, ఆ శ్రమనుండి విడిపించడము అనే ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. ఆ ఆలోచన నెరవేర్చబడే సమయము వచ్చిన వెంటనే దిగివచ్చినవాడుగా ఉన్నాడు. మన ప్రార్థన కూడా నా యెడల నీవు కలిగి ఉన్న ఆలోచనలు నెరవేర్చు ప్రభువా అని మనము అడగాలి.

ఎలా అయితే ఇశ్రాయేలు ప్రజలను కానానుకు నడిపించడానికి మోషేను సిద్ధపరచాడో, అలాగే నిన్ను నన్ను వాగ్దానము వైపు నడిపించడానికి ఒక మార్గము ప్రభువు సిద్ధాపరుస్తాడు.

మరియు అపరాధము విస్తరించునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసికొని యేలాగు ఏలెనో, ఆలాగే నిత్యజీవము కలుగుటకై, నీతిద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలునిమిత్తము పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను – రోమా 5:20

శ్రమ ఎక్కడ ఉంటుందో అక్కడే కృప కూడా ఉంటుంది. ఏ విషయములో కష్టముతో ఉంటున్నావో దానికి సంబంధించిన విడుదల మార్గము కూడా దేవుని కృపను బట్టి నీకు ఇవ్వబడుతుంది. నిన్ను ఏలుబడి చేసేవాడిగా దేవుడు తన ఉద్దేశ్యము కలిగి ఉన్నాడు. దానికొరకే నీ దేవుని కృప నిన్ను వెంబడిస్తుంది. అందుకే నీ శ్రమలో, ఇరుకులో, ఇబ్బందిలో, అపజయములో నిన్ను నీ దేవుడు విడిచిపెట్టక, ఆయన కృపను అందుబాటులో ఉంచాడు.

మన జీవితము ప్రభువు కొరకైన జీవితము, ఆయన మహిమ కొరకైన జీవితము. మన జీవితములో సమస్తము యేసు ప్రభువు మూలముగానే పొందుకుంటాము.

నీవు పట్టణము దిబ్బగాను ప్రాకారముగల పట్టణము పాడుగాను అన్యుల నగరి పట్టణముగా మరల ఉండకుండ నీవు చేసితివి అది మరల ఎన్నడును కట్టబడకుండ చేసితివి – యెషయా 25:2

అనగా ఇప్పుడు నీ జీవితములో ఏదైతే నెగటివ్ పరిస్థితి నివాసము కట్టుకొని ఉందో, ఆ పరిస్థితి ఉండకుండా పాడుచేసి, విడుదల చేసి, మరలా ఆ స్థితి నీ జీవితములోనికి రాకుండా నీ దేవుడు చేస్తాడు అని అర్థము. నీ జీవితములో ఒకప్పుడు శత్రువు ప్రవేశించాడేమో, అయితే ఇప్పుడు నీ దేవుడు నీ జీవితమునకు ప్రాకారముగా ఉన్నాడు.

ఈ లోకములో ఎవరైనా కొన్నిసార్లే సహాయము చేస్తారు. అయితే నీ దేవుడు మాటి మాటికీ నీకు సహాయకుడుగా ఉంటున్నాడు. ఇది నీ అనుభవము అయితే నీ దేవునిని స్తుతించు.

నా నీతిని దగ్గరకు రప్పించియున్నాను అది దూరమున లేదు నా రక్షణ ఆలస్యము చేయలేదు సీయోనులో రక్షణనుండ నియమించుచున్నాను ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించు చున్నాను – యెషయా 46:13

ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించు చున్నాను. ఆ ఇశ్రాయేలు ఎవరు అని ఆలోచిస్తే, ఎవరైతే ఆయన తాను కలిగిన ఆలోచనను నెరవేర్చగలవాడు అనే విశ్వాసమును కలిగిన ప్రతి వాడు ఇశ్రాయేలుగా ఈ వాక్యము అన్వయించుకోగలవు.

ఆరాధన గీతము

ఆశయ్యా.. చిన్న ఆశయ్యా
ఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా
నీ చిత్తము నెరవేరాలని
నీ ఆలోచన నిలవాలని
ఆశయ్యా.. చిన్న ఆశయ్యా
ఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా

నా చిత్తము కాదు నీ చిత్తమే
నా బ్రతుకులో నెరవేరాలని
నీ ఉన్నత ప్రణాళికలే
నా బ్రతుకులో నెరవేరాలని
నీకు సాక్షిగా
నీకు మహిమగా
నే బ్రతకాలని
నా ఆశయ్యా
ఆశయ్యా.. చిన్న ఆశయ్యా
ఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా

 

వారము కొరకైన వాక్యము

మన దేవుడు ఇచ్చిన మాటను నెరవేర్చేవాడుగా ఉన్నాడు. ఆయన మనకు ఇచ్చిన మాట ఖచ్చితముగా నెరవేర్చేవాడుగా ఉంటాడు.

నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనెదననియు చెప్పుకొనుచు ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను – యెషయా 46:10

ఈ మాటలు ఎవరికి అవసరము? ఎవరు చెప్పుచున్నారు? ఎందుకు చెప్పుచున్నారు? ఆశించి ఇంకా పొందక, నిరాశలో ఉన్నవారికొరకు ఈ మాట ప్రభువు చెప్పుచున్నాడు, “నా ఆలోచన నెరవేరుస్తాను”.

చాలా సందర్భములో దేవుడు చెప్పాడు అనుకొని మనకు మనమే అనుకొనే మాటలు కాదు గానీ, దేవుడు ఆయనే నిజముగా నీకు తెలియచేసాడో, దాని విషయములో ఆయనే బాధ్యత తీసుకొనేవాడుగా ఉన్నాడు. మనము ఈ మాటలు నమ్మడానికి ఆధారము బైబిల్ గ్రంథమే. మనము ఎంతగా ధ్యానము చేస్తే, అంతగా దేవునిని గూర్చి మనము తెలుసుకోగలుగుతాము.

అబ్రహాముకు కుమారుడిని ఇస్తాను అని దేవుడు మాట ఇచ్చాడు. సంవత్సరములు గడిచిపోతున్నాయి, అబ్రహాము నిరీక్షిస్తూ ఉన్నాడు. ఎలాగూ పిల్లలు పుడతారు అనే ఆలోచన కలిగి, దేవుని యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టేవాడుగా ఉన్నాడు.

ఇవి జరిగినతరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి–అబ్రామా, భయపడకుము; నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము–ప్రభువైన యెహోవా నాకేమి యిచ్చిననేమి? నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే; దమస్కు ఎలీయెజెరే నాయింటి ఆస్తి కర్తయగును గదా మరియు అబ్రాము–ఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి –ఇతడు నీకు వారసుడు కాడు; నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతని తీసికొని వచ్చి–నీవు ఆకాశమువైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి–నీ సంతానము ఆలాగవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను – ఆదికాండము 15:1-6

ఇక్కడ చూస్తే, దేవుడు ఒక మాట ఇచ్చాడు, ఏ కారణము చేతనైతేనే కానీ, ఆ మాట ఇంకా నెరవేరకుండా సమయము కొనసాగుతూ వస్తుంది. ఆ సమయములో, దేవుడు అబ్రహామునకు బహుమానము ఇస్తాను అని చెప్పినపుడు, ఎన్ని ఇచ్చినా సరే ఎలియాజరే నా ఇంతికి ఆస్తి కర్త అవుతాడు కదా అని చెప్పినపుడు, ఇతడు కాదు, నీ గర్భవాసమున పుట్టినవాడే నీ వారసుడు అని దేవుడు చెప్పాడు.

అలాగే నీ విషయములో కూడా నీవు వాగ్దానము నెరవేరక కృంగిపోయిన స్థితిలో నిన్ను బలపరచడానికి దేవుని వాక్యము నీ యొద్దకు వచ్చేదిగా ఉంది. నిలిచిపోయి ఉన్న స్థితిలో ఆశ కలిగి ముందుకు సాగేవిధానములో ఆ వాక్కు కార్యము చేస్తుంది.

నేనామెను ఆశీర్వదించి ఆమెవలన నీకు కుమారుని కలుగ జేసెదను; నేనామెను ఆశీర్వదించెదను; ఆమె జనములకు తల్లియై యుండును; జనముల రాజులు ఆమెవలన కలుగుదురని అబ్రాహాముతో చెప్పెను.౹ 17. అప్పుడు అబ్రాహాము సాగిలపడి నవ్వి–నూరేండ్లవానికి సంతానము కలుగునా? తొంబదియేండ్ల శారా కనునా? అని మనస్సులో అను కొనెను – ఆదికాండము 17:16-17

ఇక్కడ అబ్రహాము ఇష్మాయేలే వారసుడు అనే ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే ఇప్పుడు కూడా దేవుడు అబ్రహామును దర్శించి శారా గర్భములో పుట్టినవాడే నీ వారసుడు అని ఖచ్చితముగా చెప్పాడు. అనగా, అబ్రహాము తప్పుగా అర్థము చేసుకొని వారి వారి ఆలోచనల ప్రకారము చేసినప్పటికీ, దేవుడు తన ఆలోచన చొప్పున వారిని తిరిగి సరైన దారిలోనికి తీసుకు వచ్చి, తన వాగ్దానమును నెరవేర్చినవాడుగా ఉన్నాడు.

అలాగే నీ జీవితములో దేవుడు మాటి మాటికీ నీకు తెలియచేసే మాట ఇంకా నెరవేర్చబడలేనప్పటికీ, ఆ మాట నీ వద్దకు వస్తుంది అంటేనే, ఆ మాట నెరవేర్చేవాడు దానిని తప్పక నెరవేరుస్తాడు. అబ్రహాము కృంగినప్రతిసారీ దేవుని వాక్యము వచ్చి బలపరింది. అలాగే మనము కృంగిన ప్రతీ సారీ, దేవుడు మనకొరకు దేవుని వాక్కు వచ్చేదిగా ఉంది. వచ్చే వాక్కు నెరవేర్పుకు సంబంధించిన సమాచారము కూడా ఇచ్చేవాడుగా ఉన్నాడు.

తాను విశ్వసించిన దేవుని యెదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని యెదుట, అతడు మనకందరికి తండ్రియైయున్నాడు– ఇందునుగూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడియున్నది.౹ –నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పినదానినిబట్టి తాననేక జనములకు తండ్రి యగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సుగలవాడైయుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని, అవిశ్వాసమువలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను – రోమా 4:17-21

అబ్రహాము పరిస్థితిలో తన భౌతికమైన పరిస్థితిని బట్టి అవిశ్వాసము కలిగినప్పటికీ, వాగ్దానము ఇచ్చినవాడు నెరవేర్చగల సమర్థుడు అనే విషయమును మాత్రము గ్రహించి, సందేహింపక నమ్మి నిలబడ్డాడు, అప్పుడు సమయము నిర్ణయించబడింది. నీ జీవితములో కూడా నీకివ్వబడిన మాటలు నెరవేర్చబడటానికి దేవుని మాట పదే పదే నీ వద్దకు వచ్చినపుడు, నీవు గ్రహించి నమ్మి నిలబడితే, ఆ నెరవేర్పు సమయము నిర్ణయించబడుతుంది.

గ్రహిస్తే నిరీక్షణ కలిగి ఉంటావు. నీ జీవితములో దేవుడు చేసిన వాగ్దానము నెరవేర్చడానికి, నీవు ఏమి గ్రహించావు? దేని కొరకు నిరీక్షిస్తున్నావు? ఒకవేళ గ్రహించి నమ్మితే, నీ వాగ్దానము నెరవేర్పు సమయము నిర్ణయించబడింది.

యేసయ్య దేవుని ఆలోచన ప్రకారమే భూలోకములోనికి వచ్చాడు. ఆ పుట్టుక ఆపడానికి యోసేపు ప్రయత్నించినపుడు దేవుడు తన దూత ద్వారా గ్రహింపు కలగచేసారు. అలాగే హేరోదు యేసయ్యను చంపడానికి ప్రయత్నిస్తున్నపుడు జ్ఞానులను దర్శించి ఆ కార్యమును విడిపించాడు. హేరోదు చనిపోయిన తరువాత మరలా దేవుడే తన వాక్కు ద్వారా వారిని తిరిగి నడిపించాడు. దీనిని బట్టి ఆయన కలిగిన ఆలోచన ఆయనఏ నెరవేర్చుకుంటాడు అనే సంగతి మనము గ్రహించగలము.

మాటి మాటికీ నీకు దేవుని వాకు వస్తుంది అంటే, నీకిచ్చిన మాట నెరవేర్చడానికి దేవుడే తన కార్యము చేసేవాడుగా ఉన్నాడు. నీవు గ్రహించడమే తరువాయి, నెరవేర్పు సమయము నిర్ణయించబడుతుంది.