25-08-2024 – ఆదివారం మొదటి ఆరాధన

ఈ పరిశుద్ధమైన దినమును మనకు అనుగ్రహించిన ప్రభువుకే సమస్త మహిమ, ఘనత ప్రభావములు కలుగును గాక! ఈ దినము ప్రభువును మహిమ పరచడానికి, కీర్తించడానికి, ఆయన చేసిన మేలులకు స్తుతి యాగము అర్పించడానికి మనకు ఇచ్చిన అవకాశము.

గతవారమంతా మన చుట్టూ మరణపు వార్తలు, వ్యాధి వార్తలు ఎక్కువగా వినపడ్డాయి. అయినప్పటికీ మనలను ఇంతవరకు ప్రభువు భద్రపరిచాడు, దాని నిమిత్తము మనము ప్రభువును స్తుతించాలి. “నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా కృప తలంచగా మేళ్లు యోచించగా నా గలమాగదు స్తుతించక – నిను కీర్తించక యేసయ్యా…” అని పాడాము, ఆ పాట ద్వారా మనము తెలియచేసిన మాటలు సత్యము.

మనము చివరి దినములలో ఉన్నాము, ఏర్పరచబడినవారు సహితము తొట్రిల్లే దినములు గనుక, మనము ఎంతో జాగ్రత్తగా సిద్ధపడి ఉండాలి. ఇంతవరకు ఆయన కృపను బట్టి క్షమాపణ దొరికింది. మనపై ఉన్న దేవుని ప్రణాళికలు నెరవేర్చబడాలి గనుకనే మనలను ఎన్నిక చేసుకుని, ఇంతవరకు నడిపించాడు. మనలను మనమే పరీక్షించుకున్నప్పుడు దేవునికి ఎంత నమ్మకముగా ఉంటున్నాము? అయినప్పటికీ దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. దానికి అనేకమైన ఆధారములు ఉన్నాయి.

శ్రమలయందును అతిశయపడుదము – రోమా 5:4

మన ఆత్మీయమైన జీవితము కుంటుపడేది మనకు వచ్చే శ్రమలను బట్టే. ఈ శ్రమలను బట్టే అంతవరకు ఉన్న ఉజ్జీవము కూడా సన్నగిల్లుతుంది.

ఏలయనగా మనమింక బలహీనులమై యుండగా, క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనులకొరకు చనిపోయెను.౹ నీతిమంతునికొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు; మంచివానికొరకు ఎవడైన ఒకవేళ చనిపోవ తెగింప వచ్చును.౹ అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.౹ కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింపబడుదుము.౹ ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణముద్వారా మనము దేవునితో సమాధానపరచబడినయెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడు దుము.౹ -రోమా 5:6-10

ఈ భాగము దేనిగురించి చెప్పబడుతుంది అని ఆలోచిస్తే? రక్షణ గూర్చిన సందర్భము గూర్చి చెప్పబడుతుంది. అయితే కేవలము రక్షణ కొరకైన భాగముగా మాత్రమే మనము చూడవలసిన అవసరము లేదు. దీనిలో మనము లోతుగా ధ్యానించినపుడు “శ్రమలయందు అతిశయపడుదుము” అనే మన ధ్యానము కొరకైన మాటలు కూడా మనము తీసుకోవచ్చు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. అనగా మన శ్రమలయందు మనము కలిగిఉన్న నిరీక్షణ మనలను సిగ్గుపరచదు.

మనమింక బలహీనులమై యుండగా, క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనులకొరకు చనిపోయెను అనే మాట ఏ శ్రమలయందు మనము అతిశయపడుతున్నామో, ఆ సందర్భములో చూస్తే, ఆ శ్రమను జయించడానికి మన వద్ద శక్తి లేదు, గనుకనే బలహీనులమై ఉన్నాము. ఆ పరిస్థితులలో మనకొరకు క్రీస్తు చనిపోయాడు. ఎందుకు? ఆయన చనిపోవడము ఎందుకు అని ఆలోచిస్తే, మన రక్షణ కొరకు మాత్రమే కాక, మన జీవితములో కావలసిన సమస్తమునకు వెల చెల్లించినవాడుగా ఉన్నాడు. క్లుప్తముగా చెప్పాలి అంటే, నీవు సంతోషముగా ఉండటానికి అవసరమైన సమస్తము ఆయన మరణము ద్వారా సమకూర్చబడింది. గనుక మనమున్న శ్రమలనుండి ఆయన మరణము మనలను తప్పించింది.

నీతిమంతునికొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు; మంచివానికొరకు ఎవడైన ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. నీతిమంతుడు అంటే అన్నీ కలిగినవాడు అనగా వచ్చిన శ్రమలను జయించగలిగినవాడు. మంచివాడు అంటే, శ్రమలను ఎలా జయించాలో తెలిసినవాడు. బలహీనుడు అంటే శ్రమలను ఎలా జయించాలో తెలియనివాడు, శక్తి లేని వాడు.

అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. మనకు వచ్చిన శ్రమను జయించలేని బలహీన స్థితిలో, క్రీస్తు తన మరణము ద్వారా శ్రమను జయించడానికి అవసరమైన సమస్తము సిద్ధపరచాడు. తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు అనగా నీవు శ్రమను జయించలేని బలహీన స్థితిలో క్రీస్తు మరణములో సిద్ధపరచబడిన సమస్తమును నీకు తెలియచేసి, ప్రత్యక్షపరుస్తున్నాడు అని అర్థము.

అందుకు–నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును.౹ -2 కొరింథీయులకు 12:9

ఈ సత్యము పౌలుకు అర్థమయింది గనుకనే, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను అని తెలియచేస్తున్నాడు. ఈ మాటలు ఎంతో బలమైనవి విలువైనవి. శ్రమల ద్వారా అపవాది మనలను కృంగదీసి దేవుని నుండి దూరముగా చేయడానికి ప్రయత్నిస్తాడు. గనుక సత్యము నీకు తెలిసినపుడు నీవు ఆ శ్రమలయందు సహితము నీవు అతిశయపడతావు.

సత్యము ఏమిటి అంటే, దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు గనుకనే తన కుమారుని బలిగా అర్పించాడు. ఆయన మరణములో మన సంతోషమునకు కావలసిన సమస్తము దాచబడి ఉన్నాయి. గనుకనే క్రీస్తుయేసునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి అని చెప్పబడింది. పాతవన్నీ గతించిపోయినాయి అంటే ఏమిటి అని ఆలోచిస్తే, శ్రమ, దుఃఖములతో కూడిన అపజయమైన జీవితము గతించిపోయింది. నూతనముగా ఇవ్వబడిన జీవితము క్రీస్తు మరణములో సిద్ధపరచబడిన విజయకరమైన జీవితముగా సిద్ధపరచబడింది.

మనకు వచ్చిన శ్రమలను జయించే శక్తి మనకు లేని ప్రతిసారీ ఆయన ప్రేమ మన యెడల వెల్లడి పరుస్తాడు. కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింపబడుదుము. అనగా నీవు నీ శ్రమనుండి ఖచ్చితముగా రక్షించబడతావు, విడుదల పొందుదువు. గనుక శ్రమలను బట్టి మన ఆత్మీయ జీవితమును కోల్పోవడము కాదు గానీ, ఆ శ్రమలో మనము అతిశయపడాలి.

దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.౹ -రోమా 8:28

మన మందిరము దేవుని యొక్క సంకల్పము అని ఇంతవరకు జరిగిన నిర్మాణమే సాక్ష్యము. నిర్మాణపు చివరి దశలోనికి వచ్చాము గనుక. దేవుని ఉద్దేశ్యము, దేవుని యొక్క సంకల్పము యొక్క నెరవేర్పు కొరకు సమస్తము సమకూర్చబడతాయి.

నీతిమంతునికొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు – చేసిన ఆర్థిక సహాయమును తిరిగి తీర్చగలిగిన సామర్థ్యము ఉన్నపుడు ఎవరైనా సహాయము చేయుటకు అవకాశము ఉంది.

మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను – అర్థికముగా సహాయము పొందినప్పటికీ తిరిగి చెల్లించలేని స్థితిలో, క్రీస్తు మరణములో సిద్ధపరచబడిన సమస్తములోనుండి మనకు సహాయము అందించబడుతుంది.

దేవుడు మనయెడల తన ప్రేమను నిత్యము కనపరుస్తున్నాడు. ఆ ప్రేమను పొందుతున్న మనము దేవునిని స్తుతించాలి. దేవుని యొక్క ప్రేమ కొరకు శ్రమలయందు కనిపెట్టుకొన్న మనము, పరిణితి కలిగి మనము సిద్ధపడాలి. ఉన్నపాటున శ్రమ తీరితేనే అనే ఆలోచన మనము కలిగి ఉండకూడదు. మనము నమ్ముకున్న దేవుడు అన్యాయము చేయుట అసంభవము.

Today’s INFORMATION given by God is the CONFIRMATION of tomorrow’s victory in your tribulation and overwhelming joy.

ఆరాధన గీతము

యేసయ్యా వందనాలయ్యా

 

వారము కొరకైన వాక్యము

ఆత్మీయమైన జీవితము పరిశుద్ధముగా జీవించడానికి అనుగ్రహించబడింది. నీవు తీసుకునే నిర్ణయాలు నీ జీవితాన్ని ప్రభావితము చేస్తాయి గనుక, నీ నిర్ణయం దేనిని ఆధారపడి తీసుకుంటున్నావు అనేది నీవు తెలుసుకుని ఉండాలి.

మన నిర్ణయాలు సాధారణముగా భౌతికమైన పరిస్థితులను ఆధారము చేసుకొని ఉంటాయి అయితే అది తప్పు. మన నిర్ణయములు దేవుని వాక్యమును ఆధారము చేసుకొని ఉండాలి. ఇకనుండి నీ నిర్ణయములు అన్నీ ఆత్మీయమైన బోధను అనుసరించి ఉండుటకు జాగ్రత్త పడు.

అంతట వారు ప్రయాణమై పోవుచుండగా, ఆయన యొక గ్రామములో ప్రవేశించెను. మార్త అను ఒక స్ర్తీ ఆయనను తన యింట చేర్చుకొనెను. ఆమెకు మరియ అను సహోదరి యుండెను. ఈమె యేసు పాదములయొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుటచేత తొందరపడి, ఆయనయొద్దకు వచ్చి–ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచి పెట్టినందున, నీకు చింతలేదా? నాకు సహాయము చేయుమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు –మార్తా, మార్తా, నీవనేకమైన పనులనుగూర్చి విచారముకలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే మరియ ఉత్తమమైనదానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్దనుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. -లూకా 10:38-42

ఇక్కడ నిర్ణయము తీసుకున్న విషయములో మరియను ప్రభువు మెచ్చుకున్నాడు. మార్త అయితే అనేకమైన పనులను గూర్చి ఆలోచిస్తుంది. మరియ ప్రభువు మాటలకొరకు కూర్చుంది. ఒక ఆత్మీయ మీటింగ్ గురించి ఆలోచిస్తే, అక్కడ వచ్చే వారికొరకు సిద్ధపరచవలసిన అవసరము ఉంది. అయితే ఆదివారము గూర్చి ఆలోచిస్తే, అప్పుడే అనేకమైన పనులు ఉంటాయి అయినప్పటికీ, ఏది మనకు ప్రాముఖ్యము అనేది మనము అర్థము చేసుకోవాలి.

మరొకలా చూస్తే, భౌతికమైన జీవితము మరియు ఆత్మీయమైన జీవితము. ఈ రెండిటిలో ఏది ప్రాముఖ్యము? భౌతికమైన జీవితము అవసరమే అయితే ఆత్మీయమైన జీవితము ప్రాముఖ్యము. ఈ రెండిటిలో మనము తీసుకొనే నిర్ణయము ఎంతో ప్రాముఖ్యమైనది, మన భవిష్యత్తును స్థిరపరచేదిగా ఉంది. గనుక మనము తీసుకొనే నిర్ణయము మన ఆత్మీయమైన జీవితమునకు వృద్ధి కలిగించేదిగా ఉండాలి.

భౌతికమైన జీవితములో తొందరపాటు ఉంటుంది, అయితే ఆత్మీయమైన జీవితములో ఎదుగువాడు స్థిరముగా ఉంటాడు. శరీరము నిష్ప్రయోజనమే, అంటే శరీర సంబంధించిన జీవితము కంటే, ఆత్మీయమైన జీవితము ఎంతో గొప్పది. ఒక ధనవంతుడు భౌతికముగా ఎంతో సంపాదించాడు. లాజరుకు భౌతికముగా ఏదీ లేదు, అయితే ఆత్మీయముగా ఎదిగినవాడుగా ఉన్నాడు. అందుకే లాజరును దేవుడు చేర్చుకున్నాడు, ధనవంతుడు విడిచిపెట్టబడ్డాడు.

అందుకే మన నిర్ణయములు మనము ఆత్మీయముగా ఎదగటానికి అనుకూలముగా ఉండాలి. నీ ఆత్మీయమైన ఎదుగుదలకు ఆటంకముగా ఉండే ప్రతి దానినీ నీవు వ్యతిరేకించాలి. ఉదాహరణకు ఇప్పుడున్న లోకములో నీ చేతిలోని మొబైల్ ఫోన్ లో నీవు చూసే విషయములు నిన్ను ప్రభావితము చేసేవిగా ఉంటాయి. గనుక నీవు ఏమి చూస్తున్నావో సరి చేసుకోవాలి.

అపవాది నిన్ను వ్యక్తిగతముగా గానీ, ఇతరుల ద్వారా గానీ ప్రభావితము చేస్తాడు. గనుక నీకు ఆలోచన పుట్టగానే, ఆత్మీయమైన జీవితమునకు ఆటంకము కలిగించేది అయితే అస్సలు పాటించవద్దు. అలాగే ఎవరితో నీవు స్నేహము చేస్తున్నావో కూడా జాగ్రత్త పడాలి. నీ ఆత్మీయమైన జీవితమునకు ఆటంకముగా ఉంటే ఆ స్నేహమును విడిచిపెట్టుటయే శ్రేయస్కరము.

ఆత్మీయమైన జీవితములో వెనుకకు చూడటము అనేది ఎంతో ప్రమాదకరమైనది. అనగా నీవు వదిలి పెట్టినదాని కొరకు తిరిగి ఆలోచన కలిగి ఉండటము ఎంతో ప్రమాదకరము. గనుక ఈ మాటలను విడిచిపెట్టక, మన ఆత్మీయమైన జీవితము కొరకు జాగ్రత్త కలిగి ఉందాము.

యేసయ్యను అనేకమంది వెంబడించారు. వారిలో భౌతికమైన ఆహారము కొరకు అనేకులు వెంబడించారు. శిష్యులు కూడా యేసయ్యను వెంబడించారు. ఎవరైతే భౌతికమైన వాటికొరకు వెంబడించారో వారు మధ్యలోనే విడిచిపెట్టారు. అయితే శిష్యులను చూస్తే –

కాబట్టి యేసు–మీరు కూడ వెళ్లిపోవలెనని యున్నారా? అని పండ్రెండుమందిని అడుగగా౹ సీమోను పేతురు– ప్రభువా, యెవనియొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు;౹ నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి యెరిగియున్నామని ఆయనతో చెప్పెను.౹ -యోహాను 6:67-69

ఈ దినము ఇలాంటి నిర్ణయము తీసుకొనే పరిస్థితి నీ యెదుట నా యెదుట ఉంది. భౌతికమైన విషయముల ప్రభావము చేత ప్రభువు విడిచిపెడదామా? ఆత్మీయమైన జీవితముకొరకు ప్రభువుకు మహిమకరము కాని వాటిని విడిచిపెడదామా? పేతురు తీసుకొన్న నిర్ణయము బట్టి పరలోకపు తాళపు చెవులు పొందుకున్నాడు. నీవు తీసుకొనే నిర్ణయము బట్టి నీవు కూడా దేవునినుండి పొందుకొనే వాడివిగా, దానివిగా ఉంటావు.

నీవు ఆత్మీయముగా ఎదిగే కొద్దీ, నీవు భౌతికముగా కూడా ఆశీర్వాదమును పొందుకుంటావు, ఇది అనేకులు గ్రహించలేని మర్మముగా ఉంది. యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అది మరణపు లోయ అయినా, గాఢాంధకారమైనా, శ్రమ అయినా, శత్రువైనా నాకు లేమి అనేది కలుగదు, నిత్యము కృపాక్షేమములే కలుగును. ఆమేన్!

యోసేపు తీసుకున్న నిర్ణయము తన భౌతికమైన జీవితమునే మార్చివేసింది. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే ఐగుప్తు రాజుకే, దేవుడిగా మార్చబడ్డాడు. షద్రకు మేషాకు అబెద్నగోలు తీసుకున్న నిర్ణయము, శిష్యులు తీసుకున్న నిర్ణయము, మన యెదుట సాక్ష్యములుగా ఉన్నాయి. నీ దేవుడు నీ తండ్రి, నీవు ఆయన బిడ్డవు ఇదే సంబంధము నీ జీవితములో ఉంటుంది. ఈ సత్యము నీవు ఎరిగి ఉంటే, నీవు సరైన నిర్ణయమే తీసుకుంటావు.

ఈ దినము నీ ఆత్మీయ జీవితము భౌతికమైన జీవితముకంటే గొప్పదానిగా ఎంచుకుంటావా? ఇంతవరకు ఒకవేళ ఆత్మీయమైన జీవితము కుంటుపడే నిర్ణయములు తీసుకుని ఉంటే ప్రభువును క్షమించమని అడుగుదాము.