ఆరాధన వర్తమానము
దేవుని సన్నిధిలో ఉండునట్లు మనకొరకు సమయము సిద్ధపరచిన దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక!
మన దేవుడు మన పరిస్థితులు అన్నీ ఎరిగినవాడై, తన మహిమ కొరకే మన జీవితములు ఏర్పరచుకున్నవాడు. ఆటువంటి మహిమను దొంగిలించడానికి మన జీవితములో ని అనేకమైన పరిస్థితులు ప్రయత్నిస్తుంటాయి. అనగా దేవునికి చెందవలసిన మహిమ దేవునికి చెందకుండా చేయడానికి అపవాది ప్రయత్నిస్తాడు. అటువంటి నీ పరిస్థితులనుండి విడుదల చెయ్యడానికి ఇటువంటి అవకాశము దేవుడు దయచేస్తుంటాడు. అందుకే దేవుని విషయములు, వాక్యము ఎంతో ఆసక్తిగా మనము వినాలి. ఆయనయే తన బిడ్డలమైన మనలను ప్రేమించి విడుదల చేసేవాడుగా ఉంటాడు. మన జీవితాలకు ఆధారము ఆయనే అని గ్రహించి నిలబడినపుడు మాత్రమే అద్భుతములు చూడగలుగుతారు.
కేవలము బేతెస్ద మిరాకిల్ సర్వీస్ కి వచ్చి వెళ్ళిపోతే అద్భుతము జరగదు కానీ, దేవుడు మిమ్మలని ప్రేమించి విడుదలచేసిన వాక్యము నమ్మితేనే, విశ్వాసముంచితేనే అద్భుతము చూడగలుగుతారు.
పేతురు, యోహానులు శృంగారము అనే దేవాలయము దగ్గర పుట్టు కుంటివాడైన వ్యక్తిని స్వస్థపరిచారు. అయితే అది ఎలా జరిగింది? మా స్వంత శక్తి, భక్తి చేత జరగలేదు కానీ, యేసు క్రీస్తు నందలి విశ్వాసము వలన ఈ అద్భుతము జరిగింది అని వారు సాక్ష్యము ఇచ్చారు.
అద్భుతము అనేది దేవుని యొక్క వాక్యమందలి విశ్వాసమును బట్టి జరుగుతుంది. పరిస్థితులు ఎంత వ్యతిరేకముగా ఉన్నా సరే వాక్యమునే నమ్మండి.
ఈ స్వాతంత్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడిక్రింద చిక్కు కొనకుడి. -గలతీయులకు 5:1
ఈ అనుగ్రహించబడిన స్వాతంత్ర్యము మన జీవితముల కొరకు ఇవ్వబడింది. ఈ స్వాతంత్ర్యము మనమే అనుభవించాలి. మనమున్న పరిస్థితులలోనుండి విడుదల పొందుకోవాలి అని యేసయ్య ప్రకటించేసాడు. అయితే ఇప్పుడు ఎలా ఆ స్వాతంత్ర్యాన్ని అనుభవించాలి? నేను బంధించబడి ఉండటానికి కాదు నాకు స్వాతంత్ర్యము వచ్చింది, అయితే అది ప్రభువు యొక్క మహిమ కొరకే. గనుక నీవు బంధించబడిన స్థితిలో నీవు జ్ఞాపకము చేసుకోవలసినది ఏమిటి? నాది స్వాతంత్ర్యము కలిగిన జీవితము అనే సత్యము.
ఉదాహరణకు మోకాళ్ళ నొప్పులు ఉన్న వ్యక్తి ఉత్సాహము కలిగి ఉండలేడు, అయితే ఆరోగ్యముతో ఉన్నవాడు సంతోషముగా గంతులు వేయగలుగుతాడు. అయితే వాక్యమందలి విశ్వాసమును కనపరిస్తే, అనగా నీ ఆలోచనా విధానము మారితే, అప్పుడు నీవు నీకివ్వబడిన స్వాతంత్ర్యమును అనుభవించగలుగుతావు.
రక్త స్రావసము గల స్త్రీ, సమస్య తగ్గలేదు. అయితే యేసయ్య నన్ను స్వస్థపరుస్తాడు అని నమ్మి వెళ్ళింది, తన విశ్వాసములో ఏమాత్రము మార్పు లేదు గనుక, స్వస్థపరచబడింది. మన జీవితములో కూడా విశ్వాసముపై నిలబడితేనే అద్భుతము జరుగుతుంది.
అంతే కాదు గానీ, యేసయ్య తన గ్రామములో అద్భుతము చేయాలి అని అనుకున్నప్పటికీ, వారి అవిశ్వాసమును బట్టి అక్కడ చేయలేకపోయాడు. గనుక అద్భుతము అనేది విశ్వాసముతో ముడిపడిఉంది.
మన జీవితము సంతోషముగా ఉండాలి, అద్భుతములతో కొనసాగాలి అనే దేవుని చిత్తము అయి ఉంటుంది గానీ, కష్టాలు పడాలి అనేది కాదు. అయితే, ఆ దేవుని చిత్తమైన వాక్కు మన వద్ద ఉన్నప్పటికీ, మన జీవితములో అద్భుతములు జరగకపోవడానికి కారణము మన విశ్వాసములోని లోపమే. అయితే ఎక్కడ మన విశ్వాసములో లోపము ఉందో మనము కనుగొని, దానిని విడిచిపెట్టినపుడు, సరిచేసుకున్నపుడు, మన జీవితములో విశ్వాసమును సరిచేసుకుని, దేవుని చిత్తమును మరలా అనుభవించగలుగుతాము.
మనము ప్రార్థించినపుడు పరిస్థితి వ్యతిరేకముగా ఉన్నపుడు, ఇంక జరగదు అనే మాట మన హృదయములో వచ్చినపుడు, మన అద్భుతమును మనమే ఆపివేసుకుంటాము.
కఠినహృదయులై నీతికి దూరముగా ఉన్నవారలారా, నా మాట ఆలకించుడి నా నీతిని దగ్గరకు రప్పించియున్నాను అది దూరమున లేదు నా రక్షణ ఆలస్యము చేయలేదు సీయోనులో రక్షణనుండ నియమించుచున్నాను ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించు చున్నాను. -యెషయా 46:12-13
కఠినహృదయులై నీతికి దూరముగా ఉన్నవారలారా, నా మాట ఆలకించుడి అని ప్రభువు చెప్పుచున్నాడు. కఠిన హృదయము అంటే, మనము వెళ్ళిన పరిస్థితిని బట్టి, మన హృదయము కఠిన పరచబడిన పరిస్థితి. అలాగే నీతికి దూరముగా ఉండుట అంటే దాని అర్థము ఏమిటి అంటే, అబ్రహాము దేవుని నమ్మాడు అనే నీతిగా ఎంచబడెను, గనుక నీతికి దూరముగా ఉండుట అనే దేవుని మాటను విశ్వసించలేని స్థితి. అనగా మనమున్న పరిస్థితిని బట్టి హృదయము కఠినపరుకుని, దేవుని మాటను నమ్మలేని స్థితిలో ఉండుట అని అర్థము.
అటువంటి వారితో ప్రభువు చెప్పుచున్నాడు – “నా నీతిని నీ దగ్గరకు రప్పించుచున్నాను”. అనగా నేను ఏమైతే చేయగలుగుతానో అది నీవద్దకు రప్పిస్తున్నాను, అని ప్రభువు చెప్పుచున్నాడు. అంతే కాక, అది దూరముగా లేదు అని ప్రభువు చెప్పుచున్నాడు. అంటే, నీ జీవితములో ఏదైతే పొందుకోవాలో, అనుభవించాలో అది దూరముగా లేదు.
సీయోను దేవుని పట్టణము. మనము ఆయన సొత్తు అని ప్రభువు చెప్పుచున్నాడు. అటువంటి సొత్తైన మన జీవితములో రక్షణ ఉండ నియమించినాడు. అనగా మన రక్షణ కొరకు అవసరమైన ప్రతీదీ జరుగునట్లు ప్రభువు నియమించాడు.
అంతే కాదు గానీ, “ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించు చున్నాను” అని చెప్పుచున్నాడు. ఈ దినము ప్రత్యేకించి, హృదయము కఠినమైపోయిన స్థితిలో ఉన్నవారితో దేవుడు ఈ మాటలు చెప్పుచున్నాడు. ఎందుకంటే నీవు పడే వేదన, ఆవేదన నీ పరలోకపు తండ్రి చూసి ఉన్నాడు. నీ దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు, నీ దేవునికి సమస్తము సాధ్యమే. దేవుని కార్యము జరగడానికి నీవు చేయవలసినది, నమ్మకము ఉంచటము మాత్రమే!
జరగవలసినది దగ్గరకు రప్పించేది ఆయనే, జరగవలసిన దానికొరకు సమస్తము నియమించినవాడు ఆయనే, కేవలము నమ్మిక మాత్రమే మనము చేయవలసినది.
అయితే సీయోను–యెహోవా నన్ను విడిచిపెట్టి యున్నాడు ప్రభువు నన్ను మరచియున్నాడని అనుకొనుచున్నది. -యెషయా 49:14
ఒకవేళ ప్రభువు నన్ను విడిచిపెట్టాడు, మరచిపోయాడు అని నీవు అనుకుంటే, ఈరోజు ప్రభువు నీతోనే మాట్లాడుతున్నాడు.
స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము నా యరచేతులమీదనే నిన్ను చెక్కి యున్నాను నీ ప్రాకారములు నిత్యము నాయెదుట నున్నవి -యెషయా 49:15-16
ఈ మాటలు నీగురించి నీ జీవితము గురించి చెప్పబడినమాటలు. సీయోను దేవుని పట్టణము, మనము దేవుని ఆలయము. నెరవేరని పరిస్థితులను బట్టి, ప్రభువు నన్ను విడిచిపెట్టాడు అనే ఆలోచనలు మనకు కలుగుతాయి. అయితే నీవు దేవునికి సంబంధించినవాడవు అని నీవు జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన అరచేతులలో నిన్ను చెక్కుకున్నాడు, నీ ప్రాకారములు ఆయన ఎదుట ఉన్నాయి అని ప్రభువు చెప్పుచున్నాడు. నిన్ను చూస్తున్నాను అని ప్రభువు నీకు ఈ మాటల ద్వారా జ్ఞాపకము చేస్తున్నాదు, నీవు నమ్ముతున్నావా?
ఆదిమ దినములలో మన పితరుల జీవితములలో అనేకమైన సమస్యలు వచ్చినపుడు వారిని ఒకచోట సమకూర్చి. వారి సమస్యలకు సమాధానము, మార్గము తెలియచేసేవారు. అలాగే ఈ దినము తన వాక్యము ద్వారా నీవున్న పరిస్థితిలో అవసరమైన మాట ఆయన సెలవిస్తున్నాడు.
అందుకామె–నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నాయొద్దనున్నవేగాని అప్పమొకటైనలేదు, మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసికొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితిననెను.౹ -1 రాజులు 17:12
ఈ విధవరాలి జీఎవితము చూస్తే, ఏమీ లేని పరిస్థితి, ఇంక తన జీవితము ముగించుకోవాలి అనే పరిస్థితిలోనికి వచ్చేసింది. అయితే బంధించబడిన ఆ స్థితిలో దాటించగలిగిన వాడు మన దేవుడు. శక్తి గల దేవుడు, నీ ఊహలకు అందకుండా తన కార్యము చేయగలిగినవాడు నీ దేవుడు.
హల్లెలూయ స్తుతి మహిమ
ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము
ఆ… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
అల సైన్యములకు అధిపతియైన
ఆ దేవుని స్తుతించెదము
అల సంద్రములను దాటించిన
ఆ యెహోవాను స్తుతించెదము
ఆకాశమునుండి మన్నాను పంపిన
దేవుని స్తుతించెదము
బండనుండి మధుర జలమును పంపిన
ఆ యెహోవాను స్తుతించెదము
మన పితరులు యుద్ధమునకు వెళ్ళేటప్పుడు కూడా స్తుతించారు. ఇప్పుడు నీవున్న శ్రమలో, కష్టములో విజయము నాదే అనే నమ్మకముతో స్తుతించు, ఖచ్చితముగా నీ పరిస్థితి మార్చబడుతుంది.
స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమ పరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. -కీర్తనలు 50:23
అనగా నీవున్న స్థితిలో దేవునికి స్తుతియాగము అర్పిస్తే, దేవునిని మహిమ పరచినట్టు. అప్పుడు దేవుని రక్షణ అనగా, నీవున్న ఆ స్థితిలోనుండి నిన్ను విడిపించుట అనే కార్యము. నీవు ఏమైతే ఒప్పుకుంటున్నావో, అనగా నా దేవుడు గొప్పవాడు అని, శక్తిమంతుడు అని ఒప్పుకుంటే ఆ శక్తి, గొప్పతనము నీవున్న స్థితిలోనుండి విడిపించుటలో ప్రత్యక్షపరచబడుతాయి. నీవు ఈరోజు చేసే స్తుతి యాగము, నీవున్న స్థితిలో రక్షించబడునట్లు మార్గము సిద్ధపరుస్తుంది.
ప్రవచన వాక్యము
అందుకామె–నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నాయొద్దనున్నవేగాని అప్పమొకటైనలేదు, మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసికొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితిననెను.౹ -1 రాజులు 17:12
ఈ విధవరాలి జీఎవితము చూస్తే, ఏమీ లేని పరిస్థితి, ఇంక తన జీవితము ముగించుకోవాలి అనే పరిస్థితిలోనికి వచ్చేసింది. ఒకవేళ అదే పరిస్థితి నీ జీవితములో కూడా ఉందేమో, నీ వద్ద కొంచెమే ఉంది, ఆ కొంచెము కూడా అయిపోతే ఇంక అగమ్య గోచరమే నీ స్థితి, ఇంక జీవితమునకు ముగింపే ఇంక మిగిలింది అనే ఆలోచన నీవు కలిగి ఉంటే, ఈ పరిస్థితిలో ఇంక చనిపోతే బాగుండును అనే ఆలోచన ఉంటే ఈరోజు ప్రభువు నీతోనే మాట్లాడుతున్నాడు.
నీవు కలిగి ఉన్న కొంచెమును బట్టి ఏమిచేయాలో తెలియని స్థితిలో దేవుని ఆలోచన నీకొరకు ఏమిటి అనే సత్యము గ్రహించు. సారెఫతు విధవరాలి జీవితములో, తాను ముగించాలి అనుకుంది గానీ, ఏలియాను సిద్ధపరచి ఆమె యొద్దకు పంపించాడు.
అంతట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను–నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము;౹ నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక విధవరాలికి నేను సెలవిచ్చితిని.౹ -1 రాజులు 17:8-9
ఈరోజు మనము కూడా ఈ సత్యమును గ్రహించాలి. ఈమె ముగించాలి అనే ఉద్దేశ్యము కలిగి ఉంది, అయితే దేవుడు ఆమెను జీవింపచేయటమే కాదు గానీ, దేవుని సేవకుని కూడా పోషించే జీవితముగా మార్చినాడు. ఈ దినము నీవున్న కొంచెము స్థితిలో, దేవునికొరకు వాడబడేవాడివిగా వాడబడేదానివిగా దేవుడు మార్చడానికి ఇష్టపడుతున్నాదు.
భూమి మీద యెహోవా వర్షము కురిపించువరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువకాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా సెలవిచ్చియున్నాడు అనెను. యెహోవా ఏలీయా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు.౹ -1 రాజులు 17:14-16
ఈ వాక్యము ప్రకారము ఆ విధవరాలు జీవించడానికి అవసరమైనది కొరత లేకుండా అనుగ్రహించాడు. అలాగే నీవున్న స్థితిలో ఏమి అవసరమో దానిని నీకు అనుగ్రహించి నీ స్థితిని మార్చేవాడుగా నీ దేవుడు ఉన్నాడు.
దేవుని ఆలోచన, ఉద్దేశ్యము మీరు గ్రహించవలసిన సమయము ఇది. దేవుని ఆలోచన నీ పై ఉంది అనే సత్యము గ్రహించి నిలబడవలసిన సమయము ఇది. సారెఫతు విధవరాలి జీవితములో రోజూ వాళ్ళు రొట్టెలు తిన్నారు గానీ పిండి అయిపోలేదు, దానికి కారణము దేవుడు అద్భుతము చేసాడు. అలాగే ఈ దినము మన జీవితములో కూడా అద్భుతము చేసేవాడుగా ఉన్నాడు.
నీకు నువ్వు ఇంక నా జీవితమును ముగించాలి అని అనుకుంటున్నావు గానీ, దేవుడైతే, సూపర్ నేచురల్ గా నీ జీవితము కొనసాగించబడాలి అని ఆశిస్తూ ఉన్నాడు. దేవుని ఆశీర్వాదము మాటిమాటికీ అక్కడ కనపరచబడుతుంది. నీవున్న పరిస్థితిని బట్టి నీ ఆలోచన ఇలాగే ఉంటే, నిన్ను ప్రేమించే నీ దేవుడు నీ జీవ్తమును అద్భుతమును చేయాలి అని ఆశిస్తున్నాదు.
మీ తండ్రి నన్ను మోసపుచ్చి పది మార్లు నా జీతము మార్చెను; అయినను–దేవుడు అతని నాకు హానిచేయ నియ్యలేదు.౹ -ఆదికాండము 31:7
యాకోబు మాటి మాటికీ తన మామ చేతిలో మోసపోయినవాడుగా ఉన్నాడు. మోసపోవుట అంటే, మాటి మాటికీ ఆశించి ఉంటాడు, అయితే ఆ ఆశ తీరక మోసపోయాడు. అలాగే నీ జీవితములో కూడా నీవు ఆశించినది జరగకుండా అయిపోయిందేమో, అయితే యాకోబును ప్రేమించిన దేవుడు నిన్ను కూడా ప్రేమించి అతని జీవితములో కార్యము చేసిన దేవుడే నీ జీవితములో కూడా కార్యము చేసేవాడుగా ఉన్నాడు.
అతడు–పొడలు గలవి నీ జీతమగునని చెప్పినయెడల అప్పుడు మందలన్నియు పొడలుగల పిల్లలనీనెను. చారలుగలవి నీ జీతమగునని చెప్పినయెడల అప్పుడు మందలన్నియు చారలుగల పిల్లల నీనెను.౹ అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను.౹ -ఆదికాండము 31:8-9
ఈ దినము కూడా ఇటువంటి కార్యము ప్రభువు చేయగలవాడై ఉన్నాడు. మాటిమాటికీ నిరాశలో ఉన్న యాకోబుని దేవుడు ప్రేమించినవాడై, తన పక్షముగా కార్యము జరిగిస్తూ వచ్చాడు. మోసపోయే రీతిగా ఇంక యాకోబు జీవితము ఉండకుండునట్లు మార్చివేసాడు.
అలాగే మీ జీవితములో కూడా ఇంక నిరాశ పడవలసిన అవసరము లేదు. నీ జీవితములో కూడా అటువంటి అద్భుతమైన కార్యము జరిగించేవాడుగా నీ దేవుడు ఉన్నాడు. నీవు నిరాశ పడిన సందర్భములో నీవు ఆశించినట్లుగా పరిస్థితులు మార్చివేసి నిన్ను తృప్తి పరచే కార్యము నీ దేవుడు చేయబోతున్నాడు. నీ ఆశీర్వాదము దొంగిలించడానికి ఎవరు ఎంతగా ప్రయత్నించినా ఏమీ జరగదు.
లాబాను చూస్తే, పొడలు గలవి అని చెప్పగలుగుతాడు. అయితే సృష్టించగలిగిన వాడు నీ దేవుడు. యాకోబు అంతవరకు లాబాను వద్ద పని చేసాడు. అయితే అక్కడ ఉండటానికి కాదు గానీ, అక్కడనుండి బయలుదేరమని దేవుడు సెలవిస్తున్నాడు. అంతవరకు యాకోబుగా ఉన్న వాడు అక్కడనుండి బయలువెళ్ళాక, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు.
తన అన్న అయిన ఏశావును మోసము చేసిన యాకోబు తిరిగి తన అన్న వద్దకు పూర్వపు మోసగాడిగా కాక ఇశ్రాయేలుగా వెళుతున్నాడు. అలాగే, నీ జీవితమును కూడా మార్చేవాడుగా దేవుడు ఉన్నాడు. యాకోబు జీవితములో ఆశీర్వాదము మొదలవ్వగానే, మొదట తన మామనుండి విడుదల పొందాడు, తన అన్న భయమునుండి తప్పించినాడు, అలా తన సంకటములన్నిటిని కుదిర్చినవాడుగా దేవుడు ఉన్నాడు.
మొట్ట మొదటగా ఒక ఆశీర్వాదముతో మొదలయ్యి అనేకమైన ఆశీర్వాదములుగా స్థిరపరచబడుతున్నాయి. ఎలా అయితే, ఒక పూదండలో ఒక్కొక్క పువ్వు దానికి జతపరచి ఆ పూదండ చేయబడుతుంది. అలాగే నీవున్న దుఃఖములో ఆశీర్వాదమనే పూదండతో నిన్ను తృప్తిపరచేవాడుగా నీ దేవుడు ఉన్నాడు.
యాకోబు జీవితము మార్చబడటానికి కారణము, దేవుని యందు విశ్వాసముంచుటయే. దేవుడు చెప్పేంతవరకు లాబాను వద్దనుండి వెళ్ళలేదు. ఆశీర్వదిస్తేనే గానీ నేను వదలను అని దేవుని దూతతో అన్నాడు. అలా మనము కూడా విశ్వాసము కలిగి నిల్చి ఉండాలి.
నమ్మినవారివలన ఈ సూచక క్రియలు కనబడును; ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు; క్రొత్త భాషలు మాటలాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగులమీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. -మార్కు 16:17-18
నీవు నమ్మితే, కొన్ని క్రియలు నీలో కనపరచబడతాయి. నీవు నమ్మితే దెయ్యములు వెళ్ళగొట్టబడతాయి, అనగా అపవాది నీ జీవితమును నాశనము చేయడానికి వేసిన ప్రణాళికలన్నీ నిర్మూలము చేయబడతాయి.
దేవునికి దేవదూతలు ఉన్నట్టే, అపవాదికి కుడా అనేకమైన దురాత్మలు ఉన్నాయి. ఆ దురాత్మలు మన జీవితమును నాశనము చేయడానికి ప్రయత్నములు చేస్తాయి. అయితే నీవు నమ్మిన దానిని బట్టి, ఆ ప్రయత్నములు అన్నింటిని దేవుడు లయపరచేవాడుగా ఉన్నాడు. ఇలా అనేకమైన సూచక క్రియలు, మన జీవితములో జరుగుతాయి.
క్రొత్త భాషలు మాటలాడుదురు, అనగా నీవు నమ్మితే ఆత్మ కార్యములు నీవు చూడగలుగుతావు. పాములను ఎత్తి పట్టుకొందురు, అనగా అపవాది కార్యములు మనము గ్రహించగలిగే స్థితిలో ఉంటాము.
మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు అంటే ఎలా? తెలిసి తెలిసి మరణకరమైనది ఎవరూ తాగరు కదా! అయితే ఇది ఎలా చూడాలి అంటే, మరణకరమైనదేది ఏది ప్రవేశించిననూ, అది వారికి హాని చేయదు అని అర్థము చేసుకోవాలి. గనుక అనారోగ్యమును బట్టి ఏదో జరుగుతుంది అని భయపడక దేవుని వాక్యమందు నమ్మిక ఉంచండి.
నీకు ఏ మాత్రము నష్టము జరగనివ్వనివాడు నీ దేవుడు. యాకోబును ప్రేమించినవాడు, నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. యాకోబు కష్టములన్నీ తీర్చి తన జీవితమును మార్చినాడు. అలాగే నీ జీవితములో కూడా చేయగలిగినవాడు నీ దేవుడు.
నీలో ఉన్న అనారోగ్యమునకు కొంత శక్తి ఉంది, అయితే నీవు నమ్మితే దాని శక్తి ఏమీ నీ జీవితములో పని చేయదు.