28-07-2024 – ఆదివారం రెండవ ఆరాధన – ఆయనను విడిచిపెట్టవద్దు

ఆరాధన వర్తమానము

అప్పుడు లేవీయులైన యేషూవ కద్మీయేలు బానీ హషబ్నెయా షేరేబ్యా హోదీయా షెబన్యా పెతహయా అనువారు–నిలువబడి, నిరంతరము మీకు దేవుడైయున్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఈలాగు స్తోత్రము చేసిరి–సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక. నీవే, అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండునది అంతటిని, సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటినన్నిటిని కాపాడువాడవు. ఆకాశసైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది.౹ -నెహెమ్యా 9:5-6

నిరంతరము మనకు దేవుడైయున్న యెహోవాను స్తుతించుడి.ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండునది అంతటిని, సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటినన్నిటిని కాపాడువాడు మన దేవుడు. భూమి మీద ఉన్న సమస్తమును ఆయన కాపాడేవాడుగా ఉంటున్నాడు.

దేవా యెహోవా, అబ్రామును ఏర్పరచుకొని, కల్దీయుల ఊరు అను స్థలము నుండి ఇవతలకు అతని రప్పించి అతనికి అబ్రాహామను పేరు పెట్టినవాడవు నీవే.౹ అతడు నమ్మకమైన మనస్సుగల వాడని యెరిగి, కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజ్జీయులు యెబూసీయులు గిర్గాషీయులు అనువారి దేశమును అతని సంతతివారికిచ్చునట్లు అతనితో నిబంధన చేసినవాడవు నీవే.౹ -నెహెమ్యా 9:7-8

భూమిని, దానిలోని సమస్తమును సృష్టించినవాడు మన దేవుడు. అంతే కాక దానిని కాపాడువాడు కూడా ఆయనే. కాబట్టి మనలను సృష్టించి కాపాడువాడు అయిన వాడు మన దేవుడే గనుక, ఆయనను నిరంతరము స్తుతించవలసిన వారముగా ఉన్నాము.

యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును -కీర్తనలు 3:5

దేవుడు ఆధారము అయి ఉన్నాడు కాబట్టే నిద్రపోయి మేలుకొందును అని కీర్తనాకారుడు చెప్పుచున్నాడు. అపవాది మరియు అతని దూతల సమూహము పనిచేసేది రాత్రి సమయములోనే. మన మనస్సును తెలుసుకోగలిగిన శక్తి, మన మనస్సులో ఆలోచన పుట్టించగల శక్తి అపవాదికి ఉంది. మన పల్లెటూళ్ళలో గాలి సోకింది అని చెప్తుంటారు, అది అపవాది కార్యము. ఇటువంటి అనేకమైన విషయములనుండి కాపాడుతున్నవాడు మన సృష్టికర్త అయిన మన దేవుడే!

నెహమ్యా గ్రంథములో మనము చూసిన ప్రకారము, అబ్రాము అనే వ్యక్తిని పిలిచి ఏర్పరుచుకుని అబ్రహాముగా పేరు మార్చి ఆశీర్వదించాడు. మనలను కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. కల్దీయుల ఊరిలోనుండి అబ్రామును పిలిచి, అబ్రహాముగా మార్చాడు. పాపములో ఉండి అసహ్యకరమైన స్థితిలో ఉన్న మనలను కూడా పాప జీవితమునుండి బయటకు రప్పించినవాడుగా మన దేవుడు ఉన్నాడు.

అబ్రహాము అనేక జనములకు తండ్రిగా దేవుడు చేసాడు. అలాగే మనలను దేవుడు పిలిచాడు, మన కొరకు కూడా ప్రత్యేకమైన ఉద్దేశ్యము వ్యక్తిగతముగా కలిగి ఉన్నాడు మన దేవుడు. అబ్రాముగా ఉన్నపుడు తన తండ్రి ఇంటివారి పద్దతులను అనుసరించి జీవించేవాడు. అయితే అబ్రహాముగా మార్చబడిన తరువాత, దేవుని చిత్తానుసారమైన జీవన విధానమును అతను కలిగి ఉన్నాడు. అలాగే మనలను కూడా ఇంతకు ముందు ఉన్న పాత జీవితమును అనుసరించి గాక, యేసు క్రీస్తులోని నూతనమైన జీవితమును మనము జీవించాలి అనేది దేవుని ఉద్దేశ్యము.

మనలోనుండి అనగా వ్యక్తిగతముగా ప్రతి ఒక్కరి జీవితములో నూతనమైన సాక్ష్యము మన జీవితము కలిగి ఉండాలి అనేది దేవుని కోరిక. రక్త స్రావము కలిగిన స్త్రీ సమయము వచ్చేవరకు, అందరూ యేసయ్య చేతులు ఉంచాలి అని ఆశపడి ఆ ప్రకారముగానే స్వస్థత పొందినారు. అయితే రక్త స్రావము కల స్త్రీ ఎప్పుడైతే ఆయన వస్త్రపు చెంగు ముట్టిన చాలు నేను స్వస్థపరచబడుదును అని నమ్మి చేసిందో, ఆమె స్వస్థత పొందడమే కాక, ఇతరులు కూడా అదే విధానములో యేసయ్య నుండి స్వస్థత పొందినారు.

అక్కడి జనులు ఆయనను గుర్తుపెట్టి, చుట్టుపెట్లనున్న ఆ ప్రదేశమంతటికి వర్తమానము పంపి, రోగులనందరిని ఆయన యొద్దకు తెప్పించి –వీరిని నీ వస్త్రపుచెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి; ముట్టినవారందరును స్వస్థతనొందిరి. -మత్తయి 14:35-36

అబ్రహాము కూడా ఒక విధానమును ఆరంభించాడు. ఆయన విశ్వాసులకు తండ్రిగా ఆయన తన విశ్వాసమునకు ఆధారము ఏమిటో గుర్తెరిగియుండుట అనే విధానమును తాను ఆరంభించాడు. ఏమిటి తన విశ్వాసమునకు ఆధారము అంటే, మృతులను సజీవులుగా చేయగలిగినవాడు, లేనిది ఉన్నట్టుగా పిలుచువాడు అయిన దేవుడు అనే సత్యము. పేతురు కూడా ఒక నూతనమైన విధానము ఆరంభించాడు. అతని నీడ పడితే చాలు స్వస్థత జరిగింది.

యేసు క్రీస్తు వస్త్రపు చెంగు ముట్టగానే ఆయనలోనుండి ప్రభావము వెళ్ళింది. ఆయన ఇప్పుడు మనలో యేసయ్య ఉన్నాడు కదా, మనలో ఊన్న యేసయ్యను బట్టి మనలోనుండి కూడా ఆయన ప్రభావము బయలు వెళుతుంది.

దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై యున్నాము; అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు. –నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు. –కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైనదానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. –మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునై యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. -2 కొరింథీయులకు 6:16

దేవుడు చెప్పుచున్న మాటలు గమనిస్తే – “నేను వారిలో నివసించి సంచరింతును”. మనలో నివాసముండి ఎలా సంచరిస్తాడు అని ఆలోచిస్తే, మన ద్వారానే. పౌలు తనను యేసు ఆత్మ అడ్డగించెను అని చెప్పుచున్నాడు, అలాగే కొన్ని దినముల తరువాత అక్కడికి వెళ్ళవలసిన సమయము వచ్చినపుడు అదే ఆత్మ నడిపించిన విషయము మనము ఎరుగుదుము.

అబ్రహామును ఏర్పరచుకున్న దేవుడు ఆయనను ఆశీర్వదించాడు, ఆశీర్వాదముగా చేసాడు. అలాగే నిన్ను నన్ను కూడా దేవుడు ఏర్పాటు చేసుకుని, రాబోయే తరములకు ఆశీర్వాదముగా చేయాలి అనే ఉద్దేశ్యము కలిగి ఉన్నాడు. ఈ సత్యమును నీవు నమ్మితే మనస్పూర్తిగా హృదయమారా నీ దేవునిని స్తుతించు ఆరాధించు.

ఆరాధన గీతము

తరతరములు ఉన్నవాడవు

 

వారము కొరకైన వాక్యము

మన ఆత్మీయమైన జీవితమును బలముగా కొనసాగించడానికి పరిశుద్ధాత్ముడు ఎంతగానో సహాయపడుతున్నాడు. ఆ పరిశుద్ధాత్ముడే మన వ్యక్తిగతమైన జీవితములకు ఆధారమై ఉంటున్నాడు. దేవుని యొక్క మర్మములను ఎరిగినవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అటువంటి ఆయన మనకు బోధించేవాడుగా ఉన్నాడు, మన ఆత్మీయమైన జీవితములో పడిపోకుండానడిపించేవాడుగా ఉన్నాడు.

మనము ప్రార్థన జీవితమును కలిగి ఉన్నపుడే మనము శోధనలనుండి తప్పించబడేవారముగా ఉంటాము. మనమున్న చివరి దినములలో మన జీవితమును కొనసాగించడానికి తన వాక్యమును దయచేసేవాడుగా ఉన్నాడు. ఈ జీసస్ కేర్స్ యూ మినిస్ట్రీ లో ముఖ్యముగా సూపర్నేచురల్ సర్వీస్ లో దయచేసిన వాక్యము ఖచ్చితముగా ఆ తరువాత వారములో స్థిరపరచబడుట అనే అనుభవములు అనేకములు ఉన్నాయి. గనుక ఆయనను విడిచిపెట్టవద్దు.

మనము ప్రార్థన చేస్తాము, దానికి సంబంధించినది జరగలేని సందర్భములో, లేదా ఆలస్యమయ్యే సందర్భములో తొలి రోజులలో ఉన్న ఉత్తేజము తగ్గిపోతుంది. అసలు అపవాది ఆలోచన అదే. అయితే ఎవరైతే దేవునిని పట్టుకుని నిలబడతారో, వారిని దేవుడు సిగ్గుపరచలేదు.

మరియు మమ్రేదగ్గరనున్న సింధూరవనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని యున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను.౹ -ఆదికాండము 18:1

అబ్రహాము మన అందరికీ ఒక మంచి మాదిరిగా ఉంటున్నాడు. అబ్రహాము కూడా మనలాగేనే వాగ్దానము కొరకు నిరీక్షిస్తూ ఉన్నాడు. ఎండవేళలో గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నాడు. అంటే అతను సంతోషముగా లేడు అని అర్థము చేసుకోగలము. అటువంటి సమయములో దేవుడు అతని దగ్గరకు వచ్చాడు. మన దేవుడు మన విషయములో కూడా నమ్మకమైనవాడుగా, చేయి విడువని వాడుగా మనము ఏ పరిస్థితిలో ఉన్నా సరే, మనకొరకు ఆయన ఉన్నాడు.

అబ్రహాము తన ఆలోచనలు తన బలహీనత బట్టి నిరాశలో ఉన్నప్పటికీ, దేవునిని విడిచిపెట్టకుండా నిలిచి ఉన్నాడు. మనము కూడా అదే విధముగా దేవునిని విడిచిపెట్టక నిలిచి ఉండాలి. అంటే, దేవునిని నమ్మిన తొలి దినములలో నీవు దేవుని కొరకు కలిగిన ఉత్తేజమును నీ ప్రార్థన ఆలస్యమైనా, నెరవేరకపోయినా సరే, అదే ఉత్తేజమును కలిగి నిలిచి ఉండాలి. అప్పుడు ఖచ్చితముగా దేవుడు మనలను దర్శిస్తాడు.

అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని యెదుట నిలువబడి యుండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటనుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి, నేలమట్టుకు వంగి –ప్రభువా, నీ కటాక్షము నామీద నున్నయెడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు.౹ -ఆదికాండము 18:2-3

దేవుడు దర్శించగానే, నన్ను దాటిపోవద్దు అని దేవుని వెంబడించే ఆశలో, దృక్పథములో మార్పులేని ఉత్తేజమును కనపరచినవాడుగా ఉన్నాడు. అదే అబ్రహాము ఆశీర్వాదమునకు కారణము.

నేను కొంచెము నీళ్లు తెప్పించెదను; దయచేసి కాళ్లు కడుగు కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి.౹ కొంచెము ఆహారము తెచ్చెదను; మీ ప్రాణములను బలపరచు కొనుడి; తరువాత మీరు వెళ్లవచ్చును; ఇందు నిమిత్తము గదా మీ దాసునియొద్దకు వచ్చితిరనెను. వారు–నీవు చెప్పినట్లు చేయుమనగా -ఆదికాండము 18:4-5

మనము అబ్రహాము నుండి నేర్చుకోవాలి. మన మొదటి ప్రేమలో ఏమైనా మార్పు ఉందా? లేక అలాగే ఉందా? మన పరిస్థితి ఎలా ఉన్నా, దేవుని యెడల మన ప్రేమ మాత్రము మారనిదిగా ఉండాలి. దేవునిని మరువక నిలిచి ఉన్నాడు గనుకనే, అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, ఆశీర్వాదముగా చేయబడ్డాడు.

మన జీవితములో కూడా వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. గనుక, అపవాది ప్రేరేపణలకు లొంగక మనము ప్రభువు మాటను నమ్మి నిలిచి ఉందాము.

అబ్రహాము సంతతి అయిన ఇస్సాకు జీవితములో, యాకోబు జీవితములో కూడా దేవుడు నమ్మదగినవానిగా ఉన్నాడు. ఈరోజు మన జీవితములో కూడా మన కష్ట సమయములో దానిని తీర్చడానికి మన ప్రభువు ఖచ్చితముగా దర్శిస్తాడు. దర్శించడమే కాదు గానీ, దానికి ఒక సొల్యూషన్ కూడా ప్రభువు ఇస్తాడు.

ఇస్సాకు జీవితములో కరువు వచ్చినపుడు ఎక్కడ విత్తనము వేయాలో అనే ఆలోచనను సొల్యూషన్ గా దేవుడు దర్శించి ఇచ్చినవాడుగా ఉన్నాడు.

ఆ సరస్సు తీరముననున్న రెండుదోనెలను చూచెను; జాలరులు వాటిలోనుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోనెలలో సీమోనుదైన యొక దోనె యెక్కి– దరినుండి కొంచెము త్రోయుమని అతని నడిగి, కూర్చుండి దోనెలోనుండి జనసమూహములకు బోధించుచుండెను. -లూకా 5:2-3

సీమోను దోనెనే ఎందుకు ప్రభువు ఎక్కినవాడుగా ఉన్నాడు? సీమోను అంతకు ముందురాత్రి చేపల కొరకు ఎంత కష్టపడ్డాడో యేసయ్య ఎరిగినవాడుగా ఉన్నాడు. నతానియేలును పిలువకముండే అతని గూర్చి ఎరిగినవాడు. అలాగే పేతురు దోనె ఎక్కకముందే అతని పరిస్థితి ఎరిగినవాడు యేసయ్య. మనము ఈరోజు చూసిన ప్రతీ వారి జీవితములో వచ్చిన కష్టపరిస్థితిలో దేవుడు ఖచ్చితముగా దర్శించాడు. దానికి కారణము, వారి కష్టములో కూడా వారు దేవునిని విడిచిపెట్టలేదు. మనము కూడా అదేవిధముగా ఉన్నపుడు మన జీవితములో కూడా, మన కష్టపరిస్థితిలో ఖచ్చితముగా దర్శిస్తాడు. మన దేవుడు కష్టములో విడిచిపెట్టే దేవుడు కాదు గనుక, నీ కష్టములో దేవునికి మరింత దగ్గరగా ఉండాలి.

యాకోబు ఒక్కడు మిగిలి పోయెను; ఒక నరుడు తెల్లవారువరకు అతనితో పెనుగులాడెను.౹ తాను అతని గెలువకుండుట చూచి తొడగూటిమీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుటవలన యాకోబు తొడగూడు వసిలెను.౹ ఆయన–తెల్లవారు చున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు–నీవు నన్ను ఆశీర్వదించితేనేగాని నిన్ను పోనియ్యననెను.౹ -ఆదికాండము 32:24-26

ఇక్కడ యాకోబు కష్టములో ఉన్నాడు. ఆ సమయములో దర్శించిన దేవునిని ఆశీర్వదించకుండా వెళ్ళనియ్యలేదు. మనకు కూడా దేవుడు దర్షించిన సమయము తెలుస్తుంది, అప్పుడు మనము విడిచిపెట్టకూడడు. దేవుని దర్శన సమయమును గ్రహించక నీవు విడిచిపెడితే, నీ జీవితమును కోల్పోయేవాడివిగా ఉంటావు. అలాకాక దేవుని ప్రేమించి నిలబడితే – అతడు నన్ను ప్రేమించెను గనుక నేను అతనిని తప్పించెదను అనే మాట మన జీవితములో నెరవేరుతుంది.

యాకోబు తనతో పెనుగులాడుతున్న దూతను విడిచిపెట్టట్లేదు దానికి కారణము ఏమిటి? దేవుని మాట రాకుండా, నాకోసము దేవుని మాట పలకబడకుండా ఉంటే, తెల్లవారే సరికి నా జీవితము ముగిసిపోతుంది అనే సత్యము ఎరిగినవాడు గనుకనే, దేవుని ఆశీర్వాదము కొరకు విడిచిపెట్టక పెనుగులాడాడు. ఈ సత్యము మనము గ్రహించి దానిలో నిలిచి ఉండాలి. అలక్ష్యముగా అస్సలు మనము ఉండకూడదు, దేవుని యొక్క భయము, భక్తి కలిగి ఉండాలి. అటువంటి సమయములో యాకోబుకు కూడా ఒక మాట ఆశీర్వాదముగా ఇవ్వబడింది.

అప్పుడు ఆయన–నీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను.౹ అప్పుడు యాకోబు–నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందు కాయన–నీవు ఎందునిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతని నాశీర్వదించెను.౹ -ఆదికాండము 32:28-29

ఈ ఆశీర్వాద వచనము పొందుకున్న తరువాత, ఏశావును కలిసుకొనుటకు సమయము రాగానే, ఏశావే పరుగు పరుగున వచ్చి యాకోబును కౌగలించుకొనెను. అంటే, మరణము అయిపోతాడేమో అనే భయము తప్పించబడి, చేర్చుకోబడిన అనుభవమును పొందుకున్నాడు. యాకోబుకు దేవుడు ఇచ్చిన మాట ఆలోచిస్తే – “ఇక మీదట నీవు యాకోబువు అనబడవు” అనగా నీవు ఇక మీదట మోసగాడివి కాదు. అనగా, ఏశావు వద్దకు మోసగాడిలా వెళ్ళలేదు గానీ, ఇశ్రాయేలుగా వెళ్ళాడు. యాకోబు యొక్క జీవితము ముగించబడి, ఇశ్రాయేలు జీవితము మొదలయ్యింది.

మనము కూడా దేవునిని పట్టుకొని, కష్టసమయములో విడిచిపెట్టక నిలిచినపుడే, ఆ కష్టమును జయించే సామర్థ్యము ప్రభువు కలుగచేస్తాడు. ఒకసారి మనము గమనిస్తే, యాకోబును ఆశీర్వదించలేదు గానీ, ఇశ్రాయేలును ఆశీర్వదించాడు. అతడు భయపడిన విషయములో, దేవుడు దర్శించినపుడు అతడు విడిచిపెట్టలేదు గనుకనే, అతడు ఆశీర్వదించబడ్డాడు.

మన జీవితములో దేవుడు మనతో మాట్లాడే రేమా వాక్కును పొందినపుడు మనము ఎంతో సంతోషముతో స్వీకరిస్తాము గానీ, కొన్నిరోజులు ఆ ఆసక్తి ఉంటుంది గానీ, ఆ తరువాత దాని విషయములో మరచిపోయేవారముగా ఉంటాము. అయితే యాకోబు వలే దేవుని ఆశీర్వాదమును పొందేవరకు, దేవుడు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చేవరకు మనము నిలిచి ఉండగలిగితే, ఖచ్చితముగా దేవునికి సాక్ష్యముగా మనము నిలబడతాము, దేవుడు నిలబెడతాడు. తరాలు మారినా దేవుని తన క్రియ చేసే విధానములో మార్పు లేదు.

మన జీవితములో కష్టము ఉండక మానదు. అయితే ఆ కష్టములో దేవుడు నిన్ను దర్శిస్తాడు అనే సత్యము మాత్రము మనము ఎరిగి ఉందాము. మన దేవుడు మనతో ఉండగా ఇంక మనము దేనికి భయపడాలి? భయపడక సంతోషించి గంతులువేసి, ఆయనను ప్రతీ సమయములో వెంబడిద్దాము.