ఆరాధన వర్తమానము
సమస్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి ఉత్సాహగానముచేయుచు ఆయన సన్నిధికి రండి. -కీర్తనలు 100:1-2
సత్యమును మనము గ్రహించినపుడే మనము సంతోషముగా ఆయనను సేవించగలుగుతాము. అన్నీ బాగా ఉన్నపుడు సంతోషముగానే సేవించగలుగుతాము. అయితే బాగాలేనపుదు ఎలా సేవించగలుగుతాము? నీ దుఃఖమును సంతోషముగా మార్చగలిగేది నీ దేవుడు అని నీవు గుర్తించినపుడే సంతోషముగా ఉండగలవు. అసాధ్యమును సాధ్యముగా చేసేవాడు నీ దేవుడు అనే సత్యము నీవు ఎరిగినపుడే సంతోషముగా సేవించగలుగుతావు.
అపవాది నీ జీవితములో అడుగడుగునా ఆటంకములు కలుగచేసినప్పటికీ, దేవుని కృప కూడా నీతో అడుగడుగునా నీతో ఉంటుంది, కృప నిన్ను విడిచిపెట్టదు. పాపములో మరణముంది, కృపలో జీవముంది. అటువంటి జీవముగల కృప నిన్ను వెంబడిస్తుంది అని నీవు ఎరిగినపుడు నీవు సంతోషముగా ఉండగలుగుతావు.
నా దేవుడు ఏమైనా చేయగలుగుతాడు అనీ నీవు నమ్మి, ఆ నమ్మకముపై నిలబడినపుడే మనము సంతోషముగా ఉండగలుగుతాము. అయితే పైపైన వచ్చే మాటలు కాక, నీ హృదయమును కోరుకుంటున్నాడు నీ దేవుడు. మన దేవుడు ఏమై ఉన్నాడో మనము ఎరుగుటకు, అనేకమైన వారి జీవితములను బైబిల్ గ్రంథము మనముందు సాక్షి సమూహముగా మనముందు ఉంచాడు దేవుడు. మన దేవుడు ఏమి చేసాడో అది సాక్ష్యముగ మన ఎదుట ఉంచబడింది. గనుక, నీ జీవితముల్ నీవు వెళుతున్న పరిస్థితిలో, అసాధ్యమైన కార్యమును సాధ్యముగా చేయగలడు అని వారి సాక్ష్యములు నీ యెదుట ఉన్నాయి.
సూదిబెజ్జములో ఒంటె దూరుట అసాధ్యము. అది మనుష్యులకు అసాధ్యము అయితే దేవునికి సమస్తమునూ సాధ్యమే. సూది అనేది నిర్జీవమైన భౌతికమైన విషయము. ఒంటె జీవము గలిగినది ఆత్మీయమైన దానికి సూచన. మనము ఆత్మీయముగా బలముగా ఉన్నపుడు, శరీర కార్యములను జయించుట సులభమే. ఆత్మీయముగా ఉండుట అంటే ఏమిటి? మనలో క్రీస్తు కనపడుటయే ఆత్మీయముగా ఉండుట. మన మాట, ఆలోచన, నడక క్రీస్తు వలే ఉండాలి, కనపడాలి. అప్పుడు మాత్రమే మనము శారీరక ప్రేరేపణను మనము జయించగలుగుతాము.
చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు; మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటె గొప్పవాడు గనుక మీరు వారిని జయించియున్నారు.౹ -1 యోహాను 4:4
నీలో ఉన్నవాడు, లోకములో ఉన్నవాని కంటే బలవంతుడు, గొప్పవాడు గనుక నీవు జయించగలుగుతాము. ఆదివారము సంఘములో ఉన్నపుడు మనకంటే ఎవరూ పరిశుద్ధులు లేరు అనే రీతిలో ఉంటుంది. అయితే మన బాహ్య జీవితము కూడా దానికి సరిపోలి ఉండాలి. మనము రాకడ సమీపములో ఉన్నాము. ప్రభువు వచ్చినా, ప్రభువు వచ్చేముందే నీ జీవితము ముగించబడినా, ఇంక నీవు సరిచేసుకొనే అవకాశము ఉండదు.
అందుకే క్రీస్తు ఎలా ఆలోచిస్తాడు అని ప్రతీ పరిస్థితిలో ఆలోచించి మనము సరిచేసుకోవడాంకి సిద్ధముగా ఉండాలి. ఆత్మీయముగా ఎదిగినపుడు మాత్రమే మనము గ్రహించగలుగుతాము. దానికి మన దేవుడు ఎటువంటి వాడో ఎరిగి ఉండాలి. మన దేవుడు సింహముల నోటిని మూయించగలిగినవాడు. అయితే మన పరిస్థితులలో సింహములతో పోరాడవలసిన అవసరము లేదు అయితే మనము ఎలా తీసుకోవాలి?
సింహములు మనిషిని చూసి గాండ్రించేదిగా ఉంది, అనగా నిన్ను భయపెట్టే అరుపులు. సింహములు మన పైకి వచ్చి తినివేసేవిగా ఉంటాయి. దీనిని బట్టి, మనలను నాశనము చేసే పరిస్థితి. అయితే మన దేవుడు ఆ అరుపులను మూయించేవాడు, నాశనము కాకుండా ఆపగలిగేవాడు నీ దేవుడు. దేవుని వాక్యము లేకుండా మనము ఈ నిరీక్షణ కలిగి ఉండలేము. అందుకే మనుష్యుడు రొట్టే లేకుండా జీవించగలుగుతాడు కానీ, వాక్యములేకుండా జీవించలేదు అని వ్రాయబడింది.
దేవుడు మన యెదుట సాక్షి సమూహము ఉంచారు కదా, దానికి కారణము ఏమిటి? సాక్ష్యము చేప్పేవారి దేవుడుగా నేనున్నాను అని ఆయన ప్రకటిస్తున్నారు. వారి దేవుడుగా వారిని తప్పించిన దేవుడు, నీ దేవుడిగా నిన్ను తప్పించేవాడు కూడా నీ దేవుడే.
కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరచుడి. -కీర్తనలు 100:4
ఈ మాటలు నీ జీవితములో నెరవేరాలి అంటే, నీ దేవుడు ఏమై ఉన్నాడో తెలిసి ఉన్నపుడు మాత్రమే కృతజ్ఞత అర్పణ తీసుకురాగలుగుతావు. నీవు హృదయపూర్వకముగా అర్పించే అర్పణను దేవుడు ఎంతో ఇష్టపడేవాడిగా ఉన్నాడు. గనుక, ఆయనకు చెందవలసిన మహిమ ఆయనకు చెల్లిద్దాము. అప్పుడు నీ జీవితములో దేవుని మేళ్ళను అనుభవించగలుగుతావు.
స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమ పరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. -కీర్తనలు 50:23
నీవు ఆత్మీయముగా ఏమి చేసినా సరే, అది దేవునికి మహిమకరముగా ఉంటుంది, నీకు ఆశీర్వాదకరముగా ఉంటుంది. గనుక ఆయనకు చెందవలసిన మహిమ ఆయనకు చెల్లిద్దాము. ఒక్కరి జీవితములో ఒక్కొక్క అనుభవము మనము దేవుని గూర్చి కలిగి ఉంటారు, అయితే మన దేవుడు సంపూర్ణుడు మనలను సంపూర్ణులుగా చేయగలిగినవాడు.
ఆరాధన గీతము
నా జీవిత భాగస్వామి
వారము కొరకైన వాక్యము
నీవు దేవుని సన్నిధిలో ఉన్నపుడు ఆశీర్వదించబడతావు. ఇది గుర్తించిన వారు దేవుని సన్నిధి తోడుగా ఉంటుంది అనే సత్యము ఎరిగినవారుగా ఉంటారు. ఈరోజు, నీ ప్రార్థన వ్యర్థము కాదు అని ప్రభువు చెప్పుచున్నాడు.
ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి; యెడతెగక ప్రార్థనచేయుడి -1 థెస్సలొనీకయులకు 5:15
ఆరంభ దినములలో ప్రార్థన అనేది ఎంతో అద్భుతముగా ఉంటుంది, సమయాసమయములలో ప్రార్థన చేసేవారిమిగా ఉంటాము. అయితే క్రమముగా ప్రార్థనలో అడిగినది ఆలస్యము అయినపుడు, ఇంకా అనేకమైన కారణముల చేత ప్రార్థన విషయములో అలక్ష్యము చేసేవారుగా మారిపోతాము.
మనము ప్రార్థనలో అడిగినవి పొందుకున్నపుడు, సంతోషించి ప్రభువును సంతోషిస్తాము. ఒకవేళ పొందకపోతే, ప్రభువు పై అలిగేవారిగా ఉంటాము. ఇలా సత్యము ఎరగనివారు మాత్రమే ఇలా ఉంటారు.
మనము ప్రార్థన చేసే విషయము గూర్చి ఆలోచిస్తే, మనకున్న ప్రస్తుత అవసరములకు మాత్రమే ప్రార్థన చేస్తాము. అయితే నీవు చేసే ఈ ప్రార్థన నీ భవిష్యత్తును స్థిరపరుస్తుంది అనే సత్యము గనుక ఎరిగి ఉంటే, అసలు ప్రార్థన విషయములో అలక్ష్యము కలిగి ఉండవు.
మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగానుండి ప్రార్థన చేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి -మార్కు 14:38
మనము ప్రార్థన చేసినపుడు రాబోయే శోధనలో ప్రవేశించకుండునట్లు దేవుడు తన కార్యమును జరిగించేవాడుగా ఉన్నాడు.
అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగ నాజ్ఞాపించును రాత్రివేళ ఆయననుగూర్చిన కీర్తనయు నా జీవదాతయైన దేవునిగూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. -కీర్తనలు 42:8
దేవునిగూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును అని వ్రాయబడింది. తోడుగా ఉంటుంది అంటే అర్థము ఏమిటి? మనకు ఒకే ఒక శత్రువు అపవాది. మన జీవితము కోల్పోవునట్లుగా అనేకమైనవి సృష్టించబడతాయి. మనము చేసే ప్రార్థన మనకు తోడుగా ఉంటుంది అంటే, సహాయకరముగా ఉంటుంది, బలాన్నిస్తుంది.
మనము బలహీనులము అయితే దేవుడు మనలో ఉన్నపుడు మాత్రము మనము బలవంతులుగా ఉంటాము. మన జీవిత ప్రయాణములో ఎదురయ్యే విషయాలను జయించే శక్తి మనకు ఉండదు. అటువంటి పరిస్థితిలో మనకు తోడుగా మనము చేసే ప్రార్థన ఉంటుంది. గనుక మనము పడిపోయే పరిస్థితి వచ్చినపుడు మనలను నిలబెట్టేది ఆ ప్రార్థనే.
శాపము అనేది నాలుగు తరాలు ఉంటుంది అని లేఖనాలలో వ్రాయబడింది. ఆ తరములలో వారు చేసినది మనకు అంటకుండా ఉండటానికి, మనలను కొనసాగించడానికి మనకు సహాయపడేది, నీ ప్రార్థనా జీవితము. వారు చేసిన శాపకరమైనవాటి ప్రభావమునుండి నిన్ను తప్పించేది నీవు చేసే ప్రార్థన. అందుకే నీవు ప్రార్థన గనుక నిర్లక్ష్యము చేస్తే, నీ భవిష్యత్తు నష్టపోయే పరిస్థితి వస్తుంది అని నీవు తెలుసుకొని ఉండాలి.
ఈలోకములో రెండే రెండు ఉన్నాయి. నీ దేవుడు ఎప్పుడూ నిన్ను ఆశీర్వదించాలి అని కోరుకుంటాడు. అపవాది ఎప్పుడూ నిన్ను నాశనము చేయడానికే చూస్తాడు. ఉదాహరణకు గర్భఫలము కొరకు ప్రార్థన చేసాము అనుకోండీ, అపవాది క్రియలను బట్టి ఆ గర్భము పోయింది. అయితే నీవు చేసే ప్రార్థన వ్యర్థము కాదు కానీ, మరొక సారి గర్భము దయచేసి, అపవాదినుండి రక్షించేదిగా ఉంటుంది.
కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించుకొని, మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడును ప్రార్థనచేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. -లూకా 21:36
నీవు చేసే ప్రార్థన నిన్ను తప్పించడమే కాక, నీన్ను శక్తివంతునిగా కూడా చేసేదిగా ఉంటుంది. అంటే ప్రార్థనా పూర్వకమైన జీవితము శక్తివంతముగా ఉంటుంది. శక్తివంతముగా మార్చబడటము అంటే ఏమిటి? నీవు ప్రార్థనలో అడిగినదానిని ఎవరు చేసేవారుగా ఉంటున్నారు? దేవుడు వెలుగై ఉన్నారు. ఆయన యెదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు మనలను తయారు చేసేది ప్రార్థన.
ప్రార్థన అనేది దేవునితో సహవాసమును. అప్పుడు ఆయనలోని లక్షణములు మనలోనికి వస్తాయి. అప్పుడు బలహీనమైన మనము, శక్తివంతముగా మార్చబడతాము. ప్రార్థన లేకపోతే, మనము బలహీనమయిపోతాము. ఎటువంటి పరిస్థితులలో, ఎక్కడ మనము బలహీనము అవుతాము? అని ఆలోచిస్తే –
దేవునికి అపవాదికీ ఎల్లప్పుడూ పోరాటము అనేది ఉంది. అయితే ఆ పోరాటములో దేవుని చేతిలో బలమైన బాణము వంటివారు అని వ్రాయబడింది. మన ప్రార్థనా జీవితము మంచిగా ఉన్నపుడు, ఆ బలమైన బాణము వలే ఉంటాము. ఒకవేళ ప్రార్థనా జీవితము సరిగా లేకపోతే, బలమైన బాణముగా ఉండలేము గనుక, అపవాది దాడి చేసినపుడు మనము బలహీనులుగా ఉండి ఓడిపోయేవారముగా అయిపోతాము, అపవాదిని జయించుటలో మనము ఓడిపోతాము.
అంతేకాదు, నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధముచేయుము. -ఫిలేమోనుకు 1:22
మన ప్రార్థన ఏమి చెయ్యగలదో ఈ వాక్యములో మనము చూడగలము. మనము ఏమి కోరుకుంటామో దాని నెరవేర్పు కొరకు ఏ ఆటంకములు వచ్చినా వాటిని తప్పించేది ప్రార్థనే! మనము ప్రార్థన చేసినపుడు జరగకపోతే, దయచేసి ప్రార్థన మానవద్దు.
ప్రతీ జీవి కోరిక తృప్తిపరచబడునట్లు ఆయన తన గుప్పిలి విప్పువాడు. ఆయనకు ప్రార్థించే నీ కోరిక కూడా తృప్తిపరచునట్లు ఆయన తన గుప్పిలి విప్పువాడు అనే సత్యము ఎరిగి ఉండాలి. అయితే ఆయనకు మనకు మధ్య అడ్డుగా ఏదో వస్తుంది. అది మన దోషములే, పాపములే. గనుక మనము ప్రార్థన అనేది అస్సలు విడిచిపెట్టవద్దు.
జెకర్యా జీవితములో బిడ్డలు లేరు. అయితే జెకర్యా మరియు తన భార్య ఆత్మీయముగా ఉన్నవారే, ప్రార్థన చేయువారే. ఆలస్యము అయినప్పటికీ, వారి ప్రార్థనకు జవాబు పొందుకున్నారు కదా!
అందుకు కొర్నేలి– నాలుగు దినముల క్రిందట పగలు మూడుగంటలు మొదలుకొని యీ వేళవరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా యెదుట నిలిచి – కొర్నేలీ, నీ ప్రార్థన వినబడెను; నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి యున్నవి -అపొస్తలుల కార్యములు 10:30-31
పేతురుకు కొర్నేలీ చెప్పుచున్న మాటలను బట్టి – నాలుగు రోజుల క్రితము కొర్నేలీ చేసిన ప్రార్థన, ఈ దినము పేతురును నడిపించి, కొర్నేలీ ఇంటివారు రక్షించబడటానికి దేవుడు కలిగిన చిత్తము నెరవేరునట్లు, ఆ ప్రార్థన కారణమైంది. గనుక నీవు చేసే ప్రార్థన దేవుని చిత్తము జరుగునట్లు స్థిరపరస్తుంది.
మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పండ్రెండు గంట లకు పేతురు ప్రార్థనచేయుటకు మిద్దెమీది కెక్కెను.౹ -అపొస్తలుల కార్యములు 10:9
అంటే కొర్నేలీ ఈరోజు ప్రార్థన చేస్తే, పేతురు మరునాడు ప్రార్థనలో ఉన్నాడు. ఆ తరువాత దేవుని ఆత్మ చేత మొత్తము రక్షణకార్యము జరిగించబడింది. కొర్నేలి ప్రార్థన మాత్రము చేసాడు కానీ, కార్యము జరిగించింది దేవుడు. తన దూతలను పంపి తన కార్యము చేసాడు. పేతురు ఉన్న పరిస్థితిలో కొర్నేలీ వద్దకు వెళ్ళడానికి ఆటంకములు ఉన్నాయి. అయితే కొర్నేలీ చేసిన ప్రార్థన దేవుడు తన కార్యము చేయులాగున ఉపయోగపడింది.
నీ ప్రార్థన నిన్ను శోధనుండి తప్పిస్తుంది, బలమైన వానిగా చేస్తుంది, దేవుని చిత్తమును జరిగిస్తుంది, నీ కోరికను నెరవేరుస్తుంది.