21-07-2024 – ఆదివారం మొదటి ఆరాధన

ఆరాధన వర్తమానము

దేవుని సన్నిధి బహు బలమైన దుర్గముగా ఉంది. దేవుని సన్నిధి లో అడుగు పెట్టగానే ఏమి జరుగుతుంది అని ఆలోచిస్తే, ఆయన సన్నిధి నీకు బలమైన దుర్గముగా మర్చబడుతుంది. దేవుని సన్నిధిలోనికి రాకమునుపు, అనేకరకములుగా కృంగదీయుటకు అపవాది ప్రయత్నిస్తాడు. ఉదాహరణకు ఆర్థిక పరిస్థితిని బట్టి మనము సమకూర్చుకోలేని విషయములను బట్టి కృంగిన సయమములో అపవాది ఆ పరిస్థితిని వాడుకుంటాడు.

అదే పరిస్థితిలో ఒకవేళ నీవు దేవుని సన్నిధిలో అడుగుపెడితే, అపవాది ఆలోచనలు పనిచేయకుండా, దేవుని సన్నిధి మనకు గొప్ప దుర్గముగా మారిపోతుంది. అపవాది యొక్క దాడి భౌతికముగా కంటే, ఆలోచనలు పుట్టించి మనలను పాడుచేయడానికి ప్రయత్నిస్తాడు. అటువంటి ఆలోచనలు దాడి చేయకుండా దేవుని సన్నిధి దుర్గముగా మారుతుంది.

అందుకే దావీదు ఏ సమస్య వచ్చినా సరే, దేవుని సన్నిధికే పరిగెట్టేవాడు. ఎందుకు అని ఆలోచిస్తే, దావీదును చంపడానికి అనేకమైన పరిస్థితులు తన చుట్టూ ఉన్నాయి. ఆ సమయములో దావీదు దేవుని సన్నిధిలోనికి పరిగెట్టగానే, ఆయన సన్నిధి బలమైన దుర్గముగా ఉంటుంది అని అతడు ఎరిగినవాడై ఉన్నాడు.

యెహోవా నమ్మదగిన దేవుడు, నమ్ముకోదగిన సహాయకుడు, ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. అటువంటి దేవునిని ఆశ్రయించేవారుగా మనము ఉండాలి. ఎలా అంటే, ఆయన సన్నిధిలో ఉండులాగున మనలను మనమే సిద్ధపరచుకోవాలి.

దేవుని సన్నిధిలో, దేవుని యొక్క మాటలు విడుదల చేయబడతాయి. మనము దేవుని గూర్చి ఆలోచించే విధానములో పరిపక్వత చెందాలి. దేవుని ఆలోచనలు మనము తీసుకోవాలి గానీ, మన ఆలోచనలే జరగాలని కోరుకుంటావు. ఒకవేళ అలా జరగకపోతే, దేవునిని సంతోషముగా వెంబడించలేని స్థితిలోనికి వెళ్ళిపోతాము. మనము అలా ఉండకూడదు.

సీయోనూ, సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నతపర్వతము ఎక్కుము యెరూషలేమా, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము భయపడక ప్రకటింపుమి –ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. -యెషయా 40:9

ఆయన సన్నిధిలో దేవుని మాటలు ప్రకటించబడుతున్నాయి. ఈరోజు ప్రకటించబడిన మాట, “భయపడకండి”. నీలో నివసించుచున్న ఆయన చెప్పుచున్న మాట – “భయపడకండి”.

“సువార్త ప్రకటించుచున్నదానా” అంటే ఏమిటి? సువార్త అంటే దేవుని మాటలు. ఆ మాటలు ప్రకటించడము అంటే, నీవు మొదట నమ్మి ఆ తరువాతనే కదా నీవు ప్రకటిస్తావు. అంటే ఆయన సన్నిధిలో ఉన్నపుడు ప్రకటించిన మాటలు, ఇది నాకొరకే అని నీవు నమ్మి, ఈ మాటలు నాకొరకే అని బలముగా ప్రకటించుటయే సువార్త ప్రకటించుటగా మనము చూడాలి.

అనగా ఏ పరిస్థితి అయితే నీ కళ్ళ ఎదుట ఉండి నిన్ను కృంగదీస్తుందో, ఆ పరిస్థితిలో బలముగా దేవుని మాట ప్రకటించు. సీయోను, యెరుషలేము దేవునికి సంబంధించినవి. మనము కూడా దేవునికి సంబంధిచిన వారమే. గనుక ఆయన కనికరమును పొందుకునేవారముగా ఉన్నాము. గతములో మనము ఏమైనా సరే, ఇప్పుడు దేవునికి సంబంధించినవారము అని మనము ధైర్యముగా ప్రకటించాలి. “ఇదిగో మీ దేవుడు” అని ఆయనను ప్రకటించాలి.

ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడును మీ విమోచకుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు– మీ నిమిత్తము నేను బబులోను పంపితిని నేను వారినందరిని పారిపోవునట్లు చేసెదనువారి అతిశయాస్పదములగు ఓడలతో కల్దీయులను పడవేసెదను. -యెషయా 43:14

మనము ప్రకటించే దేవుడు విమోచించగలిగినవాడు. “మీ నిమిత్తము” తన కార్యమును చేయగలిగినవాడు. మనము ఆత్మీయముగా వెళుతున్నపుడు మనలను దేవునినుండి తప్పించడానికే అపవాది అనేకమైన ప్రయత్నములను చేస్తాడు. దేవుని యొక్క వాక్యమునకు లోబడినవాడు జీవమును చూస్తాడు.

మన దేవుడు విమోచకుడు. “నీ నిమిత్తము” అని దేవుడు అంటున్నాడు అంటే, అసలు దేవుడు నిన్ను ఎంతగా కోరుకుంటున్నాడు? అక్కడ ఇశ్రాయేలు నిమిత్తము కార్యము చేసిన దేవుడు, ఈరోజు నీ నిమిత్తము కార్యము చెసేవాడుగా ఉన్నాడు.

నీవు దేవుని ఆవరణములో ప్రవేశించగానే, దేవుని మాటలలోని అధికారము చేత ఆ మాటలు స్థిరపరచబడతాయి. నీవే నా రక్షకుడవు అని మనము ఈ దినము స్తుతిగీతము పాడాము. అయితే అది నా రక్షకుడు అని ప్రకటించుటయే.

యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. -యెషయా 43:15

ఆయన మనకు దేవుడు గా ఉన్నాడు. నీవు ఆశీర్వదించబడటానికి కారణమే నీ దేవుడు. నీవు ఆయనను కలిగి ఉండటమే నీ అర్హత. ఒకప్పుడు నీ నడక ఎలా ఉన్నా సరే, ఇప్పటి నుండి దేవుని మాటలపై నిలబడి మనము జీవించినపుడు రక్షణను అనుభవించగలుగుతాము.

షద్రకు, మేషాకు మరియు అబెద్నగో అనే వారు, మా దేవుడు మమ్ములను రక్షించగల సమర్థుడు అని ప్రకటించారు. దానిని బట్టి అగ్ని గుండములో వేసినప్పటికే, వారు ప్రకటించిన మాట ప్రకారము వారి చుట్టూ దుర్గముగా దేవుడు నిలబడ్డాడు. మన జీవితములో కూడా అంటే. అయితే మన ఆత్మీయమైన జీవితము మీద ఆధారపడి నీ ఆశీర్వాదము ఉంటుంది.

నీ జీవితము నీ దేవునిని ఆధారము చేసుకునే బ్రతకాలి. నీవున్న పరిస్థితిలో ఖచ్చితముగా వచ్చేవాడుగా ఉన్నాడు. నీవు ప్రకటించిన దాని ప్రకారము కార్యము చేసేవాడు నీ దేవుడు. నీవు ప్రకటించిన దాని ప్రకారము, నీ దేవుడే ఒక బలమైన దుర్గముగా ని చుట్టూ ఆవరించువాడిగా ఉంటాడు.

షద్రకు మేషాకు అబెద్నగోల జీవితములో వారు అగ్నిగుండములో వేయబడుతున్నపుడే వారి చర్మము ఆ వేడిమిని బట్టి కాలిపోయే స్థితి. అంటే, దేవుని నమ్మకత్వము అగ్ని గుండములో పడవేయక మునుపే కనపరచబడింది.

అనగా నీవు నీ పరిస్థితిలో దేవుని నమ్ముకుని నిలబడిన సమయమునుండే దేవుని నమ్మకత్వము కనపడుతుంది. ఆ పరిస్థితిలో నీవు ప్రవేశించకమునుపే దేవుడి నమ్మకత్వము కనపడుతుంది. ఆయన నీవు నమ్మినదానిని బట్టి, నీవు ప్రకటించిన దానిని బట్టి ఆయన దుర్గముగా నిలబడతాడు. గనుక నీవున్న కష్టములో, నష్టములో, శ్రమలో కూడా నీ దేవుడి మాటను, నమ్మి ప్రకటించు. దేవుని నమ్మకత్వము ఖచ్చితముగా నీవు అనుభవించగలుగుతావు.

ఆరాధన గీతము

నా యేసయ్యా నా రక్షకా

 

 

వారము కొరకైన వాక్యము

వాక్యము ప్రకారము, దుర్గములో మనము ఉన్నపుడు ప్రకటించబడిన మాటల యొక్క శక్తి ఎరిగినవారమైతే ఖచ్చితముగా ఆ మాటలు పట్టుకొని నిలబడేవారిగా మనము ఉంటాము. దేవుని మాటలు విత్తనముతో పోల్చబడినవి.

ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్లెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడెను. పక్షులువచ్చి వాటిని మ్రింగివేసెను. కొన్ని చాల మన్ను లేని రాతినేలను పడెను; అక్కడ మన్ను లోతుగా ఉండ నందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి, వేరులేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్లపొదలు ఎదిగి వాటిని అణచివేసెను గనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచినేలను పడెను; అవి మొలిచి పెరిగి పైరై ముప్పదంతలుగాను అరువదంతలుగాను నూరంతలుగాను ఫలించెను. –వినుటకు చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను. -మార్కు 4:3-9

వినుటకు చెవులుగలవాడు వినునుగాక అంటే, నీ ఆత్మీయ చెవులను గూర్చి దేవుడు చెప్పుచున్నాడు. ఆత్మ బయలుపరిచితేనే గానీ నీ మనసులో సంగతి ఎవరికీ తెలియదు. దేవుని ఆత్మ కార్యములను మనము శరీరముతో గ్రహించలేము. దేవుడు మన ఆత్మతో మాట్లాడేవాడు గా ఉంటాడు.

ఈ లోకము చూస్తే, పాపముతో నింపబడింది. అటువంటి సమయములో దేవుని కృప మరి ఎక్కువగా కనపరచబడుతుంది. ఎలా అంటే, ప్రకటింపబడిన వాక్యము స్థిరపరచబడునట్లుగా దేవుని కృప కనపరచబడుతుంది. ఈ పరిస్థితులలో మన హృదయములను స్థిరపరచుకోవాలి.

వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడెను. పక్షులువచ్చి వాటిని మ్రింగివేసెను. -మార్కు 4:4

దేవుడు ఆశీర్వదించే దేవుడే, తన ఆశీర్వాదములను పంపిస్తున్నాడు గానీ, త్రోవ పక్కన ఉండటమును బట్టి పక్షులు ఎత్తుకుపోయేవి గా ఉంటున్నాయి. ఈలోకములో రెండే దారులు, ఒకటి దేవునిదైన మంచి దారి, అపవాది యొక్క చెడు దారి. త్రోవ అంటే ఏమిటి అని ఆలోచిస్తే, ఒక పొలములో చుట్టూ చిన్నగా దాని ఉంటుంది. విత్తనములు పొలములో పడవలిసినవి అయితే ఆ విత్తనములు గట్టు మీద పడితే వాటిని పక్షులు ఎత్తుకుపోతాయి.

దేవుని త్రోవ వెలుగుమయమై ఉంటుంది, జీవ మార్గమై ఉంటుంది. దాని పక్కన ఉండటము అంటే వెలుగుకు పక్కగా ఉండటము, జీవముకు దగ్గరగా ఉండటము. అయితే త్రోవలో లేని దానిని బట్టి, అపవాది వాటిని దొంగిలించే విధముగా మన పరిస్థితి ఉంటుంది.

ఆశీర్వాదము కనబడి తప్పిపోతుంటే, మన జీవితమును పరీక్షించుకోవాలి. ఎక్కడ నేను దేవుని త్రోవలో లేని పరిస్థితిలో ఉంటున్నామో పరీక్షించుకోవాలి. చీకటి ప్రవేశించలేని, అధికారము వెలుగుకు ఉన్నది.

ఒకప్పుడు త్రోవ పక్కన ఉన్నామేమో గానీ, ఇప్పుడైతే త్రోవలో ఉండవలసినవారము, నిలువవలసినవారము. త్రోవలో ఉన్నప్పుడు అపవాది మన ఆశీర్వాదమును దొంగిలించలేదు. అంటే నీ జీవితమును పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, అపవాది నీ జీవితమును మాత్రము పట్టలేదు.

మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను –ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుకనుండి యొక శబ్దము నీ చెవులకు వినబడును. -యెషయా 30:21

మన మార్గములో కుడికి గానీ, ఎడమకు గానీ తిరగనవసరము ఉండదు గానీ అది తిన్నని మార్గము అయి ఉంది. మనము సరైన మార్గములో ఉంటే నీ ఆశీర్వాదము దొంగిలించడానికి ఎవ్వరికీ అవకాశము ఉండదు.

నీతిమార్గమునందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు. -సామెతలు 12:28

మరణమే లేదు అంటే, దేవుని మార్గములో నిలిచి నడచినపుడు, ఆశీర్వాదము దొంగిలించబడదు అని అర్థము. పరిశుద్ధమైన జీవితములో మరణమునకు తావు లేదు. పరిశుద్ధమైన జీవితములో ఉన్నపుడు కుడికి గానీ, ఎడమకుగానీ తిరుగ కూడదు.

పరిశుద్ధమైన జీవితమును ఎలా జీవించగలము? వాక్యము ఏమైతే నిర్ణయించిందో అదే నా నిర్ణయము. వాక్యము బోధించినదే నా జీవితము అనే విధముగా జీవించడము. అటువంటి జీవితము పరిశుద్ధమైన జీవితము. నా మాటలు సత్యమును , జీవమునై ఉన్నయి అని యేసయ్య చెప్పుచున్నాడు.

దేవుని వాక్యములోని సత్యము స్వతంత్రులుగా చేస్తుంది. అంటే వాక్యము మనలను బంధింపబడనియ్యదు.

మరియు ఆయన–ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి, రాత్రింబగళ్లు నిద్రపోవుచు, మేల్కొనుచు నుండగా, వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యమున్నది. భూమి మొదట మొలకను తరువాత వెన్నును అటుతరువాత వెన్నులో ముదురు గింజలను తనంతటతానే పుట్టించును. -మార్కు 4:26-28

భూమి విత్తనమును మొలకెత్తిస్తుంది. మొదట మొలకను, మొదట మొలకను తరువాత వెన్నును అటుతరువాత వెన్నులో ముదురు గింజలను తనంతటతానే పుట్టించును . పరిశుద్దమైన జీవితమును మనము జీవించినపుడు ఆ పరిశుద్ధమైన జీవితమే మనకు ఇవ్వబడిన వాక్యము ఫలింపచేస్తుంది.

నీవు భూమిని దర్శించి దాని తడుపుచున్నావు దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు దేవుని నది నీళ్లతో నిండియున్నది నీవు భూమిని అట్లు సిద్ధపరచిన తరువాతవారి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వాన జల్లులచేత దానిని పదునుచేయుచున్నావు అది మొలకెత్తగా నీవు దాని నాశీర్వదించుచున్నావు. -కీర్తనలు 65:9-10

మనము పరిశుద్ధమైన జీవితమును దేవుడు ఎలా సిద్ధపరుస్తున్నాడు అని ఈ వాక్యము మనకు తెలియచేస్తుంది. మొదట దర్శించి మనము ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో అనే ఆలోచనల చేత మనలను దర్శించి మహదైశ్వర్యము కలుగుచేయుచున్నావు. అటువంటి జీవితములో పడిన దేవుని వాక్యమనే విత్తనము ఖచ్చితముగా ఫలిస్తుంది. ఈ ఆశీర్వాదము మొదట మొలక ఆ తరువాత కొంతకాలమునకు వెన్ను కూడా కనపడుతుంది. మనము స్వీకరించిన వాక్యము ఖచ్చితముగా ఫలిస్తుంది. అయితే నీవు మాత్రము త్రోవలో నిలిచి ఉండాలి అంటే పరిశుద్దముగా జీవించాలి.

వర్షమును హిమమును ఆకాశమునుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో ఆలాగే నా నోటనుండి వచ్చువచనమును ఉండును -యెషయా 55:10

దేవుని మాట ఎలా ఉంది అంటే, విత్తువానికి విత్తనము దయచేయబడుతుంది. ఆ వాక్యము విత్తబడిన తరువాత. భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగిర్చి ఫలించును. గనుక మనము పరిశుద్ధమైన జీవితమును కలిగి ఉండుట ఎంతో ఆవశ్యకము. కొంచెముగా విత్తువాడు, కొంచెముగానే పంట కోయును, విస్తారముగా విత్తువాడు విస్తారముగా పంట కోయును.

యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును అతడు చేయునదంతయు సఫలమగును. -కీర్తనలు 1:2-3

ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును అనే స్థితి దేనిని బట్టి కలుగుతుంది అంటే, దేవుని మాటను బట్టి ఆనందించుచుండగా, ఆ మాట పరిశుద్ధమైన జీవితములో విత్తబడి, తన కాలమందు అనగా, ఈ జీవితములో వేర్వేరు సమయములో అవసరమైన ఫలము మన జీవితములో అనుభవించులాగున ఉంటుంది. అయితే మనము ఒకటే పరీక్షించుకోవాలి, పరిశుద్ధమైన జీవితమును జీవిస్తున్నామా లేదా అనేదే!