28-04-2024 – ఆదివారం రెండవ ఆరాధన – ఆత్మబలము కలిగివుండడానికి

స్తోత్ర గీతము 1

నా గొప్ప రక్షకుడా.. నా మంచి నావికుడా
నువ్వుంటే చాలు యేసయ్యా.. నాకేది కొదవలేదయ్యా

కరువు కాలాలు కష్ట సమయాలు
నన్ను భయపెట్టిన బాధింప చూచినా
వ్యాధులతో బందీనైనా
శ్రులలో నేను సోలిపోయిన

నువ్వుంటే చాలు యేసయ్యా
నన్నేది తాకలేదయ్యా

ముళ్ళబాటైన గాఢాంధకారమైన
ఎత్తయిన కొండలైన లోతైన లోయలైనా
నీ కృప నన్ను వీడలేదయ్యా
నీ దండం నన్ను ఆదరించినయ్య

నువ్వుంటే చాలు యేసయ్యా
నన్నేది తాకలేదయ్యా

 

 

స్తోత్ర గీతము 2

హల్లెలూయ స్తుతి మహిమ
ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము
ఆ… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

అల సైన్యములకు అధిపతియైన
ఆ దేవుని స్తుతించెదము
అల సంద్రములను దాటించిన
ఆ యెహోవాను స్తుతించెదము

ఆకాశమునుండి మన్నాను పంపిన
దేవుని స్తుతించెదము
బండనుండి మధుర జలమును పంపిన
ఆ యెహోవాను స్తుతించెదము

స్తోత్ర గీతము 3

నే యేసుని వెంబడింతునని
నేడేగా నిశ్చయించితిని
నే వెనుదిరుగన్ వెనుకాడన్
నేడేసుడు పిల్చిన సుదినం

నా ముందు శిలువ నా వెనుక లోకాశల్
నాదే దారి నా మనస్సులో
ప్రభు నా చుట్టు విరోధుల్
నావారెవరు నా యేసుని మించిన మిత్రుల్
నాకిలలో గానిపించరని

కరువులైనను కలతలైనను
కలసిరాని కలిమి లేములు
కలవరంబులు కలిగిననూ
కదలనింకా కష్టములైనా
వదలను నాదు నిశ్చయము

శ్రమయైననూ బాధలైననూ
హింసయైన వస్త్రహీనత
ఉపద్రవములు ఖడ్గములైన
నా యేసుని ప్రేమనుండి
నను యెడబాపెటి వారెవరు

ఆరాధన వర్తమానము

మన దేవుడు మంచివాడు, ప్రేమ కలిగిన వాడు.

దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకు దును నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నే నెంతో ఆశతో నీతట్టు కని పెట్టియున్నాను. నీళ్లులేక యెండియున్న దేశమందు నా ప్రాణము నీకొరకు తృష్ణగొనియున్నది నీమీది ఆశచేత నిన్ను చూడవలెనని నా శరీరము కృశించుచున్నది. -కీర్తనలు 63:1-2

వేకువనే నేను నా దేవునిని వెదికెదను అని ప్రకటిస్తున్నాడు అంటే ఆ దేవునిని ఎంతగా నమ్మి ఉంటాడు? మన వ్యక్తిగతమైన జీవితములను కూడా వాక్యము తెలియచేసిన విధానములో మనము సిద్ధపరచుకోవాలి. అప్పుడు మనము జీవాన్ని చూడగలుగుతాము.

మన పౌరస్థితి పర లోకమునందున్నది; అక్కడనుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము.౹ -ఫిలిప్పీయులకు 3:20

ప్రభువైన యేసు నాకు రక్షకుడు అని నమ్మితే, ఖచ్చితముగా ఆయనకొరకు నమ్మిక ఉంచి కనిపెట్టేవాడివిగా, కనిపెట్టేదానివిగా ఉంటావు. ఆ రక్షకుడు ఎటువంటివాడు అని చూస్తే,

సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తినిబట్టి ఆయన మన దీనశరీరమును తన మహిమగల శరీరమునకు సమ రూపము గలదానిగా మార్చును. -ఫిలిప్పీయులకు 3:21

నీవు కనిపెడుతున్న వ్యక్తి సమస్తమును లోబరుచుకోగల శక్తి కలవాడు. ఆ శక్తి మన దీన శరీరము పైన కనపరచబడుతుంది. అందుకే కీర్తనాకారుడు చెప్పుచున్నాడు – “నీవే నా దేవుడవు, వేకువనే నిన్ను నేను వెతికెదను” అని చెప్పుచున్నాడు. అంటే, ఆయన ఏమై ఉన్నాడో అనే సత్యము ఎరిగినవాడు ఆయన కొరకు కనిపెట్టుటలో ఆలస్యము చేయడు.

మన జీవితములను మార్చగల శక్తి గలవాడు, ఏమి చేస్తే ఆయన మార్చగలవాడిగా ఉంటాడు? అని ఆలోచిస్తే, ఆయనను స్తుతించి ఆరాధించినపుడు ఆయన ఆ స్తుతి సింహాసనము మీద ఆసీనుడగుటకు వచ్చేవాడిగా ఆ ప్రభువు ఉన్నాడు. వచ్చిన ఆయన తన శక్తిని కనపరచేవాడుగా ఉంటాడు.

యెహోవా, నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. -కీర్తనలు 3:3

దేవునిని కలిగినవారు తల దించుకునే పరిస్థితే లేదు. ఒకవేళ తలదించే పరిస్థితి వస్తుంది అంటే, ఆయన ఖచ్చితముగా తనను నమ్ముకున్న బిడ్డల తల ఎత్తుటకై తన కార్యములు చేయగల సమర్థుడు.

ఏలయనగా రాజు యెహోవాయందు నమ్మిక యుంచు చున్నాడు సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండ నిలుచును. -కీర్తనలు 21:7

నీ దేవుని యందు నీవు నమ్మిక ఉంచినపుడు ఏమి జరుగుతుంది అని చూస్తే,

యెహోవా, రాజు నీ బలమునుబట్టి సంతోషించు చున్నాడు నీ రక్షణనుబట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవులలోనుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు – కీర్తనలు 21:1-2

ఈ రాజు యెహోవా యందు నమ్మిక ఉంచడమును బట్టి, దేవుని రక్షణ పొందుకున్నవాడై సంతోషిస్తున్నాడు. తన యొక్క మనసులోని కోరికలు దేవుడు సఫలము చేస్తున్నాడు అంతే కాక తాను చేసిన ప్రార్థన ఎప్పుడు చేసినా సరే దానిని అంగీకరించేవాడుగా దేవుడు ఉన్నాడు.

శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అతని తలమీద అపరంజి కిరీటము నీవు ఉంచి యున్నావు. -కీర్తనలు 21:3

అంతే కాక, తాను కలిగిన నమ్మికను బట్టి దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో అతనిని ఎదుర్కొనేవాడిగాను, తాను హెచ్చింపబడిన స్థితిలోను ఉండులాగున దేవుడు తన కార్యము చేయువాడుగాను ఉంటున్నాడు.

ఒక్కోసారి మన చుట్టు పరిస్థితులు నెగటివ్ గా మారినప్పటికీ, ఎదురుచూస్తున్నది ఆలస్యమవుతున్నప్పటికీ, మన దేవునిని నమ్మిన వాడు ఆయనమీదే నమ్మిక కొనసాగిస్తాడు. దానిని బట్టి ఖచ్చితముగా నీ జీవితములో శ్రేయస్కరమైన ఆశీర్వాదములే కలుగుతాయి.

అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్షచెట్లు ఫలింపకపోయినను ఒలీవచెట్లు కాపులేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొఱ్ఱెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యెహోవాయందు ఆనందించెదను నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతో షించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము ఆయన నా కాళ్లను లేడికాళ్లవలె చేయును ఉన్నతస్థలములమీద ఆయన నన్ను నడవచేయును. -హబక్కూకు 3:17-19

హబక్కూకు చుట్టు అంతా పోగొట్టుకున్న స్థితియే ఉంది. అయితే అటువంటి స్థితిలో ఆయన చెప్పుచున్న ప్రకటిస్తున్న సత్యము ఏమిటి అంటే, నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఇది ఒక మర్మము. ప్రత్యేకించి మనము నెగటివ్ పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ ప్రకటన ఎంతో అవసరము.

యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును -కీర్తనలు 3:5

మన కష్ట సమయములో మనము దేవునిని నమ్మి, “నీవే నా దేవుడవు” అని మనము చేసే ప్రకటన ఎంతో విలువైనది. ఒక అత్యవసరము ఉన్న సమయములో, కష్ట సమయములో నిద్ర అనేది పట్టనే పట్టదు. అటువంటి స్థితిలో ఆయనే ఆధారము అని నమ్మినవాడు పండుకొని, నిద్రపోయి మరలా మేలుకుందుని అని చెప్పగలుగుతాము.

దేని కొరకు మేలుకుంటాము అని చూస్తే,

నా మంచముమీద నిన్ను జ్ఞాపకము చేసికొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరకినట్లుగా నా ప్రాణము తృప్తిపొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్నుగూర్చి గానముచేయుచున్నది -కీర్తనలు 63:4-5

రాత్రికాల సమయములో చేసిన ధ్యానములో దేవుడు మాటలాడిన మాటలను బట్టి, హృదయము సంతోషముతో నిండిపోయింది. ఆ మాటలలోని సత్యమును నెరవేరుటకు దేవుడు తన శక్తిని బలమును ఎలా కనపరుస్తాడో, ఆయన ఆధారము అని ప్రకటించాడు గనుక, ఏ ఆధారము ఆయన చూపిస్తాడో, తెలుసుకోవడానికి ఆశ కలిగి ఉన్నాడు.

ఆయుష్షు నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతని కనుగ్రహించియున్నావు సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి యున్నావు. నీ రక్షణవలన అతనికి గొప్ప మహిమ కలిగెను గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి యున్నావు. -కీర్తనలు 21:4-5

యెహోవా యందు నమ్మిక ఉంచినవాడు, దేవుడు ధరింపచేసే, గౌరవ ప్రభావములు కలిగినవాడుగా ఉంటాడు. ఆయనను నమ్మినవాడు ఎన్నడూ సిగ్గుపడడు.

“నీవే నా దేవుడవు” అనే ఒక్క మాట ఎంతో బలమైనది. ఎప్పుడు ఆరాధించినా సరే, అనగా దైవ భక్తిని సాధకము చేసినపుడు ఖచ్చితముగా మార్పు కనబడుతుంది. ఏమి మార్పు అంటే జీవములో మార్పు చూస్తాము.

అందుకే మన దీన శరీరము మహిమ శరీరముగా మార్చబడటానికి దేవుడు ఆరాధన ఒక మార్గముగా దేవుడు మనకు దయచేసాడు.

దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.౹ -రోమా 8:28

మనము దేవునిని ప్రేమిస్తునాము అంటే ఏమి చేస్తారు? చిన్నపిల్లలను చూస్తే, ఇంటికి వచ్చిన బంధువులలో ఎవరిని ఆ పిల్లవాడు లేదా పాప ప్రేమించిందో, వారి దగ్గరకే వెళ్తారు అలాగే ఆ బంధువుకూడా ఆ చిన్నిపిల్లల వద్దకే వెళతాడు. అలాగే ఆ చిన్న పిల్లలు తాము ఇష్టపడిన వారి గురించే ఎప్పుడూ చెప్తారు.

అలాగే మనము దేవునిని ప్రేమిస్తే, ఆయనను ఆరాధించడానికి, మహిమ పరచడానికి సిద్ధపడతాము. అలాగే నీకు మేలు చేయడానికి, సమస్తాన్ని సిద్ధపరచడానికి ఆయన నీ యొద్దకు వచ్చేవాడిగా ఉన్నాడు.

ఆరాధన గీతము

ఆధారం నీవేనయ్యా
కాలం మారినా కష్టాలు తీరినా
కారణం నీవేనయ్యా

నీ దీప స్థంభమై నేను
జీవించ చిరకాల ఆశ
నీ దరికి చేరి
నను నీకర్పించి
సాక్షిగా జీవింతును (నా దేవా)

నీ మహిమ కొరకే నేను
జీవించ చిరకాల ఆశ
నీ దరి కి చేరి
నను నీకర్పించి
సాక్షిగా జీవింతును (నా దేవా)

వారము కొరకైన వాక్యము

యేసయ్య భూలోకములో ఉన్నప్పుడు చాలామంది వెంబడించారు. వారిలో అనేకులు ఇహలోకములో భోజనము గురించి వెంబడించారు. అయితే మనము పలలోక సంబంధమైన భోజనము గురించి వెంబడించేవారిగా ఉందాము.

అక్కడ సందర్భములో ఇహలోక భోజనము కొరకు వచ్చినవారు ఆయన మాటలకు నొచ్చుకొని వెళ్ళిపోయారు. ప్రభువు శిష్యులను అడిగినపుడు పేతురు ఎక్కడికి వెళతాము దేవా అని చెప్పగలిగాడు అంటే, వారు పరలోక సంబంధమైన ఆహారము కొరకే వెంబడించారు.

అప్పుడు యేసు, ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్లెను; ఆయననుగూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను. -లూకా 4:14

యేసయ్య జీవితము మన జీవితమునకు ఒక మాదిరిగా ఉంది. ఆయన ఎలా అయితే ప్రవర్తించాడో, మనము కూడా అదే విధానములో ప్రవర్తించులాగున మాదిరిగా ఇవ్వబడింది. యేసయ్య ఎలా ఉన్నాడు అని చూస్తే, ఆత్మ బలముతో జీవించినవాడుగా ఉన్నాడు.

పై వాక్యములో చూస్తే, “అప్పుడు” యేసు ఆత్మబలముతో తిరిగి వెళ్ళెను అని వ్రాయబడింది. ఎప్పుడు అని ధ్యానిస్తే –

యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను. -మత్తయి 3:16

యేసయ్య బాప్తీస్మము తీసుకున్నపుడు యేసయ్య మీదకు దేవుని ఆత్మ దిగి వచ్చింది. ఆ తరువాత అరణ్యములో శోధించబడ్డాడు,
ఆ సమయములో ఆత్మలో కొనసాగాడు. ఆ శోధన ముగించబడిన తరువాత ఆత్మలో బలము పొందుకున్నవాడుగా ఉన్నాడు.

మనము కూడా బాప్తీస్మము తీసుకున్నాము, పరిశుద్ధాత్మను పొందుకున్నాము. అయితే యేసయ్య వలే ఆత్మ బలమును మాత్రము కలిగి ఉండలేకపోవడానికి కారణము ఏమిటి? యేసయ్యను చూస్తే, అపవాది వలన ఎదురైన ప్రతీ సందర్భమును ఆయన ఎదుర్కొన్నారు.

బాప్తీస్మము తీసుకున్నపుడు నూతన ఆరంభము కలిగింది. ఆరంభములోనే అపవాది యేసయ్యను శోధించడము మొదలుపెట్టాడు. అయితే ఆరంభములోనే యేసయ్య అపవాదిని ఓడించడముకూడా మొదలుపెట్టాడు. యేసయ్య భూలోకములో ఉన్నంతకాలము అపవాదిని ఓడిస్తూనే ఉన్నాడు.

నలువది దినములు నలువదిరాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయనయొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు మనెను -మత్తయి 4:2-3

బాప్తీస్మము తరువాత 40 రోజుల ఉపవాసము తరువాత యేసయ్యకు ఆకలి కలిగింది. ఆ ఆకలితో ఉన్నప్పుడు అపవాది యేసయ్యను రాళ్ళను రొట్టెలుగా మర్చుకొమ్మని చెప్పి శోధిస్తున్నాడు. నిజానికి ఆకలి తీర్చడానికి రొట్టె ఒక ఆధారము. ఆ రొట్టె ద్వారా ఆకలి తీర్చబడి బలము పుంజ్కుని, జీవము కలుగుతుంది.

అయితే ఈ సందర్భములో యేసయ్య చెప్పుచున్న మాటలు చూస్తే –

అందుకాయన –మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను. -మత్తయి 4:4

యేసయ్య మనుష్యకుమారుడుగా ఉంటున్నాడు అయినప్పటికీ, మనుష్యులవలే ఆలోచించడంలేదు. మనుష్యుల ఆలోచనలను బట్టి చూస్తే, ఆకలి తీర్చబడటానికి రొట్టే అవసరము గనుక దానికొరకే ఆలోచన కలిగినవారుగా ఉంటారు. అయితే యేసయ్య మాత్రము అలా ఆలోచించటం లేదు.

అంటే మనము కలిగి ఉన్న అవసరము తీర్చబడటానికి అనేకమైన సొల్యూషన్స్ ఉంటాయి, అయితే దేవుని ప్రేమించే మనకు మాత్రము, దేవుని ద్వారా దయచేయబడే సొల్యూషన్ మాత్రమే గురి అయి ఉండాలి.

మన పౌరస్థితి పర లోకమునందున్నది; అక్కడనుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము.౹ -ఫిలిప్పీయులకు 3:20

మనము భారతీయులము గనుక, భారత ప్రభుత్వము మనలను పరిపాలిస్తుంది. అయితే యేసయ్య తన పౌరసత్వము పరలోకమందున్నది అని గ్రహించాడు గనుక, దేవుని మాట కొరకు, చిత్తము కొరకు మాత్రమే చూసినవాడుగా ఉన్నాడు.

ఇక్కడ ఉన్న సందర్భములో ఆకలి గురించి వ్రాయబడింది. దీనిని ఏ అవసరములో ఉన్న పరిస్థితికి అయినా వర్తింపచేయవచ్చు. అందుకే మనము కలిగి ఉన్న అవసరములో దేవుని మాట వలన దొరికే సొల్యూషన్ మాత్రమే ఎంతో విలువైనది.

ఆ లోగా శిష్యులు–బోధకుడా, భోజనము చేయుమని ఆయనను వేడుకొనిరి.౹ అందుకాయన–భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా౹ శిష్యులు–ఆయన భుజించుటకు ఎవడైన నేమైనను తెచ్చెనేమో అని యొకనితో ఒకడు చెప్పు కొనిరి.౹ యేసు వారిని చూచి–నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నది.౹ -యోహాను 4:31-34

మనము ఆత్మలో బలము పొందుకోవాలి అంటే యేసయ్య ఎలా ఉన్నాడో, మనము కూడా అలాగే ఉండాలి. దేని కొరకు ఈ భూలోకములోనికి వచ్చాడో, దానిని గూర్చి మాత్రము మర్చిపోయినవాడు కాదు.

మన జీవితము కూడా ప్రభువు చేత, ప్రభువు కొరకు సృష్టించబడింది. ఈ లోకములో ఉన్న దానితో మనము తృప్తిపరచబడము గానీ, ప్రభువు మాటలు, కార్యములను బట్టే తృప్తి చెందుతాము.

యేసయ్య లోకములో ఉన్నప్పుడు మిగతా మనుష్యులవలెనే ఉంటాడు అని అపవాది అనుకున్నాడు. అయితే యేసయ్య దేవుని సంగతులను మాత్రమే ఆలోచించేవాడుగా ఉన్నాడు. మనము కూడా ఆత్మలో బలము కలిగి ఉండాలి అంటే, మనము ఆత్మ సంబంధులుగానే జీవించాలి. అలా ఉండాలి అంటే, దేని కొరకు ఈ భూమి మీదకు వచ్చామో మనము గ్రహించాలి.

మన ఆలోచన దేవుని సంగతులే అయి ఉడాలి. ఉదాహరణకు మనము ధనము అవసరము ఉంది అనుకోండి. అప్పుడు అపవాది మోసపూరితమైన ఆలోచనలతో ప్రేరేపించి పడగొట్టడానికి ప్రయత్నిస్తాడు. అయితే అప్పుడు అలా పడిపోక, దేవుని సంగతుల గురించి ఆలోచించేవాళ్ళం అయితే, నా అక్కరకు రాకమునుపే ఆయనకు ముందే తెలుసు గనుక, నా అవసరము తీర్చబడుటకు సిద్ధపరచాడు అని నమ్మి, నిలిచే వారముగా ఉంటాము.

సత్యము ఎరిగి సత్యములో నిలబడితే, మనము ఖచ్చితముగా మనకు విజయమే!

మనము చాల జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవలసిన సత్యము – “మనకు ఎక్కడ అవసరమో, అక్కడ అపవాది ఖచ్చితముగా ప్రేరేపిస్తాడు. అయితే మనము మాత్రము దేవుని మాటలోని సత్యమును గ్రహించి, నిలబడాలి”.

అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసికొనిపోయి, దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి –నీవు దేవుని కుమారుడ వైతే క్రిందికి దుముకుము – ఆయన నిన్నుగూర్చి తన దూతల కాజ్ఞాపించును, నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు – ప్రభు వైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడియున్నదని వానితో చెప్పెను. -మత్తయి 4:5-7

ఇక్కడ చూస్తే, అపవాది వాక్యమునే చూపించి యేసయ్యతో మాట్లాడుతున్నాడు. అయితే యేసయ్య సమాధానము చూస్తే – “ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని” వ్రాయబడింది అని చెప్పాడు.

అనగా అపవాది వాక్యమును సరైన విధానములో కాక మనకు నచ్చిన రీతిలో తీసుకోవడము కొరకు ప్రేరేపిస్తాడు. అయితే దేవుని ప్రేమించేవారిగా మనము వాక్యములోని సరైన సత్యమును ఆధారము చేసుకొని నిలబడాలి.

అపవాది చెప్పిన అదే మాటలు గ్రంథమునుండి చూస్తే –

నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్నుగూర్చి తన దూతలను ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగులకుండవారు నిన్ను తమ చేతులమీద ఎత్తి పట్టుకొందురు -కీర్తనలు 91:11-12

ఈ వాక్యములో “నీ మార్గములన్నిటిలో ” అని చెప్పుచున్నది. అయితే అపవాది కొండ శిఖరము మీదకు తీసుకువెళ్ళి “నీవు క్రిందకు దుముకు”, వాక్యము ప్రకారము నిన్ను రక్షించడానికి దేవదూతలు ఎత్తి పట్టుకుంటారు అని శోధించాడు.

అపవాది యొక్క ఉద్దేశ్యము యేసయ్య గ్రహించినవాడు గనుకనే అక్కడ గద్దించినవాడుగా ఉన్నాడు. మన జీవితములలో కూడా వాక్యమును సరైన విధానములో తీసుకోవడము అనే విషయములో జాగ్రత్త కలిగి ఉండాలి.

మరల అపవాది మిగుల ఎత్తయిన యొక కొండమీదికి ఆయనను తోడుకొనిపోయి, యీ లోక రాజ్యములన్నిటిని, వాటి మహిమను ఆయనకు చూపి –నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినయెడల వీటినన్నిటిని నీకిచ్చెదనని ఆయనతో చెప్పగా యేసు వానితో–సాతానా, పొమ్ము – ప్రభు వైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదనెను. -మత్తయి 4:8-10

మనమందరము ఈ పరిస్థితి గుండా వెళతాము. అపవాదికి మొక్కడము అంటే, అపవాది ఆధీనములో ఉండి అపవాది ప్రేరేపించిన క్రియలు చేయడమే. అయితే యేసయ్య సమాధానము చూస్తే – “సాతానా, పొమ్ము – ప్రభు వైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను”. అంటే ప్రభువుకే లోబడాలి తప్ప ఇంక దేనికీ లోబడి ఉండకూడదు అని దీని అర్థము.

లోబడి ఉండటము అంటే, ఏమి చెప్తే ఆ ప్రకారము చేయడమే. మన జీవితములో ఎన్నిసార్లు ఎవరూ చూడట్లేదు అని చెప్పి, దేవునికి లోబడకుండా అపవాదికి లోబడినవారిగా ఉంటున్నాము. దేవునికి ఇష్టము లేనిది చేస్తున్నాము అంటేనే, అపవాదికి నచ్చినది చేస్తున్నాము అని అర్థము.

అపవాది మొదట నిన్ను ఆకర్షించి, దేవునికి విరోధముగా ఉండునట్లు నిన్ను ప్రేరేపిస్తాడు. అయితే, దేవునికి వ్యతిరేకమైన ఆలోచన అని గ్రహించి, ఎదిరించి నిలబడగలగాలి. అప్పుడు నీవు దేవునికే మొక్కినవాడిగా ఉండగలుగుతావు.

అపవాది ఈ లోక మహిమలు చూపిస్తాడు. అవి ఎంతో ఆకర్షణీయముగా కనబడేలా చూపిస్తాడు. అయితే నేను ప్రత్యేకమైన వాడను, ప్రత్యేకమైన దానిని అనే ఆలోచన మనము కలిగి ఆ ఆకర్షణను తిప్పికొట్టి నిలబడినప్పుడు, మనము ఆత్మలో బలము పొందుకొని నిలబడ గలుగుతాము.

దినము వెంబడి దినము ఎదురయ్యే ప్రతిదానిలో అపవాదిని ఓడిస్తూ నడిస్తే, నీవు ఆత్మలో బలము క్రమక్రమముగా పొందుకుంటావు.

యేసయ్య ఒకసారి ఆత్మలో బలము పొందుకున్న తరువాత యేసయ్య వెళ్ళిన ప్రతి చోట అపవాదిని జయించాడు. ఎంతమంది జీవితములను అపవాది కబళించాడో, ఆ ప్రతీ ఒక్కరి జీవితములలో అపవాదిని జయించాడు.

అపవాదిని ఓడించడానికే నీన్ను దేవుడు సృష్టించాడు. కృప వెంబడి కృప ఎలా అయితే కలుగుతుందో, విజయము వెంబడి విజయము కలుగుతుంది.

ఆత్మ బలము మనము పొందుకున్నప్పుడు ఏమి జరుగుతుంది అంటే –

అప్పుడు యేసు, ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్లెను; ఆయననుగూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను. -లూకా 4:14
చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను-మత్తయి 4:12

నిన్ను ఆత్మ బలముతో నింపి, చీకటిలో ఉన్నవారికి వెలుగుగా చేయడమే, ఆశీర్వాదముగా చేయడమే దేవుని ఉద్దేశ్యము.