28-04-2024 – ఆదివారం మొదటి ఆరాధన – ఎల్లప్పుడు జీవముతో ఉండడానికి

స్తోత్ర గీతము 1

దేవా నీకే నా స్తుతి పాడెదన్
దేవా నిన్నే నెన్ కొనియాడెదన్
దేవా నీకే నా స్తుతి పాడెదన్
దేవా నీకే నా స్తుతి పాడెదన్
దేవా నిన్నే దేవా నిన్నే
దేవా నిన్నే నెన్ కొనియాడెదన్

ఆపత్కాలమందు నీవే నాకు ఉత్తరమిచ్చావు
అన్ని ఫలాలతో తోడైఉండి నడిపిస్తున్నావు (2)
అంతులేని ప్రేమ నాపై కురిపిస్తున్నావు (2)

మహోన్నతుడా నీకే వందనం
మహోన్నతుడా నీకే వందనం
మహాఘనుడా మహాఘనుడా నీకే వందనం
మహాఘనుడా మహాఘనుడా నీకే వందనం

నన్న పుట్టించావు పోషించావు ఆదరించావు
కన్ని తల్లికన్న మిన్నగ నన్ను లాలిస్తున్నావు
నన్న పుట్టించావు పోషించావు ఆదరించావు
కన్ని తల్లికన్న మిన్నగ నన్ను లాలిస్తున్నావు
చిన్న ప్రాయం నుండి నన్ను నడిపిస్తున్నావు

“మహోన్నతుడా నీకే వందనం”
“దేవా నీకే నా స్తుతి పాడెదన్”

భంగపడిన వేళ తోడై ఉండి నడిపిస్తున్నావు
వ్యాది భాదలందు తోడై ఉండి స్వస్థపరిచావు
భంగపడిన వేళ తోడై ఉండి నడిపిస్తున్నావు
వ్యాది బాధలందు తోడై ఉండి స్వస్థపరిచావు
దుఃఖ బాధల్లో నీవు నాకు తొడై వున్నావు
దుఃఖ బాధల్లో నీవు నాకు తోడై వున్నావు

“మహోన్నతుడా నీకే వందనం”
“దేవా నీకే నా స్తుతి పాడెదన్”

స్తోత్ర గీతము 2

తరతరములు ఉన్నవాడవు
యుగయుగములు ఏలువాడవు
నీవే రాజువు నీవే దేవుడవు

జగాలను ఏలే జయశీలుడవు నీవు
జనసైన్యములను నడిపే విజయశీలుడవు నీవు
ఎన్నితరాలు మారినా ఎన్ని యుగాలు గడిచినా
నీవే నీవే నీవే రారాజువు.
“తరతరములు”

భూమికి నీవే పునాదులు వేసినవాడవు
నీ రాజ్యస్థాపనకై ఈ సృష్టినే కలుగజేసావు
సృష్టికర్తవు నీవే శాంతిదాతవు నీవే
నీవే నీవే నీవే మహరాజువు
“తరతరములు”

స్తోత్ర గీతము 3

నేను నమ్ముకున్న నమ్మదగిన నా దేవుడు

ఆరాధన వర్తమానము

ఈరోజు తన సన్నిధిలో నిలవబెట్టిన దేవదేవునికే స్తుతులు స్తోత్రములు. దేవుని మాటలలో దేవుని ఉద్దేశ్యములు నెరవేరబడే శక్తి ఉంది.

దేవుని మాటలు అనేక దినములుగా వింటున్న మనము ఆ విన్న వాక్యమునకు విధేయత చూపించవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క ఉద్దేశ్యము, నెరవేర్చబడటానికి విధేయత ఖచ్చితముగా అవసరము.

ఆదాము విధేయత చూపించినంత కాలము దేవుడు సిద్ధపరచిన స్థలములో ఉన్నాడు. అవిధేయత చూపించినపుడు సిద్ధపరచబడిన స్థలములోనుండి తరిమివేయబడ్డాడు. గనుక మనము ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి.

ఎప్పుడైతే మనము దేవుని వాక్యమునకు, మాటకు విధేయత చూపించినపుడు దేవుని ఉద్దేశ్యములు నెరవేరడానికి మార్గములు తెరువబడతాయి

యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారాతోను ప్రచురించుట మంచిది. -కీర్తనలు 92:1-2

యెహోవాను స్తుతించుట మంచిది అని లేఖనములు చెప్పుచున్నాయి. అయితే ఈ మాట ఎవరిగురించి? ఎవరికి మంచి జరుగుతుంది? ఆత్మీయమైన ప్రతీ విషయములలో మన క్షేమమే దాచబడి ఉంటుంది. అందుకే శరీర సంబంధమైన వాటి వెంబడి వెళ్ళకుండా, ఆత్మ సంబంధమైన సంగతులలో వెళ్ళే ఆశ మనము కలిగి ఉంటే, దేవుడు జీవము వైపు నడిపిస్తాడు.

గనుకనే యెహోవాను స్తుతించుట అనేది మనకే మంచిది. ఈరోజు ఆయనను స్తుతించడానికి మరొక అవకాశము మనకు దయచేయబడింది. ఆయనను స్తుతించిన ప్రతీ సారీ మనము మేలును పొందుకొనేవారిగా ఉంటాము.

మన దేవుడు మన స్తుతులకు అర్హుడు అయి ఉన్నాడు. మన జీవితమును ప్రారంభించినవాడు, రక్షించినవాడు, కొనసాగిస్తున్నవాడు, మనకొరకు సమస్తము సిద్ధపరచినవాడు ఆయనే గనుకనే అర్హుడు. మనము ప్రభువు కొరకు పలికే మాటలే మన జీవితము అయినప్పుడు మన ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది.

దేవుడు సిద్ధపరచిన దానిలో నీ క్షేమమే, సంతోషమే, సమాధానమే దాచబడి ఉంటుంది. ఆయనను స్తుతించడానికి మొదటి కారణము మనమీద ఆయన చూపే కృప. మనము ఏమై ఉన్నామో అది ఆ ప్రభువు కృపవలననే. ఆ కృప వలననే ప్రతీ దినము మన జీవితములో కొనసాగించబడుతుంది, ఆయన విశ్వాస్యత వలననే మరొక దినము ప్రారంభమవుతుంది.

మన మంచి దేవుని విశ్వాస్యత ఒక్క క్షణము చూపించకపోతే, మన జీవితము వెంటనే నాశనము అయిపోతుంది.

ఎందుకనగా యెహోవా, నీ కార్యముచేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు నీ చేతిపనులబట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి! నీ ఆలోచనలు అతిగంభీరములు, -కీర్తనలు 92:4-5

మన సంతోషమునకు కారణమే ఆయన కృప, మనము బ్రతికి ఉండటానికి కారణము ఆయన విశ్వాస్యత. మన దినమంతా సంతోషముగా కొనసాగించబడుతున్నాము అంటేనే కారణము ఆయన కృప, ఆయన విశ్వాస్యతలే కారణము అనే సత్యము గ్రహించినపుడు, ఆయనను స్తుతించకుండా మౌనముగా ఉండలేము.

దేవుడు మనలను ఏ విధముగా నడిపిస్తున్నాడు? ఏ స్థితిలో నన్ను కొనసాగిస్తున్నాడు? అసలు మన స్థితి ఏ విధముగా ఉండవలసినది? ఈ విషయములను జ్ఞాపకము చేసుకుని, గ్రహించినపుడు ఖచ్చితముగా మనము ఆయనకు కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేము.

దావీదు గొర్రెలు కాసేవాడిగా ఉన్నపుడు సితారా వాయించుచూ దేవుని స్తుతించాడు. ఆ గొర్రెలు కాసేవారు మంచిగా కనపడే వస్త్రములు వేసుకోరు. అదే దావీదు రాజుగా ఉన్నప్పుడు కూడా, తన మొదటి స్థితిని మర్చిపోకుండా దేవునిని స్తుతించినవాడుగా ఉన్నాడు. నన్ను ఇంతగా హెచ్చించడానికి నేను ఏ పాటి వాడిని దేవా అనే ఆలోచన తన హృదయములో ఎల్లప్పుడు కలిగినవాడుగా దావీదు ఉన్నాడు. ఏ మాత్రము తన స్థితిని బట్టి గర్వము కలిగినవాడుగా లేడు.

మనము కూడా మనము ఎంతగా వృద్ధిలోనికి వచ్చినా సరే, దానికి కారణము ఆయన కృప, విశ్వాస్యతలే కారణము అనే ఆలోచనవిధానము యదార్థముగా కలిగి, దేవునిని మనము స్తుతిగీతము ద్వారా, మన జీవితము ద్వారా స్తుతిద్దాము.

నేనేమై ఉన్నానో అది కేవలము నీ కృప, నీ విశ్వాస్యత మాత్రమే దేవా! నీకే నా కృతజ్ఞతాస్తులు.

ఆరాధన గీతము

నిను విడిచినను నీవు విడువవు
నిను మరచినను నీవు మరువవు
విడువని నీదు కృపలతో
మరువని నీదు ప్రేమతో
నాతోడు నిలిచావయ్యా

నేనేమై ఉన్ననూ
నాకేమి ఉన్ననూ
అది నీ ప్రేమే నీ కృపయే
నీ నమ్మకత్వమయ్యా

చీకటిని ప్రేమించినా
వెలుగునే ద్వేషించినా
నీ కృప విడిచిపోలేదయ్యా
నీ ప్రేమ మారిపోలేదయ్యా

అందుకే వందనం యేసయ్యా

 

వారము కొరకైన వాక్యము

ఈరోజు “ఎల్లప్పుడూ జీవముతో ఉండటానికి” మనము ఏమి చెయ్యాలి అనేది నేర్చుకుందాము.

శరీర సంబంధమైన సాధకము కొంచెముమట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి యిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతోకూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును.౹ -1 తిమోతికి 4:8

ఇప్పటి జీవము, రాబోవు జీవము అనగా ఎల్లప్పుడూ జీవము కలిగి ఉండుటకు దైవభక్తిని సాధకము చేయాలి. శరీర సంబంధమైన సాధకము కొంతమట్టుకే అనగా ఆ శరీరమునకు సంబంధించిన విషయములో మాత్రమే ప్రయోజనము చేకూరుస్తుంది.

దేవుడు అనగా తండ్రి, కుమారుడు, మరియు పరిశుద్ధాత్ముడు. శరీరము కొరకు చేసిన సాధకము ఆరోగ్యమును దయచేస్తుంది. అదే దైవభక్తి అనే సాధకము మనకు జీవమును దయచేస్తుంది.

వెంటనే నేను ఆత్మ వశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి యుండెను. సింహాసనమునందు ఒకడు ఆసీసుడై యుండెను,౹ ఆసీనుడైనవాడు, దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు; మరకతమువలె ప్రకాశించు మేఘధనుస్సు సింహాసనమును ఆవరించియుండెను.౹ సింహాసనముచుట్టు ఇరువది నాలుగు సింహాసనములుండెను, ఈ సింహాసనములందు ఇరువదినలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని, తమ తలలమీద సువర్ణ కిరీటములు పెట్టుకొన్నవారై కూర్చుండిరి.౹ ఆ సింహాసనములోనుండి మెరుపులును ధ్వనులును ఉరుములును బయలు దేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి; అవి దేవుని యేడు ఆత్మలు.౹ మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజువంటి సముద్రమున్నట్టుండెను. ఆ సింహాసనమునకుమధ్యను సింహాసనము చుట్టును, ముందు వెనుక కన్నులతోనిండిన నాలుగు జీవులుండెను.౹ మొదటి జీవి సింహమువంటిది; రెండవ జీవి దూడవంటిది; మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖముగలది; నాలుగవ జీవి యెగురుచున్న పక్షిరాజువంటిది.౹ ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను, అవి చుట్టును రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి. అవి–భూతవర్తమాన భవిష్యత్కాలములలోఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అని మానక రాత్రింబగళ్లు చెప్పుచుండును.౹ -ప్రకటన 4:2-8

తండ్రితో సహవాసము చేయడానికి ఒక మాదిరి ఈరోజు మనకు దేవుడు తెలియచేస్తున్నారు. పై వాక్యములో మనము చూసిన జీవులు చూస్తే, అనునిత్యము తండ్రిని స్తుతిస్తూ ఉన్నారు. భూతవర్తమాన భవిష్యత్కాలములలోఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అని మానక రాత్రింబగళ్లు స్తుతిస్తున్నారు.

అనగా తండ్రిని స్తుతించుట ద్వారా ఆయనతో సహవాసము చేయగలుగుతాము. మనము అను నిత్యము తండ్రిని ఈ విధముగా స్తుతించి కీర్తించుట ద్వారా ఏమి జరుగుతుంది? ఇప్పటి జీవము విషయములోనూ, రాబోవు జీవము విషయములోనూ ప్రయోజనమవుతుంది.

దైవభక్తి అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యెడల మనము చూపించే భక్తి. శరీర వ్యాయమము చేసేవాడు మొదట సన్నగా ఉంటాడు, కండలు ఉండవు. అదే దినదినము ఆ సాధకము చేయడము ద్వారా వాడి శరీరము కండలు తిరిగి, బలముగా ఉంటుంది.

మనము ఎక్కడ ఉన్నా సరే, తండ్రిని స్తుతించుట మనము మర్చిపోకూడదు. ఒక్క సారి మనము చేయలేకపోయినసరే, ఏదో కోల్పోయిన ఆలోచన మనము కలిగి ఉండేంతగా మనము సిద్ధపడాలి.

స్తుతించుట అంటే ఆయన ఏమి అయి ఉన్నాడో దానిని ఒప్పుకోవడమే. ఆ జీవులు, భూతవర్తమాన భవిష్యత్కాలములలోఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు అని ఒప్పుకుంటున్నారు. నీ జీవితములో నీవు తండ్రిని గూర్చి ఏమి తెలుసుకున్నావో, అనుభవించావో దానిని ఒప్పుకోవడమే స్తుతించుట.

అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవులలోనుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. -కీర్తనలు 21:2

అతని పెదవులలోనుండి వచ్చిన ప్రార్థన తప్పకుండా అంగీకరించబడుతుంది. అంటే ఎన్ని సార్లు ప్రార్థన చేసినా సరే అది తప్పకుండా అది అంగీకరించబడుతుంది అని అర్థము చేసుకోగలము.

స్తుతి ఎలా అయితే తండ్రితో సహవాసము చేయడానికి ఒక మాదిరి అయి ఉందో, ప్రార్థన కూడా ఆయనతో సహవాసము చేయడానికి ఒక మాదిరి అయి ఉంది.

ప్రార్థనలో మనము తండ్రితో సహవాసము చేసినపుడు, ఇప్పటి జీవము విషయములోనూ, రాబోవు ప్రార్థన విషయములోనూ మనకు ప్రయోజనకరమైనది గా ఉంటుంది.

పైనున్న వాటిమీదనేగాని, భూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకొనకుడి; ఏలయనగా మీరు మృతిపొందితిరి, మీ జీవము క్రీస్తుతోకూడ దేవునియందు దాచబడియున్నది.౹ -కొలొస్సయులకు 3:2

మనము దేవుని సన్నిధిలో ప్రతీ దినము తండ్రితో సహవాసము స్తుతించుట ద్వారా, ప్రార్థన ద్వారా కలిగి ఉంటున్నాము అనుకోండి. అప్పుడు ఆ ప్రార్థన ఎలా ఉండాలి అంటే, పరలోక సంబంధమైన విషయముల గురించి అడిగేవారిగా మన ప్రార్థన ఉండాలి. పరలోక సంబంధమైనది ఏమిటి అని చూస్తే, అది దేవుని కృపయే!

మరొక సత్యము – పరసంబంధమైనది భూసంబంధమైనదానిని నడిపించేదిగా ఉంటుంది.

ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నియు ఉత్సహించి సంతోషించెదము. -కీర్తనలు 90:14

దేవుని కృప పరసంబంధమైనది గనుక, ఆయన కృప కొరకు మనము కనిపెట్టుకొని ఆయనను అడిగేవారిగా మనము సిద్ధపడాలి. అప్పుడు ఆయన కృపనుబట్టి మనము మన దినములలో మనకు అవసరమైన సమస్తము అనుగ్రహించబడి మనము సంతోషము కలిగినవారిగా ఉంటాము.

పౌలు జీవితములో ఒక ముల్లు ఉంచబడింది. అయితే దానిని తీసివేయమని మూడు మారులు ప్రార్థించినప్పుడు, “నా కృప నీకు చాలును” అని ప్రభువు చెప్పాడు. అప్పటినుండి, ఆయన కృపను బట్టి సమస్తము చేయగలను అనే స్థితిలోనికి పౌలు మారాడు. అందుకే మనము ఆయన కృప కొరకు మనము కనిపెట్టుకోవాలి.

మనలను సరైన మార్గములో నడిపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రితో మనము ఈరోజు నేర్చుకున్న విషయముల ప్రకారము సహవాసము కలిగి ఉన్నప్పుడు ఇప్పటి జీవము విషయములోనూ, రాబోవు జీవము విషయములోను మనకు ప్రయోజనముగా ఉంటుంది.

ఇంతవరకు తండ్రితో సహవాసము ఎలా చేయాలో నేరుచుకున్నాము. ఇప్పుడు కుమారుడైన యేసుక్రీస్తుతో ఎలా సహవాసము చేయ్యాలో నేర్చుకుందాము.

జీవవాక్యమునుగూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము.౹ -1 యోహాను 1:1

కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అనే మూడు విషయాలను చూస్తే. చూచుట, కనుగొనుట, తాకుట.

శిష్యులు ఏమి విన్నారో దానిని చూడటానికి వారు సహవాసము కలిగి ఉన్నారు. ఏమి చూచారో, దాని గురించి లోతైన సత్యములను కనుగొనటానికి వారు సహవాసము కలిగి ఉన్నారు. ఏమి కనుగొన్నారో దానిని తాకారు అనగా అనుభవించడానికి వారు సహవాసము కలిగి ఉన్నారు.

ఇలా సహవాసము చేయడము బట్టి, ఇప్పటి జీవము విషయములోను, రాబోవు జీవము విషయములోను ప్రయోజనము చేకూరుస్తుంది.

ఉదాహరణకు యేసయ్యలో సమృద్ధి అయిన జీవము ఉంది అని విన్నాము అనుకోండి. అప్పుడు వాక్యమును ధ్యానము చేయడము ద్వారా ఆ సత్యమును మనము ఖచ్చితముగా కనుగొంటాము. ఆ సత్యములో నిలబడటము ద్వారా కనుగొన్న దానిని అనుభవించేవారిగా ఉంటాము.

ఆకాశము భూమి గతించినను, నా మాటలు గతించవు అని వాక్యము సెలవిస్తుంది. అయితే వాక్యమును మనకు అనుగుణముగా మార్చుకోకూడదు. అయితే ఆ వాక్యమునకు అనుగుణముగా మనమే మార్చుకోవాలి.

మన పౌరస్థితి పర లోకమునందున్నది; అక్కడనుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము.౹ సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తినిబట్టి ఆయన మన దీనశరీరమును తన మహిమగల శరీరమునకు సమ రూపము గలదానిగా మార్చును. -ఫిలిప్పీయులకు 3:20-21

యేసుక్రీస్తు అనగా వాక్యము అయి ఉన్నారు. అనగా మనము వాక్యములో కనిపెట్టినపుడు. సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తినిబట్టి, ఒక మంచి జీవితము అంటే ఎలా ఉంటుందో, ఆ మంచి స్థితిలోనికి మన స్థితి మార్చబడుతుంది. నీ జీవితమును మార్చగలిగిన శక్తి దేవుని వాక్యములో ఉంది.

తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునితో ఖచ్చితముగా మనము సహవాసము కలిగి ఉండాలి.