14-04-2024 – ఆదివారం మొదటి ఆరాధన

స్తోత్ర గీతము 1

పాపాన్ని పోగొట్టి శాపాన్ని
తొలగించా భూలోకం వచ్చావయ్యా
మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువను మోసావయ్య
కన్నీటిని తుడిచావయ్యా సంతోషం ఇచ్చావయ్య
మనుషులను చేసావయా నీ రూపాన్ని ఇచ్చావయ్యా
నా సర్వం యేసయ్య నా జీవం యేసయ్య
నా ప్రాణం యేసయ్య నా ధ్యానం యేసయ్య

బంగారం కోరలేదు వెండియు కోరలేదు హృదయాన్ని కోరావయ్య
ఆస్తియు అడగలేదు అంతస్థులడగలేదు హృదయాన్ని అడిగావయ్య
నేవెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా
నా సర్వం యేసయ్య నా జీవం యేసయ్య
నా ప్రాణం యేసయ్య నా ధ్యానం యేసయ్య

తల్లి నన్ను మరచిన తండ్రి నన్ను మరచిన యేసయ్య మరువడయ్యా
బంధువులు విడిచిన స్నేహితులు విడచిన యేసయ్య విడువడయ్య
చేయిపట్టి నడుపునయ్య శిఖరముపై నిలుపునయ్య
నా సర్వం యేసయ్య నా జీవం యేసయ్య
నా ప్రాణం యేసయ్య నా ధ్యానం యేసయ్య

స్తోత్ర గీతము 2

దీవించావే సమృద్ధిగా
నీ సాక్షిగా కొనసాగమని
ప్రేమించావే నను ప్రాణంగా
నీ కోసమే నను బ్రతకమని

దారులలో.. ఏడారులలో..
సెలయేరులై ప్రవహించుమయా..
చీకటిలో.. కారు చీకటిలో..
అగ్ని స్తంభమై నను నడుపుమయా..
||దీవించావే సమృద్ధిగా||

నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా
నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా
నా ఒంటరి పయనంలో నా జంటగ నిలిచావే
నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే (2)

ఊహలలో.. నా ఊసులలో..
నా ధ్యాస…. బాసవైనావే..
శుద్ధతలో.. పరిశుద్ధతలో..
నిను పోలి నన్నిల సాగమని..
||దీవించావే సమృద్ధిగా||

కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా
కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా
నా కన్నీరంత తుడిచావే కన్నతల్లిలా
కొదువంతా తీర్చావే కన్నతండ్రిలా (2)

ఆశలలో.. నిరాశలలో..
నేనున్నా నీకని అన్నావే..
పోరులలో.. పోరాటములో..
నా పక్షముగానే నిలిచావే..
||దీవించావే సమృద్ధిగా||

స్తోత్ర గీతము 3

మార్గం నేనే – అన్నారు యేసు
సత్యం నేనే – అన్నారు యేసు
జీవం నేనే – అన్నారు యేసు
నాకై మరణించి లేచాడు

నాలో పాపాన్ని తొలగించి – శాపాన్ని విడిపించి జీవం ఇస్తాడే
నాలో పరిశుద్ధాత్మ నింపి – శక్తితో నను నడిపి గమ్యం చేరుస్తాడే
రానున్న రారాజు నా యేసు మహా రాజు ||2||

స్వస్థపరచే – నా మంచి యేసు
స్వేచ్ఛనిచ్చే – నా మంచి యేసు
శ్వాస నింపే – నా మంచి యేసు
హృదిలో చోటిస్తే నివసిస్తాడే
“నాలో పాపాన్ని తొలగించి”

విడుదల నిచ్చే – నా మంచి యేసు
విజయం ఇచ్చే – నా మంచి యేసు
విరోధిని జయించే – నా మంచి యేసు
విశ్వాస వీరునిగా మలిచాడు
“నాలో పాపాన్ని తొలగించి”

రక్తం కార్చే – నా మంచి యేసు
రక్షణ ఇచ్చే – నా మంచి యేసు
రమ్మని పిలిచే – నా మంచి యేసు
చిరకాలం ఆయనతో ఉండాలని
“నాలో పాపాన్ని తొలగించి”

ఆరాధన వర్తమానము

మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ఆ ప్రేమను గుర్తించినవారు అందరూ ఆ ప్రేమను వెల్లడిపరుస్తారు. మన ఆత్మీయ జీవితములు దేవుని ఆధారము చేసుకొని కొనసాగించబడిన ప్రతిసారీ విజయమే మనకు.

ఈ దినము యొక్క ప్రాముఖ్యత తెలుసుకొనుట ఎంతో ముఖ్యము. “ఈ లోక మర్యాదను అనుసరింపక” అనే మాట ఎంతో లోతైనది. ఈ మాట లోకాచారములు, పద్ధతులు విషయములో మనము సుళువుగా అర్థము చేసుకుంటాము అయితే ఈ దినము కూడా మనము ఈ మాటను జ్ఞాపకము చేసుకోవాలి.

ఈలోకములో సోమవారము నుండి, శనివారము వరకు పని చేసుకొని ఆదివారము విశ్రాంతి తీసుకొనేవారుగా ఉంటారు. ఆరు దినములు పని చేసుకొని ఆదివారము శారీరక విశ్రాంతి తీసుకొంటారు. అయితే మనమైతే ఆరు దినము పనిచేసుకొని, ఆదివారము మాత్రము ప్రాముఖ్యముగా మనము ఎంచి దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించే దినము.

యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారాతోను ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా, నీ కార్యముచేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు నీ చేతిపనులబట్టి నేను ఉత్సహించుచున్నాను. -కీర్తనలు 92:1-4

అనగా ఆరు దినములు ఆయన కృపను పొందుకున్నవారముగా ఉన్నాము. ఈ కృప ద్వారా ఆరు దినములు మన జీవితములో కార్యము జరిగించబడినాయి. ఆయన విశ్వాస్యత ద్వారా ప్రతి రాత్రి మన జీవితములో కార్యము జరిగింది.

అందుకే నీ కృపలేని క్షణము నేను ఊహించలేను అని కీర్తనాకారుడు స్తుతించినాడు. మన జీవితములను లాక్కుపోవడానికి అపవాది అనేక ప్రయత్నములు చేస్తూనే ఉంటాడు. అయితే ఆ ప్రయత్నములలో మనము పడిపోకుండా దేవుని కృప, విశ్వాస్యత కనపరుస్తున్నారు.

అంతేకాక దేవుడు చూపిన కృపను బట్టే, మనము సంతోషిస్తున్నాము. అటువంటి కృపను పొందుకున్న మనము ఆయన నామమును ఘనపరచాలి, కొనియాడాలి. దేవునికి సంబంధించిన ఏ విషయములోనైనా ఉదాసీనత అస్సలు ఉండనివ్వద్దు.

నా విశ్రాంతిదినమున వ్యాపారము చేయకుండ నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండినయెడల విశ్రాంతిదినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితదినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించినయెడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండినయెడల నీవు యెహోవాయందు ఆనందించెదవు దేశముయొక్క ఉన్నతస్థలములమీద నేను నిన్నెక్కిం చెదను నీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యమును నీ యనుభవ ములో ఉంచెదను యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. -యెషయా 58:13-14

ఈ దినము ప్రతిష్టితమైన దినము. ఆరు దినములు మన ఉద్యోగము కొరకు ప్రతిష్ట చేయబడ్డాము. అయితే ఈ ఏడవ దినము దేవుని కొరకు ప్రతిష్ట చేయబడిన దినము, మనము దేవుని కొరకు ప్రతిష్ట చేయబడ్డాము. ఆయనను స్తుతించుటకు, మహిమపరచుటకు, ఆయన నామమును స్తుతించుటకు మన సమయమును ప్రతిష్టించాలి.

వ్యాపారము అనగా స్వంత పనులు అనగా నీ ప్రమేయము కలిగి నీవు చేసుకొనే పనులు పక్కనపెట్టి. విశ్రాంతి దినము మనోహరమైన దినముగా, చాలా సంతోషకరమైన దినము అని, యెహోవాకు ప్రతిష్టితమైన దినము అనుకొని ఆచరించిన యెడల,

దేవుని స్తుతించడానికి ఎవరెవరు ఉన్నారు అని చూస్తే, దేవదూతలు, శెరాపులు, 24 పెద్దలు నిత్యము ఆరాధిస్తూ ఉన్నారు. వారితో కలిసి ఆ దేవదేవుని ఆరాధించడానికి మనకు కూడా అవకాశము ఈ దినము దొరికింది.

ఈ భూలోకములో దేవుని చిత్తానుసారమైన కార్యములు జరుగుచున్నవి. మన జీవితములో కూడా దేవుని కార్యములే జరిగాయి అని యెరిగి, ఈ దినమును ఘనముగా ఆచరించినయెడల దేవుని మహిమపరచేవారిగా మనము ఉంటాము. అనగా అలవాటుగా కాక, సర్వశక్తుడైన దేవుని కొరకు ప్రతిష్టించబడిన దినముగా మనస్పూర్తిగా తెలుసుకొని, అంగీకరించి ఆయనను స్తుతించాలి.

దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మయందలి ఆనందము ఉంది. గనుక నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు, విశ్రాంతిదినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితదినమనియు ఘనమైనదనియు, ఘనముగా ఆచరించినయెడల నీవు యెహోవాయందు ఆనందించెదవు.

ఈ దినమును బట్టి, రానున్న ఆరు దినములలో నీవు తృప్తిపరచే కార్యములు ఆయన చేస్తాడు గనుక ఆనందిస్తాము. దేశముయొక్క ఉన్నతస్థలములమీద నేను నిన్నెక్కించెదను నీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యమును నీ యనుభవములో ఉంచెదను యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే.

స్వాస్థ్యము అనేది సిద్ధపరచబడింది. మన తండ్రి యేసుక్రీస్తే. ఆయన స్వాస్థ్యము అనగా బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనయందే ఉన్నవి.

తల్లిదండ్రులు వారు సంపాదించినది, వారు రిటైర్ అయిపోయిన తరువాత పంచేవారుగా ఉంటారు. లేదా వారు సంపాదించినదానిని బట్టి, పిల్లలకు అవసరమైన సమయములో ఇచ్చేవారుగా ఉంటారు. అయితే నీ పరలోకపు తండ్రి అలాకాదు. సమస్తమునకు ఆధార భూతుడు. అనగా నీ లోటు అది ఏదైనా సరే తీర్చగలిగేవాడు.

అయితే ఈ ఆశీర్వాదమును పొందుకోవాలి అంటే, దేవుని స్తుతించే స్వభావము మనము కలిగి ఉండాలి. నీ లోటును తీర్చుకోవడానికి ఆయనను స్తుతించడము కాదు గానీ, ఆయనను స్తుతించుటయే గురిగా ఆయన సన్నిధికి వచ్చిన యెడల, దానిని బట్టి నీ లోటు పూడ్చబడుతుంది.

ఆరాధన గీతము

నీ సన్నిధిలో సంతోషము
నీ సన్నిధిలో సమాధానము
నలిగియున్న వారిని బలపరచును
చెరలో ఉన్న వారికి స్వాతంత్య్రము
యేసయ్యా యేసయ్యా..

నీలోనే నేనుంటాను – నీలోనే జీవిస్తాను
విడువను ఎడబాయను – మరువక ప్రేమిస్తాను

నాలో నీవు – నీలో నేను
నా కొరకే నీవు – నీ కొరకే నేను

ఇక భయమే లేదు – దిగులే లేదు
నీ సన్నిధిలో నేనుంటే చాలు

 

 

 

వారము కొరకైన వాక్యము

వాక్యమే మనకు ఆధారమై ఉన్నది, ఆ వాక్యమే మనలను నడిపించేది. తెలియచేయబడిన వాక్యపు సత్యములను అనుసరించి జీవిద్దాము.

ఒక బిల్డింగ్ కట్టబడాలి అంటే, క్రమముగా ప్రతీ పని సంపూర్ణముగా జరగాలి. మధ్యలో కొన్ని వదిలివేస్తే, ఆ బిల్డింగ్ సరైన విధానములో కట్టబడదు, నిలువదు. అలాగే దేవుడు ఈరోజు తెలియచేసిన సత్యములను మనము గ్రహించి దేవుని సన్నిధి ప్రతీ ఆదివారము మిస్ అవకుండా ఆరాధించడానికి సిద్ధపడదాము.

నీ ప్రమేయము ఉండి నీవు చేసే వ్యాపారము, నీకిష్టమైన పనులు పక్కన పెట్టి, దేవుని సన్నిధే ఘనముగా ఎంచుకొని ప్రభు దినమును తప్పకుండా పాటించాలి.

దేవుని ఆశీర్వాదము పొందడానికి ఏమి చేయాలో తెలుసుకుందాము. అయితే ఈ మాటలు ఆత్మీయమైన బాల్య దశలో ఉనవారికి కాదు. అత్మీయముగా ఎదిగినవారికి.

సమస్తమును ఆయన సిద్ధపరచినవాడు. ఈ మాట పునాది వంటిది.

దేనికాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించియున్నాడు; ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచియున్నాడుగాని దేవుడు చేయుక్రియలను పరిశీలనగా తెలిసికొనుటకు అది చాలదు.౹ -ప్రసంగి 3:11

“దేనికాలమునందు అది చక్కగా నుండునట్లు” అనే మాటలు దేవుని ఆశీర్వాదాముల విషయములలో కూడా తీసుకోవచ్చు. మన కొరకు సమస్తము సిద్ధపరచబడి ఉన్నాయి. ఇంకొంచెము లోతుగా చూస్తే, ఆత్మ లోకములో ముగించబడినదే, ఇహ లోకములో ప్రారంభించబడుతుంది.

మన జీవితములకు కావలసిన ప్రతీదీ దేవుడు సిద్ధపరచి ఉంచాడు. అది ఆత్మలోకములో ముగించబడింది. ఆ సిద్ధపరచబడిన ఆశీర్వాదము మనము పొందుకోవడానికి మనము ఏమి చేయాలి.

మన ప్రార్థన కూడా, “నీ చిత్తమైతే ఇవ్వు ప్రభువా” నుండి, “నీవు సిద్ధపరచినది నాకు ఇవ్వు ప్రభువా” అని మారవలసి ఉన్నది.

వారు–రండి మన దేవుడైన యెహోవాయందు భయభక్తులు కలిగియుందము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని దాని కాలమున కురిపించు వాడు గదా; నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకొనరు.౹ -యిర్మీయా 5:24

వర్షమును ఆశీర్వాదమునకు గుర్తు. తొలకరి వర్షము అంటే, మొదటి ఆశీర్వాదము. దాని దాని కాలమున తొలకరి వర్షము కురవాలి అంటే, ఆ వర్షము సిద్ధపరచబడి ఉండాలి కదా! అలాగే మన జీవితములకు అవసరమైన ప్రతీ ఆశీర్వాదము మన చివరి దినముల వరకు ఆయన సిద్ధము చేసి ఉన్నాడు. ఆ సిద్ధము చేసినది ఆయనే ఇచ్చేవాడుగా ఉన్నాడు.

ఇందునుగూర్చి దేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపర చెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది.౹ మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచియున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు.౹ -1 కొరింథీయులకు 2:9-10

మన జీవితమునకు దేవుడు ఏమి సిద్ధపరచాడో, దానిని ఆత్మ ద్వారా మనకు దేవుడు తెలియచేసేవాడుగా ఉన్నాడు. లోకములో మనకు శ్రమ కలిగినప్పుడు కూడా నా జీవితము ఆశీర్వదించబడినదే అని దృఢనిశ్చయత కలిగి చెప్పగలగాలి. నేనున్న పరిస్థితిలో కావలసిన మార్గము దేవుడు సిద్ధపరచాడు అని నమ్మగలిగినప్పుడే అలా చెప్పగలము. అప్పుడు సిద్ధపరచబడిన మార్గము ఆత్మ వలన తెలియచేయబడుతుంది.

అయితే ఈ అనుభవము మనము పొందుకోవాలి అంటే, దేవుని యందలి భయము, భక్తి ఖచ్చితముగా మనము కలిగి ఉండాలి. అలా కాని యెడల ఆ ఆశీర్వాద క్రమమును మనము పోగొట్టుకొనేవారిగా ఉంటాము.

మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము.౹ -యిర్మీయా 5:25

కోతకాలము అనగా, సిద్ధపరచబడినదానిని పొందుకొని అనుభవించే సమయము. అయితే దేవుని భయము లేకపోవుట చేత, మనము చేసిన దోషములచేత, ఆ సిద్ధపరచబడినదానిని అనుభవించే అవకాశము మనము కోల్పోతున్నాము. అయితే ఇకనుండి అలా ఉండక, దేవుని యందలి భయము కలిగి సిద్ధపరచుకుందాము.

మనలను ఎవరూ చూడట్లేదు అనుకుని మనము చేసే క్రియలు చేస్తున్నాము గానీ, మన దేవుడు మన ఆలోచనలు సైతము ఎరిగినవాడు. అయితే నీవు చేసే దోష క్రియలు నీకు రావలసిన ఆశీర్వాదమునకు అడ్డుపడుతున్నాయి అనే సత్యము ఎరిగి, సరిచేసుకో!

భక్తి అంటే మనలో దేవుని వాక్యము కనపరచబడటమే! నీతిమంతులు విశ్వాసము మూలముగా జీవించును గనుక, నీవు భక్తిపరుడవైతే, ఆ విశ్వాసము నీ జీవితములో కనపరచబడాలి.

సింపుల్ గా చెప్పాలి అంటే – మన జీవితము దేవుని వాక్యమై ఉండాలి. వాక్యము కాదు అంటే, కాదు. అవును అంటే, అవును అన్నట్టుగా మన జీవితము ఉండాలి.

అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును,తట్టువానికి తీయబడును. -మత్తయి 7:7-8

సాధారణముగా మనము అనేక విషయముల గురించి ఈ వాక్యము ప్రకారము అడిగే ఉంటాము. అయితే ఈరోజు మనము ఒక నూతన విధానము తెలుసుకుందాము.

ఉదాహరణకు మన నాన్నగారి దగ్గర సమృద్ధిగా డబ్బు ఉంది అని తెలిసినప్పుడు మనము మన అవసరము కొరకు అడిగే విధానము ఒకలా ఉంటుంది. అదే ఉన్నాయో లేదో తెలియనప్పుడు, మనము అడిగే విధానము వేరేలా ఉంటుంది.

మనము అడిగే వ్యక్తి ఏమై ఉన్నాడో మనకు తెలిసినపుడు మనము అడిగే విధానము కూడా మారిపోతుంది. మన దేవుడు మనకొరకు సిద్ధపరచాడు అనే విషయము మనము ఎరిగితే, మనము ఖచ్చితముగా దేవా, నాకొరకు సిద్ధపరచినది నాకు ఇవ్వు ప్రభువా అని అడుగుతాము.

దేవుడు తన చిత్తమునకు వ్యతిరేకముగా ఏమీ చెయ్యడు. మనకు ఏమి అవసరము ఉన్నా సరే, నీకొరకు దేవుడు సిద్ధపరచాడు అని ఎరిగినపుడు, ప్రభువా నా అవసరము కొరకు నీవు సిద్ధపరచినది ఈ సందర్భములో దయచేయ్యి ప్రభువా అని అడుగ గలుగుతాము.

వివాహము కొరకు సాధారణముగా దేవుని చిత్తము కొరకు కనిపెట్టేవారముగా ఉంటాము. అయితే ప్రతి దాని విషయములో కూడా మనము అదే ఆలోచన కలిగి ఉండాలి. అయితే దేవుడు సిద్ధపరచినది కాక మనము వేరేది అడిగినపుడు, అది దేవుని చిత్తము కాదు గనుక, అది మనము పొందుకోలేము.

అలాగే “వెదకుడి మీకు దొరకును” అంటే ఏమి వెతకాలి, ఎక్కడ వెతకాలి? యేసయ్య వద్ద 5000 మంది కూడి ఉన్నారు.

యేమి చేయనై యుండెనో తానే యెరిగియుండి అతనిని పరీక్షించుటకు ఆలాగడిగెను.౹ -యోహాను 6:6
–ఇక్కడ ఉన్న యొక చిన్నవానియొద్ద అయిదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి గాని, యింత మందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా౹ -యోహాను 6:9

యేసయ్యకు ఆ చిన్నవాని వద్ద రొట్టెలు ఉన్నాయి అనే సంగతి ముందే తెలుసు. అయితే ఎలా తెలుసు?

కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను– తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును.౹ -యోహాను 5:19

అనగా రాత్రి కాలము తాను ప్రార్థన చేసినప్పుడు తండ్రి చేత రేపు జరిగబోయే కార్యము గూర్చి ముందుగానే తెలియచేయబడిన వాడై ఉన్నాడు. గనుక సిద్ధపరచబడిన 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని 5000 మందికి పంచిపెట్టాడు.

దేవుడు సిద్ధపరచిన దానికొరకే మనము వెతకాలి. మన స్వంత ఆలోచనల ప్రకారము మనము వెతుక్కోకూడదు.

కానాను గ్రామములో నా సమయమింకా రాలేదు అని యేసయ్య చెప్పుచున్నాడు. అనగా తన సమయము ఇంకా రాలేదు అని యేసయ్య ఎరిగినవాడై, తండ్రి సమయము కొరకే కనిపెట్టుకొని ఉన్నాడు. తండ్రి సిద్ధపర్చిన సమయము వచ్చినపుడు కార్యము జరిగించాడు.

అయితే మనము కూడా మనకొరకు సిద్ధపరచినది ఏమిటో తెలుసుకోవాలి అంటే, ఏమి చేయాలి?

ఇందునుగూర్చి దేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపర చెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది.౹ మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచియున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు.౹ -1 కొరింథీయులకు 2:9-10

అయితే మనము కూడా మనకొరకు సిద్ధపరచినది ఏమిటో తెలుసుకోవాలి అంటే, ఖచ్చితముగా పరిశుద్ధాత్మ సహాయము వలననే మనము తెలుసుకోగలము. “ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు” అంటే నీకొరకు దేవుడు ఏమి సిద్ధపరచాడు? అది ఏ సమయములో నీకు అవసరము? ఎలా నీకు అనుగ్రహించబడాలి? దానిని బట్టి నీ జీవితములో ఎలాంటి మార్పులు వస్తాయి అనే అనేకమైన విషయములు పరిశుద్ధాత్మకే తెలుసు.

లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొంద నేరదు; మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతోకూడ నివసించును, మీలో ఉండును.౹ -యోహాను 14:17

పరిశుద్ధాత్మను ఎరుగుట అంటే ఏమిటి? పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నీతో ఉంటున్నాడు? ఎలా నీతో మాట్లాడుతున్నాడు? అనే సంగతి నీవు అనుభవపూర్వకముగా ఎరిగి ఉండాలి. ఉదాహరణకు మనము వెళుతున్న జీవితములో శ్రమ వచ్చింది. అప్పుడు మనము పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు అనే సంగతి మనము ఎరిగినట్టయితే కొన్ని క్రియలు కనపరచబడతాయి.

అవి ఏమిటి అంటే, పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే, దేవుని యందలి భయము కలిగి ఉంటావు. ఎందుకనగా పరిశుద్ధాత్ముడు నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపచేసేవాడుగా ఉంటాడు.

మన జీవితము ఎంత ఆశీర్వదించబడినదో కదా! అయితే మనలో నివాసముంటున్న పరిశుద్ధాత్మ దేవునిని మనము గుర్తించలేని స్థితిలో ఉండుటను బట్టి, ఆ ఆశీర్వాదములను పోగొట్టుకొనేవారముగా ఉంటాము.

పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే తండ్రి సిద్ధపరచినది నీకు తెలియచేస్తాడు. అయితే నీవు చేసిన పాపమును బట్టి నీలోనుండి బయటకు వచ్చి, నీతో నడుస్తూ నీవు చేసేది తప్పు అని నిన్ను ఒప్పింపచేస్తాడు. నీవు ఒప్పుకున్నపుడు మరలా నిన్ను సమకూర్చి, నీలో తిరిగి వచ్చి దేవుడు సిద్ధపరచినది తిరిగి తెలియచేసేవాడుగా ఉన్నాడు.