07-04-2024 – ఆదివారం మొదటి ఆరాధన

స్తోత్ర గీతము 1

ఆరాధనకు యోగ్యుడా ఆది నుండి ఉన్నవాడా
ఆనందముతో నింపేవాడా ఆశ్చర్యకరుడా నా యేసురాజా
యేసు రాజా యేసు రాజా యేసు రాజా

పరిశుద్ధమైన వాడా పూజింపదగినవాడా
కాలాలు మారిన యుగాలు మారిన మారనివాడా నా యేసురాజా

కన్నీరు తుడిచేవాడా కౌగిటిలో చేర్చేవాడా
కాలాలు మారిన యుగాలు మారిన మారనివాడా నా యేసురాజా

పరిపూర్ణమైన వాడా పరలోక మేలు వాడా
కాలాలు మారిన యుగాలు మారిన మారనివాడా నా యేసురాజా

నిబంధన స్థిరపరచువాడా వాగ్దానము నెరవేర్చువాడా కాలాలు మారిన యుగాలు మారిన మారనివాడా నా యేసురాజా

స్తోత్ర గీతము 2

ప్రేమా పూర్ణుడు ప్రాణ నాథుడు
నను ప్రేమించి ప్రాణమిచ్చెను
నే పాడెదన్ – కొనియాడెదన్
నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును
||ప్రేమా||

లోయలకంటే లోతైనది నా యేసు ప్రేమ
గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ
యేసుని ప్రేమ వెల యెంతో
ఇహమందైనా పరమందైనా
వెల కట్టలేనిది కలువరిలో ప్రేమ
కలువరిలో ప్రేమ నాకై వెలియైన ప్రేమ
||ప్రేమా||

మరణముకంటె బలమైనది – పునరుత్ధాన ప్రేమ
మరణపు ముల్లును విరచినది – బలమైన ప్రేమ
రక్తము కార్చి రక్షణ నిచ్చి
ప్రాణము పెట్టి పరముకు చేర్చే
గొర్రెపిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ
బలియైన ప్రేమ నాకై వెలియైన ప్రేమ
||ప్రేమా||

స్తోత్ర గీతము 3

యెహోవా దేవునికి ఎన్నెన్నో నామముల్ గంభీరము గా పాడెదను,
ప్రభువుల ప్రభు చేయు మేలులు తలచి కరము తట్టి పాడెదను

యెహోవా షాలోం యెహోవా షమ్మా
యెహోవా రువా యెహోవా రాఫా

ఎల్-రోయ్ హల్లెలూయా నన్ను చూచినావయ్యా
ఆశలన్నీ తీర్చావయ్యా
నా దాహమును తీర్చిన జీవ జల ఊటవు
దాహమంతతీర్చావయ్యా

ఎల్-షడ్డాయ్ గొప్ప దేవ నిత్యము నడుపు వాడా
ఎల్లప్పుడు నాతో ఉందువు
ఎబినేజర్ నీవేనయ్య సహాయము చేయు వాడా
భారమంతా తీర్చావయ్యా

ఎలోహిం సృష్టికర్తా సర్వశక్తి వంతుడా
సర్వము నీ వశమే
ఇమ్మాన్యుయేల్ దైవమా మాకై వచ్చినవయ్యా
నిత్యము మా తోడు నీవే

ఆరాధన వర్తమానము

దేవుని సన్నిధి ఎంతో శ్రేష్టమైనది. దావీదును చూస్తే, అతడు గొప్ప రాజు అయినప్పటికీ, దేవుని సన్నిధికి త్వరపడి వెళ్ళేవాడు. దానికి కారణము ఏమిటి అని ఆలోచిస్తే, తాను కలిగిన బలముకంటే, దేవుని సన్నిధే బలమైనది అని ఎరిగినవాడై ఉన్నాడు.

అందుకే యెహోవా నా కోట, నా ఆశ్రయదుర్గము అని చెప్పగలిగినాడు. అంతే కాక, తన స్థితి ఏమిటో ఎరిగినవాడు. అందుకే ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనేపాటివాడను అని చెప్పగలుగుతున్నాడు. మనము ఈరోజు అనుభవిస్తున్న స్థితికి కారణము దేవుడే.

దేవుని వెంబడిస్తున్నపుడు కొంచెము శ్రమ మనకు కలుగవచ్చు గానీ, దానికంటే గొప్ప ఆశీర్వాదము మనకు దేవుడు కలుగచేసేవాడు. మనము ఉన్న స్థితిని దేవుడు ఇచ్చినదానిగా భావించి, ఆయనను స్తుతించి మహిమ పరచాలి.

ఒక్కోసారి, మనము కలిగిన జీవము తక్కువగా ఉన్నదానిని బట్టి మన జీవితములను శపించుకునే ఆలోచన కలిగి ఉంటాము. అయితే ఇప్పుడున్న స్థితికైనా కారణం దేవుడే అనే సత్యము ఎరిగి, ఆయనను మహిమ పరచినపుడు, ఖచ్చితముగా మనలను తృప్తిపరచే మార్గములు దేవుడు తెరుస్తాడు.

మన దేవుడు ఎల్లప్పుడు మన ప్రక్కనే ఉంటాడు. మన జీవితములను ఆయనకు సమర్పించుకున్నాక, ఆయన ఖచ్చితముగా మనతోనే ఉంటాడు.

యెహోవా, నీ నామము ఉత్తమము నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను – కీర్తనలు 54:6

యెహోవా షాలోం – యెహోవా నా సమాధాన కర్త
యెహోవా షమ్మా – యెహోవా నాతో ఉన్నవాడు
యెహోవా రువా – యెహోవా ఆత్మ
యెహోవా రోహి – యెహోవా నా కాపరి
యెహోవా రాఫా – యెహోవా నన్ను స్వస్థపరచేవాడు

ఉదాహరణకు అనారోగ్యముగా ఉంటే, ఆయన నామము ఉత్తమము అని అంటున్నాము అంటే, యెహోవా నామము “రాఫా” అనగా స్వస్థపరచుటయందు ఆయనే ఉత్తముడు. ఆయనకంటే మేలైన స్వస్థత ఎవారూ ఇవ్వలేరు.

రక్తస్రావముతో బాధపడుతున్న స్త్రీ, యేసయ్య వస్త్రము చెంగు ముట్టగానే ఆమే స్వస్థపరచబడింది. యేసయ్యలోనుండి ప్రభావము వెడలి ఆమెను స్వస్థత పొందింది.

నేనే మార్గమును, సత్యమును , జీవమునై ఉన్నాను అని యేసయ్య చెప్పాడు. అందుకే ఆ యేసయ్యలో నిలుచుట అనేది అంతో ప్రాముఖ్యము. మనము అలా నిలిచినపుడు మన జీవితము సాక్ష్యముగా మార్చబడుతుంది.

దేవుని గూర్చిన సత్యము మనము ఎరిగి ఉంటే, మనము కూడా “యెహోవా, నీ నామము ఉత్తమము నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను” అని చెప్పగలుగుతాము.

అంతే కాక, మనకు కావలిసిన సమస్తము యేసునామములో తండ్రిని అడిగితే, ఖచ్చితముగా మనకు అనుగ్రహించబడుతుంది అని లేఖనముల ద్వారా దేవుడు సెలవిచ్చాడు కదా.

ఏల్ రోయి అనగా నన్ను చూచిన దేవుడు. అనగా ఇంతవరకు నన్ను చూచినవాడు, ఇంతవరకు నాకున్న ఆశలు తీర్చినవాడు. అలాగే ఇకముందు కూడా నా జీవితపు ఆశలు తీర్చబడటానికి కారణమే నా దేవుడు అనే సత్యము మనము ఎరిగి ఉండాలి

ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు.
– యెషయా 26:3

మనము కలిగి ఉన్న ఆశలు తీర్చబడాలి అంటే, మనము ఆయన మీదే ఆధారపడాలి. మన స్వశక్తి మీద ఆధారపడితే ఏమీ జరగదు. మనము దేవుని గూర్చిన స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి.

ఇహమందు ధనవంతులైనవారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయచేయు దేవునియందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము.౹
– 1 తిమోతికి 6:17

ఒకవేళ మన ఆశ మనకు క్షేమము కలిగించేది కాదు అనుకోండి, అప్పుడు ఆ ఆశ తీరుస్తాడా అని ఆలోచిస్తే, మనము సుఖముగా అనుభవించుటకు సమస్తము, ధారాళముగా దయచేసేవాడు మన దేవుడు. మనము క్షేమముగా ఉండుటకు ఆయన బాధ్యత తీసుకునేవాడు మన దేవుడు. ఆయన భవిష్యత్తును ఎరిగినవాడు.

అందుకే దేవునిని సరైన రీతిలో తెలుసుకోవడము ఎంతో ప్రాముఖ్యము. నీకు క్షేమము కలుగచేసే ప్రతీ కోరిక ఆయన తీర్చేవాడుగా ఉన్నాడు.

మనము ఒంటరిగా అయిన స్థితిలో ఇంక నాకు ఎవరూ లేరు అనే ఆలోచన కలిగి ఉటాము. అయితే ఎల్ రోయి అయిన నా దేవుడు నాతోనే ఉన్నాడు అనే సత్యము మనము ఎరిగితే, ఒంటరితనమే మనము ఫీల్ అవ్వము.

దేవుడు మోషేతో ఏమన్నాడు? “నేను ఉన్నవాడను, అనువాడను”. ఉన్నవాడైన దేవుడూ నిన్ను తృప్తిపరచేవాడు. నీవు ఏ విషయములో తృప్తి చెందాలో, ఆయా విషయములలో ఆయన రాఫా గా, ఎల్ రోహిగా, ఎల్ షడ్డాయ్ గా, ఎబెనేజరుగా నీ జీవితములో ఉంటున్నాడు. అందుకే యెహోవా తమ దేవుడుగా గల జనులు ధన్యులు.

ఎవరైన మనకు చేసిన సహాయమును బట్టి మనము కృతజ్ఞతలు చెప్తాము. అయితే మనము కలిగి ఉన్నదేవుడు అన్నివేళలా ఆయనే మనకు సహాయకుడు, దేవుడు. మనము వెతుక్కోవలసిన అవసరము లేదు.

ఆరాధన గీతము

యెహోవా దేవునికి ఎన్నెన్నో నామముల్ గంభీరము గా పాడెదను,
ప్రభువుల ప్రభు చేయు మేలులు తలచి కరము తట్టి పాడెదను

యెహోవా షాలోం యెహోవా షమ్మా
యెహోవా రువా యెహోవా రాఫా

ఎల్-రోయ్ హల్లెలూయా నన్ను చూచినావయ్యా
ఆశలన్నీ తీర్చావయ్యా
నా దాహమును తీర్చిన జీవ జల ఊటవు
దాహమంతతీర్చావయ్యా

##########################

ఏ నామములో సృష్టి అంతా సృజింపబడెనో
ఆ నామమునే స్తుతింతును
ఏ నామములో పాపమంతా క్షమించబడెనో
ఆ నామమునే పూజింతును
ఏ నామములో దావీదు గోలియాతును ఎదురించెనో
ఆ నామమునే నమ్మెదను
ఏ నామములో ఈ లోకమంతటికి రక్షణ కలుగునో
ఆ నామమునే స్మరింతును

నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను
నీ నామమే ఆధారము
నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను
నీ నామమే నా జయము

రోగము తలవంచును నీ నామము ఎదుట
శాపము తల వంగును నీ నామము ఎదుట (2)
సాటిలేని నామము – స్వస్థపరచే నామము (2)
||నీ నామమునే||

ప్రతి మోకాలొంగును నీ నామము ఎదుట
ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత (2)
శ్రేష్టమైన నామము – శక్తిగలిగిన నామము (2)
||నీ నామమునే||

హెచ్చింపబడును గాక నీ నామము యేసయ్యా
కీర్తింపబడును గాక నీ నామము యేసయ్యా
కొనియాడబడును గాక నీ నామము యేసయ్యా
అన్ని నామములకు పై నామముగా (2)
అన్ని నామములకు పై నామముగా – (3)
||నీ నామమునే||

 

 

వారము కొరకైన వాక్యము

ఈరోజు మనము ఎందుకు దేవుని సత్యములోనే నిలిచి ఉండాలి అనే విషయము గూర్చి తెలుసుకుందాము.

ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్నాడు.౹ -1 తిమోతికి 2:4

దేవాది దేవుని కోరిక మనుష్యులందరు రక్షణ పొందుకోవడం మాత్రమే కాక, “సత్యము” గూర్చిన “అనుభవము” కలిగి ఉండాలి అనేదే! అయితే సత్యము ఏమిటి?

ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము, కేడెమును డాలునై యున్నది. -కీర్తనలు 91:4

ఆయన సత్యము, కేడెమును డాలునై యున్నది. దేవుని సత్యములో మనము నిలిచినపుడు, అది మనకు కేడెముగాను, డాలుగాను ఉంది.

డాలు అంటే గుండ్రముగా ఉండి ఎదురుగా వచ్చే దాడిని అడ్డుకోగలిగింది. కేడెము అంటే, డాలు పట్టుకున్న చెయ్యిని మోచేతి వరకు కప్పేది. అది శత్రువు ఆయుధమునుండి కాపాడేది. అంటే శత్రువు మన మీద చేసే ప్రతి దాడి నుండి మనలను తప్పించేది దేవుని సత్యము.

దేవుని సత్యము, ఆ సత్యమునందలి విశ్వాసము మన ఆత్మీయ జీవితములో డాలు వలే, కేడెము వలే పనిచేస్తాయి.

క్రీస్తు సత్యము నాయందు ఉండుటవలన అకయ ప్రాంతములయందు నేనీలాగు అతిశయ పడకుండ, నన్ను ఆటంకపరచుటకు ఎవరి తరముకాదు.౹ -2 కొరింథీయులకు 11:10

“క్రీస్తు సత్యము నాయందు ఉండుటవలన” నన్ను ఆటంకపరచడము ఎవరి వలనా కాదు! అందుకే దేవుని సత్యము మన జీవితములో ఎంతో ప్రాముఖ్యమైనది.

సత్యము ఖచ్చితముగా డాలుగా పనిచేస్తుంది, ఈ సత్యము మనలో ఉంటే మనలను ఆపగలుగుట ఎవరి వలనా కాదు! అనగా మనము కలిగిన సత్యమును బట్టి శత్రువు చేసే దాడినుండి మనము కాపాడబడతాము. అంతే కాక, శత్రువును దాటి ముందుకు వెళ్ళగలిగే సామర్థ్యము కలుగచేస్తుంది,

మేము సత్యమునకు విరోధముగా ఏమియు చేయనేరము గాని, సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము.౹ -2 కొరింథీయులకు 13:8

శత్రువు మనపై దాడి చేసినపుడు సత్యము మనలను కాపాడుతుంది, ఆ శత్రువును జయించి ముందుకు తీసుకువెళుతుంది. దానికి ముందు మనము సత్యమును పట్టుకుని నిలబడాలి. అలాగే ఆ సత్యమును పట్టుకుని నిలబడేలా మనము సమస్తము సిద్ధపరచుకోవాలి.

యేసయ్య సత్యము, వెలుగు అయి ఉన్నాడు. వెలుగు ఉన్న చోట చీకటి ఉండలేదు. సత్యము నిమిత్తమే సమస్తము చేస్తాను అంటే, నాలో ఏ చీకటి ఉండకుండా అనగా అపవాది క్రియలు ఏవీ ఉండకుండా నా జీవితమును సిద్ధపరచుకోవాలి.

సత్యములో నిలబడితే ఏమి జరుగుతుందో చూద్దాము –

ఆయన సముద్రముమీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి, భూతమని చెప్పుకొని భయముచేత కేకలువేసిరి. -మత్తయి 14:26

ఇక్కడ శిష్యులు ఎందుకు భూతము అని అనుకున్నారు? వారి దృష్టిలో భూతములు సముద్రముపై నడువగలదు కానీ మనుష్యులు నడువలేరు అని వారికి తెలిసిన సత్యము.

వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి; నేనే, భయపడకుడని వారితో చెప్పగా పేతురు–ప్రభువా, నీవే అయితే నీళ్లమీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. -మత్తయి 14:27-28

యేసయ్య నేనే, భయపడకుడి అని చెప్పగానే, పేతురు నీవు నిజమైతే నేను కూడా నీళ్ళ మీద నడుచుటకు సెలవిమ్ము అని పేతురు అడిగాడు. ఇక్కడ చూస్తే, ఇంతవరకు భూతమే నీళ్ళమీద నడవగలదు అనేది సత్యముగా అనుకున్నారు. అందుకే “నీవే అయితే” అని యేసయ్యతో అన్నాడు పేతురు.

అనగా శిష్యులు ఇంతవరకు అసత్యమును నమ్మినవారుగా ఉన్నారు. యేసయ్య నిజమైన సత్యమును వారికి చూపించారు. అప్పుడు పేతురు ఆ సత్యమును అనుభవించడానికి అనగా ఆ సత్యములో నిలబడటానికి ఆసక్తి చూపించాడు.

మన జీవితములో కూడా దేవుని గూర్చిన సత్యములో నిలిచి ఉన్నపుడు, యేసయ్య కలిగిన అదృశ్యశక్తిని మనలో కూడా అనుభవించగలుగుతాము.

ఆసా తన దేవుడైన యెహోవాకు మొఱ్ఱపెట్టి – యెహోవా, విస్తారమైన సైన్యముచేతిలో ఓడిపోకుండ బలములేనివారికి సహాయము చేయుటకు నీకన్న ఎవరును లేరు; మా దేవా యెహోవా, మాకు సహాయముచేయుము, నిన్నే నమ్ముకొనియున్నాము, నీ నామమునుబట్టియే యీ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరియున్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైని జయమొందనియ్యకుము అని ప్రార్థింపగా -2 దినవృత్తాంతములు 14:11

ఆసా నమ్మిన సత్యము – “యెహోవా, విస్తారమైన సైన్యముచేతిలో ఓడిపోకుండ బలములేనివారికి సహాయము చేయుటకు నీకన్న ఎవరును లేరు”. దానిని బట్టి, ఆ సత్యములో నిలబడుతున్నాడు, అందుకే – “నీ నామమునుబట్టియే యీ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరియున్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైని జయమొందనియ్యకుము” అని చెప్పుచున్నాడు. ఆ యుద్ధములో దేవుని సత్యములోని శక్తి ఆసాకు అందించబడి జయము పొందాడు.

అబ్రహాము జీవితములో కూడా తాను నమ్మిన సత్యము గూర్చి చూస్తే –

తన పనివారితో–మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి; నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి (దేవునికి) మ్రొక్కి మరల మీయొద్దకు వచ్చెదమని చెప్పి -ఆదికాండము 22:5

ఇక్కడ అబ్రహాము, “దేవుడు మృతమైనదానిని సజీవముగ చేయువాడు, లేనిదానిని ఉన్నట్టుగానే చేయగలడు” అనే సత్యమును నమ్మినవాడుగా ఉన్నాడు. దానిని బట్టి ఇస్సాకును పొందగలిగాడు.

అలాగే పేతురు, నీళ్ళమీద నడిచేది భూతమే అనే అసత్యమును నమ్మాడు. అయితే ఇంతకుముందు ఎప్పుడైనా భూతమును అలా నడవడము చూసాడా? లేదు! అయితే లోకములో తాను విన్న దానిని బట్టి అలా అనుకున్నాడు. అదే ఒకవేళ దేవునికి సంబంధించిన సత్యమును గనుక ఎరిగి ఉంటే, పేతురు ఖచ్చితముగా అది దేవుడే అనుకొనేవాడు. అందుకే మనము మన మనస్సును దేవుని గూర్చిన మాటలతో, సత్యముతో, సమాచారముతో మనము నింపుకోవాలి.

మరొకలా చూస్తే, పేతురు లోకములోని అసత్యపు సమాచారమును బట్టి దేవుని సత్యమును ప్రశ్నించినవాడుగా ఉన్నాడు. అందుకే మనము మన మనస్సును దేవుని గూర్చిన మాటలతో, సత్యముతో, సమాచారముతో మనము నింపుకోవాలి.

అలాగే కుష్టురోగి, “నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయుము” అని యేసయ్యతో అడిగాడు. ఒకవేళ సత్యము ఎరిగితే ” అని మాత్రమే చెప్పగలుగుతాడు.

అదే తీమయి కుమారుడు అయిన గుడ్డివాడు సత్యమును ఎరిగినవాడుగా ఉన్నాడు గనుకనే, “దావీదు కుమారుడా కరుణించు, నన్ను దాటిపోకు” అని అరిచాడు, ప్రశ్నించలేదు.

అందుకే మనము సత్యములో నిలబడటము ఎంతో అవసరము, రాబోయే దినములలో మనలను నిలబెట్టేది దేవుని సత్యమే! దేవుని గూర్చి చెప్పబడిన ప్రతి మాట సత్యమే! పరిశుద్ధాత్మ గూర్చి చెప్పబడిన ప్రతి మాట సత్యమే! యేసయ్య గూర్చి చెప్పబడిన ప్రతి మాట సత్యమే! అప్పుడు ఆ సత్యములోని శక్తి మనలో ప్రత్యక్షపరచబడుతుంది.