స్తోత్ర గీతము 1
యూదా రాజసింహం – తిరిగి లేచెను
తిరిగి లేచెను – మృతిని గెలిచి లేచెను
యూదా రాజసింహం – యేసుప్రభువే
యేసుప్రభువే – మృతిని గెలిచి లేచెను
యూదా రాజసింహం – తిరిగి లేచెను
1. నరక శక్తులన్నీ – ఓడిపోయెను
ఓడిపోయెను – అవన్నీ రాలిపోయెను
2. యేసు లేచెనని -రూఢియాయెను
రూఢియాయెను – సమాధి ఖాళీ ఆయెను
3. పునరుత్థానుడిక – మరణించడు
మరణించడు – మరెన్నడు మరణించడు
4. యేసు త్వరలో – రానైయున్నాడు
రానైయున్నాడు – మరల రానైయున్నాడు
స్తోత్ర గీతము 2
గీతం గీతం జయ జయ గీతం – చేయి తట్టి పాడెదము (2)
యేసు రాజు లేచెను హల్లెలూయ – జయ మార్భటించెదము.. (2)
ఆ ఆ ఆ
|| గీతం గీతం ||
1. చూడు సమాధిని మూసినరాయి – దొరలింపబడెను (2)
అందు వేసిన ముద్ర కావలి నిల్చెనా – దైవ సుతుని ముందు (2)
ఆ ఆ ఆ
|| గీతం గీతం ||
2.వలదు వలదు యేడువవలదు – వెళ్ళుడి గలిలయకు (2)
తాను చెప్పిన విధమున తిరిగి లేచెను – పరుగిడి ప్రకటించుడి (2)
ఆ ఆ ఆ
|| గీతం గీతం ||
3.అన్న కయప వారల సభయు – అదరుచు పరుగిడిరి (2)
ఇంక దూత గణముల ధ్వనిని వినుచు – వణకుచు భయపడిరి (2)
ఆ ఆ ఆ
|| గీతం గీతం ||
4.గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి – జయ వీరుడు రాగా (2)
మీ మేళతాళ వాద్యముల్ బూర – లెత్తి ధ్వనించుడి (2)
ఆ ఆ ఆ
|| గీతం గీతం ||
స్తోత్ర గీతము 3
ప్రియ యేసు రాజును నే చూచిన చాలు
మహిమలో నేనాయనతో ఉంటే చాలు (2)
నిత్యమైన మోక్షగృహము నందు చేరి
భక్తుల గుంపులో హర్షించిన చాలు (2)
||ప్రియ యేసు||
యేసుని రక్తమందు కడుగబడి
వాక్యంచే నిత్యం భద్రపరచబడి (2)
నిష్కలంక పరిశుధ్దులతో పేదన్ నేను (2)
బంగారు వీదులలో తిరిగెదను (2)
||ప్రియ యేసు||
ముండ్ల మకుటంబైన తలను జూచి
స్వర్ణ కిరీటం బెట్టి ఆనందింతున్ (2)
కొరడాతో కొట్టబడిన వీపున్ జూచి (2)
ప్రతి యొక్క గాయమును ముద్దాడెదన్ (2)
||ప్రియ యేసు||
హృదయము స్తుతులతో నింపబడెను
నా భాగ్య గృహమును స్మరించుచు (2)
హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ (2)
వర్ణింప నా నాలుక చాలదయ్యా (2)
||ప్రియ యేసు||
ఆహ ఆ బూర ఎప్పుడు ధ్వనించునో
ఆహ నా ఆశ ఎప్పుడు తీరుతుందో (2)
తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో (2)
ఆశతో వేచియుండే నా హృదయం (2)
||ప్రియ యేసు||
ఆరాధన వర్తమానము
ఈ దినము మనము సంతోషించవలసిన దినము. అయితే ఎందుకు మనము సంతోషించాలి? ఈ కారణము తెలిసినపుడే మన సంతోషము నిజమైనదిగా ఉంటుంది.
ప్రభువు మృతిచెంది, సమాధి చేయబడి, తిరిగి లేవడము బట్టి మనము సంతోషించాలి అని అంటాము. అయితే ఆయన లేవడము బట్టి మనమెందుకు సంతోషించాలి?
మీరు బాప్తిస్మమందు ఆయనతోకూడ పాతిపెట్టబడినవారై ఆయనను మృతులలోనుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతోకూడ లేచితిరి.౹ -కొలొస్సయులకు 2:12
ప్రభువుతో పాటు మనము కూడా లేచినవారుగా ఉన్నాము. ప్రభువైతే మరణమునుండి లేచారు. మరి మనము కూడా ఆయనను బట్టి మరణమును జయించినవారిగా ఉన్నాము. మరణ భయమునుండి మనము విడుదల పొందుకున్నాము కాబట్టి మనము సంతోషించాలి.
మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపెను. -అపొస్తలుల కార్యములు 2:24
మనము సంతోషించడానికి ఒక కారణము, యేసు ప్రభువు జీవితములో ఏమి జరిగిందో, అదే మన జీవితములో కూడా జరుగుతుంది. అనగా మరణవేదనలు తొలగించబడవలసినదే, మన జీవితము జయ జీవితముగా చెయ్యబడింది. ఈ జీవితమును పట్టి బంధించే అవకాశము దేనికీ లేదు.
దేవుడు ఆదామును మొదట మట్టితో తయారు చేసి జీవాత్మను ఊదగా జీవించు ప్రాణి అయ్యాడు. తాను చేసిన పాపమును బట్టి మనము చెడిపోయిన, చనిపోయిన స్థితిలో ఉండగా, యేసయ్య మరణము ద్వారా మనము నూతనపరచబడ్డాము.
వారు నా కట్ట డలను నా విధులను అనుసరించి గైకొనునట్లు నేను వారి శరీరములలోనుండి రాతిగుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి, వారికి ఏకమనస్సు కలుగజేసి వారియందు నూతన ఆత్మ పుట్టింతును.౹ -యెహెజ్కేలు 11:19
మొదటి ఆదాముకు శరీరము, జీవము మరియు ఆత్మ ఉన్నవి. ఆ ఆదాము దేవుని ఆజ్ఞలు పాటించకపోవడము చేత, పాపిగా అయిపోయాడు. ఇప్పుడు యేసయ్య ఈ పాపి కొరకు, చనిపోయి, సమాధి చేయబడి, తిరిగిలేచాడు. దాని ద్వారా ఒక నూతనమైన జీవితము ఇవ్వబడింది.
ఇప్పుడు పాతవి అన్నీ గతించిపోయినవి, నూతనపరచబడిన నవీన స్థితిలోనికి మార్చబడుతుంది. యెహెజ్కేలులో చూస్తే, శరీరము మార్చబడుతుంది, మనస్సు మార్చబడుతుంది మరియు ఆత్మ నూతనపరచబడుతుంది. నూతనపరచబడిన మన జీవితము జీవము వైపు మనము నడిపించబడతాము.
మొదటి ఆదాము మట్టి చేత చెయ్యబడ్డాము ఇది పాత జీవితము. అయితే నూతనమైన జీవితము కొరకు, ప్రభువు యొక్క శరీరము దున్నబడింది, నలగ గొట్టబడింది, దాని ద్వారా మనకు నూతన రూపము ఇవ్వబడింది.
ఎలీషా చనిపోయినతరువాత ఆయన సమాధిలో ఉన్న ఎముకలకు తగిలిన శవము తిరిగి జీవము తిరిగి పొందుకుంది. ఎలీషా అయితే ఏలియాకు ఇవ్వబడిన ఆత్మకు రెండంతల ఆత్మ ఇవ్వబడింది. అయితే యేసయ్యకు కొరతలేని ఆత్మ ఇవ్వబడింది. అప్పుడు యేసయ్య ఇంకెంత ప్రభావము కలిగినవాడుగా ఉంటాడు?
అందుకే యేసయ్య ద్వారా నూతనపరచబడిన జీవితము ఎంతో బలమైనది, శక్తిగలది, ప్రభావముకలిగినది. నీతిమార్గములో మరణమే లేదు. నీతి మార్గము అనగా యేసయ్య ద్వారా ఏర్పాటు చేయబడిన జీవితము. మరణపు ముల్లు విరిచి, మరణ భయమునుండి మనలను విడిపించాడు.
దేవుడు అనుగ్రహించిన ఈ నూతన జీవితములో, ఎటువంటి మరణకరమైన పరిస్థితి నిన్ను ఎదుర్కోవడానికి వచ్చినా సరే, నీలో ఉన్న జీవము ఆ మరణమును, మరణ ప్రభావమును జయిస్తుంది.
యేసయ్య వస్త్రపు చెంగులోనుండి ప్రభావము వెళ్ళింది. మరి పేతురు నీడ పడితేనే ప్రభావము వెళ్ళింది. మరి ఇప్పుడు మనకు అంతకంటే ఎక్కువైన మహిమ ఇవ్వబడింది. మునుపంటి మహిమకంటే, కడవరి దినములలో కనపరచబడే మహిమ అధికమైనది. ఇదంతా కూడా ఆయన తిరిగి లేవడము ద్వారానే కలిగింది.
ఆరాధన గీతము
భయమే లేదు దిగులే లేదు
నా జీవితమంతా ప్రభు చేతిలో
నిరాశ నన్నెన్నడు ముట్టలేదు
నిరీక్షణతో అనుదినం సాగెదను
యావే నీవే నా దైవం – తరతరముల వరకు
యావే నీవే నా ఆశ్రయం – తరతరముల వరకు
నీవు కునుకవు నీవు నిదురపోవు
ఇశ్రాయేలున్ కాపాడువాడ(వు)
మరణ భయం అంతా పోయెను
శత్రు భీతి అంతా తొలగించెను
మరణమును ఓడించి
శత్రువును జయించిన
సర్వాధికారివి నా దేవా
పునరుత్థాన దినపు వర్తమానము
పునరుత్థానము యొక్క శక్తి ఏమై ఉన్నది అని తెలుసుకుందాము.
ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు, – విజయమందు మరణము మ్రింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీముల్లెక్కడ? మరణపుముల్లు పాపము; పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక -1 కొరింథీయులకు 15:54-57
ఈలోకములో మరణము కంటే బలమైనది ఏమీ లేదు. మరణము తరువాత ఇంక ఒకని జీవితములో మిగిలినది ఏమీ లేదు. అటువంటి బలమైన మరణమును జయించి ప్రభువు ఈ మాటలు చెప్పుచున్నాడు. ఎవరి జీవితమును అపవాది లాక్కుపోయిందో, అనగా అపవాది మన జీవితమును లాక్కుపోయి, మరణ భయములో బంధించాడు. అటువంటి మనతో ప్రభువు ఈ మాటలు చెప్పుచున్నాడు. ఆయన మరణమును జయించాడు గనుక, మరణము ముల్లు మన జీవితములో ప్రవేశించడానికి లేదు.
ఇది ఎప్పుడు మనము చూడగలుగుతాము అంటే, మనకు ఏ జీవితము ఇచ్చాడో ఆ జీవితములో మనము నిలిచి ఉండాలి. అప్పుడు మరణపు ముల్లు మన జీవితములో పని చేయదు. ఇక మనము మరణమునకు దాసులము కాదు కానీ, జీవమునకు వారసులము అయి ఉన్నాము. పునరుత్థాన శక్తి మనలను జీవమునకు వారసులుగా చేసింది.
యేసుక్రీస్తు, శరీరమునుబట్టి దావీదు సంతానముగాను, మృతులలోనుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను – రోమా 1:5
దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. నిరూపించబడటము అంటే ఏమిటి? ఉదాహరణకు శిష్యులు అందరూ గదిలో తలుపులు గడియపెట్టి లోపల ఉన్నప్పుడు, యేసయ్య లోపలికి వచ్చి నిలుచున్నాడు. అప్పుడు శిష్యులు ఎలా చూస్తారు? దేవుని కుమారునిగా నిరూపించబడినట్లుగా చూస్తారు.
అలాగే మనము కూడా యేసయ్య పునరుత్థానుడై లేచిన దానిని బట్టి మనము కూడా దేవుని కుమారులమే అనే సత్యము నిరూపించబడునట్లుగా, కార్యములు మన జీవితములో జరిగించబడతాయి.
ఈ ప్రభావము గూర్చి మనము ఆలోచిస్తే, రక్తస్రావము గల స్త్రీ అనేకమైన వైద్యుల వద్దకు వెళ్ళింది. అనగా శరీరాన్ని బాగు చేయగలడు అని పిలువబడే ప్రతివాని దగ్గరకు ఆమె వెళ్ళింది. అయితే ఏమీ ఉపయోగము లేకపోయింది అయితే ఆమె ప్రభువు యొక్క వస్త్రపు చెంగు ముట్టగానే, ఆయనలోని ప్రభావము ఆమె రక్తస్రావము గడ్డ కట్టునట్లు కార్యము జరిగించింది.
మన జీవితము శక్తివంతము అయినది అని , సూపర్ నేచురల్ జీవితము అని తెలియపరచబడటానికి యేసయ్య పునరుత్థానము కార్యము చేసింది.
ఒకరాజుకు ఎలా అయితే రాజభోగము ఉంటుందో, తన కుమారునికి కూడా అదే రాజభోగము ఉంటుంది. అలాగే దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన కుమారులుగా మనకు కూడా అసాధ్యమైనది లేదు. అది మనలను బట్టి కాదు గానీ, మనకు ఇవ్వబడిన జీవితమును బట్టి జరుగుతుంది.
దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన సమస్తము జరిగించగల సమర్థుడు. ఈరోజు మన జీవితములో కూడా సమస్తము సాధ్యము అవ్వవలసినదే, దేవుని ప్రభావమును బట్టి ఖచ్చితముగా సాధ్యము అవ్వవలసినదే. అందుకే పౌలు, నాలో ఉన్నవానిని బట్టి నాకు సమస్తము సాధ్యమే అని చెప్పగలిగాడు.
కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను -2 కొరింథీయులకు 5:17
నూతన సృష్టి అని వ్రాయబడింది. అయితే ఎప్పుడు నూతనసృష్టిగా చేయబడ్డాము? ఆయన పునరుత్థానుడగుటను బట్టే నూతన సృష్టిగా చేయబడ్డాము. దానిని బట్టి పాతవి గతించి క్రొత్తవాయెను అని వ్రాయబడింది.
సమస్తము నూతనపరచబడింది అంటే ఏమిటి? ఆయన మన పాపముల నిమిత్తము సిలువ వేయబడ్డాడు సమాధి చేయబడ్డాడు. ఆ సమాధి చేయబడిన యేసు పునరుత్థానుడైనాడు. అది ఎలా జరిగింది అంటే,
ఆయన ఆ బలాతిశయముచేత క్రీస్తును మృతులలోనుండి లేపి, సమస్తమైన ఆధిపత్యముకంటెను అధికారముకంటెను శక్తికంటెను ప్రభుత్వముకంటెను, ఈ యుగమునందుమాత్రమే గాక రాబోవు యుగమునందును పేరుపొందిన ప్రతి నామముకంటెను, ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొనియున్నాడు.౹ -ఎఫెసీయులకు 1:20
క్రీస్తును మృతులలోనుండి లేపుట యందు దేవుని బలాతిశయము కనపరచబడింది. ఇంతకు ముందు వరకు దావీదు సంతానముగా యేసయ్య గుర్తించబడ్డాడు. అప్పుడు మనకు రావలసిన మరణమంతా ఆయన పైకి వెళ్ళింది. ఇప్పుడు ఆ మరణములో దేవుని శక్తి వినియోగించబడి, ఆ మరణములో జీవము ప్రత్యక్షపరచబడింది.
దానిని బట్టి పాతవి అనగా మరణముతో సంబంధము కల ప్రతీదీ, గతించిపోయి, నూతనముగా అనగా జీవముతో సంబంధము కలదానిగా మార్చబడింది.
ఇంతకు ముందు ఓడిపోయిన చోట ఇప్పుడు గెలుస్తావు, ఇంతకుముందు పోగొట్టుకున్న చోట, ఇప్పుడు పొందుకొంటావు. ఇంతకుముందు నీవు పోగొట్టుకొన్న సంతోషమును, ఇకముందు మరింతగా పొందుకుంటాము. ఇదంతా ఆయా శక్తి ప్రత్యక్షపరచబడటమును బట్టే జరుగుతుంది.
ఆ పునరుత్థాన శక్తిని పొందుకున్న మనము ఇక బాధపడటానికి, భయపడటానికి లేదు.
మృతులలోనుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించినయెడల, మృతులలోనుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. -రోమా 8:11
యేసయ్యకు జరిగినదే మన జీవితములో జరుగుతుంది. మన జీవితములో మృతమైనది ఏది కనబడినా మనలో ఉన్న పరిశుద్ధాత్మ, ఆ మృతమైన పరిస్థితిలో మనలను జీవించునట్లుగా మనలను ఖచ్చితముగా మనలను లేపుతాడు.
మనము బాప్తీస్మము పొందినపుడు యేసయ్యతో సమాధి చెయ్యబడి, ఆయనతో పాటు పునరుత్థానులమై లేపబడుతున్నాము. అప్పటినుండి పునరుత్థాన శక్తి మన జీవితములను కొనసాగించేదిగా ఉంది. మనలను జీవింపచేయువాడు ఆయనే అయినపుడు ఇంక మనకు భయము దేనికి?
ఈ జీవమును చూడాలన్నా, ఆయన ప్రభావమును చూడాలన్నా, ఆయన ఇచ్చిన జీవితములో కొనసాగటమే మనము చేయవలసినది. ఆయన ఇచ్చిన పాప రహితమైన, పరిశుద్ధమైన జీవితమును జీవించకుండా ఆ జీవమును మనము చూడలేము.