కృప వెంబడి కృప లో

ఆయన పరిపూర్ణతలోనుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి.౹ -యోహాను 1:16.


ఈ వాక్యములో ని సత్యమును మనము గ్రహించాలి. వాక్యము స్పష్టముగా చెప్తుంది, నీవు కృపను పొందుకున్నావు అని. అయితే నువ్వు ఈ సత్యము నమ్మనంతవరకు దానిని నువ్వు నీ జీవితంలో గుర్తించలేకపోతున్నావు.
కృప చేత మీరు రక్షింపబడియున్నారు – ఎఫెసీ 2:4. అయితే అక్కడనుండి మన జీవితము కొనసాగించబడటానికి అదే కృప వెంబడి కృప మనకు అనుగ్రహించబడింది.


దేవునివలన నీవు కృపపొందితివి – లూకా 1:30. ఈ మాటలు మరియతో చెప్పబడ్డాయి. అయితే ఈ మాటలు మనతో కూడా చెప్పబడుతున్నాయి. మరియ ఈ కృపను బట్టి ఏమి పొందుకుంది? దేవుని చిత్తము తన జీవితములో నెరవేర్చబడునట్లుగా సిద్ధపరచబడింది. ఈ వాక్యపు సత్యము గ్రహించి స్వీకరించినయెడల, దేవుని చిత్తము నీ జీవితములో కూడా నెరవేర్చబడునట్లు సిద్ధపరచబడతావు.
మనము రక్షించబడటానికి పరిశుద్ధాత్మ ద్వారా వినియోగించబడిన కృప, మన జీవితము కొనసాగించడానికి అదే పరిశుద్ధాత్మ క్రియలద్వారా కృప వెంబడి కృప మనకు దయచేయబడుతుంది. కానీ ఈ కృప విడుదల అగుటకు మరియ ఒక కార్యము చేసింది, “ఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాటచొప్పున నాకు జరుగును గాక అనెను”. మనము కూడా ప్రభువుకు దాసులుగా ఉన్నట్టైతే మనము కూడా దేవుని కృప కార్యరూపము దాలుస్తుంది. కానీ మనము అనేకసార్లు, మన హృదయానికి, ఆలోచనలకు దాసులుగా ఉంటాము. అలా ఉండకూడదు. దేవుని మాటకు మాత్రమే లోబడతాను అనే తీర్మానము మనము తీసుకోవాలి. కృప విలువ ఎరిగినవారిమైతే దేవుని మాటకే లోబడతాము.
అబ్రహాము జీవితములో చూసినట్టైతే, కృపనుబట్టి ఇస్సాకును పొందాడు. ఎలియాజరు కూడా ఆ కృపను గూర్చి సాక్ష్యము చెప్తున్నాడు. “అబ్రాహామను నా యాజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక; ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు; నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల యింటికి నన్ను నడిపించెననెను.౹ -ఆదికాండము 24:26”.


మరియ జీవితములో యేసుప్రభువు పుట్టుటకొరకు విడుదల అయిన కృప, తన ప్రతీ పరిస్థితిలో నడిపించింది. హేరోదు రాజు చంపుటకు ప్రయత్నిస్తున్నప్పుడు, అనగా దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా పనిచేస్తున్న ప్రతీదానినుండి విడుదల చేయబడింది. అలాగే పౌలు కూడా నేనేమై ఉన్నానో అది ప్రభువు కృపను బట్టియే అని చెప్పుతున్నాడు.


ఆయన అట్టి గొప్ప మరణమునుండి మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మాకొరకు ప్రార్థనచేయుటవలన మీరు కూడ సహాయము చేయుచుండగా, ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయనయందు నిరీక్షణ గలవారమై యున్నాము.౹ -2 కొరింథీయులకు 1:10.


బ్రతుకుతామన్న ఆశకూడాలేని పరిస్థితిలోనుండి ప్రభువు తప్పించాడు, ఇకముందుకూడా తప్పిస్తాడు. “అయినను నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయి యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కు వగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపయే.౹ -1 కొరింథీయులకు 15:10“.


మరియ ప్రభువు దాసురాలను అని చెప్తుంది. అబ్రహామును నీ దేశమును విడిచివెళ్ళుము అని దేవుడు చెప్పగానే చేసాడు. అనగా దేవునికి దాసుడుగా ఉన్నాడు. పౌలు, నేను కాదు క్రీస్తే అని దాసుడుగా జీవితాన్ని అర్పించారు. నీవుకూడా ప్రభువుకు దాసుడుగా ఉండగలిగితే, అనగా ప్రభువు ఏమి చెప్తే అది నువ్వు చెయ్యడానికి సిద్ధపడితే, ఆయన కృప దానిని సంపూర్ణం చేస్తుంది.


సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయచేయు దేవునియందే నమ్మికయుంచుడని…౹ -1 తిమోతికి 6:17.


నీ జీవితము సంతోషముగా ఉండులాగున సమస్తమును దయచేయువాడు నీ దేవుడు. కాని, నీ జీవితములో నీవు ఆశించినది, నీకు దొరకనప్పుడు సైతము, నీ దేవుడు సమస్తము దయచేయువాడు, నీవు ఆశించినది నీకు ఆ సమయములో జరుగుట మేలుకాదేమో అనే ఆలోచనలో నీవు ఉండాలి. హేరోదు చనిపోయాక మరియ కుటుంబం తిరిగి యెరుషలేముకు తీసుకురాబడ్డారు. నీ జీవితములో నీ కొరకు ప్రభువు సిద్ధపరచినది ప్రభువు సమయములో ప్రభువు కృపను బట్టి ఖచ్చితముగా నెరవేరబడుతుంది. ఆ దేవుని కృప నీ జీవితములో నిన్ను వెంబడిస్తూనే ఉంటుంది.


క్రీస్తుయేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి, మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.౹ క్రీస్తునుగూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయనయందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి;౹ గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నారు.౹ -1 కొరింథీయులకు 1:4-7.


కృప మనలను సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులుగా చేసింది. అలాగే వ్రాయబడిన తొమ్మిది కృపావరాలన్నిటి ద్వారా ఏ మేలు జరగాలో అవన్నీ ఈ కృపద్వారా జరుతున్నాయి. కేవలము మన రక్షణ విషయములోనే కాక, మన రక్షణ జీవితము కొనసాగించబడుచుండగా, ప్రతి పరిస్థితిలో నెరవేర్చబడవలసిన దేవుని చిత్తము కృపను బట్టే జరుతుంది. విశ్వాసము కలవారే కృపలో ప్రవేశిస్తారు, విశ్వాసములేకుండా కృప అనుభవించలేము.

  1. కృపద్వారా దేవుని చిత్తము తెలియజేయబడుతుంది.
  2. కృపద్వారా దేవుని చిత్తము జరుగునట్టు మన జీవితం సిద్ధపరచబడుతుంది.
  3. కృపద్వారా తెలియచేయబడిన దేవుని చిత్తము మన శక్తినిబట్టికాక దేవుని శక్తినిబట్టి జరుగుతుంది. అనగా పరిశుద్ధాత్మ క్రియలను బట్టి జరుగుతుంది.

పూర్తి వీడియో యూట్యూబ్లో చూడండి