24-03-2024 – ఆదివారం రెండవ ఆరాధన

స్తోత్ర గీతము 1

యేసు రాజు రాజుల రాజై
త్వరగా వచ్చుచుండె – త్వరగా వచ్చుచుండె
హోసన్నా జయమే – హోసన్నా జయమే
హోసన్నా జయం మనకే – హోసన్నా జయం మనకే
||యేసు||

యోర్దాను ఎదురైనా
ఎర్ర సంద్రము పొంగిపొర్లినా
భయము లేదు జయము మనదే
విజయ గీతము పాడెదము
||హోసన్నా||

శరీర రోగమైనా
అది ఆత్మీయ వ్యాధియైనా
యేసు గాయముల్ స్వస్థపరచున్
రక్తమే రక్షణ నిచ్చున్
||హోసన్నా||

హల్లెలూయ స్తుతి మహిమ
ఎల్లప్పుడు హల్లెలూయ స్తుతి మహిమ
యేసు రాజు మనకు ప్రభువై
త్వరగా వచ్చుచుండె
||హోసన్నా||

స్తోత్ర గీతము 2

రాజుల రాజుల రాజు
సీయోను రారాజు (2)
సీయోను రారాజు నా యేసు
పైనున్న యెరూషలేము నా గృహము (2)

తల్లి గర్భము నుండి వేరు చేసి
తండ్రి ఇంటి నుండి నన్ను పిలచి (2)
సీయోను కొరకే నన్ను ఏర్పరచిన
సీయోను రారాజు నా యేసు (2)
||రాజుల||

నిషేధించబడిన రాయి
సీయోనులో మూల రాయి (2)
ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనిన
సీయోను రారాజు నా యేసు (2)
||రాజుల||

స్తోత్ర గీతము 3

హోసన్నా హోసన్నా
హోసన్నా మహోన్నతుడు
దేవా నీ నామము ఉన్నత నామము
కృతజ్ఞత స్తుతులు నీకే
ప్రభావము రారాజుకే

కీర్తి కీర్తి
కీర్తి రారాజుకే
దేవా నీ నామము ఉన్నత నామము
కృతజ్ఞత స్తుతులు నీకే
ప్రభావము రారాజుకే

మహిమ మహిమ
మహిమ రారాజుకే
దేవా నీ నామము ఉన్నత నామము
కృతజ్ఞత స్తుతులు నీకే
ప్రభావము రారాజుకే

ఆరాధన వర్తమానము

ఈ దినము ఎంతో శ్రేష్టమైనది ఎందుకంటే మన రాజును బట్టి మనము సంతోషించవలసిన దినము.

సీయోను నివాసులారా, ఉత్సాహధ్వని చేయుడి; ఇశ్రాయేలీయులారా, జయధ్వని చేయుడి; యెరూషలేము నివాసులారా, పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి.౹ -జెఫన్యా 3:14

మనలను సంతోషించి గంతులు వేసి జయ ధ్వని చేయమని దేవుడు చెప్పుచున్నాడు. మన జీవితములో ప్రతీ సారీ ఆదరించడానికే తన వాక్కును పంపుచున్నాడు.

మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజనసమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని౹ ఖర్జూరపుమట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి –జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలురాజు స్తుతింపబడునుగాక అని కేకలువేసిరి. –సీయోను కుమారీ, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిదపిల్లమీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడినప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దానిమీద కూర్చుండెను.౹ -యోహాను 12:12-14

మనము దేవునిబిడ్డలము గనుక, ఈ మాటలు మనకు సంబంధించినవి కూడా! ఆ సందర్భములో చూస్తే, అక్కడకు వచ్చిన బహుజనులు యేసయ్య గూర్చి ఎరిగిన వారై ఉన్నాడు. ఏమని? చనిపోయి సమాధి చేయబడి నాలుగు రోజులైన ఒక వ్యక్తిని మృతులలోనుండి లేపిన సంధర్భము గూర్చి తెలుసుకున్నవారై, ఈయనే రాజు అని గుర్తించారు.

అలా గుర్తించినవారు తమ బట్టలు గాడిద మీద పరచి, దారి పొడుగునా పరిచారు. ఈ బట్టలు పాపము, శ్రమలకు గుర్తుగా ఉన్నాయి. అలా బట్టలు పరచడము ద్వారా వారు ఏమి తెలియచేస్తున్నారు అంటే వారు కలిగి ఉన్న ప్రతీ పరిస్థితిని మార్చగల సమర్థుడు.

ఈరోజు మన జీవితమును ఆయనకు మహిమకరమైన జీవితముగా మార్చగల సమర్థుడు మన దేవుడు. ఈ సత్యము మనము కూడా నమ్మితే, ఈరోజు మన ఆరాధన ద్వారా ధ్వజము ఎత్తుదాము.

ఖర్జూరపు మట్టలు సమాధానము, సమృద్ధి, విజయమును సూచిస్తున్నాయి. ఎవరి ఈ విషయములు లేవో, వారికి వాటిని దయచేయువాడు మన ప్రభువే.

నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నములవలె నున్నారు గనుక కాపరి తన మందను రక్షించునట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును – జెకర్యా 9:16

ఈ మాటలు జెకర్యా ప్రవక్త ఎప్పుడో ప్రకటించారు. అయితే ఆ దినము అంటే ఏమిటి? ప్రభువైన యేసయ్య వచ్చిన తరువాతి దినములు. అనగా మనమున్న ఈ దినమే! నీవే నాకు సమాధానము దయచేయువాడవు, సమృద్ధి కలిగించువాడవు, విజయము దయచేయువాడవు అని మనము ధ్వజము ఎత్తుచుండగా, ఈ దినమున మన జీవితములో రక్షణ కార్యము జరిగించువాడు మన దేవుడు. అనగా జరగవలసిన మేలును జరిగించువాడు.

వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు; ధాన్యముచేత యౌవనులును క్రొత్త ద్రాక్షారసముచేత యౌవన స్త్రీలును వృద్ధి నొందుదురు. -జెకర్యా 9:17

అనగా జరగవలసిన మేలు జరిగిన తరువాత ఎంతో క్షేమముగా ఉంటాము. దేవుదూ తన కార్యము జరిగించిన తరువాత సొగసైన, అందమైన జీవితము స్థిరపరచబడుతుంది.

యవ్వనులు ధాన్యము చేత వృద్ధిచెందుతారు అంటే, వారి ఉద్యోగములు వృద్ధిచెందుతాయి. అలాగే యవ్వన స్త్రీలు క్రొత్త ద్రాక్షారసము చేత వృద్ధి చెందుతారు అంటే, వివాహములో వృద్ధి కరమైన జీవితము కలిగి ఉంటారు అని అర్థము.

ఒక వ్యక్తి విమానములో వస్తుంటే, అతనిని రెసీవ్ చేసుకోవడానికి మొరొక వ్యక్తి పేరు వ్రాసుకొని ఒక బోర్డ్ పట్టుకుని నిలబడతాడు. ఆ బోర్డును చూసిన వ్యక్తి దగ్గరకు వచ్చిన తరువాత ఇద్దరూ కలిసి ఎక్కడకు వెళ్ళాలో అక్కడకే వెళతారు.

ఈదినమున మనము కూడా ప్రభువు తెలియచేసిన సత్యమును నమ్మి ఆరాధించి మన ధ్వజమును ఎత్తుదాము. అప్పుడు మన ఎత్తిన ధ్వజమును చూసిన నీ యేసయ్య నీ దగ్గరకి వచ్చి, నీతో కలసి, నీవు ఏ పరిస్థితిలో సమాధానము లేదో, ఎక్కడ సమృద్ధి లేదో మరియు ఎక్కడ విజయము లేదో ఆ ప్రతీ చోట నీ స్థితి మార్చడానికి నీతో కలిసి వస్తాడు. ఆయన వెళ్ళిన ప్రతి చోట స్థితి మార్చబడింది.

ఆరాధన గీతము

నీతో నడుతుము- నిన్నే కొలుతుము
నీ సహవాసము- నిత్యము క్షేమము

ఓ యేసయ్యా మా రక్షకా
నీవే మాకు తోడుగా
మా నడవడిలో మా శ్రమలలో
నీవే మాకు నీడగా

దేవా-నీ సన్నిధిలోనా
దేవా- నీ దీవెనలెన్నో
దేవా- పొందెదము దినదినము

నీలో ఉండెదం- నీకై బ్రతికెదం
ఈ ఆనందము- ఇలలో చాటెదం

దేవా- మా స్వరములు ఇవిగో
దేవా- మా స్తోత్రాలు ఇవిగో
దేవా- మా సర్వస్వము నీకే

 

వారము కొరకైన వాక్యము

ఆయన సన్నిధిలో నిలబడే భాగ్యము మనకు దేవుడిచ్చాడు దానిని బట్టి ప్రభువుకే స్తోత్రములు. అందుకే మన జీవితములు ధన్యకరములైనవి.

ఒకవేళ మన వద్ద డబ్బు ఉంది, కారు కొనుక్కొందాము అనుకున్నావు, సంతోషముగా వెళ్ళి కొనుక్కుంటావు సంతోషిస్తావు. ఒకవేళ మన దగ్గర తగినంత డబ్బు లేదు, కానీ కారు కొనుక్కోవాలి అనే ఆశ మాత్రం ఉంది అనుకోండి, అయినప్పటికీ నీవు కారు సొంతం చేసుకోగలిగితే, అది ఇంకా ఎంత సంతోషము కలిగిస్తుంది.

మన దగ్గర ఉన్న ధనమును బట్టి సమకూర్చుకొన్నప్పుడు, నా కష్టార్జితము అని మనలను మనమే మహిమ పరచుకుంటాము. అదే మన దగ్గర ఉన్నదాని బట్టి కాక, సూపర్ నేచురల్ గా మనము సంపాదించుకుంటే, ఖచ్చితముగా మనము దేవునినే మహిమపరచేవారముగా ఉంటాము. మన జీవితములు కూడా దేవునిని మహిమపరచడానికే ఏర్పరచుకున్నాడు.

దేవుని దగ్గరనుండి వచ్చిన ప్రతీ మాట, నీకు క్షేమమును కలుగచేసేదే! అందుకే దేవుడు తన వాక్కును ఎప్పుడూ విడుదల చేసేవాడుగా ఉన్నాడు. ఆయన వాక్కు మన దినములు కొనసాగించేదిగా ఉంటుంది.

అపవాది ఎప్పుడు మ్రింగుదునా అని ప్రతిదినము కాచుకుని కూర్చుంటుంది. అయినప్పటికీ మన దినములు క్షేమముగా కొనసాగించబడుతున్నాయి, అపవాది ప్రయత్నములనుండి ఎలా తప్పించబడుతున్నాము అంటే, దాని అర్థము దేవుడు మనలను కాపాడుకుంటూ వస్తున్నాడు.

నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంటే, అపవాది నీ జీవితమును లాక్కుపోవడానికి, నష్టపరచడానికి, ప్రతీ క్షణము ప్రయత్నిస్తుంటే, ఆ ప్రతీ క్షణమూ దేవుడు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాడు.

ఆయన ఒలీవలకొండదగ్గరనున్న బేత్పగే బేతనియ అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు, తన శిష్యుల నిద్దరిని పిలిచి –మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడియున్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును; దానిమీద ఏ మనుష్యుడును ఎన్నడు కూర్చుండలేదు; దానిని విప్పి తోలుకొని రండి. -లూకా 19:29-30

ఈ మాటలలో మన జీవితమును మనము చూడవచ్చు. ఈ భాగములో యేసయ్యను గూర్చిన సత్యము ఏమిటి అంటే, “ఆయన వెదకి రక్షించేవాడు”. అక్కడ ఉన్న గాడిద స్థితి, అది ఎక్కడ ఉందో అనే విషయము యేసయ్య వెతికి తెలుసుకున్నవాడు గనుకనే శిష్యులకు చెప్పుచున్నాడు.

ఆ గాడిదను చూస్తే, దానిమీద ఇంతవరకు ఎవరూ కూర్చోలేదు అంటే, ఇంతవరకు అది కట్టబడే ఉంది అని అర్థము. మన దేవుడు నాశనము అయిపోయేదానిని వెదకి రక్షించేవాడు. నశించిపోయే పరిస్థితులలో విడిపించడానికే ఆయన వెతుకుతున్నాడు అనే సత్యము మనము గ్రహించాలి.

ఎవరైననుమీరెందుకు దీని విప్పుచున్నారని మిమ్ము నడిగినయెడల–ఇది ప్రభువునకు కావలసియున్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. -లూకా 19:31

అనేకమైన గాడిదలు ఉండగా, కట్టబడిన దాని విషయములోనే, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని ప్రభువు చెప్పుచున్నాడు. ఎందుకంటే ఇంతవరకు ఎవరూ దానిని విప్పలేదు.

అలాగే సమాధుల వద్ద సేన అనే దెయ్యము పట్టినవాడు కూడా నశించిపోయిన స్థితిలో ఉండగా, వాడిని బాగుచేయడానికే యేసయ్య వెతుకుతూ వెళ్ళాడు. యేసయ్య వెళ్ళిన ప్రతిచోట నాశనకరమైన పరిస్థితి మార్చబడింది. దానిని బట్టి దేవుడు మహిమ పరచబడ్డాడు.

దేవుడు బుద్ధిహీనులకు కనపరచుకోవడానికి కారణము, జ్ఞానము లేని కారణమున వారి నశించిపోక, దేవుని జ్ఞానముచేత స్థిరపరచబడాలి అనే ఆశ కలిగి ఉండటమే.

అలాగే సమరయ స్త్రీ జీవితములో చూస్తే, యేసయ్యే ఆమెను వెతుకుతూ వెళ్ళాడు తప్ప ఆ స్త్రీ వెతకలేదు. అందుకే సమరయ గ్రామమునకు వెళ్ళవలసి వచ్చింది అని వ్రాయబడింది.

ఈ అన్ని సందర్భములలో వారిని ప్రభువుకొరకు వాడుకున్నాడు. వారిని విడిపించిన తరువాత వారి నాశనమైన స్థితి మార్చబడి, మహిమకరమైన స్థితిగా మార్చబడినది.

సమరయ స్త్రీని చూస్తే, ఊరంతా ఆమెను వ్యభిచారిగా చూసారు, అయితే తాను మార్చబడిన తరువాత ఆమె మాటలు అంగీకరించారు. ఏమి జరిగి ఉంటుంది? కట్టబడి ఉన్నప్పుడు, అనగా పరిస్థితుల ప్రభావముచేత బంధించబడిన స్థితిలో ఆమె జీవితము వేరు, అనగా వ్యభిచారిగా ఉంది.

అప్పుడు యేసయ్య వెతికి వెళ్ళి ఆమెను విడుదల చేసాడు. అప్పుడు ఆమె పరుగు పరుగున వెళ్ళి గ్రామములోని ప్రజలవద్దకు వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడ? అని ప్రకటించింది. అనగా తన బంధకములనుండి విడుదల పొందుకుని, తనను విడిపించిన యజమానిని ప్రకటించింది.

చీకటి క్రియలు అన్నీ కూడా అపవాదికి సంబంధించినవి. అపవాది యొక్క బంధకములలో ఉన్నప్పుడు, ఆ క్రియలే మన జీవితములలో కనపరచబడతాయి. అయితే నిన్ను వెతుకుతున్న యేసయ్య నిన్ను ఆ అపవాది బంధకములనుండి విడిపించాలి అనే ఆశ కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే, నీవు విడిపించబడతావో, అప్పుడు నీవు కూడా అపవాది బంధకములనుండి, అధికారమునుండి విడిపించబడి, ప్రభువు పని కొరకు సిద్ధపరచబడతాము.

అందుకే మన ధైర్యము ఆయనే, మనము ఏ నాశనకరమైన స్థితిలో ఉన్నప్పటికీ, మన గురించి వెతికి రక్షించేవాడుగా ఉన్నాడు. అప్పుడు మన జీవితము ప్రభువునకు మహిమకరముగా మార్చబడుతుంది. దుఃఖమునుండి ఆనందమునకు జీవితము మారుతుంది .

జక్కయ్యను జ్ఞాపకము చేసుకుంటే, తనుకూడా బంధకములలో ఉన్నాడు. అన్యాయముగా ధనము సంపాదించుకోవాలి అనే అపవాది బంధకములలో అతడు బంధించబడ్డాడు. అయితే యేసయ్య అతడిని రక్షించిన తరువాత వెంటనే అన్యాయముగా తీసుకున్న ధనమునకు రెండంతలు, మూడంతలు తిరిగి ఇచ్చేవాడుగా మార్చబడ్డాడు.

అందుకే మన యేసయ్య నశించిపోవుదానిని వెతికి రక్షించేవాడు. నీ జీవితములో కూడా నిన్ను రక్షించినతరువాత, నీ ద్వారా తన పని జరిగించుకుంటాడు. జక్కయ్య జీవితములో చూస్తే, ఘోరపాపిగా లోకము చూసిన వ్యక్తిని ప్రభువు క్షమించినవాడుగా ఉన్నాడు.

నిన్ను నన్ను కూడా నశించిన స్థితిలో ఉన్న సమయములో ప్రభువు మనలను రక్షించాడు. అంటే మనలను కూడా ప్రభువు తన పని కొరకు వాడుకుంటాడు.

నీ జీవితము అనేకమందికి అద్భుత సువార్త అవ్వవచ్చు, లేదా నీన్ను ప్రత్యక్ష పరిచర్యలోనైనా వాడుకోవచ్చు, అది ప్రభువు ఇష్టము. కానీ మనము ప్రభువు పనికే అనేది స్పష్టము.