24-03-2024 – ఆదివారం మొదటి ఆరాధన – ఇక నీకు జయమే

స్తోత్ర గీతము 1

రాజుల రాజుల రాజు
సీయోను రారాజు (2)
సీయోను రారాజు నా యేసు
పైనున్న యెరూషలేము నా గృహము (2)

తల్లి గర్భము నుండి వేరు చేసి
తండ్రి ఇంటి నుండి నన్ను పిలచి (2)
సీయోను కొరకే నన్ను ఏర్పరచిన
సీయోను రారాజు నా యేసు (2)
||రాజుల||

నిషేధించబడిన రాయి
సీయోనులో మూల రాయి (2)
ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనిన
సీయోను రారాజు నా యేసు (2)
||రాజుల||

స్తోత్ర గీతము 2

హోసన్నా హోసన్నా
హోసన్నా మహోన్నతుడు
దేవా నీ నామము ఉన్నత నామము
కృతజ్ఞత స్తుతులు నీకే
ప్రభావము రారాజుకే

కీర్తి కీర్తి
కీర్తి రారాజుకే
దేవా నీ నామము ఉన్నత నామము
కృతజ్ఞత స్తుతులు నీకే
ప్రభావము రారాజుకే

మహిమ మహిమ
మహిమ రారాజుకే
దేవా నీ నామము ఉన్నత నామము
కృతజ్ఞత స్తుతులు నీకే
ప్రభావము రారాజుకే

స్తోత్ర గీతము 3

హోసన్నా హల్లేలూయా బ్రతుకంతా హల్లేలూయా
ఆరాధింతును నిన్ను ఆరాధింతును
జయము జయము హోసన్నా
స్తోత్రము గీతములు పాడి
ఆరాధింతును నిన్ను ఆరాధింతును

లోకపాపాన్ని మోసికొనిపోవు
దేవుని గొర్రెపిల్లగా
పాప శాపాన్ని రూపు మాపిన దైవసుతుడవి నీవే
హోసన్నా హల్లేలూయా బ్రతుకంతా హల్లేలూయా
ఆరాధింతును నిన్ను ఆరాధింతును

జీవమార్గము కాంతినిలయము నీవు నివసించే స్థలములు
జీవ జలములైన బ్రతికించే నీ మాట సాక్షినైయుందు దేవా
హోసన్నా హల్లేలూయా బ్రతుకంతా హల్లేలూయా
ఆరాధింతును నిన్ను ఆరాధింతును

 

ఆరాధన వర్తమానము

ఈ దినము మనము సంతోషించవలసిన దినము. సత్యము తెలిసిన వారు ఈ దినమును బట్టీ నిజముగా సంతోషించేవారుగా ఉంటారు.

సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు.౹ -జెకర్యా 9:9

మనలను సంతోషముగా ప్రభువు ఉండమంటున్నాడు అంటే కారణము ఎదో ఉండి ఉంటుంది కదా! ఆ సత్యము మనము ఎరిగితే ఆ సంతోషమును మనము అనుభవించగలుగుతాము.

“నీ” రాజు “నీ” యొద్దకు వచ్చుచున్నాడు. అందుకే నీవు సంతోషించవలసిన అవసరము ఉంది. ఆయన మన వద్దకు వచ్చుచున్నాడు గనుక సంతోషించమని దేవుడు చెప్పుచున్నాడు అంటే, మన పరిస్థితి ఏమై ఉంటుంది?

అది ఎదో ఒక దుఃఖకరమైన పరిస్థితిలో మనము ఉన్నపుడు దేవుడు మనకు చెప్పే మాట ఈ మాట. మనము ఉన్న అవసరములో దేవుడు మనకు చెప్పుచున్న మాట ఇది. “నీ రాజు” నీ యొద్దకు వచ్చుచున్నాడు గనుక అన్నీ ఆయనే చూసుకుంటాడు అని అర్థము.

ఇప్పుడు వచ్చుచున్న వాడు ఎటువంటివాడు అనే సత్యము మనము గ్రహించాలి. మనము ఒక అత్యవసరము లేదా ఒక కష్టములో ఉన్నప్పుడు, అనేకులు నేను చూసుకుంటాను అని చెప్పొచ్చు. అయితే అనేకులు మాటవరసకు మాత్రమే చెప్తారు. కానీ, నీతో చెప్పుచున్న వ్యక్తి ఎవరో నీవు ఎరిగి, ఆ వ్యక్తి చెప్పింది చేసేవాడు అయితే, ఖచ్చితముగా మనము ఎంతో సంతోషిస్తాము.

ఏలయనగా యెహోవా సర్వనరులను ఇశ్రాయేలీయుల గోత్రపువారినందరిని లక్ష్యపెట్టువాడు – జెకర్యా 9:2

మన జీవితము గురించి మనకు ఆలోచన ఉన్నా లేకపోయినా, మన రాజు మాత్రము మన జీవితమును గూర్చి లక్ష్యపెట్టేవాడుగా ఉన్నాడు. అందుకే మన యొద్దకు వచ్చుచున్నాను అని చెప్పుచున్నాడు. దీనికి కారణము ఏమిటి అంటే, మన జీవితము ద్వారా ఆయనకు అనగా దేవునికి మహిమ రావాలి.

సమరయ స్త్రీ విషయములో చూస్తే, ఆ స్త్రీ రమ్మని అడగలేదు గానీ, యేసయ్యే ప్రేమ కనికరములు మరియు కృప కలిగినవాడు గనుక ఆమె వద్దకు వెళ్ళి రక్షించాడు.

ఒక తరగతిలో ఉన్న విద్యార్థుల పై ఉపాధ్యాయులు ప్రత్యేకమైన శ్రద్ధ పెడతారు. ఆ ఉపాధ్యాయుల యొక్క ఉద్దేశ్యము ఏమిటి? బాగా చదవలేని స్థితిలో ఉన్న వారు ఫెయిల్ అవ్వకుండా పాస్ అవడానికి అవసరమైన శ్రద్ధ వారిపై చూపుతారు.

అదేవిధముగా మన జీవితముపై లక్ష్యపెట్టాడు గనుక మన దేవుడు మనలను విడిచిపెట్టక, మన స్థితి మార్చడానికి మన వద్దకు వచ్చుచున్నాడు. నీ జీవితము పై ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు గనుక నీ జీవితము స్థితి మార్చడానికి నీ యొద్దకు వచ్చుచున్నాడు.

ఒకవేళ బాగా చదివే విద్యార్థి ఉంటే, వాడిని విడిచిపెట్టడుగాని, వాడు ఇంకాబాగా ఉండాలి అనే ఉద్దేశ్యముతో ఎలా అయితే శ్రద్ధ పెడతారో, అలాగే నీ ప్రభువు కూడా నువ్వు బాగానే ఉన్నా సరే, నిన్ను మరొక మెట్టు ఎక్కించడానికి నీ మీద శ్రద్ధపెట్టారు.

ఆశించిన రీతిలో నీ జీవితము లేకపోతే, ఆ జీవితాన్ని మార్చాలి అనే ఆశ కలిగి నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు.

నీ జీవితము మంచిగానే ఉన్నప్పటికీ, నిన్ను మరొక మెట్టు ఎక్కించడానికి, నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు.

ఇది దేవుని మాటగా నీవు తీసుకుంటే ఆ మాట ప్రభావము నీవు అనుభవించగలుగుతావు.

సారెఫతు విధవరాలు ఏలియా చెప్పిన మాటను, “ఏలియా దేవుడైన యెహోవా మాట” గా తీసుకున్నప్పుడు, తన పరిస్థితి మార్చబడింది.

మన జీవితములో కొన్ని విషయములలో మంచిగా ఉన్నాము, మరికొన్ని విషయములలో దీన స్థితిలో ఉన్నాము. అయితే ఈరోజు మనలను పరిపూర్ణము చేయడానికి మన ప్రభువు మన యొద్దకు వచ్చుచున్నాడు.

మన వద్దకు వచ్చిన మాటను మనము పోనివ్వద్దు! మన వద్దకు వచ్చిన యేసయ్య మన స్థితి మార్చకుండా పోనివ్వవద్దు! ఆసక్తి కనపరచడము ద్వారానే నీవు ఇది చేయగలవు.

ఉదాహరణకు ఒక వ్యక్తి అనారోగ్యముతో ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు అనే మాట వచ్చింది. ఇప్పుడు ఆ అనారోగ్యములో ఉన్నవాడు, తన అనారోగ్యము మార్చబడుతుంది అనే విశ్వాసముతో ఆ మాటను స్వీకరించాలి. అప్పుడు ఆ మాటలోని శక్తి తన క్రియ జరిగిస్తుంది.

సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు.౹ -జెకర్యా 9:9

నీ యొద్దకు వచ్చుచున్న రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడుగా ఉన్నాడు.

ఉదాహరణకు ఒక వ్యకి ఆసుపత్రిలో ధనము అవసరమైన స్థితిలో తన వారికి ఫోన్ చేసి చెప్పినప్పుడు ఒకవేళ దబ్బుకలిగిన వాడు వస్తున్నాను అని చెప్తే, ఆ వ్యక్తి ఎమి అర్థము చేసుకుంటాడు? డబ్బు తీసుకువస్తాడు అనే కదా!

అలాగే నీ యొద్దకు వచ్చుచున్న వ్యక్తి ఎవరో, ఏమి కలిగి ఉన్నాడో అని ఆలోచిస్తే, నీ స్థితి మార్చడానికి అవసరమైన సమస్తము కలిగి ఉన్నాడు. ఆయన కలిగిన మహిమను మన జీవితములో విడుదల చేసేవాడుగా ఉన్నాడు.

దేవుని క్రియలు గమనిస్తే, మనము పడిన గుంటలోనుండి లేవనెత్తడానికి ఆయన తనవాక్కును పంపేవాడుగా ఉన్నాడు. అనగా ఈరోజున ప్రభువు నీ యొద్దకు పంపిన మాట యొక్క ప్రభావము నీవు గ్రహించాలి.

అలాగే నీ యొద్దకు వచ్చుచున్న వాడు రాజు గనుక నీ జీవితమును పరిపాలించువాడు. నీ జీవితము బాగుచేయబడుతుంది, నెక్స్ట్ లెవెల్ కి వెళుతుంది. ఇది ఖచ్చితము.

లోకములో ఉన్న మనుష్యులు మన స్థితిలో సహాయము చేయడానికి మన దగ్గరకు వస్తే, ఆ వ్యక్తిని సరైన విధానములో స్వీకరించకుండా గనుక ఉంటే ఎలా ఉంటుంది?

మనము ఏ మాత్రము అర్హత లేకపోయినప్పటికీ, మన స్థితి మార్చడానికి అన్నీ సమకూర్చుకుని మన వద్దకు దీనుడై వచ్చుచున్నాడు అంటే, ఆయనను నీవు ఎలా స్వీకరించాలి?

ఆరాధన గీతము

నా చిన్ని హృదయముతో
నా గొప్ప దేవుని నే ఆరాధించెదన్
పగిలిన నా కుండను
నా కుమ్మరి యొద్దకు తెచ్చి
బాగుచేయమని కోరెదన్

హోసన్న హోసన్నా యూదుల రాజుకే
హోసన్న హోసన్నా రానున్న రారాజుకే

మట్టి నుండి తీయబడితిని
మరలా మట్టికే చేరుదును
మన్నైన నేను మహిమగ మారుటకు
నీ మహిమను విడచితివే

హోసన్న హోసన్నా యూదుల రాజుకే
హోసన్న హోసన్నా రానున్న రారాజుకే

అడుగులు తడబడిన వేళలో
నీ కృపతో సరి చేసితివే
నా అడుగులు స్థిరపరచి నీ సేవకై
నడిచే కృప నాకిచ్చితివే

హోసన్న హోసన్నా యూదుల రాజుకే
హోసన్న హోసన్నా రానున్న రారాజుకే

ఈ లోక యాత్రలో
నాకున్న ఆశంతయూ
నా తుది శ్వాస విడచే వరకు
నీ పేరే ప్రకటించాలని

హోసన్న హోసన్నా యూదుల రాజుకే
హోసన్న హోసన్నా రానున్న రారాజుకే

 

వారము కొరకైన వాక్యము

ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమ పరచబడినప్పుడు అవి ఆయననుగూర్చి వ్రాయబడెననియు, వారాయనకు వాటినిచేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి.౹ -యోహాను 12:16

ఇక్కడ ఒక సందర్భము జరుగుతుంది. అయితే ఆ సందర్భము జరుగుతున్నపుడు శిష్యులు గ్రహించలేకపోయారు. అయితే ఆ సంధర్భము ఒకసారి చూద్దాము.

మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజనసమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని౹ ఖర్జూరపుమట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి –జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలురాజు స్తుతింపబడునుగాక అని కేకలువేసిరి. -యోహాను 12:12-13

యేసుక్రీస్తు ప్రభువును ఖర్జూరపు మట్టలు చేతపట్టుకుని, ప్రభువు పేరట వచ్చువానికి జయము అని చెప్పుచూ, ఎదుర్కోవడము శిష్యులు చూసారు. అయితే ఆ సమయములో గ్రహించలేకపోయారు కానీ యేసయ్య మహిమ పరచబడిన తరువాత గ్రహించారు. ఏమి గ్రహించారు? “వ్రాయబడిన ప్రకారము జరిగింది” అని గ్రహించారు.

అయితే మన వ్యక్తిగతమైన జీవితము గూర్చి ఏమి వ్రాయబడింది అనే సంగతి మనము తెలుసుకుందాము. ఆ విషయము మనకు తెలిస్తే మనము కూడా ప్రకటించగలుగుతాము ఉంటాము.

ఖర్జూరపు మట్టలు సమాధానమునకు, సమృద్ధికి సూచనగా ఉన్నాయి.

వారు ఆ గాడిదపిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి, తమ బట్టలు దానిపై వేయగా ఆయన దానిమీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగుననుపరచిరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలనుపరచిరి. మరియు ముందు వెళ్లుచుండినవారును వెనుక వచ్చుచుండినవారును –జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక వచ్చుచున్న మన తండ్రియైన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. -మార్కు 11:7-10

ఇక్కడ చూస్తే, అనేకులు బట్టలు గాడిగమీద వేసారు, అలాగే దారి పొడుగునా పరిచారు. అనగా మన వ్యక్తిగతమైన జీవితమును యేసయ్య కొరకు సిద్ధపరచుకోవలసిన సంగతిని ఇది జ్ఞాపకము చేస్తుంది.

ఖర్జూరపు మట్టలు సూచిస్తున్న సమాధానము దయచేయువాడవు నీవే ప్రభువా అని ప్రకటించి ఎదుర్కోవాలి. వారు పరచిన బట్టలు వారు కలిగిన బాధలకు, శ్రమలకు సాదృశ్యముగా ఉన్నాయి. ఇప్పుడు మనము కూడా మనమున్న శ్రమలో, బాధలో సమాధానము నీవే ప్రభువా అని ఆయనను ఎదుర్కుందాము.

ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణముద్వారా మనము దేవునితో సమాధానపరచబడినయెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము.౹ -రోమా 5:10

ఇప్పుడు మన యొద్దకు వచ్చుచున్న వ్యక్తిని, నా సమాధానము నీవే అని ప్రకటిస్తూ ఎదుర్కొంటున్నప్పుడు, ఆ వద్దకు వచ్చిన వ్యక్తిని మనము స్వీకరించినపుడు, అనగా ఆయన మనతో జీవించినపుడు, ఆయన మనతో జీవించుటను బట్టి, మనము మరి నిశ్చయముగా మన ప్రతీ పరిస్థితిలో రక్షించబడుదుము.

వ్రాయబడిన ప్రకారముగా అక్కడ జరుగుతూ వచ్చింది. మన జీవితములో కూడా వ్రాయబడినదే జరుగుతుంది. ఆయనే మనకు సమాధానమై ఉన్నాడు, ఆయనే మనకు జీవమును అనుగ్రహించువాడిగా ఉన్నాడు.

నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాననెను. -యోహాను 16:33

జయము కలిగినవాడిని మనము ఎదుర్కుంటున్నాము. మనము చేస్తున్న పోరాటములో, ఇక జయము మనదే!

అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక.౹ -1 కొరింథీయులకు 15:57

ఏ శ్రమలో, పోరాటములో మనకు బలము లేకున్నా, జ్ఞానము లేకున్నా, ఆదరణ లేకున్నా, నా విజయము నీవే ప్రభువా అని యేసయ్యను ఎదుర్కొంటే, ఆయన మూలముగా ఇక జయము మనదే!

ఆయన లోకమును జయించినవాడు గనుక, ఎలా జయించాలో ఎరిగినవాడుగా ఉన్నాడు. ఈలోకములో మనకు కలిగిన పోరాటములు ఎరిగి అనుభవించినవాడు గనుక ఆయనకు ఎలా మన పోరాటము ముగించాలో ఆయనకు తెలుసు.

బహుశా మనకు మన పోరాటములో శక్తిలేదు, అప్పుడు ఆయన తన శక్తిని దయచేసేవాడుగా ఉన్నాడు. ఉదాహరణకు మన జీవితములో ధనము అవసరమైన స్థితిలో ఆయన బట్టే నాకు అవసరమైనది అనుగ్రహించబడుతుంది అని ప్రకటిస్తే, ఆ అవసరమైన ధనము సమకూర్చబడునట్లుగా, మార్గములు తెరువబడతాయి.

అయితే ఇక్కడ ఒక నియమము, ఆయనను నీవు నమ్మినదానిని బట్టి అది ప్రకటించి ఎదుర్కోవాలి.

యెరూషలేములో ఉన్నవారు యేసయ్యను ఎదుర్కోవడానికి ఎందుకువచ్చారు? లాజరును మృతమైన స్థితి నుండి లేపాడు అని విని, ఇప్పుడూ మా స్థితిని కూడ మార్చగలిగినవాడు అని నమ్మి ఎదుర్కొన్నారు.

యేసయ్య మృతమైన పరిస్థిని మార్చగలిగినవాడు, సమాధానమును అనుగ్రహించువాడు, విజయము అనుగ్రహించువాడు అని విని, నమ్మి నిలబడినపుడు ఆయన ఖచ్చితముగా నీ జీవితములో ప్రవేశించి సమాధానమును, విజయమును అనుగ్రహిస్తాడు.