17-03-2024 – ఆదివారం రెండవ ఆరాధన – మరణంలో నుండి జీవము

స్తోత్ర గీతము 1

యేసే గొప్ప దేవుడు – మన యేసే శక్తిమంతుడు (2)
యేసే ప్రేమ పూర్ణుడు – యుగయుగములు స్తుతిపాత్రుడు (2)
స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి
ఘనతా బలము కలుగును ఆమెన్ (2)
||యేసే||

మహా శ్రమలలో వ్యాధి బాధలలో
సహనము చూపి స్థిరముగ నిలచిన
యోబు వలె నే జీవించెదను (2)
అద్వితీయుడు ఆదిసంభూతుడు
దీర్ఘ శాంతుడు మన ప్రభు యేసే (2)
||స్తోత్రము||

ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో
లోకమునకు ప్రభువును చాటిన
దానియేలు వలె జీవింతును (2)
మహోన్నతుడు మన రక్షకుడు
ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే (2)
||స్తోత్రము||

జీవితమంతా ప్రభుతో నడచి
ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన
హనోకు వలె నే జీవించెదను (2)
అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు
నీతి సూర్యుడు మన ప్రభు యేసే (2)
||స్తోత్రము||

స్తోత్ర గీతము 2

ఊహించని మేలులన్ నాకై చేసిన దేవా
ఉత్సహించి పాడెదన్ ఉల్లసించి చాటెదన్
నీదు నామ గీతము నాదు జీవితాంతము
కొనియాడెదన్ కీర్తించెదన్ స్తోత్రించెదన్
||ఊహకు||

కనబడవు మా కళ్ళకు – మరి వినబడవు మా చెవులకు
ఊహలకే అస్సలందవు – ప్రభు నీ కార్యముల్ (2)

అడుగువాటి కంటెను – ఊహించు వాటి కంటెను
అద్భుతాలు చేయగా – వేరెవరికింత సాధ్యము
అసాధ్యమైనదేది నీకు లేనే లేదు
ఇల నీకు మించి నాకు దైవమెవరున్నారు (2)
||ఉత్సహించి||

బండ నుండి నీళ్లను – ఉబికింపజేసినావుగా
ఎడారిలో జల ధారలు – ప్రవహింపజేసినావుగా
కనుపాప లాగ నన్ను కాచే దైవం నీవు
నడి సంద్రమైన నన్ను నడిపే తోడే నీవు (2)
||ఉత్సహించి||

స్తోత్ర గీతము 3

ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను
తన గుడారపు మాటున నన్ను దాచెను
ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను

యెహోవా నా ప్రాణ దుర్గము
నేను ఎవరికి వెరతును
నా చేయి విడువని దేవుడుండగా
నేను భయపడను

ఇహలోక దుఃఖ బాధలలో
నీవు నాతో ఉన్నావు
ముదిమి వచ్చువరకు నన్ను
ఎత్తుకొనే దేవుడవు
నీవుగాక వేరే ఆశ నాకు లేనేలేదు

నిత్యము నీ పై ఆనుకొని
నిశ్చింతగా సాగేదన్
ఆ…హల్లెలూయ….హల్లెలూయ

లెక్కించలేని అధ్భుతములు
మక్కువతో చేసిన దేవా
నీవు చేసిన కార్యములకై నేను
ఏమి అర్పింతును స్వచ్ఛమైన
నిత్య ప్రేమను నా పై చూపినదేవుడవు
కొట్లా కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా

ఆరాధన వర్తమానము

దేవుని సన్నిధిలో గడుపుట మహాభాగ్యముతో కూడినది. ఎందుకు అని ఆలోచిస్తే,

అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్షచెట్లు ఫలింపకపోయినను ఒలీవచెట్లు కాపులేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొఱ్ఱెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యెహోవాయందు ఆనందించెదను నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము ఆయన నా కాళ్లను లేడికాళ్లవలె చేయును ఉన్నతస్థలములమీద ఆయన నన్ను నడవచేయును. -హబక్కూకు 3:17-19

దేవుని సన్నిధి పరిశుద్ధులు నివాసముండే స్థలము. దేవుని సన్నిధి ధన్యకరమైనది. లోకములో కూడా అనేకమైన సన్నిధిలున్నాయి కానీ అవి వ్యర్థమైనవి.

నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించినయెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును.౹ -యోహాను 10:9

మన మధ్యన మన దేవుడు ఉన్నాడు కాబట్టి, ఈ స్థలమంతా ఆయన బలము, ప్రభావముతో నిండి ఉన్నది. ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడ ఆయన మహిమ, బలము ప్రత్యక్షపరచబడుతుంది. ఈ స్థలములో అడుగుపెట్టిన ప్రతివాడూ రక్షించబడినవాడుగా ఉంటున్నాడు. అనగా ఇక్కడ అడుగుపెట్టిన ప్రతీవారి జీవితములో ఒక రక్షణ కార్యము జరుగుతుంది. ఆ కార్యము ఆత్మీయమైనది అయినా సరే, శరీరసంబంధమైనదైనా సరే రక్షణ కార్యము మాత్రము జరుగుతుంది.

దేవుని సన్నిధిలో నెగటివ్ సంగతులే లేవు. ఒకవేళ నీవు మరణకరమైన సంగతులతో గనుక దేవుని సన్నిధిలో ప్రవేశిస్తే, నీ స్థితి జీవమునకు మార్చబడుతుంది. దేవుడు ప్రతివారి కొరకు ఆహారము సిద్ధపరచి తన సన్నిధిలో ఉంచారు.

దినదినము మనము ఆత్మీయముగా లోతైన అనుభవము కలిగి ఉండులాగున మన నడక ఉండాలి. ఒక కట్టడము కట్టేసమయములో పునాది వేసి పిల్లర్స్ లేపిన తరువాత నీటి చేత తడుపుతాము. ఆ సమయములో గమనిస్తే, ఎక్కడెక్కడ గుంటలు ఉన్నాయో అక్కడికే ఆ నీరు వెళుతుంది కదా! అలాగే మన జీవితములో ఆశ గనుక ఉంటే, మనము వినే వాక్యము ఆ ఆశను తీరుస్తుంది.

ఒకప్పుడు దేవుని సన్నిధికి వస్తూ, క్రమముగా ఎదుగుతూ ఆరాధించే స్థితికి గనుక చేరుకుంటే, ఇంకా ముందుకు మనము ఎదగాలి. దేవుని సన్నిధిలో ఉన్న ఆయన లక్షణములు, నా లేమి స్థితిని నింపాలి అనే ఆశ కలిగి ఉండేలా మనము ఎదగాలి.

యెహోవా రాజ్యము చేయుచున్నాడు లోకము కదలకుండ స్థిరపరచబడియున్నది న్యాయమునుబట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి -కీర్తనలు 96:10

మన దేవుడు పరిపాలన చేస్తున్నాడు కాబట్టే ఈ లోకము స్థిరముగా ఉన్నది అని వాక్యము చెప్పుచున్నది. ఇప్పుడు మనము ఆయన సన్నిధిలో ఉన్నాము. ఆయన సన్నిధిలో మనపై ఆయన రాజ్యము చేస్తున్నాడు గనుక మనకు కూడా కదలకుండా స్థిరపరచబడినవారముగా ఉన్నాము.

ఆయన న్యాయమును బట్టి, పరిపాలన చేసేవాడుగా ఉన్నాడు. దేవుని విషయములను మన జ్ఞానము చొప్పున సరిచూడాలి అంటే అది కష్టమైన పని. పరిపాలన చేయుట అంటే ఏమి జరుగుతుంది? ఎవరికి అన్యాయము జరిగిందో, వారికి న్యాయమైన తీర్పులు తీర్చబడతాయి. కాబట్టి మన జీవితములో జరిగిన నష్టమును బట్టి కుమిలిపోయే అవసరము లేదు.

ఈ సత్యము ఎరిగినవాడు తన నష్ట పరిస్థితిలో అయినా సరే, ఇలా చెప్పగలుగుతాడు – “నేను యెహోవాయందు ఆనందించెదను నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము ఆయన నా కాళ్లను లేడికాళ్లవలె చేయును ఉన్నతస్థలములమీద ఆయన నన్ను నడవచేయును”. ఇదే మన విశ్వాసమును కనపరచుట. అలా విశ్వాసమును కనపరచిన తరువాత ఆశీర్వాదము కలుగుతుంది.

మీకు కలుగు ఆ కృపనుగూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణనుగూర్చి పరిశీలించుచు, తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైనశ్రమలనుగూర్చియు, వాటి తరువాత కలుగబోవు మహిమలనుగూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చునపుడు, ఆ ఆత్మ, యే కాలమును ఎట్టి కాలమును సూచించుచువచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి.౹ -1 పేతురు 1:10

“దానిని విచారించి పరిశోధించిరి” ఎప్పుడు? ఏమి పరిశోధించారు? శ్రమలవెనుక మహిమ దాచబడి ఉన్నది అని పరిశోధించి తెలుసుకున్నారు. అందుకే ఈ దినము నీవు శ్రమలో ఉంటే, దాని వెనుక ఉన్న మహిమను, సంతోషమును కూడా జ్ఞాపకము చేసుకో!

యెహోవామీద క్రొత్త కీర్తన పాడుడి సర్వభూజనులారా, యెహోవామీద పాడుడి యెహోవామీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి అనుదినము ఆయన రక్షణసువార్తను ప్రకటించుడి. -కీర్తనలు 96:1-2

రక్షణసువార్త ప్రకటించాలి అనే మాట చూస్తే, అనుదినము ఏ విధముగా లోపల వెలుపల ఆహారము ఉంటుందో, దానిని ప్రకటన చేయాలి. ఎలా? ఈరోజు నా పరిస్థితిలో దేవుని కృప నాకు ఇలా తోడుగా ఉంది అనే ప్రకటనే! ఇటువంటి సాక్ష్యముతో కూడిన ప్రకటన, మరొక ఆత్మను సంపాదించగలుగుతుంది.

ఇందునుగూర్చి దేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది.౹ మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచియున్నాడు -1 కొరింథీయులకు 2:9-10

వేరేవారికి కంటికి కనబడలేదు గానీ, మనము ఆరాధనలో ఆయనతో ఐక్యమై ఉండగా మనకొరకు ఆయన సిద్ధపరచినది మనకు కనపరచబడుతుంది. మన కొరకు సిద్ధపరచబడినదాని గూర్చి దేవుడు చెప్పే సంగతులు మనకు వినబడతాయి. అలాగే మన కొరకు సిద్ధపరచబడినదాని గూర్చి దేవుడు చెప్పే సంగతులు మన హృదయమునకు అర్థమయ్యేలా తెలియచేస్తాడు. ఈ స్థాయికి మనము అందరము ఎదగాలి.

దేవునిని నిజముగా ఆరాధించే మనకు ఆయన తెలియచేసే కార్యములు కనబడతాయి, వినబడతాయి, మన హృదయమునకు అర్థముకూడా అవుతాయి.

ఆయన నామమును కలిగి ఉన్న మన జీవితములో ఏ శత్రువు ఉన్నా సరే, ఆ శత్రువు మోకాలు వంగవలసినదే. ప్రతీ అసాధ్యమైన పరిస్థితి సాధ్యమయ్యేలా అది లోబడవలసినదే! మనము జాగ్రత్తగా సరిచూసుకోవలసినది ఏమిటి అంటే, మనము ఆయనను కలిగిఉన్నామా లేదా, అనేదే!

దేవుడు మాట పలుకగా ఆ ప్రకారము జరుగవలసినదే. ఈ సత్యము ఎరిగి ఆత్మీయముగా దేవుని వైపు చూస్తూ నడిచినప్పుడు మన జీవితములో అద్భుతములు జరుగుతాయి. అయితే ఎప్పుడైతే లోకమువైపు దృష్టి మరలిందో, అప్పుడు అద్భుతము పోగొట్టుకొనేవారముగా అయిపోతాము.

అదాము హవ్వలు తినవద్దు అని చెప్పిన పండు తిన్న సమయములో. హవ్వ తిన్న వెంటనే ఏమీ కాలేదు గానీ, ఆదాము తిన్న వెంటనే మహిమను కోల్పోయారు. మన జీవితములో కూడా మన దృష్టి మరలించబడుతున్నపుడు ఆ మరలింపుకు లోబడిపోతే, మనము దేవుడిచ్చే మహిమను పోగొట్టుకొనేవారిగా అయిపోతాము.

నాలో ఉన్న వాని బట్టి నాకు సమస్తము సాధ్యమే అని పౌలు చెప్పగలుగుతున్నాడు. ఆయన క్రీస్తును పోలి నడుచుకున్నాడు కాబట్టి అలా చెప్పగలిగాడు. మనము కూడా క్రీస్తునుపోలి నడుచుకున్నప్పుడు, మనము కూడా అలాగే చెప్పగలుగుతాము.

ఆరాధన గీతము


ఏ నామములో సృష్టి అంతా సృజింపబడెనో
ఆ నామమునే స్తుతింతును
ఏ నామములో పాపమంతా క్షమించబడెనో
ఆ నామమునే పూజింతును
ఏ నామములో దావీదు గోలియాతును ఎదురించెనో
ఆ నామమునే నమ్మెదను
ఏ నామములో ఈ లోకమంతటికి రక్షణ కలుగునో
ఆ నామమునే స్మరింతును

నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను
నీ నామమే ఆధారము
నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను
నీ నామమే నా జయము

రోగము తలవంచును నీ నామము ఎదుట
శాపము తల వంగును నీ నామము ఎదుట (2)
సాటిలేని నామము – స్వస్థపరచే నామము (2)
||నీ నామమునే||

ప్రతి మోకాలొంగును నీ నామము ఎదుట
ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత (2)
శ్రేష్టమైన నామము – శక్తిగలిగిన నామము (2)
||నీ నామమునే||

హెచ్చింపబడును గాక నీ నామము యేసయ్యా
కీర్తింపబడును గాక నీ నామము యేసయ్యా
కొనియాడబడును గాక నీ నామము యేసయ్యా
అన్ని నామములకు పై నామముగా (2)
అన్ని నామములకు పై నామముగా – (3)
||నీ నామమునే||

వారము కొరకైన వాక్యము

ఈరోజు మరణములోనుండి జీవములోనికి ఎలా మనము దాటాలి అనే విషయము గూర్చి తెలుసుకుందాము. ప్రతిదాని విషయములో యేసయ్య ఒక మాదిరిగా జీవించి వెళ్ళాడు.

నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవముగలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములోనుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.౹ -యోహాను 5:24

మరణకరమైన స్థలములోనుండి జీవము గల స్థలములోనికి నడిపించబడాలి అంటే, మొదటిగా మనము విశ్వాసము ఉంచాలి. అయితే అలా విశ్వాసముంచాలి అంటే మనకు ఆధారము దేవుని వాక్యమే.

అందుకే “నా మాట (వాక్యము)” విని, నన్ను పంపినవానియందు (దేవుని యందు) విశ్వాసముంచినపుడు జీవములోనికి దాటగలుగుతాము.

అతడు (లాజరు) రోగియై యున్నాడని యేసు వినినప్పుడు తానున్నచోటనే యింక రెండు దినములు నిలిచెను.౹ -యోహాను 11:6

యేసుప్రభువు ముందు రోగిగా ఉన్న వ్యక్తి కనపరచబడుతున్నాడు. ఆ వ్యక్తిని స్వస్థపరచమని వర్తమానము వచ్చిన తరువాత, 2 దినములు ఉన్నచోటనే యేసు ప్రభువు ఉండిపోవలసిన కారణము చేత, ఆ రోగి అయిన వ్యక్తి చనిపోయాడు.

అయితే నియమము ఏమిటి? ఎవరైతే విశ్వాసముంచుతారో వారు మరణము నుండి జీవములోనికి దాటించబడుతారు.

మార్త యేసుతో–ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండును.౹ ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకను గ్రహించునని యెరుగుదుననెను.౹ -యోహాను 11:21-22

ఇక్కడ మార్త యేసు ప్రభువు నందు విశ్వాసం కలిగే ఉంది. అందుకే నీవు ఉండి ఉంటే అనే మాట చెప్పింది.

యేసు–నీ సహోదరుడు మరల లేచునని ఆమెతో చెప్పగా -యోహాను 11:23

ఇక్కడ మార్త విశ్వాసము తనకు తెలిసిన సత్యమును దాటలేకపోతుంది. ఏమిటి అంటే, చనిపోయిన వ్యక్తి తిరిగిలేవడు అనే సత్యము తాను ఎరిగి ఉన్నది. అయితే, దేవుడు దానిని దాటికూడా బ్రతికించగల సమర్థుడు అనే విశ్వాసము కనపరచాలి అంటే, మన ఆత్మీయ పునాది బలముగా ఉండాలి.

అలా కాని పక్షములోనే, మన విశ్వాసము తోట్రుపాటు పడినదై, బలమైన పరిస్థితి ఎదుర్కొనే సమయములో పడిపోయేవారముగా అయిపోతాము.

యేసుప్రభువు కూడా అదే నియమమును పాటించాడు. ఎలా చెప్పగలము?

అందుకు యేసు–నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను;౹ అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి–తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృత జ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.౹ -యోహాను 11:40-41

మార్త, యేసుప్రభువు లాజరు రోగిగా ఉన్నపుడు వచ్చి ఉంటే, తాను స్వస్థపరచబడేవాడు అని విశ్వాసముంచింది. అయితే యేసుప్రభువు, లాజరు రోగిగా ఉన్నపుడు తన మనవి ఆలకించే దేవుడు, ఈ మరణకరమైన పరిస్థితిలో కూడా మనవి ఆలకిస్తాడు అనే విశ్వాసము కనపరచాడు.

యేసు పునాది బలము గా ఉండటానికి కారణము దేవుని వాక్యముపై ఆధారపడి ఉండటమే!

కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను– తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును.౹ -యోహాను 5:19

అనగా తండ్రి ఏ మాటలు చెప్పారో, ఆ మాటలపైనే తన జీవితము ఆధారపడి ఉంది. ఈ పునాది బలముగా లేకుండా దేవుని కొరకు బలమైన కార్యములు చేయాలి అంటే అది జరగని పని.

ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి. -మత్తయి 16:5

రొట్టెలు లేని ఆ సందర్భమును, ఒక మరణకరమైన లేమి స్థితితో మనము పోల్చుకోవచ్చు.

యేసు అది యెరిగి–అల్పవిశ్వాసులారా మనయొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకను గ్రహింపలేదా? అయిదు రొట్టెలు అయిదువేలమందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్లు ఎత్తితిరో అదియైనను ఏడు రొట్టెలు నాలుగు వేలమందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్లు ఎత్తితిరో అదియైనను మీకు జ్ఞాపకము లేదా? -మత్తయి 16:8-10

ఇక్కడ తన శిష్యులకు తాను జరిగించిన అద్భుతములను జ్ఞాపకము చేసి ముఖ్యమైన విశ్వాసము గూర్చిన నియమమును జ్ఞాపకము చేస్తున్నాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు, అయితే యేసుప్రభువైతే, విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించువాడు అయిన వాడుగా ఉన్నాడు.

విశ్వాసము లేకుండా జీవమును చూడలేము అని చెప్పగలము. సందర్భము ఏమైనా సరే విశ్వాసము జీవము కలిగిస్తుంది. అందుకే నీతిమంతుడు విశ్వాసము ద్వారా జీవించగలుగుతాడు.

పరిస్థితులు ఒక్కోసారి మరణపు అంచులవరకు వెళ్ళి వచ్చే పరిస్థితులు వస్తాయి గానీ, దేవుని యందలి విశ్వాసము మనలను జీవమువైపు లాగుతుంది.

మరియు అపరాధము విస్తరించునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసికొని యేలాగు ఏలెనో, ఆలాగే నిత్యజీవము కలుగుటకై, నీతిద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలునిమిత్తము పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. -రోమా 5:20

మరణమునకు బలముంది కాబట్టే, అది మనలను లాక్కువెళుతుంది. అయితే మన విశ్వాసము మరణముకంటే బలమైన అపరిమితమైన కృప చేత మనలను జీవము వైపు లాగుతుంది.

మనము దేవునిని నమ్మినవారము, అంగీకరించినవారము, దేవుని కుమారులము గా ఉన్నవారము. మన కళ్ళముందు మరణము కనబడినా సరే, మనము దిగులుపడకుండా విశ్వాసముతో నిలబడినపుడు, ఖచ్చితముగా జీవమువైపు నడిపించబడతాము.

మరణముయొక్క బంధకములనుండి విడిపించే బలము విశ్వాసము ద్వారా కలుగుతుంది. అబ్రహాము కూడా తన పరిస్థితిలో తన దేవుడు చనిపోయినదానిని సహితము జీవింపచేయగలిగిన శక్తిమంతుడైన దేవుని పై విశ్వాసముంచిన వాడై బలము పొందుకున్నారు.

ఇటువంటి విశ్వాసము మనము కనపరచాలి అంటే, దేవుని మాటలు ఎరిగి మనము జీవించాలి. అటువంటి విశ్వాసము కనపరచగలిగితే, మన జీవితము ద్వారా దేవునికి మహిమ రావాలి.

మనము దుఃఖములో ఉండే ప్రతీ పరిస్థితి మరణకరమైనదే, అటువంటి పరిస్థితిలో మన విశ్వాసము జీవముగల సంతోషకరమైన పరిస్థితిగా ఆ పరిస్థితిని మారుస్తుంది.