స్తోత్ర గీతము 1
నా ప్రాణమా సన్నుతించుమా
యెహోవా నామమును
పరిశుద్ధ నామమును
అంతరంగ సమస్తమా
సన్నుతించుమా
||నా ప్రాణమా||
ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమా
దోషములన్నియు క్షమియించెను ప్రాణ విమోచకుడు
దీర్ఘ శాంత దేవుడు
నిత్యము కోపించడు
||నా ప్రాణమా||
మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు
నీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును
దాక్షిణ్యపూర్ణుడు
నిత్యము తోడుండును
||నా ప్రాణమా||
స్తోత్ర గీతము 2
పాపాన్ని పోగొట్టి శాపాన్ని
తొలగించా భూలోకం వచ్చావయ్యా
మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువను మోసావయ్య
కన్నీటిని తుడిచావయ్యా సంతోషం ఇచ్చావయ్య
మనుషులను చేసావయా నీ రూపాన్ని ఇచ్చావయ్యా
నా సర్వం యేసయ్య నా జీవం యేసయ్య
నా ప్రాణం యేసయ్య నా ధ్యానం యేసయ్య
బంగారం కోరలేదు వెండియు కోరలేదు హృదయాన్ని కోరావయ్య
ఆస్తియు అడగలేదు అంతస్థులడగలేదు హృదయాన్ని అడిగావయ్య
నేవెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా
నా సర్వం యేసయ్య నా జీవం యేసయ్య
నా ప్రాణం యేసయ్య నా ధ్యానం యేసయ్య
తల్లి నన్ను మరచిన తండ్రి నన్ను మరచిన యేసయ్య మరువడయ్యా
బంధువులు విడిచిన స్నేహితులు విడచిన యేసయ్య విడువడయ్య
చేయిపట్టి నడుపునయ్య శిఖరముపై నిలుపునయ్య
నా సర్వం యేసయ్య నా జీవం యేసయ్య
నా ప్రాణం యేసయ్య నా ధ్యానం యేసయ్య
స్తోత్ర గీతము 3
కీర్తి హల్లెలూయా
గానం యేసు నామం మధురమిదే
నిత్యం స్తోత్రము ఈ ఘనునికే (2)
స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం
స్తుతి స్తుతి ఉజ్జీవనామం ఈ గానము శ్రీ యేసుకే
స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం
స్తుతి స్తుతి ఉజ్జీవనామం ఈ స్తోత్రము మాక్రీస్తుకే
ప్రయాసే లేదుగా – యేసే తోడుగా
మాతో నడువగా – భయమే లేదుగా
||స్తుతి||
క్రీస్తుని వేడగా – మార్గం తానేగా
సత్యం రూఢిగా – జీవం నీయగా
||స్తుతి||
ఆరాధన వర్తమానము
మన దేవుదు మంచి దేవుడు. వాక్యము లోని సత్యము గ్రహిస్తే, మన దేవుడు అన్యాయము చేయుట అసంభవము. అసంభవము అంటే అస్సలు కలుగదు. అన్యాయము జరుగుట అనే సందర్భమే కలుగదు. అంత మంచి దేవుడు మన దేవుడు.
అటువంటి దేవుని సన్నిధిలో ఉన్న మనము ఆయనను మహిమపరచాలి. ఎందుకు ఆయనను మహిమ పరచాలి? మన వ్యక్తిగతమైన జీవితాలు కొనసాగించబడుతున్నాయి అంటే దానికి కారణము మన దేవుని కృప, కనికరము మాత్రమే.
ఒక్కోసారి మన పరిస్థితిలో దేవుడు ఏమిచేసాడు అని ఆయనను మహిమపరచాలి అనే ఆలోచన వస్తుంది. అయితే అటువంటి సందర్భములలో మన విశ్వాసమును మనము కాపాడుకోవాలి. మన కళ్ళ ముందు కొంచెం వ్యతిరేకముగా ఉన్నప్పటికీ దేవుడు అన్యాయస్తుడు కాదు.
మనము అన్నీ బాగా జరిగినప్పుడే మనము సంతోషముగా ఆనందముగా ఉంటాము. అయితే వ్యతిరేకమైన పరిస్థితి ఎదురైనప్పుడు మనము డీలా పడిపోతాము. అయితే ఆ పరిస్థితులలో మనము కొనసాగించబడుతున్నాము అంటేనే దేవుని కృప అని మనము అర్థము చేసుకోవాలి.
ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు.౹ -యోహాను 15:5
ద్రాక్షావల్లికి తీగెలు అనుసంధానించబడి ఉన్నాయి కాబట్టే అవి ఫలిస్తాయి. అలాగే అవి వల్లికి అంటుకునే ఉన్నాయి కాబట్టి వెంటనే ఫలించదు కానీ, క్రమక్రమముగా ఎదుగుతూ ఉన్న సమయములో ఫలము ఫలిస్తుంది.
మనము యేసయ్యను అంటుకుని మనము జీవించినప్పుడు వెంటనే ఫలము కనబడదుగాని, మనము ఫలించుటకే ఆయనకు అనుసంధానించబడి కొనసాగించబడుతున్నాము. అనగా మనము ఫలించుట తథ్యము.
ఆయన మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టే, మనము ఫలించులాగున ఆయన జీవము తీగెలైన మనకు అనుగ్రహిస్తున్నాడు. ద్రాక్షావల్లి ఉపమానములో, వల్లిలోని జీవము తీగెలలోనికి వెళ్ళినతరువాత కాలము పరిపూర్ణమైన తరువాత ఫలము ఫలించినపుడు, దానిని చూసినవారు చెట్టును పొగుడుతారు.
అలాగే మనము యేసయ్యకు తీగెలుగా ఉండి, ఆయన ప్రేమను బట్టి అనుగ్రహించబడిన జీవముచేత ఫలించినప్పుడు, ఆ ఫలమును బట్టి యేసయ్యకు మహిమ రావాలి, వస్తుంది.
ఒక తీగెకు త్వరగా ఫలము రావచ్చు, మరొక తీగెకు ఆలస్యముగా ఫలము రావచ్చు. అయితే ఖచ్చితముగా నిజమైన ద్రాక్షవల్లికి అనుసంధానించబడిన ప్రతి తీగె ఫలిస్తుంది.
అలాగే యేసయ్యతో అనుసంధానించబడిన ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడతారు. మన జీవితాలు కొనసాగించబడటానికి కారణమే ఆయన. ఒక చెట్టును గమనిస్తే, దానికి అనేకమైన కొమ్మలు ఉన్నాయి. దానిలో కొన్ని కొమ్మలు ఫలించి ఉన్నాయి, మరొక కొమ్మ ఫలించలేదు.
ఆ ఫలములను చూసిన వారు ఆ ఫలమును తీసుకోవడానికి రాయితో కొట్టినప్పుడు ఫలము లేని మరొక కొమ్మకు తగిలినప్పుడు దానికి గాయము అవుతుంది. అయితే అది చెట్టుకు అంటిపెట్టుకొనే ఉంది కాబట్టి ఆ గాయము మానుతుంది, ఫలము కూడా ఫలిస్తుంది. నిజానికి ఆ గాయము ఈ కొమ్మకు అవ్వకూడదు గానీ, అనుకోని రీతిలో ఆ గాయము కలిగింది.
మన జీవితములో కూడా అంతే, ఒక్కోసారి అనుకోని విధానములో మనము గాయపరచబడతాము. అపవాది మన మీద దాడి చేసినప్పటికీ మనలోని జీవము పోదు.
అలాగే యజమానుడు ఫలము అనుభవించడానికి చెట్టును కానీ, కొమ్మను గాని గాయపరచడు గానీ, దొంగతనముగా ఫలమును లాక్కోవాలి అనుకొనేవాడు రాయితో కొట్టి గాయపరుస్తాడు. అయినప్పటికీ ఫలమంతా నష్టపరచబడదు.
గనుక ఈ రోజు నీవు ఫలించలేనప్పటికీ, ఆశీర్వాదము చూడనప్పటికీ నిరాశపడి ఆరాధించక మౌనముగా ఉండకూడదు. మీరు నిజమైన ద్రాక్షావల్లి అయిన యేసయ్యను అంటిపెట్టుకొనే ఉన్నారు గనుక మీరు ఫలించుట నిశ్చయము. గనుక ఆరాధించక మౌనముగా ఉండకూడదు.
అందుకే మన దేవుడు అన్యాయము చేయుట అసంభవము. అలాగే మన దేవుని అంటిపెట్టుకుని ఉన్న మన జీవితములో అన్యాయము జరుగుట అసంభవము.
నీతిమంతునికి ఒక ద్వారము మూయబడితే, ఏడు ద్వారములు తెరువబడతాయి, ఏడు అంటే సంపూర్ణము.
ద్రాక్షావల్లిని ఆయన అయి ఉన్నాడు, తీగెలు మనమై ఉన్నాము. మన జీవితము కొనసాగించబడుతుండగా, ఆయన జీవము కూడా మనతో పాటు కొనసాగించబడుతుంది. ఆ జీవము స్థిరపరచబడటానికి కూడా ఒక సమయము ఉంది.
మన జీవితములు కొనసాగించబడటానికి కారణము మనలను ప్రేమిస్తున్నాడు. అలాగే ఈరోజు మనము కూడా ఆయనను ప్రేమిస్తున్నాము అనేదానికి మన ఆరాధనే నిదర్శనము.
మనలో ఉన్నవాడు సృష్టికర్త, పరిశుద్ధుడు అయిన దేవుడు. ఒక్కోసారి మన జీవితములు మనకే అసహ్యముగా ఉంటాయి. అయితే మన తండ్రి మనలో నివాసముండటానికి ఇష్టపడుతున్నాడు.
పాపములో ఉన్నవాడు ఎవ్వడూ నన్ను చూడట్లేదు అనే ఆలోచన కలిగి ఉంటాడు. అసలు ఆ ఆలోచన వచ్చింది అంటేనే మనము పాపములో పడినట్లే. నిజానికి తండ్రి అయిన దేవుడు ప్రతి సమయములో నిన్ను చూస్తున్నాడు. నీలో నివాసము ఉండాలి అనే ఆశ కలిగి చూస్తున్నాడు.
ఈ లోకములో మన కోరికలు తీరినప్పుడు చాలా ఆనందముగా ఉంటాము. మరి దేవుని కలిగి ఉన్నప్పుడు ఇంకెంత ఆనందముగా ఉంటాము? ఇది అనుభవించినపుడే తెలుసుకొనగలము.
పౌలు సీలలను అన్యాయముగా కొట్టినప్పుడు ఎంతో బాధ అయినా సరే వారు రక్షణానందమును అనుభవించినవారుగా ఆ పరిస్థితిలో దేవుని పాటలతో మహిమ పరిచారు.
అలాగే ఇహలోకములో పిల్లలకు తండ్రి ప్రేమించి బహుమానములు ఇచ్చినప్పుడు ఆ పిల్లలు వెంటనే ఎంతో సంతోషముతో వారి ప్రేమనుకూడా తిరిగి చూపిస్తారు. అలాగే మనము కూడా మన దేవుని పై మనకున్న ప్రేమను ఆరాధన ద్వారా వ్యక్తపరుద్దాము.
ఆరాధన గీతము
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా
నా పాపము బాప నరరూపివైనావు
నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే
నా స్థానములో నీవే (2)
నీ రూపము నాలో నిర్మించియున్నావు
నీ పోలికలోనే నివసించుమన్నావు
నీవు నన్ను ఎన్నుకొంటివి
నీ కొరకై నీ కృపలో (2)
నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు
నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు
నన్ను నీలో చూచుకున్నావు
నను దాచియున్నావు (2)
నీ సన్నిధి నాలో నా సర్వము నీలో
నీ సంపద నాలో నా సర్వస్వము నీలో
నీవు నేను ఏకమగువరకు
నన్ను విడువనంటివే (2)
నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే
నా మనుగడ ముందే నీ గ్రంథములోనుండే
ఏమి అద్భుత ప్రేమ సంకల్పం
నేనేమి చెల్లింతున్ (2)
వారము కొరకైన వాక్యము
దేవుని యొక్క ప్రేమ నీపై నిలిచినంత కాలము నీవు దేనికీ భయపడనవసరము లేదు. ఆయన ప్రేమ మారనిది. ఇహలోకములో ఉన్న ప్రేమకు, దేవుని ప్రేమకు తేడా ఏమిటి అంటే, ఇహలోకములో ఉన్న ప్రేమ పరిస్థితి బట్టి మారిపోతుంది. అయితే దేవుని ప్రేమ మారనిది.
మనము పాపిగా ఉన్నపుడు ఆయన తన ప్రేమను ప్రాణము పెట్టుట ద్వారా కనపరచారు. అలాగే మనము పరిశుద్ధులుగా చేయబడిన తరువాత ఆయన ప్రేమను బట్టి తన శక్తిని మనలో కనపరుస్తున్నారు.
భూలోకములో ఉన్న ప్రతీదీ ఆయన ప్రేమను బట్టియే సృష్టించబడ్డాయి. దేవుడు మొదట సమస్త సృష్టిని ముగించిన తరువాత ఆదామును సృష్టించాడు. కొంచెము జాగ్రత్తగా ఆలోచిస్తే, ఆదాముకు అవసరమైన సమస్తము ముందుగా దేవుడు సృష్టించాడు. ఇది దేవుని ప్రేమకు ఉదాహరణ. అందుకే దేవుని ప్రేమను ఎప్పుడూ మనము జ్ఞాపకము చేసుకోవాలి.
మన మినిస్ట్రీ పేరే “జీసర్ కేర్స్ యూ”, ఆయన కేర్, ప్రేమను కనుపరచడానికే ఈ మినిస్ట్రీని ఏర్పాటు చేసుకున్నారు. మన దేవుడు మనలను ప్రేమిస్తూనే ఉంటారు, ఆ ప్రేమలో బలము ఉంది.
ఈరోజు మనము “యెహోవాను బట్టి సంతోషించుడి” అనే విషయము గూర్చి తెలుసుకుందాము. సంతోషించండి అంటున్నారు అంటేనే మన జీవితములో దుఃఖకరమైన పరిస్థితి ఏదో ఉంది అని అర్థము చేసుకోవచ్చు.
మన జీవితములలో ఏదైనా జరిగితేనే సంతోషముగా ఉంటాము. అయితే వాక్యము చెప్తున్న విషయము, జరగకుండానే మనము సంతోషము వ్యక్తపరచాలి. మనము సూపర్నేచురల్.
మనము పరిస్థితులను చూసి డీలపడిపోయేవారిగా ఉంటాము. పేతురు నీళ్ళ మీద నడిచినప్పుడు, యేసయ్యను చూసినంతసేపు చక్కగా నడిచాడు. ఎప్పుడైతే పక్కన ఉన్న పరిస్థితిని చూసాడో, ములిగిపోసాగాడు.
మనము కూడా మన పరిస్థితిలో చుట్టో జరుగుతున్న వాటిని చూస్తే, మనము భయపడి, నీరుగారి పోతాము. అయితే అప్పుడు కూడా మనము దేవునివైపే చూస్తూ విశ్వాసముతో నిలబడితే, మనము ఖచ్చితముగా సూపర్నేచురల్ కార్యములు చూస్తాము.
ఏలియా నిర్ణయించుకున్నట్టు మనము కూడా నిర్ణయించుకోవాలి. యెహోవా వైపు ఉంటావా? లోకములో వైపు ఉంటావా?
నీతిమంతులారా, యెహోవానుబట్టి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థహృదయులారా, మీరందరు ఆనందగానము చేయుడి. -కీర్తనలు 32:11
దేవుని అంగీకరించినవారికి, దేవుని బిడ్డలైన మనకు ఈ మాట చెప్పబడింది.
ఒక దైవజనుడు తన పరిస్థితి వ్యతిరేకముగా ఉన్నప్పుడు తన గదిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో సంతోషముతో నాట్యమాడేవాడిగా ఉన్నారు అని తన సాక్ష్యము చెప్పారు.
ఆత్మీయముగా మనము చిన్న బిడ్డలుగా ఉన్నపుడు కష్టము కలిగినపుడు దేవుని సన్నిధిలో ఏడ్చి మొరపెట్టేవారము. అయితే వాక్యములో ఎదిగినపుడు మన తండ్రి ఏమి అయి ఉన్నాడో, ఏమి చెయ్యగలడో ఎరిగినవారై సంతోషముతో నిలబడేవారిగా ఉండాలి.
మనము దుఃఖకరమైన పరిస్థితిలో ఉన్నపుడు, మన నోటివెంట దేవునికి వ్యతిరేకమైన మాటలు సాధారణముగా వచ్చేస్తాయి. అయితే ఆత్మీయముగా ఎదుగుతున్న మనము మన నోటివెంట వ్యతిరేకమైన మాట ఒక్కటైనా రాకుండా జాగ్రత్తపడాలి
మనకు వ్యతిరేకముగా పరిస్థితి ఉన్నపుడు, కఠినముగా ఉన్నపుడు మనము విశ్వాసము కనపరచాలి. అబ్రహాము తన జీవితములో వ్యతిరేకమైన ఆలోచనలు వచ్చినప్పుడు దానికి లోబడక, తనను బలపరచే దేవుని బట్టే బలము పొందుకుని నిలబడ్డాడు.
అలాగే మనకు ఆలోచన కలిగిన వెంటనే అమలుపరచకుండా, అసలు అది ప్రభువుకు మహిమకరమైనదా కాదా అని కొన్ని నిమిషములు జాగ్రత్తగా గమనించడము అలవాటు చేసుకోవాలి.
మన యొక్క ముఖ్యమైన లోపము, వాక్యము వినేవారముగా ఉంటాము గానీ, ఆ విన్న దానిని అమలుపరచడములో విఫలమవుతాము. అయితే ఇకనుండి సరిచేసుకుందాము.
యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. -కీర్తనలు 37:4
ఒక దుఃఖకరమైన పరిస్థితిలో మన హృదయవాంఛ ఎలా ఉంటుంది? ఇది జరిగితే బాగుండు అనేది మన ఆలోచన. అయితే అనేకసార్లు ఇటువంటి సందర్భములలో అదే దుఃఖములో నిండిపోయి అసలు దేవుని గురించే ఆలోచించరు. అయితే “యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును” ఇది ఒక మర్మము.
యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక ద్వీపములన్నియు సంతోషించునుగాక. -కీర్తనలు 97:1
యెహోవా మనలో ఉండి రాజ్యము చేయాలి అనుకుంటున్నాడు. మన జీవితములో ఉండి, మన జీవితములో సమస్తమును పరిపాలించాలి అనే ఆశ కలిగి ఉన్నాడు. మన జీవితములో దుఃఖపరిస్థితిలో కన్నీరు కార్చక, నీవు కలిగిన దేవునిని బట్టి సంతోషము కలిగి యదార్థముగా ఉంటే, ఖచ్చితముగా ఆ దుఃఖపరిస్థితి మార్చబడుట కొరకు ఆజ్ఞలు జారీ చేస్తాడు.
ద్వీపము నిజానికి భూమిపైనే ఉంది, కానీ చుట్టూ సముద్రము ఉంది. యెహోవా రాజ్యము చేసినపుడు భూలోకము ఆనందించును అలాగే ద్వీపములు కూడా సముద్రముచేత చుట్టబడినప్పటికీ సంతోషించును.
అనగా మనమున్న దుఃఖపరిస్థితిలో ఎటుచూసినా నష్టమే కానీ, ఒక్క అవకాశము కూడా లేని పరిస్థితిని ద్వీపము సూచిస్తుంది. అటువంటి పరిస్థితిలో మన దేవుడు సంతోషింపచేస్తాడు అంటే, ఆ దుఃఖపరిస్థితి మార్చబడటానికి ఏమి అవసరమో అది జరిగిస్తాడు అని అర్థము. ఇదే యెహోవా రాజ్యము చేయుట!
యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు నిన్నుగూర్చి ఉల్లసింతురు. -కీర్తనలు 5:12
యెహోవా మాత్రమే ఆశీర్వదించువాడు అనే సత్యము ఎరిగినవాడు ధన్యుడు. అటువంటి వాడు తన పరిస్థితిలో ఆయన దయను పొందుకొనేవాడిగా ఉంటాడు. ఎందుకంటే ఆయనలోనుండి ఆశీర్వాదము బయలుదేరుతుంది.
కేడెముతో కప్పబడుట అనగా యుద్ధ పరిస్థితిలో ఉన్నాము అని అర్థము. అటువంటి పరిస్థితిలో ఆయన తన దయచేత కప్పి రక్షించువాడిగా ఉన్నాడు. ఈ దయను పొందుకున్నవారు ఆయనను బట్టి సంతోషించేవారుగా ఉంటారు.
యెహోవా నాకు వెలుగును రక్షణయునైయున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? -కీర్తనలు 27:1
ఈ మాటలు మనము అస్సలు మర్చిపోకూడదు. వాక్యము ఎక్కడ ఉంటే అక్కడ జీవము. ఆ వాక్యము నీలో ఉంది అంటే, నీలో జీవము ప్రత్యక్షపరచబడవలసినదే.
వెలుగు యొక్క శక్తి చీకటిని పారద్రోలుట. యెహోవా వెలుగై ఉన్నాడు అంటే ఆ వెలుగును బట్టి నీ జీవితములో ఉన్న చీకటి స్థితిని మార్చగల శక్తి ఆయనలో ఉంది. అసలు మన దేవుడు మార్చలేనిది ఏమి లేదు. అయితే ఇది నీ జీవితములో అనుభవించాలి అంటే, నీవు నీతిమంతునిగా జీవించాలి. పాపములో జీవిస్తూ దేవుని శక్తి అనుభవించాలి అంటే కుదరని పని.
పాపానికి మూలకారణము మన చూపే! అందుకే మనము వాక్యము ప్రకారము మన జీవితము కట్టుకోవాలి. ఆదాము హవ్వలు పాపము చేసినప్పుడు, అంతవరకు ఉన్న సూపర్నేచురల్ కళ్ళు, లోకానుసారముగా మారిపోయాయి.
ఇప్పుడున్న పరిస్థితిలో మొబైల్ ఎంతో వ్యసనముగా మారిపోయింది. మనము చూడాలి అనుకోకపోయినా సరే అనుకోకుండా మన కళ్ళముందు వచ్చినపుడు దానిని చూసామా, అపుడే మన పతనము ప్రారంభమవుతుంది. మొదట చిన్నగానే ఉన్నప్పటికీ చివరికి ఎందుకూ పనికిరాని స్థితిలోనికి మనలను తీసుకువెళుతుంది.
యెహోవాను కల్గినవారు ధన్యులు. అనగా సంతోషముగా జీవిస్తారు. మనలను కోల్పోవడానికి మన దేవుడు ఇష్టపడట్లేదు. నీతిమంతులుగా మనము ముద్రించబడ్డాము. ఆ ముద్రను బట్టే అనేకమైన ఆశీర్వాదములు మనకు సిద్ధపరచబడ్డాయి.
మన తండ్రి మన జీవిత కాలమంతా, మనము సంతోషముగా ఉండటానికి అవసరమైన సమస్తము సంపాదించి సమకూర్చి ఉంచినపుడు, ఒకేసారి అన్నీ ఇవ్వబడవు. కానీ, ఏ సమయమునకు ఏది అవసరమో అది అనుగ్రహిస్తాడు.
యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు వివాహము కొరకు సిద్ధపరచాడు. ఆ తరువాత పిల్లలను సిద్ధపరిచాడు అలా జీవితమంతా అనేకమైన విషయాలకొరకు దేవుడు సిధ్దపరచాడు. అవన్నీ అనుభవించి దేవునిని మహిమపరచేవారిగా మనము ఉండాలి. నీతిమంతునిగా మనము జీవిస్తే ఇది అనుభవించగలుగుతాము.