స్తోత్ర గీతము 1
నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము
నేనూహించలేను యేసయ్య …… “2”
యేసయ్య నీకృప నాకు చాలయ్య
నీ కృపలేనిదే నేనుండలేనయ్యా
యేసయ్య! నీకృప నాకు చాలయ్య
నీకృప లేనిదే నే బ్రతుకలేనయ్యా
మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి
మార్గముగా మారి మనిషిగా మార్చావు
మహినే నీవు మాధుర్యముగ మార్చి
మాదిరి చూపి మరు రూపమిచ్చావు
మహిమలో నేను మహిమను పొంద
మహిమగా మార్చింది – నీ కృప “2”
“యేసయ్య”
ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి
ఆపత్కాలమున ఆదుకున్నావు
ఆత్మీయులతో ఆనందింప చేసి
ఆనంద తైలముతో అభిషేకించావు
నా … ఆశ తీర ఆరాధన చేసె
అదృష్టమిచ్చింది – నీ కృప “2”
“యేసయ్య”
స్తోత్ర గీతము 2
ప్రభు ఆత్మ నాలో నిండిపొర్లినప్పుడు
దావీదువలె నేను నాట్యమాడెదన్
నాట్యమాడెదన్ నేను నాట్యమాడెదన్ నేను
దావీదువలె నేను నాట్యమాడెదన్
ప్రభు ఆత్మ నాలో నిండిపొర్లినప్పుడు
దావీదువలె నేను పాటపాడెదన్
పాటపాడెదన్ నేను పాటపాడెదన్ నేను
దావీదువలె నేను పాటపాడెదన్
ప్రభు ఆత్మ నాలో నిండిపొర్లినప్పుడు
దావీదువలె నేను స్తుతించెదను
స్తుతించెదన్ నేను స్తుతించెదన్ నేను
దావీదువలె నేను స్తుతించెదను
స్తోత్ర గీతము 3
చాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడు
నేను నమ్మిన నా యేసుడు
చాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడు
నాకు దొరికిన నా యేసుడు
మాటలలో చెప్పలేనంత
చేతలలో చూపలేనంత
చాలా చాలా చాలా చాలా – చాలా గొప్పోడు
చాలా చాలా చాలా చాలా – చాలా మంచోడు
||చాలా||
నా పాప శిక్షను తాను మోసెను
నా కొరకు కలువారిలో త్యాగమాయెను
తన ప్రేమ వర్ణనాతీతం
తన జాలి వర్ణనాతీతం
||మాటలలో||
యేసయ్యకు సాటి ఎవ్వరు లేరు
జగమంతా వెదకినా కానరారులే
తన ప్రేమ వర్ణనాతీతం
తన జాలి వర్ణనాతీతం
||మాటలలో||
ఈలాంటి ప్రేమ ఎక్కడ లేదు
వింతైన ప్రేమ అంతు చిక్కదు
కలువరిలో చూపిన ప్రేమ
శాపమునే బాపిన ప్రేమ
||మాటలలో||
ఆరాధన వర్తమానము
ఈ దినము ప్రభువును మహిమపరిచే దినము, ఘనపరిచే దినము. ఈ దినమును ప్రాముఖ్యముగా ఎంచుకొనేవారి జీవితములలో దేవుని శక్తి వెల్లడిపరచబడుతుంది. ఈ దినము గురించి ఆసక్తి కలిగి ఉంటారో వారి జీవితములలో, దేవుని మహిమ ఆయన శక్తి మరియు ఆయన కృప అపరిమితముగా వెల్లడి పరచబడుతుంది.
మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలువ బడి, తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రగ్రంథమును చదువుచు వచ్చిరి, ఒక జాముసేపు తమ పాపములను ఒప్పు కొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచు వచ్చిరి.౹ -నెహెమ్యా 9:3
మన వ్యక్తిగతమైన జీవితములలో కొంచెము ఎక్కువసేపు ఆరాధన చేస్తే చాల కష్టముగా ఉంటారు. ఒక జాము అంటే సుమారు మూడు గంటలు. నెహెమ్యాలో మనము చూసిన బిడ్డలు 3 గంటలు వాక్యము చదువుతున్నారు, 3 గంటలు ప్రార్థనలో ఉన్నారు. అనగా దేవుని సన్నిధిలో 6 గంటల సేపు ఉన్నారు.
లేవీయులలో యేషూవ బానీ కద్మీయేలు షెబన్యా బున్నీ షేరేబ్యా బానీ కెనానీ అనువారు మెట్లమీద నిలువబడి, యెలుగెత్తి, తమ దేవుడైన యెహోవాకు మొఱ్ఱపెట్టిరి.౹ -నెహెమ్యా 9:4
అప్పుడు లేవీయులైన యేషూవ కద్మీయేలు బానీ హషబ్నెయా షేరేబ్యా హోదీయా షెబన్యా పెతహయా అనువారు–నిలువబడి, నిరంతరము మీకు దేవుడైయున్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఈలాగు స్తోత్రము చేసిరి–సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక.౹ -నెహెమ్యా 9:5
నిరంతరము మనకు దేవుడైయున్న యెహోవా అనేది ఎంతో సత్యమైన శ్రేష్టమైన అనుభవము. సమయమును బట్టి పరిస్థితులను బట్టి మనుష్యులు మారతారు గానీ, ఆయన మాత్రము మనకు దేవుడుగానే ఉన్నాడు. దేవునికే స్తోత్రము కలుగును గాక!
నీవే, అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండునది అంతటిని, సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటినన్నిటిని కాపాడువాడవు. ఆకాశసైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది.౹ -నెహెమ్యా 9:6
మనము కలిగి ఉన్న దానికంటే ఆయన నామము ఘనమైనదిగా ఉన్నది. మన ఆశీర్వాదమునకు కారకుడే ఆయన అయి ఉన్నాడు. అందుకే మనము కలిగినదానిని బట్టి కాదుగాని, దానిని ఇచ్చిన దేవునిని మాత్రమే ఘనపరచే వారిగా ఉండాలి. ఆయన మన జీవితములో అవసరమైన వనరులుగానీ, సొల్యూషన్స్ గానీ అన్నీ ఆయన కృపను బట్టే కలుగుచున్నవి.
మన దేవుడు నిరంతరము మనతో ఉంటున్నాడు. మనతో ఉన్న ఆయన మనకు ఆశీర్వాదములను అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. అంతేకాక, మనలను కాపాడువాడిగాను మనతో ఉంటున్నాడు. అటువంటి దేవునిని మనము ఆరాధించడానికి కూడుకున్నాము అని గ్రహించాలి.
భూమిని దానిలోని సమస్తమును సృజించినవాడు ఆయనే, వాటిని కాపాడువాడు కూడా ఆయనే. మనలను సృజించినవాడు కాపాడువాడు ఆయనే. ఆయన అనుగ్రహించిన ఆశీర్వాదమును కాపాడువాడు వాడే. అపవాది మన ఆశీర్వాదమును దొంగిలిణ్చడానికి అనేక ప్రయత్నములను చేసినప్పటికీ, వాటిని ఏ మాత్రము సాగనివ్వక కాపాడువాడు మన దేవుడు.
అందుకే ఈ దినము ఎంతో శ్రేష్టకరమైన దినము. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదమును జ్ఞాపకముచేసుకొనే దినము. ఆయన గొప్పతనము, కాపాడబడుతున్న అనుభవమును జ్ఞాపకము చేసుకుని ఆయనను ఆరాధించే సమయము.
మనము దేవుని సన్నిధిలో కూడుకోవటము కూడా దేవుని కృపయే! ఈ దినము ఆయనను ఆరాధించడానికి సమయమును కలుగచేసింది ఆయన కృపయే.
దేవుని స్తుతించుట మంచిది అని లేఖనములు చెప్పుచున్నవి అంటే ఆ స్తుతి వెనుక అనేకమైన ఆశీర్వాదములు దాచబడి ఉంటాయి. మన దేవుడు మంచి దేవుడు. దేవునియందు విశ్వాసముంచు ప్రతివారి జీవితములో సంతోషమే!
మనము దేవుని ఆరాధించుట ద్వారా దేవుని శక్తి బయలుదేరుతుంది. వాక్యములో మనము అనేక సార్లు ఈ అనుభవము మన పితరుల జీవితములో నిరూపించబడింది.
స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమ పరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. -కీర్తనలు 50:23
స్తుతియాగము అర్పించినపుడు రక్షణ కొరకైన మార్గము సిద్ధపరచబడుతుంది అంటే, ఎలా? మనము స్తుతి అర్పిస్తున్నప్పుడు మనము పలికే మాట ద్వారా మహిమ పైకి వెళుతుంది. ఆ పరలోకమునుండి క్రిందికి నీవు పలికిన మాటలను నెరవేర్చడానికి దేవుని శక్తి విడుదల అవుతుంది. అందుకే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదమును మనము పోగొట్టుకొనము – ఆమేన్!
మనకొరకు సృష్టించడమే కాక, దానిని అనుభవించుటకు అవకాశము కూడా మనకు కలుగచేసినవాడుగా మన దేవుడు ఉన్నాడు.ఒకవేళ నీ పరిస్థితులు కష్టముగా ఉంటే, దేవుని ఆశీర్వాదమును అనుభవించకుండా అడ్డుగా ఉంటే, ఈరోజు చేసే ఆరాధన మార్గమును సిద్ధపరుస్తుంది.
యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించు చున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించు వాడు నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు నేను ఆశ్రయించియున్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొఱ్ఱపెట్టగా ఆయన నా శత్రువులచేతిలోనుండి నన్ను రక్షిం చును. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లువలె నామీదపడి బెదరింపగను పాతాళపు పాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరింపగను నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని నా దేవునికి ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన నంగీకరించెను నా మొఱ్ఱ ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. -కీర్తనలు 18:1-6
వరద వంటి భక్తిహీనుల మాటలచేత, మరణపు పరిస్థితులు, పాతాళపు పాశములవంటి పరిస్థితులు చుట్టుముట్టినప్పుడు చెప్పగలగే నిజమైన విశ్వాసపు మాట – “యెహోవా నా బలమా…నా శైలము, నా కోట, నన్ను రక్షించు వాడవు నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము.. “
ఆరాధన గీతము
ఆధారం నీవేనయ్యా
కాలం మారినా కష్టాలు తీరినా
కారణం నీవేనయ్యా
||ఆధారం||
నీ దీప స్థంభమై నేను
జీవించ చిరకాల ఆశ
నీ దరికి చేరి
నను నీకర్పించి
సాక్షిగా జీవింతును (నా దేవా)
||ఆధారం||
నీ రాయబారినై నేను
ధైర్యముగా జీవించ ఆశ
నిస్వార్థముగను
త్యాగముతోను
నిను నేను ప్రకటింతును (నా దేవా)
||ఆధారం||
వారము కొరకైన వాక్యము
మన దేవుడు మంచి దేవుడు. ఆయన మంచితనమును మనము వెతికినపుడు ఖచ్చితముగా కనుగొనగలము.
మనము అనుకున్నది జరగనపుడు ఆయన మీద కోపగించుకుంటాము గానీ, అయితే ఆయన మంచితనమును వెతికినపుడు అది మన మంచికే జరగలేదు అనే సత్యము తెలుసుకొనగలుగుతాము. దైవజనుని గృహము విషయములో లోన్ విషయములో కూడా అదే విధమైన అనుభవమును దయచేసారు. మంచి తండ్రి తన పిల్లలు దుఃఖపడటము చూడలేడు అనేది సత్యము.
ఈరోజు విశ్వాస జీవితము అనే విషయము గూర్చి తెలుసుకుందాము. మనకు ప్రతీ విషయములోను యేసయ్యే మాదిరి అయి ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏ మనస్సు కలిగి ఉన్నాడో, అదే మనస్సు మనము కలిగి ఉండాలి.
క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి.౹ -ఫిలిప్పీయులకు 2:5
అయితే యేసు ఎలా ఉన్నాడో చూద్దాము.
జీవముగల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును.౹ -యోహాను 6:57
నేను తండ్రి మూలముగా జీవించుచున్నాను అని యేసయ్య చెప్పుచున్నాడు. అనగా విశ్వాస జీవితము దేవుని ఆధారము చేసుకుని కొనసాగించబడే జీవితమే తప్ప, మనము కలిగి ఉన్నదానిని బట్టి కాదు!
మనము కూడా యేసయ్య ఏ మనస్సు కలిగి ఉన్నాడో, అదే మనస్సు కలిగి ఉండాలి. నాకు ఆధారం నా దేవుడే అనే మనసు మనము కలిగి ఉండాలి. ప్రతీ విషయములోను దేవుడినే ఆధారము చేసుకోవాలి.
ఏలయనగా నా అంతట నేనే మాటలాడలేదు; నేను ఏమనవలెనో యేమి మాటలాడవలెనో దానినిగూర్చి నన్ను పంపిన తండ్రియే నాకాజ్ఞ యిచ్చియున్నాడు.౹ -యోహాను 12:49
అనగా మన విశ్వాస జీవితము దేవుని మాటలచేత కొనసాగించబడే జీవితము అని అర్థము చేసుకోవాలి.
యేసయ్య ముందు 5000 మంది కూర్చున్నారు. అయితే అక్కడ వారికి తగినంత ఆహారము లేదు అయినప్పటికీ, ఆయన ఏమి చెయనై ఉన్నాడో ఎరిగి ఉండి ఫిలిప్పును అడిగెను అని వ్రాయబడింది.
మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక, దేవుని శక్తిని ఆధారము చేసికొని యుండవలెను – 1 కొరింథీ 2:4
అంటే మన ప్రతీ పరిస్థితిలో దేవుడు ఏ మాట పలికాడో, అదే మాట మనము కూడా పలకాలి. మనము మాటలాడకుండా మౌనముగా ఉండిపోయేలా అపవాది ప్రయత్నిస్తూనే ఉంటాడు. అయితే దేవుడు మన హృదయముతో మాట్లాడే ప్రతీ మాట తప్పక మనము పలకాలి.
కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను– తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును.౹ -యోహాను 5:19
యేసయ్య ఒక మంచి విశ్వాస సంబంధమైన జీవితమును జీవించాడు. ఆయన దేవుడు ఇచ్చిన మాటలనే మాటలాడుతున్నాడు. అంతే కాక, తన క్రియలు కూడా దేవుని సంబంధించినవే అయి ఉన్నాయి, తండ్రి చిత్తమును, ఉద్దేశ్యమును నెరవేర్చేవిగా ఉన్నాయి.
మనము మన కోరికలను తీర్చుకోవడానికి మనము అనేకమైన విధములుగా ప్రయత్నించి చేసేస్తాము. అదే దేవుని ఉద్దేశ్యమును నెరవేర్చేటప్పుడు వచ్చే కష్టములలో చతికిల పడిపోతాము. అదే మన ఉద్దేశ్యములైతే, కష్టమైనా ఎడో ఒక మార్గము కొరకు వెతికేవారముగా ఉంటాము. అయితే మనము మాత్రము దేవుని ఉద్దేశ్యము నెరవేర్చుటకు మాత్రమే మనస్సు కలిగినవారిగా ఉండాలి.
యిదిగో మీలో ప్రతివాడును ఎవని యింటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది; అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను.౹ -యోహాను 16:32
క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మనము కూడా కలిగి ఉండాలి. మన విశ్వాస సంబంధమైన జీవితములో మనము ఒంటరిమి కాదు. పరిస్థితులు కఠినముగా మారవచ్చు. అంతవరకు ఆధారముగా ఉన్నవారు ఒక్కసారిగా విడిచిపెట్టవచ్చు. అయినప్పటికీ నిజమైన విశ్వాసి ఆ భౌతికమైన పరిస్థితిని బట్టి ఒంటరి కాదు. పరలోకపు తండ్రి మనతోనే ఉంటాడు. ఈ సత్యము ఎంతో బలమైనది.
తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుట లేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలుచేయుచున్నాడు.౹ -యోహాను 14:10
మన విశ్వాస జీవితములో పరలోకపు తండ్రి మనతో నివాసము చేసేవాడుగా ఉంటాడు. అయితే మన విశ్వాసమును పరీక్షించే సమయము ఖచ్చితముగా ఉంటుంది. అయితే ఆ సమయములో మనము నిలబడి ఉన్నప్పుడు దేవుని మంచితనమును, శక్తిని మనము చూడగలుగుతాము. అది ఆయన క్రియల ద్వారా కనపరుస్తారు. ఆయన క్రియలు అద్భుత క్రియలు.
తండ్రి నీవు ఏకమై ఉన్నారా లేరా అనేది నీతో, నీలో జరిగే క్రియలే సాక్ష్యమిస్తాయి.
నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవ సాయకుడు.౹ -యోహాను 15:1
విశ్వాస జీవితము ఫలించే జీవితము. విశ్వాస జీవితము ఆశీర్వదించబడిన జీవితము. నిజమైన ద్రాక్ష అనగా ఖచ్చితముగా ఫలించేది. దానికి కారణము పరలోకపు తండ్రి వ్యవసాయకుడు అయి ఉన్నాడు.
నా జీవితము ఆశీర్వదించబడినది దానికి కారణము నా జీవితమునకు వ్యవసాయకుడు, పోషకుడు నా దేవుడే. నా జీవితము ఫలించులాగున అవసరమైనది దయచేయువాడు, అనవసరమైనది తీసివేయువాడు నా దేవుడే ఈ సత్యము మన హృదయములో ఎప్పుడూ భద్రపరచుకుందాము.
నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును.౹ నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపడు.౹ వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటె గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలోనుండి యెవడును వాటిని అపహరింపలేడు;౹ -యోహాను 10:27-29
ఇక్కడ యేసయ్యకు గొర్రెలను దేవుడే ఇచ్చాడు గనుక వాటిని ఎవ్వడు తన చేతిలోనుండి అపహరింపడు అని యేసయ్య చెప్పుచున్నాడు. భూమి మీద శ్రేష్టమైన ప్రతి ఈవి, ఆశీర్వాదము పరలోకపు తండ్రి దగ్గరనుండే వచ్చును గనుక, వాటిని దొంగిలించే అవకాశము ఎవరికీ, ఏ పరిస్థితికీ లేదు. నీకు ఇవ్వబడిన ప్రతీ ఆశీర్వాదము నీవు అనుభవించవలసినదే, అయితే ఇది విశ్వాస జీవితమును కలిగి ఉన్నవారి విషయములోనే జరుగుతుంది.
నీ ఆశీర్వాదములను దొంగిలించుటకు ప్రయత్నములు జరిగినప్పటికీ, అవి ఏ మాత్రము సఫలము కానివ్వడు నీ తండ్రి. అందుకే మంచి విశ్వాస జీవితము అనేది ఎంతో ప్రాముఖ్యమైనది.
- విశ్వాస జీవితము దేవుని ఆధారము చేసుకొని వెళ్ళేది.
- విశ్వాస జీవితములో ఒంటరిమి కాదు
- విశ్వాస జీవితము ఆశీర్వదించబడినదే
- విశ్వాస జీవితములో దేవుడు సిద్ధపరచిన ప్రతీ ఆశీర్వాదము మనము అనుభవిస్తాము.