25-02-2024. – ఆదివారం మొదటి ఆరాధన – నీకోసం పరలోక రాజ్యము పనిచేయును

స్తోత్ర గీతము 1

నీటిపైనా నడిచెను
గాలి సముద్రమును గద్దించెను
మృత్యుంజయుడై లేచెను
నాతో నిత్యము జీవించును

ఆయనే కాపాడు దేవుడు
ఆయనే నడిపించే దేవుడు
ఆయనే తోడైయుండు దేవుడు ఆయనే

మనకొరకు మరణించి
సిలువలో ప్రాణమునిచ్చెను
జయశీలుడై లేచెను
పాపికి విడుదలనిచ్చెను

ఆయనే కాపాడు దేవుడు
ఆయనే నడిపించే దేవుడు
ఆయనే తోడైయుండు దేవుడు ఆయనే

మేఘాల మధ్యలో
బూర ధ్వని శబ్దముతో
రారాజుగా దిగివచ్చును
ఈ భూలోకమును ఏలుటకై

ఆయనే అధికారముతో యేసయ్యా
ఆయనే రాజ్యమేలుటకు యేసయ్యా
ఆయనే న్యాయాధిపతి యేసయ్యా

ఆయనే కాపాడు దేవుడు
ఆయనే నడిపించే దేవుడు
ఆయనే తోడైయుండు దేవుడు ఆయనే-2

స్తోత్ర గీతము 2

మార్గం నేనే – అన్నారు యేసు
సత్యం నేనే – అన్నారు యేసు
జీవం నేనే – అన్నారు యేసు
నాకై మరణించి లేచాడు

నాలో పాపాన్ని తొలగించి – శాపాన్ని విడిపించి జీవం ఇస్తాడే
నాలో పరిశుద్ధాత్మ నింపి – శక్తితో నను నడిపి గమ్యం చేరుస్తాడే
రానున్న రారాజు నా యేసు మహా రాజు ||2||

స్వస్థపరచే – నా మంచి యేసు
స్వేచ్ఛనిచ్చే – నా మంచి యేసు
శ్వాస నింపే – నా మంచి యేసు
హృదిలో చోటిస్తే నివసిస్తాడే
“నాలో పాపాన్ని తొలగించి”

విడుదల నిచ్చే – నా మంచి యేసు
విజయం ఇచ్చే – నా మంచి యేసు
విరోధిని జయించే – నా మంచి యేసు
విశ్వాస వీరునిగా మలిచాడు
“నాలో పాపాన్ని తొలగించి”

రక్తం కార్చే – నా మంచి యేసు
రక్షణ ఇచ్చే – నా మంచి యేసు
రమ్మని పిలిచే – నా మంచి యేసు
చిరకాలం ఆయనతో ఉండాలని
“నాలో పాపాన్ని తొలగించి”

స్తోత్ర గీతము 3

దావీదు వలె నాట్యమాడి
తండ్రీని స్తుతించెదము
యేసయ్యా స్తోత్రముల్‌
||దావీదు||

తంబురతోను సితారతోను
తండ్రీని స్తుతించెదను
యేసయ్యా స్తోత్రముల్‌

కష్టము కలిగినా – నష్టము కలిగినా
తండ్రీని స్తుతించెదను
యేసయ్యా స్తోత్రముల్‌

పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన
తండ్రీని స్తుతించెదను
యేసయ్యా స్తోత్రముల్‌

క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన
తండ్రీని స్తుతించెదను
యేసయ్యా స్తోత్రముల్‌

ఆరాధన వర్తమానము

మన దేవుడు మంచి దేవుడుగా ఉంటున్నాడు. ఆయనే మహిమ ఘనత కలుగును గాక! దేవుని కలిగిన మన అందరి జీవితములు ధన్యములు.

యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. -కీర్తనలు 33:12

ధన్యులు అనే మాటకు అర్థము సంతోషముగా జీవించువారు. మన జీవితములో ఆయనను కలిగి ఉండటమే మహాభాగ్యము. మనము కొనసాగిస్తున్న జీవితము ఎంతో ప్రత్యేకమైనది. ఆ దేవుడు ఏమి కలిగి ఉన్నాడో అదే మన జీవితము అయి ఉన్నది. గనుకనే మన జీవితము ఎంతో ప్రాముఖ్యము అయినదిగా ఉంది.

ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు నీవు వారి ఉన్నతస్థలములను త్రొక్కుదువు. -ద్వితీయోపదేశకాండము 33:29

దేవుని కలిగి ఉన్నవారి జీవితము వంటి జీవితము మరెవ్వరికీ లేదు అనే సత్యము గ్రహిస్తే, అప్పుడు మనము కలిగిన జీవితమును బట్టి దేవుని స్తుతించేవారిగా ఉండగలుగుతాము. ఈ సత్యము ఎరగని వారు దేవుని కలిగనప్పటికీ మనము కలిగిన జీవితము యొక్క విలువ గ్రహించలేక, పాడు జీవితము అని వారికి వారే శాప వచనములు పలుకుతారు. అయితే మనకు ఇవ్వబడిన జీవితము విలువ గ్రహించాలి.

మన జీవితములకు ఆయన సహాయకరమైన కేడెముగాను, మన జీవితము యొక్క విలువ పెంచేవాడుగాను ఉన్నాడు. మనము ఆయనను దేవుడుగా కలిగి ఉన్నాము కాబట్టే, మనము ధన్యులము. మన జీవిము ఎంతో విలువైనది ఆ జీవితమును ఇచ్చిన దేవునిని ఎల్లప్పుడు మనము స్తుతించాలి, మహిమపరచాలి.

అడ్డంకులు ఖచ్చితముగా వస్తాయి, శ్రమలు కూడా వస్తాయి అయితే మన జీవితము మన దేవుని సహాయముచేత నడిపించబడేది గనుక ధన్యకరముగానే కొనసాగించబడుతుంది, సమాధానకరముగానే ఉంటుంది.

నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాననెను. -యోహాను 16:33

మన దేవుడు లోకములోని శ్రమను జయించినవాడు గనుక జయించినవాడిని మనము కలిగి ఉన్నాము.

అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు.౹ -1 పేతురు 2:9

ఆయన గుణములను ప్రచురముచేయు నిమిత్తము మనము పిలువబడి ఏర్పరచబడిన వారముగా ఉన్నాము. మన దేవుడు జయించినవాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన యొక్క గుణము అనగా జయించగలుగుట అనే గుణము మన జీవితము ద్వారా ప్రచురము చేయబడాలి. అందుకే దేవుడు ఏమై ఉన్నాడో అదే మన జీవితము అయి ఉన్నది గనుకనే ఆయనను కలిగి ఉన్నవారు ధన్యులు అని చెప్పగలము.

మనము శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు అపవాదికి సరైన సమయము. మనము అదే సమయములో దేవుని వాక్యము చెంతకు చేరాలి. దావీదు కూడా శ్రమ వచ్చిన ప్రతీసారీ దేవుడే నా ఆశ్రయము, కోట అని ఆయన చెంతకే చేరేవాడు. మనము కూడా అదే విధముగా ఉండాలి .

దేవుడు నాకు ఎత్తయిన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు నా బలమా, నిన్నే కీర్తించెదను. -కీర్తనలు 59:17

మన దేవుని గూర్చి తెలిసినవాడు ఎవ్వడూ ఆయనను విడిచిపెట్టడు. మన దేవుడు ఎత్తయిన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. బలమైన దేవుడై ఉన్నాడు. అందుకే మనం జీవితము గూర్చి శాప వచనములను ఏనాడు పలుకవద్దు. ఏ స్థితిలో ఉన్నా సరే, ఎంత శ్రమ అయినా సరే, నీ జీవితముయొక్క ధన్యతను గూర్చిన సత్యము ఎరిగినవారిగా నిలబడితే, మన జీవితము యొక్క నిజమైన స్థితి ప్రత్యక్షపరచబడుతుంది. అనగా దేవుని సహాయము అందించబడి, ఆయన శక్తి, బలము అందించబడి ఆయన మహిమ ప్రత్యక్షపరచబడుతుంది.

అందుకే మన జీవితము సాధారణమైన జీవితము కాదు. మన జీవితము ముందు ఏదీ నిలబడలేదు. మనలను బట్టి కాదు గానీ, లోకములోని శ్రమను జయించినవానిని బట్టి, మన ముందు ఏదీ నిలబడలేదు.

చాలా సందర్భాలలో మన నోరు మూతబడిపోతుంది. అయితే మనము శ్రమలలో ఉన్నప్పుడు ఆ శ్రమను గూర్చిన బాధ, వేదన బట్టి వచ్చే శాపకరమైన మాటలకు నోరు మూతబడే ఉండాలి. అయితే అదే పరిస్థితిలో దేవుని స్తుతించడానికి మాత్రము నోరు తెరవగలగాలి. ఈ జీవితము మనది కాదు గానీ దేవుని సొత్తు.

మన దేవుడు జయించినవాడు గనుక మనము కూడా మన ముందు ఉన్న దానిని జయించేవారిగా ఉంటాము.

ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము -ద్వితీయోపదేశకాండము 33:29

మన జీవితము యొక్క విలువను పెంచేవాడుగా మన దేవుడు ఉన్నాడు. శత్రువు అనగా మనకు వ్యతిరేకమైన పరిస్థితులు. ఆ పరిస్థితిలో దేవుని శక్తి ప్రత్యక్షపరచబడుతుంది. తద్వారా దేవుని నామము మహిమపరచబడుతుంది. గనుకనే మన జీవితము విలువైనది.

ఇంత శ్రేష్ఠకరమైన జీవితమును మనకు దేవుడు ఇవ్వడానికి మనలను వెతికి రక్షించాడు. దేవుడే మనకు సహకారిగా లేకపోతే, మనము వెళ్ళే సందర్భములో అనేకసార్లు మన జీవితములను మనమే శపించుకొని, నాశనము చేసుకొనేవారమే, అయితే దేవునికే మహిమ కలుగునుగాక! ఆయన మనలను వెతికి రక్షించి ఆయన సొత్తుగా చేసుకున్నారు.

దేవుడు నాకు ఎత్తయిన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు నా బలమా, నిన్నే కీర్తించెదను. -కీర్తనలు 59:17

ఎత్తయిన కోట అనే దానిని కొంచెము ఆలోచిస్తే, ఎత్తైన కోట మీద కూడా శత్రువు ప్రయత్నిస్తాడు గానీ, ఆ ప్రయత్నాలు నిలబడవు. అనేకమైనవి మన జీవితములో ప్రవేశించడానికి ప్రయత్నములు జరుగుతాయి కానీ, వాటి ప్రయత్నములు నెరవేరవు. ఆయన మన పక్షముగా ఉండగా, మనకు విరోధి ఎవరు?

అప్పుడతడు నాతో ఇట్లనెను–జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే; శక్తిచేతనైనను బలముచేతనైననుకాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదునుభూమి వగుదువు; –కృప కలుగును గాక కృప కలుగునుగాక అని జనులు కేకలువేయగా అతడు పైరాయి తీసికొని పెట్టించును.౹ -జెకర్యా 4:6

గొప్ప పర్వతమా అనగా మనము వెళుతున్న శ్రమ, మన కళ్ళముందు ఉన్న పరిస్థితి చాలా గొప్పదిగాను, అసాధ్యమైనదిగాను ఉన్నదేమో, అయితే జెరుబ్బాబెలును అడ్డగించడము దానికి సాధ్యము కాదు. అనగా ఏర్పాటు చేయబడిన వారైన మనలకు అడ్డుగా రావడానికి ఏ పరిస్థితికీ ఏ శ్రమకూ సాధ్యము కాదు, అనుమతి లేదు.అది ఎంత ఎత్తైనదైనాసరే చదును భూమిగా మారవలసిందే. అనగా మన ఎదురుగా ఎంత ఎత్తుగా శ్రమ రేగినా సరే, అది మన కాళ్ళ వద్దకు తగ్గించబడవలసినదే గనుకనే మన జీవితము ధన్యకరమైనది.

అందుకే మన జీవితములో దేవునిని విడిచిపెట్టకూడదు. ఆయనను దేవునిగా కలిగినవారు ధన్యులు. అటువంటివారి జీవితములో ఏ శ్రమ వచ్చినా సరే, అది దేవుని మహిమ కొరకే! అందుకే ఆ శ్రమ సమయములో దేవుని ఆశ్రయించేవారిగా ఉండాలి. ఒంటరిగా ఆయన సన్నిధిలో కనిపెట్టుకున్నప్పుడు, మనము సహాయము, సమాధానము పొందుకోగలుగుతాము.

ఈ సత్యమును ఎరిగి, అటువంటి జీవితమును మనకు ఇచ్చినందుకు మన దేవునిని స్తుతించి మహిమపరుద్దాము.

ఆరాధన గీతము

నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు
నిన్నే ప్రేమింతును నే వెనుదిరుగా

నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా నే వెనుదిరుగా

నిన్నే పూజింతును నిన్నే పూజింతును యేసు
నిన్నే పూజింతును నే వెనుదిరుగా

నీ సాక్షిగా జీవించి నీ మహిమకై ఉండెదన్
నిరసించక సాగెదా నే వెనుదిరుగా

నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును యేసు
నిన్నే కీర్తింతును నే వెనుదిరుగా

నీ సాక్షిగా జీవించి నీ మహిమనై ఉండెదా
నిరసించక సాగెదా నే వెనుదిరుగా

వారము కొరకైన వాక్యము

దేవుని కృపను మాటిమాటికీ జ్ఞాపకము చేసుకోవాలి. ఎల్లప్పుడు ఆ కృపను ఆశ్రయించి, ఆధారము చేసుకునే మనము ఉండాలి. మనకొరకు పరలోక రాజ్యము పనిచేయును అనే విషయమును గూర్చి నేర్చుకుందాము.

నీ కొరకు అనగా ఎవరైతే దేవునిని కలిగి జీవిస్తారో, ఆయననే ఆశ్రయించి జీవిస్తారో వారి జీవితములలో పరలోకరాజ్యము పనిచేయును.

మన పౌరస్థితి పర లోకమునందున్నది; అక్కడనుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము.౹ -ఫిలిప్పీయులకు 3:20

దేవుని కలిగి ఉన్నవారి పౌర స్థితి పరలోకమందు ఉన్నది. అనగా ఆయనను కలిగినవారైన మనము పరలోకమునకు చెందినవారము. మనము ఈలోకములో భారతీయులము గనుక ఆ భారత ప్రభుత్వము పరిపాలన చేసేదిగా ఉంటుంది. అలాగే మనము పరలోకమునకు చెందినవారము గనుక మన జీవితము పరలోక ప్రభుత్వము పరిపాలించేదిగా ఉంటుంది. ఆ పరలోక ప్రభుత్వము మంచిది, మనకు న్యాయము జరిగించేదిగా ఉంది, మనకు నెమ్మది కలిగించేదిగా ఉంది, మనకు సమస్తము సిద్ధపరచేదిగా ఉంటుంది, నడిపించేదిగా ఉంటుంది. అయితే దానికొరకు మనము ఏ విధముగా ఉండాలి?

మొదటిగా యేసయ్యను కలిగి ఉండాలి. ఆ తరువాత విషయాలు నేర్చుకుందాము.

మాదీయుడగు అహష్వేరోషుయొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపైన రాజాయెను.౹ అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు, యెరూషలేము పాడుగా ఉండవలసిన డెబ్బది సంవత్సరములు సంపూర్తియౌచున్నవని గ్రంథములవలన గ్రహించితిని.౹ -దానియేలు 9:1-2

దానియేలు గ్రంథము వలన యెరుషలేము పాడుగా ఉండవలసినది 70 సంవత్సరములే అని గ్రహించాడు. అనగా దేవుని ఉద్దేశ్యమును తన ప్రవక్తల ద్వారా తెలియపరచాడు. దానియేలు ఆ దేవుని చిత్తమును తెలుసుకున్నాడు. ఆ వెంటనే ఆ దేవుని చిత్తము నెరవేర్చబడునట్లు సిద్ధపరచుకున్నాడు.

అంతట నేను గోనెపట్ట కట్టుకొని, ధూళి తలపైన వేసికొని ఉపవాసముండి, ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని యెదుట నా మనస్సును నిబ్బరము చేసి కొంటిని.౹ -దానియేలు 9:3

ఆ పరలోకము మన జీవితములలో పనిచెయ్యాలి అంటే, దేవుని చిత్తమును మనము కనుగొనేవారిగా, ఎరిగేవారిగా ఉండాలి. అప్పుడే ఆ చిత్తమును నెరవేర్చడానికి మనము ప్రయత్నించగలుగుతాము. ప్రతీ విషయమందు దేవుని చిత్తమును మనము ఎరిగినవారిగా ఉండాలి. ఎప్పుడైతే దానియేలు అలా సిద్ధపరచుకున్నాడో అప్పుడు ఏమి జరిగింది?

–దానియేలూ, నీవు బహు ప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని; నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పుమాటలు తెలిసికొనుమనెను. అతడీమాటలు నాతో చెప్పగా నేను వణకుచు నిలువబడితిని.౹ అప్పుడతడు–దానియేలూ, భయపడకుము, నీవు తెలిసికొనవలెనని నీ మనస్సును అప్పగించి, దేవుని యెదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలనుబట్టి నేను వచ్చితిని -దానియేలు 10:11-12

దానియేలు దేవుని చిత్తమును జరిగించడానికి తనను సిద్ధపరచుకోగానే, పరలోకమునుండి బయలుదేరిన దేవదూత దానియేలు వద్దకు పంపబడ్డాడు. అలాగే మన జీవితములో కూడా దేవుని చిత్తమును గ్రహించి ఆ ప్రకారము మనము సిద్ధపడితే మనకొరకు కూడా పరలోకము పనిచేసేదిగా ఉంటుంది.

అంతట అపవాది ఆయ నను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. -మత్తయి 4:11

దేవదూతలు అంటే పరలోకరాజ్యములో ఉండేవారు. యెహోవా యందు భయభక్తులు కలిగినవారికి దేవదూతలు కావలిగా ఉంటారు అని వాక్యములో మనకు తెలుసు. యేసయ్య మనుష్యకుమారునిగా భూమి మీదకు వచ్చి ఏమి చేస్తున్నారు అంటే,

నా యిష్టమును నెరవేర్చు కొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగివచ్చితిని.౹ -యోహాను 6:38

దేవుని చిత్తమును నెరవేర్చడానికే భూమిపైకి వచ్చిన యేసయ్య 40 దినములు అరణ్యములో ఉపవాసము చేసినవాడుగా ఉన్నాడు. ఉపవాసము అయిపోయినవెంటనే దేవదూతలు పరిచర్య చేసారు. అంటే ఎలా పరిచర్య చేసి ఉంటారు? అక్కడ యేసయ్య పరిస్థితి ఆకలితో, అలసిపోయిన పరిస్థితి. ఆ సమయములో ఆయనకు ఏమి అవసరమో ఆ కార్యముల ద్వారానే ఆ పరిచర్య జరిగి ఉంటుంది.

మనము కూడా దేవుని చిత్తమును జరిగించాలి అని మనము నిలబడినప్పుడు, మన జీవితములో కూడా పరలోకము పనిచేస్తుంది. మన జీవితములో దుష్ట మృగములవంటి పరిస్థితుల గుండా వెళుతున్నప్పుడు, ఏమి లేని పరిస్థితులలో మన కొరకు పరలోకము స్పందిస్తుంది.

అయితే మొదటిగా మనము దేవుని కలిగి ఉన్నవారిగా ఉండాలి. దానియేలు, యేసయ్య దేవుని కలిగినవారిగా ఉన్నారు. దానియేలు విషయములో జరగవలసిన వాటి విషయములో పరలోకము పనిచేసింది. యేసయ్య విషయములో అక్కడ ఉన్న అవసరముకొరకు పరలోకము పనిచేసింది.

దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు . సంఘపువారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని౹ యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను.౹ ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలిసికొని పేతురును కూడ పట్టుకొనెను. ఆ దినములు పులియనిరొట్టెల పండుగ దినములు.౹ అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి, పస్కా పండు గైన పిమ్మట ప్రజలయొద్దకు అతని తేవలెనని ఉద్దేశించి, అతనికి కావలియుండుటకు నాలుగు చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను.౹ పేతురు చెరసాలలో ఉంచ బడెను, సంఘమయితే అతనికొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థనచేయుచుండెను.౹ -అపొస్తలుల కార్యములు 12:1-5

ఇక్కడ వచ్చిన కష్టకాలములో సంఘము ఆసక్తితో ప్రార్థించింది. యోహాను, యాకోబు మరియు యోహానులు దేవుని సువార్త ప్రకటన కొరకు ఏర్పాటు చేయబడినవారు. వీరు దేవుని విషయములను సంఘమునకు బోధించేవారు గనుక పేతురు మరణకరమైన పరిస్థితిలో చిక్కుబడిఉండగా, దేవుని విషయములపై ఆసక్తి కలిగిన సంఘముయొక్క ప్రార్థనకు పరలోకము పనిచేసింది.

హేరోదు అతనిని వెలుపలికి తీసికొని రావలెననియుండగా, ఆ రాత్రియే పేతురు రెండు సంకెళ్లతో బంధింపబడి యిద్దరు సైనికులమధ్య నిద్రించు చుండెను; మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి.౹ ఇదిగో ప్రభువు దూత అతనిదగ్గర నిలిచెను; అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి–త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్లు అతనిచేతులనుండి ఊడిపడెను.౹ -అపొస్తలుల కార్యములు 12:6-7

మన జీవితములో కూడా పరలోకము పనిచేయాలి అంటే, దేవుని విషయములలో మనము ఆసక్తి కనపరచాలి. వాక్యములో వ్రాయబడిన ఈ సత్యములు మన జీవితములో కూడా అనుభవించడానికే. పేరుతు విషయములో పరలోకము మరణమును తప్పించుటకు పనిచేసింది.

ఎలీషా జీవితములో చూస్తే, శత్రుసైన్యము చుట్టుముట్టినప్పుడు కూడా పరలోకము పనిచేసింది. వారి జీవితములలోనే కాదు గానీ, మన జీవితములలో కూడా జరుగుతుంది. అయితే మనము చేయవలసినవి ఏమిటి అంటే –

1. దేవుని కలిగి ఉండాలి
2. దేవుని చిత్తమును తెలుసుకోవాలి
3. దేవుని చిత్తమును జరిగించుటకు సిద్ధపడాలి
4. దేవుని విషయములకొరకైన ఆసక్తి కలిగి ఉండాలి