11-02-2024 – ఆదివారం మొదటి ఆరాధన

స్తోత్ర గీతము 1

ఆరాధించెదను నిన్ను
నా యేసయ్యా ఆత్మతో సత్యముతో
ఆనంద గానముతో ఆర్భాట నాదముతో
||ఆరాధించెదను||

నీ జీవ వాక్యము నాలో
జీవము కలిగించె
జీవిత కాలమంతా
నా యేసయ్యా నీకై బ్రతికెదను
||ఆరాధించెదను||

చింతలన్ని కలిగిననూ
నిందలన్ని నన్ను చుట్టినా
సంతోషముగ నేను
నా యేసయ్యా నిన్నే వెంబడింతును
||ఆరాధించెదను||

స్తోత్ర గీతము 2

రాజులకు రాజువు ప్రభువులకు ప్రభుడవు
నీవే మా విభుడవు లేకాన ఘనుడవు
నీవే… నీవే… నీవే… నీవే…..
రాజా నా రాజా యేసు రాజా

రారు సరిరారు మరి నీకెవ్వరూ లేరు
సరిపోరు మరి ఇంకెవ్వరూ
సర్వ సృష్టికర్తవు సర్వోన్నతుడవు
సర్వాధికారివి సర్వాంతర్యామివి
నీవే…..నీవే…..నీవే…..నీవే…..
రాజా నా రాజా యేసు రాజా

ఉన్నా నేనున్నా అని అనువాడవు
ఉన్న రానున్న ఏకైక రాజువు
అగ్ని జ్వాలలవంటి కన్నులున్నవాడా
మహా తేజస్సుతో ప్రకాశించువాడా
నీవే…..నీవే…..నీవే…..నీవే…..
రాజా నా రాజా యేసు రాజా

స్తోత్ర గీతము 3

ఓ హల్లెలూయ ఓ హల్లెలూయని
స్తోత్రాలాపన చేసెదన్ స్తోత్రము…స్తోత్రము…స్తోత్రము…స్తోత్రము


నీవు నా సొత్తని పేరు పెట్టి నన్ను పిలచిన తండ్రీ స్తోత్రము
ప్రత్యేయకపరచి కృపచేత నన్ను పిలచిన తండ్రీ స్తోత్రము


ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి పిలచిన తండ్రీ స్తోత్రము
ఏర్పరచబడిన పరిశుద్ధ జనముగ పిలచిన తండ్రీ స్తోత్రము

ఆరాధన వర్తమానము

లేఖనములు మనకు తెలియచేస్తున్న మాట – “ఆయనను స్తుతించుట మంచిది”. మన వ్యక్తిగతమైన జీవితములు దేవునిని ఆధారము చేసుకునే ఉన్నాయి ఈ సత్యము గుర్తించినవారు తమ దేవుని స్తుతించడానికి ఖచ్చితముగా వస్తారు.

ఒక్క క్షణము ఆయన మౌనముగా ఉంటే, మన జీవితములు ఎప్పుడో నాశనము అయిపోయేవి. దేవుని మనసు గురించి దావీదు కనుగొనగలిగాడు. అలాగే యోనా కూడా దేవుని మనస్సుని ఎరిగి ఉన్నాడు. “ఒకవేళ నినెవే ప్రజలు పశ్చాత్తాపం పడితే దేవుడు చేయ దలచిన నాశనము చెయ్యడు అని యోనా దేవుని మనసును ఎరిగి ఉన్నాడు”.

ఈరోజు దేవుని ఆరాధించడానికి, మనము కూడా దేవుని గూర్చిన సత్యము ఎరిగి ఉండాలి. సత్యము ఎవరికైతే తెలియచేయబడుతుందో, వారు స్వతంత్రులుగా చేయబడతారు. మన దేవుడు ఏమై ఉన్నాడు? అనే ప్రశ్న మన ప్రతీ సందర్భములో మన ముందు ఉంటే, మన దేవుని గూర్చిన సత్యమును గ్రహించగల స్థితిలో ఉంటాము.

రాజైన దావీదుకూడను బహుగా సంతోషపడి, సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను–మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు.౹ -1 దినవృత్తాంతములు 29:10

ఈ మాట మన జీవితములలో ఎంతో ప్రాముఖ్యమైనది. మన జీవితములు దేవుని మహిమ కొరకు సృష్టించబడ్డాయి. “చింతలన్ని కలిగిననూ నిందలన్ని నన్ను చుట్టినా సంతోషముగ నేను నా యేసయ్యా నిన్నే వెంబడింతును” అనే అనుభవము మనము అందరము కలిగి ఉండాలి. అప్పుడే నిరంతరము స్తోత్రార్హుడవు అనే మాటకు అర్థము ఉంటుంది.

మన జీవితములో ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే నా జీవితములో దేవుడు నిరంతరము స్తోత్రార్హుడు అనే ఆలోచన కలిగి ఉండాలి. దేవుని స్తుతించుట మనకే మంచిది. కష్టమైనా నష్టమైనా నా జీవితములో దేవుడు స్తోత్రార్హుడు.

మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోకవిషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను.౹ -ఎఫెసీయులకు 1:3

మన ఆశీర్వాదమునకు ఆత్మీయ విషయములు ముడిపడి ఉన్నాయి. అనగా ఆశీర్వాదము వెనుక మనము పరిగెట్టవలసిన అవసరము లేదు గానీ, ఆత్మీయముగా మనము ఎదిగినపుడు ఆ ఆశీర్వాదములు మన వెంటే వస్తాయి.

అత్మీయముగా ఎదగటము అంటే ఏమిటి? దేవుని గురించిన సత్యము తెలుసుకోవడమే! వాక్యానుసారముగా నడవడము అంటే, దేవుని మాట ప్రకారము నడవటమే. భయభక్తులు కూడా దేవుని యందు కలిగి ఉండుటయే. ఆజ్ఞలు కూడా దేవుడు ఇచ్చినవే. గనుక దేవుని గూర్చి తెలుసుకోవడమే మనము ఆత్మీయముగా ఎదుగుట.

ఎందుకు మన జీవితములలో ఆయన నిరంతరము స్తోత్రార్హుడు అని చూస్తే –

యెహోవా, భూమ్యాకాశములయందుండు సమస్తమును నీ వశము; మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి; యెహోవా, రాజ్యము నీది, నీవు అందరిమీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని యున్నావు.౹ ఐశ్వర్యమును గొప్పతనమును నీవలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించు వాడవును అందరికి బలము ఇచ్చువాడవును నీవే.౹ -1 దినవృత్తాంతములు 29:11-12
మాకు తండ్రివి నీవే, అబ్రాహాము మమ్ము నెరుగక పోయినను ఇశ్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను యెహోవా, నీవే మా తండ్రివి అనాదికాలమునుండి మా విమోచకుడని నీకు పేరే గదా. -యెషయా 63:16

“అనాదికాలమునుండి మా విమోచకుడని నీకు పేరే గదా” అంటే మన జీవితములో చూస్తే, మనము భూమి మీదకి వచ్చినప్పటినుండి ఆయనే మనకు తండ్రి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు. విమోచకుడు అంటే పరిస్థితులు బాగోనపుడు ఆ పరిస్థితినుండి విడిపించేవాడు.

నేను పుట్టినప్పటినుండి ఆయన నాకు విమోచకుడుగా ఉన్నాడు. ఆయన యందు నేను విశ్వాసము ఉంచకమునుపు, ఆయన సొత్తుగా నేను మారకమునుపు కూడా ఆయనే నన్ను విమోచించినవాడుగా ఉన్నాడు.

దేవుడైన యెహోవా ఇశ్రాయేలుయొక్క దేవుడు స్తుతింపబడును గాక ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు. -కీర్తనలు 72:18

మన జీవితములు ఆశ్చర్య కార్యములతో నిండి ఉంటాయి. ఎందుకంటే ఆయన ఆశ్చర్య కార్యములు చేయువాడు.

స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమ పరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. -కీర్తనలు 50:23

స్తుతియాగము అర్పించడము అంటే ఆయనను ఆరాధించడము. ఆయనను ఆరాధించినపుడు ఆయనకు మహిమ కలుగుతుంది. ఆయన ఆశ్చర్యకార్యములు జరిగించువాడు అని ఒప్పుకొని, ఆ సత్యముపై నిలబడుటను బట్టి ఆయనకు మహిమ కలుగుతుంది. దానిని బట్టి మన ప్రతీ పరిస్థితిలో దేవుని యొక్క రక్షణ అనగా కాపుదల, విడుదల ఇలా మనము తప్పించబడుట కొరకు అవసరమైన ప్రతీ కార్యము ఆయన జరిగించేవాడుగా మన దేవుడు ఉన్నాడు, దానికొరకైన మార్గము దేవుడు తెరిచేవాడుగా ఉన్నడు. అందుకే నిజమైన ఆరాధన ఎంతో ప్రాముఖ్యమైనది.

నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి యుంటేనేగాని తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నాయందు నిలిచియుంటేనేకాని మీరును ఫలిం పరు.౹ ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు.౹ -యోహాను 15:4-5

ఎవడు నాయందు నిలిచి ఉండునో, అనగా మనము వాక్యమందు నిలిచి ఉంటే, మనము ఖచ్చితముగా ఫలిస్తాము. ఆయనకు వేరుగా ఉండి అనగా ఆయన వాక్యమునకు వేరుగా ఉండి మనము ఏమీ చేయలేము. మనము నిలబడితే చాలు ఆయన మనయందు నిలిచి ఉండుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. గనుక ఆయనయందు నిలిచి ఉండుట ఎంతో ప్రాముఖ్యమైనది.

యెహోవా, భూమ్యాకాశములయందుండు సమస్తమును నీ వశము – 1 దినవృత్తాంతములు 29:11.

మన జీవితములలో ప్రతీ చిన్న దాని విషయములో కూడా మన దేవుడు మనలను తృప్తిపరచాలి అని కోరుకుంటాడు. మన ఆలోచనలు మనముకలిగి ఉన్న వనరులపై ఆధారపడి ఉంటుంది గానీ, దేవుడు మాత్రము ఆశ్చర్య కార్యములు చేసేవాడు.

నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండినయెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును.౹ -యోహాను 15:7

మనము ఆయనయందు నిలిచి అప్పుడు మనము ఆయనను ఏమి అడిగినా సరే ఆయన దయచేసేవాడుగా ఉంటాడు. ఆయన యందు నిలిచి ఉండటము అంటే, దేవుడు ఏది సరియైనది కాదు అని ప్రభువు తెలియచేస్తాడో, దానిని సరిచేసుకుని ముందుకువెళ్ళడమే. అనగా దేవునికి ఏది ఇష్టమో తెలుసుకుని ఆ ప్రకారము మనలను మనమే సిద్ధపరచుకోవడమే ఆయనయందు నిలిచి ఉండటము.

ఆరాధన గీతము

నా ప్రియ యేసు పదివేలలో అతి సుందరుడా…సుందరుడా…
యేషువా..ఆ…ఆ..ఆ..ఆ…ఆ…ఆ..
యేషువా..ఆ…ఆ..ఆ..ఆ…ఆ…ఆ.. ఆ

నీదే రాజ్యము – నీదే బలము నీకె మహిమ – కలుగును ఆమెన్
యేషువా..ఆ…ఆ..ఆ..ఆ…ఆ…ఆ..
యేషువా..ఆ…ఆ..ఆ..ఆ…ఆ…ఆ.. ఆ

వారము కొరకైన వాక్యము

నీ భవిష్యత్తు ఆశీర్వదించబడినదే. భవిష్యత్తును గూర్చిన ఆలోచన ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే వాక్యము ఏమి చెప్పుచున్నది అని ఆలోచిస్తే –

నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు.౹ -యిర్మీయా 29:11

ఈ వాక్యము ప్రకారము నీ భవిష్యత్తు ఆశీర్వదించబడినదే అని అర్థము చేసుకోవచ్చు. మన కళ్ళముందు అసాధ్యముగా పరిస్థితి కనపడినప్పటికీ, వాక్యము ప్రకారము మన భవిష్యత్తు ఖచ్చితముగా ఆశీర్వదించబడినదే ఎందుకంతే మన భవిష్యత్తును మన దేవుడు ఎరిగే ఉన్నాడు.

మన ప్రభువు తన ప్రేమను తన క్రియలద్వారా కనపరచేవాడుగా ఉంటాడు. దేవుని చిత్తమును బట్టి మనము మన జీవితములను సిద్ధపరచుకోవాలి. ఆత్మ మండలములో ముగించబడినది భూలోకములో స్థిరపరచబడుతుంది. మన జీవితము ఆశీర్వదిచబడి ఉండటము, ఆత్మ మండలములో ముగించబడినదే, అయితే ఆ సత్యము ఇప్పుడు మన జీవితములలో భూలోకములో స్థిరపరచబడుతుంది.

అబ్రహాము జీవితములో అనేక జనములకు తండ్రిగా చేయడము అనేది దేవుని ఉద్దేశ్యము. దానిని దేవుడే నెరవేర్చాడు. అయితే అబ్రహాము ఏమి చేసాడు అని నేర్చుకుందాము.

యెహోవా–నీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువుల యొద్దనుండియు నీ తండ్రి యింటినుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము.౹ నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు.౹ నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమియొక్క సమస్తవంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా -ఆదికాండము 12:1-3

నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని దేవుడు చెప్పుచున్నాడు. అబ్రహాము పితరులు విగ్రహములను తయారు చేసేవారు. అయితే అబ్రహామునకు ఆశీర్వాదము ఉంది అయితే తాను దేవునికి వ్యతిరేకమైన కార్యములు జరిగే ఇంటిలో ఉన్నాడు. అయితే దేవుడు తెలియచేసిన ఉద్దేశ్యమును గ్రహించినవాడై తాను దేవుడు చెప్పినట్టే ముందుకు వెళ్ళినవాడై ఉన్నాడు.

మన జీవితములలో కూడా తన ఉద్దేశ్యములను తెలియచేసినవాడుగా ఉన్నాడు. అయితే మనకు దేవునికి వ్యతిరేకమైన బంధకములనుండి మనము వెడలిపోయేవారముగా సిద్ధపడాలి.

జక్కయ్యను ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని యేసయ్య ఎందుకు చెప్పాడు. దేనిని విడిచిపెట్టాలో దానిని విడిచిపెట్టాడు కాబట్టే, వెంటనే జక్కయ్య అబ్రహాము కుమారుడుగా ఎంచబడ్డాడు.

అబ్రహాము పై దేవుని ఉద్దేశ్యము స్పష్టమైనప్పటికీ, తనకు ఇంకా పిల్లలు కలుగలేదు. తన ప్రయాణము మాత్రము ప్రారంభమయింది. అలా తన ప్రయాణములో క్రమక్రమముగా ఆశీర్వదించబడుతూ వచ్చాడు.

అబ్రాహాము బహు కాలము గడిచిన వృద్ధుడై యుండెను. అన్ని విషయములలోను యెహోవా అబ్రాహామును ఆశీర్వదించెను.౹ -ఆదికాండము 24:1

ఆశీర్వదించబడిన మన భవిష్యత్తును స్వతంత్రించుకోవడములో మొదటి మెట్టు దేనిని విడిచిపెట్టాలో దానిని విడిచిపెట్టుట.

ఈ రాళ్ళవలనకూడా అబ్రహామునకు కుమారులను కలగచేయగలడు అనే మాట ను చూస్తే – రాళ్ళు అనగా జీవము లేనివి. మనము విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టి ముందుకు సాగుతున్న సమయములో, జీవము లేని పరిస్థితులు కలుగుతాయి. అయితే మన భవిష్యత్తు ఆశీర్వదించబడినదే. గనుక ఆ జీవము లేని వ్యతిరేక పరిస్థితులలో ఖచ్చితముగా జీవము కలుగుతుంది. అనగా ఇటువంటి పరిస్థితులలో కూడా అబ్రహాము కుమారుడిగా ఆశీర్వదించబడిన వారిగా నిలబెట్టగలవాడు మన దేవుడు. మన దేవుడు సమర్థుడు గనుకనే, మిమ్మును గూర్చిన సంగతులను నేను ఎరుగుదును అని చెప్పుచున్నాడు.

పేతురుతో “నా వెంబడిరా నిన్ను మనుష్యులను పట్టు జాలరనిగా చేస్తాను” అని యేసయ్య ఎప్పుడు చేప్పాడు? రాత్రంతా కష్టపడినా ఏమీ దొరకని పరిస్థితులలో ఆశ్చర్యకరమైన రీతిలో కనీవినీ ఎరుగని విస్తారమైన చేపలు పట్టినప్పుడు, నన్ను వెంబడించుమని ప్రభువు చెప్పగానే – పేతురు అన్నీ విడిచిపెట్టి ప్రభువును వెంబడించాడు. అప్పుడు ప్రభువు చెప్పినట్టుగానే ఆయన మనుష్యులను పట్టు జాలరిగా సిద్ధపరచబడ్డాడు.

పేతురు–ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరకునని ఆయనను అడుగగా యేసు వారితో ఇట్లనెను (ప్రపంచ) పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడైయుండునపుడు నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనములమీద ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి తీర్పుతీర్చుదురు. -మత్తయి 19:27-28

పేతురు గూర్చిన భవిష్యత్తు ఎంత గొప్పదో కదా! ఇక్కడ కూడా అదే నియమము. విడిచిపెట్టవలసినది విడిచిపెట్టుట. అప్పుడు మనుష్యులను పట్టే జాలరిగా మాత్రమే కాక, మనుష్యులకు తీర్పు తీర్చేవాడుగా చేయబడ్డాడు.

అబ్రాము వెండి బంగారము పశువులుకలిగి బహు ధనవంతుడై యుండెను.౹ -ఆదికాండము 13:2

అబ్రహాము తన ప్రయాణము మొదలు పెట్టినప్పుడు ధనవంతుడే కానీ 24 వ అధ్యాయములో చూస్తే ధనము మాత్రమే కాదు కాదు గానీ, అన్ని విషయములలో ఆశీర్వదించబడ్డాడు.

మన ఐడెంటిటీ ఏమిటి అంటే దేవుని కుమారులము. రాజుకు కలిగిన కుమారుడు ఎలా ఉంటాడు? వాడు తినేది, ధరించేది అనుభవించేది అంతా దేని గురించి? తాను రాజు యొక్క కుమారుడు కాబట్టే, రాజు యొక్క స్థాయికి తగిన విధముగానే తాను అన్నీ పొందుకునేవాడుగా ఉంటాడు.

మన దేవుడూ ఎప్పుడూ మన క్షేమమునే కోరుకుంటాడు గనుకనే మనము ధైర్యముగా, నిరీక్షణ కలిగి ఉండాలి. అయితే మనము కూడా అబ్రహాము వలే పేతురు వలే మనము విడిచిపెట్టవలసినది విడిచిపెడదాము. లోకమును, లోకమునకు సంబంధించంది మన జీవితములో ఉంటే మనము విడిచిపెడదాము.

దేవుని కంటే దేనినీ మనము ఎక్కువగా ప్రేమించకూడదు అని ఎందుకు చెప్పాడు? దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించినా మనము పాపము చేసే అవకాశము ఉంది గనుకనే. అందుకే ప్రభువే మన జీవితములలో ప్రథమ స్థానము కలిగి ఉండాలి.

మనము కూడా అదే విధముగా విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టి, దేవునికే ప్రథమ స్థానము ఇచ్చి ఆశీర్వదించబడిన వారిగా మనము దేవుని సాక్ష్యముగా మనము సిద్ధపరచుకుందాము.