స్తుతిగీతము – 1
అబ్రాహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు
యాకోబు దేవుడవు రాజుల రాజా
యావే నిన్ను స్తుతియింతును
యావే నిన్ను ఘనపరతును
హల్లెలూయా హల్లెలూయా హోసన్నా
నీవే నీవే నా మార్గము నీవే నీవే నా సత్యము
నీవే నీవే నా జీవము నీవే నీవే నా రక్షణ
నీవే నీవే నా నిరీక్షణ నీవే నీవే నా సంగీతము
నీవే నీవే నా సంతోషము నీవే నీవే నా బలము
నీవే నీవే నా ఖడ్గము నీవే నీవే నా కిరీటము
నీవే నీవే నా కవచం నీవే నీవే నా కేడెము
నీవే నీవే నా కోట నీవే నీవే నా ఆశ్రయం
నీవే నీవే నా శృంగము నీవే నీవే నా సంపద
స్తుతిగీతము – 2
నీ ప్రేమ మాధుర్యము నేనేమని వర్ణింతును
నా ఊహ చాలదు ఊపిరి చాలదు
ఎంతో ఎంతో మధురం
నీ ప్రేమ ఎంతో మధురం
ప్రభు యేసు ప్రేమ మధురం
నా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతో
నా పూర్ణ మనస్సుతో
నిను పూజింతును నా ప్రభువా
||నీ ప్రేమ||
దేవదూతలు రేయింబవలు
కొనియాడుచుందురు నీ ప్రేమను
కృపామయుడా కరుణించువాడా
ప్రేమస్వరూపా ప్రణుతింతునయ్యా
||నా పూర్ణ||
సృష్టికర్తవు సర్వలోకమును
కాపాడువాడవు పాలించువాడవు
సర్వమానవులను పరమున చేర్చెడి
అద్వితీయుడా ఆరాధ్యదైవమా
||నా పూర్ణ||
స్తుతిగీతము – 3
శతకోటి వందనాలు యేసు స్వామి నీకు
కరుణించి కాపాడుమయ్య
కాలాలన్నీ మారినట్టు మారిపోని నీకు
మా నిండు వందనాలయ్య
ఆ చల్లని చూపు మాపై నిలుపు
నీ కరుణ హస్తం మాపై చాపు
యేసేపు అన్నలంత తోసేసినా
బానిసగా బైట అమ్మేసిన
చేయ్యని నేరాలెన్నో మోపేసిన
చెరసాలలో అతని పడేసిన
చల్లంగా చూచినావు
నీ చేయి చాచినావు
బాధించిన దేశానికే
ప్రధాని చేసినావు
ఆరుమూరల జానెడైనా
గొల్యాతు ఎంతో ధీరుడైనా
దేవుని హృదయానుసారుడైనా దావీదును
చిన్న చూపుచూసినా
చల్లంగా చూచినావు
నీ చేయి చాచినావు
అభిషేకమిచ్చి నీవే రాజుగా చేసినావు
ఆరాధన వర్తమానము
తన సన్నిధిలో మనలను క్సేమముగా నిలబెట్టినందుకు దేవునికే మహిమ కలుగును గాక! ఈ దినము ప్రభువు మనకొరకు సిద్ధపరచిన దినము. ఈ దినమందు మన దేవుడు స్తుతింపదగినవాడు.
మనము ఇందాక ఒక పాట పాడాము – “నీ ప్రేమ మాధుర్యము నేనేమని వర్ణింతును
నా ఊహ చాలదు ఊపిరి చాలదు ఎంతో ఎంతో మధురం నీ ప్రేమ ఎంతో మధురం ప్రభు యేసు ప్రేమ మధురం నా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతో నా పూర్ణ మనస్సుతో నిను పూజింతును నా ప్రభువా….సృష్టికర్తవు సర్వలోకమును కాపాడువాడవు పాలించువాడవు సర్వమానవులను పరమున చేర్చెడి అద్వితీయుడా ఆరాధ్యదైవమా”.
మన దేవుడు మనలను కాపాడువాడుగా ఉన్నాడు. ఆయన ప్రేమ వర్ణించడము ఎవ్వరికీ సాధ్యము కాదు!
ప్రభువు స్తుతినొందును గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్తయై యున్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణరక్షణ కలుగజేయు దేవుడై యున్నాడు మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. -కీర్తనలు 68:19-20
“అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు” ఈ మాట జ్ఞాపకము చేసుకుంటే, మనమే కదా మన భారమును భరిస్తూ ముందుకు వెళుతున్నాము అనిపిస్తుంది. అయితే పౌలు మాటలలో చూస్తే-
అయినను నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయి యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కు వగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపయే.౹ -1 కొరింథీయులకు 15:10
బాహ్యముగా ప్రయాస మనము పడుతున్నట్టు కనబడినప్పటికీ, నిజానికి ఆ ప్రయాస అంతా దేవుని కృపదే అనగా దేవునిదే అని అర్థము చేసుకోవచ్చు. మన జీవితము దేవునిపైనే ఆధారపడినవు. ఆయనను బట్టి మన జీవితములు ముందుకు వెళుతున్నాయి గానీ, మనలను బట్టి కాదు!
ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను… ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము – మత్తయి 1:21-23
పాపములు మన వ్యక్తిగతముగా మనము చేసుకొన్నవి. అయితే ఆయన మనలను ప్రేమించినవాడై, మన పాపములను బట్టి ఏమి కలిగి ఉన్నామో, దానిని ఆయనే భరించేవాడుగా ఉన్నాడు. మన జీవితములు ఆయన కృపను బట్టియే కొనసాగించబడుతున్నాయి.
“నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు” అని పౌలు చెప్పుచున్నాడు. పౌలు రక్షించబడినపుడు, దేవుని కృపద్వారా రక్షించబడ్డాడు. నూతనముగా మారుజన్మ పొందిన పౌలు యొక్క దినములు కొనసాగించబడుతున్నావి. కృప అంటేనే అర్హత లేనివాడికి దయచేయబడినది. పౌలు దినములు కొనసాగించబడుతుండగా అవి ప్రయాసతో కూడిన దినములుగా ఉన్నాయి.అయితే తన ప్రయాసతో కూడిన పరిస్థితిలో దేవుని కృప నిష్ఫలము కాలేదు అనగా తనను తాను ఆ ప్రయాసనుండి రక్షించుకోలేనప్పటికీ, దేవుని కృపను బట్టి ఆ ప్రయాసను దాట గలిగాడు. అలా ఇంకా ముందుకు వెళుతున్నప్పుడు, అనేకమైన ప్రయాసలు ఆ ప్రతీ ప్రయాసలో దేవుని కృప ఆయనకు తోడుగా ఉండి ఆ ప్రతీ ప్రయాసనుండి తప్పించిన అనుభవము కలిగి ఉన్నాడు కాబట్టే, “నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు” అని సాక్ష్యము చెప్పగలుగుతున్నాడు.
పౌలుగారు అనుభవించిన కృప మనకు కూడా ఇవ్వబడింది. ప్రతీ బలహీనమైన సమయములో కృప తోడుగా ఉంటుంది. ఈ సత్యము గ్రహించిన పౌలు, ప్రతీ ప్రయాస, శ్రమ ను చూసి భయపడలేదు గానీ, ఆ కృపనే నమ్ముకుని నిలబడినవాడుగా ఉన్నాడు. ఈ సత్యము మనము ఎరిగితే, మనము కూడా అలా నిలబడగలము, సాక్ష్యము ఇవ్వగలుగుతాము.
“అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు…” అనగా, ప్రతీ దినము గడుచుచుండగా ఎదురయ్యే పరిస్థితులు ఎంతో భారముగా మనము మోయలేనతగా ఉన్నాయి. అయితే దేవుడు ఆ భారమును తప్పించడానికి, మార్గము, బలము దయచేయువాడు, నూతనముగా పుట్టించువాడు. ఈ పరిస్థితులన్నీ మన జీవితములో ప్రభువు మహిమ పరచబడటానికే. శరీర కార్యములలో చావకపోతే ఈ విధముగా ఉండలేము.
మన జీవితములో “నేను” అనేదానిని కనపరుస్తాము. అయితే ఎప్పుడైతే మనము “నేను కాదు ప్రభువా, నీవే” అనే విధముగా మారతామో, అప్పుడు మనముకూడా పౌలువలే దావీదువలే మనము కూడా చెప్పగలుగుతాము.
“దేవుడు మా పక్షమున పూర్ణరక్షణ కలుగజేయు దేవుడై యున్నాడు” గతవారము మరణముతో పోరాడుతున్న ఒక సహోదరుని కొరకు ప్రార్థిస్తున్నప్పుడు, మరణము దరి చేరదు అనే దేవుని మాట, అప్పటి వరకు ఉన్న ప్రతీ పరిస్థితినీ మార్చివేసింది. మన దేవుడు సంపూర్ణమైన రక్షణ అనగా మనము రక్షించబడటానికి ఏ మార్గము తెరిచాడో, ఆ మార్గము సంపూర్ణమైనది అని అర్థము. మన జీవితములో ఏ భారము ఉన్నా సరే దాని అంతము ముగింపే. “మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము” మన జీవితములో ఎటువంటి మరణకరమైన పరిస్థితులైనా సరే వాటినుండి తప్పించువాడుగా మన దేవుడు ఉన్నాడు. ఈ సత్యము ఎరిగితేనే మనము ” నీ ప్రేమ మాధుర్యము నేనేమని వర్ణింతును నా ఊహ చాలదు ఊపిరి చాలదు ఎంతో ఎంతో మధురం నీ ప్రేమ ఎంతో మధురం ప్రభు యేసు ప్రేమ మధురం” అని మనస్పూర్తిగా చెప్పగలుగుతాము.
అందుకే ఈ రోజు మన దేవుడు ఎంతగా మనలను ప్రేమిస్తున్నాడో అని మనము తెలుసుకోవాలి. ఆయనను బట్టి మనము ధైర్యము కలిగి ఉండాలి అంటే, నీ యెడల ప్రేమ కలిగిఉన్నాడు, ఆ ప్రేమను కనుపరచేవాడుగా ఉన్నాడు అనే సత్యము నీవు ఎరిగి ఉండాలి.
ఆరాధన గీతము
నన్ను కాపాడువాడు కునుకడు
నన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు
నా భారము వహియించు యేసు
నా కొరకై మరణించె యేసు
పలుకరించే వారు లేక పరితపిస్తున్నా
కనికరించి వారు లేక కుమిలిపోతున్నా
కలతలెన్నో కీడులెన్నో
బ్రతుకు ఆశను అణచివేసినా
ఎడబాయడు యేసు నన్ను
దరి చేర్చును యేసు నన్ను
మనస్సులోన శాంతి కరువై మదనపడుతున్నా
పరుల మాటలు కృంగదీసి బాధపెడుతున్నా
భీతులెన్నో భ్రాఒతులెన్నో
సంతసంబును త్రుంచివేసినా
ఎడబాయడు యేసు నన్ను
దరి చేర్చును యేసు నన్ను
నీ భారము వహియించువాడే ఆ భారము తొలగించబడుటకు మార్గము తెరుచువాడు… స్తుతించు..
ఆయన మరణమునుండే మనకు జీవము అనుగ్రహించబడింది. ఇప్పుడు మనము ఏ భారము కలిగిఉన్నా ఆ జీవమునుబట్టియే మనకు విడుదల కలుగుతుంది.
నా భారము వహియించు యేసు నా కొరకై మరణించె యేసు. ఆయన మరణమునుండే మనకు జీవము వచ్చింది. ఈరోజు అయన మరణమును మనము డిక్లేర్ చేసాము. ఆయన మరణమునుండే మనకు ఇప్పుడు జీవము దొరుకుతుంది. ఆయన యెడబాయడు విడువడు.
ఏ భారము చేత నీవు బాధపడుతున్నావో, దుఃఖపడుతున్నావో, నీ హృదయము భారముతో నిండిఉందో.. అయితే నిన్ను ప్రేమించు యేసయ్య నిన్ను ఎడబాయడు, నీ భారములో విడిచిపెట్టడు గానీ నిన్ను దరి చేరుస్తాడు.ఆమేన్
నీవు చేసే ఈ ఆరాధన నీకొరకు ఒక మార్గము తెరిచేదిగా ఉంది. గనుక నీవు పలికే మాటలు నమ్మి పలుకు ఆరాధించు,
వారము కొరకైన వాక్యము
2024 అనుభవముతో కూడినది అయి ఉంది గనుక ఆచారయుక్తమైన భక్తి మన జీవితములో ఇక ఉండదు. ప్రతీ అడుగులో, ప్రతి సమస్యలో దేవుని అనుభవమును కలిగినవారిగా ఉంటాము. మన కళ్ళముందు ఉన్న పరిస్థితి ఎలాంటిది అయినా సరే వాటిని మార్చగలిగిన శక్తి కలవాడు మన దేవుడు. ఈ సంవత్సరము యేహోషువ సంవత్సరము అనగా విజయకరమైన సంవత్సరము.
ఈరోజు “ఆయన విషయమై అభ్యంతరపడవద్దు” అనే సంగతి గూర్చి నేర్చుకుందాము. మన వ్యక్తిగతమైన జీవితములలో అనేకమైనవి మనకు మనమే కోల్పోయినవారిగా ప్రవర్తిచేవారిగా ఉంటాము.
యేసు, వాడు పడియుండుట చూచి, వాడప్పటికి బహుకాలమునుండి ఆ స్థితిలోనున్నాడని యెరిగి–స్వస్థపడ గోరుచున్నావా అని వానినడుగగా -యోహాను 5:6
యేసయ్య అతనిని చూచి, అతను ఆ పరిస్థితులలో 38 సంవత్సరములనుండి ఉన్నాడు అని యెరిగినప్పటికీ, యేసయ్య అతనిని ఎందుకు స్వస్థపడ గోరుచున్నావా? అని అడుగుతున్నాడు.
ఆ వ్యాధికలిగినవాడు ఎవడైనా వచ్చి ఆ కోనేటిలో దించుతాడేమో అని చూస్తున్నాడు.
ఆయన యింట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయనయొద్దకు వచ్చిరి. యేసు–నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? అని వారి నడుగగా -మత్తయి 9:28
అక్కడ యాయెరు ఇంటిలో జరిగిన అద్భుతము చూసే యేసయ్య వద్దకు వచ్చారు. ఆ సంగతి కూడా ప్రభువైన యేసయ్యకు తెలిసే ఉంది. అయినప్పటికీ యేసయ్య అడగటానికి కారణము ఏమిటి? ఈ సత్యము తెలియకుండా మనము యేసయ్య వద్దకు వస్తే దాని వలన ప్రయోజనము లేదు.
మూడవసారి ఆయన–యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా? అని అతనిని అడిగెను. – నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి–ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను.౹ -యోహాను 21:17
మన అందరం యేసయ్య చెయ్యగలడు అని నమ్మే వచ్చాము, అయితే ఇంక లోతైన సత్యము మనము యెరిగిఉండాలి. ఈ ధ్యానము ద్వారా దేవుని నియమము మనము ఎరిగి ఉండాలి.
అదేమనగా–యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు.౹ ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును.౹ -రోమా 10:9-10
నీతి కలగాని అంటే నీ హృదయమందు విశ్వసించాలి, రక్షణ కలగలి అంటే నోటితో ఒప్పుకోవాలి. బేతెస్ద కోనేరు వద్ద ఉన్న వ్యక్తి హృదయమందు విశ్వసించినవాడుగా ఉన్నాడు, గుడ్డివారు విశ్వసించినవారుగా ఉన్నాడు. ఆ విశ్వసించిన దానిని పలికినప్పుడు రక్షణ కలుగుతుంది, అనగ విడుదల కలుగుతుంది.
నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? అని వారి నడుగగా వారు–నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడాయన వారి కన్నులు ముట్టి–మీ నమ్మికచొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరువబడెను. -మత్తయి 9:28-30
మన వ్యక్తిగతమైన జీవితములలో మనం హృదయమందు విశ్వసించేవారముగా ఉన్నాము గానీ, ప్రకటిస్తున్నామా?
–విశ్వసించితిని గనుక మాటలాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతోకూడిన ఆత్మగలవారమై, ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడ లేపి, మీతోకూడ తన యెదుట నిలువ బెట్టునని యెరిగి, మేమును విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము. -2 కొరింథీయులకు 4:14
దేవుని కార్యముల విషయములలో మనము కేవలము విశ్వసించుట మాత్రమే కాదు గానీ, ఆ విశ్వాసమును బట్టి ప్రకటించేవారుగానూ, మాటలాడేవారుగానూ ఉండాలి. “ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడ లేపి” అనగా పరిస్థితి ఏదైనా, ప్రభువ్హు మనలను ఖచ్చితముగా లేపువాడు.
ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము; అపాయములోనున్నను కేవలము ఉపాయము లేనివారము కాము;౹ -2 కొరింథీయులకు 4:8
ఈ సత్యము ఎరిగినవాడిగా పౌలు అనేక సందర్భాలలో తాను ఎరిగిన దేవుని సత్యమును ప్రకటించినవాడుగా ఉన్నాడు. మనము ఆరాధించిన సత్యము – “నా భారము వహియించు యేసు నా కొరకై మరణించె యేసు”. నా కొరకు యేసయ్య మరణించాడు, ఆ మరణములోనుండి నాకు జీవము ఇవ్వబడింది. ఆ జీవమును బట్టే మన పరిస్థితిలలో జీవము స్థిరపరచబడుతుంది.
“ప్రభువైన యేసును లేపినవాడు” ఎటువంటి పరిస్థితులలోనుండి లేపాడు? మరణములోనుండి లేపాడు. గనుక మనము మరణకరమైన పరిస్థితులలో ఉన్నప్పటికీ, మనలను సహితము లేపగలిగినవాడు.
“మీతోకూడ తన యెదుట నిలువ బెట్టునని యెరిగి, మేమును విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము” అనగా ఖచ్చితముగా మేము ప్రకటించినదానికి సాక్ష్యముగా ఉంటాము అని అర్థము.
మనము కూడా దేవుని కార్యము జరగడానికి ప్రార్థన చేస్తున్నాము. అయితే కేవలము ప్రార్థన చేయడమే కాదు గానీ, ఏ సత్యము నీవు నమ్మావో, ఆ సత్యమును నీవు ప్రకటించాలి. షద్రకు మేషాకు అబెద్నగో అనువారు దేవుని గూర్చి విశ్వసించినదానిని రాజు ముందు ప్రకటించారు. ఆ ప్రకటించినదానిని బట్టి, జనముల ముందు సాక్ష్యముగా నిలబడ్డారు.
యేసయ్య కూడా ఇదే నియమము పాటించాడు. మనము కూడా అదే నియమమును పాటించాలి. “విశ్వసించితిని గనుక మాటలాడితిని అని వ్రాయబడిన ప్రకారము” మనము ధైర్యము కలిగి మనము విశ్వసించినదానిని ప్రకటిద్దాము.
విశ్రాంతిదినము వచ్చినప్పుడు ఆయన సమాజమందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి–ఈ సంగతులు ఇతనికి ఎక్కడనుండి వచ్చెను? ఇతనికియ్యబడిన ఈ జ్ఞానమెట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి? ఇదేమి? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరు మనతో నున్నారు కారా? అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. -మార్కు 6:2-3
ఇక్కడ ఉన్నవారు యేసయ్యను నమ్మని వారుగా ఉన్నారు. ఆయన గూర్చి అభ్యంతరపడినవారుగా ఉన్నారు. గనుక ఏమి జరిగింది అంటే,
అందువలన కొద్దిమంది రోగులమీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. -మార్కు 6:5
విశ్వాసము ఉన్న చోటనే ప్రకటించగలిగిన ధైర్యము ఉంటుంది. అదే విశ్వాసము లేకపోతే, నోటివెంట దేవుని నమ్మినట్టుగా నీవు మాటలాడలేవు.
పునాది వేయబడిన నాటి నుండి 5 రకములుగా దేవుడు ఆశీర్వదిస్తాను అని ప్రభువు చెప్పారు. ఇది మందిరము కొరకైన ఆసక్తి కలిగి ఆ మందిరపనిలో చేయి వేసిన ప్రతి ఒక్కరి జీవితములో కలుగుతుంది. అవేవనగా
- భాగ్యవంతమైన జీవితము
- ఫలభరితమైన జీవితము
- ఆరోగ్యవంతమైన జీవితము
- ఘనమైన జీవితము
- పరిశుద్ధమైన జీవితము
అయితే ఇవి పొందాలి అంటే, దేవుడు ఈ ఆశీర్వాదములు ఇస్తాను అన్నాడు కాబట్టి, ఒకవేళ ఆ ఆశీర్వాదమునకు సంబంధించిన సూచన ఏమీ కనపరచనిదానిని బట్టి మనము అభ్యంతరపడకూడదు. అయితే మనము విశ్వసించినదానిని బట్టి అదే ఆశీర్వాదమును ప్రకటించాలి. అప్పుడు ఆ ఆశీర్వాదము నీవు పొందటానికి అవసరమైన కార్యము దేవుడు జరిగించేవాడుగా ఉంటాడు.
గనుక దేవుని కొరకైన సాక్షులుగా ఉండులాగున మనము విశ్వసించినదానిని ప్రకటిద్దాము.