21-1-2024 – ఆదివారం మొదటి ఆరాధన – మీరు తీగలు

స్తుతిగీతము – 1

సర్వేశ్వరా నీకే స్తుతి
సర్వము నీకే ప్రభు
ఆధారము ఆశ్రయము
నీవే నా యేసు “2”

నన్ను కన్న తండ్రి నన్ను కొన్న తండ్రి
రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి

చిన్న చిన్న గొర్రె పిల్లలము
కాపరి మము కాయుము
అమ్మ నాన్న అన్ని నీవే
ఆదరించి సేదదీర్చుము

పరిగెత్తెదా కొండ కోనల్లోనా
పచ్చని పచ్చికలో
అండ దండా కొండా
కోనా నీవే నా యేసు

స్తుతిగీతము – 2

చాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడు
నేను నమ్మిన నా యేసుడు
చాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడు
నాకు దొరికిన నా యేసుడు
మాటలలో చెప్పలేనంత
చేతలలో చూపలేనంత
చాలా చాలా చాలా చాలా – చాలా గొప్పోడు
చాలా చాలా చాలా చాలా – చాలా మంచోడు
||చాలా||

నా పాప శిక్షను తాను మోసెను
నా కొరకు కలువారిలో త్యాగమాయెను
తన ప్రేమ వర్ణనాతీతం
తన జాలి వర్ణనాతీతం
||మాటలలో||

యేసయ్యకు సాటి ఎవ్వరు లేరు
జగమంతా వెదకినా కానరారులే
తన ప్రేమ వర్ణనాతీతం
తన జాలి వర్ణనాతీతం
||మాటలలో||

ఈలాంటి ప్రేమ ఎక్కడ లేదు
వింతైన ప్రేమ అంతు చిక్కదు
కలువరిలో చూపిన ప్రేమ
శాపమునే బాపిన ప్రేమ
||మాటలలో||

స్తుతిగీతము – 3

దేవుని ఆనందం నను కమ్మును
ఉన్నతమైన స్థలములు నను ఆహ్వానించున్
పరలోక స్వాస్థ్యముతో పోషించును నన్ను
ఆకాశపు వాకిళ్లు తెరుచును నాకు

నేను పైకి లేచెదను పై పైన ఎగిరెదను
నేను వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదను
కోల్పోయినవన్ని రెండింతలుగా మరలా పొందెదను

బాధించు బంధకములు ఈ దినమే విప్పబడున్
నా ముందు అడ్డుగా నిలిచే సంకెళ్లు తెగిపడున్
నాకున్న దర్శనం నెరవేర త్వరపడున్
అనుకూల ద్వారములు నా కొరకు తెరవబడున్

నేను పైకి లేచెదను పై పైన ఎగిరెదను
నేను వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదను
కోల్పోయినవన్ని రెండింతలుగా మరలా పొందెదను

నీతి సూర్యుడు నా పైన ఉదయించును
యేసుని రెక్కల క్రింద ఆరోగ్యమొందెదను
నా కాలి క్రింద దుష్టుడు ధూళిగా మారును
నింగిలో మెరుపు వలె శత్రువు కూలును

నేను పైకి లేచెదను పై పైన ఎగిరెదను
నేను వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదను
కోల్పోయినవన్ని రెండింతలుగా మరలా పొందెదను

ఆరాధన వర్తమానము

మన దేవుడు మన జీవితములను కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ దేవదేవుని సన్నిధిలో మనము ఉన్నాము. ఆయనను స్తుతించేవారముగా మనము ఉండాలి. ఎప్పుడు ఆయనను హృదయమారా స్తుతించేవారముగా ఉంటాము? ఆయన ఎవరో ఎరిగినప్పుడు మాత్రమే.

ప్రభువా, తరతరములనుండి మాకు నివాసస్థలము నీవే. పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు -కీర్తనలు 90:1-2

ఈ వాక్యమును గమనిస్తే, తరతరములనుండి నీవే మాకు నివాస స్థలము అని కీర్తనా కారుడు చెప్పుచున్నాడు. అంతే కాక పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు అని చెప్పుచున్నాడు.

అయితే ఈ వాక్యములో మన జీవితమును చూస్తే, నివాస స్థలము గా మన దేవుడు ఉన్నాడు. నివాసము అనగా మనము ఉండదగిన ప్రదేశము గా చూడవచ్చు. తరము అనేది సమయమును సూచిస్తుంది. ఈ సమయము మారవచ్చు. అనగా ఒక సమయము మంచిగా ఆశీర్వాదకరముగా ఉండవచ్చు, ఒక సమయము కష్టముగా, ఒక సమయము సమాధానము లేనట్టుగా ఉండే విధముగా మారుతుంది. ఇలా ఏ సమయమైనా, ఏ తరమైనా మనము నివసింపదగిన స్థలము, ఉండదగిన స్థలము ఆయన అయి ఉన్నాడు. మనకు ఆయన దేవుడు గా ఉంటున్నాడు.

శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై యున్నాడు.౹ సమీ పింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్. -1 తిమోతికి 6:15-16

మనకు నివాస స్థలముగా ఉన్న వ్యక్తి, మనము ఉండదగిన వ్యక్తి అయిన మన దేవుడు శ్రీమంతుడు అయి ఉన్నాడు. ఒక సమయములో మనకు ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ, మనము నివాసముంటున్న మన దేవుడు శ్రీమంతుడు అయి ఉన్నాడు. ఆయన మన స్థితిని మార్చగలిగేవాడు.

మనము దేవునిని వ్యక్తిగతముగా ఆరాధించాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. ప్రార్థనలో మన మాటలు ఆయన వద్దకు చేర్చబడుతున్నాయి. ఆరాధనలో ఆయన మన వద్దకు దిగి వచ్చేవాడుగా ఉన్నాడు.

ప్రార్థనలో మనము అడిగినదానిని అంగీకరించి దానిని నెరవేర్చేవాడిగా ఉన్నాడు. ఆరాధనలో మనము ఆయన గూర్చి ఒప్పుకొన్న దానిని నెరవేర్చేవాడిగా ఉన్నాడు.

శ్రీమంతుడు అనగా సమృద్ధిగలవాడు. మనము శ్రీమంతుడి వద్ద నివసిస్తున్నాము అంటే మనము దేవుని సమృద్ధిలో నివసిస్తున్నాము అని అర్థము. ఒకవేళ సమృద్ధి లేని స్థితి గనుక వస్తే, ఆయన సమృద్ధిని బట్టి మనకు సమృద్ధి అనుగ్రహించబడవలసినదే!

అద్వితీయుడు అంటే ఆయన వంటి వాడు మరొకడు లేడు. సర్వాధిపతి అంటే సర్వము అధికారము కలిగినవాడు. అనగా మన జీవితములో సర్వముపై ఆయన వలే అధికారము కలవాడు మరొకడు లేడు. ఈ సత్యము గ్రహించినవారు ఇక దేనికీ భయపడరు.

యుక్తకాలము అనగా ఒక ఉదాహరణ ద్వారా చూద్దాము. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మన దగ్గర ఉన్న దానిని బట్టి మనము అవసరమైన దానిని కొనుక్కోగలము. అయితే మనకు అవసరము ఉంది గానీ మన వద్ద సరిపడా ధనము లేదు. ఆ అవసరము తీరవలసిన సమయములో దేవుడు స్పందించే సమయమే యుక్తకాలము. అనగా ఆయన నీ జీవితములో సమయమును పోనియ్యడు.

సమృద్ధికలవాడై, నీ జీవితములో సర్వముపై అధికారము కలవాడు అయిన నీ దేవుడు, సమయమును పోనియ్యక నీ ప్రతి అవసరములో స్పందించేవాడు అనేది ఈ దినము ప్రభువు తెలియచేసిన సత్యము.

ఆకాశపక్షుల కంటే శ్రేష్టముగా తన మహిమ కొరకై ఏర్పాటు చేసిన జీవితములు మనవి. గనుక మనము కనుపరచే నమ్మకత్వమే మన జీవితమును స్థిరపరచును.

తన ప్రత్యక్షతను కనుపరచే దేవుడు అనగా, మన అవసరము తీరుటకు ఆయన ఏర్పాటు చేసిన మార్గమును మనకు తెలియచేసి, వాటి ద్వారా సహాయమును అందించి ప్రత్యక్షత కనుపరుస్తాడు.

అందుకే ఏడారులలో నదులు పారచేసేవాడు అని ప్రవక్తలు కొనియాడారు. మన దేవుడు సమయమును పోనిచ్చేవాడు కాడు. దేని కాలమున సమస్తము చక్కగా ఉండునట్లు నియమించినవాడు ఆయన. గనుక ఆయనను ఎరిగిన తన ప్రజల జీవితములలో సమయమును పోనియ్యడు.

యేసుయొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసుయొక్క మర ణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడును వహించుకొని పోవుచున్నాము.౹ ఏలయనగా, యేసుయొక్క జీవము కూడ మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు, సజీవులమైన మేము ఎల్లప్పుడు యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము.౹ కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి.౹ కృప యెక్కువమంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున, సమస్తమైనవి మీకొరకై యున్నవి. కాగా -2 కొరింథీయులకు 4:10-13

ఏ సమస్య వచ్చినా సరే మనము భయపడవలసిన అవసరము లేదు. మరణకరమైన స్థితిలో దేవుని జీవము ప్రత్యక్షమగును అని పౌలు విశ్వసించి మాటలాడిన ప్రకారము, మన స్థితిలో విశ్వసించిన మన జీవితములో కూడా ప్రత్యక్షమగును.

మనకు వచ్చిన సమస్యను బట్టి మన జీవితములను మనము కోల్పోము గానీ, మన దేవుని ప్రత్యక్షత కనుపరచబడి, మన ద్వారా మన దేవుడు మహిమపరచబడతాడు.

మన దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు గనుక మనము దేనికీ భయపడనవసరము లేదు. ఆయన మాత్రమే నివాసస్థలముగా ఉండుట అనేదే మనము చేయదగినది.

ఇంతవరకు మన యెడల కనుపరచిన ప్రత్యక్షతను బట్టి మనము ఆయనను స్తుతించాలి. యుగయుగములకు నీవే నా దేవుడు అని ఒప్పుకుందాము. మన ఆరాధనలో ఆయన దిగి వచ్చేవాడిగా ఉన్నాడు. దిగి వచ్చిన ఆయన “యుగయుగములకు నీవే నా దేవుడవు” అని నీవు ఒప్పుకున్నదానిని బట్టి నీవున్న సమయములో దేవుడిగా ప్రత్యక్షపరచుకుంటాడు. క్రియల ద్వారా తనను ప్రత్యక్షపరచుకుంటాడు. తనను గూర్చిన సాక్ష్యము నీ జీవితములో నిలిపేవాడుగా ఉంటాడు.

ఆరాధన గీతము

శుద్ధుడా పరిశుద్ధుడా
ఘనుడా మహాఘనుడా
యుగయుగములకు దేవుడవు నీవే
తరతరములు కీర్తించెదను నిన్నే

యేసయ్యా యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా

ఎన్నెన్నో శోధనలు
యోసేపును చుట్టుముట్టినా
ఉన్నతముగా హెచ్చించావు
నా ప్రతి శోధనలో
నీవే నా తోడుండి
నీవు నన్ను స్థిరపరచావు

యేసయ్యా యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా

యోసేపును హెచ్చించిన దేవా నన్ను కూడా హెచ్చించువాడా! యుగయుగములకు నాకు నీవే దేవుడవు! ఒప్పుకుంటున్నాను ప్రభువా!

ఎన్నెన్నో శోధనలు
నన్ను చుట్టుముట్టినా
ఉన్నతముగా హెచ్చించావు
నా ప్రతి శోధనలో
నీవే నా తోడుండి
నీవు నన్ను స్థిరపరుచుదువు

 

వారము కొరకైన వాక్యము

ఈరోజు “మీరు తీగెలై ఉన్నారు” అనే విషయమును గూర్చి నేర్చుకుందాము.

ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు.౹ -యోహాను 15:5

తీగెలు మీరు అనే ప్రకటన ఇక్కడ జరిగింది. అనగా ద్రాక్షావల్లిలో ఉన్న జీవము నీలో ప్రవహిస్తుంది అనే సత్యము నీవు గుర్తించాలి. మనము తీగెలు గనుక ఆయనలోని జీవము మనలో ప్రవహించి మన జీవితము ఫలించే జీవితముగా ఉంటుంది.

అయితే మనము ఎలా ఉంటే యేసయ్య అనే ద్రాక్షవల్లికి తీగెగా ఉండగలము? భౌతికముగా ఒక ద్రాక్షావల్లిని చూసినప్పుడు దాని ఫలమును బట్టే అది ద్రాక్షతీగెగా మనము గుర్తిస్తాము. అలాగే మనము కనపరచే ఫలములను బట్టే మనము తీగెలుగా గుర్తించబడతాము.

మనము ఈరోజున పరీక్షించుకోవాలి. తీగెగా ప్రకటించబడిన మనలో పనికిరానివి ఏమైనా ఉన్నాయా? ద్రాక్షావల్లి, మరియు తీగెలను గమనిస్తే, వల్లిలో ఉన్నది తీగెలలోనికి వెళ్ళి ఆ తీగెలను ఫలింపచేసేదిగా ఉంది. యేసయ్య ద్రాక్షావల్లిగా మనము తీగెలుగా ఉన్నాము కాబట్టి, యేసయ్యలో ఏముంది మనము ఎలా ఉండాలి అనేది గ్రహించినప్పుడు మన జీవితములు ఫలభరితముగా మార్చబడతాయి.

అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు.౹ -1 పేతురు 2:9

పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయుట అనగా యేసయ్య యొక్క గుణములను కలిగి ఉన్నాడో అదే గుణములను ప్రచురము చేయుటకు తీగెగా చేయబడ్డాము.

ఆయన పరిశుద్ధుడు గనుక ఆయనలో తీగెగా ఉన్న మనలో పరిశుద్ధత కనపరచునట్లుగా మన జీవితము ఉండాలి. మనమున్నవి చివరి ఘడియలు గనుక సత్యమును గ్రహించి మనలను మనమే సిద్ధపరచుకోవాలి.

ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; అనగా ఆయన పరిశుద్ధుడు గనుక మనము పరిశుద్ధత కలిగి జీవిస్తే మనము బహుగా ఫలిస్తాము. అయితే మనము ఆయనవంటి పరిశుద్ధత కలిగిఉండకుండా అడ్డుగా, దేవునికి మహిమకరము కానిది ఏమైనా ఉంటే అది సరిచేసుకోవాలి. అలా కాని యెడల పరిశుద్ధతను మనము కోల్పోతాము తద్వారా ఫలము పోగొట్టుకొనేవారముగా అయిపోతాము.

చాలా సందర్భాలలో, మంచి జీవితముగా దేవునిచేత ప్రకటించబడిన మనము మన ఫలమును పోగొట్టుకొనే రీతిలో ఉండిపోతున్నాము. దానికి కారణము ఆయన గుణములను మన జీవితము ద్వారా కనుపరచాలి అనే విషయము మనము ఎరిగి ఉండకపోవడమే! అయితే ఈరోజు దేవుడు జ్ఞాపకము చేసినదానిని బట్టి సరిచేసికొందాము.

క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి -ఫిలిప్పీయులకు 2:5

ఆయన వల్లిగా ఉన్నాడు, మనము తీగెలుగా ఉన్నాము. వల్లిగా ఆయన ఒక మనస్సు కలిగి ఉన్నాడు గనుక తీగెలుగా ఉన్న మనము కూడా అదే మనస్సు కలిగి ఉండాలి.

ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని౹ మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.౹ మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించు కొనెను.౹ -ఫిలిప్పీయులకు 2:6-8

ఆయన మనస్సు ఎటువంటిది? తగ్గింపు కలిగిన మనస్సు, విధేయత కలిగిన మనస్సు. మనము కూడా తగ్గింపు కలిగి, విధేయయ కలిగి ఖచ్చితముగా ఉండాల్సిందే. పరలోకములో ఉన్న 24 పెద్దలు మంచి జీవితములు జీవించినటువంటివారు పరలోకములో వారి కిరీటములను దేవుని యెదుట పడవేసి సాగిలపడ్డారు.

మన పితరులు దేవుని మాటకు విధేయత చూపినదానిని బట్టే వారి జీవితములు శ్రమలగుండా వెళ్ళారు. మనము ఎలా ఉంటున్నాము? మన ఆత్మలో వినబడుతున్న గద్దింపు వాక్కును త్రోసివేస్తున్నామా? అయితే మనం ఫలింపును కోల్పోతున్నాము. అయితే మనము ఖచ్చితముగా దేవుని మాటకు విధేయత చూపించవలసినదే. యేసయ్య మనసులో దేవుని మాట మాత్రమే ఆఖరు. అలాగే యేసయ్య తగ్గింపు కలిగినవాడుగా ఉన్నాడు. ఇదే గుణలక్షణములు మనము కలిగి ఉండాలి.

తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుట లేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలుచేయుచున్నాడు.౹ తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి; లేదా యీ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి.౹ -యోహాను 14:10-11

యేసయ్య తండ్రితో ఏకమైనవాడుగా ఉండే గుణము కలిగినవాడు. మనము యేసయ్యకు తీగెగా ఉన్నాము. యేసయ్య లో తండ్రితో ఏకమై ఉండే జీవము ఉంది. మనము కూడా యేసయ్యతో ఏకమై ఉండే జీవితము కలిగి ఉండాలి.

యేసయ్య తన తండ్రి క్రియలు జరిగించునట్లు యేసయ్య జీవితము ఉంది. యేసయ్యను అంగీకరించిన మన జీవితములో కూడా దేవుని కార్యములు జరిగించబడవలసిన విధముగా మనము ఉండాలి. తండ్రి క్రియలు అన్నీ సూపర్ నేచురల్ క్రియలు. యేసయ్య జీవితములో సూపర్ నేచురల్ క్రియలే జరిగించాడు. ఆయనలో ఉన్న మన ద్వారా కూడా దేవుని సూపర్ నేచురల్ కార్యములు మన జీవితము ద్వారా జరగాలి! ద్రాక్షావల్లి వలే తీగెలుగా ఉన్న మన జీవితములో అదే లక్షణము కనబడాలి. ఒకవేళ సూపర్ నేచురల్ కార్యములు జరగట్లెడు అంటే, ఆయనతో ఏకమైన జీవితము లేదు అని అర్థము. అయితే ఆ పనికిరానిది తీసివేద్దాము.

నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను.౹ -యోహాను 9:5
మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండమీదనుండు పట్టణము మరుగై యుండనేరదు. -మత్తయి 5:14

యేసయ్య లోకమునకు వెలుగై ఉన్నారు. ఆయనలో తీగెలుగా ఉన్న మనము కూడా వెలుగై ఉండాలి. కొండమీద ఉండే పట్టణము మరుగై ఉండనేరదు. అనగా మన జీవితము మరుగున పడే జీవితము కాదు గానీ, ఉన్నతమైన స్థానములో ఉండవలసినదే అయితే దానికి ఏమి చేయాలి అంటే, “వెలుగు గా ఉండాలి”. లోకము అంతటా చీకటి ఉంది. ఆ చీకటిలో వెలుగా మనము కనపడాలి గానీ ఆ చీకటిలో కలిసిపోకూడదు. చీకటి పరిస్థితులలో మనము ఎలా నిలబడతామో అనే పరీక్ష ప్రభువు పెడతాడు. ఆ పరీక్ష లో మనము ఉత్తీర్ణులమైనప్పుడు ఖచ్చితముగా వెలుగుగా కనపరచబడతాము.

వాక్యమే వెలుగు, మనము ఉన్న చీకటి పరిస్థితిలో మనము వాక్యము ప్రకారము నిలబడటమే వెలుగును కనపరచడమే. మనలను పరీక్షించుకుందాము. దేవుని సమయమును దొంగిలించే పనికిరాని తీగె ఏముంది నీ జీవితములో? మన జీవితము కొండమీద ఉండే పట్టణము అనగా ఉన్నతమైన ఉద్దేశ్యము కొరకు ఇవ్వబడిన జీవితము. గనుక వాక్యమునకు వ్యతిరేకముగా పనిచేసే ప్రతీదీ తీసివేద్దాము.

  • మనము పరిశుద్ధత కలిగి ఉండాలి
  • విధేయత మరియు తగ్గింపు కలిగి ఉండాలి
  • తండ్రితో ఏకమై ఉండాలి
  • తండ్రి క్రియలు జరిగేలా జీవితమును సిద్ధపరచుకోవాలి.
  • యేసయ్య వెలుగుగా ఉన్న విధముగా మనము కూడా చీకటి పరిస్థితులలో వెలుగును కనబరచాలి.