14-1-2024 – ఆదివారం రెండవ ఆరాధన – దేవునియొక్క ప్రణాళిక నీలో నెరవేర్చబడటానికి

స్తుతిగీతము – 1

గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని
గళమెత్తి నిన్ను నేను గానమాడెదన్
రాజుల రాజువని రక్షణ దుర్గమని
నీ కీర్తిని నేను కొనియాడెదన్
హల్లెలూయా నా యేసునాథా
హల్లెలూయా నా ప్రాణనాథా (2)
||గొప్ప||

అద్భుత క్రియలు చేయువాడని
ఆశ్చర్య కార్యాలు చేయగలడని
అద్వితీయుడవని ఆదిసంభూతుడని
ఆరాధించెద నిత్యం నిన్ను (2)
||హల్లెలూయా||

సాగరాన్ని రెండుగా చేసినాడని
సాతాను శక్తులను ముంచినాడని
సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని
సాక్ష్య గీతం నే పాడెదన్ (2)
||హల్లెలూయా||

స్తుతిగీతము – 2

ఓ హల్లెలూయ ఓ హల్లెలూయని
స్తోత్రాలాపన చేసెదన్
స్తోత్రము…స్తోత్రము…స్తోత్రము…స్తోత్రము

నీవు నా సొత్తని పేరు పెట్టి
నన్ను పిలచిన తండ్రీ స్తోత్రము
ప్రత్యేకపరచి కృపచేత
నన్ను పిలచిన తండ్రీ స్తోత్రము

ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి
పిలచిన తండ్రీ స్తోత్రము
ఏర్పరచబడిన పరిశుద్ధ జనముగ
పిలచిన తండ్రీ స్తోత్రము

స్తుతిగీతము – 3

హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు – హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు (2)

రాజుల రాజా ప్రభువుల ప్రభువా – రానైయున్నవాడా (2)
మహిమా మహిమా ఆ యేసుకే – మహిమా మహిమా మన యేసుకే (2)
||హల్లెలూయ||

సూర్యునిలో చంద్రునిలో – తారలలో ఆకాశములో (2)
మహిమా మహిమా ఆ యేసుకే – మహిమా మహిమా మన యేసుకే (2)
||హల్లెలూయ||

ఆశ్చర్యకరుడా ఆదిసంభూతుడా – యుగయుగముల నిత్యుడా (2)
మహిమా మహిమా ఆ యేసుకే – మహిమా మహిమా మన యేసుకే (2)
||హల్లెలూయ||

కొండలలో లోయలలో – జీవులలో ఆ జలములలో (2)
మహిమా మహిమా ఆ యేసుకే – మహిమా మహిమా మన యేసుకే (2)
||హల్లెలూయ||

ఆరాధన వర్తమానము

దేవుని వాక్కు ద్వారా దేవుని మహిమ ప్రత్యక్షపరచబడేదిగా ఉంటుంది. దేవుని సన్నిధిలో ఉన్న మనము దేవుని స్తుతిస్తాము. ఆయనను స్తుతించడము ద్వారా, ఆయనను ఆరాధించడము ద్వారా ఆయన నామమును ఒప్పుకుంటున్నాము. మనము ఎప్పుడైతే ఆయన నామమును ఒప్పుకుంటున్నామో, ఏ విషయములో ఆయన నామును ఒప్పుకుంటున్నామో, ఆ విషయము ప్రత్యక్షపరచబడుతుంది.

ఉదయకాలము సిద్ధపరచబడిన గంప గూర్చిన మర్మము ప్రభువు తెలియచేసాడు. సిద్ధపరచబడిన గంపలలో రొట్టెలు ఉంచబడ్డాయి. ఆ రొట్టెలో పంక్తిలో కూర్చున్నారో వారందరికీ వడ్డించబడింది. అది ఒక నియమమువలే దేవుడు మన జీవితములో చూడాలి అని కోరుకుంటున్నారు. పంక్తిలో కూర్చోవాలి అంటే యేసయ్య దగ్గరకు రావాలి. ఆయన దగ్గరకు వచ్చిన వారిని పంక్తిలో కూర్చుండబెట్టారు, అనగా ఖచ్చితముగా సిద్ధపరచినది వడ్డించబడుతుంది. ఆయన ఆశీర్వాదము పొందునట్లుగా మన అందరికీ ఒక స్థానము ఇవ్వబడింది.

మనకు బలమైయున్న దేవునికి ఆనందగానము చేయుడి యాకోబు దేవునిబట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన యెత్తుడి గిలకతప్పెట పట్టుకొనుడి స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. -కీర్తనలు 81:1-2

మనకు బలమైయున్న దేవుడు. దావీదైతే నా పక్షమున ప్రతిదండన చేయువాడుగా ఉన్నాడు అని చెప్పుచున్నాడు. ఆయన బలమైన దేవుడుగా మన పక్షమున నిలిచి ఉన్నప్పుడు ఏ పరిస్థితి మన జీవితములను అడ్డుకోగలదు? ఏ కార్యము జరగాలన్నా బలమును బట్టే జరుగుతుంది. ఒకవేళ ధనము బలముగా ఉంటే కొనవలసిన ప్రతి దానిలో సులభముగా కొనగలుగుతాము, ఆరోగ్యము బలముగా ఉంటే, ఏమి తిన్నా అరిగిపోతుంది.

యెహోవా నిరంతరము ఏలును సీయోనూ, నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును యెహోవాను స్తుతించుడి. -కీర్తనలు 146:10

బలమైన వాడు ఏలేవాడుగా ఉన్నాడు. దేనిని ఆయన ఏలేవాడుగా ఉన్నాడు?

ఏలుట అంటే పరిపాలించుట, నా జీవితములో ప్రతి సమయములో అనగా మంచి సమయమైనా కష్ట సమయమైన ప్రతి సమయములోనూ ఆయన బలమైనవాడుగా మన జీవితములను పరిపాలించేవాడుగా, పోషించేవాడుగా, కాపాడేవాడుగా ఉన్నాడు.

యెహోవాయే యెరూషలేమును కట్టువాడు చెదరిన ఇశ్రాయేలీయులను పోగుచేయువాడు -కీర్తనలు 147:2

మనకు ఆయన బలమై ఉన్నడు కాబట్టి మన జీవితములలో చెదరినవన్నీ ఆయన సమకూర్చేవాడుగా ఉన్నాడు. ఒకప్పుడు మనకు బలము లేని కారణాన శత్రువు మన వద్దనుండి చెదరగొట్టేసింది. ఇలా చెదరిపోయినవి ఎక్కడ ఉన్నాయి? అపవాది అధికారములో ఉన్నాయి.

ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పెట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను – కొలస్సీ 2:13

ఇప్పుడు మన దేవుడు మనకు బలమై ఉన్నాడు గనుక అపవాది అధికారములో ఉండిపోయిన స్వాస్థ్యమును మన కొరకు విడిపించుటకు ఆ అపవాది బలమునకు వ్యతిరేకముగా మన దేవుని బలము ప్రదర్శించేవాడుగా ఉన్నాడు. గనుక ఇప్పటివరకు మనము పోగొట్టుకున్నది బాహాటముగా కనుపరచబడుతుంది. అనగా అందరి ముందు ప్రభువు మనలని సాక్షిగా నిలబెట్టేవాడుగా ఉన్నడు. గనుకనే మన బలమైన దేవునిని మనము స్తుతించాలి, ఘనపరచాలి.

గుండె చెదరినవారిని ఆయన బాగుచేయువాడువారి గాయములు కట్టువాడు. -కీర్తనలు 147:3

దేవునికే స్తోత్రము కలుగును గాక! మనకు బలమైన దేవుడు మన జీవితమును బాగు చేసేవాడిగాను, సాక్ష్యముగాను నిలబెట్టేవాడుగా ఉన్నాడు గనుక మనము ఆయనను ఆరాధించుటకు అర్హుడు. నీవు ఎక్కడ పడిపోయావో అక్కడ నుండి లేపడానికి ఆయన బలమైనవాడిగా నీ జీవితములో ఉంటున్నాడు. అప్పుడు చెప్పబడిన మాటలు ఖచ్చితముగా ప్రత్యక్షపరచబడతాయి.

మన యేసయ్య సత్యము ఆయన గనుక చెప్పినది కనపరుస్తాడు. ఆ యేసయ్య ఈరోజు నీ జీవితములో తన బలమును ప్రయోగిస్తాను అని చెప్పుచున్నాడు. గనుక ఇప్పుడు నీవు ఈ సత్యమును నమ్మాలి. మనకు ఆయన బలమై ఉంటే ఎంత బలమైనది మనముందుకు వచ్చినా సరే అది నిలువదు.

ఆరాధన గీతము

నా బలమంతా నీవేనయ్యా
నా బలమంతా నీవేనయ్యా

అలలు లేచిననూ – తుఫాను ఎగసిననూ
కాపాడే దేవుడవయ్యా
నీవు ఎన్నడు మారవయ్యా

సోలిన వేళలలో – బలము లేనప్పుడు
(నన్ను) ఆదరించి నడిపావయ్యా
యెహోవా షాబోత్ నీవే

జీవం నీవేనయ్యా
స్నేహం నీవేనయ్యా
ప్రియుడవు నీవేనయ్యా
సర్వస్వం నీవేనయ్యా

నా దేవా నా బలమంతా నీవే అని ఒప్పుకోవడమే ఆయన నామమును ఒప్పుకోవడము అదే ఆరాధించడం. ఈ సత్యము ఎరిగి ఆరాధిస్తే నీవు ఒప్పుకున్నది ఖచ్చితముగా స్థిరపరచబడుతుంది.

బాగుచేయబడవలసిన జీవితములు, ఒక బిందె చొట్టబడిపోయిన రీతిగా క్రమము తప్పిన జీవితములు, డిస్టర్బ్ చేయబడిన జీవితములు ఇప్పుడు బాగుచేస్తాను అని ప్రభువు చెప్పుచున్నాడు. నీవు ఉండవలసిన రీతిలో ఉండులాగున బాగుచేస్తాను అని ప్రభువు చెప్తున్నాడు గనుక ఈరోజు నీవు చేసే ఆరాధన నీ జీవితమును బాగు చేస్తుంది. ముగింపు జరగవలసిన దానికొరకు, ముందుగా విడుగల తరువాత ఆశీర్వాదము. ఆ విడుదలయే ఈరోజు బాగుచేయబడుట.

తప్పిన క్రమమును మరలా సరిచేస్తాను ప్రభువు చెప్పుచున్నాడు. గనుక ఆయన బలమును ఒప్పుకో! అప్పుడు క్రమము తప్పిన నీ జీవితములో ఆయన బలము బాగుచేసేదిగా ఉంటుంది.

 

వారము కొరకైన వాక్యము

మన జీవితములలో మన శక్తిని బట్టి, మనము కలిగినదానిని బట్టి మనము చేసుకోలేనివి అనేకములు ఉన్నవి. అయితే దేవుని వాక్కును బట్టీ, ఆయాన్ సన్నిధిని బట్టి అనేకమైనవి మనము పొందుకోవచ్చు. మన దేవుడు తన వాక్కును పంపి మనము పడినగుంటలోనుండి లేపేవాడుగా ఉన్నాడు. అనగా మనము ఎక్కడైతే ఆగిపోయామో, అక్కడనుండి మనము లేపబడతాము. దేవుని వాక్కు జీవమును కలుగచేసేదిగా ఉంది.

ప్రతి ఆదివారము మన జీవితములకు దేవుడు ఇచ్చిన అపాయింట్మెంట్ దినము. ఆ దినమున మన ఆత్మకు అవసరమైన ప్రతీ విషయమును గూర్చి తన వాక్కును విడుదల చేసేవాడుగా ఉంటాడు గనక, ఆయన సన్నిధిలో ఉన్న మనము అందరమూ ధన్యులము. ఎక్కడ మరుగుచేయబడ్డారో, ఎక్కడ పడిపోయారో, ఎక్కడ ఆగిపోయారో అక్కడ నుండి ఆయన బలముచేత తిరిగి లేపుతున్నాడు.

గర్భఫలము దయచేసేది దేవుడే. గర్భఫలము ఇచ్చాడు అని చెప్పటానికి బాహ్యముగా ఏమీ కనపరచకపోయినప్పటికీ, ఒక చిన్న ఆధారము మొదటిగా కనపరచబడుతుంది. అయితే తొమ్మిది నెలల తరువాత అదే చిన్న ఆధారము, బిడ్డగా బయలుపరచబడుతుంది. మన జీవితములో కూడా ముగించబడవలసినదాని కొరకు ఆధారము ఈరోజే కనబడుతుంది. ఎలా అయితే గర్భఫలము విషయములో క్రమక్రమముగా ఆధారము బలపరచబడుతుందో, నీ జీవితములో ముగించబడవలసినదానికొరకు కూడా ముందుకు వెళ్ళుతుండగా బలమైనవి కనపరచబడతాయి.

ఈ వారము ఏ విషయములో ఆధారము కనపడుతుందో, కనిపెట్టండి. ప్రవక్త నోట దేవుడు పలికించినమాట నమ్మి కనిపెట్టండి.

ఈరోజు దేవుని ప్రణాళిక మన జీవితములో ఎలా నెరవేరుతుంది అని నేర్చుకుందాము. దేవుని ప్రణాళికలు మన అందరిపై ఉన్నాయి అని మనము అందరము నమ్ముతాము. అయితే దానిని అమలుపరచటములో దేవుని పద్ధతి ఎలా ఉంది అని లేఖనముల ద్వారా నేర్చుకుందాము.

యేసయ్య భూలోకములో “నశించినదానిని వెదకి రక్షించుటకు” అనే ప్రణాళిక కలిగి వచ్చాడు. జక్కయ కొరకు మాత్రమే కాదు గాని, జక్కయ్య ద్వారా మొత్థము గ్రామమును రక్షించాలి అనేది దేవుని ప్రణాళిక. సమరయ గ్రామమును రక్షించుట అనేది దేవుడి ఉద్దేశ్యము. అయితే ఆ ఉద్దేశ్యము నెరవేర్చుకొనుటకు సమరయ స్త్రీ ని ఏర్పరచుకున్నారు.

ఇక్కడ మనము గ్రహించవలసినది ఏమిటి అంటే లోకములో నశిచినదానిని వెదకి రక్షించుట అనేది దేవుని ఉద్దేశ్యము. ఆ ఉద్దేశ్యము కొరకు నిన్ను నన్ను ఏర్పాటుచేసుకున్నాడు. సమరయ గ్రామము విషయములో చూస్తే, ఒక స్త్రీ ని ప్రభువు మొదటిగా దర్శించాడు. అయితే ఆ స్త్రీ కి తనను దర్శిస్తున్నాడు అనిగానీ అసలు ఎందుకు దర్శిస్తున్నాడో అని గానీ తెలియదు.

ఆయన సమరయ మార్గమున వెళ్లవలసివచ్చెను గనుక౹ యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను.౹ అక్కడ యాకోబు బావి యుండెను గనుక యేసు ప్రయాణమువలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను; అప్పటికి ఇంచుమించు పండ్రెండు గంటలాయెను.౹ సమరయ స్త్రీ ఒకతె నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు–నాకు దాహమునకిమ్మని ఆమె నడిగెను.౹ -యోహాను 4:4-7

ఇక్కడ చూస్తే, సాధారణముగానే అక్కడ బావి వద్ద అలసిన రీతినే కూర్చున్నట్టుగానే కనపడుతుంది. అయితే దేవుని ప్రణాళిక వేరు. “ఆయన సమరయ మార్గమున వెళ్లవలసివచ్చెను” అనగా అటువైపు వెళ్ళుటకు ఒక కారణము ఉంది. అలాగే మన విషయములో కూడా మనము ఉన్న ప్రదేశములో ప్రభువు ప్రణాళిక నెరవేర్చుటకు మనలను ఏర్పరచుకున్నాడు. అయితే ఆ ప్రణాళిక నెరవేర్చుటకు మన వ్యక్తిగతమైన జీవితము కొనసాగించబడుతుండగా మనలను సాధారణమైన రీతిలోనే దర్శిస్తున్నాడు.

సమరయ స్త్రీతో కూడా సాధారణముగానే మాటలడుతూనే, తనను తాను బయలు పరచుకుంటున్నాడు. అలాగే మొదటగా దేవుడు మనలను దర్శిస్తాడు, ఆ తరువాత దేవుడు సిద్ధపరుస్తాడు. ఈ దినములలో మనపై దేవుని ప్రణాళిక ఉంది అని 90 శాతము అందరికీ తెలుసు గానీ, దేవుడు దాని కొరకు దర్శిస్తున్నాడు అనే సంగతి మాత్రము అనేకులకు తెలియదు. అయితే మనము జాగ్రత్తగా గమనిస్తే, మనలను దర్శిస్తున్నాడు అని, సిద్ధపరుస్తున్నాడు అని మనము తెలుసుకోగలము.

దావీదును చూస్తే, దావీదు పై దేవుని ప్రణాళిక ఏమిటి అంటే, సౌలుకు ప్రతిగా రాజుగా చేయడానికి దావీదును ఎన్నుకున్నాడు. అలా ఎన్నుకున్నాక, దావీదును సిద్ధపరచాడు. ఎలా అంటే, మొదట ఒక గొర్రెల మందను కాపాడుట అనే బాధ్యత దావీదుకు ఇచ్చాడు. ఎలుగుబంటి నోటనుండి, సింహము నోటనుండి దేవుడే తప్పించి దావీదును సిద్ధపరచాడు. తద్వారా ఆ పోరాటము ద్వారా మంచి యోధునిగా మలచుచున్నాడు. అలా సిద్ధపరచి తరువాత ఇశ్రాయేలీయుల వద్దకు తీసుకువెళ్ళాడు.

ఈ విషయము గ్రహించేవరకు దేవుడు తనను తాను కనపరచుకునేవాడుగా ఉన్నాడు. ఈరోజునుండి సమస్యలు ఒకదానినుండి మరొకటి వస్తుందా, నీవు పోరాటయోధుడవు. దేవుని రాజ్యములో నీవు ఒక సైనుకునిగా ఉన్నావు అని గ్రహించు. ఎలా నీ సమస్యలను జయించాలో ప్రభువు నేర్పుతున్నాడు. మొదట ఎలుగుబంటి, తరువాత సింహము, తరువాత గొల్యాతు ఇలా అనేకమైన పోరాటములకొరకు సిద్ధపరచేవాడుగా దేవుడు ఉన్నాడు. ఆ విషయము గుర్తించిన దావీదు నా వేళ్ళకు పోరాటము నేర్పుము అని అడిగాడు. అలాగే మనము కూడా ఎందుకు మనలను ఏర్పరచుకున్నాడో మనము గ్రహించినపుడు మనము కూడా సిద్ధపడగలుగుతాము.

మనము దేవుని చేత సిద్ధపరచబడినవారము. మన జీవితములు చూసుకుంటే ఏ విషయమైనా సరే చివరికి దేవునితోనే ముడిపడి ఉంటుంది. దేవుడు సిద్ధపరచిన తరువాత ఏమి జరుగుతుంది అని చూస్తే –

అప్పుడా స్ర్తీ–అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను.౹ -యోహాను 4:19
ఆ స్త్రీ తనకుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్లి౹ –మీరు వచ్చి, నేను చేసిన వన్నియు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి; ఈయన క్రీస్తుకాడా అని ఆ ఊరివారితో చెప్పగా౹ -యోహాను 4:28-29

గ్రహించిన తరువాత ఊరులోనికి వెళ్ళి యేసయ్య చెప్పమనకుండానే, ఆ స్త్రీ తనపై ఉన్న ఉద్దేశ్యము కొరకు తాను పని ప్రారంభించిన దానిగా ఉంది.

ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్ర్తీతో మాటలాడుట చూచి ఆశ్చర్యపడిరి గానినీకేమికావలెననియైనను, ఈమెతో ఎందుకు మాటలాడుచున్నావని యైనను ఎవడును అడుగలేదు.౹ -యోహాను 4:27

అయితే శిష్యులకు మాత్రము ఎందుకు యేసయ్య ఆ స్త్రీతో మాట్లాడుతున్నాడో ఎవరికీ తెలియదు. కానీ ఒకరోజు మాత్రము దేవుని ఉద్దేశ్యము బయలుపరచబడుతుంది.