స్తుతిగీతము – 1
ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చును
స్తుతింతున్ స్తుతింతున్ స్తుతిచేయుచుందునే
హల్లెలూయా ఆనందమే…. … హల్లెలూయా ఆనందమే
ఉన్నతుని చాటున్ సర్వశక్తినిడన్ ఎపుడుందునే
దేవుని చూచిచి ఆశ్రయకోటని తెలిపెద ఎపుడూ
హల్లెలూయా ఆనందమే…. … హల్లెలూయా ఆనందమే
తన రెక్కలతో నను కప్పి కాచి నడిపించున్
ఆయన వాక్యం ఆత్మీయ ఖడ్గము నాకు కేడెము
హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే
మార్గము లందు నను గావ దూతలు నాకుండు
రాతికి పాదము తగలకుండా-నన్నెత్తి పట్టుకొనున్
హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే
సింహములను త్రాచుపాములన్- త్రొక్కి నడిచెదన్
సాతానులోని శక్తిని జయించ-అధికారం నాకున్నది
హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే
స్తుతిగీతము – 2
నా ప్రాణమా సన్నుతించుమా
యెహోవా నామమును
పరిశుద్ధ నామమును
అంతరంగ సమస్తమా
సన్నుతించుమా
||నా ప్రాణమా||
ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమా
దోషములన్నియు క్షమియించెను ప్రాణ విమోచకుడు
దీర్ఘ శాంత దేవుడు
నిత్యము కోపించడు
||నా ప్రాణమా||
మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు
నీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును
దాక్షిణ్యపూర్ణుడు
నిత్యము తోడుండును
||నా ప్రాణమా||
స్తుతిగీతము – 3
ఆరాధించెదం ఆర్భాటించెదం – యేసుని సన్నిధిలో
ఆనందించెదం మరల ఆనందించెదం – దేవుని సన్నిధిలో
సాయంకాల నైవేద్యము వలె చేతులెత్తి స్తుతియించెదం
జిహ్వా ఫలము ప్రభుకర్పించి స్తుతి గీతము పాడెదము
యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడవు నీవేనయ్యా
యేసయ్యా యేసయ్యా స్తుతులకు అర్హుడ నీవేనయ్యా
యెరికో కోట గోడలన్ని కూలిపోయే – కాలిపోయే
ఇశ్రాయేలు ప్రజలంతా కూడి ఆరాధించగా – ఆర్భాటించగా
స్తుతులపై ఆసీనుడా యేసయ్యా
మా ప్రార్ధనలు ఆలకించువాడా
స్తుతియాగము చేయు వాడే
నిన్ను మహిమ పరచు వాడు ||యేసయ్యా||
యూదా దేశము మీదికి శత్రు సైన్యము – దండెత్తగా
యెహోషాపాతు తన ప్రజలతో స్తుతియించగా – స్తోత్రము చేయగా
దేవుడే యుద్ధము జరిపెను
అద్భుత జయమును పొందిరి
బెరాకా లోయలో కూడిరి
కృతజ్ఞతా స్తుతులు చెల్లించిరి ||యేసయ్యా||
ఆరాధన వర్తమానము
దేవునిని ఆరాధించడానికి వచ్చిన మనము ఏ విధముగా ఉండాలి? సంతోషముగా ఉత్సాహముగా ఉండాలి. ఆ ఉత్సాహము ఎప్పుడు కలుగుతుంది అంటే, ఆ దేవుడు ఏమై ఉన్నాడో, ఏ విధముగా నీ జీవితానికి ఎలా ఆధారమై ఉన్నాడో తెలిసి ఉంటే, ఖచ్చితముగా ఉత్సాహముగా ఉంటాము.
నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును అని పాట పాడుతున్నాము. అయితే ఎందుకు సన్నుతించాలి అని ఎరిగి ఉంటే అప్పుడు మనము పాడే పాట కు అర్థము ఉంటుంది. దేవుడు ఉత్సాహముగా స్తుతించువారిని దేవుడు ప్రేమిస్తాడు.
దావీదైతే సత్యమును గ్రహించినవాడుగా తన దేవునిని ఎల్లప్పుడు ఉత్సాహముగా స్తుతించాడు. దావీదు స్తుతించిన దేవునినే మనము కూడా స్తుతించుచున్నాము.
యెహోవా జీవముగలవాడు నా ఆశ్రయదుర్గమైనవాడు స్తోత్రార్హుడు నాకు రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు మహోన్నతు డగును గాక ఆయన నా నిమిత్తము ప్రతిదండనచేయు దేవుడు ఆయన నా నిమిత్తము పగ తీర్చు దేవుడు జనములను నాకు లోపరచువాడు ఆయనే. ఆయనే నా శత్రువుల చేతిలోనుండి నన్ను విడి పించును నామీదికి లేచినవారికంటె ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలాత్కారము చేయువారి చేతిలోనుండి నీవు నన్ను విడిపించుదువు. అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను. నీ నామకీర్తన గానముచేసెదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగ జేయువాడవు అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. -2 సమూయేలు 22:47-51
దావీదు తన దేవునిని గూర్చి ఎరిగిన సంగతులు పై వాక్యములలో మనము గమనించగలము. ఎందుకు తన జీవితములో తన దేవుడు స్తోత్రార్హుడు అని చెప్పుచున్నాడు. “నా నిమిత్తము ప్రతి దండన చేసేవాడు నా దేవుడు” అని దావీదు ఎరిగినవాడుగా ఉన్నాడు. అనగా దావీదు ఏమి చేసేది లేదు గానీ, తన పక్షముగా దేవుడే నిలబడి ఉన్నాడు.
ఈరోజున మనము నా ప్రాణమా యెహోవా సన్నుతించుమా అని చెప్పుచున్నప్పుడు నా నిమిత్తము ప్రతిదండన చేసేవాడు. అనగా మనకు జరిగిన అన్యాయమునకు, అపకారమునకు ప్రతిగా శత్రువు యెడల జరిగించేవాడు అని యెరిగిఉండాలి.
“ఆయనే నా శత్రువుల చేతిలోనుండి నన్ను విడి పించును నామీదికి లేచినవారికంటె ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు” ఇక్కడ మన దేవుని మనస్సును అర్థముచేసుకోగలము. ఇక్కడ దావీదు ఎలా అర్థము చేసుకున్నాడు అని ఆలోచిస్తే, నా దేవుడు ఖచ్చితముగా నన్ను హెచ్చిస్తాడు, నా శత్రువు కంటే ఎత్తుగా నన్ను హెచ్చిస్తాడు అని మనస్పూర్తిగా నమ్మినవాడుగా ఉన్నాడు అందుకే నా హృదయానుసారుడు అని దేవుడు అతని గూర్చి సాక్ష్యము ఇచ్చాడు. దావీదు ఈ మాటకు, కృంగిపోయి ఉన్న సందర్భములో, ఎవ్వరూ ఆదరణ లేని సమయములో చెప్పుచున్నాడు.
మనము కూడా మన దేవుడు మనకు ఏమై ఉన్నాడో అని ఎరిగి ఉంటే మనము కూడా ఇలాగే చెప్పగలుగుతాము. “బలాత్కారము చేయువారి చేతిలోనుండి నీవు నన్ను విడిపించుదువు” అనగా ఇంతకుముందే కాదు, ఇకముందు కూడా విడిపించేవాడుగా ఉన్నాడు. అందుకే సమస్య వచ్చినప్పుడు సహాయము కొరకు మనుష్యులవైపు చూడటము కాదు గానీ, నీవు ఎరిగి ఉన్న నీ దేవుడైన యెహోవానే ఆశ్రయించేవారిగా ఉండగలుగుతాము.
మన దేవుడు ఏమై ఉన్నాడో ఖచ్చితముగా గ్రహించాలి. మన దేవుడు హెచ్చించేవాడు మరియు విడిపించేవాడు అయి ఉన్నాడు.
2024 లో మనకు 12 నెలలకు 12 గంపలు సిద్ధపరచబడి ఉన్నాయి. గంపలలో రొట్టెముక్కలు ఉన్నాయి. అయితే ఈ రొట్టెముక్కలు ఎక్కడనుండి వచ్చాయి అంటే, యేసయ్య చేతులనుండి. ఆయన చేతిలోనికి రాకమునుపు అది ఒక్క రొట్టెనే. అయితే ఆయన చేతులతో దానిని విరిచి ఇవ్వగానే ఆ రొట్టే లో దైవిక శక్తి వచ్చింది. అందువలనే ఆ రొట్టెలు అనేకమందికి వడ్డించబడ్డాయి. పంక్తిలో కూర్చున్నవారికి ఆ రొట్టేముక్కలు వడ్డించబడ్డాయి. మరి ఆ పంక్తిలో ఎలా కూర్చోగలుగుతాము. యేసయ్య దగ్గర ఉన్నప్పుడే పంక్తిలో కూర్చోగలుగుతాము. ఆయన దగ్గర ఉండాలి అంటే ఆయన ఎవరై ఉన్నాడో ఎరిగి ఉండాలి. తెలిసి వచ్చినా తెలియక పోయినా యేసయ్య దగ్గరకి వచ్చిన నీకు ఖచ్చితముగా వడ్డించబడుతుంది. పంక్తిలో కూర్చున్న ప్రతి వారికి వడ్డించబడింది. ఈ నెలకొరకు ప్రభువు సిద్ధపరచినది నీవు పంక్తిలో ఉన్న నీకు కూడా ఖచ్చితముగా వడ్డించబడుతుంది. అనగా సిద్ధపరచిన ఆశీర్వాదము ఖచ్చితముగా నీవు పొందుకుంటావు.
దైవిక శక్తిని నింపుకున్న రొట్టె ఆ గంపలో ఉంది. ఆ రొట్టే విస్తరించబడే రొట్టెగా ఉంది. అనగా మనము పొందే ఆశీర్వాదము కూడా విస్తరించబడే ఆశీర్వాదముగా ఉంది. ఆ రొట్టె ఆకలి తీర్చింది గనుక దానిలో జీవము ఉంది. మనము పొందే ఆశీర్వాదము కూడా జీవము కలిగి మనకు ఉన్న అవసరము సూపర్ నేచురల్ గా తీర్చబడతాయి.
ప్రభువు సిద్ధపరచిన గంపలో నీ జీవితమును అభివృద్ధి చేయగల అద్భుతమును గానీ, మార్గమును గానీ ప్రభువు సిద్ధపరచి ఉంచాడు. గనుక నేను పంక్తిలో ఉండాలి అనే ఆశ మనము కలిగి ఉండాలి.
విరువబడిన రొట్టె అనేకుల ఆకలి తీర్చబడింది. ఆ రొట్టెలో జీవము ఉంది. ఇది మన ప్రభువు శరీరము గూర్చిన మర్మము కూడా అయి ఉన్నది. విరువబడిన ఆయన శరీరము జీవము కలిగి మనలను విస్తరింపచేసేదిగా ఉంది.
ఈ సత్యములను గ్రహిస్తే, ఖచ్చితముగా మన దేవునిని ఉత్సాహముతో ప్రభువును స్తుతించేవారిగా ఉంటారు. ఈరోజున ఆయన సన్నిధిలో ఉన్న మనము పంక్తిలో ఉన్నాము గనుక ఖచ్చితముగా మనము దీవించబడే సమయము ఉంది అంతే!
ఆరాధన గీతము
నా ప్రాణమా సన్నుతించుమా
యెహోవా నామమును
పరిశుద్ధ నామమును
అంతరంగ సమస్తమా
సన్నుతించుమా
||నా ప్రాణమా||
ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమా
దోషములన్నియు క్షమియించెను ప్రాణ విమోచకుడు
దీర్ఘ శాంత దేవుడు
నిత్యము కోపించడు
||నా ప్రాణమా||
మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు
నీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును
దాక్షిణ్యపూర్ణుడు
నిత్యము తోడుండును
||నా ప్రాణమా||
ఆత్మతో సత్యముతో మనము ప్రభువును ఆరాధించాలి. సత్యము ఏమిటి? నాకు జీవము ఇవ్వబడింది ఆ జీవము విస్తరించబడేది. నన్ను తృప్తిపరచే జీవము గంపలో సిద్ధపరచబడింది. అది నా వద్దకు నడిపించబడుతుంది, ఆమేన్!
వారము కొరకైన వాక్యము
మన అందరినీ మన ప్రభువు ఆకర్షించాడు. దేనికొరకు? సిద్ధపరచబడిన గంపలోనిది నీవు పొంది తృప్తిపరచడానికి నిన్ను ఈరోజున ఆకర్షించాడు. ఈ సంవత్సరము యెహోషువ సంవత్సరము. ఈ సత్యమును ఉత్సాహముగా స్వీకరించువారిని మరి ఎక్కువగా ఆశీర్వదించేవాడిగా దేవుడు ఉన్నాడు.
గత వారము నేర్చుకున్నది: మనము ప్రభువు ప్రేమను బట్టి ఆనందించేవారిగా ఉండాలి, ఆయన కాపరిగా ఉన్నాడు కాబట్టి ఆనందించాలి, జీవముతో ఉంచాడు గనుక ఆనందించాలి, ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడుగా ఉన్నాడు కాబట్టి, ఆయనను బట్టి ఆనందించాలి. ఈరోజు యేసయ్య ఏమై ఉన్నాడో నేర్చుకుందాము.
యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరయతో చేరిన గ్రామములకు బయలుదేరెను. మార్గములోనుండగా– నేను ఎవడనని జనులు చెప్పుచున్నారని తన శిష్యుల నడిగెను. అందుకు వారు–కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అనియు, కొందరు ఏలీయా అనియు, మరి కొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకాయన–మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారని వారినడుగగా పేతురు–నీవు క్రీస్తు వని ఆయనతో చెప్పెను. -మార్కు 8:27-29
ఈ వాక్యములో చూస్తే జనులు ఎలా యేసును గూర్చి అనుకుంటున్నారో అని శిష్యులను అడిగినపుడు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అనియు, కొందరు ఏలీయా అనియు, మరి కొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి.
బాప్తిస్మమిచ్చు యోహాను వలే పరలోక రాజ్యము సమీపించుచున్నది అనే సువార్తనే యేసు కూడా ప్రకటించాడు కాబట్టి, బాప్తీస్మమిచ్చు యోహాను అని కొందరు అనుకుంటున్నారు.
ఏలియా సారెఫతు విధవరాలి ఇంటిలో రొట్టె విస్తరించబడే అద్భుతము చేసినట్టు యేసయ్య కూడా 5 రొట్టెలు రెండు చేపల విషయములో కూడా అదే అద్భుతము చేసాడు. గనుక కొందరు ఏలియా అని అనుకున్నారు.
ప్రవక్తలు మర్మములు బోధించేవారుగా ఉంటారు వారి వలెనే యేసయ్య కూడా అనేక మర్మములు బోధించాడు. అందుకే కొందరు ఆయనను ప్రవక్తగా అనుకుంటున్నారు.
అనగా సువార్త ప్రకటించువానిగా, అద్భుతములు చేయువానిగా, మర్మములు బోధించువానిగా స్వీకరించారు గానీ సంపూర్ణమైన యేసయ్యగా స్వీకరించలేకపోతున్నారు. నీ సమాధానము ఏమిటి? యేసయ్య ప్రశ్నకు?
యేసయ్యను వెంబడించువారిలో ఒక యవ్వనస్తుడు నీవు ఎక్కడ ఉంటున్నావు అని అడిగాడు. అప్పుడు నక్కలకు బొరియలు, పక్షులకు చెట్లు ఉన్నాయి గానీ, మనుష్య కుమారునికి తల వాల్చుకొనుటకు స్థలమైనను లేదు. ఎందుకంటే, ఆ యవ్వనస్తుడు యేసయ్య ఎవరో ఎరిగి వచ్చినవాడు కాదు గనుక, నా వద్ద స్థలము లేదు అని చెప్పుచున్నాడు.
మార్గము మధ్యలో శిష్యులను అదే ప్రశ్న అడిగాడు. అప్పుడు పేతురు నీవు క్రీస్తువు అని చెప్పాడు. అనగా అభిషేకించబడినవాడవు అని చెప్పాడు. ఈ ప్రశ్నకు నీ నా సమాధానము ఏమిటి?
అందుకు యేసు–నీవు దేవుని వరమును– నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజల మిచ్చునని ఆమెతో చెప్పెను.౹ -యోహాను 4:10
యేసయ్య దేవుని యొక్క వరము అనగా గిఫ్ట్ ఆఫ్ గాడ్. యేసయ్య పరసంబంధమైన వాడు గానీ ఇహసంబంధమైనవాడు కాదు.
మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోకవిషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను.=-ఎఫెసీయులకు 1:3.
ఏలియా అద్భుతములు చేసాడు గనుక, యేసయ్య కూడా అద్భుతములు చేసాడు గనుక ఏలియా గా స్వీకరించారు కానీ, ప్రతీ ఆశీర్వాదము, ప్రతీ అద్భుతము యేసయ్యలోనే మనకు అనుగ్రహించబడింది. ఒక్క ఆశీర్వాదము కాదు, ఒక్క అద్భుతము కాదు, ప్రతీదీ యేసయ్యలోనే మనకు అనుగ్రహించబడింది. అందుకే ఆయన పరలోకసంబంధమైన వరముగా యేసయ్య మనకు ఉన్నాడు. పరలోక సంబంధమైనది ఇహలోకసంబంధమైనదానికంటే మించిన మహిమ కలిగినదిగా ఉంది.
యేసు –నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.౹ -యోహాను 14:6
నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించినయెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును.౹ -యోహాను 10:9
ఆయన నిత్య జీవమునకు మార్గమై ఉన్నాడు. భూలోకసంబంధమైన ప్రతి విషయములోనూ సర్వాధికారము యేసయ్యకు ఇవ్వబడింది. ఆయన లేకుండా ఏదీ కలుగలేదు. ప్రతి దానికీ ఆధారము ఆయనే అయి ఉన్నాడు. గనుక భూలోక సంబంధమైన పరలోకసంబంధమైన ప్రతీ విషయములోనూ ఆయనే మార్గము అయి ఉన్నాడు.
నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించినయెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును.లోపల అనగా ఆత్మీయ మైన విషయములు, బయటికీ అనగా భూసంబంధమైన విషయములు గా అర్థము చేసుకోవచ్చు. అనగా యేసయ్య ఆత్మీయమైన, భూసంబంధమైన ప్రతీ ఆశీర్వాదమునకు మార్గమై ఉన్నాడు.
యేసయ్య క్రీస్తు అని పేతురు చెప్పుచున్నాడు. క్రీస్తు అనగా అభిషిక్తుడు, దేవుని చేత అభిషేకించబడినవాడు. ప్రకటించినదానిని స్థిరపరచగలిగేవాడు. ఈ దినమున యేసయ్య ఏమై ఉన్నాడో అది సంపూర్ణముగా మనము స్వీకరించగలిగే ధన్యత ఆధిక్యత ప్రభువు కలుగచేసాడు.
ప్రవక్తలు దేవుని యొక్క ఆత్మలో ఒక పాలు అనుగ్రహించబడినప్పుడు వారు అద్భుతములు చేసినవారుగా ఉన్నారు. అయితే యేసయ్య కొరతలేని దేవుని ఆత్మను కలిగి ఉన్నాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలములు ఎరిగినవాడుగా యేసయ్య ఉన్నాడు.
ఇంకా యేసయ్య సత్యమై ఉన్నాడు. బాప్తీస్మమిచ్చు యోహాను పరలోక రాజ్యము సమీపించినది అని ప్రకటించాడు. యేసయ్య కూడా అదే వార్త ప్రకటించాడు అయితే ఇంకా “పరలోక రాజ్యము మీ మధ్యనే ఉన్నది” అని చెప్పాడు. అనగా ప్రకటించినదానిని సత్యముగా స్థిరపరచేవాడు కనుపరచేవాడు.
నేను మీకు అప్పగించిన దానిని ప్రభువువలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి౹ దానిని విరిచి–యిది మీకొరకైన నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.౹ -1 కొరింథీయులకు 11:23-24
యేసయ్య చెప్పినదే సత్యము అని నేర్చుకున్నాము. ఇప్పుడు యేసయ్య “ఇది మీ కొరకైన నా శరీరము” అని చెప్పుచున్నాడు. ఇప్పుడు ఆ శరీరమును బట్టి మనకు ఏమి కలిగింది అని చూస్తే-
కావున యేసు ఇట్లనెను–మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని, మీలో మీరు జీవముగలవారు కారు.౹ -యోహాను 6:53
ఈ మాట విన్న అనేకులు వెనుకకు వెళ్ళిపోయారు. అయితే ఈరోజు నీవు ఎలా ఉన్నావు? యేసయ్యలో ఒక్క కోణము మాత్రమే చూసి స్వీకరిస్తావా? సంపూర్ణముగా ఆయనను స్వీకరిస్తావా? ఆయన చెప్పిన మాట సత్యము. ఆయన జీవము కలిగినవాడు అది సత్యము. నేను వెలుగై ఉన్నదాని వలే మీరును లోకమునకు వెలుగు అయి ఉన్నారు అని యేసయ్య చెప్పారు, అది సత్యము. యేసయ్య గూర్చిన సత్యమునకు సాక్ష్యముగా మన జీవితమై ఉండాలి.
నన్ను జీవింపచేయువాడు, నా జీవమునకు ఆధారమై ఉన్నవాడు యేసయ్యే! ఆమెన్! హల్లెలూయా!
యేసయ్య దేవుని వరము, ఆశీర్వాదమునకు మార్గమును అయి ఉన్నాడు, సత్యము అయి ఉన్నాడు మరియు జీవము అయి ఉన్నాడు.
వారు కొందరు బాప్తిస్మ మిచ్చు యోహాననియు, కొందరు ఏలీయా అనియు, కొందరు యిర్మీయా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారి నడిగెను. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు–సీమోను బర్ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనేకాని నరులు నీకు బయలు పరచలేదు. -మత్తయి 16:14-17
మరియు నీవు పేతురువు; ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. -మత్తయి 16:18
యేసయ్య ఎలా నీ జీవితములో ఎలా మార్గమై, సత్యమై, జీవమై ఉన్నాడో అని నీవు కనుగొనగలిగితే ఏమి జరుగుతుంది? అంటే మన జీవితమునకు ఒక సామర్థ్యము కలుగుతుంది. యేసయ్య ఏమై ఉన్నాడో తెలుసుకోవడానికి నీవు సిద్ధముగా ఉంటే బయలుపరచడానికి తండ్రి యైన దేవుడు సిద్ధముగానే ఉన్నాడు. అప్పుడు నీకు దేవుడు ఒక సామర్థ్యము కలుగచేసేవాడుగా ఉన్నాడు. నీ ముందు మరణకరమైనది ఏదైనా సరే నిలువలేని సామర్థ్యము కలుగచేస్తాడు. నాశనకరమైన మార్గము ఏదీ నీముందు నిలువది. ఎవరు నీవు నమ్మే యేసు అనే ప్రశ్న నీకు వేయబడినపుడు, నీ జీవితము ఆయన మార్గమునకు, సత్యమునకు జీవమునకు సాక్ష్యముగా ఉండాలి.