7-1-2024 – ఆదివారం రెండవ ఆరాధన

స్తుతిగీతము – 1

నూతన పరచుము దేవా
నీ కార్యములు నా యెడల
సంవత్సరాలెన్నో జరుగుచున్నను
నూతనపరచుము నా సమస్తము

పాతవి గతించిపోవును – సమస్తం నూతనమగును
నీలో ఉత్సహించుచు – నీకై ఎదురు చూతును

శాశ్వతమైనది నీదు ప్రేమ
ఎన్నడైన మారనిది నీదు ప్రేమ
దినములు గడచినా సంవత్సరాలెన్ని దొర్లినా
నా యెడ నీదు ప్రేమ నిత్యం నూతనమే

ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో
నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో
తరములలో ఇలా సంతోషకారణముగా
నన్నిల చేసినావు నీకే స్తోత్రము

స్తుతిగీతము – 2

యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా

నీ కృప లేని క్షణము – నీ దయ లేని క్షణము
నేనూహించలేను యేసయ్యా
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
నీ కృప లేనిదే నేనుండలేనయ్యా

మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి
మార్గముగా మారి మనిషిగా మార్చావు
మహిని నీవు మాధుర్యముగా మార్చి
మాదిరి చూపి మరో రూపమిచ్చావు
మహిమలో నేను మహిమను పొంద
మహిమగా మార్చింది నీ కృప

ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి
ఆపత్కాలమున ఆదుకొన్నావు
ఆత్మీయులతో ఆనందింప చేసి
ఆనంద తైలముతో అభిషేకించావు
ఆశ తీర ఆరాధన చేసే
అదృష్టమిచ్చింది నీ కృప

స్తుతిగీతము – 3

పాపాన్ని పోగొట్టి శాపాన్ని
తొలగించా భూలోకం వచ్చావయ్యా
మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువను మోసవయ్య
కన్నీటిని తుడిచావయ్యా సంతోషం ఇచ్చావయ్య
మనుషులను చేసావయా నీ రూపాన్ని ఇచ్చావయ్యా
నా సర్వం యేసయ్య నా జీవం యేసయ్య
నా ప్రాణం యేసయ్య నా ధ్యానం యేసయ్య

బంగారం కోరలేదు వెండియు కోరలేదు హృదయాన్ని కోరావయ్య
ఆస్తియు అడగలేదు అంతస్థులడగలేదు హృదయాన్ని అడిగావయ్య
నేవెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా
నా సర్వం యేసయ్య నా జీవం యేసయ్య
నా ప్రాణం యేసయ్య నా ధ్యానం యేసయ్య

తల్లి నన్ను మరచిన తండ్రి నన్ను మరచిన యేసయ్య మరువడయ్యా
బంధువులు విడిచిన స్నేహితులు విడచిన యేసయ్య విడువడయ్య
చేయిపట్టి నడుపునయ్య శిఖరముపై నిలుపునయ్య
నా సర్వం యేసయ్య నా జీవం యేసయ్య
నా ప్రాణం యేసయ్య నా ధ్యానం యేసయ్య

ఆరాధన వర్తమానము

యెహోవా కృప మనయెడల హెచ్చుగానున్నది ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా, యెహోవాను స్తుతించుడి సర్వజనములారా, ఆయనను కొనియాడుడి యెహోవాను స్తుతించుడి. -కీర్తనలు 117:1-2

యెహోవా కృప మనయెడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును అనే రెండు విషయాలు మనము చూడవచ్చు. ఉదయాన మనము ప్రభువు ప్రేమను గూర్చి 4 విషయాలు నేర్చుకున్నాము.

ప్రభువు నందు ఆనందించులాగున ఉదయము మనము నేర్చుకున్న నాలుగు విషయములు-

1. ఆయన మనలను ప్రేమిస్తున్నాడు
2. ఆయన మనకు కాపరి
3. ఇప్పటివరకు జీవముతో ఉంచాడు
4. ఆయన మాట నెరవేర్చేవాడు

అయితే ఇప్పుడు విశ్వాస్యత ఏమిటి? ఎలా మనము ఆయన విశ్వాస్యతను అర్థము చేసుకోవచ్చు ? అని నేర్చుకుందాము.

మాట తప్పడు అనే విషయము తీసుకుంటే, ఇచ్చిన మాట నెరవేర్చేవాడుగా మన దేవుడు ఉన్నాడు. కాపాడుట అనే విషయము తీసుకుంటే, మనము కాపాడబడుట అనేది ఆయన విశ్వాస్యతను కనపరుస్తుంది. ఏ విషయమైనా సరే చెప్పిన దానిని చేసేవాడుగా మన దేవుడు ఉన్నాడు దానిని విశ్వాస్యతగా మనము చూడవచ్చు. గనుక విశ్వాస్యత లో అన్ని విషయములు, ఆశీర్వాదము, కాపాడుట ఇలా అనేక విషయములలో చూడవచ్చు.

ఆయన ఎందుకు మనపై ఎందుకు విశ్వాస్యత చూపిస్తున్నాడు అంటే, ఆయన మనలను కనియున్నాడు. మన విషయములను చూస్తే, మన పిల్లలకు అడగకుండానే వాడికి కావలిసినది సమకూర్చడము మనము చూస్తాము. ఇది మన పిల్లలకు మనము కనపరిచే విశ్వాస్యత. అదేవిధముగా మన తండ్రి యైన దేవుడు కుడా తన విశ్వాస్యతను కనపరచేవాడుగా ఉన్నాడు.

మనము జీవముగల దేవుని ఆలయమై యున్నాము; అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు. –నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు. –కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైనదానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. –మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునై యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. -2 కొరింథీయులకు 6:16

ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు కాబట్టి మనలను ఆయన చేర్చుకోనేవాడుగా ఉన్నాడు. మనము ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆయన స్పందించేవాడుగా ఉన్నాడు. ఎవరు స్పందించినా స్పందించకపోయినా, మన పరలోకపు తండ్రి మాత్రము స్పందించేవాడుగా ఉన్నాడు.

ఆయన మనకు దేవుడుగానూ, తండ్రిగానూ ఉంటున్నాడు. ఒక్కడే కానీ రెండు క్యారెక్టర్స్. తండ్రి గద్దిస్తాడు గానీ, తప్పకుండా అక్కున చేర్చుకుంటాడు. అటువంటి తండ్రి యొక్క విశ్వాస్యత నిరంతరము నిలిచేదిగా ఉంది. ఈ మాట మన జీవితములను కట్టెదిగా ఉంది.

దేవుని వలన అతనికి రక్షణ యేమియు దొరకదని నన్నుగూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. -కీర్తనలు 3:3

మన యొక్క పరిస్థితులను బట్టి మనము దేవుని సన్నిధిలో ఉంటున్న సందర్భములో, ఇది జరుగుతుందా లేదా అని మన హృదయము ప్రశ్నలతో ఆలోచనతో వేదన పడుతుంది. అయితే దేవుడే మన తండ్రిగా ఉన్నాడు గనుక, మనలను చేర్చుకునే తండ్రి గనుక మనము ఎంతో ధైర్యము కలిగి ఉండవచ్చు. ఆయన నీ తల ఎత్తువాడిగా చేస్తాడు. నా తల ఎత్తువాడవైన దేవా నీకే స్తోత్రములు.

యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును -కీర్తనలు 3:5

యెహోవా నాకు తండ్రిగా ఉన్నాడు కాబట్టి పదివేలమంది దండెత్తి నా మీదికి వచ్చి మోహ రించినను నేను భయపడను. పదివేలమంది కలిసి ఏ పని చేయగలరో, నా తండ్రి ఒక్కడే వారికంటే బలమైన కార్యములు చేయువాడుగా ఉన్నాడు. అటువంటి తండ్రి నిన్ను, నన్ను చేర్చుకొనేవాడుగా ఉన్నాడు గనుక ఏ పరిస్థితి అయినా సరే మన జీవితాన్ని లాక్కుపోయే అవకాశమే లేదు.

సంఘము యొక్క వాగ్దానము చాలా ప్రాముఖ్యమైనది. యెహోవా నాకు తండ్రిగా ఉన్నాడు, యెహోవా నన్ను చేర్చుకొనేవాడుగా ఉన్నాడు గనుక ఆ తండ్రిని మనము అందరము కలిగి ఆరాధిద్దాము.

ఆరాధన గీతము

నా తండ్రి నీవే – నా దేవుడవు నీవే
నా తండ్రి నీవే – నీవే

యేసయ్యా… యేసయ్యా
యేసయ్యా… యేసయ్యా
యేసయ్యా… యేసయ్యా

నా అడుగులు తప్పటడుగులై
నడిచిన నా ప్రతి మార్గము
సరిచేయు నా తండ్రివి
పగలు ఎండ దెబ్బయైనను
రాత్రి వెన్నెల దెబ్బయైనను
తగులకుండ కాచే నీ ప్రేమ

యేసయ్యా… యేసయ్యా
యేసయ్యా… యేసయ్యా
యేసయ్యా… యేసయ్యా

గాడాంధకార లోయలో
నే నడచిన ప్రతివేలలో
తోడున్న నా తండ్రివి
వేయిమంది కుడి ఎడమకు
కూలినా కూలును కాని
చెదరకుండ నన్ను కాపాడు ప్రేమ

వారము కొరకైన వాక్యము

ఈరోజు మన దేవుడు మన చేయిపట్టి నడిపించేవాడు అనే సత్యమును గూర్చి నేర్చుకుందాము. ప్రభువు మనకు ఒక నూతనమైన సంవత్సరమును ఇచ్చియున్నాడు. ఈ సంవత్సరము మన దేవుడు మహిమ పరచబడేవాడుగా ఉన్నాడు. దేవునియందు అత్యాశక్తి కలిగి ఉన్నప్పుడు ఆ దేవుడు మన పక్షముగా తన మాటను నెరవేర్చేవాడుగా ఉంటాడు, ఆమేన్!

ఆయన మనకు దేవుడుగా ఉంటున్నాడు. ఆ దేవుడు మనలను నడిపించాలి అనే కోరికను కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితములను ఆలోచన చేస్తే, వారికి రాజుగా ఆయనే ఉండాలి అని కోరుకున్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు వేరే రాజు కావాలి అని కోరుకున్నారు. అయితే దేవుడి కోరిక, తన ప్రజలను తానే నడిపించాలి అని!

మనము గ్రహించాల్సింది ఏమిటి అంటే, దేవుడి యొక్క కోరిక ఏమిటి? మన వ్యక్తిగతమైన జీవితములను ఆయనే నడిపించాలి అనే కోరిక కలిగి ఉన్నాడు. అబ్రహామును దేవుడు ఎన్నిక చేసుకున్నాడు.

యెహోవా–నీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువుల యొద్దనుండియు నీ తండ్రి యింటినుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము.౹ -ఆదికాండము 12:1

ఈ మాటలు దేవుడు అబ్రహామునకు చెప్పుచున్న మాటలు. అబ్రహాము తన తండ్రి ఇంటి ఇంటినుండి ఇష్టమైన ప్రదేశమునకు వెళ్ళమని చెప్పట్లేదుగానీ, నేను చూపించే దేశమునకు అని దేవుడు చెప్పుచున్నాడు. దేవుని ఉద్దేశ్యము ఏమిటి అంటే, “నేను చూపించేవాడను”. మన దేవుడు చూపించేవాడు, నడిపించేవాడు.

నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. -యెషయా 48:17

విమోచకుడు అనగా విడిపించేవాడు. ఏ త్రోవలో వారిని నడిపించాలి అని నిర్ణయించాడో, ఆ త్రోవలో నడుస్తుండగా మార్గములో ప్రతి చోట తోడుగా ఉన్నాడు, ప్రతి పరిస్థితినుండి విడిపించేవాడుగా ఉన్నాడు.

నిన్ను ఒక త్రోవలో నడిపించాలి అని దేవుడు నిర్ణయించాడు అంటే, ఆ త్రోవ సిద్ధపరచబడింది అని అర్థముచేసుకోగలము, ఆమేన్! హల్లెలూయా.

ఆయన సిద్ధపరచిన మార్గములో ఆయన మనలను నడిపించేవాడుగా ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక! ఈ మాటలు వింటున్నా, చదువుతున్న నీవు ఒక సత్యమును గ్రహించాలి. నిన్ను నడిపించడానికి ఒక మార్గమును సిద్ధము చేసాను అని నీ దేవుడు నీకు తెలియచేస్తున్నాడు.

పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయు చున్నాడు శాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు. -కీర్తనలు 23:2

ఆయన నడిపించే మార్గము శాంతికరమైన మార్గమై ఉన్నది. సమాధానకరమైన మార్గముగా దేవుడు ఏర్పాటు చేసిన మార్గముగా ఉంది. అందుకే కీర్తనాకారుదు చెప్పగలుగుతున్నాడు, యెహోవా నా కాపరి ఆయనే నన్ను నడిపించువాడు అని. కీర్తనాకారుడు తన కాపరి ఏమై ఉన్నాడో గ్రహించాడు కాబట్టే ఈ విషయము చెప్పగలుగుతున్నాడు.

మనము కూడా మనలను నడిపించేవాడు ఎటువంటివాడో, ఎంతటి శక్తిమంతుడో మనము గ్రహించాలి.

సముద్రములో త్రోవ కలుగజేయువాడును వడిగల జలములలో మార్గము కలుగజేయువాడును రథమును గుఱ్ఱమును సేనను శూరులను నడిపించువాడు నగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. వారందరు ఏకముగా పండుకొని లేవకయుందురువారు లయమై జనుపనారవలె ఆరిపోయిరి. -యెషయా 43:16
నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును నదులలో బడి వెళ్లునప్పుడు అవి నీమీద పొర్లిపారవు. నీవు అగ్నిమధ్యను నడచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు -యెషయా 43:2

ఈ మాటలను ధ్యానము చేస్తే, మన దేవుని శక్తిని వెల్లడిపరచే మాటలై ఉన్నాయి. మనకొరకు ఏర్పాటు చేసిన మార్గములో అగ్ని వంటి పరిస్థితులు వచ్చినా సరే అనగా మనలను నామరూపములులేకుండా చేసే పరిస్థితులు వచ్చినా సరే వాటి ప్రభావము మనపై పడకుండా కాపాడువాడుగా మన దేవుడు ఉన్నాడు. అలాగే వడిగల జలములవంటి పరిస్థితులు మన జీవితములను నాశనము వైపు లాక్కుపోవడానికి ప్రయత్నించినా సరే వాటి నుండి తప్పించేవాడుగా మన దేవుడు ఉన్నాడు. గనుక దేవుడు సిద్ధపరచిన మార్గములో నడచుట, నిలిచి యుండుట మన ధన్యత.

నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును.౹ -యోహాను 10:27

ఆయన మన కొరకు ఒక మార్గము సిద్ధపరచాడు ఆ మార్గములో మనము నిలిచి ఉండాలి అంటే, ఆయన స్వరము మనము వినేవారిగా ఉండాలి.

నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుము నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును. -సామెతలు 3:5-6

ఇక్కడ రెండు విషయములు మనము చూడవచ్చు. మొదటిది ఆయనపై నమ్మకముంచాలి. రెండవదిగా ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. అనగా ఆయన వినిపించిన స్వరమును ఒప్పుకోనేవాడవు గానూ, ఆ స్వరమునకు లోబడేవాడవుగానూ ఉండాలి. దేవుని స్వరమును ఖచ్చితముగా మనము వినగలిగే వారముగా ఉండాలి. అప్పుడే ఆయన చెప్పే మాటలు నమ్మేవారిగానూ, ఆ మాటలకు లోబడేవారము గానూ ఉండగలుగుతాము.

ఆయనన మన చేయిపట్టి నడిపించేవాడుగా ఉన్నాడు. అనగా తన వాక్కును మనకు ఇచ్చి, ఆ ఇవ్వబడిన వాక్కును పట్టుకుని ముందుకు వెళ్ళేవారి త్రోవను సరాళము చేసేవాడుగా మన దేవుడు ఉన్నాడు.

దేవుని యొక్క రాకడ అతి సమీపముగా ఉంది. అనేక సందర్భములలో ప్రభువు మనకు ఆ విషయమును జ్ఞాపకము చేస్తున్నాడు. ఆచారయుక్తముగా మనము వెళుతున్న సందర్భములలో, చాల స్పష్టముగా లేఖనములు చెప్పుచున్నాయి.

వ్రాయబడిన ప్రకారము మిమ్మునుబట్టియే గదా దేవుని నామము అన్యజనులమధ్యను దూషింపబడు చున్నది?౹ -రోమా 2:24

మన జీవితములను ప్రభువు ఎంతగా కోరుకుంటున్నాడో, ఆ కోరిక మనము గ్రహించవలసినవారముగా ఉన్నాము. దేవుని మనస్సును మనము గ్రహించాలి. దేవుడు తన ప్రేమను మాటి మాటికీ కనపరుస్తున్నాడు. ఆ ప్రేమలో మనము ఎదుగుతూ ముందుకు వెళ్ళాలి. కానీ ఆ ప్రేమ ఆనాటిది ఆనాటి వరకే అన్నట్టుగా మన జీవితములు ఉండకూడదు. ఎంతగా మనము వాక్యాన్ని తెలుసుకోగలుగుతామో అంతగా దేవుని ప్రేమను రుచి చూడగలుగుతాము. దేవుని కార్యములను ప్రత్యక్షముగా చూసేవారముగా ఉంటాము. మన ప్రభువు సంఖ్యాబలము కంటే యదాథత కలవారినే ప్రభువు కోరుకుంటున్నాడు. ఈ 2024 ప్రభువుకు మహిమ కరముగా ఉండుటకు సిద్ధపడదాము.

దేవుడు మన యెడల ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక నెరవేరాలి అంటే మనము యదార్థముగా నిలబడాలి. మన ప్రభువు ప్రతీదీ ముందుగానే మనకు చెప్పుచున్నాడు. తన వాక్కును ముందుగా మనకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆ వాక్కు ద్వారా మనలను నడిపిస్తాడు. అయితే దేవుని స్వరమును వినాలి అంటే, మొదటిగా మనము మనలను సమూయేలువలే ప్రతిష్టించుకోవాలి. మోషేవలే ఆసక్తి కలిగి ఉండాలి. ఆయన స్వరమును వినాలి అంటే, మనలను మనమే సిద్ధపరచుకోవాలి.

దేవుని స్వరము తన వాక్యము ద్వారా వినిపిస్తాడు. ఉపదేశము చేసి నడిపించేవాడుగా ప్రభువు ఉన్నాడు. అయితే వాక్యములోని ఉపదేశమును గ్రహించాలి అంటే, మనము ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని స్వరమును వినగలిగినపుడు ఆయన మార్గము ఎలా ఉంటుందో కళ్ళారా చూడగలము. ఆయన నడిపింపు కళ్ళారా చూడగలము.