స్తుతిగీతము – 1
మేలు చేయక నీవు ఉండలేవయ్య
ఆరాధించక నేను ఉండలేనయ్య
యేసయ్యా ………యేసయ్యా
యేసయ్యా……….యేసయ్యా
నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేనయ్యా
నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లేక
నా ఆనందం కోరేవాడా , నా ఆశలు తీర్చేవాడా
క్రియలున్న ప్రేమ నీదీ ,నిజమైన ధన్యతనాది
ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను
పశ్చాతాపం కలిగే నాలో నేను పాపిని అని గ్రహించాగానే
నీ మేళ్ళకు అలవాటయ్యే ,నీ పాదముల్ వదలకుంటేన్
నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి
పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను
క్షమించగల్గే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో
నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని
అతిశయించే నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు
స్తుతిగీతము – 2
ఇమ్మానుయేలు దేవా
ఇహపరములకు రాజా
సన్నుతించి కిర్తించేదము
సతతము నీ నామము
హల్లెలూయ ఆరాధ్యుడా
హల్లెలూయ స్తుతి పాత్రుడా
హల్లెలూయ అభిషక్తుడా
హల్లెలూయ అభి వందనం
ఆదియందు వాక్యమై యున్నావు
ఆ వాక్యము నేనే అని చెప్పావు (2)
మా వెలుగు మార్గం నీవే దేవా
నిత్య జీవము నీవేనయ్యా (2)
” హల్లెలూయ “
రాజులకు రారాజు నీవేనయ్యా
జనులందరి జీవాధిపతి నీవే
మా యోగ క్షేమము నీవేనయ్యా
మా స్తుతి గానము నీకేనయ్యా
” హల్లెలూయ “
స్తుతిగీతము – 3
యెహోవా మా ప్రభువా యేషువా మా రక్షకా
యెహోవా షాలోం యెహోవా రాఫా
మా ఇమ్మానుయేలు రాజా
రక్షణ స్తోత్రం బలము ప్రభావం
శక్తి ఐశ్వర్యం ప్రభు యేసుకే
స్తుతి ఘన మహిమ ఇహపరములలో రాజుల రాజునకే
ప్రభువా నీ ఉపకారములకు ఏమి చెల్లింతుము
రక్షణ పాత్రను చేతబూని ఆరాధించెదము
ఆరాధన వర్తమానము
ఈ 2024 సంపూర్ణమైన సంవత్సరము. యెహోషువ సంవత్సరము అనగా ముగింపు సంవత్సరము. మన జీవితములో ఉన్న ప్రతీ శ్రమకు, పరిస్థితికీ ముగింపు సంవత్సరము. ఆమేన్!
ఈ సంవత్సరము 12 గంపలు, 12 నెలలు, 12 రాళ్ళు అనే ప్రవచనాత్మక వాక్కు ప్రభువు ఇచ్చారు. 12 గంపలు జీవముచే సిద్ధపరచబడిన 12 నెలలు మరియు 12 రాళ్ళు 12 సాక్ష్యములు. ఈ సంవత్సరము ప్రతీ నెల ప్రతి గంపలోని జీవమును అనుభవించి మనము ప్రతీ నెల సాక్ష్యముగా ఉందుము గాక!
మన దేవుని యొక్క శక్తి ప్రతీ శ్రమను ముగించడానికి, ప్రతి ఇబ్బందిని ముగించడానికి మన జీవితమును వెంబడిస్తుంది. గనుక ఈ సంవత్సరము ఆశగా మన్ము జీవితమును కొనసాగిద్దాము. ఈ సత్యమును నీవు నమ్మితే, ప్రతీ దినము సంతోషించేవాడివిగా ఉంటావు.
దేవుని సన్నిధిలో ఉత్సాహముగా ఉండాలి అని మనము అంటుంటాము. అయితే ఎందుకు ఉత్సాహముగా ఉండాలి? మన దేవుడు సమస్తమును మార్చేదేవుడు అయి ఉన్నాడు. దేవుని సన్నిధిలో నీ దుఃఖము సంతోషముగా మార్చబడుతుంది. ఇప్పటికే సంతోషముగా ఉన్నావా? నీ సంతోషము పొంగి పొర్లుతుంది.
ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము దీనియందు మనము ఉత్సహించి సంతోషించెదము. -కీర్తనలు 118:24
మనము తండ్రి సన్నిధిలో ఉన్నాము. ఆయన సన్నిధిలో మనకు స్వాతంత్ర్యము ఉంది. ఆయనను మనము హత్తుకోగలము. ఈ దినము దేని కొరకు ఏర్పాటు చేయబడింది? ఈ వారము దినాలు ఎక్కడెక్కడో తిరిగాము. ఏమేమో అంటించుకుని వచ్చాము. స్కూల్ లో చదివే పిల్లలను గమనిస్తే స్కూల్ నుంచి వచ్చేసరికి వాడు దుమ్ము ధూళితో నిండి ఉంటాడు. వెంటనే మనము స్నానము చేయమని పంపిస్తాము. మన తండ్రి కూడా ఈ లోకములో తిరిగి తిరిగి అంటించుకున్న ప్రతీ అశుభ్రతనుండి మనలను శుద్ధిచేయడానికి ఈ దినమును ఏర్పాటు చేసారు.
మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన ఆత్మ ఎదుగుటకు అవసరమైన వాతావరణము ఉంటుంది. మనము వారమంతా లోకములో ఉన్నాము. ఈ లోకములో ఉన్నదంతా మాలిన్యమే. మనము తెలిసో తెలియకో లోకములో ఉన్న పాపముతో కూడిన విషయములలో మలినపడిపోతాము. అటువంటి పరిస్థితిలో దేవుని సన్నిధికి ఆదివారము రానప్పుడు, మన ఆత్మ రోజు రోజుకు బంధించబడి, కృంగిపోయి కృశించిపోతుంది. అదే మనము దేవుని సన్నిధిలో ఆదివారము గనుక ఉంటే ఆయన వాక్యము చేత శుద్ధిచేయబడి రాబోయే ఆరు రోజులు అపవాది ఉచ్చులు ఎదుర్కోవడానికి సిద్ధపరచబడుతుంది.
మన దేవుడు మన ఆత్మను ఒక ఆయుధముగా చేయాలి అనే ఆశ కలిగి ఉన్నాడు. అలా నిన్ను నీ ఆత్మను ఆయుధముగా చేసి, అపవాదిని వాడి కార్యములను ఓడించడానికి నిన్ను సిద్ధపరుస్తున్నాడు. గనుక నీకు నీ ఆతము దేవుని సన్నిధే శరణాగతిగా ఏర్పాటుచేయబడింది. దేవుడు మనలను పరిశుద్ధపరచి విజయము కొరకు సిద్ధపరుస్తున్నాడు.
నీకు తెలిసిన దేవుని సత్యము నిన్ను ఒక విషయములో స్వతంత్రునిగా చేస్తుంది. అలాగే సత్యము పై సత్యము నీవు తెలుసుకొనే కొలదీ అనేక విషయములలో నీవు స్వతంత్రునిగా మారగలుగుతావు. ప్రభువు యొక్క ఆశ కష్టముతో, శ్రమతో కూడిన నీ జీవితమును సూపర్ నేచురల్ గా మార్చాలి అనే. నీ జీవితమును సూపర్ నేచురల్ గా మార్చడానికి ఈ దినమును ప్రభువు ఏర్పాటుచేసాడు. రేపు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. అయితే సత్యమైన దేవుని వాక్కుని మనము ఆధారము చేసుకున్నప్పుడు, అదే వాక్యము వెలుగై ఉన్నది గనుక, చీకటి గుండా నీవు సత్యపు వెలుగులో ధైర్యముగా నడువగలుగుతావు.
ఈ సంవత్సరము యెహోషువా సంవత్సరము అనగా వాక్కు చేత పట్టుకుని యెహోషువ వెళ్ళినట్టు మనము కూడా వాక్కును పట్టుకును విజయకరమైన సాక్షులుగా ఈ సంవత్సరము ఉందాము. దేవుని యొక్క కార్యములు నీ ఊహకు మించినవే.
నీవు నా దేవుడవు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను నీవు నా దేవుడవు నిన్ను ఘనపరచెదను. -కీర్తనలు 118:28
ఇది నన్ను పరిశుద్ధపరచాడినికి, సిద్ధపరచడానికి, విజయము అనుగ్రహించడానికి ఏర్పాటు చేసిన దినముగా నీవు నమ్మితే, ప్రభువును స్తుతించు. రాబోయే వారము దినములలో ఎటువంటి ఆటంకమైనా నిలువదు.
ఈ సత్యమును నీవు నమ్మితే ఉత్సహించి బిగ్గరగా ఆమేన్, హల్లెలూయా స్త్రోత్రము దేవా అని చెబుతావా! నీ సంతోషము దాచకుండా వ్యక్తపరచు.
ఈ వారము మనము విజయకరముగా ముగించుదుము గాక! మన ముందు ఏదీ నిలువదు. ఆమేన్! అందుకే ఈ దినము ఏర్పాటు చేయబడినది.
యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. -కీర్తనలు 118:29
మన దేవుడు దయాళుడు ఆయన దయ నాపై నిలిచేదిగా ఉంది. అందుకే ఈ దినమును మనకొరకు ఏర్పాటుచేసాడు.
యెహోవా, నీవే నా దేవుడవు నేను నిన్ను హెచ్చించెదను నీ నామమును స్తుతించెదను నీవు అద్భుతములు చేసితివి, సత్యస్వభావము ననుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి -యెషయా 25:1
“నీవే నా దేవుడవు నీవు అద్భుతములు చేసితివి” అని ఈ వాక్యములో చూస్తున్నాము. ఆయన దేవుడు గనుక ఆయన స్వభావమును బట్టి పూర్వకాలములో అద్భుతములు చేసాడు. ఆయన ఇప్పుడు కూడా దేవుడు గనుక ఆయన దయ కలవాడు గనుక ఇప్పుడు కూడా ఆయన అద్భుతములు చేసేవాడుగా ఉన్నాడు. వాటిచేత నీ స్థితిని మార్చేవాడుగా ఉన్నాడు.
భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివానవలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి దరిద్రులకు కలిగినశ్రమలో వారికి శరణ్యముగాను గాలివాన తగులకుండ ఆశ్రయముగాను వెట్ట తగుల కుండ నీడగాను ఉంటివి. -యెషయా 25:3
బీదలు అనగా బలము లేనివారు. ధనము విషయములో గానీ, ఎదుర్కోనే పరిస్థితులలో గానీ బలహీనముగా ఉన్నవారు బీదలుగా చూడవచ్చు. ఇటువంటి పరిస్థితిలలో ఉన్నవారికి శరణ్యముగా దేవుడున్నాడు. ఆధారముగా ఆయనే ఉన్నాడు. చాలా సందర్భములలో మనము ఎదుర్కొంటున్న పరిస్థితిలలో మన బలము సరిపోదు. ఒకవేళ మనకే బలముంటే మనము సులభముగానే జయించేవారము. అయితే బలము లేని కారణాన అదే పరిస్థితిలో కొనసాగించబడుతున్నాము. అయితే దేవుడు తానే నీకు శరణ్యముగా ఉన్నాడు అని చెప్పుచున్నాడు.
దారిద్ర్యము అనగా మనమున్న పరిస్థితులను జయించుటకు బలము చాలని స్థితి, బలము లేని స్థితి అని అర్థము చేసుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో ఆశ్రయముగా, నీడగా దేవుడే ఉన్నాడు అని ఆయనే తెలియచేస్తున్నాడు. గనుక మన దేవునిని బట్టి మనము ఎంతో సంతోషించేవారిగా ఉండాలి. మన బలము, మన ధైర్యము ఆయనే!
ఆయన మనకు నీడగా ఉన్నాడు అంటే మనకు విశ్రాంతిస్తాడు అని అర్థము. నీ ఉద్యోగములోనో, కుటుంబములోనో ఇంక నీకొచ్చిన సమస్య ఏమీ లేదు. రాబోయె ఏడు దినములు సంతోషముతోనే మనము ముగిస్తాము. ఆమేన్, హల్లెలూయా!
ఆరాధన గీతము
యెహోవా దయాళుడు సర్వ శక్తిమంతుడు
ఆయన కృప నిత్యముండును
ఆయనే బలవంతుడు – ఆయనే యుద్ధ వీరుడు
యెహోవా నాకు తోడుండగా – నాకు భయమే లేనే లేదు
యెహోవా నాకు తోడుండగా – నాకు దిగులే లేనే లేదు
జై జై యేసు రాజా – జయ యేసు రాజా
సేనా దయ్యమును పందులలోకి పంపిన వారాయనే
మృతుడైన లాజరును మరణము నుండి లేపిన వారాయనే
దావీదు వంశమును ఇల చిగురింప చేసిన వారాయనే
విలువైన రక్షణలో నను కడ వరకు నడిపించు వారాయనే
దావీదు వంశమును చిగురింపచేసిన వాడు. అనగా పూర్వకాలమున ఆయన అద్భుతములు చేసి నడిపించాడు.అయితే ఇప్పుడు మనము వర్తమానములో ఉన్నాము. యెహోవా దయాళుడు, సర్వశక్తిమంతుడు అని మనము ప్రకటిస్తున్నాము. దావీదు ఈ సత్యమును ప్రకటించినప్పుడు ఆయన వంశమంతా ఆశీర్వదించబడింది. ఇప్పుడు మనము కూడా ప్రకటిస్తుండగా మనము మన రాబోయే తరములు కూడా ఆశీర్వదించబడేవిగా ఉన్నాయి. గనుక సత్యమును ఎరిగి నమ్మి, ఆయన దయాళుడు, సర్వ శక్తిమంతుడు, యుద్ధవీరుడు అని సంతోషముతో ప్రకటించు.
వారము కొరకైన వాక్యము
మన ఆశీర్వాదము మన నోట్లోనే ఉంది. ఆయన యుద్ధవీరుడు అని మనము ప్రకటించడమే కాదు గానీ, ఆయన యుద్ధము ఎలా ముగిస్తాడో, నీ పోరాటమును ఎలా నడిపిస్తాడో నీవు గమనించాలి. గడిచిన దినములు సరే, ఇకనుంచి ఆయన మహిమను అనుక్షణము వెతికేవారిగా ఉందాము.
ఈరోజు ప్రభువు “ఆనందించుడి” అని ప్రభువు చెప్పుచున్నాడు.
మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదేసంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము.౹ -ఫిలిప్పీయులకు 3:1
ప్రభువునందు ఆనందించుట మనము క్షేమకరమైనది. ఈలోకములో చూస్తే శాస్త్రవేత్తలు, వైద్యులు ఒక విషయాన్ని తెలియచేస్తుంటారు. సంతోషము ఆరోగ్యానికి మూలము. అలాగే నవ్వుట ఒక వైద్య రీతిగా కూడా లోకములో మనము చూస్తాము. అయితే వాక్యమును బట్టి ప్రభువునందు ఆనందించుట మన ఆత్మకు, జీవితమునకు క్షేమకరముగా ఉంది.
మనుష్యులముగా మనకు ఒక ఆధారము కనపడితేనే గానీ, మనము నమ్మము. ప్రభువునందు ఎందుకు ఆనందించాలి అనే సత్యము నీవు ఎరిగితే ఖచ్చితముగా నీవు ప్రభువునందు ఆనందించేవాడివిగా ఉంటావు. ఈ సంవత్సరము పూర్ణ ఆనందముతో మనము జీవించాలి అనేది దేవుని ఉద్దేశ్యము.
మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది.౹ -1 యోహాను 4:10
మొదటిగా మనము ఆనందించడానికి ఒక కారణము, ఆయన మనలను ప్రేమిస్తునాడు అనే సత్యము. తానే మనలను ప్రేమించి, ఆ ప్రేమ ద్వారా మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపిచాడు. అయితే యేసయ్య 2000 సంవత్సరములకు మునుపే వచ్చాడు. మరి ఈరోజున మనము ఎలా అర్థముచేసుకోవాలి? మనము ఆ యేసయ్యను అంగీకరించి దేవుని కుమారులుగా చేయబడ్డాము. మరి ఇప్పుడు ఆ ప్రేమ ఏమి చేస్తుంది? భూలోకములో ఉన్న మనకు పరలోకమునుండి సొల్యూషన్ తీసుకువచ్చేదిగా చేస్తుంది. ప్రభువునందు ఎందుకు ఆనందించాలి అంటే, మనము సంతోషముగా ఉండటానికి ఏ సొల్యూషన్ అయితే పరలోకములోనుండి ఆయన పంపిస్తున్నాడో, అది ఖచ్చితముగా కార్యము చేస్తుంది. పరసంబంధమైన దానికి అపజయము అనేదే లేదు. ఆయన ప్రేమను బట్టి దేవుని మార్గములు నాకొరకు సిద్ధపరచబడతాయి. దీనిలో ఆయన ప్రేమ ఉంది.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.౹ -యోహాను 3:16
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాటను గమనిస్తే, లోకములో ఉన్న మన యందు ఆయన ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. అనగా ఆయన ప్రేమ మాటిమాటికీ కనపరచబడుతుంది. అనుదినము ఆయన వాత్సల్యత, ప్రేమ నూతనముగా పుట్టుచున్నది. గనుక ఈ ప్రేమను బట్టి అనుదినము మనము ఆనందించునట్లుగా నూతనమైన మార్గములు మనకొరకు తెరువబడతాయి.
ఆయన ఆత్మల కాపరి అయి ఉన్నాడు. ఆయన మనకు కాపరిగా ఉన్నాడు గనుక మనము ఆనందించాలి. మన కాపరిని బట్టి మనకు లేమి అనేదే కలుగదు. హల్లేలూయా! ఆయన మనకు నిత్యము కాపరిగా ఉన్నాడు గనుక లేమి కలుగదు.
యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయు చున్నాడు శాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించు చున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువులయెదుట నీవు నాకు భోజనము సిద్ధ పరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరములో నేను నివా సము చేసెదను. -కీర్తనలు 23:1-6
మనకున్న మంచి ఆత్మల కాపరిని బట్టి మనము నిత్యము ఆనందించేవారముగా ఉన్నాము. ఒకవేళ గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, మనకున్న కాపరి గాఢాంధకారపు భయమునుండి మనలను తప్పించేవాడిగా ఉన్నాడు.
ఒక విషయమును బట్టి మనము మొత్తము జీవితాన్ని పోగొట్టుకొనే పరిస్థితులలో ఉన్నపుడు, మన కాపరి గొప్పవాడు గనుక ప్రాణము పోయే పరిస్థితులలో ప్రాణము పోసేవాడుగా ఉన్నాడు, ఆమేన్!
పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయు చున్నాడు. గొర్రెలు మేత మేస్తూ అక్కడ ఉన్న ప్రదేశములో ఉన్న మేత అంతా అయిపోయిన స్థితికి చేరుకున్నాయి. అయితే కాపరి ఎక్కడ పచ్చిక ఉందో అక్కడకు వాటిని నడిపించేవాడు గనుక, ఆ గొర్రెలు మేత పోగొట్టుకునే పరిస్థితికి రావు. ఖాళీ అయిపోతుంది అని కంగారు పడవద్దు, అయితే తిరిగి నింపే కాపరి నీకు ఉన్నాడు. ఈ విశ్వాసముతో మనము కూడా దేవునికి ప్రార్థిద్దాము. ప్రభువా నీవు మా కాపరి గనుక నిన్ను బట్టి మేము ఆనందిస్తున్నాము. నిన్ను బట్టి నా గృహములో లేమి ఉండదు అని మనము ప్రార్థనా పూర్వకముగా ప్రకటిద్దాము. మన కాపరి మనకొరకు సిద్ధపరచేవాడుగా ఉన్నాడు గనుక ఆ కాపరిని బట్టి మనము ఆనందించేవారిగా ఉండాలి.
ఆయన మనము ఆనందించునట్లుగా సమయాన్ని అనుగ్రహించినవాడుగా ఉన్నాడు. సమయము ముగించబడక అది పొడిగించబడింది. 2023 లో మనము ఆశించినది జరగలేదు అయితే 2024 మనకొరకు ఇచ్చాడు కదా? ఈ సమయము పొడిగించకుండా ఉంటే, మన జీవితములు ఏమయ్యేవి? ఈ సత్యము ఎరిగితే ఖచ్చితముగా నీవు ఆయన యందు ఆనందిస్తావు. కాలాలు, సమయములు ఆయన స్వాధీనములో ఉన్నాయి. ఈ సమయము మనది, హల్లెలూయా! మనము ఇంకా జీవముతో ఉన్నదే మనము ఆనందింపచేయబడుట కొరకే!
ప్రభువు నందు ఆనందించులాగున ఈరోజు మనము నేర్చుకున్నా నాలుగు విషయములు-
1. ప్రేమిస్తున్నాడు గనుక
2. కాపరి గనుక
3. జీవముతో ఉంచాడు గనుక
4. ఆయన మాట నెరవేర్చేవాడు గనుక