17-12-2023 – ఆదివారం మొదటి ఆరాధన

స్తుతిగీతము – 1

చిరకాల స్నేహితుడా _ నా హ్రుదయాల సన్నిహితుడా
నా తోడు నీవయ్యా _ నీ స్నేహం చాలయ్య
నా నీడ నీవయ్యా _ ప్రియ ప్రభువా యేసయ్యా
చిర కాల స్నేహం _ ఇది నా యేసు స్నేహం

బంధువులు వెలి వేసిన _ వెలివేయని స్నేహం
లోకాన లేనట్టి ఆ దివ్య స్నేహం _ నా యేసుని స్నేహం
చిరకాల స్నేహం ఇది నాయేసు స్నేహం

కష్టాలలో కన్నీళ్ళలో _ నను మోయు నీ స్నేహం
నను ధైర్య పరచి అదరణ కలిగించు నా యేసుని స్నేహం
చిరకాల స్నేహం ఇది నాయేసు స్నేహం

నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం
కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం
నా యేసుని స్నేహం
చిరకాల స్నేహం ఇది నాయేసు స్నేహం

స్తుతిగీతము – 2

నీవు చేసిన మేళ్లకు
నీవు చూపిన కృపలకు
వందనం యేసయ్యా

ఏపాటివాడనని నేను
నన్నెంతగానో ప్రేమించావు
అంచెలంచెలుగా హెచ్చించి
నన్నెంతగానో దీవించావు
||వందనం||

బలహీనుడనైన నన్ను
నీవెంతగానో బలపరచావు
క్రీస్తేసు మహిమైశ్వర్యములో
ప్రతి అవసరమును తీర్చావు
||వందనం||

స్తుతిగీతము – 3

ఊహించలేనివి అహ్లాదమైనవి
ఎన్నేన్నో మేలులు పొందండి ఈ వేళ
యేసయ్య త్రోవలు ఎనలేని ఈవులు
యేసయ్య వరములు ఇవన్నీ కావాలా
యేసే మార్గము యేసే గమ్యము
యేసే జీవము మనకంతా

యేసు, రక్షణకే ఆధారం
యేసు ఉంటే చాలు లేదు పాప భారం
నేడే రక్షణ కోరు మారే రోజే నేడు
దక్కే గొప్ప భాగ్యం సత్యం ఈ మాట

పాపములేని పావనుడేసు పాపము మోసాడే
శిలువలో మనకై విలువగు ప్రాణం నిలువున పెట్టాడే
తన రుదిరములో మన పాపం కడవరకును కడిగాడే
తెలియక తిరుగాడువారికి తెలియగ చెబుదామిల…

క్షమయేలేని నిష్ఫల జీవికి రక్షణ నిచ్చాడే
సాక్షిగ జేసి మోక్షము జేర్చ ప్రక్షాళించాడే
తన తనయులుగా మనమంత అనవరతమును నిలిపాడే
తెలియక తిరుగాడువారికి తెలియగ చెబుదామిల.

ఆరాధన వర్తమానము

మనలను తన సన్నీధిలో నిలబెట్టిన ఆ దేవదేవునికే మహిమ స్తోత్రము కలుగును గాక! దేవుని ప్రేమించేవారు, వాక్యము చేత నేర్చుకున్నవారు దేవుని స్తుతించేవారిగా ఉంటారు. మన దేవుడు స్తుతులకు అర్హుడైనవాడు. ఏ విధముగా అర్హుడు అయి ఉన్నాడో తెలుసుకుందాము.

కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరచుడి. -కీర్తనలు 100:4

మనము దేవుని సన్నిధికి, ఆయన ఆవరణములోనికి వెళ్ళునప్పుడు, కృతజ్ఞతార్పణలు చెల్లించాలి అని వాక్యము తెలియచేస్తుంది.

మరియు కోరదగినదిగాను చూడముచ్చటయైనదిగాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నియు ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటివలన క్షేమముగా బ్రదుకుచుండుటయే, ఇదియే వానికి భాగ్యము.౹ -ప్రసంగి 5:18

సొలొమోను మహా జ్ఞానము కలిగినవాడై ఈ మాటలు చెప్పుచున్నాడు. దేవుడు తనకు నియమించిన ఆయుష్కాలమంతా అన్నపానములు పుచ్చుకొనుచు, తన కష్టర్జితమంతటివలన క్షేమముగా బ్రదుకుటయే కోరదగినది మరియు భాగ్యముతో కూడినది.

మరియు దేవుడు ఒకనికి ధనధాన్యసమృద్ధి ఇచ్చి దానియందు తన భాగము అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసినయెడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదమువలన కలిగినదనుకొనవలెను.౹ -ప్రసంగి 5:19

మనము దేవునికి కృతజ్ఞతలు అర్పించడానిక్ ఒక కారణము మనము క్షేమముగా ఉండుట, ఈ దినము అన్నపానములు పుచ్చుకొనుట. మనమున్న కాలములో అందుబాటులో ఉన్నాసరే తినలేని ఆరోగ్యపరిస్థితులు. దీనినిబట్టి దేవుడు వీలు కలుగచేస్తే గానీ మనము కలిగిన దానిచేత తృప్తి చెందలేము అనే సత్యము మనము గ్రహించాలి. మనకు ధనధాన్య సమృద్ధి ఇచ్చువాడు దేవుడే.

ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను.౹ ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.౹ -కొలొస్సయులకు 1:16-17

అనగా మనకు ధనధాన్య సమృద్ధి ఆయనను బట్టియే కలుగుతుంది. దేవుడు నిర్ణయము ప్రకారమే మన జీవితములు వృద్ధిలోనికి తీసుకురాబడతాయి. ఉదాహరణకు దేవుడు దావీదును నిర్ణయించుకున్నాడు అయితే దావీదుకు గల అర్హతలు ఏమిటి? ఎటువంటి తర్ఫీదు రాజు అగుటకొరకు దావీదు పొందలేదు, గానీ దేవుని ఏర్పాటు మాత్రమే తనకు కలిగిన అర్హత.

దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు, సింహములనుండి ఎలుగుబంటులనుండి తన మందను కాపాడుకున్నాడు. ఈ మృగములకు ఎంతో బలముకలిగి ఉంటాయి అటువంటి బలము కలిగిన వాటి చేతిలోనుండి దేవుడే రక్షించాడు అని దావీదు చెప్పుచున్నాడు. వాటిని జయించుటకు కావలసిన బలము దేవుడు అనుగ్రహించాడు.

గొల్యాతు బలాఢ్యుడు మాత్రమే కాదు గానీ, మనుష్యుడు గనుక యుక్తి కలవాడు. యుద్ధములో నేర్పరి అనే మాట అతనిగూర్చి వ్రాయబడింది. అయితే దావీదు తన బలమును ఉపయోగించలేదు గానీ, అతనని ఎదుర్కోవడానికి కావలసిన జ్ఞానమును అనుగ్రహించాడు. గొల్యాతు దగ్గరకు వెళ్ళకుండానే, దూరమునుండి వడిసెల రాయితో జయించే జ్ఞానము దేవుడిచ్చాడు. గొల్యాతు యొక్క బలము దావీదుమీద ప్రభావము చూపకుండానే జయించే కృప దేవుడు దావీదునకు ఇచ్చాడు.

దేవుని యదార్థముగా వెంబడిస్తే చాలు, తన యొక్క సామర్థ్యము దెవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీవున్న పరిస్థితులకు తగినట్టుగా ఆ సామర్థ్యము అనుగ్రహిస్తాడు. గనుకయే మన దేవునికి కృతజ్ఞతార్పణ తప్పక చెల్లించాలి. దేవుడిచ్చిన క్షేమము, సమృద్ధి చేతనే మనము తృప్తి కలిగి ఉండగలుగతాము.

కొలొస్సయులకు 1:16-17 లో మనము చదివిన భాగములో మన జీవితము గూర్చిన సత్యము ఏమైనా ఉందా అని మనము గమనించాలి. ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని ఆయనయందు ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను.

ఆకాశమందున్నవియు అనగా పరలోక సంబంధమైన ఆశీర్వాదము అనగా నిత్యజీవము యేసయ్య ద్వారానే కలుగుతుంది. ఇంతవరకు అనుభవించిన భూసంబంధమైన ఆశీర్వాదము దృశ్యమైనవిగానూ, దేవుని చేత నిర్ణయించబడి ఇంతవరకు అనుభవించని ఆశీర్వాదాలు అదృశ్యమైనవిగాను మనము అర్థము చేసుకోవచ్చు. గనుక ఈరోజు వరకు నేను అనుభవిస్తున్న దానిని బట్టి దేవానీకు స్తోత్రము, ఇకముందు నాకొరకు నియమించబడిన ఆశీర్వాదముల కొరకు నీకు స్తోత్రము అని చెప్పగలగాలి.

సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను. అనగా,

సింహాసనము అనేది ఒక స్థానము. యేసయ్యను బట్టి ఆ స్థానము అనుగ్రహించబడుతుంది. ప్రభుత్వము అనగా పరిపాలన చేయుట. ప్రధానులుగా ఉండుట అనగా ఒక మంచి హోదా కలిగి ఉండుట. అలాగే అధికారము కలిగి ఉండుట ఇవన్నీ, ప్రభువు చేత, ప్రభువును బట్టి మన జీవితములో కలుగుతుంది. ఇప్పుడు జ్ఞానము లేకుండా ఉన్నాసరే, ఒక దినము నీకు జ్ఞానము అనుగ్రహించబడుతుంది. ఉన్నదానికి బట్టి కృతజ్ఞతా స్తుతులు చెల్లించునపుడు, ఏమి జరుగుతుంది అని ఆలోచిస్తే. అదృశ్యమైనదానిని దృశ్యమైనదానిగా మార్చేది సమయము. ఈ సమయమును సద్వినియోగపరుచుకుంటే అదృశ్యమైనవి దృశ్యమైనవిగా మార్చబడతాయి.

యేసయ్య 5000 వేల మందికి ఆహారము పెట్టిన సందర్భములో, కలిగినదాని బట్టి కృతజ్ఞత చెల్లించినప్పుడు, 5000వేల మందికి ఆహారము తయారు చేయడానికి పట్టే సమయము, కృతజ్ఞతా చెల్లించడము ద్వారా మార్చబడింది. మనము చెల్లించే కృతజ్ఞత ప్రభువు మనకొరకు నిర్ణయించినదానిని పొందుటకు అవసరమైన సమయము మార్చబడి త్వరగా సమకూర్చబడుతుంది. అందుకే దేవుని స్తుతించుట ఎంతో మంచిది, ధన్యకరమైనది.

రొట్టె తయారు చేయాలి అంటే, పిండి తయారుచేయాలి, దానిని ఒత్తి ఒక రూపములోనికి తీసుకురావాలి, తరువాత కాల్చాలి. అప్పుడు ఒక రొట్టె తయారు అవుతుంది. అయితే మనము చేసే కృతజ్ఞతలు చెల్లించినపుడు సూపర్నేచురల్ గా సిద్ధపరచబడుతుంది. ఇది ఒక నియమము. అది చదువులో అయినా, ఉద్యోగములో అయినా ఎక్కడ అయినా ఈ నియమము వర్తిస్తుంది.

ఈరోజు తెలుసుకున్న సత్యములను బట్టి మనము దేవునిని స్తుతిద్దాము.

ఆరాధన గీతము

లెక్కించలేని స్తోత్రముల్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్
ఇంత వరకు నా బ్రతుకులో
నువ్వు చేసిన మేళ్ళకై

ఆకాశ మహాకాశముల్
వాటియందున్న సర్వంబును
భూమిలో కనబడునవన్ని
ప్రభువా నిన్నే కీర్తించున్

నీటిలో నివసించు ప్రాణుల్
ఈ భువిలోన జీవ రాసులు
ఆకాశమున ఎగురునవన్ని
ప్రభువా నిన్నే కీర్తించున్

వారము కొరకైన వాక్యము

యేసయ్య పేతురును – “నీవు నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగాడు. ఈరోజు అదే ప్రశ్న నిన్ను నన్ను అడిగితే మన సమాధానము ఏమిటి? మనము వెంబడించే విధానములో మనము ఆయనను ఎంతగా ప్రేమిస్తున్నామో అని గమనించేవాడుగా ఉన్నాడు.

ఒక దినము ఒక పరిసయ్యుడు యేసయ్యను ఇంటికి పిలిచాడు. అయితే అక్కడకు ఒక స్త్రీ కూడా వచ్చింది. అప్పుడు వారి ఇద్దరి ప్రవర్తనను యేసయ్య గమనించినవాడుగా ఉన్నాడు.

ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమెయొక్క విస్తార పాపములు క్షమించబడెనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో, వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి -లూకా 7:47

ఆమె ప్రభువు కొరకు చేసిన కార్యమును బట్టి ఆమె హృదయములోని ప్రేమ ప్రత్యక్షపరచబడింది. అదే విధముగా ప్రభువు మనలను గమనిస్తే మన హృదయములో ఎంత ప్రేమ ప్రత్యక్షపరచబడుతుంది? ఒకవేళ మనము కూడా ఆ స్త్రీ వలె మన హృదయమును సిద్ధపరచుకుంటే మనముకూడా అదే సాక్ష్యము పొందుకుంటాము. దానికొరకు అసలు ఆమె చేసిందో నేర్చుకుందాము –

నీ నా జీవితములో దేవునిని ఎంతగా ప్రేమిస్తున్నామో అనే సంగతి దేవుడు గమనిస్తున్నాడు.

ఆ స్ర్తీవైపు తిరిగి, సీమోనుతో ఇట్లనెను–ఈ స్ర్తీని చూచుచున్నావే, నేను నీ యింటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లియ్య లేదు గాని, యీమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తలవెండ్రుకలతో తుడిచెను. -లూకా 7:44

యేసయ్య దినములలో బయటనుండి వచ్చునపుడు కాళ్ళు కడుకొనుట అనేది శుద్ధీకరణ ఆచారముగా ఉండేది. అయితే ఆత్మీయముగా “కాళ్ళు కడుగొనుట” అనేది పరిశుద్ధతకు సాదృశ్యముగా ఉంది. ఈ స్త్రీ జీవితము చూస్తే, ఆమె పరిశుద్ధముగా లేదు గానీ పాపముతో కూడిన జీవితమే. అయితే ఆయన పాద సన్నిధికి వచ్చి తాను కలిగిన పాప జీవితమునుండి విడుదల పొందుకోవడానికి ఇష్టము కలిగి ఉంది. ఆమె పరిశుద్ధత కోరుకుంటుంది. అలాగే మన నుండి కూడా దేవుడు కోరుకొనేది “పరిశుద్ధత”. దేవుని ప్రేమిస్తున్నాను అని నేను చెప్పుచూ పరిశుద్ధత కలిగి ఉండకపోతే, దేవునిని తృణీకరించినవారిగా అవుతాము. ప్రభువు పైరూపమును చూసేవాడు కాదు గానీ, హృదయమును చూసేవాడుగా ఉన్నాడు.

నీవు నేను దేవునిని ప్రేమిస్తున్నాము అంటే పాపమునుండి దూరముగా ఉండాలి అనే ఆశ కలిగిఉండాలి. దానికొరకు దేవుని సన్నిధికి రావాలి. కుక్క తన వాంతిని అదే తిన్నట్టుగా మనము విడిచిపెట్టిన పాపమువైపు మరలా వెళ్ళకూడదు. అప్పుడు దేవుని చేత మనము కూడా ప్రేమించబడతాము.

నీవు నన్ను ముద్దుపెట్టుకొనలేదు గాని, నేను లోపలికి వచ్చినప్పటి నుండి యీమె నా పాదములు ముద్దుపెట్టుకొనుట మానలేదు. -లూకా 7:45

ముద్దుపెట్టుకొనుట అనేది సహవాసమును సూచిస్తుంది. దేవునితో సహవాసము మానక కలిగిఉండుట అనేది దేవుని ప్రేమించేవారి లక్షణము. ఈరోజు దేవునితో నీ నా సహవాసము ఎలా ఉంది? ఈ విషయము తప్పని సరిగా మనము పరీక్షించుకోవాలి, సరిచేసుకోవాలి. ఒకడు ఏ పని చేయాలి అనుకున్నా ఎవరితో ఎక్కువ సహవాసము కలిగి ఉంటామో వారితోనే చెప్తాడు. సరదాగా అయినసరే ఏమైన సమయాన్ని గడపాలన్నా, మాటలు పంచుకోవలసి వచ్చినా సరే ఎవరితో ఎక్కువ సహవాసము కలిగి ఉంటామో వారితోనే చేస్తాము. అదేవిధము గా మనము ఇష్టపూర్వకముగా మన జీవితములోని ప్రతి విషయమును బట్టి దేవునితో సహవాసము కలిగి ఉండాలి. నీవు దేవుడు ఏకమైపోవుటయే సహవాసము.

నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండినయెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును.౹ -యోహాను 15:7

నాయందు (దేవుని యందు) మీరును మీయందు నా (దేవుని) మాటలును నిలిచియుండినయెడల – దేవునితో ఐక్యము అయిపోతాము. అనగా వాక్యము ప్రకారము మన జీవితమును సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి.

ఆయనతో సహవాసముచేసినయెడల నీకు సమాధానము కలుగును ఆలాగున నీకు మేలు కలుగును. -యోబు 22:21

దేవుని ప్రేమించడము ఎలా అంటే, పరిశుద్ధత కలిగి ఉండుట మరియు ఆయనతో సహవాసము చేయుట ద్వారా అని చూసాము. మూడవదిగా చూస్తే –

నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. -లూకా 7:46

తల అనేది శరీరములో ప్రాముఖ్యమైనది. పాదములు అనేవి అంత ప్రాముఖ్యమైనది కాదు. అయినప్పటికీ ఆ పాదములకే అత్తరు అనే విలువైన దానిని అర్పించింది. అయితే ఈ సందర్భములో అత్తరు అనేది ఒక సాక్ష్యము గా మనము చూడవచ్చు. అనగా దేవుని ప్రేమించే విషయములో ఒక మంచి సాక్ష్యముగా ఉండాలి. అత్తరు ఎక్కడ ఉన్నా సరే దాని సువాసన ఎలా అయితే వ్యాపిస్తుందో, అలాగే మన సాక్ష్యము కూడా మనము ఎక్కడ ఉన్న సరే, అక్కడ కనపరచబడుతుంది.

మన దేవుడు మనలను ప్రేమించి మనకొరకు వచ్చినవాడుగా ఉన్నాడు. అటువంటి ప్రభువు కొరకు పరిశుద్ధత కలిగి ఉండాలి అనే ఆశను కలిగి ఉండాలి. దేవునితో సహవాసము కలిగి ఉండాలి. దేవుని కొరకు సాక్ష్యము కలిగి ఉండాలి. ఆ విధముగా మనము సిద్ధపడదాము. అప్పుడు దేవుని సమాధానము మన వెంట వస్తుంది.