స్తుతిగీతము – 1
ఆనందం నీలోనే – ఆధారం నీవేగా
ఆశ్రయం నీలోనే – నాయేసయ్యా స్తోత్రార్హుడా
అర్హతే లేనినన్ను ప్రేమించినావు
జీవింతునిలలో నీకోసమే సాక్షార్థమై
|| ఆనందం ||
పదేపదే నిన్నే చేరగా – ప్రతిక్షణం నీవే ధ్యాసగా
కలవరాల కోటలో – కన్నీటి బాటలో
కాపాడే కవచముగా – నన్ను ఆదరించిన
దివ్య క్షేత్రమా – స్తోత్ర గీతమా
|| ఆనందం ||
నిరంతరం నీవే వెలుగుని – నిత్యమైన స్వాస్థ్యం నీదని
నీసన్నిధి వీడక – సన్నుతించి పాడనా
నీకొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా
సత్య వాక్యమే – జీవ వాక్యమే
|| ఆనందం ||
సర్వ సత్యమేనా మార్గమై – సంఘ క్షేమమేనా ప్రాణమై
లోకమహిమ చూడక – నీజాడను వీడక
నీతోనే నిలవాలి – నిత్య సీయోనులో
నీదర్శనం నా ఆశయం
|| ఆనందం ||
స్తుతిగీతము – 2
నీతో గడిపే ప్రతి క్షణము
ఆనంద బాష్పాలు ఆగవయ్యా
కృప తలంచగా మేళ్లు యోచించగా
నా గలమాగదు స్తుతించక – నిను కీర్తించక
యేసయ్యా యేసయ్యా – నా యేసయ్యా
||నీతో||
మారా వంటి నా జీవితాన్ని
మధురముగా మార్చి ఘనపరచినావు
నా ప్రేమ చేత కాదు
నీవే నను ప్రేమించి
రక్తాన్ని చిందించి
నన్ను రక్షించావు
||యేసయ్యా||
గమ్యమే లేని ఓ బాటసారిని
నీతో ఉన్నాను భయము లేదన్నావు
నా శక్తి చేత కాదు
నీ ఆత్మ ద్వారానే
వాగ్ధానము నెరవేర్చి
వారసుని చేసావు
||యేసయ్యా||
ఆరాధన వర్తమానము
దేవుని సన్నిధిలో ఉన్న మనము ఆయనను స్తుతించాలి. ఎందుకంటే,
మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతోకూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింప జేసెను.౹ -1 పేతురు 1:3
ఈ వాక్యమును ధ్యానము చేస్తే, మనకు ఇవ్వబడిన రక్షణను బట్టి మన దేవునిని స్తుతించాలి. తిరిగి జన్మించడము అంటే, మనము రక్షణ పొందుట. ఆ రక్షణను బట్టి ఆయన స్వాస్థ్యములో పాలుపంపులు ఉంటున్నాయి. ఆయన స్వాస్థ్యము మనకొరకు సిద్ధపరచినది, సంపాదించినది. అది పరిశుద్ధుల స్వాస్థ్యముగా చెప్పబడింది.
మనము పరిశుద్ధులుగా ఉండటానికి యేసయ్య రక్తము చిందించాడు, మరణించాడు, తిరిగి లేచాడు. అలా తిరిగి లేచుటను బట్టి మనకు ఈ స్వాస్థ్యము సిద్ధపరచబడింది. పరిశుద్ధుల స్వాస్థ్యము అంటే పరలోకము. అయితే ఈ లోకములో ఉన్నప్పుడు మనకు ఇవ్వబడిన స్వాస్థ్యము సమాధానము, సంతోషము మరియు ధన్యకరమైన జీవితము.
కావున మేము అధైర్యపడము; మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్యపురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు.౹ మేము దృశ్యమైనవాటిని చూడక అదృశ్యమైనవాటినే నిదానించి చూచుచున్నాము గనుక౹ క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాకొరకు అంత కంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ జేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు; అదృశ్యమైనవి నిత్యములు. -2 కొరింథీయులకు 4:16-18
ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము; అపాయములోనున్నను కేవలము ఉపాయము లేనివారము కాము;౹ తరుమబడు చున్నను దిక్కులేనివారము కాము; పడద్రోయబడినను నశించువారము కాము.౹ యేసుయొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసుయొక్క మర ణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడును వహించుకొని పోవుచున్నాము.౹ ఏలయనగా, యేసుయొక్క జీవము కూడ మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు, సజీవులమైన మేము ఎల్లప్పుడు యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము.౹ -2 కొరింథీయులకు 4:8-11
ఈ మాటలు క్రీస్తు నందు అనుగ్రహింపబడిన జీవితమును గూర్చి చెప్పుచున్న మాటలు. శ్రమ ఉన్నప్పటికీ ఇరుకున పడలేదు అని చెప్పుచున్నారు. ఎందుకంటే, ఎక్కడైతే శ్రమ ఉంటుందో, అక్కడ యేసు యొక్క జీవము ప్రత్యక్షపరచబడుతుంది. యేసు యొక్క జీవము స్వాస్థ్యముగా ఇవ్వబడింది. ఈ భూలోకములో మనకు ఇవ్వబడిన స్వాస్థ్యమైన క్రీస్తునందలి జీవము ను మనము అనుభవించాలి.
అందుకు–నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును.౹ -2 కొరింథీయులకు 12:9
మరియు నేను చెప్పునదేమనగా, వారసుడు అన్ని టికిని కర్తయైయున్నను బాలుడైయున్నంతకాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు.౹ -గలతీయులకు 4:1
మనకు కృప, జీవము స్వాస్థ్యముగా ఇవ్వబడింది. అయితే బాలుడుగా ఉంటున్నాము కాబట్టి దానిని అనుభవించలేకపోతున్నాము.
ఆయన పరిపూర్ణతలోనుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి.౹ ధర్మశాస్త్రము మోషేద్వారా అను గ్రహింపబడెను; కృపయు సత్యమును యేసు క్రీస్తుద్వారా కలిగెను.౹ -యోహాను 1:16-17
యేసయ్యను అంగీకరించినప్పుడు కృప స్వాస్థ్యముగా ఇవ్వబడింది.
నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నియు గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపు కొందుము. మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధికబలమున్నయెడల ఎనుబది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము. -కీర్తనలు 90:9-10
ధర్మ శాస్త్రము మోషే ద్వారా ఇవ్వబడింది. మోషే ధర్మ శాస్త్రమును వెంబడించినవాడుగా చెప్పుచున్న మాటలు ఇవి. మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధికబలమున్నయెడల ఎనుబది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అని చెప్పుచున్నాడు.
అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చె దను శ్రమలో నేనతనికి తోడై యుండెదను అతని విడిపించి అతని గొప్ప చేసెదను దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను నా రక్షణ అతనికి చూపించెదను. -కీర్తనలు 91:14-16
ఈ మాటలు దావీదు అనుభవపూర్వకముగా చెప్పుచున్న మాటలు. ఎందుకంటే దేవుని కృపను ఆయన అనుభవించినవాడుగా ఉన్నాడు. దీర్ఘాయువు అంటే దేవుడు ఈ భూమి పై నిర్ణయించిన కాలము. కృప ఉన్నవాడు అతనికి నిర్ణయించిన ఆయుష్కాలమంతా జీవిస్తాడు, మధ్యలో అతని జీవము కోల్పోడు. ఎందుకంటే మధ్యలో మింగడానికి ప్రయత్నించే మరణమునుండి దేవుని కృప విడిపిస్తుంది, తప్పిస్తుంది.
మనకు దేవుని స్వాస్థ్యముగా ఇవ్వబడిన కృపను బట్టి మనము దేవునిని స్తుతిద్దాము, ఆరాధిద్దాము. ఎందుకంటే కృపను నమ్ముకున్నవాడు నిశ్చయముగా తప్పించబడును, విడిపించబడును, హెచ్చించబడును. ఈ సత్యమును నీవు నమ్మినట్టయితే, ఆ కృపను ఆధారము చేసుకుని బ్రతుకుదాము.
యేసయ్య రాకపోతే మనకు కృప లేదు. కృప లేకుండా మనకు జీవితమే లేదు. ఈ సత్యము గ్రహిస్తే మన హృదయము కృతజ్ఞతతో నిండిపోతుంది.
అయినను నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయి యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కు వగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపయే.౹ -1 కొరింథీయులకు 15:10
పౌలుకు కృప లేకపోతే తాను లేడు అనే సత్యము అర్థమయింది, అంతే కాక ఆయా సందర్భములలో అనుభవించాడు. ఒక సందర్భములో పౌలును కొట్టి చనిపోయాడు అనుకుని ఊరికి వెలుపల పడవేసిన సందర్భములో, మరలా తరువాతి రోజున లేచి వాక్యమును బోధిస్తున్నాడు. ఎలా సాధ్యమైంది? కేవలము దేవుని కృప చేతనే మరణమునుండి విడిపించబడి జీవమును పొందుకొని దేవుని కొరకు సాక్ష్యము ఇస్తున్నాడు.
కృప అనేది సూపర్ నేచురల్. ఎందుకంటే మానవ రీతిగా ఏమి చేసుకోలేమో అది దేవుడు తన కృప ద్వారా చేస్తాడు. మరణకరమైన స్థితిలో పౌలుకు తనకు తాను జీవమును పొందుకోలేడు. సూపర్ నేచురల్ గా దేవుని కృపను బట్టి జీవమును పొందుకున్నాడు. కృపను గూర్చిన ఈ సత్యము ఎరిగిన పౌలు, క్రీస్తు యొక్క జ్ఞానము సంపాదించుకోవడానికి సమస్తము పెంటకుప్పతో సమానముగా ఎంచి వదిలిపెట్టాడు. అయితే దేనిని బట్టి పౌలు ఇలా ఉండలిగాడు? కేవలము దేవుని కృపను బట్టి మాత్రమే.
మరియు అపరాధము విస్తరించునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసికొని యేలాగు ఏలెనో, ఆలాగే నిత్యజీవము కలుగుటకై, నీతిద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలునిమిత్తము పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. -రోమా 5:20
పాపము ఎక్కడ ఉంటుందో అక్కడ మరణము ఉంటుంది. మరణము ఎక్కడ ఉంటుందో అక్కడ కృప ఉంటుంది. ఆ కృప మరణముపై ఏలేదిగా ఉంటుంది. పాపము అపవాది యొక్క ప్రేరేపణ శక్తిని ఆధారము చేసుకుంటుంది. అయితే కృప దేవుని శక్తిని ఆధారము చేసుకుని మన వద్దకు వస్తుంది. ఎక్కడెక్కడ అపవాది నీ జీవితమును లాక్కుపోవడానికి ప్రయత్నిస్తున్నాడో, అక్కడ కృప ఆ ప్రయత్నమును లయపరుస్తుంది.
అందుకే కృప ఉన్నంతకాలము దేనికి భయపడనవసరములేదు. మన భయము ఎప్పుడూ కూడా, ఎమి జరుగుతుందో అనే భయమే. అయితే కృపను నమ్ముకున్నవాడు ఏ మాత్రము భయపడడు. నీవు నమ్ముకున్న కృప సూపర్ నేచురల్ కాబట్టి, ఏ పరిస్థితి అయినా సరే, భయపడనవసరము లేదు. మన యేసయ్య పరిపూర్ణతలోనుండి కృప వెంబడి కృప మనము పొందుకుంటున్నాము.
నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? -యోబు 4:6
నీవు యదార్థమైన భక్తి కలిగి ఉంటే నీకు ధైర్యము పుడుతుంది. ఒకవేళ నీలో భయము పుడుతుంది అంటే, నీ భక్తిలో ఎక్కడో సమస్య ఉంది అని అర్థము. దేవుడు మన హృదయమును లక్ష్యము చేసేవాడుగా ఉన్నాడు. నీవు యదార్థమైన భక్తి కలిగి ఉంటే, ఆ యదార్థ హృదయమును బట్టి దేవుడు తన కృపను సమృద్ధిగా దయచేస్తాడు. మనము కూడా ఆ కృపను నమ్ముకుని ఆయా పరిస్థితులలో నిలబడితే, ఆ కృప ఎలా పనిచేస్తుందో కార్యరూపకముగా నీ జీవితములో ప్రత్యక్ష పరచబడుతుంది.
అందుకే పౌలు నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చెయ్యగలను అని చెప్పుచున్నాడు. కృపను అనుభవిస్తే, మన సాక్ష్యము కూడా ఇదే. గనుక మనకు స్వాస్థ్యముగా ఇవ్వబడిన కృపను అనుభవించడానికి సిద్ధపడదాము. దానికి నీవు ఆ కృపను నమ్ముకొని నీ పరిస్థితిలో నిలబడాలి. అప్పుడు నీ భక్తి నీకు ధైర్యము పుట్టిస్తుంది.
ఆరాధన గీతము
నాకు నీ కృప చాలును ప్రియుడా
నాకు నీ కృప చాలును
శ్రమలతో నిండిన ఈ జీవితములో
నాకు నీ కృప చాలును ప్రియుడా
నాకు నీ కృప చాలును
ఆశ్రయించుటకు స్థలమే లేదు
ఆదరించుటకు మనుష్యులు లేరు
సంపూర్ణ జీవము కలిగిన నాథా
నీవే నా ఆధారము ఈ భువి లో
నీవే నా ఆదరణ
ప్రభువు నీకు ఏమి ఇచ్చాడో అది జ్ఞాపకము చేసుకో. రక్షణ పొందుకున్న నీకు స్వాస్థ్యముగా తన కృపను, జీవాన్ని ఇచ్చాడు నీ దేవుడు. ఈ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు, ఆ కృప ఎలా ఉంటుందో అని పరిశీలించి, పరిశోధించారు అని లేఖనములు చెప్పుచున్నవి. ఆ కృప నిజమైనది, అమూల్యమైనది.
పౌలు అయితే తనకు అనుగ్రహించబడిన కృపను నిరర్థకము చెయ్యను అని అంటున్నాడు. మరి నీకు అనుగ్రహించిన కృప సంగతి ఏమిటి? నిరర్థకము చేస్తున్నావా? నిలబడి ఉన్నావా? ఏమిటి నీ సాక్ష్యము?
నీ భక్తి యదార్థమైనదైతే, దేవుని కృపలో నిలిచి ఉంటావు. ఒకవేళ నీవు ఆచారయుక్తమైన భక్తి చేస్తున్నట్టయితే, ఆ అమూల్యమైన కృపను వ్యర్థము చేసుకుంటున్నావు ప్రియుడా మేలుకో!
ఇంతవరకు నీవు కృపను ఆధారము చేసుకోలేదేమో, ఇకనుండి అయినా సరే దేవుడు ప్రేమించి ఇచ్చిన కృపను ఒడిసిపట్టుకుని ఆధారముగా చేసుకుందామా?
సమయోచితమైన కృపాసనము యొద్దకు వెళదామా? అనగా ఆ కృప అనుగ్రహించబడే సమయములో మనము సిద్ధముగా ఉందామా? జక్కయ్య వలే ఆ సమయమునకు వద్దకు వస్తున్న కృపను విడిచిపెట్టక ఒడిసిపట్టుకుందామా?
యేసయ్యను చేర్చుకున్న వెంటనే జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. ఈరోజు కృపను గూర్చిన మాటలను నీవు నీ హృదయములో చేర్చుకుంటే, ఆ ప్రకారము నీవు నీ జీవితమును సిద్ధపరచుకుంటే, పరిశుద్ధుల స్వాస్థ్యము అయిన ఆ కృప, జీవమును అనుభవించగలుగుతావు.