విస్తారమైన ప్రేమ

ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమెయొక్క విస్తార పాపములు క్షమించబడెనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో, వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి -.

లూకా 7:47

దేవుని నీవు కూడా విస్తారముగా ప్రేమిస్తున్నావా? ఏమి చేస్తే మనము విస్తారముగా ప్రేమించువారిగా అవుతాము? గర్భఫలమైన జ్యేష్ఠపుత్రుని అర్పిస్తేనా? వేలాది నదులంత విస్తార తైలము అర్పిస్తేనా? ఏమిచేస్తే ఈ సాక్ష్యాన్ని పొందుకుంటాము?

ఈ స్త్రీని గమనిస్తే, “ఆ స్ర్తీవైపు తిరిగి, సీమోనుతో ఇట్లనెను–ఈ స్ర్తీని చూచుచున్నావే, నేను నీ యింటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లియ్య లేదు గాని, యీమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తలవెండ్రుకలతో తుడిచెను – లూకా 7:44”. యేసయ్య ఇంటిలోనికి రాగానే, యేసుపాదాలని కడిగి తుడిచింది. ఇలా కడగటము, తుడవటము దేనిని తెలియచేస్తుంది? యేసయ్య అక్కడ ఉండగలుగునట్టుగా, ఆయన పాదాలని కడిగి శుభ్రపరచింది. ఆ స్త్రీ గురించి తను ఒక పాపాత్మురాలు అని రాయబడింది. అయితే ఇప్పుడు తను కన్నీరు కారుస్తుంది. మరి దేవుడు ఉన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడైనప్పటికీ, ఇప్పుదు ఆ విరిగి నలిగిన హృదయములో నివసించడానికి ఇష్టపడుతున్నాడు.

శతాధిపతిని గమనించినట్టయితే, “ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగియై చావ సిద్ధమైయుండెను. శతాధిపతి యేసునుగూర్చి విని, ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. -లూకా 7:2-3”. అప్పుడు, “వారు యేసునొద్దకు వచ్చి–నీవలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు; అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజమందిరము తానే కట్టించెనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. -లూకా 7:4-5”. కావున యేసు వారితోకూడ వెళ్లెను. కాని యేసు అక్కడకి వెళ్ళగానే, “శతాధిపతి తన స్నేహితులను చూచి–మీ రాయనయొద్దకు వెళ్లిప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు; నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. -లూకా 7:6”. మొదట పిలవమని చెప్పినది శతాధిపతే, కాని ఎప్పుడైతే యేసు దగ్గరకు రాగానే తన స్థితి ఎరిగినవాడై, నేను పాత్రుడను కాను అని ఒప్పుకుంటున్నాడు.

అలాగే, సీమోను పేతురు అది చూచి, యేసు మోకాళ్లయెదుట సాగిలపడి ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. -లూకా 5:8. అప్పటివరకు అదే దోనెలో యేసు ఉన్నాడు. ఎప్పుడైతే యేసునుగూర్చి గ్రహించాడో, వెంటనే తన స్థితిని గ్రహించినవాడుగా ఉన్నాడు.

అలాగే మన జీవితాన్ని గమనించినప్పుడు, యేసయ్య కూడా మన జీవితంలోనికి వచ్చాడు కానీ, ఆయన నివసించలేని విషయాలు అనేకము మన జీవితంలో ఉంటున్నాయి. మనము ఆయనను ప్రేమిస్తున్నాము అంటే, ఆయన నివసించగలుగునట్లు, హృదయాన్ని శుభ్రపరచాలి. ఆయనగురించి మనకు అర్థమయితే ఖచ్చితంగా మనం మన పరిస్థితి ఒప్పుకుని శుభ్రపరిచేవారముగా ఉంటాము. అప్పుడు మనముకూడా విస్తారముగా ప్రేమించాము అనే సాక్ష్యాన్ని కలిగిఉంటాము.

మొదటిగా: మన హృదయము, మన జీవితములో ప్రభువు నివసించలేని ప్రతి పరిస్థితిని ఒప్పుకుని, శుభ్రపరచుకోవాలి.

ఆ స్త్రీని విషయంలో ఇంకా చూసినట్టయితే, “నీవు నన్ను ముద్దుపెట్టుకొనలేదు గాని, నేను లోపలికి వచ్చినప్పటి నుండి యీమె నా పాదములు ముద్దుపెట్టుకొనుట మానలేదు. -లూకా 7:45”. ఇది సహవాసమును సూచిస్తుంది. మనజీవితంలో ప్రభువు వచ్చి ఎన్నిసార్లు సహవాసం చేస్తున్నాము? పండగలప్పుడా? వాక్యము గద్దించినప్పుడా? చుట్టపుచూపుగానా? ఎలా ఉంది మన సహవాసం? మనము కూడా దేవునితో సహవాసము చేయవలసినవారిగా ఉన్నాము. ఎలా సహవాసం చేస్తాము? ఆమె విషయం చూస్తే, ముద్దుపెట్టుకొనుట మానలేదు. పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలముతోను, పూర్ణ మనస్సుతోను ఆయనతో సహవాసం చెయ్యాలి. కేవలం ప్రార్థన, వాక్యధ్యానము, ఆరాధన సమయములుమాత్రమే కాదు, ప్రతీ పరిస్థితులలో ఆయనతో మమేకమై ఉండాలి. సహవాసము అనేది ఐక్యతను తెలియజేస్తుంది. యేసుతో సహవాసము అంటే, యేసుతో ఐక్యము అగుట. యేసు పరిశుద్ధుడుగనుక ఆయనతో గల మీ సహవాసమునుబట్టి, మీరుకూడా పరిశుద్ధులుగానే ఉంటారు. ఉదాహరణకు, దేవునినుండి ఒక వాక్యము ఎదైనా పరిస్థితిలో గనుక మనకు ఇవ్వబడితే, ఆయనతో సహవాసము కలిగిఉన్నట్టయితే, దానిని స్వీకరిస్తాము. లేకపోతే, వేరే రీతిలో అలోచిస్తాము.

రెండవదిగా: పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలముతోను, పూర్ణ మనస్సుతోను యేసుతో సహవాసం చెయ్యాలి.

ఇంకొంచెం ముందుకువెళ్ళి ఈ స్త్రీని చూసినట్టయితే, ప్రభువుచెప్తున్నాడు “నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. -లూకా 7:46”. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. “నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మ ను మీకనుగ్రహించును.౹ -యోహాను 14:16.” అని యేసు చెప్తున్నాడు. చాలామంది పరిశుద్ధాత్మదేవుడిని నమ్మలేనివారుగా ఉనారు. ఈ స్త్రీ అత్తరు పూసింది. ఆ అత్తరు వాసన మనతో ఉండటానికి, ఆ సీసా మనము కూడాబెట్టుకుని వెళ్ళక్కరలేదు. ఆ అత్తరు మన శరీరానికి తాకితే చాలు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. సీసా పగిలింది అత్తరు వాసన గది అంతా వ్యాపించింది. యేసు చనిపోయి తిరిగిలేచి తండ్రిదగ్గరకు వెళ్ళారు, కానీ ఆయన నామములో ఇవ్వబడిన పరిశుద్ధాత్మ మనతోనే, మనలోనే ఉంటున్నారు. ఆ ఆదరణకర్త, సత్యస్వరూపి  పరిశుద్ధాత్మను నమ్మి ఆయన సహవాసములో మనము ఉండాలి.  

మూడవదిగా: ఆదరణకర్త, సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్మను నమ్మి ఆయన సహవాసములో మనము ఉండాలి.

ఆవిధంగా ఆమె విస్తారముగా ప్రేమించింది, ఆమె విస్తారమైన పాపములు క్షమించబడి, ఆ పాపములను బట్టి కలగవలసిన విస్తారమైన నష్టములనుండి తప్పించబడి, విస్తారమైన అశీర్వాదముతో ఆమె జీవితం నింపబడింది. అలా మనముకూడా ప్రభువు విస్తారముగా ప్రేమించి విస్తారముగా అశీర్వదించబడులాగున, దేవుడు సహాయము చేయునుగాక. ఆమేన్!

యూట్యూబ్ లో ఈ వీడియో చూడండి