స్తుతిగీతము – 1
స్తోత్రము స్తుతి స్తోత్రము
వేలాది వందనాలు
కలుగును గాక నీకే మహిమ
ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము
యేసయ్య యేసయ్య యేసయ్య (4)
శూన్యము నుండి సమస్తము కలుగజేసెను
నిరాకారమైన నా జీవితమునకు రూపము నిచ్చెను
యేసే నా సర్వము
యేసే నా సమస్తము
||యేసయ్య||
పరము నుండి భూమికి దిగివచ్చిన యేసు
సిలువ మరణమునొంది మార్గము తెరిచెను
యేసే నా రక్షణ
యేసే నా నిరీక్షణ
||యేసయ్య||
స్తుతిగీతము – 2
యెహోవా మహిమ నీ మీద ఉదయించెను
తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును (2)
ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది
అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది (2)
లెమ్ము నీవు తేజరిల్లుము
ప్రభువు కొరకు ప్రకాశించుము (2)
చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది
జీవ వాక్యము చేబూని జ్యోతివలే లెమ్ము (2)
జనములు నీ వెలుగునకు పరుగిడి వచ్చెదరు
రాజులు నీ ఉదయకాంతికి త్వరపడి వచ్చెదరు (2)
||లెమ్ము||
ఒంటరియైన వాడు వేయి మంది అగును
ఎన్నిక లేని వాడు బలమైనట్టి జనమగును (2)
ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును
నీ దుఃఖదినములు సమాప్తమగునని ప్రభువు సెలవిచ్చెను (2)
||లెమ్ము||
ఆరాధన వర్తమానము
దేవుని వాక్యము జుంటి తేనె ధారలకన్న మధురమైనది. అయితే ఆవాక్యమును పాటించినపుడే దానిలోని మధురమును అనుభవించగలుగుతాము. “ప్రతి దినము నూతనముగా మన మీద ప్రేమ పుడుతున్నది” అని వాక్యము చెప్పుచున్నది. అయితే ఆ వాక్యములోని సత్యమును ఎరిగి, స్వీకరించి ఆ వాక్యము ప్రకారముగా చేసినప్పుడు నూతనముగా పుట్టే ఆ ప్రేమను అనుభవించగలుగుతాము.
దేవుని వాక్యముద్వారా తెలియజేయబడే సత్యము నీవు గ్రహించిననాటినుండి, నీ జీవితములో ప్రతిసారీ స్థిరపరచబడుతుంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అయితే ఆయనను అంగీకరించిన వారు ఆయన పిల్లలు అగుదురు. అనగా అంగీకరించిననాటినుండి ప్రతీదినము, ఆయనను తండ్రిగా కలిగియుందురు. అందుకే ప్రభువు వాక్యము ద్వారా విడుదలయ్యే ప్రతీ సత్యమును ఆసక్తితో పట్టుకుని నిలబడాలి.
ప్రభువు ఒకవేళ సీయోనులోనుండి నిన్ను ఆశీర్వదిస్తాను, నీ పోషకుడను నేనే, అని ప్రభువు చెప్పినప్పుడు నీ ఆలోచన ప్రతీ పరిస్థితిలో ప్రభువు ఎలా పోషిస్తాడో అని కనిపెట్టేదిగా మారాలి. ఎందుకంటే, ఆ సత్యమును నీవు గ్రహించి నిలబడ్డావు కాబట్టి. మనము ఉన్నది అంత్య దినములలో ఎత్తబడే సమయములో ఉన్నాము గనుక, దేవుని వాక్యములోని సత్యములను గ్రహించేవారుగా ఆ సత్యముమీద నిలబడేవారుగా ఉంటేనే తప్ప మనము ఎత్తబడే గుంపులో మనము ఉండము.
పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్.౹ -రోమా 9:5
ఈ వాక్యములో చూస్తే, శరీరమును బట్టి క్రీస్తు ఇశ్రాయేలువారిలో పుట్టినప్పటికీ, యేసయ్య నిరంతరము స్తోత్రములకు అర్హుడై ఉన్నాడు అనగా మనము నిత్యం ఆయనను స్తుతించాలి మన జీవితము ఆయన స్తుతించబడే విధముగా ఉండాలి అని అర్థము. ఈ దినమునుండి దేవుడు నీలో స్తుతించబడే విధముగా జీవితమును సిద్ధపరచుకుందాము.
వీరు ఇశ్రాయేలీయులు; దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలును ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులును వాగ్దానములును వీరివి.౹ -రోమా 9:4
యేసయ్యను అంగీకరించినప్పుడు మనము దేవుని కుమారులుగా చేయబడ్డాము. దేవుని మహిమ పొందుకునేవారిగా చేయబడ్డాము. దేవుని మహిమను గూర్చి ధ్యానము చేసినట్టయితే, ఆదాము జీవిత్ములో పాపము చేయనంతవరకు దేవుని మహిమ నింపబడిన జీవితము కలిగినవాడు. దానిని బట్టి దేవుని చిత్తము ఆదాము పట్ల ఏమైతే ఉందో అది నూటికి నూరుశాతము నెరవేరుతూవచ్చింది.
దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా–మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశపక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.౹ -ఆదికాండము 1:28
ఈ మాట ఆదాము జీవితములో వందశాతము నెరవేరింది. ఆదాము దేవుని మహిమ కలిగిన్ ఉన్నంతకాలము ఆదాము ఏమి చెప్తే అది జరుగుతూ వచ్చింది. ఇప్పుడు యేసయ్య ద్వారా దేవుని మహిమ మనకు కూడా అనుగ్రహించబడింది. ఆ మహిమను బట్టి మనము కూడా ఏలేవారిగా ఉండగలము అదే దేవుని చిత్తము. అందుకే యేసయ్యలో మనకు అటువంటి కృపను అనుగ్రహించాడు.
అలాగే దేవుని నిబంధన ఇశ్రాయేలీయులతో చేసాడు. ధర్మశాస్త్రము, ఆరాధన క్రమములు, వాగ్దానములు కూడా వారికి ఇవ్వబడినవి. అయితే యేసయ్యను అంగీకరించిన మనకు కూడా నిబంధన వర్తిస్తుంది, దేవుని ధర్మశాస్త్రము యేసయ్యలో నెరవేరి పరిశుద్ధాత్మద్వారా మనకు అందుబాటులో ఉంది అలాగే ఆయనను ఆరాధించుట అనే క్రమము కూడా మనకు ఇవ్వబడింది.
నిబంధన ఇద్దరి మధ్య చేయబడిన ఒడంబడిక అది ప్రస్తుత కాలమునకు సంబందించినది. వాగ్దానము అనేది భవిష్యత్తులో చేయబోయేదాని కొరకు ఇచ్చిన మాట. అయితే వాగ్దానము అయినా నిబంధన అయినా కొన్ని నియమముల ప్రకారము మాత్రమే వర్తిస్తుంది. అబ్రహామునకు ఇచ్చిన వాగ్దానము “నిందారహితుడుగా జీవించుట” అనే నియమమును బట్టి నెరవేర్చబడింది. అలాగే ఇశ్రాయేలీయులకు ఇచ్చిన నిబంధన “దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను” నెరవేర్చుట అనే నియమమును బట్టి స్థిరపరచబడుతూ వచ్చింది.
ఆయనను బట్టి ఇవి మనకు ఉన్నాయి గనుక మనము ఆయనను మనసారా ఆరాధిద్దాము.
ఆరాధన గీతము
ఆరాధనకు యోగ్యుడా ఆది నుండి ఉన్నవాడా
ఆనందముతో నింపేవాడా ఆశ్చర్యకరుడా నా యేసురాజా
యేసు రాజా యేసు రాజా యేసు రాజా
పరిశుద్ధమైన వాడా పూజింపదగినవాడా
కాలాలు మారిన యుగాలు మారిన మారనివాడా నా యేసురాజా
కన్నీరు తుడిచేవాడా కౌగిటిలో చేర్చేవాడా
కాలాలు మారిన యుగాలు మారిన మారనివాడా నా యేసురాజా
పరిపూర్ణమైన వాడా పరలోక మేలు వాడా
కాలాలు మారిన యుగాలు మారిన మారనివాడా నా యేసురాజా
నిబంధన స్థిరపరచువాడా వాగ్దానము నెరవేర్చువాడా కాలాలు మారిన యుగాలు మారిన మారనివాడా నా యేసురాజా
వారము కొరకైన వాక్యము
ప్రతి ఆదివారము ప్రభువు శరీరాన్ని, రక్తాన్ని మనము స్వీకరిస్తున్నాము. అయితే కొంతమందికి ఈ అవకాశము ఉండదు. మరి వారి పరిస్థితి ఏమిటి? తీసుకునే వారి పరిస్థితి ఏమిటి? అనేది నేర్చుకుందాము.
నేను మీకు అప్పగించిన దానిని ప్రభువువలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి౹ దానిని విరిచి–యిది మీకొరకైన నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.౹ ఆప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొని–యీ పాత్ర నా రక్తమువలననైన క్రొత్తనిబంధన; మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.౹ -1 కొరింథీయులకు 11:23-25
ప్రతీ వారము ఈ వాక్య ప్రకారము మనము ప్రభువు బల్లలో పాలుపంపులు కలిగి ఉంటున్నాము. ఆయన శరీరములో ఏముంది ఆ శరీరము విరవబడటము ద్వారా ఏమి జరిగింది అనేది మనము తెలుసుకుందాము.
ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి౹ -యోహాను 1:14
వాక్యము శరీరధారియై మన మధ్య నివాసము చేసెను. ఆ శరీరములో ఏముంది? “ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను.౹ -యోహాను 1:4”. అయితే ఈ శరీరము విరువబడింది, ఎందుకు అని చూస్తే, “బదులుగా” జరిగిన కార్యముగా మనము చూడవచ్చు. అనగా మనము పాపమును బట్టి మరణించవలసిన పరిస్థితిలో ఆ శరీరము విరువబడింది ఆయన శరీరములోని జీవము విడిచిపెట్టినాడు. దానిని బట్టి మన పాపములకు ప్రాయశ్చిత్తము జరిగింది, పరిశుద్ధులుగా చేయబడ్డాము.
దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకమునుండి దిగివచ్చిన ఆహారమిదే.౹ పరలోకమునుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును; మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవముకొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. -యోహాను 6:50-51
మన జీవితములో అనారోగ్యముగా ఉన్న పరిస్థితులలో మనము వైద్యుని వద్దకు వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చిన మందుల ద్వారా ఆ అనారోగ్యము నివారించబడుతుంది. మనము తీసుకుంటున్న ఆయన శరీరము, మనము నిత్యము జీవించులాగున పరలోకమునుండి ఇవ్వబడిన ఆహారము అయి ఉన్నది. అనగా మన జీవితములో నిత్యము జీవింపచేయబడే లాగున సూపర్నేచురల్ ఆధారముగా ఆయన శరీరము ఉన్నది. అందుకే మనము బల్లలో చేయివేసినప్పుడు ఆయన శరీరము నా కొరకు ఇవ్వబడిన జీవము అని ఎరిగి స్వీకరించాలి. ఆ శరీరమును స్వీకరించునపుడు జీవము మనలో ప్రవేశిస్తుంది. అయితే ఈ విషయమును గ్రహించినపుడే దానిని అనుభవించగలుగుతాము.
నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము.౹ జీవముగల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును.౹ -యోహాను 6:56-57
అనగా ఆయనను బట్టే మన జీవితములు కొనసాగించబడతాయి గానీ, మనము కలిగి ఉన్న సామర్థ్యమును బట్టి కాదు అని అర్థము చేసుకోగలము. “నా మూలముగా జీవించును” అనగా “నేను వానియందును నిలిచియుందును” అని చెప్పిన ప్రభువు మనలో ఉండి నన్ను జీవింపచేసేవాడిగా ఉంటాడు. అనగా ప్రభువుతో మనము ఏకమైపోతాము.
ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.౹ సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు; ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఆయన ఆదియైయుండి మృతులలోనుండి లేచుటలో ఆదిసంభూతుడాయెను.౹ ఆయనయందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు, ఆయన సిలువరక్తముచేత సంధిచేసి, ఆయనద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటిని ఆయనద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయెను.౹ -కొలొస్సయులకు 1:17-19
సమస్తమునకు ఆధారభూతుడైన వాడు ఇప్పుడు మనలో ఉంటున్నాడు. కలిగి ఉన్నదేదియూ ఆయన లేకుండ కలుగలేదు, అటువంటివాడు మనలో ఉంటున్నాడు. ఒకవేళ అనారోగ్యమునుబట్టి జీవించలేని స్థితిలో ఉన్నట్టయితే, ఆయనను బట్టి మనలో జీవము కలుగుతుంది. ఒకవేళ ఆర్థికమైన పరిస్థితులలో మరణకరమైన స్థితిలో ఉంటే, ఆయనలో సర్వసంపదలు ఉన్నవి గనుక మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవ సరమును తీర్చును.౹ -ఫిలిప్పీయులకు 4:19
ఆయన శరీరమును రక్తమును స్వీకరించునపుడు ఆయనను జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకు ఆ శరీరము విరువబడింది? అనే సత్యము ఎరిగి ఉండాలి. మనము పరిశుద్ధముగా ఉండుటకు ఆయన శరీరము విరువబడింది, రక్తము చిందించబడింది. గనుక మనము పాపములో ఉంటూ ఆయన శరీరములో చెయ్యివేస్తే, అది మనకు మేలు చేయకపోగా, కీడుకొరకే మనము పాలుపంపులు కలిగి ఉన్నట్టుగా అవుతుంది.
సిలువ రక్తముచేత సంధి చేయబడింది. అనగా పరలోకమందున్నవైనా, భూలోకమందున్నవైనా పొందునట్లుగా ఆయన రక్తము సిలువలో చిందించబడింది. అయితే పరిశుద్ధమైన జీవితము ద్వారా మాత్రమే వీటిని పొందుకోగలము.
అందుకు యేసు వారితో ఇట్లనెను–జీవాహారము నేనే; నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నాయందు విశ్వాసముంచు వాడు ఎప్పుడును దప్పిగొనడు. తండ్రి నాకు అనుగ్రహించువారందరును నాయొద్దకు వత్తురు; నాయొద్దకు వచ్చువానిని నేనెంతమాత్రమును బయటికి త్రోసివేయను.౹ నా యిష్టమును నెరవేర్చు కొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని.౹ -యోహాను 6:35, 37-38
తండ్రి చిత్తము ప్రకారమే యేసయ్య తన వద్దకు వచ్చువారిని త్రోసివెయ్యట్లేదు అని ప్రభువు చెప్తున్నాడు. అయితే తండ్రి చిత్తము ఏమై ఉంది? మనము తృప్తి కలిగి ఉండుట అనేది ఆయన చిత్తము. ఆయన మన కాపరి గనుక మనకు లేమి కలుగదు. అనగా ఎప్పుడైతే ఆహారము తక్కువయ్యేటప్పటికే, ఆహారము లభించే మరొక చోటు సిద్ధపరుస్తాడు. ఆహారము అనగా మనము జీవము కలిగి ఉండునట్లుగా ఇవ్వబడేది. ఏ ఏ పరిస్థితులలో జీవము కోల్పోయేదిగా ఉంటుందో, ఆ పరిస్థితిలో జీవము నింపబడుతుంది. అనారోగ్యమును బట్టి జీవము కోల్పోతుంటే, ఆరోగ్యము దయచేయుటనుబట్టి జీవము ఇవ్వబడుతుంది. ఇది మనలో నిలిచిఉన్న ప్రభువును బట్టి కలిగే మహిమను బట్టి సూపర్ నేచురల్ గా జరుగుతుంది.
కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములుగలవారైనందున ఆప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయన కూడ రక్తమాంసములలో పాలివాడాయెను.౹ -హెబ్రీయులకు 2:13
అపవాది యొక్క బలము మరణము. ఆ మరణాన్ని జయించడానికి యేసయ్య శరీరములో, రక్తములో పాలివాడైనాడు. అపవాది మన జీవితమును పాపముకొరకు ప్రేరేపించే శక్తి కలిగినది. మనకే తెలియకుండా మన జీవితములో అపవాదిచేత పాపము చేయునట్లుగా ప్రేరేపించినపుడు, ప్రభురక్తములో పాలుపంపులు కలిగి ఉన్నమనలోని యేసయ్య మహిమ ఆ శక్తిని జయించేవారిగా చేస్తుంది.
అయితే ఒకవేళ ప్రభుబల్లలో చేయివేసే అవకాశము లేకపోతే ఎలా? వాక్యము శరీరధారియై వచ్చెను గనుక, వాక్య ప్రకారము జీవించుటయే ఆయన శరీరములో రక్తములో పాలుకలిగి ఉండుట.
యేసుయొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసుయొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడును వహించుకొని పోవుచున్నాము.౹ -2 కొరింథీయులకు 4:10
మరణానుభవమును అనగా ఎందుకు యేసయ్య శరీరము, రక్తము దేనికొరకు అర్పించబడిందో ఎరిగి ఉండే అనుభవములోనికి వెళ్ళుట. అప్పుడు ఆయన శరీరరము, రక్తములో ఉన్న జీవము, మహిమ మనలో ప్రత్యక్షపరచబడుతుంది.
ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు.౹ -1 కొరింథీయులకు 11:29
ఈ సత్యమునుకూడా మనము ఎరిగి ఉండాలి. ప్రభువు శరీరము అని ఎరిగి, అనగా ఎందుకొరకు ఆ శరీరము విరువబడిందో, ఆ శరీరమును బట్టి మనకు ఏమి ఇవ్వబడిందో, అనే సత్యము ఎరిగినవాడిగా జీవించుటను బట్టి గాక, ఇష్టారీతిగా పాపములోనే ఉంటూ పాలుకలిగి ఉన్నట్టయితే అది శిక్షావిధికి కారణము అవుతుంది. ఒకవేళ తప్పుచేసినట్టయితే ఒప్పుకొని క్షమాపణ పొందుకొని బల్లలో చేయివేయండి.