అపవాది తంత్రాలను ఎరిగియుండుడి

నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.

1 పేతురు 5:8

ఎర్రసముద్రం ఎదురుగా ఉన్నప్పుడు, మోషే ప్రభువును అడిగినప్పుడు. నన్ను ఎందుకు అడుగుతున్నావు? సాగిపో అని చెప్పినప్పుడు. మోషే తన కర్ర పైకెత్తి విశ్వాసంతో సిద్దపడి ఇప్పుడు చూసిన ఐగుప్తుప్రజలను మరెన్నడూ చూడరు అని ప్రకటించాడు. మోషే తాను చెయ్యవలసిన సిద్ధపాటు తాను జరిగించాడు అప్పుడు దేవుని మహాశక్తి ప్రత్యక్షపరచబడింది.

అపవాదికి విరోధికి ఎవరు? ఆత్మీయంగా ఉన్నవారు వాడికి విరోధులు. మనకు శ్రమ వచ్చింది అంటే, దేవుని గొప్ప మహిమ ప్రత్యక్షపరచబడే అవకాశం వచ్చినట్టే. ఈ అపవాది మనం ఎక్కడ దొరుకుతామా అని వెతుకుతూ ఉంటాడు. అదే మనము తన తంత్రాలు ఎరిగిన వారుగా ఉన్నట్టయితే మనము దొరుకుతామా?

ఇదిగో పదునెనిమిది ఏండ్లనుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తెయైన యీమెను విశ్రాంతిదినమందు ఈ కట్లనుండి విడిపింప దగదా? అని అతనితో చెప్పెను. -లూకా 13:16. ఈ వాక్యములో గమనించినట్టయితే, అబ్రహాము కుమార్తె అనగానే ఒక విశ్వాసి లేదా ఆత్మీయమైన జీవితం గలిగిన స్త్రీని సాతాను బంధించాడు. ఆమె సాతానుకు దొరికింది ఒక 18 సంవత్సరాలు బంధంపబడింది. 

త్రోవప్రక్క నుండువారెవరనగా, వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్య మెత్తికొనిపోవును. -మార్కు 4:15. మనము వినిన వాక్యమును సహితము ఎత్తుకునిపోయేదిగా అపవాది ఉన్నాడు. సూపర్నేచురల్ వాక్యము మనకు అందించబడుతుండగా, మన శరీరాన్ని ప్రేరేపించి ఆ వాక్యమును ఎత్తుకుపోయేదిగా అపవాది ప్రయత్నిస్తుంది. ఒకవేళ ఆ వాక్యమును ఎత్తుకుపోయే అవకాశం ఇచ్చామా, వాడి తంత్రములో పడిపోయినట్టే. వాక్యము విషయంలో మనము జాగ్రత్తకలిగి ఉండాలి. ఎప్పుడూ ఆ వాక్యమును హత్తుకుని ఉండాలి. 

అయితే మరియ ఆ మాటలన్నియు తన హృదయములో తలపోసికొనుచు భద్రము చేసికొనెను. -లూకా 2:19. గొఱ్ఱెల కాపరులు తమతో చెప్పిన సంగతులనుగూర్చి విన్నవారందరు మిక్కిలి ఆశ్చర్యపడిరి కానీ మరియమాత్రము. ఆ విషయములను హృదయంలో భద్రముచేసుకుంది. మనముకూడా అలాగే ఉండాలి. ఎప్పుడైతే మన హృదయంలో వాక్యము భద్రముచేసుకుంటామో, ఆ వాక్యపు వెలుగులో చీకటి ఉండదు, ఆ వాక్యపు జీవము ప్రత్యక్షపరచబడాల్సిందే.

అపవాది తంత్రాలను ఎదిరించడంలో ముఖ్యమైన విధానం. విత్తబడిన వాక్యాన్ని, ధ్యానిస్తూ, విశ్వాసంతో జ్ఞాపకము చేసుకుంటూ ఉండాలి. తద్వారా సాతాను మీనుండి ఆ వాక్యమును ఎత్తుకుపోలేడు.

యేసుప్రభువు జీవితంలో అపవాది ఎలా శోధించాడో చూస్తే, అందుకు యేసు –మనుష్యుడు రొట్టెవలన మాత్రమే జీవించడు అని వ్రాయబడియున్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను. -లూకా 4:4. ఇక్కడ అపవాది ప్రయత్నము ఏమిటి అంటే, వ్రాయబడిన వాక్యమునుండి యేసును తప్పించాలి అని. మన దేవుడు మనలను ఎలా నడిపిస్తాడు? వాక్యము ద్వారా రక్షించి, వాక్యము ద్వారా నడిపించి, వాక్యము ద్వారానే పోషిస్తాడు. అందుకే మనము వాక్యమునుండి ఎప్పుడూ తొలగిపోకూడదు.

మరొక సందర్భములో, “నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదని వానికి ప్రత్యుత్తర మిచ్చెను – లూకా 4″8”. యేసయ్య అపవాదికి ఎందుకు దొరకలేదు? అంటే లేఖన సత్యములను గ్రహించి, అపవాది తంత్రములను ఎరిగినవాడుగా ఉన్నాడు.

అయినాకూడా అపవాది తన ప్రయత్నములు మానలేదు. “నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పెను. -లూకా 4:11”. అయితే యేసయ్య వాడి తంత్రములను ఎరిగినవాడిగా వాక్యానుసారముగానే సమాధానం చెప్తున్నాడు. అందుకు యేసు –నీ దేవుడైన ప్రభువు ను శోధింపవలదు అని చెప్పబడియున్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను. -లూకా 4:12. 

అపవాదియొక్క మొదటి ప్రయత్నము, నీలో విత్తబడిన వాక్యమును ఎత్తుకుపోవడమే. వాక్యము అనగా, “క్రీస్తు మహిమను కనుపరచు సువార్త”. అపవాది నీనుండి వాక్యమును ఎత్తుకుపోయింది అంటే, దేవుని మహిమ కనుపరచబడకుండా చేసినట్టే.

అబ్రహాము కు దేవుడు చెప్పిన మాట, “నీ సంతానము ఇసుకరేణువులవలే అగును”. అదే మాట నమ్మాడు. ఇస్సాకును బలి ఇవ్వమన్నప్పుడు, అబ్రహాము దేవుని మాటను నమ్మినవాడుగా ఆప్రకారం చెయ్యడానికి సిద్ధపడ్డాడు. మన జీవితంలో వాక్యమును ఎత్తుకుపోయే అవకాశము ఇచ్చావంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, “దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకా శింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగ జేసెను”. దేవుని వాక్యము గనుక మనలో ఉంటే, దేవుని మాట ఈరోజు నెరవేరకపోయినాకూడా, రేపైనా నెరవేరుతుంది అనే నమ్మకంతో ఉంటాము.

అప్పుడు పేతురు –అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీయొద్ద నున్నపుడు నీదే గదా? అమ్మిన పిమ్మట అది నీ వశమై యుండలేదా? యెందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించు కొన్నావు? ౹ -అపొస్తలుల కార్యములు 5:3,4. ఇక్కడ అననీయకు ఎందుకు ఆ ఉద్దేశ్యం కలిగింది? అపవాది ప్రేరేపణకు లోబడిపోయాడు. అపవాది ఎలా ప్రేరేపించాడు? అననీయ తన భూమిని అమ్మాడు. అమ్మినది దేవునికొరకు అమ్మాడు, అయితే ఈ అపవాది లోకానుసారమైన ఆలోచన తనలో పుట్టించింది. మొత్తం ఇచ్చేస్తే నీకెలాగా? అని ప్రేరేపించింది. లోకములోనిదంతా మోసము, అబద్ధమే. ఆ లోకము మనకెందుకు? 

అపవాది మనలను పడగొట్టే రెండవ విధానము, లోకమును మీజీవితంలోకి తీసుకురావడానికి చేసే ప్రయత్నం.

అంతట పండ్రెండుమంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను -లూకా 22:3. ఈ యూదా యేసుయొక్క శిష్యుడు. అయితే యూదా బలహీనత “ధనము”. ఆ బలహీనతను ఆసరాగా చేసుకుని సాతాను యూదాలో ప్రవేశించాడు. ప్రధానయాజకులు యేసును బంధించాలి అని చూస్తున్న సమయములో యూదా బలహీనతను సాతాను ఉపయోగించుకున్నాడు.

అపవాది తంత్రములు ప్రయోగించే మూడవ విషయము, “శరీర బలహీనత”.

నలువది దినములు నలువదిరాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా -మత్తయి 4:2. ఉపవాసంలో ఉన్నప్పుడు సాతాను ప్రయత్నించలేదు గాని, ఆకలిగొన్నప్పుడు ప్రయత్నించింది.

ఈ మూడు విషయాలలో గనుక నీవు జాగ్రత్తపడితే, ఆత్మానుసారముగా దేవుని కుమారులుగా మనం ఉన్నంతకాలము, సాతాను ప్రయత్నించిన ప్రతిసారీ మనమే విజయంపొందేవారుగా ఉంటాము. ఈరోజునుంచి అపవాది తంత్రములను ఎరిగి ఉండేవారిగా ఉండులాగున దేవుడు సహాయము చేయును గాక.

యూట్యూబ్ లో ఈ వర్తమానం వినండి