స్తుతిగీతము – 1
స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము
యేసు నాథుని మేలులు తలంచి
దివారాత్రములు కంటిపాపవలె కాచి (2)
దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి (2)
గాడాంధకారములో కన్నీటి లోయలలో (2)
కృశించి పోనీయక కృపలతో బలపరచితివి (2)
సజీవ యాగముగా మా శరీరము సమర్పించి (2)
సంపూర్ణ సిద్దినొంద శుద్ధాత్మను నొసగితివి (2)
సీయోను మార్గములో పలుశోధనలు రాగా (2)
సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి (2)
సిలువను మోసుకొని సువార్తను చేపట్టి (2)
యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి (2)
పాడెద హల్లెలూయా మరనాత హల్లెలూయా (2)
సద పాడెద హల్లెలూయా ప్రభుయేసుకే హల్లెలూయా (2)
స్తుతిగీతము – 2
నీలో సమస్తము సాధ్యమే (2)
మహొన్నతుడా యేసయ్యా
బలవంతుడా యేసయ్యా (2)
ఆరాధింతును – నిన్నే స్తుతియింతున్ (4)
అలసియున్న నా ప్రాణమును సేదదీర్చువాడవు
జీవజలపు ఊటనిచ్చి తృప్తిపరచువాడవు (2)
ప్రార్థనలన్ని ఆలకించువాడవు నీవు
అడిగినవన్ని ఇచ్చేవాడవు నీవు (2)
శోధన వేదనలలో జయమిచ్చువాడవు
బుద్దియు జ్ఞానమిచ్చి నడిపించువాడవు (2)
నిత్యజీవం ఇచ్చేవాడవు నీవు
మాతో ఉన్న ఇమ్మానుయేలువు నీవు (2)
స్తుతిగీతము – 3
నా నీతి సూర్యుడా – భువినేలు యేసయ్యా
సరిపోల్చలేను నీతో- ఘనులైన వారిని (2)
రాజులకే……… మహారాజవు
కృపచూపే…….. దేవుడవు
నడిపించే……… నజరేయుడా
కాపాడే……….. కాపరివి (2)
శ్రమలలో – బహుశ్రమలలో- ఆదరణ కలిగించెను
వాక్యమే – కృపావాక్యమే – నను వీడని అనుబంధమై (2)
నీమాటలే – జలధారాలై – సంతృప్తి నిచ్చెను
నీమాటలే – ఔషధమై – గాయములు కట్టెను
నీ మాటే మధురం
రాజులకే……… మహారాజవు
కృపచూపే…….. దేవుడవు
నడిపించే……… నజరేయుడా
కాపాడే……….. కాపరివి
మేలులకై – సమస్తమును – జరిగించుచున్నావు నీవు
ఏదియు – కొదువ చేయవు – నిన్నాశ్రయించిన వారికి (2)
భీకరమైన కార్యములు – చేయుచున్నవాడా
సజీవుడవై – అధిక స్తోత్రము – పొందుచున్నవాడా
ఘనపరుతును నిన్నే
ప్రేమించే ………………యేసయ్యా
నీవుంటే ……………….చాలునయా
నడిపించే …………….. నజరేయుడా
కాపాడే …………………కాపరివి
సంఘమై – నీ స్వాస్థ్యమై - నను నీ యెదుట నిలపాలని
ఆత్మతో – మహిమాత్మతో- నన్ను ముద్రించి యున్నావు నీవు (2)
వరములతో – ఫలములతో – నీకై బ్రతకాలని
తుదిశ్వాస – నీ సన్నిధిలో – విజయం చూడాలని
ఆశతో ఉన్నానయా
కారుణించే………యేసయ్యా
నీ కోసమే…….. నా జీవితం
నిను చేరే ఆశయం తీరాలయ్యా
నిను చూసే………. ఆక్షణం. రావాలయ్యా
ఆరాధన వర్తమానము
దేవుని సన్నిధికి వచ్చినమనము ఆయనను స్తుతించడానికి సిద్ధపడవలసిన వారముగా ఉన్నాము. మన దేవుడు నీవు స్తుతించడానికి ఆయన కారణభూతుడిగా ఉన్నవాడు. “నా స్తుతికి కారణభూతుడవగు దేవా, మౌనముగా ఉండకుము -కీర్తనలు 109:1” అని కీర్తనా కరుడు చెప్పుచున్నాడు.
ఉన్నతస్థలముననుండు మహిమగల సింహాసనము మొదటినుండి మా పరిశుద్ధాలయ స్థానము. -యిర్మీయా 17:12
యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థతనొందుదును, నన్ను రక్షించుము నేను రక్షింపబడు దును, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతు డవు.౹ -యిర్మీయా 17:14
మనము స్తోత్రములు చెల్లించులాగున ఆయన కార్యము మన జీవితములలో చేసేవాడుగా ఉన్నాడు. మన జీవితములు ఆయన మహిమ కొరకై ఉన్నాయి. మన జీవితములు ఆయన సొత్తు గనుక, మన జీవితములలో ఆయన మహిమ కార్యములు జరుగులాగున ఆయనే బాధ్యత తీసుకుంటున్నాడు.
తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయనియెడల యెహోవావారిని అప్పగింపనియెడల ఒక్కడు ఎట్లు వేయిమందిని తరుమును? ఇద్దరు ఎట్లు పదివేలమందిని పారదోలుదురు? వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గమువంటిది కాదు ఇందుకు మన శత్రువులే తీర్పరులు. -ద్వితీయోపదేశకాండము 32:30-31
ఈ భాగములో చూస్తే, మన దేవుడు ఎలా స్పందిస్తాడో అనే విషయము గ్రహించగలుగుతాము. ఆసా జీవితములో జ్ఞాపకము చేసుకుంటే, విస్తారమైన సైన్యము తన మీదికి దండెత్తి వచ్చినప్పుడు, బలము లేనివారికి బలము అనుగ్రహించే దేవుడైన నీవంటివాడు ఎవడూ లేడు అని చెప్పగలుగుతున్నాడు.
యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును.౹ -యిర్మీయా 17:7
ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతినొందించువాడను బ్రదికించువాడను నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే నా చేతిలోనుండి విడిపించువాడెవడును లేడు -ద్వితీయోపదేశకాండము 32:39
మన దేవునికి సమస్తము సాధ్యమే! ఈరోజు మన జీవితములలో ఆయన మహిమ పొందులాగున, మన పరిస్థితులు మారునట్లుగా, ఆయనను మనము స్తుతించునట్లుగా కార్యములు జరిగించేవాడుగా ఉన్నాడు. ఈరోజు ఖచ్చితముగా దేవుని కార్యము జరిగించబడుతుంది అనే నమ్మకము కలిగి మన దేవుని ఆరాధిద్దాము.
దేవుని వాక్కు విలుల మనము శ్రమల గుండా, శోధనలగుండా వెళ్ళినప్పుడే తెలుస్తుంది. అంతా సవ్యముగా ఉన్నప్పుడు, వచ్చిన వాక్కును అంతగా పట్టించుకోము. అయితే మన దేవుని గూర్చిన సత్యము ఎన్నటికీ మారనిది. ఈరోజు మనము తెలుసుకున్న సత్యము ఏమిటి? మన జీవితము ఆయన సొత్తు, మన జీవితములలో ఆయనే మహిమపరచబడతాడు, మన జీవితములలో అవసరమైన ప్రతీదీ దయచేయువాడు, కష్ట పరిస్థితులలో ఘనకార్యములు జరిగించువాడు ఆయనే!
అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చె దను శ్రమలో నేనతనికి తోడై యుండెదను అతని విడిపించి అతని గొప్ప చేసెదను దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను నా రక్షణ అతనికి చూపించెదను. -కీర్తనలు 91:14-16
నీవు కూడా నీ దేవునిని ప్రేమించేవాడవుగా ఉన్నట్టయితే, నిన్ను కూడా తప్పించువాడిగా, ఘనపరచేవాడిగా నీ దేవుడు ఉన్నాడు. నీవు పెట్టే ప్రతి మొర్రకు ఉత్తరమిచ్చేవాడిగా ఉంటాడు, నిన్ను తృప్తిపరచేవాడిగా ఉంటాడు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఎంత మహాభాగ్యమో కదా ఆయనను నమ్ముకొని, ప్రేమించేవారి జీవితములు? మన పరిస్థితులు వ్యతిరేకముగా వచ్చిన ప్రతీ సమయములో, మనకు రక్షణ కలుగచేసేది దేవుని సన్నిధే! ఒక్క క్షణము ప్రభువు కునుకు తీసి ఉంటే, మన జీవితములు ఆ ఒక్క క్షణములోనే ముగించబడేవి. అంటే నీ జీవితము కోల్పోయేవిధముగా ఒక్క అవకాశము కూడా ఎవ్వరికీ, ఏ పరిస్థితికీ దేవుడు తనను ప్రేమించేవారి విషయములలో ఇవ్వడు. అనగా మనలను విడువక దేవుని కృప వెంటాడుతూ, కాపాడుతూ ఉంది. గనుక శ్రమకాలము ఇప్పుడు ఉన్నప్పటికీ, ఖచ్చితముగా ఆశీర్వాదకాలము ఉంటుంది.
ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు.౹ -హెబ్రీయులకు 12:2
యేసయ్య తన యెదుట ఉంచబడిన ఆనందము కొరకు ప్రస్తుతము అవమానమును నిర్లక్ష్యపెడుతున్నాడు. మనముకూడా అదేవిధముగా ఉండాలి. అప్పుడు శ్రమల తరువాత మహిమ ఖచ్చితముగా చూస్తాము.
మీకు కలుగు ఆ కృపనుగూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణనుగూర్చి పరిశీలించుచు, తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైనశ్రమలనుగూర్చియు, వాటి తరువాత కలుగబోవు మహిమలనుగూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చునపుడు, ఆ ఆత్మ, యే కాలమును ఎట్టి కాలమును సూచించుచువచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి.౹ -1 పేతురు 1:10
శ్రమ ముగించబడిన తరువాత మహిమ వెంబడిస్తుంది. అందుకే ఏ శ్రమలలో ఉన్నప్పటికీ, అది ముగించబడిన తరువాత ఖచ్చితముగా రెట్టింపు మహిమ వెంబడిస్తుంది. అందుకే మన దేవునిని ఎప్పుడూ స్తుతించి, ఆరాధించేవారిమిగా ఉండాలి. అట్టి రీతిగా దేవునిని కలిగి ఉంటే ఎంత భాగ్యము? హనోకు దేవునితో నడచినవాడుగా ఉన్నాడు. గనుక మరణము చూడక దేవుని యొద్దకు మహిమ గల ప్రదేశములలోనికి కొనిపోబడ్డాడు.
నీవు స్తుతించునట్టుగా దేవుడు మహిమకార్యములు జరిగిస్తాడు. అంటే నీవు స్తుతించుచుండగానే నీ జీవితములో ఎదో కార్యము జరగడానికి సిద్ధపరచబడుతుంది. మనము జరిగిన, పొందిన వాటి విషయములలోనే కాక, ఇకముందు జరగబోయే కార్యములగూర్చి విశ్వాసముతో ఆరాధించగలగాలి. అలా నీవు స్తుతించుచుండగానే నీ జీవితములో ఎదో కార్యము జరగడానికి సిద్ధపరచబడుతుంది. దేవుని కార్యము ఏదైనా సరే అది నీ ఊహకు అందని కార్యమే అవుతుంది.
ఆరాధన గీతము
నన్ను కాపాడు నా దేవుడు కునుకడు కునుకడు
నన్ను రక్షించు నా యేసుడు నిద్రపోడు నిద్రపోడు
స్తుతులకు పాత్రుడు స్తోత్రార్హుడు
మృత్యుంజయుడు నిత్యముండువాడు
వేటగాని ఉరినుండి విడిపించువాడు
ఏ తెగులు రాకుండా రక్షించువాడు
తన రెక్కల చాటున నన్ను దాచువాడు
తన మార్గములన్నిటిలో నన్ను నడిపించువాడు
గాఢాంధకారములో తోడుండువాడు
ఏకీడు రాకుండా కాపాడువాడు
నా కన్నీరంతటిని తుడిచివేయువాడు
ప్రార్థనలన్నిటిని ఆలకించువాడు
వారము కొరకైన వాక్యము
మన ఆత్మీయ జీవితము ఎంతో ప్రాముఖ్యమైనది. ఇదే మన భౌతికమైన వ్యక్తిగత జీవితములకు ఆధారమైనది. అయితే చాలా మంది ఈ ఆత్మీయ జీవితములలో పడిపోతున్నారు, లేస్తున్నారు, మరలా పడిపోతున్నారు. అయితే మన ఆత్మీయమైన జీవితము స్థిరముగా ఎప్పుడు ఉంటుంది?
అప్పటినుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకతీసి, మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు.౹ -యోహాను 6:66
ఈ శిష్యులు ఎటువంటివారు? అని చూస్తే, “కాబట్టి యేసును ఆయన శిష్యులును అక్కడ లేకపోవుట జనసమూహము చూచి నప్పుడు వారా చిన్న దోనెలెక్కి యేసును వెదకుచు కపెర్నహూమునకు వచ్చిరి – యోహాను 6:24” అనగా యేసయ్యను వెతుకుతూ ఉన్నవారు. ఈ మాటలు మన జీవితమును సూచిస్తున్నాయి. మనము కూడా దేవుని అంగీకరించినవారమే, ఆయన కొరకు నిలబడినవారమే. అయినప్పటికీ పడిపోయినవారిగా ఉంటున్నాము. దానికి కారణము ఏమిటో తెలుసుకుందాం. ఏమి చేస్తే స్థిరముగా ఉంటామో కూడా తెలుసుకుందాం.
పరలోకమునుండి దిగి వచ్చి, లోకమునకు జీవము నిచ్చునది దేవుడనుగ్రహించు ఆహారమై యున్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను.౹ కావునవారు–ప్రభువా, యీ ఆహారము ఎల్లప్పుడును మాకు అనుగ్రహించుమనిరి.౹ -యోహాను 6:33-34
ఇక్కడవరకు బాగానే ఉంది జనులు ఎంతో ఆసక్తితో ఆ ఆహారము దయచేయుము అని ప్రభువును అడిగారు. అయితే యేసయ్య తరవాత ఏమి చెప్పాడో చూస్తే –
అందుకు యేసు వారితో ఇట్లనెను–జీవాహారము నేనే; నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నాయందు విశ్వాసముంచు వాడు ఎప్పుడును దప్పిగొనడు.౹ -యోహాను 6:35
ఈ మాటలు వినగానే వారి హృదయము కఠినము అయ్యింది. అప్పుడు వారు, “ఆయననుగూర్చి సణుగుకొనుచు–ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా?౹ ఈయన తలిదండ్రులను మన మెరుగుదుము గదా? –నేను పరలోకమునుండి దిగి వచ్చియున్నానని ఈయన ఏలాగు చెప్పుచున్నాడనిరి.౹ -యోహాను 6:41-42”.
ఈ ఆత్మీయమైన జీవితము బలముగా స్థిరముగా ఉండాలి అంటే, నీ జ్ఞానము చొప్పున ఆలోచించకూడదు. జనులు కేవలము మానవరీతిగానే ఆలోచిస్తున్నారు గానీ యేసయ్య మాటలలోని ఆంతర్యము అర్థము చేసుకోలేకపోయారు. అందుకే వారి హృదయములు ఎరిగిన యేసయ్య వారితో ఇలా అన్నాడు.
యేసు –మీరు సూచనలను చూచుటవలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుటవలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.౹ -యోహాను 6:26
మన ఆత్మీయమైన జీవితము దేవునిని మాటల ప్రకారము జీవించాలి. మన మానవ స్వభావముతో ఏమీ అర్థము చేసుకోలేము. ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.౹ -1 కొరింథీయులకు 2:14. మనము దేవుని ఆత్మ కలిగి ఉంటేనే గానీ దేవుని విషయములు మనము గ్రహించలేము.
కాబట్టి యేసు–మీరు కూడ వెళ్లిపోవలెనని యున్నారా? అని పండ్రెండుమందిని అడుగగా౹ సీమోను పేతురు– ప్రభువా, యెవనియొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు;౹ నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి యెరిగియున్నామని ఆయనతో చెప్పెను.౹ -యోహాను 6:67-69
పేతురు ఈ మాటలు చెప్పగలగడానికి కారణము ఏమిటి? మిగతా శిష్యులు ఆత్మీయముగా పడిపోయి ఉన్నారు. పేతురు మాత్రము ఆత్మీయముగా నిలబడి ఉన్నాడు. ఎనుదుకు?
సీమోను – ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమియు దొరకలేదు; అయినను నీ మాటచొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. -లూకా 5:5
ఈ పేతురు జాలరి. చేపలు పట్టడములో విశేష అనుభవము కలిగినవాడు. అయినప్పటికీ, యేసయ్య లోతుగా వెళ్ళి వల వెయ్యమని చెప్పినప్పుడు, తన జ్ఞానము ప్రకారము బదులు ఇవ్వలేదు గానీ, యేసయ్య చెప్పిన మాట ప్రకారమే చేస్తాను అని ముందుకు సాగాడు.
వారాలాగు చేసి విస్తారమైన చేపలు పెట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోనెలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి; వారు వచ్చి రెండు దోనెలుమునుగునట్లు నింపిరి. -లూకా 5:6-7
“నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు” అని పేతురు ఎందుకు చెప్పగలిగాడు అని చూస్తే, ఈ భాగములో పేతురు అనుభవించిన ఆశ్చర్య కార్యము గూర్చిన అనుభవము. ఎంతగా శ్రమపడినా చేపలు పడలేదు, ఇక చేపలు పడే సమయము కూడా అయిపోయింది. అయినప్పటికీ “యేసయ్య మాట చొప్పున వలలు వేసాడు” ఇదే చాలా ప్రాముఖ్యమైనది. దానిని బట్టి, ఇంతకు మునుపు ఎన్నడూ జరగినిది ఇప్పుడు జరిగింది.
అలాగే మనము కూడా ప్రభువు మాట చొప్పున స్థిరముగా నిలబడితే, ఇంతవరకు నీ ప్రయత్నము సఫలము అవ్వకపోతే, నీవు నిలబడినదానిని బట్టి, ఇప్పుడు అది సఫలం అవుతుంది. ఇటువంటి అనుభవములచేత నీ జీవితము కొనసాగించబడితే నీ ఆత్మీయ జీవితము నిలబడుతుంది, అప్పుడు దేవుని చేత భళా మంచి దాసుడా అనే సాక్ష్యము పొందుకుంటావు. అనుభవము లేకుండా నీ ఆత్మీయ జీవితము నిలబడదు గానీ పడుతూ లేస్తూ ఉన్న స్థితిలోనే ఉంటుంది.
అయితే ఏమి చేస్తే మనము దేవుని యొక్క అనుభవములు పొందుతాము? దావీదు అనుభవమునుంది ధ్యానిద్దాము.
సింహముయొక్క బలమునుండియు, ఎలుగుబంటియొక్క బలమునుండియు నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలోనుండికూడను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలు–పొమ్ము; యెహోవా నీకు తోడుగానుండునుగాక అని దావీదుతో అనెను. -1 సమూయేలు 17:37
దావీదు దేవునిని కలిగి ఉన్నవాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవునిని కలిగినవారే. ఫిలిష్తీయుల గుంపులోనుండి వచ్చిన బలఢ్యునిని చూసి ఇశ్రాయేలు ప్రజలు అందరూ వెనుకకు వెళుతుంటే, దావీదు మాత్రము ముందుకు వచ్చాడు. ఎందుకు అని చూస్తే, దావీదు మాటలలో – “ఇంతకు ముందు గొర్రెలు కాస్తున్నప్పుడు ఒకసారి ఎలుగుబంటి, ఒకసారి సింహము వచ్చినప్పుడు వాటి బలమునుండి విడిపించిన దేవుడే ఈ ఫిలిష్తీయుని చేతినుండి విడిపిస్తాడు”.
యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. -కీర్తనలు 34:8
రుచి చూడకుండా, అనుభవించకుండా నా దేవుడు ఉత్తముడు అని ఎవరూ చెప్పలేరు. గాఢాంధకారములోనికి నేను వెళ్ళిపోయినప్పటికీ అక్కడనుండి నన్ను తిరిగి తీసుకురాగలిగినవాడు నా దేవుడు అనే సత్యము మనము ఎరిగి ఉండాలి. అనుభవములతో మనము సిద్ధపడాలి. దానికొరకు వచ్చిన అవకాశమును వదలకూడదు. దేవుని గూర్చిన అనుభవము కొరకు వచ్చిన అవకాశమును మనము వదిలిపెట్టకూడదు. అది మొదటి మెట్టు. అలా మనము కూడగట్టుకున్న అనుభవములు దేవుడు ఏమి చేయగలడో అనే దానికి నీ జీవితాన్ని సాక్ష్యముగా సిద్ధపరుస్తుంది. ఇంతకు ముందు నీ జీవితములో కార్యము జరిగించిన దేవుడు ఇప్పుడు కూడా కార్యము జరిగిస్తాడు. అయితే మనలో ఆసక్తే అసలు కావలసినది. దావీదు రోషము చూస్తే, “జీవము గల దేవుని సైన్యమును ఎదిరించుటకు ఈ సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఏపాటి వాడు?” అని చెప్పగలుగుతున్నాడు.
ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? -ద్వితీయోపదేశకాండము 33:29
మనము కూడా అలా దేవుని కార్యములయందు, దేవుని అనుభవములయందు ఆసక్తి కలిగి ఉన్నట్టయితే, మన గూర్చికూడా ఇలాంటి సాక్ష్యము పొందగలుగుతాము.
ఏలియా దేవుని శక్తి కనపరచబడునట్లుగా ప్రార్థన చేసాడు, దేవుని శక్తి కనపరచబడింది. ఆ తరువాత సారెఫతు వెళ్ళిన తరువాత ఆ విధవరాలి ఇంటివద్ద ఏమిచేసాడు? ఇంతకు ముందు తాను పొందిన కెరీతువాగు అనుభవము ద్వారా దేవుని కార్యము కొరకు నిలబడ్డాడు. వారి సమయము అయిపోయింది. ఇప్పుడు నీ సమయము, నా సమయము. నీవు సిద్ధమైతే దేవుని గూర్చిన అనుభవము సంపాదించు.
దేవుని గూర్చిన అనుభవము ఎలా సంపాదించాలి? ఏ మాట అయితే చెప్పబడిందో, ఆ మాటను నమ్మి నిలబడటము ద్వారా అనుభవమును పొందుకుంటావు. నీ పరిస్థితులు మారుతున్నప్పటికీ దేవుని మాట మాత్రము మారనిది. ఉదాహరణకు మన జీవితములలో అనారోగ్యములు వస్తూనే వుంటాయి అయితే దేవుని మాట మాత్రము మారనిది. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలిగింది. ఈ మాట నమ్మి, నీ అనారోగ్య పరిస్థితిలో ప్రార్థనాపూర్వకముగా నిలబడు. ఇలా అనేకమైన పరిస్థితిలలో ఇలాగే దేవుని మాటను బట్టి నిలబడటము మొదట ప్రారంభించాలి. దానికొరకు నీ జ్ఞానము పనిచెయ్యకూడదు. నీవు ఆశ కలిగి ఉంటే, దేవుడు ప్రత్యక్షపరచుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. మనము ఆశకలిగి దేవుని వెంబడించేవారిగా సిద్ధపడదాము. ఆత్మీయ జీవితము స్థిరముగా ఉండులాగున సిద్ధపడదాము.